Sunday, November 30, 2008

అశ్రు నివాళి

తీవ్రవాద దాడుల్లో వీర మరణ మొందిన అమర జవానులకు,అమాయక ప్రజలకూ అశ్రు నివాళి .
ఇటువంటి సమయంలో తిలక్ గారి" ఆర్తగీతం " గుర్తు చేసుకోకుండా వుండలేక పోతున్నా .ఐతే అక్కడక్కడా కొంత భాగాన్ని ఎడిట్ చేసినందుకు క్షమించాలి .

నా దేశాన్ని గూర్చి పాడలేను ,నీ ఆదేశాన్ని మన్నించలేను .
ఈ విపంచికకు శృతి కలపలేను ,
ఈ రోజు నాకు విషాద స్మృతి ,విధి తమస్సులు మూసిన దివారుంధతి
నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి .
గత చార్రిత్రక యశః కలాపమ్ము వివరింపకు,
బహుళ వీరానేక గాధాసహస్రమ్ము వినిపిమ్పకు
ఇంక నన్ను విసిగింపకు .

నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను ,
సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును ,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను .

ఈ రోజు నేను చూసిందేమి ?
విధి ఇన్ని కత్తులను దూసినదేమి?
జాగృతి హేతి వాదరల రుధిరమేమి ?

ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి ?ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి ?
ఏ బుద్ధదేవుడి జన్మ భూమికి గర్వ స్మృతి ?

ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనింపగలదు ?
ఏ రాజకీయ వేత్త గుండెలను స్పృశించ గలదు ?
ఏ భోగవంతుని విచలింప చేయగలదు ?
ఏ భగవంతునికి నివేదించుకోగలదు .......?

నన్ను నిర్భందించకు నేస్తం
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవునిగా శిరసెత్తుకు తిరగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను .

Wednesday, November 26, 2008

స్నేహం

*తెలుగురత్నగారు స్నేహం గురించి అభిప్రాయం రాయమంటే
నాకు తోచింది రాశా .మరి మీరూ నాతో ఏకీభవిస్తారా ?


*** శూన్య జీవన గమనంలో చైతన్య దీప్తి స్నేహం
జనన మరణాతీతమైన నిరంతర
అమృత ధార స్నేహం
ఈ నవ నాగరికతా గ్రీష్మంలో
శరత్ చంద్రిక స్నేహం

అలవి కాని ఆనందాన్నిచ్చినా
అంతులేని విషాదాన్నిచ్చినా
అనంతమైన ఐశ్వర్యాన్నిచ్చినా
ఆకలి తీరని పేదరికమిచ్చినా
వినమ్రుడనై స్వీకరిస్తాను
కాని ప్రభూ !
సంతోషాన్ని పెంచుకోవటానికి
బాధను పంచుకోవటానికి
ఒక్క మిత్రుడ్నివ్వు చాలు
శూన్య జీవన గమనంలో కూడా
అలుపెరుగక పయనిస్తా ........

ఒక చిన్న కోరిక

*రాత్రిపూట రాలే నక్షత్రం కోరుకున్న వరమిస్తుందటగా ?
అది నిజమైతే .............
***ప్రతీ ఉదయం నీ జ్ఞాపకాల సూర్యోదయమే
అరుణుడి కంటే ముందుగా పవనుడు
మోసుకొచ్చిన పున్నాగ పూల పరిమళాలు,
శుభోదయం చెపుతున్నట్లు గుస గుస లాడే
చెట్ల ఆకులూ, పూలూ..............
నీ తలపుల వాకిట్లో కళ్ళాపి చల్లడానికి సిధ్ధంగా
ఆకుల చివరినుండి జారిపడే మంచుబిందువులు
వాటిపై ముగ్గులేసే పారిజాతాలు.....
కాస్త కాస్తగా పైకొస్తున్న సూర్యుని వెచ్చదనం,
ఇవేవీ నిన్ను మరిపించలేకపోయాయి.
మళ్లీ దినచర్య ప్రారంభం
ఎప్పటిలాగే రొటీన్ గా ..........
లైఫ్ ని ఎంత బిజీ చేసుకున్నా,
ఆగని నీ జ్ఞాపకాల పరంపర ......
తిరిగి ప్రతీ సాయంత్రం ,
నీ ఊహల చంద్రోదయంతో
నా మానస సరోవరంలో విరిసే
నీ తలపుల కలువలు.....
చూస్తుండగానే చిక్కబడుతోన్న చీకటి,
శుభరాత్రంటున్న చిరుగాలుల సవ్వడి ........
నేను మాత్రం రాత్రంతా రెప్పవాల్చక
ఆకాశం నుండి జారిపడే నక్షత్రం కోసం
ఎదురు చూస్తూండగానే మరో ఉదయం ఎదురైంది.
కాని
నేల రాలే చుక్కని నేను కోరేది మాత్రం
నీ స్నేహమే సుమా!

