Thursday, May 28, 2009

ఆరంభ శూరత్వం !


చిన్నప్పుడు అంటే ఇంకా స్కూల్ లో వెయ్యకుండానే ..నాన్నగారు చెప్పిన పాటలూ ..పద్యాలూ ...చిలకపలుకుల్లా పలకటం చూసి కూతురు ప్రతిభకి మురిసి పోయి ఒక సవత్సరం ముందే నన్ను స్కూల్ లో వేసేయ్యడానికి నిర్ణయించేసుకున్నారు అమ్మ నాన్నగారునూ ...వయసుదేముందిలే (అప్పట్లో బర్త్ సర్టిఫికేట్ అడిగేవారు కాదనుకుంటా ) ఒక సంవత్సరం ఎక్కువ వెయ్యొచ్చు అనుకున్నారు .

అప్పుడు మేముండే ఊర్లో ఒకే ఒక ఇంగ్లీషు మీడియం కాన్వెంటు ఉండేది .సరే కూతురు ఏ కలెక్టరో ...డాక్టరో ...అయిపోవాలని ముచ్చటపడిపోయి ఒకేడు ఎక్కువ వయసు వేయించి మరీ కాన్వెంట్ లో జాయిన్ చేశారు .సరే ఎదురు చూసిన రోజు రానే వచ్చింది .ఆ రోజే నేను మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళటం .అమ్మ చక్కగా తయారు చేసింది .నా పుస్తకాల పెట్టె ( అప్పట్లో ఇండాలియం బాక్సులు ఉండేవి ) తోపాటూ ....మరో బుట్ట ! దాంట్లో లంచ్ బాక్స్ ,వాటర్ బోటిల్ తోపాటూ స్నాక్స్ బాక్స్ , జూస్ బోటిల్ , ఇంకా పాల ఫ్లాస్క్ ...సరంజామా సిద్ధం . ఇంతకూ స్కూల్ మూడు గంటల వరకే ! సరే ఇక స్కూల్ కి వెళ్ళాకా ..అక్కడ టీచర్ కీ ...ఆయాకీ ...నన్ను అప్పగించి ..పొద్దుట ఇంటెర్వల్ లో పాలు , బిస్కెట్ లూ ....మద్యాహ్నం లంచ్ , తర్వాతి ఇంటెర్వల్ లో జూస్ ఇవ్వాలని అన్ని జాగ్రత్తలూ ఆయాకి చెప్పి ..కొద్దోగొప్పో ఆమెకి లంచమిచ్చి మంచి చేసుకొని వదల్లేక వదిలి వెళ్ళారు నాన్నగారు . ఇక్కడ మీలో ఆకాశమంత సినిమా చూసిన వారంతా
ప్రకాష్ రాజ్ ను గుర్తు తెచ్చుకోవాల్సిందే !

నా సరంజామా చూసిన వాళ్ళకి నేను చదువుకోడానికి వెళ్తున్నానా ...లేక తినటానికి వెళ్తున్నానా అనిపిస్తే అది వాళ్ల తప్పు కాదు మరి ! ప్రతి రోజూ నాన్నగారు దింపడం ( రిక్షాలు ఉండేవి కానీ తనే దింపేవారు) ...ఆయాకు అన్ని జాగ్రత్తలతో అప్పగించడం జరిగేది .సరే మనం కూడా శ్రద్ధగా A B C D లు దిద్దడం నుంచి ...మెల్లగా రైమ్స్ ,చిన్న చిన్న పదాల్లోకి వస్తున్నాం .ఈలోగా ఒక విషయం ఇంట్లో తెలిసి పోయింది .

