Friday, January 30, 2009

ఏల ??

*పద్మార్పిత గారి "అక్కరకురాని..." టపా చదివాక రాయాలనిపించింది .

అమృతం తాగిన వానికి
నీళ్లివ్వనది ఏల ?
కడుపు నిండిన వానికి
పరమాన్నమేల ?
జీవించి యున్నవానికి
సంజీవని ఏల ?
సాటి మానవునికి చేయని
సేవ మాధవునికేల ?
ప్రత్యక్ష దైవాలకు లేని పూజ
కనిపించని దేవుని కేల?
కనిపించునా కలియుగమున
మానవత్వమున్న మనుజులు ??
*(అరుదుగా కనిపిస్తారు కనుకనే ధర్మం ఒక్క పాదం మీదైనా నిలబడి ఉంది )

Wednesday, January 28, 2009

శ్మశాన వైరాగ్యం !

వైరాగ్యం ,శ్మశాన వైరాగ్యం .... రెండూ వేరు వేరు .
వైరాగ్యం గురించి మాట్లాడాలంటే నా పరిజ్ఞానం సరిపోదు .కాని
ఒక్క మాటలో చెప్పాలంటే వైరాగ్యం శాశ్వత మైనది .కాని శ్మశాన వైరాగ్యం అలా కాదు .అది తాత్కాలికం .
ఒక మనిషి చనిపోయినపుడు ,అతని అంతిమ యాత్రలో పాల్గొనే వారికి ,శ్మశానం లోపలికి అడుగు పెట్టగానే ........హు ....
ఇంతేకదా జీవితం ....మనిషి ఎంత సంపాదించినా ,కీర్తి ప్రతిష్ఠ లార్జించినా చివరికి అందరూ చేరాల్సింది ఇక్కడికే కదా ! రాజు ,పేదా .....రైతు ,కూలీ బేధం లేకుండా ప్రక్క ప్రక్కనే ,శాశ్వత నిద్ర పోయే చోటు .నేను కూడా ఎప్పటికైనా ఇక్కడికి రావలసిందే .ఈ మాత్రం దానికి బ్రతికిన నాలుగు రోజులూ ఈర్ష్యా ద్వేషాలు ఎందుకు ?ఈ సంపాదన (అక్రమమో ,సక్రమమో )ఎందుకు ? కష్టపడి ,దానధర్మాలైనా చేయక కూడబెట్టిన ఆస్తి నాతో రాదుకదా .చివరికి మిగిలేది ఈ ఆరడుగులే కదా !ఇలా సాగుతాయి వారి ఆలోచనలు .చనిపోయిన వ్యక్తీ దహన సంస్కారాలవగానే ,ఇంటికి వచ్చి తలస్నానం చేయగానే .....మళ్ళీ మామూలే .నా సంసారం ,నాపిల్లలూ ,నాడబ్బూ ,నా స్వార్ధం ...........
మధ్యలో ఆ కాస్సేపూ కలిగేదే శ్మశాన వైరాగ్యం .ఇది అప్పుడప్పుడూ మనక్కూడా కలుగుతుంది .ఉదాహరణకి ,ఏ రాఖీ యో ,భారతీయుడో లేక అపరిచితుడో లాంటి సినిమాలు చూసినపుడు ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని ,అవినీతి పరుల్నీ చీల్చి చెండాడేద్దాం అనిపిస్తుంది .థియేటర్ నుంచి బైటకి వచ్చేవరకూ ....అలాగే మన పై అధికారి అకారణంగా చివాట్లు పెట్టినపుడూ ,మన శ్రమకు గుర్తింపు లభించనపుడూ ,చివరికి మన పిల్లలు మన మాట విననపుడూ .......ఇలా ....అనేక సందర్భాలలో మనకు శ్మశాన వైరాగ్యం కలుగుతూ ఉంటుంది .దీన్ని పూనకంతో పోల్చవచ్చేమో .దేవుడో ,దెయ్యమో ఒంటిమీదకొచ్చి కాసేపటికి వెళ్లిపోతుంటారు అలాంటిదే ఇదీను .
*ఈమధ్య మా నాన్నగారికి ఇష్టమని కొన్న సత్య హరిశ్చంద్ర సి .డి పెట్టుకొని సినిమా చూసాను .పూర్తయ్యేసరికి బాగా ఇన్స్పైర్ అయ్యి ఎల్లప్పుడూ సత్యమునే పలుక వలెను అని ఘా ....ట్టి గా నిర్ణయించుకున్నా .
ఇంతలో సెల్ రింగ్ అయ్యింది .చూద్దును కదా ,తెలిసిన ఎల్ .ఐ .సి ఏజెంటు .జీవన్ ఆస్థా అని మంచి పాలసీ ఉంది మేడం !మీరు, సార్ ఫ్రీగా ఉంటే వచ్చి కలుస్తా !
అయ్యో !మేం ఇంట్లో లేమండీ ! వీకెండ్ కదా అందరం రిలేటివ్స్ ఇంటికెళ్లాం ??? sengihnampakgigi

