Monday, February 22, 2010

అవును...ఈ అబ్బాయి చాలా మంచోడు .....


పై పేపర్ క్లిప్పింగ్ చూశారుకదా..మొన్న శనివారం (20 వ తేదీ) హైదరాబాద్ ఎడిషన్ లో 10 వ పేజీలో వచ్చింది. ఆరోజు గెస్ట్ లు వచ్చిన కారణంగా బిజీగా ఉండి పేపర్ చూడలేదు. నిన్న నా ఫ్రెండ్ చూసి ఇతను అతనే కదా అంటూ చూపిస్తే ..అప్పుడు చూశాను. అప్పుడెప్పుడో పేపర్ క్లిప్పింగ్ లో చూసిన ముఖం ! గొంతు పరిచయమే కాని ఆ పేపర్ క్లిప్పింగ్ లేకపోతే గుర్తుపట్టలేక పోయేదాన్ని! స్ఫూర్తి కాలమ్ లో రాసిన అతని జీవిత కధ నిజంగా స్ఫూర్తివంతం....యువతకు ఆదర్శం.

2005 సెప్టెంబర్ పద్నాలుగు (నిజానికి నాకు గుర్తులేదు ఆపక్క క్లిప్పింగ్ చూస్తేగాని :) ) ఈనాడు లోకల్ ఎడిషన్లో ఓ పక్కన చూసాను ఒక న్యూస్. దశరథ్ అనే అబ్బాయి కష్టపడి డిగ్రీ పూర్తిచేశాడని MCA లో సీటు వచ్చిందని ఆర్ధిక ఇబ్బందులవల్ల ఫీజ్ కట్టలేక పోతున్నాడని క్లుప్తంగా దాని సారాంశం ! అందరిలాగే స్పందించి నేనూ ఏదో నాకు తోచిన చిన్న మొత్తాన్ని పంపించాను . ఇలా చాలా సార్లు చేస్తూ ఉంటాం...ఆవెంటనే మర్చిపోతూ ఉంటాం..కాని మొదటిసారి నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఉత్తరం వచ్చింది . అది దశరథ్ దగ్గరనుండి .

అది ఒక్కటే ఐతే ఈ అబ్బాయి గురించి ఈ టపా ఇలా రాసేదాన్ని కాదేమో ! ఫీజులు కట్టి ఎంతో శ్రద్ధ తీసుకొని మనం స్కూళ్ళకి ..కాలేజీలకి ..పంపించే పిల్లలు బాధ్యతగా వారి ప్రోగ్రెస్స్ మనకు చూపిస్తారో లేదో గాని దశరథ్ మాత్రం తన ప్రతి సెమిస్టరు ఫలితాలు జిరాక్స్ తీసి నాకు పంపిస్తూ ఉండేవాడు. నేను పంపించిన చిన్న మొత్తానికి అతడు అంతబాధ్యతగా పంపించడం నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉండేది. అంతేకాదు ప్రతి పండుగకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతాడు ఇప్పటికీ ...తనకి బెంగుళూరులో జాబు వచ్చినప్పుడు కూడా అపాయింట్మెంట్ లెటర్ కాపీని పంపించాడు.
పోయిన సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు నా మేనల్లుడికి యాక్సిడెంట్ ఐతే ...తను విష్ చేసినప్పుడు నేను తిరిగి మనస్పూర్తిగా విష్ చేయలేక విషయం చెప్తే తర్వాత కొద్దిరోజులకు మళ్ళీ ఫోన్ చేసి యాక్సిడెంట్ ఐన బాబు బావున్నాడా అమ్మా...అంటూ పలకరించిన విషయం నేనెప్పటికీ మర్చిపోలేను .