నా దురదృష్టవశాత్తూ ...మా ఆయాకి ఓ కొడుకున్నాడు .వాడెప్పుడూ వాళ్లమ్మతోనే ఉండేవాడు .మన బుట్టంత నిండుగా ఏ బుట్టా వచ్చేది కాదేమో ..నన్ను ప్రత్యేకంగా ఓ ప్రక్కన కూర్చోబెట్టి తినిపించేది . తినిపిస్తూ నాకు రెండు ముద్దలు పెట్టడం ఇంక చాలా ..అని అడగటం ...మనకేం తెలుసు చాలు అనగానే మిగతా అన్నం కొడుక్కి పెట్టేయడం .అలాగే పాలు తాగుతావా ... నేను తాగను అనగానే వాడికి ఇచ్చేయటం ...జూస్ కూడా అంతే అమ్మ కష్టపడి పంపిస్తే నేను తాగేది రెండు సిప్ లు . కొన్నాళ్ళకు ఇంటర్వెల్ లో స్నాక్స్ బాక్స్ ఖాళీగా ఉండేది .

కొన్నాళ్ళు గడిచాక ...రోజు రోజుకీ చదివేసి చిక్కిపోతున్నానా ..లేకపోతె ఏంటీ ...అని అమ్మ ఒక రోజు కూర్చోబెట్టి బుజ్జీ ! అన్నం తింటున్నావా ?జూస్ తాగుతున్నావా ....అని బుజ్జగించి అడిగే సరికి ....మరే ..పాపం ..ఆయా వాళ్ల అన్నయ్యున్నాడు కదా ( వాళ్ల అబ్బాయి ) ....వాడు తినాలికదా ..అందుకే నేను చాలు అంటున్నానన్నమాట !అనేసింది బుజ్జి ...అదేనండీ ...నేను !

అంతే ఆ తర్వాత నాన్నగారు స్కూల్ కి వచ్చి ఆయాతో గొడవ పెట్టుకొని ...టీచర్ కి కంప్లైంట్ చేశారు . స్కూల్ మేనేజ్ మెంట్ అక్కడ ఉండేవారు కాదు .టీచర్ లేమో పట్టించుకోలేదు .దానితో నాన్నగారు గొడవ పెట్టుకొని స్కూల్ మానిపించేశారు . వేరే స్కూల్ లో వేద్దామని అనుకోని సంవత్సరం వేస్ట్ అవకుండా విరజాజి పూలు ....
టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టి తెలుగు అక్షరాలు నేర్పించి ...ఆ తర్వాతి సంవత్సరం తెలుగు మీడియం అంటే బోర్డు స్కూల్లో చేర్చారు .

అంత హడావుడిగా మొదలైన నా చదువు స్కూల్ ఫైనల్ పూర్తవ కుండానే ఆగిపోయిందనుకోండి .ఎందుకనేది మరో టపాలో.....

* పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)

18 comments:

  1. 'ఆకాశమంత' సినిమా మూడోసారి చూసినట్టు ఉందండి.. (ఇప్పటికే రెండు సార్లు థియేటర్ లో చూశా). చదివేవాళ్ళకి కళ్ళముందు ఆయా దృశ్యాలు కనిపించేలా రాశారు.. బహుశా అది జ్ఞాపకాలకున్న ప్రత్యేకత ఏమో...

    ReplyDelete
  2. అప్పుడే అయిపోయిందా.. తెలియనే లేదు..చాలా బాగా చెప్పారు ..నేను తెలుగు సినిమా చూసి రెండేళ్ళు దాటింది మీ పోస్ట్ చదివినంత సేపు ఒక ఫీల్ కి లోనయ్యాను..మీకు నా అభినందనలు
    ఉష గారి కవితలు ని మీ పోస్ట్ లను మిస్ అవ్వడం చాలా కష్టం ఇకనుండి

    ReplyDelete
  3. పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)
    బావుంది conclusion

    .ఎందుకనేది మరో టపాలో...
    ఆ టపా తొందలోనే పోస్ట్ చేస్తారని ఆశిస్తూ మీకు థాంక్స్ :)

    ReplyDelete
  4. పరిమళం గారు,
    మీ బుజ్జి చాలా ముద్దుగా వుంది సుమండీ!
    అర్జెంట్ గా ఆకాశమంత చూసేయాలి.