Wednesday, January 21, 2009

నెనరు !!(మోహం ,వలపు )

*చెలికాడా !నెనర్లు !(కృతజ్ఞతలు )
నీ ప్రక్కన ఓ నిముషం కూర్చునే ,
చనువుంటే చాలనుకున్నాను .
నీ ముఖాన్ని చేతులలో తీసుకొని ,
నీ నుదుట ముద్దాడ గల్గితే ...
అదే భాగ్యమనుకున్నాను .
ఎన్ని వసంతాల నిరీక్షణిది?
చివరికి ...........నా ప్రేమ ,
నీ వాంఛలో సఫలీకృత మైంది .
నువ్విచ్చిన కాన్క నా చిన్ని
దోసిట చాలక .........
పొంగి పొర్లి పోతోంది .
కాముని చెరకు వింటి నుంచి పుట్టావో ఏమో ....
నాలో నివురు గప్పిన కాంక్షా జ్వాలను ,
నులి వెచ్చని నీ స్పర్శతో రగిల్చావు .
కారు మబ్బులా కమ్మేస్తావ్ ....
వెనువెంటనే వర్షిస్తావ్ .....
నీ తలపుల్ని మాత్రం నాకొదిలి ,
నువ్వు నిష్క్రమిస్తావ్ ......
ప్రియతమా !
ఆ తలపుల వాకిటే నిలుచుని
నీ ఆకస్మిక ఆగమనాన్ని తలుచుకొంటూ,+
కలలు కంటాను ......

Sunday, January 18, 2009

నన్ను విడిచి .......

నిన్ను చేరుకొనే ప్రయత్నంలో ........
నా అస్థిత్వం మరచి ,
నన్ను నేను విడిచి ,
అలుపెరుగని పయనం సాగించా ......
గమ్యం చేరుకోలేక ,
తిరిగి నాకు నేను
చేరువ కాలేక ,
రెంటికీ చెడ్డ రేవడినయ్యా !!

Tuesday, January 13, 2009

*సంక్రాంతి శుభాకాంక్షలు *

మీకూ ,మీకుటుంబానికీ ....
భోగి భోగ భాగ్యాలనూ ,
సంక్రాంతి శాంతి సౌఖ్యాలను ,
కనుమ ఆయురారోగ్యాలనూ ,
ఇవ్వాలని కోరుకుంటూ ......
బ్లాగ్ మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు .

Monday, January 12, 2009

సంక్రాంతి (మా ఊరి సంబరాలు )

సంక్రాంతి తెలుగు వారి" పెద్ద పండుగ ".సూర్యుడు ధనూ రాశి నుంచి ,మకర రాశి లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి .ఇప్పుడే ఉత్తరాయణం ప్రవేశిస్తుంది .
మూడు రోజులు జరుపుకొనే ఈ పండుగ పల్లెల్లో ఏటేటా సంబరాల్ని తెస్తుంది .పేరుకి మూడు రోజులే కాని నెలంతా పండుగ లాగే ఉంటుంది .మా ఊళ్ళో కూడా ....మీకు తెలీదని కాదు ,ఈ పట్నవాసంలో నేను మిస్ ఐన పండుగ సందడిని మీతో పంచుకోవాలని ఈ టపా .....
హేమంత ఋతువు .......పుష్య మాసం ....ధాన్య లక్ష్మీసమేతయై పౌష్య లక్ష్మి ఇంటింటికి వస్తూంటే ముంగిట రంగవల్లులతో ఆహ్వానిస్తాము .పంట చేతికొచ్చి రైతూ ,రైతు బావుంటే రెండు పుట్లవడ్లు ఎక్కువ కొలుస్తారని కూలీలు ...అందరూ సంతోషంగా చేసుకొనే పండుగ .ఈ నెలలో బలి చక్రవర్తి ఏడాదికోసారి పాతాళం నుండి భూలోక సంచారానికి వస్తాడని ఆయన్ను స్వాగతిస్తూ నెలంతా నాలుగు ద్వారాలున్న నెలముగ్గులు (నెల కంట )పెడతారు .మా వూళ్ళో ధనుర్మాసం నెలంతా తెల్లవారు ఝామున , నగర సంకీర్తన చేస్తారు .అంటే కొంతమంది భక్తులు కలసి హరి నామ సంకీర్తన చేస్తూ ఊరంతా తిరుగుతారు .హరినామ స్మరణ చేయని వారికి కూడా హరినామ శ్రవణం వల్ల పుణ్యం లభిస్తుందని ఈ నగర సంకీర్తన యొక్క ఉద్దేశ్యం .ఈ మాసంలో వస్త్ర దానం మంచిదని అంటారు బహుశా చలికాలం పేదలకు వస్త్రాలు అందుతాయన్న ఉద్దేశ్యం కావచ్చు .నెల పట్టింది మొదలు ముంగిట ముగ్గులు వేసి వాటి మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు చివరిరోజు పసుపు కుంకుమలు చల్లిన గొబ్బెమ్మల్ని ఒక చోట చేర్చి వాటిపై గుమ్మడి పూవులుంచి కన్నెపిల్లలంతా చేరి ....సుబ్బి గొబ్బెమ్మా ,సుబ్బణ్ణియ్యవె, చామంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే , తామర పువ్వంటీ తమ్మున్నియ్యవే .....ముసి ముసి నవ్వులతో ,బుగ్గల్లో సిగ్గులు పూయిస్తూ ....మొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవె .....అంటూ చప్పట్లు చరుస్తూ గొబ్బిళ్ళ చుట్తో తిరుగుతూ పాడుతుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలవనుకోండి.ఇక నెలంతా రోజుకొక వేషంతో పౌరాణిక ఘట్టాలను పద్యాలుగా పాడుతూ పగటి వేషగాళ్ళూ , హరిలో రంగ హరీ అంటూ ఇంటింటికీ తిరిగే హరి దాసులూ ,అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ బుడబుక్కల వాళ్ళూ ,శుభోజ్జయమంటూ భట్రాజులూ ,అమ్మగారికి దణ్ణం పెట్టు,అయ్యగారికి దణ్ణం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళూ ,శంఖారావం చేస్తూ వచ్చే ఈశ్వర స్వరూపులు జంగం దేవరలూ ఇంకా కొమ్మదాసులవాళ్ళు (చెట్లెక్కి దూకుతూ తిరిగే హాస్యగాళ్ళు ),పిచ్చిక గుంటోళ్ళు (వీళ్ళు మన ఇంటి పేరు చెప్తే గోత్రాన్ని ,ఇంకా మన వంశీకుల ,ఇంటిపేర్ల పుట్టుపూర్వోత్తరాలు చెప్తారు ).వీరంతా నెలంతా బియ్యంతో సరిపెట్టినా పండుగ మూడు రోజులూ స్వయంపాకమో ,సంభావనో ,ధాన్యమో లేక పాత వస్త్రమో ఇస్తే మహదానందంగా దీవెనలిస్తూ మరలిపోతారు . తనకున్న దానిలో కొంత ఇతరులకు పంచడంలోని తృప్తిని ప్రజలకు కలగజేయటమే పండుగ దానం పరమార్ధం .దానివల్ల కష్ట జీవులకు ,పేద సాదలకు మేలు కలగాలన్న ఉద్దేశ్యం అయి వుంటుంది .
