Friday, December 26, 2008

ధైర్యం - అధైర్యం

ఒక మనిషి తాను చేయ దల్చుకున్న పని పట్ల నమ్మకం కంటే , దాని వ్యతిరేక శక్తి పట్ల నమ్మకం పెంచుకోవడాన్ని "అధైర్యం "అంటారు . తాను చేయదల్చుకున్న పని పట్ల , తన స్వశక్తి మీద నమ్మకం డామినేట్ చేయటాన్ని "ధైర్యం " అంటారు .జరగబోయే నష్టం కన్నా ,సాధించ బోయే లాభం విలువ ఎక్కువుంటే రిస్క్ తీసుకోవడమే ధైర్యం .గెలుపు అస్పష్టంగా ఉన్నా కూడా ధైర్యం చేయడాన్ని "సాహసం '' అంటారు . పెద్ద కష్టాల్ని ఎదుర్కోవడానికి సాహసం కావాలి . చిన్న కష్టాల్ని ఎదుర్కోవడానికి "ఓర్పు " కావాలి .
* అస్తమిస్తున్న సూర్యుడన్నాడట..
నా పని ఇక ఎవరు చేస్తారని ....
నాకు ఆ పని వదలండి ప్రభూ !
అన్నదట ఆత్మవిశ్వాసం
నిండిన " ప్రమిద "
-రవీంద్ర నాధ్ ఠాగూర్ -

Tuesday, December 23, 2008

ముద్దు (ఓ కొంటె కవిత )

అమ్మ పెట్టింది తొలిముద్దు
నాన్న పెట్టారు మలిముద్దు
మళ్లీ ఇన్నేళ్ళకి నువ్వూ .......

నుదుటి పైన ముద్దు అది
నులి వెచ్చని తొలి పొద్దు
బుగ్గ మీది ముద్దు అది
చేయదు ఏ సద్దూ
పెదవి పైన ముద్దు అది
పగడపు రంగును అద్దు
మెడ మీది ముద్దు అది
మోహపు సరిహద్దు
ఆపై నీ కొంటె తనానికి
లేదిక హద్దూ.....పద్దూ .......

Friday, December 19, 2008

కృష్ణ శాస్త్రి కవిత

* అక్కడ ఇంద్ర ధనుస్సులు అల్లిన పందిళ్ళు
అక్కడ వెన్నెల కళ్ళాపి చల్లిన వాకిళ్ళు .
భావుకత బహుశా ఆయన ఇంటి పేరో ఏమో .....
సాహిత్యం వెన్నెల బాటైతే కృష్ణ శాస్త్రి కవిత ఆ మార్గాన పరుగులు తీసే వెండి రథం అంటారు ఆయన సహ కవులూ ,అభి మానులు ......ఎన్ని పాటలు రాశారో ,ఎన్ని కవితామాలికలల్లారో తెలీదు కాని తెలుగు పరిమళమంతా ఆయన కవిత్వంలో గుభాళిస్తుంది .ఆయన కవితావేశం గురించి మాట్లాడేంతదాన్ని కాదు గాని ,అన్నమంతా పట్టి చూడక్కర్లేనట్టు "మేఘ సందేశం "చిత్రం కోసం ఆయన వ్రాసిన ....
ఆకులో ఆకునై , పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై ,నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా .......
ఈ ఒక్క పాటే చాలు మనసు నిండి పోతుంది .వింటుంటే ప్రకృతిలో విలీనమవ్వని హృదయం ఉంటుందా ?
"నేను మానవతా వాదిని , వట్టి హృదయ వాదిని "అని చెప్పుకొనే శాస్త్రి గారు పద్య రచనలు మాత్రమే కాదు ,గద్య రచనలో కుడా దిట్టే నట .ఎల్లప్పుడూ ఆయన చుట్టూ జనం ,కబుర్లు ,సాహితీ విమర్శలూ ,ఇష్టాగోష్టులు ఉండ వలసిందేనట .అటువంటి మహా మనీషి జీవితంలో విషాదం ఊహించలేం .కాని ఆయనకు గొంతుక ఆపరేషన్ అయి స్వర పేటిక తీసేశారని , తర్వాత కూడా ఆయన నోట్ బుక్ ల ద్వారా సంభాషించే వారని చదివి నప్పుడు నా హృదయం ఆర్ద్రమై పోయింది .మీ అందరికి తెలిసే వుండొచ్చు కాని భారమైన హృదయపు ఆవేదన పంచుకోవాలన్న ఆరాటంతో
వ్రాస్తున్నా .......
గొంతుకు ఆపరేషనై నప్పుడు బొంబాయి హాస్పటల్ లో ఆయన వ్రాసిన ఓ కవిత ......
**నా మందిర గవాక్షంలో నుంచి
తొలి అరుణ స్వర్ణ కాంతి వచ్చి
నా రెప్పలను తాకినప్పుడు
కళ్లు విప్పి స్వాగతం చెప్తాను
వేకువ గాలి ముని వేళ్ళతో
నా మొగం నిమిరి నప్పుడు
చిరునవ్వు నవ్వుతాను
పెరటిలో నుంచి కొత్తగా విరిసిన
విభాత సుమ పరిమళం వచ్చి
పలకరిస్తే ' ఔ 'నని తల ఊపుతాను .
కాని ........గవాక్షం లోనికి ,రవ్వంత ఒరిగిన
మావి కొమ్మ చివర నిలిచి
'కో ' అన్న వనప్రియారవానికి
బదులు మాత్రం చెప్పలేను ,
ఇక ...........బదులు మాత్రం చెప్పలేను .
*నిందించదానికీ ,కీర్తించడానికి కాదు .మానవుని మానవునిగా చేయడానికే కావ్య నిర్మాణ మట! ఆ నిర్మాణానికి రాళ్లెత్తిన ,రంగులద్దిన కవులకూ ,భావుకులకూ ......... నా వినమ్ర పూర్వక వందనములు .

Monday, December 15, 2008

నువ్వు - నేను

ఉదయించే సూర్యుడు నువ్వైతే
వికసించే పద్మం నేనౌతా
గర్జించే మేఘం నువ్వైతే
చిరుజల్లునై పులకిస్తా
ఎగసిపడే కడలివి నువ్వైతే
ప్రవహించే నదినై చేరుకుంటా
మల్లె వంటి మనసు నీదైతే
పరిమళమై చేరువౌతా
జాబిలి నువ్వైతే
వెన్నెల నేనౌతా
ఇన్ని మాటలేల .........
నువ్వు పురుషుడివి
నేను ప్రకృతిని .

Saturday, December 13, 2008

మరో దీపావళి

ఎవరెన్ని విధాల తప్పొప్పులెంచినా జరిగిన ఎన్కౌంటర్ చాలా మందికి సంతోషాన్ని కలిగించిందనేది వాస్తవం .ఆ చాలా మందిలో నేను కూడా ఉన్నాను . స్త్రీ శక్తి మరోసారి సత్యభామగా మారి ఈ కలియుగ నరకుడ్ని అంతమొందించక ముందే
పోలీసులే ఆ పని చేసారు .ప్రజలు టపాసులు కాల్చి మరో దీపావళి చేసుకున్నారు .మరోసారి ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా ఈ సంఘటన ఒక కనువిప్పుగా వుంటుందని భావిస్తున్నాను .
***ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే .

Thursday, December 11, 2008

చిట్టి తల్లీ !నీకు రక్షణ ఎక్కడ ?