    ReplyDelete
  5. title choosi na gurunchi rastunnaru anukunna...aakasmantha super movie andi...nenu antey anni start chesi madhyalo manesta...

    ReplyDelete
  6. అలా అంటే ఎలాగండీ!!!!
    ఆ శూరత్వమే కదండి ఇప్పుడు పరిమళాలని వెదజల్లుతుంది.

    ReplyDelete
  7. ప్చ్ నాకెందుకంత మంచి ఆయా లేదో. ఎన్ని సాకులు చెప్పి కారేజీలోని అన్నం తినకుండా మానేదాన్నో. ఆ వారా నాన్నగారు ఇంట్లో కూరి కూరి తినిపించేవారు. పక్కనే నానమ్మ సై సై ["అసలే తల్లిపాలు లేని పిల్ల, అర్భకురాలు" అంటూ (నాకు 20ఏళ్ళు వచ్చినా అదే తంతు)]. చివరికి విశ్వవిద్యాలయం లో చేరేవరకు, నేనలా కాథలిక్ కాన్వెంట్లోనే లీడరుగా పేరుప్రఖ్యాతులు కాంచి, చదువులో వెలిగిపోయాను (ఇది మాత్రం గర్వకారణం :)).

    పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి, నల్ల బుజ్జి, రాచెర్ల బుజ్జి అబ్బా ఇలా ఎన్ని బుజ్జి పాత్రలు తారసపడ్డాయో జీవితాన, ఇక ఇప్పుడు మీ బుజ్జి ;)

    ReplyDelete
  8. * పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)
    అడగబోతున్నా, పైన బొమ్మ మీదేనా అని...సివర్లో ట్విస్ట్ ఇచ్చారు..
    మీ ఆరంభం బాగున్నా, మీ రాత బాగున్నా, చివరి రెండు లైన్లు అనగా
    అంత హడావుడిగా మొదలైన నా చదువు స్కూల్ ఫైనల్ పూర్తవ కుండానే ఆగిపోయిందనుకోండి.
    ఇది నా చిరునవ్వుని ఆపేసింది.

    ReplyDelete
  9. పరిమళం, కాదూ కాదు బుజ్జీ, మరే తినే బాధ తగ్గుతుందని మంచ్ ఎత్తుగడ. కదూ!
    పెద్ద వాళ్ళయ్యాక అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా అలా కొసరి పెట్టేవాళ్ళుంటే బాగుంటుందని. ప్చ్.. అనుకుని ఏమ్ లాభం.
    అయినా బోర్డ్ స్కూల్ లో ఉన్న మజా కాన్వెంట్ లో ఉంటుందా? చెప్పండి.

    తపా మాత్రం ఎప్పటిలానే చాలాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ బాగుందోచ్.

    ReplyDelete
  10. బాగుందండి మీ బుజ్జమ్మ ప్రహసనం.. పాపం బుజ్జమ్మ ఎంత మంచిదో...

    ReplyDelete
  11. బుజ్జి ... మీ అమ్మను ఇప్పటికీ మీ అమ్మమ్మా వాళ్లు అలానే పిలుస్తారు మీ చిన్నప్పటి జ్ణాపకాలను ,మీ విరజాజి పూల టీచర్ ని తలుచుకుంట్టేనె ఎంతొ సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మా అమ్మ గారికి మీ పరిమళం, మరియూ ఉష గారి మరువం అంటే ఎంతో ఇష్టం "ఎందుకనేది మరో టపాలో..."
    ఆ టపా తొందలోనే పోస్ట్ చేస్తారని ఆశిస్తూ.....శ్రీ

    ReplyDelete
  12. బాగున్నాయి మీ జ్ఞాపకాలు... :)

    ReplyDelete
  13. @ మురళి గారూ ! నిజానికి బాల్య స్మృతులు పంచుకోవడానికి ఇన్స్పిరేషన్ మీరే ! అందుకు మీకు ధన్యవాదాలు .