బంతిపూల తోరణాల గుమ్మాలూ ,పసుపు రాసిన గడపలూ ,చామంతులరరారు కొప్పులతో పల్లె పడుచులూ ...అసలు చేల గట్ల మీద పూచిన బంతిపూలు మా పల్లెకు కట్టని బంగారు తోరణాలు .పండిన మిరప చేలు భూమాతకు పచ్చంచు ఎర్ర చీర .
మొదటిరోజు భోగి .తెల్లవారు ఝామున లేచి (నూనె రాసి నలుగు తప్పనిసరి )తలంటి పోసుకొని ,కొత్తబట్టలు వేసుకొని ,
చిన్న పాలేరు నెలరోజులు కష్టపడి ఆవు పేడతో చేసి ఎండబెట్టిన చిన్నచిన్న పిడకలతో భోగిదండలు చేసేవాడు .ఎంతమంది పిల్లలుంటే అన్నిదండలు .వీధి చివరి భోగి మంటలో వేసి నస్కరించాలి .అది కూడా ఒక యజ్ఞమేనని అమ్మమ్మ చెప్పేది .సున్నుండలూ ,పులగం భోగి స్పెషల్ .(అరిసెలు ,పాకుండలు ,బెల్లం మిఠాయి ,కారప్పూస .....కామన్ )
సంక్రాంతి ....తల స్నానం ,కొత్తబట్టలూ షరా మామూలే .పరమాన్నం ,పులిహోర ,గారెలూ ..సంక్రాంతి స్పెషల్ .పెద్దపండుగ రోజు కొత్తగా వచ్చిన పంటతోనూ,పిండివంటలతోనూ పెద్దలను (చనిపోయిన పూర్వీకులను ) పూజిస్తారు .ఇక అమ్మమ్మ మమ్మల్ని ముస్తాబు చేసి ఒక బుట్టలో బియ్యం పోసి చిన్న గిన్నె చేతికిచ్చి బయట అరుగుమీద కూర్చోబెట్టేది .భిక్షకు ఎంతమంది వచ్చినా లేదనకుండా ఆ చిన్న గిన్నెతో కొలిచి పోసేవాళ్ళం .ఇంట్లో పెద్దమ్మలూ ,పిన్నులూ ,బాబాయిలూ ,అన్నలూ ,చెల్లెళ్ళూ , తమ్ముళ్ళూ ,కొత్తగా పెళ్ళయిన అక్కలుంటే బావతో మరీ సందడి .
బావని అల్లరి పట్టించడానికి పిల్లలంతా ప్లాన్ చేసుకొని ,సున్నుండలకు బదులు తవుడు ,బెల్లం నేతితో కలిపి పెట్టడం ,తమలపాకుల్లో పచ్చిమిరప ముక్క పెట్టివ్వడం .....ఇలా తుంటరి పనులు చేయడం అలా పెద్దాళ్ళతో చివాట్లు తినడం (ఉత్తుత్తినే లెండి )భలే సరదా !మరి ఊర్లో సందడి ....ఓహో ...మహా జోరుగా కోడి పందేలు ,రావి చెట్టు గట్టు మీద చతుర్ముఖ పారాయణం .కొత్తల్లుళ్ళ దగ్గర్నించీ ,తల పండిన తాతల వరకూ అందరూ అక్కడే ఉంటారు .
మూడవ రోజు కనుమ ....ఎడ్లను ,పాడి పశువులనూ కడిగి పూజిస్తారు .ఎడ్లను పసుపు కుమ్కాలతోనూ ,కొమ్ములకు రంగులతోనూ ,మెడలో మువ్వలతోనూ అలంకరిస్తారు .పూర్ణం బూరెలు ,పప్పు ,అన్నంతో గ్రామ దేవతకు నైవేద్యాలు పెడతారు .రెండు రోజుల్నుంచీ పప్పు ధప్పలాలతో చప్పబడిన అల్లుళ్ళకి కనుమ విందు ప్రత్యేకం .నాటుకోడి కూర ,గారెలూ ...స్పెషల్ .
భోగి పళ్ళూ ,గాలిపటాలూ, బొమ్మల కొలువులు ..... చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాని అసలు ఇది చదివే ఓపికేఎందరికి ఉంటుందో ,లేదో అనుకొంటూ రాస్తున్నా .
నాలుగవదీ ,చివరిదీ ముక్కనుమ ....ఆరోజు సూర్యుని రధం దిశ మారటానికి గుర్తుగా రధం ముగ్గు వేసి పొడవాటి గీత వీధి చివరి వరకూ గీసి మరు ఏడు మరల రావమ్మా అంటూ సంక్రాంతి లక్ష్మిని సాగనంపుతారు . మరుసటి రోజు ప్రయాణం ....అందరి ముఖాల్లో దిగులు .పిల్లలకేమో సెలవులైపోయాయనే గుబులు .సంవత్సరానికి సరిపడా తీపి గుర్తులు మూటగట్టుకొని (అమ్మమ్మ ఇచ్చిన స్వీట్ ల తోపాటు )మరలిపోయేవాళ్ళం .