ప్రేమోన్మాదం మరోసారి బుసలు కొట్టింది .మరో మానవ మృగం ఇద్దరు చిట్టి తల్లుల జీవితాల్లో చీకటి నింపింది .ఒక పక్క ఒప్పుకుంటే ,ప్రేమ పేరుతో వంచన .మరో పక్క ఒప్పుకోకుంటే ,ఉన్మాదుల దాడులు .ఇంతేనా ఆడ పిల్లల జీవితాలు ?
కిట్స్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులపై యాసిడ్ దాడి సభ్య సమాజంలో మానవ మృగాల సంచారానికి నిదర్శనం.
చిట్టి తల్లీ !నీకు రక్షణ ఎక్కడ ?
కడుపున పడ్డ నాటి నుండీ ఏ క్షణం నీ ఉపిరి తీసేస్తారో ని అనుక్షణం నిన్ను పక్షిలా రెక్కల చాటున దాచుకొని ,అల్లారు ముద్దుగా పెంచుకొని ,మహా లక్ష్మి లాంటి నిన్ను చదువుల సరస్వతిగా చూసుకొని మురిసి పోవాలని ,నా చెంగు చాటు
నుండి కళాశాలకు పంపిస్తే .....చిట్టి తల్లీ నీకు రక్షణ ఎక్కడ ? ప్రతిరోజూ నువ్వు తిరిగి ఇంటికి వచ్చేవరకు భయం ......
ఎప్పుడు ,ఎక్కడ ,ఎవరు ఏ ఘాతుకానికి ఒడికడ తారోన్న ఆందోళనే ........
శ్రీ లక్ష్మి ,ప్రత్యూష ,ఆయేషా ..........ఎవరైనా .....ఆరేళ్ల పాప నుంచి ,అరవై ఏళ్ల అవ్వ వరకు ....అత్యాచారాలు ,హత్యలూ ...ఇవన్ని చూస్తుంటే మనం ఆటవిక వ్యవస్థ లోనే వున్నామని పిస్తుంది .పెరిగిన నాగరికత మనకేం ఒరగ బెట్టిందోగాని
మరిన్ని మానవ మృగాలను తయారు చేస్తోంది ,మారణ హోమాలు సృష్టిస్తోంది .
దురదృష్టవశాత్తు ఇటువంటి నేరాలకు శిక్షలు కటినంగా లేకపోవడం వల్ల ఈ దారుణాలు రిపీట్ అవుతున్నాయి .ఇవి
ఇలాగే కొనసాగితే ఆడ పిల్లను కనటానికే భయపడే పరిస్థితులొస్తాయి .వర కట్నం మాట అటుంచి అసలు రక్షణే భారంగా మారుతోంది .
ఇటువంటి మానవ మృగాలను శిక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలి .శిక్షలు కటినంగా అమలు చేయాలి .అది
మరొకరు ఇటువంటి దాడులు చేయాలంటే భయపడేలా వుండాలి .కనీసం అప్పుడైనా ఇటువంటి దాడుల్ని కొంతవరకైనా
నిరోధించిన వారవుతారు .ప్రభుత్వం వెంటనే స్పందించాలి .

Tuesday, December 9, 2008

భయం

***ఇది నేను చాలా సంవత్సరాల క్రిందట చదివినది .ఏ పుస్తకమో గుర్తులేదు కాని చాలా నచ్చి వ్రాసుకున్నది .మీ కోసం .....


*భోగములలో - వ్యాధి కలుగునన్న భయం
ఉన్నత జన్మలో - జాతి పోవునన్న భయం
సంపదలో - దొంగల భయం
కీర్తి ప్రతిష్టలలో - అవి పోవుననే భయం
బలములో - శత్రువుల భయం
అందములో - వృద్ధాప్యపు భయం
జ్ఞానములో - అపజయ భయం
మంచి గుణములో - అపనిందల భయం
శరీరంలో - మృత్యు భయం
మనిషి జీవితమంతా భయముల మయమే
వైరాగ్యం ఒక్కటే నిర్భయమైనది .

Sunday, December 7, 2008

నేనంతా నీవే

కళ్లు మూస్తే కలలో నీవే
కళ్లు తెరిస్తే ఎదుటా నీవే
నిద్రలో కలవరింత నీవే
మెలకువలో కవ్వింత నీవే
నా ముంగురుల అలజడి నీవే
నా అందెల సవ్వడి నీవే
నా ఎద సడి ,కన్నుల తడి
మోహపు జడి ,వెన్నెల ఒడి
అన్నీ నీవే ......అంతెందుకు?
నా బలమూ ,బలహీనతా
అసలు నేనంతా నీవే.....

Friday, December 5, 2008

అవ్యక్తం

మనసు లేని వాడవు నీవు
నాలోని మమత యెరుగకున్నావు
ప్రణయ మూర్తివనుకున్నా
గుండె గుడిలో ప్రతిష్టించుకున్నా
పొంగి పొరలే ప్రేమానురాగాల్ని
మబ్బు వెనక చందమామలా
మనసు వెనక దాచుకున్నా
నా ఆశ ...నా శ్వాసా ....నువ్వేనని ,
నేను తెలుపలేను .....
నువ్వు తెలుసుకోవు .....
శిల వంటి నిను వలచి
శాపగ్రస్త నైనాను .....
శిల ముందరి పూమాలికలా
వడిలి ,వాడి పోయాను
నీ కొరకై వేచి వేచి
నేల కొరిగి పోయాను .

