Monday, November 30, 2009

నాన్న చెప్పిన ఓ సంఘటన!


అవి 1962 వ సంవత్సరం నాన్నగారు రైల్వే లో అప్రెంటీస్ గా కోయంబత్తూర్ లో పనిచేస్తున్న రోజులు .అప్పటికే నాన్నగారికి పెళ్లయింది.ఏవో నాలుగు రోజులు సెలవులోస్తే కోయంబత్తూర్ నుండి ఊరికి వచ్చారు . సెలవులు పూర్తయి తిరుగు ప్రయాణం.

ఆరోజు 30 వతేదీ ....ఆ మర్నాడు జీతాలిస్తారు .( అప్పట్లో నాన్నగారికి స్టేఫండ్ ఎనభైఐదు రూపాయలట ! ) ట్రైనుకి టికెట్ అవసరం లేదు పాస్ ఉంటుంది . కాబట్టి డబ్బులు పెద్దగా పనేముందీ అనుకొని ఓ పదిరూపాయల కాగితం జేబులో వేసుకొని భోజనం చేసేసి సాయంత్రం నాలుగ్గంటలకు రాజమండ్రి లో మద్రాసు మెయిల్ ఎక్కారు.కోయంబత్తూర్ వెళ్ళాలంటే మద్రాసులో దిగి ట్రైన్ మారి వెళ్ళాలి .సరే ఉదయం ఆరుగంటలకి మద్రాస్ లో దిగితే తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తిరిగి కోయంబత్తూర్ వెళ్ళే కొచ్చిన్ ఎక్స్ ప్రెస్.అప్పట్లో భోజనం ముప్ఫైమూడు పైసలట ! మద్రాస్ లోనే టిఫిన్ ,భోజనం చేసి బండి ఎక్కేవారట !

రాజమండ్రిలో బండి ఎక్కి పై సీటుమీద దుప్పటి పరుచుకొని సెటిలైపోయి కూర్చున్నాక ..ఎదురుగా ఉన్న సీటుమీద కూడా ఓ వ్యక్తి టవల్ లాంటిది పరుచుకొని కూర్చోవడం గమనించి పలకరించారు .అతను కూడా మద్రాస్ వెళుతున్నట్టు చెప్పాడు .ఎనిమిది గంటలయ్యేసరికి ట్రైను విజయవాడ చేరుకుంది అక్కడ ఎక్కువసేపు హాల్ట్ !విజయవాడ స్టేషన్ లో
ఎద్దు ముఖంఆకారంతో వంపున్న ఎర్రమట్టి కూజాలు అమ్మేవారట ! నాన్నగారి పై అధికారి ఒకరు నాన్నగారిని వీలయితే ఆ కూజా ఒకటి తెచ్చిపెట్టమని అడిగారట ! విజయవాడ రాగానే నాన్నగారి ఎదురుసీటులో ఆయన
కిందికి వెళ్ళబోతూ ఉంటే నాన్నగారు అతన్నిఆపి మీరెలాగూ దిగుతున్నారు కదాఒకకూజా తెచ్చిపెట్టమని అడిగారు .కూజా రెండున్నర ! చిల్లరలేక పదిరూపాయల నోటు ఇచ్చారు అంతే దిగి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు .అతనికి లగేజ్ కూడా ఏమీలేదని అప్పుడు గమనించారట నాన్నగారు !సాటిమనిషిని మీద నమ్మకం పోయిన క్షణాలవి !

మద్రాస్ స్టేషన్లో బండి దిగి ఫ్లాట్ ఫాం మీద మొహం కడుక్కొని ఒక బెంచిమీద కూర్చున్నారు .టిఫిన్ మాట అటుంచి టీ తాగుదామన్నా జేబులో నయాపైసా లేదు .నిన్న మధ్యాహ్నం అనగా తిన్న భోజనమే .కడుపులో ఆకలి ..సూర్యుడు పైకొచ్చినకొద్దీ నీరసం ..నిస్సత్తువా ఆవరించేసి కళ్లు తిరుగుతున్నట్టు అనిపించి అలాగే బల్లమీదజారబడి కళ్లు మూసుకున్నారు నాన్నగారు !

