Thursday, December 11, 2008

చిట్టి తల్లీ !నీకు రక్షణ ఎక్కడ ?

ప్రేమోన్మాదం మరోసారి బుసలు కొట్టింది .మరో మానవ మృగం ఇద్దరు చిట్టి తల్లుల జీవితాల్లో చీకటి నింపింది .ఒక పక్క ఒప్పుకుంటే ,ప్రేమ పేరుతో వంచన .మరో పక్క ఒప్పుకోకుంటే ,ఉన్మాదుల దాడులు .ఇంతేనా ఆడ పిల్లల జీవితాలు ?
కిట్స్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులపై యాసిడ్ దాడి సభ్య సమాజంలో మానవ మృగాల సంచారానికి నిదర్శనం.
చిట్టి తల్లీ !నీకు రక్షణ ఎక్కడ ?
కడుపున పడ్డ నాటి నుండీ ఏ క్షణం నీ ఉపిరి తీసేస్తారో ని అనుక్షణం నిన్ను పక్షిలా రెక్కల చాటున దాచుకొని ,అల్లారు ముద్దుగా పెంచుకొని ,మహా లక్ష్మి లాంటి నిన్ను చదువుల సరస్వతిగా చూసుకొని మురిసి పోవాలని ,నా చెంగు చాటు
నుండి కళాశాలకు పంపిస్తే .....చిట్టి తల్లీ నీకు రక్షణ ఎక్కడ ? ప్రతిరోజూ నువ్వు తిరిగి ఇంటికి వచ్చేవరకు భయం ......
ఎప్పుడు ,ఎక్కడ ,ఎవరు ఏ ఘాతుకానికి ఒడికడ తారోన్న ఆందోళనే ........
శ్రీ లక్ష్మి ,ప్రత్యూష ,ఆయేషా ..........ఎవరైనా .....ఆరేళ్ల పాప నుంచి ,అరవై ఏళ్ల అవ్వ వరకు ....అత్యాచారాలు ,హత్యలూ ...ఇవన్ని చూస్తుంటే మనం ఆటవిక వ్యవస్థ లోనే వున్నామని పిస్తుంది .పెరిగిన నాగరికత మనకేం ఒరగ బెట్టిందోగాని
మరిన్ని మానవ మృగాలను తయారు చేస్తోంది ,మారణ హోమాలు సృష్టిస్తోంది .
దురదృష్టవశాత్తు ఇటువంటి నేరాలకు శిక్షలు కటినంగా లేకపోవడం వల్ల ఈ దారుణాలు రిపీట్ అవుతున్నాయి .ఇవి
ఇలాగే కొనసాగితే ఆడ పిల్లను కనటానికే భయపడే పరిస్థితులొస్తాయి .వర కట్నం మాట అటుంచి అసలు రక్షణే భారంగా మారుతోంది .
ఇటువంటి మానవ మృగాలను శిక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకు రావాలి .శిక్షలు కటినంగా అమలు చేయాలి .అది
మరొకరు ఇటువంటి దాడులు చేయాలంటే భయపడేలా వుండాలి .కనీసం అప్పుడైనా ఇటువంటి దాడుల్ని కొంతవరకైనా
నిరోధించిన వారవుతారు .ప్రభుత్వం వెంటనే స్పందించాలి .

10 comments:

  1. ఇటువంటి విషయాలలో ప్రభుత్వం ఏం చేయగలదు. తీరిగ్గా చింతించి, అరెస్ట్ చేసి, జైళ్లో పెట్టి మేపుతుంది. సినిమాలలో చూపించినట్టు ఓ రాఖీ, భారతీయుడు కావాలి. ఇలాంటి వాళ్లను మనమే పట్టుకుని అదే యాసిడ్ , కిరోసిన్ పోసి అందరిముందు తగలెట్టాలి. మిగతావారికి భయముంటుంది. లేకుంటే నోట్ల కట్టలతో ఏదైనా సంభవమే. న్యాయం మాత్రం దొరకదు..

    ReplyDelete
  2. అందరిముందు జరిగిన సంఘటనలకి , నిందుతుడు దొరికిన వారం రొజులలొ శిక్ష పడేలా మన చట్టాలు మారాలి.