ఇటువంటి అబ్బాయి ...ఒకప్పటి కష్టాల కడలికి ఎదురీది చదువుకొని ఈరోజు తాను మంచి ఉద్యోగం సంపాదించుకోవటమే కాకుండా తనలాంటి వారికి తనకు చేతనైన సాయం చేయాలన్న సంకల్పంతో ...నలుగురు సభ్యులతో ఓ టీమ్ ని తయారుచేసి పేద విద్యార్ధులకు అండగా నిలబడుతున్నాడని తెలిసినప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది . తన జీవితాన్ని చక్కదిద్దుకోవటమే కాకుండా తనలాంటివారికి మార్గదర్శిగా...స్ఫూర్తి ప్రదాతగా ఉన్న ఈ అబ్బాయి చాలా మంచోడే ..కదూ !

తాను పైకొచ్చినా ఎక్కిన మొదటిమెట్టునుకూడా గుర్తుపెట్టుకొనే దశరథ్ ఇంకా ఎంతో మంచి స్థాయికి రావాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నా ...ఎప్పుడూ తను లాండ్ నెంబర్ కి ఫోన్ చేయటం వల్ల ప్రత్యేకంగా తన నెంబర్ అడగక పోవడంవల్ల నాకు స్వయంగా అభినందించే అవకాశం లేకపోయింది. అందుకే నా ఆనందాన్ని బ్లాగ్ మిత్రులందరితో పంచుకోవడంతో పాటు దశరథ్ కి హృదయపూర్వక అభినందనలు బ్లాగ్ ముఖంగా తెలుపుతున్నా ...నా అభినందనలు అతనికి అందకపోయినా మీ అందరి ఆశీస్సులు తప్పక అందిస్తారుకదూ !

40 comments:

  1. ధశరథ్ కి మా అభినందనలు , బెస్ట్ విషెస్ తెలియచేయండి .

    ReplyDelete
  2. ముందు మీరు అభినందనలు అందుకోండి!ఇలాంటి సహాయ కార్యక్రమాలకు మీరూ ముందుంటారన్నమాట. చాలా సంతోషం?!

    చదువుకోసం సహాయం చేయడానికి ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకోవాల్సిందేననిపిస్తుందండీ! తల్లి దండ్రులు వేల కొద్దీ ఫీజులు కట్టినా వాటికి న్యాయం చేయని పిల్లలెందరో ఉంటారు.

    ఇటువంటి ఆణిముత్యాలకు పెట్టిన ఖర్చే నిజంగా సద్వినియోగం!

    తప్పకుండా దశరధ్ ఇంకా గొప్ప వాడవుతాడు.

    మీరెంత మంచి మనసుతో పంపారో ఆ మొత్తం, ఈ రోజు ఇంత తీయని వార్త మీకు తెలిసింది.
    దశరధ్ కీ మీకు మరోసారి అభినందనలు!

    ReplyDelete
  3. Very well done ma'am.
    I appreciate your kind-heartedness. Lets carry on the humanitarian work. I wish you and Dasarath.
    ramu
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  4. daSarath ki antaamanche jaragaalani korukontunnaanu.
    alaane ataniki sahaayam chesina mee manasoo maruaraanidi.

    ReplyDelete
  5. దశరథ్ తన వృత్తి లో పైకెదిగి మంచి పేరు సంపాదించుకొని ,ఎంతోమందికి సహాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. దశరథ్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. చాలా మంచి విషయం చెప్పారండీ మన సమాజం లో ప్రస్తుతం కావాల్సింది ఇదే..మిమ్మలిని అనుసరించి నలుగురికి సహోయమ్ అందగలిగితే మీ సేవ సక్సెస్ అయినట్టే....దయచేసి మన బ్లోగ్మిత్రులు సహాయం అవసరమయిన వారికి చేయూతనివ్వాలని ఆశిద్దాం

    ReplyDelete
  8. దశరధ్ చాలా అభినందనీయుడు. చాలా గొప్ప సంస్కారం అతనిది. తల్లిదండ్రులు అన్నీ అమర్చిపెట్టినా కూడా ఇంకా ఏదో లోటుందనుకుంటూ తమను, తమ భవిష్యత్తును, తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఇతనిని చూసి నేర్చుకోవాలి. అతనిని ప్రోత్సహించిన మీకు కూడా అభినందనలు.

