Tuesday, March 3, 2009

యక్ష ప్రశ్నలు ....


యక్ష ప్రశ్నలు ....మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు .వాటికి ధర్మజుని సమాధానాలలో మన జీవన విధానానికి మార్గ దర్శకాలుగా ఉన్న కొన్నింటిని టపాగా రాయాలనిపించింది .

* సుఖానికి ఆధారం - శీలం
* దుఃఖం అంటే - అజ్ఞానం కలిగి ఉండటం
* జ్ఞానం అంటే - మంచి చెడ్డల్నిగుర్తించ గలగటం
* దయ అంటే - ప్రాణులన్నిటి సుఖమూ కోరడం
* ధైర్యం అంటే - ఇంద్రియ నిగ్రహం
* తపస్సు అంటే - తమ వృత్తి కుల ధర్మం ఆచరించడమే
* స్నానం అంటే - మనసులోని మాలిన్యాన్ని తొలగిచుకోవటం
* లాభాల్లో గొప్పది - ఆరోగ్యం
* సుఖాల్లో గొప్పది - సంతోషం
* ధర్మాలలో ఉత్తమమైనది - అహింస
* మానవునికి సహాయ పడేది - ధైర్యం
* దేన్ని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది - మనస్సు
* మంచిగా మాట్లాడే వారికి దొరికేది - మైత్రి
* మానవుడు సజ్జనుడు ఎట్లవుతాడు అన్న ప్రశ్నకు - ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే , ఏమి మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో ....తాను ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించకుండా ఉండువాడు సజ్జనుడనీ .....
* మనిషి గర్వాన్ని విడిస్తే సర్వ జనాదరణీయుడు , క్రోధాన్ని విడిస్తే శోక రహితుడూ , లోభాన్ని విడిస్తే ధనవంతుడూ , కోరికలు విడిచినచో సుఖవంతుడూ అవుతాడని ధర్మ రాజు చెప్తాడు .

పైన చెప్పిన వాటిని మార్గ దర్శకాలుగా జీవితాన్ని మలుచుకున్న మానవుడు ధన్యజీవి కదూ !

23 comments:

 1. "దుఃఖం అంటే - అజ్ఞానం కలిగి ఉండటం"
  ఒక్కోసారి అజ్ఞానం లోనే ఆనందం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది.. బాగుందండి..

  ReplyDelete
 2. యక్షప్రశ్నలు వాటికి ధర్మరాజు సమాధానాలను మార్గదర్శకంగా తీసుకుని జీవితాన్ని సాగిస్తే భగవంతుడే మనచెంత నిలవడా మరి.

  ReplyDelete
 3. యక్ష ప్రశ్నలు అని చాలా మంచి సమధనాలు ఇచ్చారేమిటబ్బా? పరిమళం, మరి చందమామలోలా ప్రశ్నలడిగి వదిలేయకుండా మీరే జవాబు చెప్పేశారు. హమ్మయ్య, జవాబు చెప్పడానికి ఆలోచించే శ్రమ తప్పించారు. (కొంచెం అంటే నిజంగా కొంచెం బాధగా కూడా ఉంది. అన్నిమీరే చెప్పేశారు. నా సమాధానం కరెచ్టా కాదా అని ఆత్రంగా ఎదుచూసే చాన్స్ మిస్సయ్యిందని)

  ReplyDelete
 4. పరిమళ గారు,
  భారతం మానవ ప్రవృత్తిని చక్కగా వివరిఅంచిన సజీవ గ్రంధం.రామాయణంలా ఆదర్శవంతమైన,రచయిత భావాత్మక కాల్పనికట కాదు. అందుకే రామాయణ పాత్రలు మనకు నిజజీవితంలో సాధారణంగా కనపడవు. అదే కీచ్క,సుయోధనుదు లాంటి మత్సర స్వభావులు,ధర్మరాజు లాంటి ద్వంధ స్వభవులు,ద్రౌపదిలాంటి వ్యక్తిత్వం వున్న స్త్రీలు,కర్ణుడిలాంటి స్నేహధర్మానికి కట్టుబడే వారు,శకున్లాంటి కపటులు ఒకటేమిటి ఎన్నో భాఅరత పాత్రలు న్త్యం మనకు దృశ్య మాన మవుతూనే వూంటాయ్.అలాంటి పంచమ వేదం భారతంలోని సంఘటనను గుర్తు చేశారు ధన్యులు.
  -సుబ్బారెడ్డి