ఇక ఇప్పుడు పండుగ ...ఆరు గంటలకు (అదే ఎక్కువ )లేచి షాంపూతో తలస్నానం అయిందనిపించి ,కొత్తబట్టలు వేసుకోవడం ,తప్పదన్నట్టు కాసిని పిండివంటలు వండుకోవడం (అప్పుడప్పుడు స్వగృహ ఫుడ్స్ నుంచి ).
టి .వి ముందర సెటిలై పోవడం .కాకపొతే ఎడారిలో ఒయాసిస్ లాగా ఈ కాంక్రీట్ జంగిల్ లో శిల్పారామం .పండుగ వాతావరణాన్ని తలపింప చేస్తుంది .ఎంతైనా క్రియేట్ చేసిన దానికీ ,మన పల్లె సాంప్రదాయానికీ తేడా వుంటుంది కదండీ !

Friday, January 9, 2009

తేగ తెచ్చిన తంటా !

"మావూరి గాలి" టపాలో ప్రవీణ్ గారు పల్లె అందాలతో పాటు పల్లె రుచులను కూడా ప్రస్తావిస్తూ తేగలు ,చెరకు గడలు అంటూ నోరూరించారు .చిన్ననాటి జ్ఞాపకాల తేనెతుట్ట మీద రాయి విసిరిన చందంలా ...
మా అమ్మమ్మ గారి ఊరిలో కూడా పొలంలో తేగలపాతర వేసేవారు .అంటే తాటి టెంక లన్నీ ఒక చోట పాతిపెడతారన్నమాట .అవి అన్నీ ఊరి తేగలు తయారయ్యాక తంపట వేస్తారు .అంటే ఒక కుండలో తేగలు వేసి చుట్టూ మంట వేస్తే లోపలి తేగలు చక్కగా ఉడుకుతాయన్నమాట .ఇంటికి తేగానే పిల్లలందరం లావుపాటి తేగలు పోటీపడి ఏరుకొని తినేవాళ్ళం .వాటి రుచి చెప్పక్కర్లేదనుకోండి . తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని ,తింటే చదువు రాదనీ చెప్పేవాళ్ళు .మేం భయపడి తినేవాళ్ళం కాదు .కాని అప్పుడప్పుడు అమ్మమ్మ చూడకుండా తిన్న నాకు ,అస్సలు తినని మా చెల్లికి కూడా చదువబ్బలేదు అది వేరే సంగతనుకోండి .(బహుశా అందుకేనేమో మా చెల్లి నాకంటే ఓ రెండు క్లాసులేక్కువే చదివేసింది లెండి ).
ఇంతకూ నాకొచ్చిన తంటా ఏవిటంటారా ? అక్కడికే వస్తున్నా !ఈ మధ్య మా చెల్లెలి కొడుకు ఏడేళ్ళ వాడు మా ఇంటికొస్తే తేగలు పెట్టా .పెట్టి ఊరుకోకుండా చందమామ తినకూడదురా అన్నా .అంతే మొదలైంది నాకు తంటా ...ఎందుకు తినకూడదు ? ఎందుకు చదువు రాదు ? నీకెవరు చెప్పారు ? అంటూ వదలకుండా వెంట పడ్డాడు .మా రోజులు కావు కదా పెద్దాళ్ళు చెప్పారు కదాని వినటానికి .పిల్లల దగ్గర నోరు జారితే ప్రతీదానికి రీజన్ చెప్పాల్సి వస్తోంది .ఒక పట్టాన వాడు వదలడు నాకు తెలీదని అంటే మరెందుకు చెప్పావ్ అంటూ అందర్లో పరువు తీస్తాడు.సరే ఇక తప్పదు మన క్రియేటివిటి కి టైం వచ్చేసిందని అనుకొంటూ చెప్పాను .
అనగనగా చాలా సంవత్సరాల క్రితం అంటే కొన్ని వందల ఏళ్ల క్రిందట రాసుకోవడానికి పుస్తకాలు ,పేపర్లు ....ఉండేవి కాదు .అప్పుడు తాటి ఆకుల్ని కోసి వాటిపైనే రాసుకోనేవారు .వాటినే తాళపత్ర గ్రంధాలంటారు . అంటే మన పుస్తకం లాగే తాటి ఆకులు కూడా సరస్వతీ దేవి అన్నా మాట .మరి చందమామ మొలిస్తే తాటి చెట్టవుతుంది కదా .అందుకే చందమామ తింటే సరస్వతీ దేవికి కోపం వస్తుంది .చదువు రాదు అందుకే తినొద్దని అంటారన్న మాట .అని చెప్పి ఉపిరి
పీల్చుకున్నా.మావాడు కన్విన్స్ అయ్యాడా అని చుసేలోపు ...అప్పటి వరకు ఊపిరి బిగబట్టి వింటున్న మా చెల్లి ,మరిది ,మా మేనకోడలు ,మా అబ్బాయి ......ఇలా అంతా హాశ్చర్యంగా చూసి నిజమా ...అత్తమ్మా ...నాకింతవరకు తెలీదండి .....అక్కా చిన్నప్పుడు నాకెప్పుడూ చెప్పలేదే ...అంటూ .....ఒకటే ప్రశ్నలు .ఏం చెప్పను నా ఇబ్బంది ?ఇంతలో వాడు అడిగాడు ..నువ్వు చెప్పింది కరక్టే కాని ఇప్పుడు మేం బుక్స్ మీదే రాస్తున్నాంగా ...మేమెందుకు తినకూడదు ? అని .
హా ..........హతవిధీ ......
ఇంతకూ చందమామెందుకు తినకూడదంటారూ? మీకేమైనా తెలుసా ?