    ReplyDelete
  9. పరిమళం గారు పొద్దున్న అతని గురించి చదివినప్పుడే మనసులో అభినందించా
    ఇప్పుడు మీ పోస్ట్ చదివాక అతని మీద మరింత గవురవం పెరిగింది .మీ మీద కుడా .
    వెయ్యి రూపాయిల విలువైన వస్తువులు పంచి ఫొటోస్ వేయించుకునే యి రోజుల్లో
    మీలా గుప్త దానాలు చేసి కేవలం సందర్బం వచ్చిందనే ప్రస్తావించడం అభినందనీయం .
    ఇంతకీ అతను ఏ landline నెంబర్ కి చేసే వాడో కూడా రాసి వుంటే బావుండేదేమో ---.:

    ReplyDelete
  10. దశరధ్ కు మనస్పూర్తిగా అభినందనలు.. అతను జీవితంలో ఇంకెత్తో ఎదగాలని కోరుకుంటున్నాను.. సమయానికి సహాయం చేసి అతనిని ఆదుకున్న మీ మంచి మనసుకూ నమస్సుమాంజలి!

    ReplyDelete
  11. దశరథ్ ను అభినందిస్తున్న బ్లాగ్ మిత్రులకు కృతజ్ఞతలతో పాటు ఒకవిషయం చెప్పదలచుకున్నాను ఇది కేవలం అతని మంచి మనసును ,బాధ్యతాయుతమైన అతని ప్రవర్తనను అందరూ తెలుసుకోవాలని చేసిన ప్రయత్నమే కాని నేను చేసింది ఏమీలేదు . తర్వాత మురళి మోహన్ గారు , ఇంకా చాలామంది మహానుభావులు చేయూతనిచ్చారు . అంతకంటే ముందు అనాధ శరణాలయం అతన్ని అమ్మలా ఆదుకుంది ...ఇన్నిటితో పోల్చుకుంటే నేనుచేసింది సూర్యుడి ముందు దివిటీ.

    ReplyDelete
  12. @ మాలా గారు తప్పకుండానండీ ..

    @ సుజాతగారు , ఇందుకు మా నాన్నగారే కారణమండీ ..ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మంచిదే ..అలాగే చదువుకోవాలని ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తే వారికి తగిన జీవనోపాధి వాళ్ళే కల్పించుకుంటారు అని చెప్పేవారు .మా పొలం కౌలుకు చేసేవాళ్ళ అబ్బాయికి చదువుకోవడానికి సహాయం చేసేవారు.ఇప్పుడు ఆ అబ్బాయి డిగ్రీ పూర్తిచేసి , బి ఈ డి చేసి గవర్నమెంట్ టీచర్ గా స్థిరపడ్డాడు.నాన్నగారి కళ్ళల్లో కనపడ్డ తృప్తి విలువ కట్టలేనిదనిపించిన్దండీ ...చిన్నప్పట్నుంచీ నాన్న చేయిపట్టుకు నడవడం అలవాటు :) :) ధన్యవాదాలండీ ...

    @ రాముగారు ,మీ బ్లాగ్ చూశానండీ ...మీరు అభినందనలు రాయటం చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు .

    @ రామ్ గారు ధన్యవాదాలండీ ...

    @ రాధికగారు ఆ కోరికతోనే మీ అందరితో పంచుకున్నానండీ ....ధన్యవాదాలు.

    @ రవి చంద్రగారు ధన్యవాదాలు .

    @ kvsv గారు , ఇప్పటికే ప్రమదావనం ద్వారా జ్యోతిగారు ,వరూధినిగారు ,లక్ష్మిగారు ,మాలాగారు ....ఇంకా చాలామంది మిత్రులంతా కలిసి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారండీ ....మీ అభినందనలు వారందరికీ కూడా ...ధన్యవాదాలు.

