Sunday, September 13, 2009

ద్వితీయ విఘ్నం !


అవి నేను తొమ్మిదో తరగతి పరీక్షలు రాసేసి బలాదూర్ గా ( అప్పట్లో ముందస్తు కోచింగ్ లూ అవీ లేవులెండి ) తిరుగుతున్న రోజులు ....ఇక సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా పిడుగులాంటి వార్త ! మరో మూడు నెలల్లో నాన్నగారికి ట్రాన్స్ఫర్ ! అప్పటికీ ఊహ తెలిసినప్పట్నుంచీ దాదాపు అదే ఊర్లో ఉంటున్నాం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే నాస్నేహితుల్ని , ముఖ్యంగా ...లలిత , పరిమళ , కిషోర్ , చిన్ని లను విడిచి వెళ్ళాలంటే ...అమ్మో ....అనిపించింది . కానీ ముందే చెప్పుకున్నాం కదా విధి బలీయమైందని !దానికి జాలీ దయా ఉండవు అనుకున్నట్టే మమ్మల్ని విడదీసింది .

ఐతే ఈ ట్రాన్స్ఫర్ వల్ల మధ్యలో నాకు టెన్త్ క్లాస్ మధ్యలో జాయినింగ్ కుదరదని ....మా పిన్నిగారింటి దగ్గర ఉండి టెన్త్ చదివేలా ఏర్పాటు జరిగిపోయింది . పిన్ని అమ్మ తర్వాత అమ్మే నాకు ! నాన్నగారికంటే చిన్నాన్నగారికి మరీ గారం నేనంటే !వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నా అక్కడ చదవటానికి !

ఓ శుభ ముహూర్తంలో ( కేలండర్ చూసి ) పిన్నిగారింటి వెనుకే ఉన్న హైస్కూల్ లో చేర్చారు . ఆరోజు శనివారం !మొదటి రోజు స్కూల్ ! బిక్కుబిక్కు మంటూ వెళ్లాను. పెద్దగా క్లాస్ లు ఏమీ జరగలేదు పరిచయాలూ ....కబుర్లూ తప్ప !ఆరోజు స్కూల్ లాస్ట్ పిరీడ్ లో హెడ్ మాస్టర్ పిలుస్తున్నారంటూ ప్యూన్ కబురు మోసుకొచ్చాడు . ఉదయం జాయిన్ ఐనప్పుడు చూశాను నిలువెత్తు మనిషి ...నల్లటి ఛాయా ...ఎర్రటి కళ్ళూ ...భయం గొలిపేలా ఉన్నాయన రోజుకొక సారి లెక్కల క్లాస్ కి వస్తారంటేనే భయపడిపోయాను ( నాకసలే లెక్కల్రావ్ మరి ) ఇక ప్రత్యేకంగా కబురుపెట్టారంటే ....దడ దడ లాడే గుండెతో ..ఆయన రూంలో అడుగుపెట్టా ....భయపడుతూనే తలెత్తి సర్ !పిలిచారట ....ఆయన విశాలంగా నవ్వుతూ (నాకు బాగా గుర్తు ఆ నవ్వు ఆయనకస్సలు సూటవలేదు ) నువ్వు ఈరోజే చేరావుకదా ...రేపు ఆదివారం ద్వితీయ విఘ్నం అవుతుంది .అలా కాకుండా ప్యూన్ కి తాళా లిచ్చి పంపిస్తా ...రేపొచ్చి క్లాస్ లో కాస్సేపు కూర్చొని వెళ్ళు అని చెప్పారు . సరేనని ...ఇంటికెళ్ళాక పిన్నికి చెప్పా ద్వితీయవిఘ్నం గురించి వివరంగా నాకు చెప్పి ఆయనంత శ్రద్ధ తీసుకున్నందుకు మురిసిపోతూ నన్ను మర్నాడు స్కూల్ కి పంపించింది .