Thursday, December 4, 2008

రియల్ హీరోస్

సామాజిక వైఫల్యాలపై విద్యార్ధుల చిత్ర సంధానం .ఈ రోజు లోకల్ ఎడిషన్ లో వ్రాశారు .యువత అంటే పబ్ లూ ,డిస్కో
లూ ,సినిమాలూ ఇవే అనుకొనేవారికి కనువిప్పు "ప్రేరణ - 2008" సందేశాత్మక డాక్యుమెంటరిల ప్రదర్శన . నేటి యువతలో ఎంజాయ్ చెయ్యటమే కాదు ,సమాజం పట్ల బాధ్యతా ,సామాజిక వైఫల్యాల్ని వెలికి తీసి మార్పు తేవాలన్న చైతన్యమూ ,తపనా కనిపిస్తున్నాయి .అదే పేజ్ లో విద్యార్ధినులు తీసిన లఘు చిత్రాలు కూడా మనం తీసుకునే చిన్న జాగర్తలతో పర్యావరణ పరిరక్షణలో ఎలా భాగస్తులం కావచ్చో ఆచరణలో చూపించారు.
"చేంజ్ "' డాక్యుమెంటరి గురించి చదువుతూ గత ఐదేళ్ళలో చదువుల ఒత్తిళ్ళతో దేశ వ్యాప్తంగా 30 వేల మంది విద్యార్ధులు మరణించారని తెలిసినప్పుడు నా మనసు ఆవేదనతో నిండిపోయింది .ఈ ఉద్విగ్నత మీతో పంచుకోవాలని అనిపించింది .ఈ విషయంలో తల్లి తండ్రులదే పూర్తీ బాధ్యత .కొంత మంది తల్లి తండ్రులు పిల్లలను పాఠాలు వల్లే వేసే యంత్రాలుగా ,తమ స్టేటస్ చూపుకునేందుకు ఒక మార్గంగా భావిస్తున్నారు .నాకు బాగా తెలిసిన వారి పిల్లలు బాగానే చదువుతారు 75 శాతం మార్కులు వస్తుఉంటాయి కానీ వారి తల్లి మాత్రం సెంట్రల్ సిలబస్ చదువుతున్న తన పిల్లల్ని
స్టేట్ సిలబస్ లో చదువుతున్న వాళ్ల బంధువుల పిల్లల మార్కులతో పోల్చి ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది .
స్కూల్ దగ్గర్నుండి ,కాలేజ్ వరకు ఒత్తిడి ....ఒత్తిడి ....
ఎంటర్ టైన్ మెంట్ కి ,ఫిజికల్ ఏక్టివిటీస్ కి ,కళలకు, అస్సలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు .అటువంటి వారున్నా నూటికొక్కరు .
ఎప్పుడైతే విద్య విజ్ఞానం కోసం కాకుండా ఉద్యోగార్జన కోసం ,ధనార్జన కోసం అని విద్యార్ధి ,తల్లి తండ్రులు తాపత్రయ పడుతున్నారో ,అప్పుడే అటువంటి విద్యనందివ్వ టానికి కార్పొరేట్ పాఠశాలలు ,కళా శాలలు పుట్టుకొచ్చాయ్ .
వారికి కావాల్సి నంత డబ్బు అందివ్వడానికి తల్లి తండ్రులు వెనకాడటం లేదు .డబ్బు తీసుకుని పాఠాలు చెప్పే విద్యాలయాలు ,అధ్యాపకులు తప్ప ,విజ్ఞానాన్ని ,వివేకాన్ని జాగృతం చేసి ,మంచి ఆచరణ ,సమాజం పట్ల అప్రమత్తత ,నేర్పుతూ విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే గురువులకు కొరత ఏర్పడింది.
ఇటువంటి సమయంలో మంచి నేపథ్యంతో ,చక్కటి అవగాహనతో ,చూసినవారిలో కొద్దిమందైనా మారతారన్న ఆశావహ దృక్పధంతో ఈ డాక్యుమెంటరి తీసిన విద్యార్ధులు ...... రియల్ హీరోస్ కాదంటారా ??

Wednesday, December 3, 2008

వియోగం ???

ప్రియతమా !
నీ నయనమ్ముల అశ్రు ధార లెందుకు ?
దయలేని విధి విడదీసినా ,అది తాత్కాలికమేగా
మనది వియోగం కాదు విరహమనుకో ....
విరహము కూడా సుఖమే కాదా ....అన్నారో కవి

ప్రియతమా !
నా ప్రయాణం బహు దూరం సుమా !
ఆకాశం ,భూమి కలిసే చోటకి ....
అదో సుందర లోకం ...
ఐనా ....అలసిపోక ,
గమ్యం చేరిన వెంటనే ,
ఇంద్ర ధనుస్సు చీర కట్టుకొని
చందమామ సింధూరం ,
చీకటి కాటుక పెట్టుకొని ,
నక్షత్రాల్ని సిగలో ముడుచుకొని
నీ రూపాన్ని కన్నుల నింపుకొని ,
స్వర్గపు వాకిట ఓ వారగా నిలుచుని ....
నిన్ను స్వాగతించటానికి ,
చందనపు పాత్ర చేత బట్టుకొని
ఉద్విగ్నభరిత హృదయంతో
నిరీక్షిస్తూంటా......

