Sunday, February 15, 2009

పదిలంగా అల్లుకున్నా........


అనగనగా ఓ చిన్న పల్లెటూరు .అక్కడో పాత కాలపు లోగిలి .చుట్టూ చక్కటి పూదోట .మల్లె ,జాజి ,మందారం ,నందివర్ధన ,గులాబి ,నిత్యమల్లి ,కనకాంబరాలు,బంతులూ ,చామంతులూ .........ఒకటేంటి విభిన్న సంస్కృతులు కలిసుండే భారత దేశం లాంటి తోట .పెరడు నిండుగా కాసే కూరగాయలు ,ఆకుకూరలూ .....

ఆ ఇంట్లో ఓ ముచ్చటైన కుటుంబం .భార్య ,భర్తా ,పాప ,బాబు .ప్రతిరోజూ గుడి మైకులో వినిపించే సుప్రభాతమే అలారం .జోడెద్దుల చిరుగంటల సవ్వడే మేలుకొలుపులు .ప్రతీ ఉదయమూ శుభోదయమే .....పాలేరు అప్పుడే తీసి తెచ్చిన చిక్కటి పాలతో ,శ్రీవారికి కాఫీ ,పిల్లలకు బూస్టూ ......తర్వాత మామూలే పిల్లలేమో స్కూలుకు ,శ్రీవారేమో పొలానికి వెళ్ళిపోయాక వంటలూ వార్పులూ , అవయ్యాక ఇరుగు పొరుగులతో ముచ్చట్లూ ,అష్టా చమ్మ ,వైకుంఠ పాళీ ఆటలూ .....

సాయంత్రానికల్లా గూటికి చేరిన పక్షుల్లా ఇంటికి చేరిన పిల్లల అల్లరీ ,శ్రీవారి ముచ్చట్లతో ఆ ఇల్లాలికి పొద్దే తెలియని సందడి .ఆరోజు స్కూల్ విశేషాలు ఒకరితో ఒకరు పోటీపడి చెప్పే పిల్లల కబుర్ల మధ్య భోజనాలు .ఇక హోం వర్క్ అయిన దగ్గర్నుంచీ కేరమ్స్ ,చెస్ ,చైనీస్ చక్కర్ ...ఇలా ఏదొక ఆట....ఆతర్వాత 9 -9.30 కల్లా నిద్ర .

ఇక పౌర్ణమి వస్తే చాలు ఆరుబయట సన్నజాజి పందిరి పక్కన (పున్నమి రోజు పూలు కోయని జాజి పందిరి చూశారా ?చంద్రుడు లేని ఆకాశంలా ఉంటుంది నక్షత్రాల్లా విరగ పూసిన పూలతో ) చాపవేసుకుని చల్లని రేయి జాజిపూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ పెరుగన్నంలో వెన్నెల కలుపుకొని ,చందమామ కుళ్ళు కునేలా నలుగురూ ఒకే కంచంలో తినడం అదో అద్వైతం (అనొచ్చా ?) . ఆ తర్వాత అంత్యాక్షరి ....ఇద్దరిద్దరొక గ్రూపు .అందులో ఎవరికి ముందు 'మ ' వచ్చినా అందరూ కలిసి పాడే పాట మేడంటే మేడా కాదు ,గూడంటే గూడూకాదు, పదిలంగా అల్లుకున్నా పొదరిల్లూ మాదీ .......
ఇలా ఎంతో ప్రశాంతంగా ,ఆనందంగా జీవించే వారి జీవితాల్లోకి ......హఠాత్తుగా వచ్చేసింది ....
టెక్నాలజీ .....ముందుగా t.v .తర్వాత పిల్లలకు పోటీ పరీక్షలంటూ పట్నానికి వలస .సెల్ ఫోన్లూ ,కంప్యుటర్ లూ ....
పూర్వం రాణివాసంలో స్త్రీలని అసూర్యంపస్యలు (అంటే సూర్యకాంతి సోకని వారు ) అనేవారు .ఇప్పుడు అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంటులలో ఉండే వారందరూ అసూర్యంపశ్యలె .ఇక కబుర్లూ లేవు ,ఆటలూ లేవు ,వెన్నెల రాత్రులు లేవు .ఇంటికి చేరాక ఒకరు t.v తో మరొకరు కంప్యుటర్ తో ,మిగిలిన టైము సెల్ లో మాట్లాడుతూ .....అంతా యాంత్రిక మయం .
అసలు మనిషి తనవాల్లనుండే కాదు తననుండి తానే దూరమై టెక్నాలజీ కి దగ్గరౌతున్నాడేమో అనిపిస్తుంది .టెక్నాలజీ మనిషికి సౌకర్యాన్నిచ్చి ఉండొచ్చు .కాని మనుషుల్ని దూరం చేసేంత గా మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చేస్తోందన్న మాట చేదుగా ఉన్నా నిజం .అందుకే మనం కూడా ప్రతి దానికీ ఒకరోజు పెట్టుకుని అనుబంధాల్ని గుర్తు చేసుకునే సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం .టెక్నాలజీ ని ప్రేమించే రోజుల్నించి , తిరిగి మనుషుల్ని ప్రేమించే రోజులు మళ్ళీ వస్తాయని ,రావాలని కోరుకుంటూ .......

