Saturday, February 28, 2009

ఉత్తరాలు ......


ఉత్తరాలు ......మన ఆత్మీయుల వద్దనుండి కష్ట సుఖాలు ,ప్రేమ ఆప్యాయతలూ మోసుకొచ్చే పలకరింపుల పరిమళాలు .పోస్ట్ మాన్ ఒకప్పటి ఆత్మీయ బంధువు .మనకు మనియార్డర్ వస్తే మన సంతోషం లోనూ ,సీరియస్ టేలిగ్రాములోస్తే మన దుఃఖం లోనూ పాలు పంచుకునే మనకేమీ కాని ఓ నేస్తం .మండు వేసవిలో ఉత్తరం తెచ్చిస్తే ఓ గ్లాసు చల్లటి మంచి నీళ్ళో ,మజ్జిగ తేటో ఇస్తే పరమానందంగా తాగి చల్లగా చూస్తూ వెళ్ళిపోయే అల్ప సంతోషి .కొత్తగా పెళ్లై అత్తారింట్లో ఉన్న కూతురి క్షేమాన్ని ఓ తండ్రికి ,కేంపుకి వెళ్ళిన భర్త సమాచారాన్ని ఓ ఇల్లాలికి , పురిటి కెళ్ళిన భార్య బాగోగులు భర్తకి .......చేరవేసేది ఉత్తరం .

కార్డులూ ,కవర్లూ ,ఇన్ లాండ్ కవర్లూ ,రిజిష్టర్ పోస్ట్ లూ ,పార్శిల్సూ ..........ప్రతీ రోజూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూపులు .ఇప్పుడు మచ్చుకైనా లేవు .ఫోన్ లూ , మెయిల్సూ .....లేదంటే కొరియర్ ..... ఎప్పుడైనా అడపా దడపా ఏ LIC వాళ్ళో పంపించేవి తప్ప .అది కూడా అపార్ట్ మెంట్ లో ఉండే వాళ్ల కైతే వాచ్ మాన్ తీసుకుని తెచ్చిస్తాడు .నా చిన్నప్పుడైతే ఎన్ని ఉత్తరాలోచ్చేవో ....మా ఇంట్లోను ,అమ్మమ్మ వాళ్ళింట్లోనూ ఐతే వచ్చిన ఉత్తరాలన్నీ ఒక ఊసకి గుచ్చి వంకెకి తగిలించి పెట్టేవారు .

ఓ ఐదారు ఏళ్ల క్రితం వరకు అందరూ మానేసినా మా నాన్నగారు మాత్రం ఉత్తరాలు రాశేవారు .ఇన్ లాండ్ కవర్ నిండుగా ఎక్కడా సంతకం పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా .ఇద్దరికీ ఫోన్ లు ఉండేవి ఉత్తరం అందేలోగా ప్రతీ రోజూ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం .అప్పట్లో కోప్పడే దాన్ని . ఎందుకు ఫోన్ లో చెప్పినవే లెటర్ రాస్తారు ,లెటర్ లో రాసినవే ఫోన్ లో చెప్తారు అని .అప్పుడర్ధం కాలేదు ఆ ఆప్యాయత .ఏదైనా కోల్పోయాకే దాని విలువ తెలిసేది . ఈ మధ్య ఇల్లు సర్దుతుంటే నాన్నగారు రాసినవి ,మా పాప హాస్టల్ లో ఉన్నప్పుడు రాసినవి ,నేను పుట్టింటి కెళ్ళినప్పుడు మావారికి రాసినవీ ........కంటబడ్డాయి .

వాటిని మళ్ళీ చదువుతుంటే .......అప్పుడు తెలిసింది ఇప్పుడేం మిస్ అవుతున్నానో ......చదివేసినవే అయినా ఆ ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఎవరైనా ఉత్తరం రాస్తే బావుండని పించినా ,రాశేవారు లేరు .ఒకవేళ నేను రాసినా నవ్వుతారో ఏవిటో ............