Monday, December 1, 2008

నా కోసం

గువ్వలన్ని గూటికి చేరుకునే వేళ
నువ్వు మన గూడు విడిచి వెళ్ళావ్
ఈరోజు నిండు పున్నమి....... ఐనా
తనులేనిదే నేనుమాత్రం
నీకెందుకని చందమామ కూడా
మబ్బుల వెనుక చేరి నన్నుడికిస్తోంది
సీతాకోక చిలుకలా నా సంతోషాన్ని
నీతో తీసుకెళ్ళి పోయావ్ !
నీ వెంట రాలేక నిస్సహాయంగా
నిలుచుండి పోయిన నన్ను
వెదుక్కుంటూ తిరిగి........
త్వరగా వచ్చేయి నేస్తం!
నా కోసం........
శ్రమనుకోకుండా నా నవ్వుల పువ్వుల్ని
నీతో పాటు తిరిగి తెచ్చేయి నేస్తం!

Sunday, November 30, 2008

అశ్రు నివాళి

తీవ్రవాద దాడుల్లో వీర మరణ మొందిన అమర జవానులకు,అమాయక ప్రజలకూ అశ్రు నివాళి .
ఇటువంటి సమయంలో తిలక్ గారి" ఆర్తగీతం " గుర్తు చేసుకోకుండా వుండలేక పోతున్నా .ఐతే అక్కడక్కడా కొంత భాగాన్ని ఎడిట్ చేసినందుకు క్షమించాలి .

నా దేశాన్ని గూర్చి పాడలేను ,నీ ఆదేశాన్ని మన్నించలేను .
ఈ విపంచికకు శృతి కలపలేను ,
ఈ రోజు నాకు విషాద స్మృతి ,విధి తమస్సులు మూసిన దివారుంధతి
నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి .
గత చార్రిత్రక యశః కలాపమ్ము వివరింపకు,
బహుళ వీరానేక గాధాసహస్రమ్ము వినిపిమ్పకు
ఇంక నన్ను విసిగింపకు .

నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను ,
సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును ,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను .

ఈ రోజు నేను చూసిందేమి ?
విధి ఇన్ని కత్తులను దూసినదేమి?
జాగృతి హేతి వాదరల రుధిరమేమి ?

ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి ?ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి ?
ఏ బుద్ధదేవుడి జన్మ భూమికి గర్వ స్మృతి ?

ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనింపగలదు ?
ఏ రాజకీయ వేత్త గుండెలను స్పృశించ గలదు ?
ఏ భోగవంతుని విచలింప చేయగలదు ?
ఏ భగవంతునికి నివేదించుకోగలదు .......?

నన్ను నిర్భందించకు నేస్తం
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవునిగా శిరసెత్తుకు తిరగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను .

Wednesday, November 26, 2008

స్నేహం

*తెలుగురత్నగారు స్నేహం గురించి అభిప్రాయం రాయమంటే
నాకు తోచింది రాశా .మరి మీరూ నాతో ఏకీభవిస్తారా ?


*** శూన్య జీవన గమనంలో చైతన్య దీప్తి స్నేహం
జనన మరణాతీతమైన నిరంతర
అమృత ధార స్నేహం
ఈ నవ నాగరికతా గ్రీష్మంలో
శరత్ చంద్రిక స్నేహం

అలవి కాని ఆనందాన్నిచ్చినా
అంతులేని విషాదాన్నిచ్చినా
అనంతమైన ఐశ్వర్యాన్నిచ్చినా
ఆకలి తీరని పేదరికమిచ్చినా
వినమ్రుడనై స్వీకరిస్తాను
కాని ప్రభూ !
సంతోషాన్ని పెంచుకోవటానికి
బాధను పంచుకోవటానికి
ఒక్క మిత్రుడ్నివ్వు చాలు
శూన్య జీవన గమనంలో కూడా
అలుపెరుగక పయనిస్తా ........