    @ హరే కృష్ణ గారు , మీ అభిమానానికి ధన్యవాదాలండీ ... ఉషగారి కవితల పక్కన నా టపాకి స్థానాన్నిచ్చారు కానీ అంత భాషా పరిజ్ఞానం నాకు లేదండీ .

    @ మాలగారు , :) :)

    @ శిరీష గారూ ! మీ బ్లాగ్ చూశాను బావుంది .నాకేమీ ఆరంభ శూరత్వంలా అనిపించట్లేదు .కానీ తెలుగులో రాస్తే బావుండేది .

    @ పద్మ గారు , థాంక్స్ !

    @ లక్ష్మిగారు :) :)

    @ ఉషాగారు , అప్పుడెలా ఉన్నా ..ఆ విలువ ఇప్పుడు తెలుస్తూంది ...ఇంత ప్రేమగా మనపిల్లల్ని చూడగలమా అనిపిస్తుంది . ఇప్పుడు మన ప్రేమ కంటే పిల్లల చదువే ముఖ్యమనిపిస్తుంది ...మన ప్రేమ పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కాకూడదని అనిపిస్తుంది .మీ బాల్య స్మృతులు పంచుకున్నందుకు థాంక్స్ !

    @ భాస్కర్ రామరాజు గారు , ధన్యవాదాలండీ ..నిజానికి చదువుకోలేక పోయినందుకు బాధగానే ఉన్నా ..అది నా స్వయంకృతాపరాధమేనండీ ....చివరి రెండు లైన్లూ మీ చిరునవ్వుని ఆపేసిందన్నారు ....అది స్పందించే మీ మంచి మనసుకు నిదర్శనం !

    @ శృతి గారు , నిజమే ...ఇప్పుడుకూడా ఎవరైనా అలా కొసరి పెట్టేవాళ్ళుంటే బావుంటుందన్నారు ... ఇప్పుడూ పెడుతున్నారు ....మా వారు .... అది నన్ను చూస్తేనే తెలిసిపోతుంది ...:) టపా నచ్చినందుకు థాంక్స్ !

    @ నివాస్ గారు , థాంక్స్ !

    @ భావన గారు , అవునండీ బుజ్జమ్మ Sooooo chweet అన్న మాట :)

    @ శ్రీ గారు ! నాకు అత్యంత సంతోషం కలిగిందండీ ..మీ కామెంట్ చూశాక ...నా టపాలు మీకు మాత్రమె కాకుండా అమ్మగారికి నచ్చటం నా అదృష్టంగా భావిస్తున్నానండీ ...ధన్యవాదాలు ...అమ్మకు కూడా తెలియ చేయండి .

    @ చైతన్య గారు , థాంక్స్ !

    ReplyDelete
  14. nenu aaya కొడుకు గురించి aalochistunna.. నేను ఆ ప్లేస్ లో ఉంటే ... ఈ పాటికి లావై పోయేవదినని.. హ హ హ ..

    వేరి గుడ్ వన్ ..as usually..

    ReplyDelete
  15. @ శివగారు , అన్నీ వాడికే పెట్టేసినా ....నేనేం చిక్కిపోలేదండీ ....బుజ్జిగా ( వేరేలా అనలేక ) అలాగే ఉన్నా....ఇప్పటికీ .. :) :)

    ReplyDelete
  16. >> మరీ ముఖ్యంగా మా అమ్మ గారికి మీ పరిమళం, మరియూ ఉష గారి మరువం అంటే ఎంతో ఇష్టం

    శ్రీ, ఇది చాలా ఆదరణపూరితమైన వాక్కు. చెప్పిన మీకు, ఆ అభిమానం వుంచుకున్న మీ అమ్మగారికీ నా నెనర్లు.

    ReplyDelete