* పైన చెప్పిన ఫామిలీ మాదే .మానవ సంబంధాలు కనుమరుగై పోతాయేమోన్న ఆవేదన తప్ప టెక్నాలజీని తక్కువ చేసినట్టు భావించొద్దని మనవి .

15 comments:

 1. చాలా చక్కగా రాశారు. నా చిన్నతనాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు మా పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పినా వాళ్ళకి టి.వి కార్టూన్ నెట్ వర్క్ ఆకర్షించినంతగా ఇవి రుచించటము లేదు. వాళ్ళకు ఏమి పోగొట్టుకుంటున్నారో కూడా పెద్దవాళ్ళైనా తెలియదనుకుంటా

  ReplyDelete
 2. మా అందరి జీవితాలు కూడా ఇలానే మారిపోయాయి. మా చిన్నప్పుడు మా అమ్మ,నేను ఒక వైపు, నాన్న అక్క ఒక వైపు ఉండి క్యారమ్స్ ఆడేవాళ్ళం. ఆ రోజులింక రావు.

  ReplyDelete
 3. మీ ఫామిలి కి మా అభినందనలు !!!
  టి.వి , సెల్ల్ ఫొన్ ,కంప్యుటర్ లేని జీవితం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు.
  మన పిల్లలకి మన చిన్ననాటి జీవన విధానము చెప్పి, రుచి చూపించాల్సిన భద్యత మన మీదే వుంది.

  ReplyDelete
 4. తప్పకుండా వస్తాయి.. మనం కోల్పోతున్నదేమితో తెలుసుకున్నాం కాబట్టి, దానిని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నాలనూ ప్రారంభిస్తాం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయనే అనిపిస్తోంది. మంచి టపా.

  ReplyDelete
 5. కొత్తొక వింత, పాతొక రోత అని మనమే కొత్త కొత్త టేక్నాలజీల వైపు పరిగెత్తి పిల్లలకి కార్టూన్ లు, కంప్యూటర్ గేంస్ అంటూ అలవాటు చేస్తున్నాము. లేకపోతే వాళ్ళకి అవేవీ తెలియవు కదా, అలా అని వాళ్ళని కొత్తదనం తెలియని చీకటి రోజుల్లో ఉంచమని కాదు.

  నా మటుకు నేనైతే, పౌర్ణమి రోజుల్లో డాబా మీదే వెన్నెల్లో భోజనాలు, మేడ మీద నడుస్తూ నూరు కట్ల పిశాచం కథలు, చాప వేసుకుని డాబా మీద పడుకుని చుక్కలని చూస్తూ చిన్ననాటి కబుర్లు చెప్పుకోవటం, ఆపాత మధురాల్లాంటి పాటలు పరిచయం చెయ్యటం, ప్రతి వారం నలుగు పెట్టి కుంకుడుకాయతో స్నానాలు, యేడదికి ఒక సారి పల్లెటూరిలో విహారాలు (పేడ నీళ్ళ కళ్ళాపి, గిలక బావి, డేగిసాల్లో వేణ్ణీళ్ళు కాచటాలు మొదలైనవి అన్నమాట)

  గొప్ప కోసం కాదు ఇవన్నీ చెప్పింది, చిన్నతనం నుండీ ఇవన్నీ పరిచయం చేస్తే తర్వాత అయ్యో మంచి మంచి క్షణాలు చేజారిపోయాయే అని బాధ పడనవసరం రాకపోవచ్చు అని చెప్పటమే నా ముఖ్యోద్దేశం

  ReplyDelete
 6. వ్యవసాయ కుటుంబం కాదుగానీ మా చిన్నప్పుడు మా వుళ్లొ అలాగే ఉండేది. మీ వూరి పేరుకూడ చెపితే బాగుండేది. :)

  ReplyDelete
 7. మీ పరిమళాన్ని మొదటి సారి ఆఘ్రాణిస్తున్నాను.అమర కవి కౌముది అన్నట్లు "చావంటె ఎందుకు భయం బ్రతుకన్నది శాశ్వతం కాదు కదా,కాక్ పోతే బతికినంతకాలం పరిమళభరితంగా బతకడం. చుట్టు పరిమళ భరితంగా వుంచడం" మీటపాలో ఆపరిమళం నాక్కనిపించింది.
  -సుబ్బారెడ్డి

  ReplyDelete
 8. చదవడానికే ఇంత బాగుందికదా!!
  మళ్ళీ ఆరోజులు వస్తే ఇంకెంత బాగుంటుందోకదా!!

  ReplyDelete
 9. మీ బ్లాగు చాలా బాగుంది. కానీ పైన అడ్డంగా ఉన్న బ్లూ కలర్ నావిగేషన్ బార్ ను తీసివేయండి. ఇంకా బాగుంటుంది. అదెలా తీసివేయాలో నా బ్లాగు http://superblogtutorials.blogspot.com/

  లో ట్యుటోరియల్స్ పెట్టాను చూడండి.