సరే వెళ్లి ప్యూన్ గారి దయవలన ఖాళీ క్లాస్ రూం లో బిక్కుబిక్కు మంటూ కాస్సేపు కూర్చుని ద్వితీయ విఘ్నం బారినుండి తప్పించుకున్నా అని ఆనందపడుతూ ఇంటికొచ్చేశా ! ఏడెనిమిది నెలల తర్వాత గానీ తెలీలేదు ...క్లాస్ కెళ్ళి ఊరికే కూర్చుంటే కాదనీ ...నా చదువుకు విఘ్నం తప్పలేదనీ ......ఆ తర్వాత ద్వితీయ విఘ్నం ఎంత పవర్ ఫుల్లో అర్ధమైంది .అప్పటినుంచీ నాకు ఆ సెంటిమెంట్ స్థిరపడి పోయింది .

Wednesday, September 9, 2009

స్వయంకృతాపరాధం !


నా పెళ్లి ఫిక్స్ అయి రెండో రోజే నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది . ఐతే ఈ విషయాలేవీ స్కూల్ లో చెప్పటానికి చాలా బిడియంగా అనిపించి ...నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా ఏమీ చెప్పకుండా మామూలుగా స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉన్నాను రెండు నెలల్లో ముహూర్తం ఉంది . పెళ్లి అయ్యేటప్పటికి ఒక నెలా , నెలన్నర రోజుల్లో ఫైనల్ పరీక్షలుంటాయి .సిక్ లీవ్ పెట్టేసి సరాసరి ఎగ్జాం సెంటర్కి వెళ్లి పరీక్షలు రాసేద్దాం ...ఆ తర్వాత ఇంటర్ అంటే పెద్దైపోయినట్టేగా ....పెళ్లైనట్టు తెలిసినా ఫర్వాలేదు అనుకున్నా !అన్నీ మనమనుకున్నట్టు జరిగితే ఇక విధాతకు ఆయన రాసిన రాతకు అర్ధమేముందీ ?

అలా ఒక వారం బాగానే గడిచిపోయింది . ఆరోజు శుక్రవారం ! చివరి పిరీడ్ గేమ్స్ ...మాస్కూల్ లో పెద్ద గ్రౌండ్ ఉండేది. అబ్బాయిలంతా ఒకపక్క ...అమ్మాయిలంతా ఒకపక్క వాలీబాల్ ఆడుతున్నాం ! ఒక్కరే కోచ్ అటు బాయ్స్ కి మాకూ మధ్య తిరుగుతూ ....ఆడిస్తున్నారు . మా గ్రౌండ్ ని ఆనుకొని లెక్చరెర్స్ కోలనీ ఉండేది అదీ మా గ్రౌండ్ ని ఆనుకొని బాబూరావుగారని మాకు తెలిసిన వారుండేవారు . మేమంతా ఆడుతూ ఉండగా డాబాపైనుండి చూసిన ఆంటీ గబగబా దిగి మా గ్రౌండ్ లోకి వచ్చేసి ....ఏంటి బుజ్జమ్మా...నీకు పెళ్లి కుదిరిందంటగా ..మమ్మల్ని పిలవకుండానే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావా ?మాకు తెలీదనుకున్నావా ?అబ్బాయిది ఫలానా ఊరట కదా ...భోజనాల్లో నిన్నుచూసి చేసుకుంటున్నారట కదా ...అసలు నా సమాధానం కోసం చూడకుండా మాట్లాడేస్తూనే ఉందావిడ ! ఒక్కసారిగా రక్తమంతా ముఖంలోకి తన్నుకొచ్చిన భావన ! ఆ ఫీల్ చెప్పలేను .

సడన్ గా గ్రౌండ్ అంతా నిశ్శబ్దం ఆవరించుకుంది ...అప్పటివరకు అరుపులతో ....మాటలతో హోరెత్తిన గ్రౌండ్ ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది ...బాయ్స్ అంతా ఆడటం మానేసి ఆవిడమాటలు ఆసక్తిగా వినసాగారు . మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా నోరెల్లబెట్టుకుని నన్నూ ,ఆవిడనీ మార్చి మార్చి చూస్తుండిపోయారు .మా కోచ్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్లిపోయారు .నేను మాత్రం ఎర్రబడిన మొహంతో అలా చలనంలేని బొమ్మలా షాక్ లో ఉండగానే బెల్ మోగడం ..నేను తేరుకొని పరుగెత్తుకుంటూ బాగ్ తీసుకుని ఇంటికి పారిపోవడం జరిగిపోయింది .