Monday, November 24, 2008

అంతర్మధనం

దైవ కార్య నిమిత్తం మూడు రోజులు అమ్మ వాళ్ల వూరు వెళ్ళా .మనసు నిండా మోసుకొచ్చిన ఆధ్యాత్మిక పరిమళం అంతలోనే ఆవిరైపోతుందనుకోలేదు .మూడు రోజుల తర్వాత వచ్చానేమో ,వచ్చిన దగ్గర్నుంచి నా దృష్టి కంప్యూటర్ పైనే .
త్వర త్వరగా పనులు ముగించుకొని కంప్యూటర్ ముందు కూర్చున్నా .మూడు రోజులకే మిస్ ఐన ఫీలింగ్ .కొద్ది రోజుల్లోనే డ్రగ్ ఎడిక్ట్ లాగా ,బ్లాగ్ ఎడిక్ట్ ఇపోయానేంటా అని నవ్వుకొంటూ బ్లాగ్ ఓపెన్ చేశా .కొత్త టపాల కోసం నా కళ్లు ఆత్రంగా
వెదికాయ్.అంతే.....నిశ్చేష్టురాలినైపోయా .అటువంటి జుగుప్సా కరమైన పదాలతో ఎవరైనా టపా రాయగలరని ,నేనుహించలేదు .నాకసలే కొత్త ....ఏదో మీ అందరి ప్రోత్సాహం వల్ల ధైర్యం చేసి ఏదో మీ మధ్య కొచ్చాను .అంతే కాని .....
నిజానికి కాస్త కష్టానికే ,అది నాకైనా ,ఎదుటి వారికైనా .....వూరికే తడిసిపోయే కళ్ళూ ...కరిగిపోయే గుండే....నా బలహీనత .కాని ,ఆ అజ్ఞాత వ్యక్తి , భాష ,వ్యంగ్యత చూశాక ,ఇంకా ముందు ముందు ఇటువంటి పరిస్థితి మళ్లీ ఎదురౌతుందేమోన్న భయం .కాని తర్వాత క్షమాపణ అడుగతూ వచ్చిన టపా ముందు వ్యక్తి నుండే అంటే నమ్మశక్యంగా లేదు .అంత భాషా బేధముంది మరి .హాయిగా జీవితం సాగిపోతూ వుంటే ,ఏమిటి ఇలా పరిచయమే లేని వ్యక్తుల నుండి వచ్చే అసభ్య కరమైన కామెంట్స్ కి బాధపడుతూ ఈ బ్లాగు కొనసాగించాలా ?అని ....రోజంతా మధనపడి చివరికి కొద్దిపరిచయమే ఐనానన్ను ప్రోత్సహించిన సంస్కార వంతులైన మీతో నా బాధను పంచుకోవాలనిపించింది .పోనీ ఆపేద్దామా అంటే వూరికే బంధాలను అల్లుకోవడమేగా మానవ నైజం . మీ సాహితీ వనంలోకి కొత్త చిగురులా ఆహ్వానించారు నన్ను ........మన పరిచయాన్ని చిరు కాలంలోనే ముగించేయాలా .......లేక చెడును వదిలి ,మీ మంచితనపు ప్రపంచంలో చిరకాలం కొనసాగాలా అని .......నా అంతర్మధనం ........???

గాయం

నిదురించే నా హృదయాన్ని
మేల్కొలిపి ,ఆశలు రేపి
గతించిన జ్ఞాపకాల్ని
మరల గుర్తుచేసి
చేరువైన వసంతాన్ని
తిరిగి నువ్వే తీసుకెళ్ళి
నా ఎదలో చేసిన గాయం
ఎలా మాన్పుకోను నేస్తం ?

