Wednesday, November 26, 2008

ఒక చిన్న కోరిక

*రాత్రిపూట రాలే నక్షత్రం కోరుకున్న వరమిస్తుందటగా ?
అది నిజమైతే .............
***ప్రతీ ఉదయం నీ జ్ఞాపకాల సూర్యోదయమే
అరుణుడి కంటే ముందుగా పవనుడు
మోసుకొచ్చిన పున్నాగ పూల పరిమళాలు,
శుభోదయం చెపుతున్నట్లు గుస గుస లాడే
చెట్ల ఆకులూ, పూలూ..............
నీ తలపుల వాకిట్లో కళ్ళాపి చల్లడానికి సిధ్ధంగా
ఆకుల చివరినుండి జారిపడే మంచుబిందువులు
వాటిపై ముగ్గులేసే పారిజాతాలు.....
కాస్త కాస్తగా పైకొస్తున్న సూర్యుని వెచ్చదనం,
ఇవేవీ నిన్ను మరిపించలేకపోయాయి.
మళ్లీ దినచర్య ప్రారంభం
ఎప్పటిలాగే రొటీన్ గా ..........
లైఫ్ ని ఎంత బిజీ చేసుకున్నా,
ఆగని నీ జ్ఞాపకాల పరంపర ......
తిరిగి ప్రతీ సాయంత్రం ,
నీ ఊహల చంద్రోదయంతో
నా మానస సరోవరంలో విరిసే
నీ తలపుల కలువలు.....
చూస్తుండగానే చిక్కబడుతోన్న చీకటి,
శుభరాత్రంటున్న చిరుగాలుల సవ్వడి ........
నేను మాత్రం రాత్రంతా రెప్పవాల్చక
ఆకాశం నుండి జారిపడే నక్షత్రం కోసం
ఎదురు చూస్తూండగానే మరో ఉదయం ఎదురైంది.
కాని
నేల రాలే చుక్కని నేను కోరేది మాత్రం
నీ స్నేహమే సుమా!

2 comments: