Wednesday, September 26, 2012

చీమ...చీమ....చీమ!

ఈగ....రాజమౌళిగారి సినిమా...తెలియనివారుండరు.ఆ సినిమాలో హీరో నాని మరుజన్మలో ఈగగా పుట్టి తన ప్రియురాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా తనను చంపినా విలన్ మీద పగతీర్చుకుంటాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయినా కధ మాత్రం వాస్తవానికి దూరంగా కామెడీగా అనిపిస్తుంది కదూ :) చీమ అని మొదలుపెట్టి ఈగ గురించి చెప్తున్నానని అనుకొంటున్నారా ...అక్కడికేవస్తున్నా.ఇటువంటి కామెడీనే ఈమధ్య మాఇంట్లో తరుచూ జరుగుతోంది.వింటే కామెడీయే కాని అదో పెద్ద టార్చర్.

గత నెలరోజులుగా మాఇంట్లో చీమలు వింతగా ప్రవర్తిస్తున్నాయి.అసలు సిటీకొచ్చి పన్నెండేళ్ళవుతోంది, రెండు అద్దె ఇల్లులు మారి రెండేళ్ళక్రితం సొంత ఫ్లాట్ లోకి వచ్చాం,ఎప్పుడూ  ఇక్కడా చీమలబెడద లేదు.ఇప్పుడు మొదలైంది.ఆ చీమలన్నాక ఇంట్లోకిరావా...బెల్లంచుట్టూ చేరవా..అని మీరనుకుంటున్నారు కదూ?అక్కడే వుంది  వింత! మాఇంట్లో చీమలు బెల్లం చుట్టూ చేరట్లేదండీ అన్నం చుట్టూ చేరుతున్నాయి.ఒక్క అన్నమే కాదు,ఉప్మా,దోస,
ఇంకా రవ్వ,పల్లీలు,పప్పులు మొదలైన వాటిని పడుతున్నాయి.స్వీట్స్ కాని,బెల్లం కాని, పంచదారకాని గట్టుపై పోసినా అస్సలు ముట్టుకోవటం లేదు.కావాలనే అన్నంగిన్నె పక్కన బెల్లంకోరు...స్వీట్ పాకెట్ పెట్టినా,గచ్చుమీద పంచదార చల్లినా పట్టించుకోవట్లేదు.కరెంట్ కుక్కర్ చల్లారితే చాలు మేం తినేలోపే చీమలమయం. అన్నం,పప్పు వంటివన్నీ పెద్ద పళ్ళెంలో నీళ్ళుపోసి వాటిమధ్య పెట్టుకుంటున్నాం.అన్నీ ప్లేసులు మారుస్తూ దాచుకోవాల్సి వస్తుంది. అన్నం దొరికిందా సరే లేకపోతె కబోర్డ్ మూలల్లో సిమెంట్ తోడేస్తున్నాయి. మందుచల్లినా,గోడవారలు పసుపు ఉప్పు కలిపి చల్లినా ఎన్నిచేసినా ఎక్కడ్నించి వస్తాయో తెలీటంలేదు.బారులు తీరి అలా దండులా వస్తుంటే నిజంగానే అవి నామీద పగపట్టాయేమో అనిపిస్తుంది.ఒకవేళ దాని పార్ట్ నర్ ని చూసుకోకుండా వేడి వేడి అన్నం కాని మీదవేసి చంపేశానేమో అని!అందుకే దాని దండుతో సహా దండెత్తి వస్తుందేమో :) ఇంకా నయం దానికి ఏ సమంతా లాంటివారో  ట్రైనింగ్ ఇచ్చి ఉంటే నా గతి ఏమి ఉండేదో కదా :(  :(

# నేనూ సుదీప్ రేంజ్ లో బాగా ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నా పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి వాటిని ఫినిష్ చేస్తా హ్హ హ్హ హ్హా ....

Sunday, September 9, 2012

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి నివాళులు !

ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి అబ్బాయి రోహిణీప్రసాద్ గారు కన్నుమూశారన్న వార్త పేపర్లో చూడగానే చాలా బాధగా అనిపించింది. 1949 సెప్టెంబర్ 14న జన్మించిన ఆయన నిన్న (శనివారం) ఉదయం 11గంటలకు ముంబాయి జస్లోక్ హాస్పటల్ లో కన్నుమూశారట!

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన మంచి సాహితీవేత్తకూడా.సైన్సుకు సంబంధించిన పుస్తకాలతోపాటు ఆయన అంతర్జాలంలో సరళమైన రీతిలో తెలుగులోవ్యాసాలు రాసారు.అవి బహుశా మీకందరికీ సుపరిచితమే! రోహిణీప్రసాద్ గారికి సాహిత్యం పట్లఎంత మక్కువో సంగీతంపట్లకూడా అంతే మక్కువ!ఆయన గురించి ఆయన బ్లాగ్ 'Rohiniprasad Kodavatiganti'లో చూడొచ్చు.

ఆయన ఎంత  గొప్పవారైనా నిగర్వి.ఈవిషయం నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను.ఆయన నా చిన్న బ్లాగులో కృష్ణశాస్త్రి గారి గురించి రాసిన పోస్ట్ చదివి కామెంట్ చేయడమే కాకుండా నన్ను ఏవిధంగా వెన్నుతట్టి ప్రోత్సహించారో ఈక్రింది కామెంట్స్ చూస్తే మీకూ తెలుస్తుంది.మీతో పంచుకోవాలని ఆయన రాసినవి అలాగే పెస్ట్ చేస్తున్నా!

## రెండే రెండు మాటల్లో కవిత్వం రాయగలిగినది ఒక్క కృష్ణశాస్త్రేనని మానాన్న కుటుంబరావుగారనేవారు. సినిమా పాటల్లోనే దీనికెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. 'ఎందుకీ సందెగాలి', 'ఏదీ బృందావనమిక, ఏదీ విరహ గోపిక', 'పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా'.

కొడవటిగంటి రోహిణీప్రసాద్


## ప్రస్తుత పరిస్థితుల్లో మీకు నచ్చిన తెలుగు సాహిత్యం (కృష్ణాశాస్త్రి వగైరా) గురించిన మీ స్పందనను చిన్న వ్యాసాల రూపంలో రాసి, ఈమాట, పొద్దు వంటి వెబ్ పత్రికలకు పంపిస్తే ఈ తరం పాఠకులకు వాటిని పరిచయం చెయ్యగలుగుతారు. ఇటువంటి ప్రయత్నం మీ పాండిత్య ప్రదర్శనకు కాక మీ ఆసక్తిని నలుగురితో పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు కొని, చదివి, అర్థంచేసుకునేంత ఆసక్తిగాని, వ్యవధిగాని లేనివారికి ఇటువంటి రచనలు ఉపయోగపడతాయి. తెలుగు రీడర్‌షిప్ పెరిగేంతవరకూ ఇలాంటివి జరగడం చాలా ఆరోగ్యకరం అనుకుంటాను. మీ మోడెస్టీని అర్థం చేసుకోగలను. దాన్ని గురించి అంతగా పట్టించుకోకుండా రచనలు కొనసాగించండి. బ్లాగ్ రాయడం కన్నా ఎడిటర్లు ఎంపిక చేసే పత్రికలకు రచనలు పంపడం మంచి పని.   
రో.ప్ర.

సర్!మీకు ఆత్మశాంతి కలగాలని కోరుకొంటున్నాను.