ఒక చిన్న కోరిక

*రాత్రిపూట రాలే నక్షత్రం కోరుకున్న వరమిస్తుందటగా ?
అది నిజమైతే .............
***ప్రతీ ఉదయం నీ జ్ఞాపకాల సూర్యోదయమే
అరుణుడి కంటే ముందుగా పవనుడు
మోసుకొచ్చిన పున్నాగ పూల పరిమళాలు,
శుభోదయం చెపుతున్నట్లు గుస గుస లాడే
చెట్ల ఆకులూ, పూలూ..............
నీ తలపుల వాకిట్లో కళ్ళాపి చల్లడానికి సిధ్ధంగా
ఆకుల చివరినుండి జారిపడే మంచుబిందువులు
వాటిపై ముగ్గులేసే పారిజాతాలు.....
కాస్త కాస్తగా పైకొస్తున్న సూర్యుని వెచ్చదనం,
ఇవేవీ నిన్ను మరిపించలేకపోయాయి.
మళ్లీ దినచర్య ప్రారంభం
ఎప్పటిలాగే రొటీన్ గా ..........
లైఫ్ ని ఎంత బిజీ చేసుకున్నా,
ఆగని నీ జ్ఞాపకాల పరంపర ......
తిరిగి ప్రతీ సాయంత్రం ,
నీ ఊహల చంద్రోదయంతో
నా మానస సరోవరంలో విరిసే
నీ తలపుల కలువలు.....
చూస్తుండగానే చిక్కబడుతోన్న చీకటి,
శుభరాత్రంటున్న చిరుగాలుల సవ్వడి ........
నేను మాత్రం రాత్రంతా రెప్పవాల్చక
ఆకాశం నుండి జారిపడే నక్షత్రం కోసం
ఎదురు చూస్తూండగానే మరో ఉదయం ఎదురైంది.
కాని
నేల రాలే చుక్కని నేను కోరేది మాత్రం
నీ స్నేహమే సుమా!

Monday, November 24, 2008

అంతర్మధనం

దైవ కార్య నిమిత్తం మూడు రోజులు అమ్మ వాళ్ల వూరు వెళ్ళా .మనసు నిండా మోసుకొచ్చిన ఆధ్యాత్మిక పరిమళం అంతలోనే ఆవిరైపోతుందనుకోలేదు .మూడు రోజుల తర్వాత వచ్చానేమో ,వచ్చిన దగ్గర్నుంచి నా దృష్టి కంప్యూటర్ పైనే .
త్వర త్వరగా పనులు ముగించుకొని కంప్యూటర్ ముందు కూర్చున్నా .మూడు రోజులకే మిస్ ఐన ఫీలింగ్ .కొద్ది రోజుల్లోనే డ్రగ్ ఎడిక్ట్ లాగా ,బ్లాగ్ ఎడిక్ట్ ఇపోయానేంటా అని నవ్వుకొంటూ బ్లాగ్ ఓపెన్ చేశా .కొత్త టపాల కోసం నా కళ్లు ఆత్రంగా
వెదికాయ్.అంతే.....నిశ్చేష్టురాలినైపోయా .అటువంటి జుగుప్సా కరమైన పదాలతో ఎవరైనా టపా రాయగలరని ,నేనుహించలేదు .నాకసలే కొత్త ....ఏదో మీ అందరి ప్రోత్సాహం వల్ల ధైర్యం చేసి ఏదో మీ మధ్య కొచ్చాను .అంతే కాని .....
నిజానికి కాస్త కష్టానికే ,అది నాకైనా ,ఎదుటి వారికైనా .....వూరికే తడిసిపోయే కళ్ళూ ...కరిగిపోయే గుండే....నా బలహీనత .కాని ,ఆ అజ్ఞాత వ్యక్తి , భాష ,వ్యంగ్యత చూశాక ,ఇంకా ముందు ముందు ఇటువంటి పరిస్థితి మళ్లీ ఎదురౌతుందేమోన్న భయం .కాని తర్వాత క్షమాపణ అడుగతూ వచ్చిన టపా ముందు వ్యక్తి నుండే అంటే నమ్మశక్యంగా లేదు .అంత భాషా బేధముంది మరి .హాయిగా జీవితం సాగిపోతూ వుంటే ,ఏమిటి ఇలా పరిచయమే లేని వ్యక్తుల నుండి వచ్చే అసభ్య కరమైన కామెంట్స్ కి బాధపడుతూ ఈ బ్లాగు కొనసాగించాలా ?అని ....రోజంతా మధనపడి చివరికి కొద్దిపరిచయమే ఐనానన్ను ప్రోత్సహించిన సంస్కార వంతులైన మీతో నా బాధను పంచుకోవాలనిపించింది .పోనీ ఆపేద్దామా అంటే వూరికే బంధాలను అల్లుకోవడమేగా మానవ నైజం . మీ సాహితీ వనంలోకి కొత్త చిగురులా ఆహ్వానించారు నన్ను ........మన పరిచయాన్ని చిరు కాలంలోనే ముగించేయాలా .......లేక చెడును వదిలి ,మీ మంచితనపు ప్రపంచంలో చిరకాలం కొనసాగాలా అని .......నా అంతర్మధనం ........???

గాయం

నిదురించే నా హృదయాన్ని
మేల్కొలిపి ,ఆశలు రేపి
గతించిన జ్ఞాపకాల్ని
మరల గుర్తుచేసి
చేరువైన వసంతాన్ని
తిరిగి నువ్వే తీసుకెళ్ళి
నా ఎదలో చేసిన గాయం
ఎలా మాన్పుకోను నేస్తం ?

Tuesday, November 18, 2008

మనలో మన మాట సారీ !మనసులోని మాట

నా ఫ్రెండ్ అడిగాడు .....ఎప్పుడూ కవితలేనా ?అని ......మరేం రాయాలని ఆలోచించాను ఒక రోజంతా ......ఐనా ఏం రాయాలో తెలీలేదు .నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది ,అది నా ఇల్లే ...ఏం రాద్దామన్నాసంకోచమే .వాడంటాడు .....నా బాల్యం,నేను తిన్న బాసుంది ,నాకు నచ్చిన సినిమా ఏదైనా రాయొచ్చని .కాని ,కధలు ,కవితలు ,కొటేషన్స్ , పుస్తకాలు ,వంటలు ,సినిమాలూ......ఒకటేవిటి?రాముడి దగ్గర్నుండి ,రాజకీయాల వరకు ,కావేవి బ్లాగుకనర్హం అంటూ అన్నీ అందరూ రాసేస్తుంటే ..నేనేం రాసినా హనుమంతుడి ముందు కుప్పిగంతులా ఉంటుందే మోనన్న భయంతో .....
బిక్కమొహంతో ........ఓ ....బ్లాగిస్ట్..

ఐనా ధైర్యం చేసి నాకు నచ్చిన ఓ కవితను మీ ముందుంచుతున్నా.
తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి నుండి
నా భారత ధాత్రి
మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల
మోహన వస్త్రం దాలిచి
మౌళి మీద హిమ సుందర కిరీటం ధరించిన
రాజ్ఞి నా భరత ధాత్రి అనుకోవడం ఒక నిజం !
అదొక సుఖం .
మూడు సముద్రాలు మూసిన కోసిన తీరంతో
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
ముల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం ! అదో దుఖం .
ఇదీ నిజం అదీ నిజం
రెండింటికీ ఋజువులు సమం
శ్రీ రాముడి శ్రీ కృష్ణుడి జన్మ భూమి మరి
కంసునికి , దశకంఠునికీ కాదా ?

Sunday, November 16, 2008

ప్రియమైన శత్రువు

కన్ను తెరిస్తే జననం
కన్ను మూస్తే మరణం
రెప్పపాటే ఈ జీవితం
ఈ మధ్యనున్న కొద్ది కాలంలో
మన ఇద్దరి మధ్యా
అవసరమా ఈ యుద్ధం ?
అసలెన్నాళ్ళని ఈ మౌనం ?
ఏ అస్త్రంతో చేదించాలీ నిశ్శబ్దం ?
చిరునవ్వులు చిందించా?
మరుమల్లెలు సంధించా ?
నా ప్రియమైన శత్రువ్వి నువ్వైతే
ఓటమెరుగని సిపాయిని నేను ....

Saturday, November 15, 2008

నీ స్నేహం

సూర్యుడు ఉదయిస్తున్నాడు ,అస్తమిస్తున్నాడు
తిరిగి రేపు ఉదయిస్తాడు
పున్నమి వెన్నెలా ,అమావాస్య చీకటి
ప్రతినెలా వస్తూనే ఉన్నాయ్
తొలకరి జల్లూ,పచ్చని పైరూ
ప్రతి ఏటా పలకరిస్తూనే వున్నాయ్
గ్రీష్మం ,శిశిరం ,
వర్షం ,హేమంతం
శరదృతువులు ,నా జీవితంలో
మళ్లీ మళ్లీ వస్తున్నాయ్
కాని నేస్తం .......
నీ స్నేహం మాత్రం ,
తిరిగి రాని వసంతం ......