ఎంతసేపట్నించి నాన్నగార్ని గమనిస్తున్నాడో ఒక పెద్దాయన దగ్గరికివచ్చి తెలుగువాడిలా ఉన్నావ్ నీపెరేంటి బాబూ అని పలకరించాడు.నాన్నగారు చెప్పాక ...ఏంటి నీరసంగా కనిపిస్తున్నావ్ ఒంట్లో బాగానే ఉందా ..భోజనం చేశావా అని అడిగారు .నాన్నగారు మొహమాటం కొద్దీ చేశానండీ ..అని సమాధానం చెప్పారు కానీ ఆయన నాయనా ! పెద్ద కుటుంబం నుండి వచ్చినట్టున్నావ్ ఏం జరిగిందో నాకు తెలీదు నేను చాలాసేపట్నించి చూస్తూనే ఉన్నాను నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చున్నావ్ ఏం జరిగిందో చెప్పు అని అడిగారు . అప్పుడు నాన్నగారు జరిగింది చెప్పగానే ఆయన పదిరూపాయల కాగితం తీసిచ్చి ముందు నువ్వు భోజనం చేసిరా తర్వాత మాట్లాడదాం అన్నారు .కాని నాన్నగారికి అభిమానం అడ్డొచ్చి తీసుకోలేకపోతే నీ తండ్రిలాంటివాడిని తీసుకోకపోతే నా మనసు బాధపడుతుంది అని ఒప్పించి పంపించారు .తిరిగి వచ్చాక మిగిలిన చిల్లర కూడా ఏదైనా అవసరం పడొచ్చు ఉండనీ అన్నారట !ఆ తర్వాత మాటల్లో నాన్నగారు ఆయన అడ్రస్ తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు .

ఆయన పేరు సిఖిలే వెంకన్న గారు , ఆయనది అమలాపురం . నాన్నగారు కోయంబత్తూర్ వెళ్ళిన వెంటనే జీతం తీసుకొని చేసిన మొదటి పని ఆయన ఇచ్చిన పదిరూపాయలతోపాటూ మరో పది కలిపి , మాటల సందర్భంలో ఆయన క్రిస్టియన్ అని తెలుసుకొని ఒక సిలువ బొమ్మ కొని మనియార్డర్ తోపాటు పార్సిల్ చేశారట !

దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రిందటి సంగతి నాన్నగారు ఇప్పటికీ ఆయన్ని , ఆయన చేసిన సహాయాన్నీ మర్చిపోకుండా గుర్తుచేసుకుంటారు . ఒక మనిషి తప్పు చేసినంత మాత్రాన అందరు మనుషులపై నమ్మకం పోగొట్టుకోవద్దని భగవంతుడు నాకు వెంటనే తెలియచేశాడని చెప్తూ ఉంటారు . అలాగే ఎవరైనా చేసిన మేలును జీవితాంతం మర్చిపోకూడదని నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు .

ఆరోజు నాన్నగారికి సహాయం చేసి ఆకలి తీర్చిన భగవత్స్వరూపులు సిఖిలే వెంకన్నగారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలీదు అయినా ఆయనకు నా కృతజ్ఞతాభివందనం ! భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా !

Tuesday, November 24, 2009

వెదుకుతున్నా ఇంకా ....


మోయలేని బాధ్యతగా ....
నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని
అతికించుకోలేని నా అసహాయతనీ
వ్యక్తపరచలేని నా ఆవేదననీ
చెలమలౌతున్న నా కళ్ళనీ
దాచుకొని...తిరిగిరాని గతంలోని
ప్రతి మధురస్మృతినీ పదిలంగా మోస్తూ
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ....మన ప్రేమని !!