ఆ మర్నాడు ఎలా వెళ్ళను అనుకొంటూనే స్కూల్ కి వెళ్లాను. నేను అడుగు పెట్టగానే క్లాసంతా మళ్ళీ నిశ్శబ్దం ! అబ్బాయిలంతా ముసిముసిగా నవ్వులు ...వాళ్ళల్లో వాళ్లు గుసగుసలు ! ఇక అమ్మాయిలు నేనెప్పుడు దొరుకుతానా అన్నట్టు ప్రశ్నల వర్షం కురిపించారు . స్కూల్ అంతా పాకిపోయినట్టుంది ..మా తెలుగు మేడం కూడా క్లాస్ అవ్వగానే పిలిచి అడిగారు . బహుశా ఆ స్కూల్ మొత్తం మీద ఇలా జరిగింది నాకే అనుకుంటా !

అంతే ఇంటికి వెళ్ళగానే చెప్పేశా !ఇక స్కూల్ కి వెళ్లనని ! అమ్మ ,పిన్ని వాళ్లు మిసెస్ బాబూరావ్ ని కాస్సేపు తిట్టి నన్ను ఒప్పించాలని చూశారు కానీ నేను మొండికేసే సరికి నాన్నగారేమీ మాట్లాడలేదు . ఆ తర్వాత ఎలాగూ తెలిసింది కదాని పెళ్ళికి ముందు శుభలేఖలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మా హెడ్ మాస్టరు చాలా బాధపడి పెళ్ళి ఐతేనేం .....చదువుకోవడానికేం...తప్పకుండా రామ్మా అని చెప్పారు కానీ ..అప్పుడా మాటల విలువ తెలీలేదు .అలా నాచదువుకి నేనే పుల్ స్టాప్ పెట్టుకున్నా ! నేను వెళ్తానంటే ఎవ్వరూ వద్దని అనేవారు కాదు ...మా అత్తవారింట్లో కూడా ! కానీ ...ప్చ్ ...మా వారు మాత్రం పెళ్లి తర్వాతే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.

తర్వాత పెళ్ళికి వచ్చిన నా ఫ్రెండ్స్ , మా క్లాస్ అబ్బాయిలు నన్ను స్కూల్ కి రమ్మని , పరీక్షలు రాయమని చెప్పారు కానీ మంగళ సూత్రాలు , మెట్టెలు వేసుకొని స్కూల్ కి వెళ్ళటం సిగ్గుగా అనిపించి ఎవరిమాటా వినలేదు.అయినా అంతా నా స్వయంకృతాపరాధం మాత్రమె కాదండోయ్ ....కొంత దైవం కూడా అనుకూలించలేదు ....అప్పటినుండి నాకు ఒక సెంటిమెంటు కూడా ఏర్పడింది ...అదేంటో మరో టపాలో ....అంతవరకూ సెలవా మరి !

Thursday, September 3, 2009

తెర వెనుక !


అలా నా పెళ్లి కుదిరిపోయింది కదా ! అసలు నా వెనుక ఏం జరిగిందో చెప్తాను . నేను భోజనాల కార్యక్రమం లో నా గురించి ఆరా తీసిన తాతగారు మా శ్రీవారి తాతగారన్న మాట ! అప్పటికి కొద్దిరోజుల ముందు ఆయనకు అనారోగ్యం చేసిందట! నన్ను చూడగానే వాళ్ల మనవడికి చేసుకుంటే బావుండుననిపించిందట ! కనీసం ఒక మనవడి పెళ్లినైనా చూసుకోవాలని ( రెండో ఆయన పెళ్లి చూపులకొచ్చిన ఇంకో అబ్బాయి ఇప్పుడు మా మరిది ) మా బాబాయి గారిచేత నాన్నగార్ని అడిగించారట ! ( ఆ తర్వాత కూడా ఆయన చాలా ఏళ్ళు క్షేమంగానే ఉన్నార్లెండి :) )

తాతగారికి వాళ్ల వదిన గారంటే చాలా గౌరవం ! అమ్మమ్మగారికంటే ముందు ఆవిడ సలహానే తీసుకొనేవారు . భోజనం చేసి సరాసరి వాళ్ల వదినగారి ఇంటికి వెళ్లి తన మనసులోని మాటను చెప్పగానే ఆవిడ అవును ఆ అమ్మాయి చాలా బావుంది తప్పకుండా చేసుకుందాం అన్నారట ! ఇంతకూ బస్ లో నన్ను ప్రశ్నలమీద ప్రశ్నలతో విసిగించిన ఆవిడే ఈవిడ !తర్వాత అమ్మమ్మగారికీ , మా అత్తగారికీ కూడా నేను నచ్చడం వాళ్ళూ ఓకే చెప్పటం జరిగింది .

సరే !వాళ్లకు నేను నచ్చేసి ప్రపోజ్ చేశారు కానీ మానాన్నగారికేమయింది ?
మా బాబాయి వాళ్ల ఫేమిలీ గురించి అబ్బాయి మంచితనం గురించి నాన్నగారికి చెప్పి ఇంక రెండేళ్ళ తర్వాతైనా బుజ్జి పెళ్లి చేయాలికదా అప్పుడు ఇంతమంచి కుర్రాడు దొరకొద్దా ? అబ్బాయి సిటీలో చదువుతున్నాడు వాళ్ల పెద్దమ్మగారి అమ్మాయి నిశ్చితార్దానికి వచ్చి ఇక్కడే ఉన్నాడు ఒకసారి నువ్వు చూడన్నయ్యా ...నచ్చకపోతే మానేద్దాం అని చెప్పారట . సరే చూద్దామని నాన్నగారు వాళ్ళింటికి వెళ్లారట ! అయ్యో ముందు కబురంపలేదు అబ్బాయి చావిడిదగ్గర ఉన్నాడని వాళ్ల అమ్మమ్మగారు చెప్పగానే నాన్నగారూ ,బాబాయీ అక్కడే చూస్తామని వెళ్లారట ! వీళ్ళు వెళ్ళేసరికి ఈయన చావిట్లో పందిళ్ళు వేయిస్తున్నారట ! అంతే నాన్నగారు ఫ్లాట్ !చదువుకొనే కుర్రాడు వ్యవసాయం పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నాడని , ఆ తర్వాత తన మాట తీరు నచ్చేసి వెంటనే మా అమ్మాయిని చూడటానికి రండని చెప్పారట !

ఆతర్వాత జరిగింది మీకు తెలిసిందే !తన చదువూ పూర్తి కాలేదు ( మా పెళ్ళయిన తర్వాతే డిగ్రీ పూర్తి చేశారు ), నువ్వుకూడా మనింటి దగ్గరే చదువుకోవచ్చు 10 పూర్తయ్యాక కావాలంటే ప్రేవేట్ గా చదువుకోవచ్చు .అని నాకు చెప్పారు .నన్ను చూసుకున్న తర్వాత రెండు రోజులకే నిశ్చితార్ధం ....ఆతర్వాత రెండు నెలలలోపే పెళ్లి జరిగిపోవడం జరిగింది .ఐతే నా చదువు మాత్రం ఆగిపోయింది .అదీ నా స్వయంకృతాపరాధం అదెలాగో తర్వాతి టపాలో ..........

** నా పెళ్ళయిన ఆరునెలల తర్వాత మా పెద్ద తమ్ముడడిగాడు నన్ను! అక్కా బావ సిగరెట్ కాలుస్తాడా అని ! అదేంట్రా నేనడిగితే నువ్వేకదా కాల్చడని చెప్పావ్ అన్నా ! అదికాదక్కా నాకు తెలీదు కానీ ఈబావని చేసుకుంటే నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావని అలా చెప్పా !అన్నాడు :)
అక్కడ ఉన్నన్నాళ్ళూ తమ్ముళ్ళిద్దరూ నన్ను తోబుట్టువులాగే చూశారు ఇప్పటికీ మేం సిటీకి వచ్చేసినా మా పొలాలు శిస్తులు అన్నిట్లోనూ చాలా సహాయంగా ఉంటారు .