ఇప్పటికీ ఎప్పుడైనా బయటి కెళ్ళినప్పుడు పోస్ట్ మాన్ కనిపిస్తే ఆత్మీయుడిని చూసినట్టే అనిపిస్తుంది .
మరి మీకేమనిపిస్తుంది ? టెక్నాలజీ ఇంత డవలప్ అయి ఎంత దూరానున్న మనిషినైనా చూసి మాట్లాడుతుంటే ఉత్తరాలంటూ ఈ పోష్ట్ఏవిటీ అనిపిస్తుందా ?

Friday, February 27, 2009

మనసుకు రెక్కలు ....


ప్రియతమా !
నీ జ్ఞాపకాలు నాకు చేరువై
నా నిద్రను దూరం చేస్తున్నాయ్
నిన్ను చూడలేని నా కళ్లు
కన్నీళ్లను సైతం మాకొద్దని
బైటకు తోసేస్తున్నాయ్ .....
మనసుకు మాత్రం రెక్కలిచ్చి
ఈ తనువును నిస్సహాయంగా
చేసిన ఆ దేవుడ్ని తిట్టుకుంటూ
నిన్ను కలిసే క్షణాల కోసం
యుగాలు లెఖ్ఖ పెడుతూ
ఎదురు చూస్తున్నా ..........

Tuesday, February 24, 2009

దాంపత్యం సాఫల్యత ....


** చాలా సంవత్సరాలై ఉంటుంది రంగ నాయకమ్మగారి "అంధకారంలో "అనే నవల చదివాను .దానిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని .........

సంగీతాలూ ,చిత్రలేఖనాలూ మాత్రమే కలలనుకుంటాం .కాని హాయిగా జీవించడం కూడా గొప్ప కళే .ఆ కళలో మనం నిష్ణాతులం కావాలంటే జీవితాన్ని గౌరవించి ,ప్రేమించడమే దానికి మార్గం .

పెళ్లి అనేది సాంఘిక బంధమూ ,శారీరక బంధమే కానీ అది మానసిక బంధం కాదు .భార్యని శాశ్వతంగా భర్తతో ఐక్యం చేయగలిగేంత బలీయమైన మధుర స్మృతులు ఏవీ లేకపొతే దాంపత్యం విఫలమౌతుంది . సంసారంలోని మధురిమనూ అనుభవించలేరు .

వివాహం రెండు వ్యక్తిత్వాల కలయిక ,రెండు మనస్తత్వాల కలయిక ,రెండు సంస్కారాల కలయిక .పెళ్ళవగానే సుఖాలూ ,ఆనందాలూ తరుముకుంటూ రావు .భాగస్వామిలో ఏదో నచ్చుతుంది ,మరేదో నచ్చదు .ఎదుట వ్యక్తికోసం తను కొంత మారాలి ,తన కోసం ఎదుటి వ్యక్తిని కొంత మార్చుకోవాలి .సామరస్యంతో ,బాధ్యతతో ......ఇద్దరిదీ ఒకే జీవితంగా చేసుకోవాలి .అప్పుడే దాంపత్యం సాఫల్యం చెందుతుంది .

భార్యా భర్తల మధ్య అనురాగం సంధ్యా రాగం అంత అందంగా .....మల్లెపువ్వంత పరిమళంగా .....పాల వెన్నెలంతా స్వచ్చంగా ఉండాలి .

Sunday, February 22, 2009

ఆక్రోశం......నీ
పరిచయానికి ముందు .....
నా ప్రపంచం రంగుల మయం
తర్వాత ఎప్పుడావరించిందో
నా చుట్టూ ఈ శూన్యం
నా ఊహల కోటకు నిన్ను
మహారాజును చేస్తే .....
నా సంతోషానికి సమవర్తివై ,
నన్ను శ్రావణ మేఘాన్ని చేశావ్
నేను కట్టుకున్నది ఇసుక కోటని
తెలుసుకునే సరికి ..........
రెక్కలు తెగిన పక్షినై
నేలకొరిగాను .

