Saturday, February 28, 2009

ఉత్తరాలు ......


ఉత్తరాలు ......మన ఆత్మీయుల వద్దనుండి కష్ట సుఖాలు ,ప్రేమ ఆప్యాయతలూ మోసుకొచ్చే పలకరింపుల పరిమళాలు .పోస్ట్ మాన్ ఒకప్పటి ఆత్మీయ బంధువు .మనకు మనియార్డర్ వస్తే మన సంతోషం లోనూ ,సీరియస్ టేలిగ్రాములోస్తే మన దుఃఖం లోనూ పాలు పంచుకునే మనకేమీ కాని ఓ నేస్తం .మండు వేసవిలో ఉత్తరం తెచ్చిస్తే ఓ గ్లాసు చల్లటి మంచి నీళ్ళో ,మజ్జిగ తేటో ఇస్తే పరమానందంగా తాగి చల్లగా చూస్తూ వెళ్ళిపోయే అల్ప సంతోషి .కొత్తగా పెళ్లై అత్తారింట్లో ఉన్న కూతురి క్షేమాన్ని ఓ తండ్రికి ,కేంపుకి వెళ్ళిన భర్త సమాచారాన్ని ఓ ఇల్లాలికి , పురిటి కెళ్ళిన భార్య బాగోగులు భర్తకి .......చేరవేసేది ఉత్తరం .

కార్డులూ ,కవర్లూ ,ఇన్ లాండ్ కవర్లూ ,రిజిష్టర్ పోస్ట్ లూ ,పార్శిల్సూ ..........ప్రతీ రోజూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూపులు .ఇప్పుడు మచ్చుకైనా లేవు .ఫోన్ లూ , మెయిల్సూ .....లేదంటే కొరియర్ ..... ఎప్పుడైనా అడపా దడపా ఏ LIC వాళ్ళో పంపించేవి తప్ప .అది కూడా అపార్ట్ మెంట్ లో ఉండే వాళ్ల కైతే వాచ్ మాన్ తీసుకుని తెచ్చిస్తాడు .నా చిన్నప్పుడైతే ఎన్ని ఉత్తరాలోచ్చేవో ....మా ఇంట్లోను ,అమ్మమ్మ వాళ్ళింట్లోనూ ఐతే వచ్చిన ఉత్తరాలన్నీ ఒక ఊసకి గుచ్చి వంకెకి తగిలించి పెట్టేవారు .

ఓ ఐదారు ఏళ్ల క్రితం వరకు అందరూ మానేసినా మా నాన్నగారు మాత్రం ఉత్తరాలు రాశేవారు .ఇన్ లాండ్ కవర్ నిండుగా ఎక్కడా సంతకం పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా .ఇద్దరికీ ఫోన్ లు ఉండేవి ఉత్తరం అందేలోగా ప్రతీ రోజూ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం .అప్పట్లో కోప్పడే దాన్ని . ఎందుకు ఫోన్ లో చెప్పినవే లెటర్ రాస్తారు ,లెటర్ లో రాసినవే ఫోన్ లో చెప్తారు అని .అప్పుడర్ధం కాలేదు ఆ ఆప్యాయత .ఏదైనా కోల్పోయాకే దాని విలువ తెలిసేది . ఈ మధ్య ఇల్లు సర్దుతుంటే నాన్నగారు రాసినవి ,మా పాప హాస్టల్ లో ఉన్నప్పుడు రాసినవి ,నేను పుట్టింటి కెళ్ళినప్పుడు మావారికి రాసినవీ ........కంటబడ్డాయి .

వాటిని మళ్ళీ చదువుతుంటే .......అప్పుడు తెలిసింది ఇప్పుడేం మిస్ అవుతున్నానో ......చదివేసినవే అయినా ఆ ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఎవరైనా ఉత్తరం రాస్తే బావుండని పించినా ,రాశేవారు లేరు .ఒకవేళ నేను రాసినా నవ్వుతారో ఏవిటో ............

ఇప్పటికీ ఎప్పుడైనా బయటి కెళ్ళినప్పుడు పోస్ట్ మాన్ కనిపిస్తే ఆత్మీయుడిని చూసినట్టే అనిపిస్తుంది .
మరి మీకేమనిపిస్తుంది ? టెక్నాలజీ ఇంత డవలప్ అయి ఎంత దూరానున్న మనిషినైనా చూసి మాట్లాడుతుంటే ఉత్తరాలంటూ ఈ పోష్ట్ఏవిటీ అనిపిస్తుందా ?

12 comments:

 1. very nice .naku letters rayatam ante inka istam undi . chadive time ledu kada evariki,chinnappudu penfriendship kuda undi kada. na daggara 6th(1996) classlo unnappudu maa frnd rasina letter kuda undi inka. inka chala unnayi . maa science madam rasina letter alantivi chala unnayi. letters chusinappualla chala relaxedga untundile. interlo marklist postcard lo pampevallu avi matram levu kada.