    @ శిశిర గారు ,అతని సంస్కారానికేనండీ ఈ అభినందనలన్నీ...అతనేక్కడున్నా మీ అందరి ఆశీస్సులతో మరింత ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నాను .ధన్యవాదాలు

    ReplyDelete
  13. @ రవిగారు , ఏది ఏమైనా అవతలివారికి ఏదొక రకంగా సహాయం అంది మంచిజరిగితే మనకంతే చాలు కదండీ . ఇక నా టపాకు కారణం కేవలం అతని ఉత్తమ సంస్కారాన్ని బ్లాగ్మిత్రులందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనేనండీ ...ధన్యవాదాలు
    landline నెంబర్?? రవిగారనిపించుకున్నారుగా :) :)

    @ నిషిగంధగారు , మీ అందరూ ఇంత మంచిమనసులతో అభినందిస్తే అవి ఆ భగవంతుని ఆశీస్సులతో సమానమేనండీ ..ధన్యవాదాలు .

    ReplyDelete
  14. my best wishes to Dasarath and to you too :)

    ReplyDelete
  15. చాలా మంచి విషయం చెప్పారు. ఎంత సహాయమైనా మరువకుండా భాధ్యతగా ప్రోగ్రెస్ తెలియచేస్తూ అంతగా గుర్తుపెట్టుకోవడమనేది మంచి విషయం. అతను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కథలు సహాయం చేయాలన్న ఆలోచనకు మరింత స్ఫూర్తినిస్తాయి. మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  16. చేసిన సాయాన్ని మరువకుండా తన ప్రొగ్రెస్ రిపోర్టు పంపిన విషయం చూసి నాకు ఆశ్చర్యమేసింది. దశరథ్ లాంటి పిల్లలు వుండాలని కోరుకుంటున్నా. ఆయనకు సాయపడ్డ మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  17. దశరధ్ కు మనస్పూర్థి గా శుభాకాంక్షలు. మీకు కూడా.

    ReplyDelete
  18. పరిమళ గారు, ఎండిపోతున్న చిన్న మొక్కకు కొంచెం నీరుపోసినా, అది ఎదుగుతుంటే చాలా ఆనందమనిపిస్తుంది. పెరిగిన ఆ మొక్క ఇంకో నలుగురికి నీడిస్తుంటే పరమానందమైతుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు. దశరథ్ కు నా ప్రత్యేక శుభాభినందనలు.

    ReplyDelete
  19. Telugu lipilo raayalekapotunnanduku kshaaminchandi .
    Ee post chadavagaane gurtochchina paata "JYOT SE JYOT JALAATE CHALO......PREM KI GANGAA BAHAATE CHALO.... "deeniki pedda vudaaharana meeriddaroo....subhaabhinandanalu meeku.

    ReplyDelete
  20. మిమ్మల్ని కాదండి, మీ నాన్నగారిని అభినందించాలి.మిమ్మల్ని ఇంత మంచి మనిషిగా తీర్చిదిద్దినందుకు. Keep it up.

    All the best to him and to you.

    ReplyDelete
  21. మీ టపాలో నాకు దశరధ్ కంటే మీరు ఆదర్శ ప్రాయంగా కన్పిస్తున్నారు.ఇకపై మీ స్పూర్తి తో నేను కూడా వీలున్నంత సహాయం చేయడానికి నిర్ణయం తీసుకొన్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  22. అభినందనలు పరిమళం గారు .స్పందించే హృదయం అతి తక్కువ ఉంటుందండీ .
    మీరు ఈ ఆర్టికల్ రాయడం ద్వారా నేను అత్యంత గౌరవించే వ్యక్తి చేసిన సహాయం కూడా తెలుసుకున్నాను .వారు తన కుడిచేత్తో చేసే దానాన్ని కనీసం ఎడమ చేయికి కూడా తెలియనీయరు .వృత్తిపరంగా నాకు ఆప్తులు .

    ReplyDelete
  23. My first wishes to Mr. Dasarath

    ReplyDelete
  24. >>> అతని మంచి మనసు ,బాధ్యతాయుతమైన అతని ప్రవర్తన
    నిజమే ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళకు సహాయం చేస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది

    పరిమళం గారు ఈ పోస్ట్ వల్ల మరింతమందికి సహాయం చేయాలని అందరూ అనుకుని ఉంటారు (నాతో సహా)

    ReplyDelete
  25. చాలా రోజులైంది మీ బ్లాగు చూసి...
    humanity has no limts...

    ReplyDelete
  26. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక మంచి స్థాయికి ఎదిగిన దశరధ్ గారిని ఎలా అభినందించాలో తెలీటంలేదండి...రియల్లీ హి ఈజ్ గ్రేట్...సాయం అందించిన ప్రతీవారికి తన ప్రోగ్రెస్ ను తెలియపరచటం తనలోని నిబద్దతను తెలియజేస్తుంది. అతను ఇంకా గొప్ప పొజిషన్ లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. పెద్దమనసుతో మీరు చేయగలిగిన సహాయం చేసిన మీకు మనస్పూర్తిగా అభినందనలు. అర్హులకు సాయం అందితే వచ్చే చక్కని మార్పుకు దశరధ్ గారే ఒక ఉదాహరణ.

    ReplyDelete
  27. నిజంగానే చాలా మంచోడండీ.. అభినందనలు, అతనికీ, మీకూను..

    ReplyDelete
  28. నిజంగానే దశరధ్ చాలా మంచోడండీ . అంతే కాదు మీరు కూడా చాలా మంచివారు అని తెలుస్తుంది . దశరధ్ కు మనస్పూర్థి గా శుభాకాంక్షలు.

    ReplyDelete
  29. దశరథ్ గురించి మీరు చెప్పిందంతా విని ఎంత సంతోషమేసిందో!! మనం చేసిన కొద్దో గొప్పో సహాయమైనా ఒకటికి రెండు పాళ్ళు సద్వినియోగం అయిందంటే.. ఎంత ఆనందంగా ఉంటుందో కదా.! అలాంటి మీ ఆనందం నాక్కనిపించింది ఈ పోస్టులో :-)
    అంత చక్కటి వ్యక్తిత్వమున్న దశరథ్ కీ, ఇంత మంచి మనసున్న మీకూ ఇద్దరికీ అభినందనలు.! దశరథ్ భావి జీవితంలో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలనీ, మానవతామూర్తిగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..!

    ReplyDelete
  30. నేను ముగ్గురికి ధన్యవాదాలు చెబుదామని ఈ కామెంట్ రాస్తున్నానండీ!!!!

    మొదటిగా: దశరథ్ గారికి....కష్టపడి పైకి వచ్చిన దారిని మర్చిపోకుండా ఏ ఒక్క మెట్టునీ మర్చిపోకుండా, సహాయం చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకున్నందుకూ.........తన ప్రోగ్రెస్ ని తెలియజేస్తూ, వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటూ కృతఙత తెలియజేసినందుకూ.........మా లాంటి వాళ్లు నేర్చుకోవటానికి ఒక పాఠాన్ని, చూసి నడవటానికి ఒక దారినీ, పాటించటానికి ఒక ఆదర్శాన్నీ ఇచ్చినందుకు నా ధన్యవాదాలు.

    రెండు (మీకు నచ్చదు కాబట్టి ముందుగానే సారీ :) ): మీకు!!!....ఎన్ని మాటలు చెప్పినా ఒక తెలియని వ్యక్తికి సహాయం చేనే వాళ్ల్లు ఎంతమంది ఉంటారు చెప్పండి....చదువుకునేప్పుడు ఇలాంటీ ఇబ్బందులు వస్తే ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి, మీరు చేసిన సహాయం విలువ ఏంటో నాకు బాగా తెలుసు.
    ఒక తోటీ విధ్యార్ధికి, తోటి యువకుడికి, అన్నింటికీ మించి.... ఒక తోటి మనిషికి సహాయం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    మూడు: బ్లాగర్.కామ్ మరియు మన "హారం" కి....మీలాంటి, దశరథ్ గారి లాంటి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ల గురించి తెలుసుకునే, వాళ్లతో ఇలా ప్రత్యక్షంగా మాట్లాడే (లేదా కామెంట్లాడే) అవకాశం కల్పించినందుకు.......

