Monday, March 30, 2009

వేటగాడివి నువ్వు ....


నా మనసు ముంగిట పూచిన అందమైన
గులాబీవి నువ్వనుకున్నా ....అందుకే
నిర్లక్ష్యమనే ముల్లుతో ఎప్పుడూ
నా గుండెల్లో గుచ్చుతూ ఉంటావ్

నా కలల వాకిట అల్లరి దొంగవి
నువ్వనుకున్నా .......కానీ
పొద్దస్తమానం నా పెదవుల్ని వీడని
నా చిరునవ్వుని దొంగిలించావ్

నిజానికి ఏమాత్రం దయలేని
వేటగాడివి నువ్వు ....
నా ఆశల పావురాన్ని
నీ మాటల తూటాలతో
కౄరంగా వేటాడి చంపేస్తున్నావ్ !

Thursday, March 26, 2009

ఉగాది శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులకూ మరియు వారి కుటుంబ సభ్యులకూ
విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .....
ఈ ఉగాది మీకు సర్వ శుభాలనూ చేకూర్చాలని
ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ .........మీ పరిమళం .

Saturday, March 21, 2009

క్షణమొక యుగం ....


నువ్వుంటే ప్రతి యుగమూ
ఒక్క క్షణమై కరిగిపోతుంది
లేకుంటే ప్రతీ క్షణమూ ...
ఒక యుగమై నిలిచిపోతుంది
నిన్ను చూడనిదానికంటే
నువ్వు దూరంగా ఉన్నావన్న
భావనే ...నా నిద్దురని తరిమేస్తోంది
ఈ రోజు కూడా నువ్వు రావన్న నిజం
నా పెదవిపై చిర్నవ్వుని చెరిపేస్తోంది
నీక్కూడా ఇలాగే ఉండి ఉంటుందనే
తలంపు నా కంటి చివరి
నీటి చుక్కని ఆపేస్తూంది ...

Wednesday, March 18, 2009

నిన్న - నేడు -రేపు ??

"బాల్యం ఓ తీపి జ్ఞాపకం" కవిత రాసినపుడు కొత్తపాళీ గారు తల్లితండ్రుల చిన్నతనం గురించి తెలుసా అని అడిగారు .అమ్మా నాన్నల చిన్నతనం గురించి చెప్పాలంటే ...చిన్న నవలవుతుందేమో ( మాకు చెప్పినవి మాత్రం ). తరానికి తరానికి బాల్యం లోని అనుభూతుల్ని కోల్పోతున్నామేమో అనిపిస్తుంది .
అమ్మా నాన్నలు ....వారు మనకు కధలు కధలుగా చెప్పే వారి బాల్యం మన పిల్లల్ని ఆశ్చర్య పరిచే నిజం .కొన్ని తరాల తర్వాతి పిల్లలకు నమ్మలేని నిజం .

మా అమ్మా నాన్నలు చిన్నప్పటి విషయాలు చాలా చెప్పినా .....నేను నాకు నచ్చిన ఒక విషయం ప్రస్తావించ దలచుకున్నాను .అది .....పంచుకోవడం .....అవును ...పంచుకోవడమే ....దానివల్ల పెరిగే ఆప్యాయత ,సాయం చేసే మనస్తత్వం అలవడటం ....వింటూవుంటే ఎంతో బావుండేది .

అప్పట్లో ప్రతీ ఇంట్లోనూ ఐదు లేక ఆరుగురు ...ఇలా అధిక సంఖ్యలో సంతానం ఉండేది .అక్కా చెల్లెళ్ళు పూలను అందరూ కలిసి కట్టుకొని తలా ఓ ముక్క తుంపి పెట్టుకోవడం , అన్నదమ్ములు ,సంతకెళ్ళి కూరగాయలు కొనగా మిగిలిన రెండు పైసలతో తినుబండారాలు కొనుక్కుని సమంగా పంచుకొని తినడం ( ఈ పంపకాల్లో గిల్లి కజ్జాలు సరేసరి ) ఇంట్లో కోడి పెట్టిన గుడ్లను వండి సగం ముక్కలు చేసి పిల్లలందరికీ వేయడం ....ఇలాగన్నమాట .అసలు అమ్మ వాళ్లు ఐదుగురు అక్క చెల్లెళ్ళు .వారం వారం తలంటు పోసుకోవడమే ఓ పండగలా ఉండేదట .ఇక పండగ వస్తే చెప్పక్కర్లేదు .ఇవన్నీ అమ్మా నాన్నలు చెబుతుంటే మాకు కధలాగే ఉండేది .