Friday, November 14, 2008

నిరీక్షణ

నిద్రలేని రాత్రిని కరిగిస్తూ సూర్యుడొస్తున్నాడు
నీవు రాకుండానే పొద్దంతా గడిచిపోతోంది
గంటలు యుగాలై కాలం కదలనంటోంది
ఎదురు చూపులతోనే మరోరోజు, ఇంకోరోజు....
ఎప్పుడో హఠాత్తుగా నువ్వొస్తావ్.... వెళ్లిపోతావ్.....
నువ్వున్న ఆ కొద్ది నిముషాల్లోనే
నా చూపు నీ రూపును దొంగిలించి
నా హృదయంలో పదిలంగా దాచేస్తుంది
మళ్లీ నువ్వు తిరిగి వచ్చేవరకూ
అదేగా మరి నాకు ఊపిరి పోస్తోంది !

Thursday, November 13, 2008

శిల

నిన్నెలా సంభోదించను?
నా ఆరోప్రాణమా అందామంటే
నా పంచ ప్రాణాలూ నువ్వైపోయావు
నీలాకాశామా అందామంటే
ఎప్పటికీ అందవేమోననే భయం
మధుర స్వప్నమా అందామంటే
కళ్లు తెరిస్తే కరిగి పోతావేమో
నా ఆశా దీపమా అందామంటే
నాకు చీకటి మిగిల్చి వెళ్లిపోయావ్
మరి నువ్వెవరు ?
చిరు గాలివా ? చందమామవా ?
సెలఏరువా ? హరివిల్లువా ?
కాదు ....ఇవేవీ కాదు .....
నువ్వొక శిలవి ......
వరమివ్వని వట్టి శిలవి
కాని .......
నేను శిల్పిని
నా అక్షరాలే వులిగా ,నిన్ను
శిల్పంగా మలుచుకుంటా ,
వరమిచ్చే వేలుపుగా కొలుచుకుంటా....

Wednesday, November 12, 2008

నీ జ్ఞాపకాలు

నిన్ను మరచిపోవడమంటే
నానుంచి నేను విడిపోవడమే
నా హృదయం లో నీ జ్ఞాపకాలు
సముద్రంలోని కెరటాలు
ఎంతగా తీరం వైపు తోసేసినా
తిరిగి నాలోనే కలుస్తాయి
నా మదిలోని ఆశలూ
సముద్రంలోని అలలూ ఒక్కటే
అవి ఎగసి ఎగసి నిన్నందుకోవటానికి
ప్రయత్నిస్తూనే వుంటాయి
కాని నేస్తం ....నాకు తెలుసు
నువ్వు అందని ఆకాశానివని
అయినా ....
ఆగిపోని ,అలసిపోని ,
అలను నేను .

Tuesday, November 11, 2008

కరిగిన కల

నిదురించే తోటలోకి
కోయిలవై వచ్చావు
నీ తీయని పాటతో
ఎదను మేల్కొలిపావు
రాదనుకున్న వసంతాన్ని
తిరిగి తీసుకొచ్చావు
మోడువారిన మనసులో
ఆశలు చిగురించే వేళ
కన్నుల్లో నీరు నింపి
కలవై కరగి పోయావు

Monday, November 10, 2008

నేస్తం

అనుకో లేదు నేనెప్పుడూ
రెండు చందమామల్ని
ఒకేసారి చూస్తానని,
కానీ చూశాను
ఒకటి ఆకాశంలో ఐతే
మరొకటి నా ఎదురుగా
వింతేవిటంటే,
ఆ చంద్రునిలోని మచ్చ
నీలో నాకెన్నడూ కనపడదేం?
ప్రియ నేస్తం!
నిన్ను చూసి గర్వపడనా?
ఆ జాబిల్లిని చూసి జాలిపడనా?

నువ్వెవరు?

పగలంతా వెలుగౌతావ్
రేయంతా వెన్నెలౌతావ్
మెలకువలో శ్వాసవౌతావ్
నిద్దురలో కలవౌతావ్
నీ చూపుల గాలానికి
చిర్నవ్వుల ఎరవేసి
నా మనసును దోచేశావ్!

Sunday, November 9, 2008

నీ మౌనం

నువ్వు వదిలిన ఊపిరి
ఈగాలిలో కలిసి ఆక్సిజన్ గా మారి
నాకు ప్రాణం పోస్తోంది, కాని.....
నీ మౌనం మాత్రం
మనసు పొరల్లో గాయంగా మారి
గుండెను కోస్తోంది, కాని.....
నా గాయాన్ని మాన్పడానికి
నువ్వు డాక్టర్ వి కాదే
ఐతే,
మందు మాత్రం ఖచ్చితంగా
నీ చిరునవ్వే...............