Wednesday, May 27, 2015

వీడుకోలు....


సెలవా మరి అంటున్న నీ కళ్ళనుండి 
నా కళ్ళను విడదీయటానికి 
వెళ్ళనా మరి అంటున్న నీచేతి స్పర్శనుండి 
నాచేతిని విడిపించడానికి 
నా మనసు పడిన మూగవేదన
నీవు తెలుసుకోక నేను తెలుపలేక 
వీడ్కోలు చెప్పటానికి మొరాయిస్తున్న 
నా మనసును సముదాయించలేక 
ఆ క్షణమే మరణించాను.

Sunday, May 17, 2015

శూన్యం!


కరిగి పోయిన కలేమో మన
పరిచయం అనుకుందామంటే ... 
నీ జ్ఞాపకాల ఊటను కన్నుల్లో 
నింపుతున్న గతం నన్ను 
నీడలా వెంటాడుతోంది....  
కట్టెను వదిలి ప్రాణం పయనమై పోతుంటే 
కళ్ళప్పగించి చూస్తూండి పోయిన క్షణం!
బాధ్యతల ఉక్కు సంకెళ్ళ మధ్య 
బందీనై నిలుచుండి పోయాను
నేస్తం! 
ఇన్నేళ్ళ మన సావాసంలో 
ఎన్నో విలువైన కానుకలిచ్చావు 
అవన్నీ నాతోనే వున్నాయి 
నువ్వు మాత్రం నన్ను విడిచి 
దూరపుకొండల వైపు సాగిపోయావు 
నువ్విచ్చిన చివరి కానుకేమో ఈ శూన్యం! 
బహుశా అదే తోడుగా వుంటుంది 
నా ఈ ఏకాంత వాసంలో.... 

Sunday, May 10, 2015

Tears are the words the heart can't say.


పెద్ద పెద్ద కళ్ళనిచ్చిన దేవుడు
ఛత్రాలవంటి రెప్పలనిచ్చివుంటే
రెప్పల మాటున స్వప్నం
కరిగి జారుతున్న వేళ
కంటిచివరి నీటి చుక్కని
రెప్పవాల్చి దాచుకునేదాన్ని
ముఖం దాచుకొనేందుకు
నీ గుండె వెదుక్కొనే
అవసరం ఉండేదికాదు!