
కోపాన్ని ధ్యానంతో జయించేద్దాం..అని నిర్ణయించుకున్నా కదండీ ..ఇక ధ్యానం ఎలా చేయాలో నాకు తెలిసింది చెపుతా! పద్మాసనంలో కూర్చొని చూపుడు వేలు , బొటనవేలు కలిపి చిన్ముద్రలో ఉండి కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో అదేనండీ నుదుటి మధ్య ఉంచి ధ్యానం చేయటం...రెండు సుఖాసనంలో కూ
ర్చుని రెండుచేతుల వేళ్ళూకలిపి ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళటం ! మొదటిది నావల్ల కాదు కాబట్టి రెండోదానికే డిసైడ్ అయ్యాను .
ఇక ఎప్పుడు ప్రారంభించాలి ?ధ్యానం అంటే ఉదయాన్నే సూర్యోదయ వేళలో చేస్తే మంచిది అంటారుకనుక ఆదివారం కుదరదు ఎందుకంటే హరిహర బ్రహ్మాదులు వరమిస్తానన్నా ఓ గంటాగికోరు
కుంటా స్వామీ...అనేసి ముసుగు పెట్టేస్తా మరి !కాబట్టి ప్రతి ఆదివారం ధ్యానానికి సెలవు ఇచ్చేశా ! ఇక శనివారం..వద్దు మనకసలే ద్వితీయవిఘ్నం సెంటిమెంటు. మంగళవారం ఏపని మొదలు పెట్టినా సాగదని అంటుంది అమ్మ కనుక వద్దు!ఇన్ని ఆలోచించి ఓ శుభదినం డిసైడ్ చేసుకొని ముందురోజు రాత్రి ..తెల్లవారుఝామున ఆరు గంటలకే సెల్ లో అలారం పెట్టుకొని ....పొద్దున్నే కాఫీపట్టుకొచ్చేయకండి నేను ధ్యానం పూర్తయ్యేవరకూ తాగను...ఈలోపు షేవింగు గట్రా ...మీ పనులు పూర్తిచేసుకోండి అని శ్రీవారికి
స్ట్రిక్ట్ గా ఇంచుమించు వార్నిం
గ్ లాంటిది ఇచ్చి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ...ఈనాడే ఎదురౌతుంటే ఇంకా తెలవారదేమి..ఈ చీకటి విడిపోదేమి అని పాడుకుంటూ నిద్రకుపక్రమించా!
ఆరుగంటలకు అలారం మోగినట్టుంది...అదేం రింగ్ టోనోనండీ అసలు మోగినట్టే తెలీలేదు.మా ఇంటాయనకి మెలకువ వచ్చేసిందట కాని నన్ను లేపే రిస్క్ చేయలేకపోయినట్టున్నారు పాపం! అది రెండోసారో మూడోసారో రిపీట్ అవుతుండగా మెలకువ వచ్చి చూస్తె ఆరున్నర ! ఛీ మొదటిరోజే లేటా అనుకొని ఐనాసరే ఈరోజే మొదలుపెట్టాలి అనిఘాట్టిగా అనుకొని
లేచి కూర్చున్నా! ఇంతకూ ధ్యానం బ్రష్ చేసుకొని చేయాలా ...లేకపోతె లేవగానే చెయ్యాలా ??? ప్చ్ ..ధ్యానం పవిత్రమైనకార్యం ...కాఫీతాగటంలాగా మొహం కడుక్కూకుండా చేయ
కూడదు.( ఇంతకూ కాఫీ క్షుద్రమైనదంటారా?) చకచకా మొహం కడిగేసి సుఖాసనంలో కూర్చున్నాక మరో సందేహం ....ధ్యానానికి ముందు ఓంకారం చేయాలా ..అప్పుడెప్పుడో నేను యోగా క్లాసులకు వెళ్ళే రోజుల్లో టీచర్ చెప్పినట్టు గుర్తు! సరే మూడుసార్లు ఓంకారం పూర్తిచేసి ...కళ్ళుమూసుకొని కూర్చున్నాక మళ్ళీ ఓ డౌటు ఒకవేళ పదినిముషాలకు ధ్యానంలోంచి బైటకు రాకపోతే ....పూర్తిగా ధ్యానంలో నిమగ్నమైపోతే ...ఈయన కదిలిస్తారన్న నమ్మకం లేదు కాబట్టి సెల్ తెచ్చుకొని పదినిముషాల తర్వాత మోగేలా అలారం సెట్ చేసు
కొని మళ్ళీ కళ్ళుమూసుకున్నా!