    ReplyDelete
  3. స్పందనే కరువైన క్షణాన, మీ ఆవేదన ఓ చక్కన్ని ఓదార్పు.

    ReplyDelete
  4. పరిమళం గారు ఇప్పుడే చదివా ఆ వార్త.. భయమేస్తుందండి.. ఇంత అమానుషమా ..అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? పెంచిన పెంపకం లోనా?లేక అర్దంపర్దం లెకుండా యువతను రెచ్హగొడుతున్న సినిమాలా?..లేక అడ్డమైన సైట్లను చూస్తూ అదేలొకంగా గడుపుతున్న ఈ యువతరానిదా?

    ReplyDelete
  5. రుగ్మతల్ని పెంచిపోషించి, ఇప్పుడు ప్రభుత్వాలు స్పందించాలంటే ఎలా!Law and order వరకూ ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యగలదుగానీ సామాజిక రుగ్మతల్ని రూపుమాపడం ప్రభుత్వాల తరమా?

    ఇది అందరి బాధ్యత. వ్యక్తులుగా,కుటుంబాలుగా,పౌరులుగా కనీసం మనుషులుగా ఈ బాధ్యత మనందరిదీ. Let's do our bit.STOP EVE TEASING/HARASSMENT,DOMESTIC VIOLENCE,HONOUR CRIMES,LOVE CRIMES and DOWRY DEATHS.

    ReplyDelete
  6. *జ్యోతి గారు ,రమణ గారు ,శృతి గారు ,మహేష్ గారూ !మీ స్పందనకు ధన్యవాదములు .
    మొదట అటువంటి మానవ మృగాలను శిక్షించాల్సింది కన్న తల్లి తండ్రులు .కొడుకు మృగంలా మారి ఒక అమ్మాయిని దారుణంగా హింసించినప్పుడు చెప్పుతో కొట్టి ,చట్టానికి అప్పగించి కుటుంబం నుంచి ఎటువంటి సహకారం ఇవ్వకుండా
    వుండాలి .దాడి చేసి పారిపోతే ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకూడదు .బంధువులు ,స్నేహితులు వెలి వెయ్యాలి .వీళ్ళ తరుపున
    ఏ లాయరు వాదించకూడదు . ఒళ్ళంతా కాలిన గాయాలతో బాధ పడుతున్న ఆ పిచ్చి తల్లికి ,కన్నీరుమున్నీరవుతున్న
    తల్లి తండ్రులకు సమాధానం చెప్పేదెవరు ?ప్రభుత్వమా ,నేతలా ,పోలీసులా ,లేక మన వ్యవస్థా ?స్వప్నిక టీవీ లో కాలిన గాయాలతో బాధ పడుతూ జరిగిన విషయం వివరిస్తుంటే ,గుండె తరుక్కు పోతోంది .గాంధీ గారు కలలు కన్న రామ రాజ్యం రాకపోయినా ఫర్వాలేదు .ఆడపిల్ల అర్ధ రాత్రి కాదు ,పట్టపగలు ,తల్లి తండ్రుల నీడలో సేఫ్ గా బ్రతకగలిగితే చాలనిపిస్తుంది .
    ,

    ReplyDelete
  7. ఏంటో.. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న కొద్దీ.. సమాజం లో అలాంటి శాడిస్టులు పుట్టుకురాకుండా మంచి మార్పు రావాల్సింది పోయి అవి ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘోరమైన తప్పులు చేసిన దుర్మార్గులకి వెంటనే ఏ ఉరి శిక్షో వేయకుండా.. నెలలు, సంవత్సరాలు సాగతీసి.. చివరికి పెద్ద శిక్షలు వేయకుండానే ముగిస్తున్నారు. అందుకే చేసేవాళ్ళకి కూడా ఇంత ధైర్యం వస్తుంది. తరవాత పరిణామాలేంటి అన్న భయం కూడా ఉండట్లేదు.
    పరిమళం గారన్నట్లు వాడికి సంబంధించిన వాళ్లందరూ వాడిని వెలివెయ్యాలి. అసలు జనాల్లో ఒక అయిదు నిమిషాలు నిలబెడితే చాలు. ప్రభుత్వం అవసరం లేకుండా జనాలే శిక్ష వేస్తారు.
    వాడి సంగతి ఎలా ఉన్నా.. ఇరయ్యేళ్ళు బుద్దిగా పెరిగి, చక్కగా చదువుకుంటున్న ఆ అమ్మాయిల జీవితాలు సర్వ నాశనం అయిపోయాయే.. అది తలుచుకుంటేనే హృదయం ద్రవిస్తుంది. ఇలాంటి మానవ మృగాలని ఏమి చేసినా పాపం లేదు.