Thursday, February 19, 2009

పరిమళించని పారిజాతాలునేస్తం !
ఎలా ఇలా మారిపోయావ్ ?
ఒకప్పుడు నా చెంగు నిండా నింపుకున్న
నీ నవ్వుల పారిజాతపూలు .....
ఇప్పుడు నిప్పురవ్వలై పోయాయేం ?
ఒకప్పుడు నేను తడిసి మురిసిన ,
నీ చూపుల వెన్నెల కిరణాలు .......
ఇప్పుడు తూటాలై నా గుండెలో
మానని గాయం చేస్తున్నాయ్
నువ్వు రాని ఈ వాకిలీ,
పరిమళించని పారిజాతాలూ,
పూజలేని రాధా కృష్ణులూ,
నిర్జీవమైన నేనూ ........
అన్నీ .......ఇవన్నీ .......
తిరిగి రాని మన స్నేహానికి సాక్ష్యాలు !

Wednesday, February 18, 2009

పరిపూర్ణ పురుషుడు

స్త్రీ ......

కార్యేషు దాసీ ,కరణేషు మంత్రీ ,
రూపేచ లక్ష్మీ ,క్షమయా ధరిత్రీ ,
భోజ్యేషు మాతా,శయనేషు రంభా ,
షడ్ధర్మ యుక్తా కుల ధర్మ పత్నీ .

భర్తకు సేవలు చేసేటప్పుడు దాసీ గాను ,గృహ విషయములందు ,ధర్మ కార్యములలోను మంత్రి వలె సలహాదారు గాను ,రూపములో లక్ష్మీ దేవి వలెను ,సహనము చూపుటలో భూదేవి వలెను ,భర్తకు ,అతిధులకు భోజనం పెట్టునపుడు తల్లి వలెను ,భర్తతో శయనించు వేళ రంభ వలెను ........ఈ ఆరు లక్షణములు ఉన్న స్త్రీని ధర్మపత్నిగా చేసుకో దగిన పరిపూర్ణమైన స్త్రీగా వర్ణించారు .

అలాగే పురుషునికి ఉండాల్సిన ఎనిమిది లక్షణాలు .........

అన్న మదము , అర్ధ మదము ,
స్త్రీ మదము , విద్యా మదము ,
కుల మదము , రూప మదము ,
ఉద్యోగ మదము ,యౌవన మదము .
ఈ అష్ట మదములూ కలిగిన వాడు పరిపూర్ణ పురుషుడని పెద్దలు చెప్తారు .

వీటితో పాటూ ....చతుర్విధ పురుషార్ధములలోనూ ,ధర్మ ప్రవర్తన కలిగి ,ఈర్ష్యా స్వభావము లేక ,దయ ,కరుణ, ఓర్పు కలిగి ,మధుర మైన వాక్కునూ ,సత్ప్రవర్తనను కలిగి ఉండవలెను .శ్రమ పడుటకు వెనుదీయక ,ధైర్య సాహసములు కలిగి కీర్తి ,సంపదలు సంపాదించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నము చేయువాడు ఉత్తమ పురుషుడు .

* పేరు గుర్తు లేదు ఎప్పుడో చదివిన పుస్తకం నుండి ........తప్పులుంటే మన్నించగలరు .

Sunday, February 15, 2009

పదిలంగా అల్లుకున్నా........


అనగనగా ఓ చిన్న పల్లెటూరు .అక్కడో పాత కాలపు లోగిలి .చుట్టూ చక్కటి పూదోట .మల్లె ,జాజి ,మందారం ,నందివర్ధన ,గులాబి ,నిత్యమల్లి ,కనకాంబరాలు,బంతులూ ,చామంతులూ .........ఒకటేంటి విభిన్న సంస్కృతులు కలిసుండే భారత దేశం లాంటి తోట .పెరడు నిండుగా కాసే కూరగాయలు ,ఆకుకూరలూ .....