ధ్యానం మొదలు పెట్టాక ఏమీ ఆలోచించకూడదు....అన్నట్టు నిన్న పేపర్అబ్బాయి మాకు వేయాల్సిన ఈనాడుకు బదులు ఎవరికో వేయాల్సిన ఆంధ్రజ్యోతి వేశాడు ఈరోజు కూడా అలాగే చేస్తాడేమో బహుశా కొత్త అబ్బాయేమో ఈయనకు చెప్పి ఉండాల్సింది...ఛీ ఇదేవిటీ ..ఏం ఆలోచించకూడదు ...నా దృష్టంతా రెండుకనుబోమ్మల మధ్య కాన్సంట్రేషన్ చెయ్యాలి...ఎండ వచ్చేటట్టుంది ఈరోజు వాషింగ్మిషన్ వెయ్యాలి ..ప్చ్ ...దృష్టి ...అదేంటి ఈయన్ని కాఫీ అప్పుడే వద్దన్నానుకదా ..మరి అదేంటి కాఫీ కప్పుతో ఆర్తి అగర్వాల్ వచ్చేస్తుంది !! ఓహో ..ఆ ముందురోజు ఏదో లోకల్ చానెల్లో అనుకుంటా పూర్తిగా చూస్తానని నా ఫ్రెండుతో పందెం వేసి మరీ
చూసిన మెంటల్ కృష్ణ సినిమాలో సీనది. పందెం ఓడిపోయాను కాని ఈ సీను నన్ను వదలకుండా వెంటాడుతుందన్న మాట!పోసాని కృష్ణమురళి సినిమానా మజాకా !ఛీ ఛీ ఇలాంటివి మనసులోకి రానివ్వకూడదు ...మరింత ఘాట్టిగా కళ్ళుమూసుకున్నా....
చాకలి ఇస్త్రీ బట్టలు తేలేదు లోపలిబీరువాలోది ఒక జత తీసి
పెట్టి కూర్చోవాల్సింది నేను ప్చ్...ఏం వేసుకుంటున్నారో ..అసలే లేటుగా మొదలుపెట్టాను...టిఫిన్ చేయటానికి టైం సరిపోదేమో ..హమ్మయ్య ఫ్రిజ్ లోబ్రెడ్ఉంది బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే సరి!ఆఅయ్...దృష్టి తప్పుతోంది ...కాన్సంట్రేట్ బుజ్జీ ...కాన్సంట్రేట్ ...అవునూ చాలా సేపయింది కదా ఇంకా పదినిముషాలు కాలేదా ...లేక నాకు వినపడలేదా ...అనుమానం కాసేపటికి పెనుభూతమైంది...ఐనా మొదటి రోజు కదా కొద్దిసేపు చే
సినా చాలు అనుకొంటూ కళ్ళుతెరిచి టైం చూసి షాకయ్యా...అప్పటికింకా నాలుగునిముషాల ఇరవై సెకన్లుమాత్రమే అయ్యింది.
ఐనా పర్లేదు మొదటిరోజు కదండీ...అన్నప్రాశన రోజే ఆవకాయ తినగలమా...ఈరోజుకిది చాలు.రేపు పొద్దున్నే లేచి పర్ఫెక్ట్ గా చేద్దాం. అ రోజంతా బాగా ఆలోచించా వేరే ఆలోచనలు మనసులోకి రాకుండా ఏం చెయ్యాలా అని! ఐడియా....నాది వోడా ఫోనేనండి ఐనా ఈ ఐడియా నా ధ్యానాన్ని మార్చేస్తుంది చూడండి. పడుకొనేముందు సెల్ లో అలారం రింగ్ టోన్ మార్చి
సౌండ్ లౌడ్ లో పెట్టుకొని తలదగ్గరే ఉంచుకున్నాను.
అలారం మోగగానే లేచి బ్రష్ చేసేసుకొని ధ్యానానికి సిద్ధమైపోయా...డివిడిలో ఓం చాంటింగ్ పెట్టుకొని( నిన్న నాకొచ్చిన గుడ్ ఐడియా ఇదే) సోఫాలో చేరాను. నిటారుగా కూర్చోవడం కష్టంగా ఉండి కాన్సంట్రేషన్ దెబ్బతుంటుంది అదే రిలాక్స్డ్ గా ఉంటే ఆ ప్రోబ్లం ఉండదు కాబట్టి సోఫాలో శవాసనంలో ధ్యానం చే
యటం ద్వారా అందరికీ ఓ కొత్త కోణం చూపిద్దాం..అనుకుంటూశవాసనంలో కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో కేంద్రీకరించి...ధ్యానం ప్రారంభించా...ఆహా ..ఎంత ప్రశాంతంగా ఉంది...ఇహపరమైన ఆలోచనలు ఏమీ రావట్లేదు ....అనుకొంటూ ధ్యానంలో నిమగ్నమైపోయా!........
బుజ్జీ....
బుజ్జీ ....
ఎక్కడో లోయలోనుండి వినపడుతోంది ఎవరిదా గొంతు.....
ఎవరో గట్టిగా భుజాలు పట్టి కుదుపుతున్నారు..
ఎవరు ?
ఎవరు నా ధ్యానాన్ని భగ్నం చేసింది...
కళ్ళుతెరిచి చూసేసరికి ...
ఎదురుగా ఈయన !
బుజ్జీ టైం ఎనిమిదైంది...
ఇక్కడ పడుకున్నావేం?
నాకు టైం అయిపొయింది టిఫిన్ బైట చేస్తాలే తలుపేసుకో....
అంటూ ....
అలా నాధ్యానం ద్వితీయ విఘ్నం కాకుండా పూర్తయింది.
మీరూ ట్రై చెయ్యండి చాలా ప్రశాంతంగా ఉంటుంది...
నేను చెప్పిన పొజిషన్ లో నేను చేసినట్టు చేస్తే ఎన్ని గంటలైనా ధ్యానం కాన్సంట్రేషన్ తో చెయ్యొచ్చు.....
కనుక మిత్రులారా ధ్యానం చేయండి కోపాన్ని జయించండి.