  ReplyDelete
 2. అవునండి..ఒక్కోసారి అప్పటి ఉత్తరాలు చూసుకుంటే మనమేనా ఇవి వ్రాసింది అనిపిస్తుంది, ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి, ఓ తీయని లోకంలోకి వెళ్లిపోతాం...ఏదో కోల్పోతున్న భావం మనల్ని చుట్టుముడుతుంది..నిజం చాలా కోల్పోతున్నాం.

  పిల్లలు ఇలాంటి అనుభూతులు కోల్పోతున్నారని మేము కొన్నాళ్లు బలవంతాన మా పిల్లల చేత ఇంటికి ఉత్తరాలు వ్రాయించాం.....

  ReplyDelete
 3. ఉత్తరాలు సాహిత్యమే. సామాన్యుడిలోని సాహితీ భావనలు వ్యక్తమయ్యేది అందులోనే.నాకు వచ్చిన వుత్తరాలు నన్ను ఇప్పటికీ అలవోకగానన్ను వెనుకటి రోజుల్లోకి నడిపిస్తాయి.యండమూరి,విక్టరి మధుసూధనరావు లాంటిమరికొందరు నాకు రాసిన లేఖలు నాజ్నాపకాల ఖజానాలో విలువైన వజ్రాలు
  -సుబ్బారెడ్డి

  ReplyDelete
 4. అవును కమ్మ్యునికేషన్ పెరిగి పోయిన ఈ కాలం లో వుత్తరం రాయటం టైం వృధా అనుకుంటున్నారు... కానిఅందులోని మధురిమ అర్ధం చేసుకోవాలంటే చదివే వారికి రాసే వారికి కూడా ప్రత్యేకమైన అభిరుచి వుండాలి.. కాలం కల లా కదిలిపోయినప్పుడు దానిని వెనక్కి తీసుకురాగల మత్రం ఒక్క వుత్తరానికి తప్ప దేనికి వుండి చెప్పండి...

  ReplyDelete
 5. తీపి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు అబినందనలు. అవును... పొస్టుమేన్ అందరి కి నేస్తం, ఆత్మీయుడు.. అందరూ ఆ మహానుబావుడు కోసం ఎదురు చూసే వాళ్ళే గతంలో. కొంత మందికి అస్సలు ఉత్తరాలు రావు, వచ్చే అవకాశాలు ఉండవు. అయినా సరే.. నాకేమన్నా ఉత్తరాలు ఉన్నాయా అని రోజు అడుగుతారు. మెయిల్సు, sms లు, టేలిగ్రములలో సమాచారం ఉంటుంది కాని ఆత్మ ఉండదు. పొస్టుమేన్ అంటే కొంతమందికి కోపం.. ఎవరికంటే?? ఎవరికైతే బేరింగ్ ఉత్తరాలు వస్తాయో వారికి.

  ReplyDelete
 6. తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' లో పోస్టుమాన్ కవితను గుర్తు చేశారు. నేను, నా స్నేహితులు చూసిన సినిమా కథలను ఉత్తరాల్లో రాసుకునేవాళ్ళం. తర్వాత ఏంజరిగిందో తెలియాలంటే సినిమా చూడు, లేదా నా ఉత్తరం కోసం ఎదురు చూడు అని ముగించే వాళ్ళం. అప్పుడప్పుడూ నేను ఉత్తరాలు రాస్తున్నా..జవాబులే రావడంలేదు.. బదులుగా ఫోన్ చేస్తున్నారు.. మంచి టపా.. నేనూ అప్పుడప్పుడూ ఇలా ఆలోచిస్తూ ఉంటా..

  ReplyDelete
 7. @ శివ ప్రసాద్ గారూ !మీ ఉత్తరాల జ్ఞాపకాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ .

  @ వరూధినిగారూ !మీ కామెంట్ కి ధన్యవాదాలు .కొన్ని అనుభూతులు పిల్లలకు మనం పరిచయం చేయకపోతే వాటిని కోల్పోతారు .అభినందనలండీ !

  @ సుబ్బారెడ్డి గారూ !ఉత్తరాలు కూడా సాహిత్యమేనన్నారు .నిజమే కొందరి ప్రముఖుల ఉత్తరాలే పుస్తకాలుగా అచ్చయ్యాయి .అన్నట్టు యండమూరిగారి వద్దనుండి వచ్చాయన్నారు .నేను చాలా excite అయ్యాను .ధన్యవాదాలండీ .