ఇక మాతరం ..... ఇద్దరు లేక ముగ్గురు ...సౌకర్యాలు కాస్త ఎక్కువగా అందేవి .ఉన్నంతలో ఎవరికీ కావాల్సినవి వారికి అమర్చి పెట్టడంతో ప్రతీది పంచుకునే అవసరం కాస్త తగ్గింది .అయినా పెద్దవాళ్ళ పుస్తకాలు రెండో వాళ్ళూ ఆ తర్వాత తెలిసిన వాళ్ళకి ...ఇచ్చి పుచ్చు కోవడం జరుగుతూ ఉండేది .అలాగే బట్టలూను ...నా చిన్నప్పుడు నా బట్టలు పిన్నికి (మా పిన్ని కూతురు ) ఇచ్చేదాన్ని ,నా తర్వాత నా పుస్తకాలు ఇద్దరు చదువుకునే వారు ,సెలవులకి మా అమ్మమ్మ వాళ్ల వూరు వెళ్తే బెల్లం ఆడేచోట పానకం తాగేవాళ్ళం , పొలానికి వెళ్లి గట్లవెంబడి కన్ది కాయలు కోసుకునేవాళ్ళం ...ఇలా చెప్తే మా పిల్లలు కధలుగానే వినేవాళ్ళు .ఇప్పటి వాళ్ళకీ అనుభవాలు లేవు మరి సెలవులిస్తే సమ్మర్ కేంప్ లు ,కంప్యుటర్ కోచింగ్ లు తప్ప .

ఇక ఇప్పుడు ...ఆడైనా , మగైనా ...ఒక్కరే ...( దేశ జనాభా పెరుగుతుందని కాదు )మళ్ళీ ఇద్దర్ని కంటే వార్ని చదివించడం ,ఆస్తిపాస్తులు పంచి ఇవ్వడం కష్టమని ...( తల్లితండ్రులు చివరి వరకూ తోడుండరు .కాబట్టి కనీసం ఇద్దర్ని కంటే కష్టం లోనూ ,సుఖం లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారని నా అభిప్రాయం )
ఒక్కరే కాబట్టి అతి గారాబం ,అవసరానికి మించి అన్నీ అమర్చి పెట్టడం ,అది తాహతుకు మించినదైనా సరే తమ పిల్లల్ని ఎలోటూ తెలియకుండా ఉంచాలన్న ఆలోచన .ఈ పోటీ ప్రపంచంలో నిలదోక్కుకునేలా చేయాలనే తాపత్రయం తో వారి బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేసి ,బండెడు పుస్తకాల భారం వారిపై మోపుతున్నారు .బామ్మ ,తాత మాట అటుంచి తల్లి తండ్రుల ప్రేమైనా పూర్తిగా దక్కుతుందా అంటే ....అనుమానమే ,భార్యా భర్తలు ఉద్యోగాలు చేస్తుంటే ..వారితో గడిపే సమయం ఎక్కడుంటుంది ?

నేల బండ , తొక్కుడు బిళ్ళ ,ఒప్పులకుప్పా ....ఇటువంటి ఆటలు ఉంటాయని ఇప్పటి పిల్లల్లో చాలామందికి తెలీనే తెలీదు .అవన్నీ మేమాడుకున్న ఆటలు అని చెప్తే ఇప్పటి చిన్న పిల్లలు వింతగా చూస్తారు ఏదో గ్రహాంతర వాసిని చూసినట్టు (స్వీయానుభవం ) ఇప్పుడు పిల్లలు కంప్యుటర్ గేమ్స్ ఆడటమే ప్రిస్టేజ్ గా భావించే తల్లితండ్రులు కూడా ఉండటం బాధాకరం .

నాకు తెలిసిన వారి పాపను ( వారికి ఒకే పాప ) వారుండే టౌనులో కూడా ఎడ్యుకేషన్ బాలేదని ,సిటీ లో ఓ పేరున్న పెద్ద స్కూల్ లో ,హాస్టల్ లో వేశారు .కొద్దిరోజులకు ఆ అమ్మాయి ఉండనని పేచీ పెడితే ,తండ్రి ఉద్యోగ రీత్యా రాలేడు కాబట్టి తల్లి వచ్చి ఇల్లు తీసుకుని కూతుర్ని చదివిస్తోంది .తండ్రి ఎ నెలకో ఓసారి వస్తాడు .ఈ మధ్య ఆ స్కూల్ కూడా అన్ని యాక్టివిటీస్ కి సమానంగా ప్రాధాన్యత ఇస్తుంది ,ఈ ఈతలూ ,యోగాలూ మనకేం మార్కులు తెచ్చి పెట్టవు అంటూ అచ్చంగా చదువు (??) మాత్రమె చెప్పే (రుద్దేసే ) స్కూల్స్ కొత్తగా పెట్టారటగా దాంట్లో చేర్పిస్తానంటుంటే ...పాపం ఆ పిల్ల మీద జాలేసింది .ఇంతకూ ఆ పాప చదివేది ఆరవ తరగతి .

మన తల్లితండ్రుల బాల్యం మనకు ,మన బాల్యం మన పిల్లలకూ కధగా అనిపించినపుడు ...కొన్ని తరాల తర్వాత కదా చరిత్రగా ఎందుక్కాకూడదు .ఇప్పుడు మన చరిత్ర లో చదువుకోనేవన్నీ ఒకప్పుడు జరిగినవేగా ! అలాగే ముందు ముందు బాల్యం అనే పాఠాన్ని పిల్లలు పుస్తకాల్లో చదువు కుంటారేమో ....

**అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే జరుగుతుందని కాదు .మన చుట్టూ పరికిస్తే ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నారని నా ఆవేదన .ఇది నా అభిప్రాయం మాత్రమే .ఎవరి మనసు నైనా నొప్పించి ఉంటే మన్నించగలరు .

Monday, March 16, 2009

బాల్యం ఓ తీపి జ్ఞాపకం .....


బాల్యం ఓ తీపి జ్ఞాపకం .......
పసితనం కాదది .....పసిడి వనం ....
బడిలో
మాష్టారు వల్లెవేయించిన
సుమతీ శతకం ....
ఏడో ఎక్కం లో తప్పు దొర్లినపుడల్లా
ఝళిపించే లెక్కల మాష్టారి బెత్తం ,
చెలులతో కలిసి ఇసుకలో
కట్టుకున్న గుజ్జన గూళ్ళూ .....
బట్టలకంటిన మట్టిచూసి
అమ్మ వేసిన మొట్టికాయలు ,
నాన్న బుజ్జగింపులూ ....
బామ్మ చేతి గోరుముద్దలు
తాతయ్య చెప్పే రాజు రాణి కధలూ ....
ఇవన్నీ నిన్నటి మన తీపి జ్ఞాపకాలు
నాటి మన బాల్యం ....
నేటి పిల్లలకు ......కధైతే .....
రేపటి తరానికి ......
చరిత్రౌతుందేమో .......

Saturday, March 14, 2009

మేక నాది ..........


అనగనగా ఒక ఊరు .....ఆ ఊరిలో రామయ్య ఓ సన్నకారు రైతు . అతడికి అదే ఊరి చివర ఆశ్రమం లో నివసిస్తున్న సాధువు అంటే ఎనలేని భక్తి . అతడు చెప్పే ప్రవచనాలంటే గౌరవం ....అవి వినడం కోసం రోజూ ఆశ్రమానికి వెళ్తూవుండేవాడు .ఆ సాధువు కూడా గ్రామస్తులకు మంచి , చెడ్డ బోధిస్తూ .....వారు పండో , పత్రో ఏదిస్తే అది ఇచ్చిన్నాడు తింటూ , లేన్నాడు పస్తుంటూ కాలం గడిపేవాడు .

ఒక
రోజు గ్రామస్తులలో ఓ వ్యక్తి సాధువుకు భక్తితో ఒక మేకను కానుకగా ఇచ్చాడు .సాధువు గారు సంతోషించారు .ఆ రోజు నుండీ అది ఆశ్రమం చుట్టు ప్రక్కల గడ్డి మేస్తూ బాగా పాలు ఇచ్చేది .వర్షాకాలం అయినా ,జనం రాకపోయినా ....మేక ఇచ్చే పాలతో హాయిగా కాలం గడిపెసేవారు సాధువు గారు .

ఇలా వుండగా ..ఒక రోజు రామయ్య కొడుకు హఠాత్తుగా మరణించాడు . రామయ్య తీవ్రమైన వేదనతో కృంగిపోయాడు .అయినా అలాగే ఏడుస్తూ సాధువు దగ్గరకు వెళ్ళాడు . విషయం తెలుసుకున్న సాధువు ,....రామయ్యా ! పుట్టిన వారు మరణించక తప్పదు ...మరణించినవారు తిరిగి పుట్టక తప్పదు .ఈ శరీరమేనయ్యా నాశనమయ్యేది , ఆత్మకు చావు లేదు .జీవి శరీరం లో వున్నంత వరకేనయ్యా బంధాలు ,బంధుత్వాలూ .....ఇదే సృష్టి ...అంటూ కృష్ణ భగవానుడు గీతలో చెప్పిన సారాంశాన్ని బోధిస్తాడు .రామయ్య మనసు తేలికపడింది .సాధువు గారికి కృతజ్ఞతలు చెప్పి ,యధావిధిగా తన పనుల్లో మునిగి పోయాడు .

ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాయి .ఒక రోజు రామయ్య వెళ్ళేసరికి సాధువు భోరున ఏడుస్తూ కనిపించాడు .స్వామీ ! ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నారు ? అంటూ అడిగాడు రామయ్య . అప్పుడు సాధువు ....రామయ్యా !నా మేక చచ్చిపోయిందయ్యా , చక్కగా పాలిచ్చేది , నా కడుపు నింపేది ...ఇప్పుడది చచ్చిపోయింది ....అంటూ ఏడ్వసాగాడు .
అదేంటి స్వామీ ! ఇందులో ఏడవాల్సిందేముంది ? మేక ఈ శరీరాన్ని వదిలి , వేరే శరీరం ధరిస్తుంది . అంతేగా ! ఆత్మ నాశనం లేనిది కదా స్వామీ !ఆ రోజు నా కుమారుడు చనిపోయినపుడు మీ దయవల్లే ఇవన్నీ తెలుసుకున్నాను . దీనికి మీరు ఏడుస్తున్నారేంటి స్వామీ ! అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య .

అయ్యా ! రామయ్యా ! ఆ రోజు చనిపోయింది నీ కొడుకు . కానీ ఇప్పుడు చనిపోయిన మేక నాది .......అన్నాడు సాధువు భోరున ఏడుస్తూ .......
*ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు ......తనదాకా వస్తే .......

***ఎప్పుడో చదివిన కధ కాస్త అటూ ఇటూ గా ....

Tuesday, March 10, 2009

వసంతం వచ్చేసింది ...ఉగాదిని తెచ్చేస్తోంది .........


బయట పచ్చని చివుళ్ళతో ముస్తాబవుతున్న చెట్లను చూస్తే అనిపించింది .వసంతం వచ్చేసింది , ఉగాదిని తెచ్చేస్తోంది .....అని . ఇన్నాళ్ళూ ఆకురాల్చి నగ్నంగా నిలుచున్న చెట్లన్నీ ...కొత్త చివురులతో ఒంటిని కప్పుకుంటున్నాయి .ప్రతి ఉగాదికీ మీకేనా కొత్త బట్టలు ...మాక్కూడా .....అన్నట్టు .

రాలే ప్రతి ఆకూ ఒక క్రొత్త చివురుకు జన్మనిస్తుంది .మన మానవ జీవనానికి సంకేతంలా అనిపిస్తుంది .పునరపి జననం పునరపి మరణం అన్న మాటను ఒక చెట్టు మనకు ప్రత్యక్షంగా చూపుతుంది .అంతేకాదు కష్టం వచ్చినా ,సుఖం వచ్చినా వంగిపోక , కృంగి పోక ధీరత్వం తో ఆహ్వానించే చెట్టుని చూసి మనం ఆశావహ దృక్పధం తో మనుగడ సాగించాలి .

ఎక్కడో కోయిల కుహూ రాగం వినిపిస్తోంది మధురంగా ....ఎంత కమ్మని స్వరం ....రంగు నలుపైతేనేం ....తిన్నవి వగరు చివురు లైనా ....ఎంతో హాయిని మనకు పంచుతోంది . ఈ కోయిలమ్మకూ , మన బ్లాగరులకూ ఒక పోలిక కనిపిస్తుంది నాకు .గుబురుల మాటున తాను కనపడకనే తన గొంతులోని మాధుర్యాన్ని పంచుతుంది కోయిలమ్మ .....కనపడకనే వారి మనసుల్లోని భావతరంగాలు మనతో పంచుకొంటున్న మన బ్లాగరులూ ......పోలిక సరైనదేనా ??

Friday, March 6, 2009

మల్లెలు .....


మల్లెలు .....
పేరు వింటే చాలు మగువల
హృదయపు పరవళ్ళు .....
వాటి పరిమళాలు పుట్టించు
పురుషుల గుండెల్లో గుబుళ్ళు
నవ దంపతుల మధ్య
సయోధ్య చేకూర్చు చెలులు
షష్ట్యబ్ధి దంపతులకూ ...
అవి నెరిసిపోని మురిపాలు
ఉదయపు అలకలను
మాపటి వలపులుగా మార్చేసే
మంత్ర గత్తెలు మల్లెలు ......

Tuesday, March 3, 2009

యక్ష ప్రశ్నలు ....


యక్ష ప్రశ్నలు ....మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు .వాటికి ధర్మజుని సమాధానాలలో మన జీవన విధానానికి మార్గ దర్శకాలుగా ఉన్న కొన్నింటిని టపాగా రాయాలనిపించింది .

* సుఖానికి ఆధారం - శీలం
* దుఃఖం అంటే - అజ్ఞానం కలిగి ఉండటం
* జ్ఞానం అంటే - మంచి చెడ్డల్నిగుర్తించ గలగటం
* దయ అంటే - ప్రాణులన్నిటి సుఖమూ కోరడం
* ధైర్యం అంటే - ఇంద్రియ నిగ్రహం
* తపస్సు అంటే - తమ వృత్తి కుల ధర్మం ఆచరించడమే
* స్నానం అంటే - మనసులోని మాలిన్యాన్ని తొలగిచుకోవటం
* లాభాల్లో గొప్పది - ఆరోగ్యం
* సుఖాల్లో గొప్పది - సంతోషం
* ధర్మాలలో ఉత్తమమైనది - అహింస
* మానవునికి సహాయ పడేది - ధైర్యం
* దేన్ని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది - మనస్సు
* మంచిగా మాట్లాడే వారికి దొరికేది - మైత్రి
* మానవుడు సజ్జనుడు ఎట్లవుతాడు అన్న ప్రశ్నకు - ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే , ఏమి మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో ....తాను ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించకుండా ఉండువాడు సజ్జనుడనీ .....
* మనిషి గర్వాన్ని విడిస్తే సర్వ జనాదరణీయుడు , క్రోధాన్ని విడిస్తే శోక రహితుడూ , లోభాన్ని విడిస్తే ధనవంతుడూ , కోరికలు విడిచినచో సుఖవంతుడూ అవుతాడని ధర్మ రాజు చెప్తాడు .

పైన చెప్పిన వాటిని మార్గ దర్శకాలుగా జీవితాన్ని మలుచుకున్న మానవుడు ధన్యజీవి కదూ !