*ఏదో ఆట విడుపుగా రాశాను .నవ్వొస్తే నవ్వుకోండి ...మీ సమయం వృధా ఐతే క్షమించండి .

Wednesday, January 7, 2009

మధురోహలు

నా ఊహల బృందావనంలో విరిసిన
పారిజాతానివి నువ్వని ......
నా మధురోహలు నీతో పంచుకున్న క్షణం ,
నువ్వు పలికిన పసిడి పలుకులు
ఇంకా నా చెవిలో .....
గుసగుసగా వినిపిస్తిన్నాయి .
నీ ధరహాసాలు , పరిహాసాలు ,
నీ చిలిపి గారాలు ,సరాగాలు ...
ఇవన్నీ, క్షణ కాలమేనా ?
నా కలల వాకిట నిలిచిన
నిలువెత్తు శిల్పానివి ...
నిన్నెంత చూసినా
నా నయనాల దాహం తీరదాయే
తొలకరి జల్లులా మెరిసి ,
మాయమై పోయావ్ .....
ఇది కలయో ,వైష్ణవ మాయో .....
తెలిపే౦దుకైనా నీ చిరునవ్వుల
చందనాన్ని మరోసారి ........
నాపై చల్లిపో ........ప్రియా!

Monday, January 5, 2009

నేడు విజయవాడలో కొ .కు .శతజయంతి సభ

*ఈ రోజు ఈనాడులో నరసింహ మూర్తి గారి వ్యాసం చదివే వుంటారు .చదవని వారి కోసం క్లుప్తంగా ....