ఆ ఇంట్లో ఓ ముచ్చటైన కుటుంబం .భార్య ,భర్తా ,పాప ,బాబు .ప్రతిరోజూ గుడి మైకులో వినిపించే సుప్రభాతమే అలారం .జోడెద్దుల చిరుగంటల సవ్వడే మేలుకొలుపులు .ప్రతీ ఉదయమూ శుభోదయమే .....పాలేరు అప్పుడే తీసి తెచ్చిన చిక్కటి పాలతో ,శ్రీవారికి కాఫీ ,పిల్లలకు బూస్టూ ......తర్వాత మామూలే పిల్లలేమో స్కూలుకు ,శ్రీవారేమో పొలానికి వెళ్ళిపోయాక వంటలూ వార్పులూ , అవయ్యాక ఇరుగు పొరుగులతో ముచ్చట్లూ ,అష్టా చమ్మ ,వైకుంఠ పాళీ ఆటలూ .....

సాయంత్రానికల్లా గూటికి చేరిన పక్షుల్లా ఇంటికి చేరిన పిల్లల అల్లరీ ,శ్రీవారి ముచ్చట్లతో ఆ ఇల్లాలికి పొద్దే తెలియని సందడి .ఆరోజు స్కూల్ విశేషాలు ఒకరితో ఒకరు పోటీపడి చెప్పే పిల్లల కబుర్ల మధ్య భోజనాలు .ఇక హోం వర్క్ అయిన దగ్గర్నుంచీ కేరమ్స్ ,చెస్ ,చైనీస్ చక్కర్ ...ఇలా ఏదొక ఆట....ఆతర్వాత 9 -9.30 కల్లా నిద్ర .

ఇక పౌర్ణమి వస్తే చాలు ఆరుబయట సన్నజాజి పందిరి పక్కన (పున్నమి రోజు పూలు కోయని జాజి పందిరి చూశారా ?చంద్రుడు లేని ఆకాశంలా ఉంటుంది నక్షత్రాల్లా విరగ పూసిన పూలతో ) చాపవేసుకుని చల్లని రేయి జాజిపూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ పెరుగన్నంలో వెన్నెల కలుపుకొని ,చందమామ కుళ్ళు కునేలా నలుగురూ ఒకే కంచంలో తినడం అదో అద్వైతం (అనొచ్చా ?) . ఆ తర్వాత అంత్యాక్షరి ....ఇద్దరిద్దరొక గ్రూపు .అందులో ఎవరికి ముందు 'మ ' వచ్చినా అందరూ కలిసి పాడే పాట మేడంటే మేడా కాదు ,గూడంటే గూడూకాదు, పదిలంగా అల్లుకున్నా పొదరిల్లూ మాదీ .......
ఇలా ఎంతో ప్రశాంతంగా ,ఆనందంగా జీవించే వారి జీవితాల్లోకి ......హఠాత్తుగా వచ్చేసింది ....
టెక్నాలజీ .....ముందుగా t.v .తర్వాత పిల్లలకు పోటీ పరీక్షలంటూ పట్నానికి వలస .సెల్ ఫోన్లూ ,కంప్యుటర్ లూ ....
పూర్వం రాణివాసంలో స్త్రీలని అసూర్యంపస్యలు (అంటే సూర్యకాంతి సోకని వారు ) అనేవారు .ఇప్పుడు అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంటులలో ఉండే వారందరూ అసూర్యంపశ్యలె .ఇక కబుర్లూ లేవు ,ఆటలూ లేవు ,వెన్నెల రాత్రులు లేవు .ఇంటికి చేరాక ఒకరు t.v తో మరొకరు కంప్యుటర్ తో ,మిగిలిన టైము సెల్ లో మాట్లాడుతూ .....అంతా యాంత్రిక మయం .
అసలు మనిషి తనవాల్లనుండే కాదు తననుండి తానే దూరమై టెక్నాలజీ కి దగ్గరౌతున్నాడేమో అనిపిస్తుంది .టెక్నాలజీ మనిషికి సౌకర్యాన్నిచ్చి ఉండొచ్చు .కాని మనుషుల్ని దూరం చేసేంత గా మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చేస్తోందన్న మాట చేదుగా ఉన్నా నిజం .అందుకే మనం కూడా ప్రతి దానికీ ఒకరోజు పెట్టుకుని అనుబంధాల్ని గుర్తు చేసుకునే సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం .టెక్నాలజీ ని ప్రేమించే రోజుల్నించి , తిరిగి మనుషుల్ని ప్రేమించే రోజులు మళ్ళీ వస్తాయని ,రావాలని కోరుకుంటూ .......