  @ భావన గారూ !" కాలం కలలా కదిలిపోయినప్పుడు దానిని వెనక్కి తీసుకురాగల మంత్రం ఒక్క వుత్తరానికే ఉంది "ఎంత అర్ధవంతంగా చెప్పారు ....ధన్యవాదాలండీ .

  @ కృష్ణా రావు గారూ !అవునండీ .....కానీ ఇప్పుడు సామాచారానికి ఉన్న ఇంపార్టేన్స్ ఆత్మీయతకు లేకుండా పోతోంది .నాకైతే కొన్నాళ్ళకి పోస్టల్ డిపార్ట్ మెంట్ ఎత్తేస్తారేమో అనిపిస్తుంది .టపా నచ్చినందుకు ధన్యవాదాలండీ .

  @ మురళి గారూ ! మీ ఉత్తరాల ముచ్చట బహు బాగుందండీ .మీరు చెప్పాక "తపాలా బంట్రోతు " మళ్ళీ చదివానండీ .గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.తపాలా బంట్రోతు పద ప్రయోగం బావుంటుంది .ఇప్పుడు చాలామందికి పోస్ట్ మాన్ ను తెలుగులో ఏమంటారో తెలీదు .తిలక్ గారు కూడా కొన్ని కవితలకు ఇంగ్లీషు టైటిల్ పెట్టినా ,దీనికి తెలుగే వాడారు .కవిత చాలా పెద్దది అయినా ఈ నాలుగు మాటలైనా రాయాలనిపించింది .
  * అదృష్టాధ్వం మీద నీ గమనం
  శుభాశుభాలకి నువ్వు వర్తమానం
  నీ మేజిక్ సంచిలో
  ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
  ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం !

  ReplyDelete
 8. బాగుంది. ఒక సరదా సంఘటన ఙ్ఞాపకం చేసారు. మా యూనివర్సిటీవారు నా డిగ్రీ సర్టిఫికెట్టును ఒక గొట్టంలాంటి దాంట్లో వేసి పంపించారు. ఆ విషయం నాకు తెలియదు. పోస్టుమాన్ దాన్ని ఇస్తూ సంతకం తీసుకుంటున్నాడు. మా నాన్న ’ఏమిట్రా వచ్చింది?’ అని అడిగితే ’తెలీదు నాన్న, ఎవరో షటిల్ కాక్ల (బ్యాడ్మింటన్)గొట్టం పంపించారు’ అని సమాధానమిచ్చి తర్వాత అదేమిటో తెలిసాక నాన్నతో తిట్టించుకున్నా ’బుర్ర తక్కువ వెధవని’. ఏం చేస్తాం bad time.

  ReplyDelete
 9. ఇప్పటికీ ఎప్పుడైనా బయటి కెళ్ళినప్పుడు పోస్ట్ మాన్ కనిపిస్తే ఆత్మీయుడిని చూసినట్టే అనిపిస్తుంది .
  మరి మీకేమనిపిస్తుంది ? నిజం చెప్పారు నిజం చెప్పి ఎంతో మందిని ఆలోచింపచేసారు మీ వెన్నలాంటి మనస్సు అందరికీ ఉండాలని కోరుకుంటూ ..శ్రీ

  ReplyDelete
 10. ఫోన్ లు వచ్చినా, మెయిల్స్ వచ్చినా... ఉత్తరానికి గల స్తానం యెప్పుడూ పదిలమే...

  ReplyDelete
 11. @Raj .. హ హ హ.

  ఉత్తరాలుత్తరాలుత్తరాలు .. ఈమెయిళ్ళు కూడా చక్కగా ఉత్తరాల్లాగా రాసుకోవచ్చు. కానీ రాయరెందుకనో!

  ReplyDelete
 12. @ రాజ్ గారూ ! :) :)

  @ శ్రీ గారూ ! ధన్యవాదాలు .

  @ ఆదిశేషారెడ్డి గారూ ! గవర్న్ మెంట్ కాబట్టి నడుస్తోంది ...ప్రెవేటు సంస్థ ఐతే పోస్టల్ డిపార్ట్ మెంట్ ని మూసేసేవారేమో అనిపిస్తుంది .అంతగా తగ్గిపోయాయి ఉత్తరాలు .మీ స్పందనకు ధన్యవాదాలండీ .

  @ కొత్తపాళీ గారూ !మెయిళ్ళు కొన్నాళ్ళకి డిలీట్ చేసేస్తాం కదండీ .ఉత్తరాలైతే దాచి ఉంచుతాం ..పైగా మన స్వదస్తూరీ ,మొదటి నుంచి చివరి వరకూ మన అక్షరాల కూర్పూ అవతలి వారి పట్ల మనకున్న ఆపేక్షని తెలియ చేస్తాయి కదండీ . ధన్యవాదాలు .

  ReplyDelete