Tuesday, November 18, 2008

మనలో మన మాట సారీ !మనసులోని మాట

నా ఫ్రెండ్ అడిగాడు .....ఎప్పుడూ కవితలేనా ?అని ......మరేం రాయాలని ఆలోచించాను ఒక రోజంతా ......ఐనా ఏం రాయాలో తెలీలేదు .నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది ,అది నా ఇల్లే ...ఏం రాద్దామన్నాసంకోచమే .వాడంటాడు .....నా బాల్యం,నేను తిన్న బాసుంది ,నాకు నచ్చిన సినిమా ఏదైనా రాయొచ్చని .కాని ,కధలు ,కవితలు ,కొటేషన్స్ , పుస్తకాలు ,వంటలు ,సినిమాలూ......ఒకటేవిటి?రాముడి దగ్గర్నుండి ,రాజకీయాల వరకు ,కావేవి బ్లాగుకనర్హం అంటూ అన్నీ అందరూ రాసేస్తుంటే ..నేనేం రాసినా హనుమంతుడి ముందు కుప్పిగంతులా ఉంటుందే మోనన్న భయంతో .....
బిక్కమొహంతో ........ఓ ....బ్లాగిస్ట్..

ఐనా ధైర్యం చేసి నాకు నచ్చిన ఓ కవితను మీ ముందుంచుతున్నా.
తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి నుండి
నా భారత ధాత్రి
మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల
మోహన వస్త్రం దాలిచి
మౌళి మీద హిమ సుందర కిరీటం ధరించిన
రాజ్ఞి నా భరత ధాత్రి అనుకోవడం ఒక నిజం !
అదొక సుఖం .
మూడు సముద్రాలు మూసిన కోసిన తీరంతో
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
ముల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం ! అదో దుఖం .
ఇదీ నిజం అదీ నిజం
రెండింటికీ ఋజువులు సమం
శ్రీ రాముడి శ్రీ కృష్ణుడి జన్మ భూమి మరి
కంసునికి , దశకంఠునికీ కాదా ?

Sunday, November 16, 2008

ప్రియమైన శత్రువు

కన్ను తెరిస్తే జననం
కన్ను మూస్తే మరణం
రెప్పపాటే ఈ జీవితం
ఈ మధ్యనున్న కొద్ది కాలంలో
మన ఇద్దరి మధ్యా
అవసరమా ఈ యుద్ధం ?
అసలెన్నాళ్ళని ఈ మౌనం ?
ఏ అస్త్రంతో చేదించాలీ నిశ్శబ్దం ?
చిరునవ్వులు చిందించా?
మరుమల్లెలు సంధించా ?
నా ప్రియమైన శత్రువ్వి నువ్వైతే
ఓటమెరుగని సిపాయిని నేను ....

Saturday, November 15, 2008

నీ స్నేహం

సూర్యుడు ఉదయిస్తున్నాడు ,అస్తమిస్తున్నాడు
తిరిగి రేపు ఉదయిస్తాడు
పున్నమి వెన్నెలా ,అమావాస్య చీకటి
ప్రతినెలా వస్తూనే ఉన్నాయ్
తొలకరి జల్లూ,పచ్చని పైరూ
ప్రతి ఏటా పలకరిస్తూనే వున్నాయ్
గ్రీష్మం ,శిశిరం ,
వర్షం ,హేమంతం
శరదృతువులు ,నా జీవితంలో
మళ్లీ మళ్లీ వస్తున్నాయ్
కాని నేస్తం .......
నీ స్నేహం మాత్రం ,
తిరిగి రాని వసంతం ......

Friday, November 14, 2008

నిరీక్షణ

నిద్రలేని రాత్రిని కరిగిస్తూ సూర్యుడొస్తున్నాడు
నీవు రాకుండానే పొద్దంతా గడిచిపోతోంది
గంటలు యుగాలై కాలం కదలనంటోంది
ఎదురు చూపులతోనే మరోరోజు, ఇంకోరోజు....
ఎప్పుడో హఠాత్తుగా నువ్వొస్తావ్.... వెళ్లిపోతావ్.....
నువ్వున్న ఆ కొద్ది నిముషాల్లోనే
నా చూపు నీ రూపును దొంగిలించి
నా హృదయంలో పదిలంగా దాచేస్తుంది
మళ్లీ నువ్వు తిరిగి వచ్చేవరకూ
అదేగా మరి నాకు ఊపిరి పోస్తోంది !