  ReplyDelete
 10. @ భాస్కర రామి రెడ్డి గారూ !టపా మీకు నచ్చినందుకు ధన్యవాదములండీ .

  @ murali గారూ !లైఫ్ బిజీ ఐన కొద్దీ చిన్నచిన్న సరదాలు కూడా దూరమై పోతున్నాయండీ .థాంక్స్ .

  @ రమణ గారూ !టి .వి ,కంప్యూటర్ ,సెల్ ....ఇవన్నీ వుండకూడదని కాదండీ .మనుషులతో కంటే వాటితోనే ఎక్కువ అనుబంధం ఏర్పరుచుకుంటే మానవ సంబంధాలు దూరమైపోతాయేమో అని .టెక్నాలజీకి వ్యతిరేకిని కాదు .ఒకప్పుడు లేని ప్రిజ్ లు ,మిక్సి లు ,గ్రైండర్ లు వచ్చాయి .ఇవన్నీ ఉపయోగించి తక్కువ సమయంలో పనులు ముగించి ,ఎక్కువ సమయం కుటుంబం తో గడపటానికి వీలవుతోంది .టెక్నాలజీ ఎంత అవసరమో .....ప్రేమ ,ఆప్యాయతలు అంతే అవసరం లేకపొతే మనకూ రాబోట్ కి తేడా వుండదు .మీ స్పందనకు కృతజ్ఞతలు .

  @ మురళి గారూ !మీరు చెప్పింది నిజం .అందుకు మన తెలుగు బ్లాగులే ఉదాహరణ .భావాలు పంచుకోవడం ప్రారంభమైతే అనుబంధాలు పెంచుకోవడం మొదలౌతుంది .థాంక్స్ .

  @ లక్ష్మి గారూ !పిల్లలకు చక్కటి బాల్యాన్ని అందిస్తున్నారు .అభినందనలు .టీనేజ్ వచ్చాక పిల్లల మీద స్నేహితుల ప్రభావమే ఎక్కువ వుంటోంది .మనం మంచికోసమే అన్నిటికి దగ్గర చేస్తాం .కాని వారు అతి గా వినియోగించడాన్ని నియంత్రించ లేక పోతున్నాం .అన్నటు ఇప్పుడు పల్లెలు కూడా రూపురేఖలు మార్చేసుకున్నాయండోయ్. మండువా లోగిళ్ళ అచ్చట్లూ , రచ్చ బండ దగ్గర ముచ్చట్లూ ఇప్పుడు లేవు .ఎవరింట్లో వాళ్లు టి .వి లకి అతుక్కుపోతున్నారు . ఇంట చక్కగా కామెంట్ రాసారు .సంతోషమండీ .

  @ సమీహ గారూ !ధన్యవాదాలండీ .మాది తూర్పు గోదావరి జిల్లాలో ఓ కుగ్రామం .

  @ సుబ్బా రెడ్డి గారూ !స్వాగతమండీ ....నా అక్షర పుష్ప పరిమళాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .

  @ పద్మార్పిత గారూ !నా కోరికా అదేనండీ ........

  @ మహి గారూ ! బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలండీ . నావిగేషన్ బార్ తీసేయటానికి ప్రయత్నిస్తాను .మీ సూచనకు థాంక్సండీ .

  ReplyDelete
 11. nannu chusi meeru nerchukovadamemtamdi baabu. mee daggare nenu nerchukovaalsinavi chaala unnayi.

  oka vishayamlO nenu baadapadanakkaraledamdi. ippatiki memu meeru cheppinatlu technologyni takkuva cheyakumdaa prakrutilo bhagamai anubhootulu pamchukumtumnnaamu.

  nice post.

  ReplyDelete
 12. @ శృతి గారూ !అంత లేదండీ .Thatis your modesty!బంధాల్ని పదిలంగా అల్లుకుంటున్న మీకూ అభినందనలు .

  @శ్రీధర్ గారూ ! ఆదిత్య 369 లాగానా! :)

  ReplyDelete
 13. ఎంత అందం గా చెప్పేరండి... ఒక చిన్న ఇల్లు చుట్టూ చిన్న తోట........ అ తోట లో ఒక కలల ప్రపంచం... బాగుంది అండి... ప్రొద్దుటే నిద్ర లేపే చిట్టి గువ్వలు రాత్రి కి జోల పాడే జాజి తావి.. చాలా బాగుంది అండి.. చిన్నతనం అమ్మ ఒడి లో కలలనుంచి కన్నె పిల్ల గా జాజి పందిరి కింద కన్నకలలవరకు కంటి ముంది పరచిన మీ పోస్ట్ కు ఎంతో కృతజ్నతలు..

  ReplyDelete
 14. భావన గారూ !స్వాగతం .మీ కామెంట్ తో నా బ్లాగ్ ని పరిమళింప చేసినందుకు ధన్యవాదాలు .

  ReplyDelete