Tuesday, November 17, 2009

సోమయ్య ....కాదు సోమరాజుగారు !


నా గోరింట పూసింది...అరచేత ! టపా చదివిన మిత్రులకు సోమయ్య పరిచయమే ...సోమయ్య ...నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మమ్మగారింటి పాలేరు ...బహుశా తన చిన్నప్పట్నుంచే మాదగ్గరే పనిచేసేవాడనుకుంటా ..వాళ్ల నాన్న కూడా తాతగారి దగ్గర పొలాలు చూసుకోనేవాడనుకుంటా ! అమ్మమ్మగారింటికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ...నన్నెంతో గారాబం చేసేవాడు ...గోరింటాకు , చెరుకుగడలు ,కందికాయలు ...ఇలా ఏదడిగితే అది తెచ్చి తిను బుజ్జమ్మా ..మీ టౌనోల్లకి ఇయన్నీ దొరకవుకదా అంటూ ఎంతో ఆప్యాయంగా చూసేవాడు .

ఇక వేసవి సెలవుల్లోనే అమ్మమ్మగారి ఊరిలో ప్రతి ఏటాగౌరమ్మ సంబరం జరుగుతుంది . అది కూలీలంతా కలిసి కట్టుకున్న గుడన్న మాట ! చందాలు పోగేసి చాలా బాగా జాతర జరిపేవారు. ఇక ఊరేగింపులో గరగలు , గారడీ వాళ్లు , బ్యాండు పార్టీలూ , కోయ డాన్సులూ , పౌరాణిక ,సాంఘిక వేషధారణలు ...రాత్రి సందకాడ మొదలైన ఊరేగింపు తెల్లరేవరకూ జరిగేది .ఇంతకూ విశేషమేవిటంటే ...ఈ వేషాలు వేసుకున్నోళ్ళంతా మా కళ్ళముందు తిరిగే చాకలి వీరయ్యా, టైలర్ సత్తిబాబు , ఇంకా మా సోమయ్యా ...మొదలైన వారన్న మాట !

ఇక ఊరేగింపులో చివరగా వేషాల బళ్ళు మొదలవగానే మొదలయ్యేది మా సెర్చింగ్ . ఎవరు ఏ వేషం వేశారా అని ! ముఖ్యంగా మా సోమయ్య కోసం ! రాముడి వేషం వేసుకొని విల్లు బాణాలతో , పక్కనే సీతా లక్ష్మణులతో కదలకుండా నిలబడి ఉండేవాడు. మా ఇంటిదగ్గర బండి ఆగగానే సోమయ్యా సోమయ్యా అంటూ అరిచి గోల చేసేవాళ్ళం ( పిన్నిల పిల్లల తో కలిసి చిన్నగాంగ్ అయ్యేదిలెండి ) కళ్లు మాత్రం తిప్పి చిరునవ్వులు చిందిన్చేవాడు కానీ అంగుళం కూడా కదిలేవాడు కాదు...మేం కాగితాలు విసిరి , మాతమ్ముడైతే చిన్న చిన్న రాళ్ళు కూడా విసిరి అమ్మమ్మ చేత చివాట్లు తినేవాడు.అయినా సోమయ్యని మాత్రం కదిలించలేక పోయేవాళ్ళం .అలా మా ఇల్లు దాటేవరకూ నరకం చూపించేవాళ్ళం .

అలా మేం పెద్దై పోయాం ...అమ్మమ్మ ,తాతగారు కాలం చేశారు ...పొలాలు కౌలుకిచ్చేసే వారనుకుంటా ! ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యాక ...అమ్మకి తాతగారిల్లు రావటం వల్ల అక్కడే సెటిలయ్యారు . అప్పట్నుంచీ మళ్ళీ సోమయ్య విశేషాలు తెలుస్తున్నాయి . మా పొలాలే కౌలుకు చేసుకుంటూ ...సొంతంగా పశువులను కొనుక్కుని పాడి చేసుకుంటూ
చక్కగా పైకొచ్చాడు .ఇప్పటికీ ఏ పనికైనా మాకు సాయం వస్తుంటాడు .