Thursday, November 13, 2008

శిల

నిన్నెలా సంభోదించను?
నా ఆరోప్రాణమా అందామంటే
నా పంచ ప్రాణాలూ నువ్వైపోయావు
నీలాకాశామా అందామంటే
ఎప్పటికీ అందవేమోననే భయం
మధుర స్వప్నమా అందామంటే
కళ్లు తెరిస్తే కరిగి పోతావేమో
నా ఆశా దీపమా అందామంటే
నాకు చీకటి మిగిల్చి వెళ్లిపోయావ్
మరి నువ్వెవరు ?
చిరు గాలివా ? చందమామవా ?
సెలఏరువా ? హరివిల్లువా ?
కాదు ....ఇవేవీ కాదు .....
నువ్వొక శిలవి ......
వరమివ్వని వట్టి శిలవి
కాని .......
నేను శిల్పిని
నా అక్షరాలే వులిగా ,నిన్ను
శిల్పంగా మలుచుకుంటా ,
వరమిచ్చే వేలుపుగా కొలుచుకుంటా....

Wednesday, November 12, 2008

నీ జ్ఞాపకాలు

నిన్ను మరచిపోవడమంటే
నానుంచి నేను విడిపోవడమే
నా హృదయం లో నీ జ్ఞాపకాలు
సముద్రంలోని కెరటాలు
ఎంతగా తీరం వైపు తోసేసినా
తిరిగి నాలోనే కలుస్తాయి
నా మదిలోని ఆశలూ
సముద్రంలోని అలలూ ఒక్కటే
అవి ఎగసి ఎగసి నిన్నందుకోవటానికి
ప్రయత్నిస్తూనే వుంటాయి
కాని నేస్తం ....నాకు తెలుసు
నువ్వు అందని ఆకాశానివని
అయినా ....
ఆగిపోని ,అలసిపోని ,
అలను నేను .

Tuesday, November 11, 2008

కరిగిన కల

నిదురించే తోటలోకి
కోయిలవై వచ్చావు
నీ తీయని పాటతో
ఎదను మేల్కొలిపావు
రాదనుకున్న వసంతాన్ని
తిరిగి తీసుకొచ్చావు
మోడువారిన మనసులో
ఆశలు చిగురించే వేళ
కన్నుల్లో నీరు నింపి
కలవై కరగి పోయావు

Monday, November 10, 2008

నేస్తం

అనుకో లేదు నేనెప్పుడూ
రెండు చందమామల్ని
ఒకేసారి చూస్తానని,
కానీ చూశాను
ఒకటి ఆకాశంలో ఐతే
మరొకటి నా ఎదురుగా
వింతేవిటంటే,
ఆ చంద్రునిలోని మచ్చ
నీలో నాకెన్నడూ కనపడదేం?
ప్రియ నేస్తం!
నిన్ను చూసి గర్వపడనా?
ఆ జాబిల్లిని చూసి జాలిపడనా?

నువ్వెవరు?

పగలంతా వెలుగౌతావ్
రేయంతా వెన్నెలౌతావ్
మెలకువలో శ్వాసవౌతావ్
నిద్దురలో కలవౌతావ్
నీ చూపుల గాలానికి
చిర్నవ్వుల ఎరవేసి
నా మనసును దోచేశావ్!

Sunday, November 9, 2008

నీ మౌనం

నువ్వు వదిలిన ఊపిరి
ఈగాలిలో కలిసి ఆక్సిజన్ గా మారి
నాకు ప్రాణం పోస్తోంది, కాని.....
నీ మౌనం మాత్రం
మనసు పొరల్లో గాయంగా మారి
గుండెను కోస్తోంది, కాని.....
నా గాయాన్ని మాన్పడానికి
నువ్వు డాక్టర్ వి కాదే
ఐతే,
మందు మాత్రం ఖచ్చితంగా
నీ చిరునవ్వే...............