  ReplyDelete
 5. పరిమళం గారూ..
  మంచి టపా..!
  యక్ష ప్రశ్నలతో విసిగించకు అంటూ ఉంటారు కదా.. అవి కూడా చొప్పదంటు ప్రశ్నల టైపులో ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నాను. వీటి వెనకాల ఇంత కథ, చక్కని పరమార్ధం ఉందని తెలీనే లేదు నాకు ఇప్పటి దాకా :(

  ReplyDelete
 6. బాగుంది మీ పోస్ట్ ... ఇవన్ని అప్పుడెప్పుడో ఏదో సినిమా లో చూసా... మల్లి ఇక్కడ చదివా ఇప్పుడు... మంచి టపా :)

  ReplyDelete
 7. @ మురళి గారు ,ఒక్కోసారి అజ్ఞానమే ఆనందం అనిపించినా ........అందులోనే ఉండిపోం కదండీ .నచ్చినందుకు ధన్యవాదాలు .

  @ విజయ మోహన్ గారూ !భగవంతుడ్ని చేరే దగ్గరి దారి ధర్మాచరణమే కదండీ ....ధన్యవాదాలు .

  @ పద్మార్పిత గారు , థాంక్సండీ .

  @ శృతి గారు ,సమాధానాలు ధర్మరాజేప్పుడో చెప్పేశాడు కదా ....ఈసారి వేరే పోస్టులో పొడుపు కధలు రాస్తాను అప్పుడు ఫస్ట్ చాన్స్ మీకే ..........ok

  @ సుబ్బారెడ్డి గారూ ! భారతంలోని పాత్రల ప్రవృత్తిని ఎంత చక్కగా విశ్లేషించారు సర్ ! ధన్యవాదాలు .

  @ మధురవాణి గారూ ! చాలామంది మీలాగే అనుకుంటారు కానీ అప్పటి ఇంటర్వ్యులో ఐక్యు కి సంబందించిన ప్రశ్నలతో పాటు ,మానవ జీవితాన్ని ఆదర్శ ప్రాయం గా గడిపేందుకు ఆచరణ యోగ్యమైన ధర్మాన్ని గురించి కూడా అడిగి నట్టు , మొత్తం 72 ప్రశ్నలు యముడు అడిగినట్టుగా చెప్పబడుతోంది .ధన్యవాదాలండీ .

  @ చైతన్య గారు , సినిమా లోనే కాదు చిన్నప్పుడు తెలుగు ఉపవాచకాల్లోను , స్నేహితులు అడిగిన వాటిలోనూ .....ప్రాణ మున్నా కదలనిది , కళ్లు తెరిచి నిద్రపోయేది , రూపమున్నా హృదయం లేనిది ........సరదా ప్రశ్నలు ...గుర్తొచ్చాయా ?ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలేనండీ .నచ్చినందుకు థాంక్స్ .

  ReplyDelete
 8. "ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే , ఏమి మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో ....తాను ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించకుండా ఉండువాడు సజ్జనుడు". నాకు మనసులో బలంగా నాటుకొన్న మాటండి ఇది. యండమూరిగారి పుస్తకంలో చదివాను. "ఇతరులు ఏ పని చేస్తే తనకు నచ్చదో అదే పనిని తాను చేసే వాడు ప్రపంచంలో అందరికంటే నికృష్టుడు". (యధాతథంగా కాక పోయినా దాదాపుగా ఆయన మాటలు ఇవి.) నాకు బాగా నచ్చిన వాక్యాల్లో ఇదొకటి.

  ReplyDelete
 9. మంచి పోస్టు. బాగుంది. మనం అప్పూడప్పుడూ ఇలాంటివి గుర్తుకు చేసుకోవడం చాలా అవసరం. నాకు బా...గా... నచ్చిన ప్రశ్న, జవాబు
  ధైర్యం అంటే - ఇంద్రియ నిగ్రహం :)

  ReplyDelete
 10. హాయ్ పరిమళం గారు ,నిజంగా మనం అప్పుడప్పుడు ఇలాటివి గుర్తుచేసుకోవాలి ,బావున్నాయండి .
  మీ బ్లాగ్ ఓపెన్ చేయగానే కనబడే పూలు మతిపోయేట్లు చేస్తాయి ,వేప పూలు అనుకున్న,,కాని కాదు ,ఈమద్య ఎటువేల్తోన్న అవి కనువిందు చేస్తున్నై ..వాటి పరిమళం తో అవి ఉన్న దిక్కు చూసేట్లు చేస్తున్నై ,.....అచ్చం మీ బ్లాగ్ లానే,నిజం .