* పైన చెప్పిన ఫామిలీ మాదే .మానవ సంబంధాలు కనుమరుగై పోతాయేమోన్న ఆవేదన తప్ప టెక్నాలజీని తక్కువ చేసినట్టు భావించొద్దని మనవి .

Friday, February 13, 2009

నా హృదయాన్ని ........

ఓ ప్రేమికుల రోజు ........
నా ప్రేమను నీముందు పరచాలని ,
మాటల్లో చెప్పలేని భావాల్ని ,
అక్షరాలుగా పొదిగి ....
అందమైన గ్రీటింగ్ కార్డ్ ని
కవర్ నిండా నింపిన గులాబీ రేకులతో
నీకిస్తే ......ఏం చేశావ్ ?
జల జలా రాలిన పూరేకుల్ని
చెత్తబుట్ట పాలు చేశావ్ ,కార్డ్ ని
డెస్క్ లో ఓ మూలకి విసిరేశావ్ .
వాటి మధ్య పదిలంగా అందించిన
నా హృదయాన్ని .......
స్వీకరించావో ....లేదో ....తెలీదు
ఇష్టం లేదో .....లేక ధైర్యం లేదో ....తెలీదు
నీ దృష్టిలో అవి......
కేవలం వాడిపోయే పూలూ ,
చిరిగిపోయే కాగితం కావచ్చు
గాయపడిన నా మనసునడుగు
వాటి విలువెంతో ?
జీవితంలో నీకొక తోడు దొరకొచ్చు
నాకొక నీడా దొరకొచ్చు ......కాని
మన ఈ చిన్న పరిచయం .....
మరువలేని తీపి (???) జ్ఞాపకం !!

Monday, February 9, 2009

నీ నిర్లక్ష్యం

నీ నిర్లక్ష్యం వల్ల .....
ఆకాశం విరిగి పడలేదు
భూమి కంపించిపోలేదు
నక్షత్రాలు రాలి పడలేదు
గాలి స్థంభించి పోలేదు .....
సూర్యుడు వెలుగునిస్తూనే ఉన్నాడు ,
చంద్రుడు వెన్నెల వెదజల్లుతున్నాడు ...
బాల్కనీలో పావురాళ్ళూ ,
ఎక్వేరియంలో చేపలూ ,
స్కూలుకెళ్ళే పిల్లలూ ,
ఆఫీసుకెళ్ళే పెద్దలూ ,
గజీ బిజీ ట్రాఫిక్ .....
అంతా మామూలుగానే ఉంది .
కాని
నా మనసే ముక్కలైంది .
నువ్వు మాత్రం వెనుతిరిగి
చూడకుండానే వెళ్లిపోయావ్
నా గుండె పగిలిన చప్పుడు ....
నీకు వినపడ లేదో ....ఏమో .....

Tuesday, February 3, 2009

వివాహం-ఓ వేడుక

నేను -లక్ష్మి బ్లాగ్ లో లక్ష్మి గారు రాసిన వివాహం-మారుతున్న చిత్రం టపాలో మారిన వివాహ వ్యవస్థ ,ఫోటో ,వీడియో పెళ్ళిళ్ళు తప్ప ,నిజమైన సాంప్రదాయ బద్ధమైన పెళ్ళిళ్ళు ఈరోజుల్లో కరువై పోయాయని రాశారు .నిజమే చాలామంది పెళ్లి లో జరిగే తంతు ఎందుకో తెలియకుండానే ,మొక్కుబడిగా పెళ్లి కానిచ్చేస్తున్నారు .మరికొంతమంది ఈ పెళ్లి తంతు అంతా ,పాతకాలపు చాదస్తంగా కొట్టి పడేసి రిజిష్టర్ పెళ్ళిళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు .రిజిష్టర్ మారేజేస్ లో అనవసర ఖర్చు తగ్గుతుందని కొందరి వాదన .కాని కొన్ని అనుభూతులు డబ్బుతో కొనలేం .ఇక ఖర్చు విషయానికొస్తే ,అనవసరంగా తాహతుకి మించి చేస్తే కష్టం కాని ఉన్నంతలో సాంప్రదాయ బద్ధమైన వివాహనికే నా ఓటు .అయినా రిజిష్టర్ మారేజ్ చేసుకున్నాక స్నేహితులకు పార్టీలు ,రిసిప్షన్ ల పేరుతో చేసే ఖర్చు మాత్రం తక్కువేమీ కాదుగా !

ఇక్కడ చాలామంది విజ్ఞులున్నారు .వారికి తెలిసే వుంటుంది .అలా తెలియని వారి కోసం పెళ్ళిలోని కొన్ని ముఖ్య ఘట్టాలను నాకు తెలిసినంతలో వివరిస్తాను .ఇది నాకు తెలిసిన పరిధి కాబట్టి తప్పులుంటే , క్షంతవ్యురాలను .

పెళ్ళిలో ముందుగా వరుడి చేత గణపతి పూజ చేయించి గణపతిని oఆహ్వానిస్తారు .కలశ పూజ చేసి లక్ష్మి సమేతుడైన మహా విష్ణువును ఆహ్వానిస్తే ,ఆయన వివాహం అయ్యేవరకు కలశమందు ఉండి వధూవరులనాశీర్వదిస్తాడు .విష్ణువుతో ,గరుడుడూ ,మరియు సప్త ఋషులు ,అష్టదిక్పాలకులు మొదలగు rదేవతలంతా ఆయన వెన్నంటి ఉండి వధూవరులను ఆశీర్వదిస్తారు .

ఇరువైపులా తల్లితండ్రు లుండి పట్టుచీరతో ,పూలజడతో ,బంగారు ఆభరణాలతో ,బాసికంతో (భ్రూమధ్యం పై అందరి దృష్టి పడకుండా నుదుట కట్టేది ) అలంకరించిన వధువును పీటల మీదికి తీసుకొస్తారు .సుముహూర్తం వరకూ వధూవరులిరువురి మధ్యా తెరనుంచుతారు .వధువును లక్ష్మీ iస్వరూపంగానూ ,వరుని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి ,బంగారము వంటి మనసు కలదీ ,బంగారు ఆభరణాలతో అలంకరించ బడినదీ ఐన vఈ కన్యను పంచ భూతముల సాక్షిగా ,బ్రహ్మాదులూ మున్నగు దేవతల సాక్షిగా నీకు దానం చేయుచున్నాను అని వరుని చేతిలో అమ్మాయి చేతినుంచి దోసిలిలో కొబ్బరి బొండాం aఉంచి పాలు పోస్తూ తల్లి తండ్రులు కన్యాదానం చేస్తారు .

వరునిచేత ధర్మ ,అర్ధ ,కామములందు cఈమెను విడిచి జీవనము సాగించనని ,ప్రమాణం చేయిస్తారు .నాతి చరామి అంటూ వరుడు ప్రమాణం స్వీకరిస్తాడు .అలాగే ధర్మ ,అర్ధ ,కామములందు ,సంతానోత్పత్తి ప్రక్రియ లందునూ నిన్ననుసరించి మసలుకుంటానని వదువుచేత ప్రమాణము చేయించి సుముహూర్తములో వధూవరుల iచేత ఒకరి తలపై మరొకరు నూరిన జీలకర్ర ,బెల్లము ముద్దను పెట్టిస్తారు .నూరిన జీలకర్ర ,బెల్లము విడిపోకుండా ఉన్నట్లే ఇరువురూ అన్యోన్యంగా జీవించాలని భావము .తర్వాత తెర తొలగించి ఒకరినొకరు చూసుకుంటారు .

మాంగల్య దేవతను ఆహ్వానించి గౌరీ దేవిని ,మంగళ సూత్రాలను పూజించి ,ముత్తైదువులచె మాంగల్యాన్ని ఆశీర్వదింప చేసి ,వరునిచే మాంగల్య ధారణ చేయిస్తారు . నా జీవన గమనానికి హేతువైన మంగళ సూత్రము నీకు కడుతున్నాను .నూరేళ్ళు మనము కలిసే జీవించేదము గాక !అని కోరుకుంటూ వరుడు సూత్ర ధారణ చేస్తాడు .

తలంబ్రాలు !పెళ్ళిలో వదూవరులకే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే ఘట్టం .కోరిన సంతానము సమృద్ధిగా లభించును గాక అంటూ .వధువు పోస్తే , ఆనందమూ ,కోరికను , సత్యమును కలిసి అనుభవింతుము .సంపదలను,వంశాన్ని వృద్ధి చేసుకోనేదము గాక అంటూ వరుడు పోస్తాడు .ఇరువురూ ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటారు .కలిసిన
బంధానికి గుర్తుగా బ్రహ్మ ముడి వేస్తారు .కొంతమంది ఉంగరాలు తీయిస్తారు . బంగారు ఉంగరమూ,వెండి చుట్టూ వేసి . ..తీయమంటారు .ఇది స్పర్శ తాలూకు సాన్నిహిత్యం వల్ల వధూవరుల మధ్య బిడియాన్ని పోగొట్టి ప్రేమను చిగురింప చేయుట కొరకు ఉద్దేశించబడినది అయివుండొచ్చు .

మట్టెలు తొడిగించి వధువు చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తారు. ఏడడుగులునడిచి స్నీహితురాలివయ్యావ్ ,అట్లే ఎడబాటు లేకుండా పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యాన్ని కలిగిఉందాము అని వరుడు అంటాడు .

ఏడడుగులు..ఒకటి అన్న సమృద్ధి కొరకు ,రెండవది బలము కొరకు ,మూడవది వ్రత ఫలము కొరకు ,నాల్గవది వ్రతాది కారము కొరకు , ఐదవది పశుసమృద్ది కొరకు , ఆరవది వంశాభివృద్ధి కొరకు ,ఏడవది ఋత్విజాదుల నిచ్చుటకు విష్ణువును ప్రార్ధిస్తూ ఏడడుగులు నడుస్తారు.

అరుంధతి నక్షత్ర దర్శనం పెళ్ళి వేడుక పూర్తయ్యాక వధూవరులిరువురి చేత అరుంధతి దర్శనం చేయిస్తారు.అరుంధతిని ఆధారంగా చేసుకొని మిగతా నక్షత్ర గమనం ఉంటుంది.అట్లే నాపతి ఇంటిలో నేను స్థిరముగా ఉండి నీవలెనే కీర్తి పొందునట్లు ఆశీర్వదించమని కోరుకొని నమస్కరిస్తారు . అంతటితో వివాహం లోని ముఖ్య ఘట్టాలు పూర్తయినట్లే .

అసలు పూర్వం వివాహం పదహారు రోజులు దాదాపు ముప్ఫై అంశాలతో కూడుకున్నదై ఉండేదట.తర్వాత ఐదు రోజులు,.....మూడు రోజులు ............ ఇప్పుడు దాన్ని మరీ కుదించి జరుపుతున్నారు. ఇది కూడా కాదనుకుంటే మన ముందు తరాలకు ఎటువంటి అనుభూతిని మిగల్చగలం ?వివాహం ఓ అందమైన వేడుక .ఆ మధురమైన అనుభూతిని సాంప్రదాయాన్ని,పదిలంగా ముందు తరాలకు అందిద్దాం .