    ReplyDelete
  8. నీతిని బోధించే సంస్కృత శ్లోకాలూ, శతకాలూ, చిన్ననాటి నుండీ పిల్లలకు బోధించే పాఠ్య ప్రణాళికలు పూర్వకాలంలో వుండేవి. నేనూ వాటిని చాలా కాలం క్రితం పాఠ్య భాగాలలో వుండబట్టి బోధించే వాడిని. ఆ నేనే తరువాతకాలంలో అలాంటి పాఠాలు ప్రణాళికలో మృగ్యమవడం వలన సందర్భోచితంగా కల్పించుకొని బోధించడమే తప్ప పాఠాలుగా చెప్పే అవకాశం లేకపోయాను.
    చిన్ననాటి నుండీ ఇంగ్లీషు మీడియం చదువులొచ్చి, మన సంస్కారాన్ని మట్టుబెట్టడం వల్ల దాని ఫలితంగా ఈ నాడిటువంటి దౌష్ట్యాలు చోటు చేసుకొంటున్నాయి.

    ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంస్కారాన్నదించే చక్కని నీతి పాఠాలు ప్రణాళికా బద్ధం చేయకపోతే రాబోయే తరాలలోనూ యిదే దుస్థితి దాపురిస్తుంది. అందరం ఏకకంఠంతో మన బ్లాగుల ద్వారా మన అభిప్రాయాన్ని తెలిపి, ప్రభుత్వానికి విన్నవించేప్రయత్నమా కాదు కాదు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దామా?
    జైహింద్.

    ReplyDelete
  9. రుగ్మతల్ని పెంచిపోషించి, ఇప్పుడు ప్రభుత్వాలు స్పందించాలంటే ఎలా.ఎవరు పెంచి పోషిస్తున్నది సమాజంలో నేరాలు జరుగుతున్నప్పుడు స్పందించి నేరానికి తగిన శిక్ష ఎవరు వేయాలి ప్రజలు వేయాలా, ప్రభుత్వంలో ముఖ్యభాగమైన పోలీ్సులు వేయాలా. ప్రజలు చేస్తే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు పోలీసులకు పిర్యాదు చేయండి అంటారు.మేము పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులంటున్నారు.పిర్యాదు చేయాలన్నా పోలీసుల చేతులు తడిపాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఒకవేళ తడిపి పిర్యాదు చేసినా అవతల నిందితులు ఎక్కువ భాగం రాజకీయనాయకుల మనుష్యులే ఉంటున్నారు. తర్వాత జరుగుతున్న తతంగమేంటో జగమెరిగిన సత్యం.ఇటు బాధింపబడి, అటు న్యాయం జరుగక ప్రజలు రెంటికీ చెడ్డ రేవడవుతున్నారు.నేరాలకు తగిన శిక్షలు వేయడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలి.ప్రస్తుతం అది కొరవడింది.నేరగాల్లదే రాజ్యమవుతోంది, వారిమాటే చెల్లుతోంది.

    ReplyDelete
  10. @చిలమకూరు విజయమోహన్: మొదటిలైనుతరువాత రెండోలైను మిగతా పేరా కూడా ఉంది చూడండి

    "Law and order వరకూ ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యగలదుగానీ సామాజిక రుగ్మతల్ని రూపుమాపడం ప్రభుత్వాల తరమా?

    ఇది అందరి బాధ్యత. వ్యక్తులుగా,కుటుంబాలుగా,పౌరులుగా కనీసం మనుషులుగా ఈ బాధ్యత మనందరిదీ. Let's do our bit.STOP EVE TEASING/HARASSMENT,DOMESTIC VIOLENCE,HONOUR CRIMES,LOVE CRIMES and DOWRY DEATHS."

    ReplyDelete