ఆ మధ్య ఊరెళ్ళినప్పుడు వీరభద్రుని బోణం రోజు వంటచేస్తూ కనపడ్డాడు సోమయ్య ! నేను ఆశ్చర్యంగా ఏంటి సోమయ్యా !అంటే నాన్నగారు చెప్పారు మనకి సోమయ్య గాని ఇప్పుడందరికీ సోమరాజుగారమ్మా ....అని ! చిన్నగా ఓ వంట మాస్టర్ దగ్గర అసిస్టెన్స్ చేస్తూ తనూ నేర్చుకొని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు దాదాపు ఐదారు వందల మందికి వంట చేయగల మాస్టర్ ఐపోయాడు సోమయ్య ..కాదు కాదు సోమరాజుగారు !పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే సోమరాజుగారి సెల్ కి విశ్రాంతే ఉండదు . అన్నట్టు మన సోమరాజు గారికి భక్తి కూడా ఎక్కువేనండోయ్ ప్రతి ఏటా భవానీ మాల వేసుకుంటాడు .అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు .

ఈమధ్య ఊరెళ్ళినపుడు ...నాటుకోడిని కోసి మాంసం తెచ్చి ....అయ్యో పెంచుకునే కోడిని కోసేసేవా అని బాధపడితే ..మీరెప్పుడూ బాయిలర్ మాసమే తింటారు బుజ్జమ్మా ..మేం అస్సలు తినం కావలసినప్పుడు ఓ కోడిని కోసుకుంటాం (వాళ్ళింట్లో పెంచిన కోళ్ళని , కోడిగ్రుడ్లనీ అస్సలు అమ్మడట ! వాళ్లింట్లోకే పెంచుతాడట !) అంటూ అమ్మా ...ఉల్లిపాయలిలా పడేయ్ , కూర వండేసి వెళ్తాను అంటూంటే ఎన్నేళ్ళైనా తరగని ఆప్యాయతకు కళ్లు తడిసాయ్ !

** పై ఫోటోలో సోమయ్యని వెతక్కండెం....తన ఫోటో లేక గూగుల్ లోది పెట్టా ...

Friday, November 13, 2009

గండుతుమ్మెదవు!!


నేస్తం ??
నువ్వేం
చేసినా నేను నిన్ను ద్వేషించలేను
నేనేం చేసినా నువ్వు నన్ను ప్రేమించలేవు
పువ్వుపువ్వునీ పలకరించు గండుతుమ్మెదవు నీవు
రేయంతా నీకై వేచి వేచి ......
అలసి రాలిన పారిజాతాన్ని నేను! Add Imageపువ్వు పువ్వునీ తట్టే నీకు
పారిజాతం విలువేం తెలుసు ?
మకరందపు రుచులు తప్ప
పూల పరిమళమెందుకు నీకు?
నువ్వు నిర్లక్ష్యంతో ఎగిరెళ్లిపోతేనేం
దైవసన్నిధిలో నాచోటు పదిలం !


Wednesday, November 11, 2009

దివ్యగుణములు


మానవునికి కావలసిన దివ్యగుణములు పదహారు అని పెద్దలు చెప్తారు అవి .....
1. పరమాత్మునియందు సంపూర్ణ విశ్వాసం
2. ఆత్మలో దృఢత
3. ఆలోచనలో పరిపక్వత
4. మనస్సులో సంతుష్టత
5. బుద్ధిలో దివ్యత
6. సంస్కారములో శ్రేష్టత
7. దృష్టిలో పవిత్రత
8. మాటలో మధురత
9. కర్మలలో కుశలత
10. సేవలో నమ్రత
11. వ్యవహారములో సరళత
12. స్నేహములో ఆత్మీయత
13. ఆహారములో సాత్వికత
14. జీవితంలో సత్యత
15. వ్యక్తిత్వంలో రమణీయత
16. నిద్రలో నిశ్చింతత

పై పదహారు దివ్యగుణములు ప్రతి ఒక్కరూ వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి .
ఎక్కడో చదివినప్పుడు రాసిపెట్టుకున్నవి మీతో పంచుకోవాలని ఈ టపా !