    ReplyDelete
  31. హుమ్... ఇప్పటికే... మీకు చాలా అభినందనలు వచ్చేశాయి. ఆ బరువును మోయలేక మీకు ఊపిరి ఆడటం లేదనే విషయం నేను మాత్రమే గమనించాను.
    సొ, మీకు అభినందనలు తెలియజేయాలని వున్నా... తెలియజేయట్లేదు.
    ధశరథ్ కష్టపడి చదివి, ఐదెంకెల జీతం సాప్ట్ వేర్ లో ఉద్యోగం కూడా సంపాయించాడు కాబట్టి, మీరు అదే చేత్తో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళిచేసేసారంటే... ఒక Circle 'పూర్తి' అవుతుంది. ఏమో చెప్పలేం! మన ఆణిముత్యాన్ని వేరే రాష్ట్ర అమ్మాయిలు ఎగరేసుకుపోతే కష్టం. :)

    ReplyDelete
  32. Both of you are great.. but you are more than that.

    ReplyDelete
  33. పరిమళ గారు కుశలమా!చాలామంది అమ్మగురించి రాసారు ఎన్నో పాటలూ/కవితలూ!!అయితె అర్దనారీశ్వర తత్వమే జగతికి మూలము కదా..నాన్న గురించి రాసిన పాటని నా బ్లాగ్ లో చూసి కామెంటుతారని ఆశ..మీకూ నాన్నంటేకూడా ఇష్టమే కదా....మీకు జీవితాన్నివ్వడమేకాకుండా..జీవిత పాఠాలను అడుగడుగునా బోధిస్తున్న మీ నాన్నగారికి నమస్సులతో..
    సదా మీ స్నేహాభిలాషి
    రాఖీ

    ReplyDelete
  34. దశరథ్ కు ఆశీస్సులందించిన మిత్రులందరికీ ....పేరు పేరునా కృతజ్ఞతలు .నిజానికి ఈ టపా రాసేముందు నేనుచేసింది చిన్న సాయం అందరికీ తెలియటం అవసరమా అనుకున్నానండీ సిగ్గుగా అనిపించినా దశరథ్ బాధ్యతాయుతమైన ప్రవర్తన అందరికీ తెలియచేయాలనే కోరికతో రాయటంజరిగింది .మంచిగంధం చెట్టు చుట్టూ ఉన్న చెట్లకు కూడా ఆ పరిమళం అంటినట్టు మీ అభినందనలు నేనూ అందుకున్నాను .అందుకు మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.

    ReplyDelete
  35. దశరథ్ గారికి ప్రసంసలు.
    పరిమళం గారికి హృదయ పూర్వక అభినందనలు.

    ReplyDelete
  36. hmmm nice ilanti vallani encourage chesinandhuku miku thanks and also at the same time antha manchi opportunity ni bhaga vadukuna thanaki kuda abinandhanalu

    ReplyDelete
  37. parimala gaaru.nijamgaa.ituvantivi vinnappudu,chadivinappudu chaalaa haayigaa anpistundi...manam chese sahaayam sadviniyogam aite,antakannaa aanandam emuntundi..nenu appudappudu ilaanti kaaryakramaalu chestaanu kaabatti,mee aanandaani nenu anubhavinchaanu..keep it up madam.....RUKMINIDEVI.

    ReplyDelete
  38. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. చేసిన సహాయాన్ని ఇంత బాగా గుర్తు పెట్టుకునే వాళ్ళు. నిజంగానే ఈ అబ్బాయి చాల మంచోడు.

    మీకు అభినందనలు ఇంత మంచి విద్యార్థిని, వ్యక్తిని ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సహించినందుకు. పళ్ళు ఇచ్చే చెట్టు ఎంత ముఖ్యమో ఆ చెట్టు ఎదగడానికి నీళ్ళు పోసిన వాళ్ళు అంతే ముఖ్యం కదండీ మరి.

    ReplyDelete