  ReplyDelete
 11. @ పిచ్చోడు గారూ ! అది కనీస మానవ ధర్మం ....పాటిస్తే ఎవరూ , ఎవరివల్లా బాధించబడరు . ధన్య వాదాలు .

  @ ప్రేమికుడు గారూ ! పోస్ట్ నచ్చినందుకు ధన్య వాదాలండీ .

  @ చిన్ని గారూ ! నా అక్షరాల పరిమళాలు ఎలా ఉన్నా , పూల పరిమళాలు చూసైనా బ్లాగ్ లోకి విచ్చేసిన వారు నిరాశ పడకుండా ఉంటారని స్వార్ధం తో పెట్టుకున్న టెంప్లేట్ .ఈ రహస్యం ఎవరికీ చెప్పకండేం.నచ్చినందుకు థాంక్స్ .

  ReplyDelete
 12. ఈ పురాణాల వాళ్ళు ఎప్పుడూ ఇంతే .. ఏదీ తిన్నగా చెప్పరు. సుఖానికి ఆధారం శీలం ఎలాగైందబ్బా? ఈకాలంలో నీ కులవృత్తి మాత్రం చేసుకుంటూ ఉంటే అదే నీ తపస్సు అంటే ఎవడా మాట వింటాడు?

  ఇక్కడ కామెంటిన పలువురు .. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో .. సూత్రాన్ని బాగా మెచ్చి్నట్టున్నారు. మీరే కాదు, అనాదిగా ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక మానవులు ఈ సూత్రాన్ని ఆచరింఛదగిన సూత్రంగాభావిస్తూ వచ్చారు. అనేక ప్రపంచ మతాల ప్రవచనాల్లో ఇది అంతస్సూత్రంగా నిలుస్తూ వచ్చింది. దీన్ని బంగారు సూత్రం (golden rule) అంటారు.

  ReplyDelete
 13. @ కొత్తపాళీ గారూ ! ఇవన్నీ ద్వాపరయుగంలో ఆనాటి వ్యక్తులు ఆచరించాల్సిన ధర్మాలుగా చెప్పబడ్డాయి .ధర్మం అనేది యుగాన్ని బట్టి మారుతుందంటారు .ఈ కలి యుగం లో అన్నీ పాటించలేక పోయినా ....కనీసం ఇతరులను బాధపెట్టకుండా ఉండగలం కదా !కొంతమందికి అదికూడా ఆచరించడం అసాధ్యమైపోతోంది .బంగారు సూత్రం లింక్ ఇచ్చినందుకు ధన్య వాదాలు .

  @ నేస్తం గారూ ! థాంక్స్ .

  ReplyDelete
 14. మరణంపై కూడా ఒక ప్రశ్న ఉండాలే. అది ఏమయ్యిందబ్బా?
  యక్షప్రశ్నలన్నింటిలోనూ అత్యుత్తమమైన ప్రశ్న మరణం మీద ఉన్న ప్రశ్నే అంటే అతిశయోక్తి లేదేమో

  యక్షప్రశ్నల గురించి రాసినందుకు అభినందనలు

  ReplyDelete
 15. @ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారూ !మీరు చెప్పింది .....ఏది ఆశ్చర్యం ? అన్నప్రశ్నకు ధర్మరాజు ఇచ్చిన సమాధానం ...ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండటం చూస్తూ కూడా మనిషి తాను శాశ్వతంగా ఈ భూమ్మీద ఉండిపోతాననుకోవడం ....ఇదేనాండీ ? ధన్య వాదాలండీ !

  ReplyDelete
 16. చక్కని మాటలు అందించారు. పాటిస్తామో లేదో కానీ కనీసం తెలుసుకుంటున్నాము. good post

  ReplyDelete
 17. @ జీడిపప్పు గారూ !పోస్ట్ నచ్చినందుకు ధన్య వాదాలండీ .

  ReplyDelete
 18. అవునండీ ఆ ప్రశ్నే.

  ReplyDelete
 19. ఇలాంటి ప్రశ్నలు జవాబుల వలన మానవులలో తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది

  ReplyDelete
 20. ఇలాంటి మంచి మాటలు వలన మన జీవితం అనేది గొప్ప సందేసంగా మారుతుంది. చాలా మంచి మాటలు అందించినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete