Sunday, May 6, 2012

సత్యమేవజయతే!


ఏమాత్రం లాజిక్ మాత్రమే కాదు ముగింపే లేని సీరియళ్ళు,చూస్తుంటేనే కంపరం పుట్టించే రియాలిటీ షోలు,ప్రతి ఎలిమినేషన్ లో ఏడుపులు,తిట్టుకోవడాలు చూసేవాళ్ళని వెర్రి వాళ్ళని చేసే మరికొన్ని షోలు,వంటలు,రిటైర్ ఐన నటీమణులు వాళ్ళ టాలెంట్ చూపిస్తూ చేసే షోలు,ఏ హిందీ చానెల్ వాళ్ళో చేసిన ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులమీద రుద్దుతూవాళ్ళు వేసుకునే పిచ్చి జోకులకి వాళ్ళే పగలబడి నవ్వుతూ కత్తితో పొడవకుండా,తుపాకితో కాల్చకుండా మనుషుల్ని చంపడం వీరికే సాధ్యం !ఇక వేసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ వేసినా వేరే దిక్కులేక వాటినే చూస్తూ పొద్దు పుచ్చటం అలవాటైపోయిన సగటు బుల్లితెర ప్రేక్షకులకి ......టివి పెట్టాలంటేనే భయపడిపోతున్న వారికి శుభవార్త!ఎడారిలో ఒయాసిస్సులా....మండువేసవిలో చిరుజల్లులా,ఒక ప్రయోజనకరమైన ఒక కార్యక్రమం!నిజమేనండీ .....మీరు నమ్మాలి!

అది అమీర్ఖాన్ సత్యమే వజయతే! ఈ ప్రోగ్రాం మిగిలిన భాషల్లో ఎప్పుడు మొదలైందో నాకు తెలీదుకాని నేను మాత్రం ఈరోజు ఈటివిలో ఉదయం పదకొండు గంటలకు చూశాను. మొదటి రోజే గుండెల్ని పిండేసే సత్యాలను తెలుసుకుంటుంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది,,అసలు మనుషులమధ్య మసిలే మృగాలు, మనుషులుగా చలామణి అవుతున్న రాక్షసుల గురించి వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.టివిలో అన్నీ చెత్త ప్రోగ్రామ్స్ అని అనను కాని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు మన తెలుగులో చాలా తక్కువనే చెప్పాలి.

నిజాల్ని వెలికితీసి ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలనే అమీర్ఖాన్ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం!ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకి తెలుగులో ఈటివిలోను,హిందీలో స్టార్ ప్లస్ లోను ప్రసారమవుతుంది.ఈ చైతన్య యాత్రలో మనంకూడా చేయి కలపొచ్చు www.satyamevajayate.in ద్వారా మన అభిప్రాయాలను పంచుకోవచ్చు.

* ఎపిసోడ్ మిస్ ఐనవారు ఈ లింక్ లో చుడండి (స్టార్ ప్లస్ లో హిందీలో వచ్చింది)
http://www.youtube.com/watch?feature=player_embedded&v=u1vASMbEEQc