తెలుగు వాళ్లకు కొ .కు.గా పరిచయమున్న ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు.ఇరవై ఎనిమిదేళ్ళు "చందమామ 'సంపాదకులుగా వుంటూ అటు పిల్లలను ,ఇటు పెద్దలను ఒకే రీతిగా సంతోష పెట్టగల తెలుగు రచయిత కొ .కు.గారు . 20-10-1909 వ తేది , తెనాలి లో ఆయన జన్మించారు .డెబ్బై ఒక్క సంవత్సరాల జీవితంలో దాదాపు అరవై సంవత్సరాల పాటు ఎడతెగని రచనలు చేశారు .'ప్రాణాధికం ' ఆయన రాసిన తొలి కధ .1925 వరకు తెనాలిలో పాఠశాల విద్య ,గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు .తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో భౌతిక శాస్తంలో పట్టభద్రులయ్యారు .బనారసు విశ్వ విద్యాలయంలో m.s.c లో చేరారు .కాని ఆర్ధిక పరిస్థితుల కారణంగా రెండవ సంవత్సరంలో ఆయన చదువు ఆగిపోయింది .ఇక ఆయనకు పదహారేళ్ళ వయసులోనే పద్మావతి గారితో వివాహం జరిగింది .బనారసులో చదివే కాలంలోనే కొ .కు. నాస్తికవాది ,వ్యాసకర్త ,కధకుడు అయ్యారు .సిమ్లా ,బొంబాయి ,మద్రాసు ....ఎన్నో చోట్ల గుమస్తాగా ,ఉపాధ్యాయునిగా , ఫోర్ మాన్ గా ,సినిమా రచయితగా రకరకాల ఉద్యోగాలు చేసి చివరకు పత్రికా రంగంలో స్థిర పడ్డారు .1931 నుంచి 500 కు పైగా కధలు రాసిన కొ .కు .అభ్యుదయ రచయితగా ,నవలా కారునిగా ,వ్యాసకర్తగా ప్రసిద్ధులయ్యారు .ఆయన వందకు పైగా రేడియో నాటికలూ రాశారు .అశ్వని ,కేయాస్ ,టి .వి .శంకరం వంటి కలం పేరుతొ కూడా ఆయన రచనలెన్నో కనిపిస్తాయి .ఆయన రచనల్లో అనుభవాలకు తప్ప ఊహలకు చోటుండదు .జీవితపు మారుమూలల్లోకి వెలుగు తీసుకు రాలేనిది సాహిత్యం కాదని ఆయన గట్టిగా నమ్మేవారు .కొ .కు .రచనలు జీవితానికి దగ్గరగా వున్నట్టే ,భాష ప్రజలకు దగ్గరగా వుంటుంది .విప్లవ బీజాలు లేని సాహిత్యం ఆలోచనలు రెకెత్తిన్చదని అది సాహిత్యమే కాదని కొ .కు .అంటారు .ఆయన మంచి విమర్శకులు .స్వపర భేదం లేదు .ఇతరుల కంటే ముందే తన లోపాలను తానే ఎత్తి చూపించుకుంటూ వచ్చారు ."సాహిత్యంలో కలగలిసిన మార్పు "అనే వ్యాసమూ ,"ఆర్ధకోపన్యాసాలు "అనే కధ ,"నా అజ్ఞానాన్ధత్వానికి మచ్చు తునకలు ","నేనవలంభించిన వ్యక్తి వాదం వల్ల నా ప్రయోజనం కొనసాగిందేమో కాని సాంఘిక ప్రయోజనం నా కలల్లో మృగ్యమైంది ."వంటి ఆత్మ విమర్శతో కూడిన అభిప్రాయాలను ఆయన తరచూ ప్రకటిస్తూ వచ్చారు .ఆయన రచనల్లో తెలుగుదనం తక్కువని ,పాత్రలు సిద్ధాంతాలు మాట్లాడతాయని వచ్చిన విమర్శల్నికొన్ని స్వీకరించినా ,కొన్నిటిని ఆయన ఎదుర్కొన్నారు ."నేను ఎవరి ఉపయోగం కోసం కధ రాస్తున్నానో వారికా కధ అర్ధం కాకపోవడం నిజంగా నా లోపమే మరి "అంటూ విమర్శను హుందాగా స్వీకరించే అలుపెరుగని రచయిత కొడవటిగంటి కుటుంబ రావు గారు .కనుకనే ఆయన తెలుగు పాఠకులకు అభ్యుదయ భావాలను జీర్ణింప చేసే జరాగ్నిగా నిలిచారు .

*కొ .కు .గారి కుమారుడు కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారు ,వారి బ్లాగులు సైన్స్ , మ్యూజిక్ మనకు సుపరి చితమే .

Friday, January 2, 2009

యుద్ధం చేస్తున్నా !

యుద్ధం చేస్తున్నా ! నా హృదయంతో .....
తన నిండా నింపుకున్న నీ తలపుల్ని
తుడిచెయ్యాలని.......
యుద్ధం చేస్తున్నా ! నా కళ్ళతో
నాలోని నీ రూపుని కన్నీరుగా
తోసెయ్యాలని .......
యుద్ధం చేస్తున్నా ! నా పెదవుల్తో
పలకొద్దని నీ పేరుని
పదే పదే ......
కానీ ప్రతి సారీ ఓడిపోతున్నా
సర్వాంతర్యామివై నన్ను వేధిస్తున్నావ్
ఐనా నేను గెలవాలని ప్రయత్నిస్తున్నా ....
ఓడిపోవాలని కోరుకుంటూనే .........

Thursday, January 1, 2009

నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం

గమ్య మెరుగని పయనంలో
దాటామొక మజిలీ
తీపి మరిచి ,చేదు విడిచి
స్థిత ప్రజ్ఞత సంతరించుకున్న ,
ఈ చివరి రోజు ........
నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ,
ప్రార్ధిస్తున్నా..... సర్వే జనాఃసుఖినో భవంతు

*మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.