Monday, November 9, 2009

వార్షికోత్సవ శుభవేళ .....


అనుకున్నామని జరగవు అన్నీ ....అనుకోలేదని ఆగవుకొన్ని ....జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషిపని ....అన్నారో మహాకవి ! ఇదెంత నిజం ! బ్లాగ్ అంటే తెలియనితనం నుండి బ్లాగ్ వార్షికోత్సవాన్ని ఉత్సాహంగా మీతో పంచుకోవడం ...పై మాటలు అక్షరసత్యాలని నిరూపించటం లేదూ !

ఒకానొక రోజు ఈనాడు పేపర్ చూస్తుండగా ...e బ్లాగుల గురించి చదవటం ...వాటిలో భావుకత్వంతో నిండిన రాధిక గారి బ్లాగ్ గురించి చదివి సంబరపడిపోతున్న నన్ను చూసి నాస్నేహితుడు మీరు మాత్రం ఎందుకు బ్లాగ్ మొదలుపెట్టకూడదు అంటూ ప్రోత్సహించి కంప్యుటర్ మెట్లైనా తాకని నాచేత బ్లాగ్ మొదలు పెట్టించి తానే నా బ్లాగ్ కు నామకరణం చేసి ఇంతమంది మిత్రుల పరిచయానికి కారణమైన వాడికి మీ సమక్షంలో కృతఙ్ఞతలు తెలుపుకోవడం నా కనీస ధర్మం !

నేను బ్లాగ్ ఓపెన్ చేసింది నవంబర్ ఎనిదవ తేదీన అయినా మొదటి టపా రాసింది మాత్రం ఈరోజే !నెమలికన్ను మురళిగారి ఫిర్యాదు నిజం చేద్దామని కాదుకాని ...కుటుంబ బాధ్యతల వల్ల అప్పుడప్పుడూ బ్లాగ్ కి కొద్దిరోజులు దూరమవ్వాల్సి వచ్చేమాట వాస్తవం ! ఐతే మొదట భార్యగా ,కూతురిగా , తల్లిగా ....నా బాధ్యతల తర్వాతే కదా నా బ్లాగ్ ! దీనికి మీ అందరి సపోర్ట్ నాకే కదూ !

అన్నట్టు ఈ మధ్య టపా లేటవడానికి ఓ మంచి కారణం ఉందండోయ్ ! అనుకోకుండా ఫ్లాట్ తీసుకోవడం ...తర్వాత మంచి లేదన్నారని గృహప్రవేశం చేసుకోవడం ....ఈ హడావుడి అన్నమాట ! ఆహ్వానించలేదని అన్యదా భావించక ఆశీర్వ దిస్తారు కదూ! ఉత్తములకు భగవంతుని అండ ఎల్లప్పుడూ ఉంటుందని అంటారు ....అటువంటి ఉత్తములైన మిత్రుల ప్రోత్సాహం కొండంత అండగా నాకుంటుందని ఆశిస్తూ ......ఇంతవరకూ నేనేం రాసినా నన్ను ప్రోత్సహిస్తూ స్పందించిన వారికీ ...బ్లాగ్ ఫాలోవర్స్ గా ఉంటూనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినవారికీ ......నేను తెలియక తప్పులు రాసినపుడు సరిదిద్దిన వారికీ ....అందరికీ వినమ్ర పూర్వక నమస్సులతో ......మీ పరిమళం !