Sunday, May 3, 2009

తప్పక చూడండి !! ( సురేంద్రపురి )


యాదగిరి గుట్ట వెళ్ళారా ? ఈ మధ్య ..అంటే ఓ ఏడాది లోపులో ...వెళ్ళక పొతే తప్పక వెళ్లి రండి .హైదరాబాద్ నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షాలతో పాటు , పంచముఖ హనుమదీశ్వర అనుగ్రహం కూడా పొందవచ్చు .అంతే కాదు సంపూర్ణ భారత దేశ యాత్రానుభూతి కలుగుతుంది .

యాదగిరి గుట్ట స్వామివారి ఆలయమునకు వెళ్ళే దారిలో సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయం మరియు కుందా సత్యనారాయణ కళాధామం ఉన్నాయి .

సాధారణంగా ఆంజనేయస్వామి మనకు భక్తాంజనేయునిగా , వీరాంజనేయునిగా , ప్రసన్నాంజనేయునిగా ......కొలువై కనిపిస్తారు . ఇక్కడ పంచముఖాంజనేయుడై , సువర్చలా సమేతుడై దర్శనమిచ్చుట ఇచ్చటి విశేషము .ఈశ్వర , నారసింహ ,గరుడ , వరాహ, హయగ్రీవ ....ఈ ఐదు ముఖములతో అలరారు హనుమంతుని విగ్రహముతో పాటు అదే ఆవరణలో పంచముఖ విశ్వరూపుడైన శివుడు కొలువై ఉన్నాడు .ఆ శివలింగం నేపాల్ లోని పశుపతినాధ లింగాన్ని పోలి ఉండటం విశేషం .

కుందా సత్యనారాయణ కళాదామంఒక అపురూప పౌరాణిక విజ్ఞాన కేంద్రం ....అధ్బుత శిల్ప కళా సృష్టి కి నిలయం !
సురెంద్రపురిలో దాదాపు 10 సంవత్సరాలు కొన్ని వందలమంది కళాకారుల ,శ్రామికుల కష్ట ఫలం .
ఖమ్మం జిల్లా , మదిర తాలూకా , బసవాపురం వాస్తవ్యులు శ్రీ కుందా సత్యనారాయణ గారు భగవంతుడు అర్ధాంతరంగా దూరం చేసిన తమ చిన్న కుమారుడు సురేంద్ర శాశ్వత కీర్తిని భువిలో నిలుప దలచి అహోరాత్రులూ కష్టించి ,ఎన్ని అవాంతరాలు , కష్టనష్టాలు ఎదురైనా ..ఆరోగ్యం ,వయసు సహకరించక పోయినా స్వామిపైనే భారం వేసి ఈ మహత్తర కార్యాన్ని పూర్తి చేశారు .

కళాధామం విశేషాలు :

భారత దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నకళ్ళు ఇక్కడ నిర్మించడం విశేషం !సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని దర్శిస్తే ఒకింత ఆ అనుభూతిని పొందవచ్చు .
అంతేకాక బ్రహ్మ లోకం , విష్ణులోకం , శివలోకం , నాగలోకం , ఇంద్రలోకం ,యమలోకం ,నరకలోకం...శిక్షలు , పాతాళ లోకం ,....క్షీరసాగర మధనం , గజేంద్రమోక్షం , కాళీయ మర్దనం , గోవర్ధన గిరి ధారణం , విశ్వరూప సందర్శనం , పద్మవ్యూహం మొదలైన శిల్పాలతోపాటు .....రామాయణ , మహాభారత , భాగవతాలలోని ముఖ్య ఘట్టాలనూ అపూర్వంగా మలిచారు .

ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూడదగ్గ ప్రదేశం .ముఖ్యంగా పిల్లలకు పౌరాణిక విజ్ఞానం తక్కువగా ఉంటోంది . చక్కటి శిల్పాల ద్వారా ఆసక్తి కలిగించేలా పిల్లలకు మన పురాణాలను వివరించవచ్చు .కుటుంబ సమేతంగా చూడదగ్గ విశేషం .ప్రవేశ రుసుము కాస్త ఎక్కువ అనిపించినా ...అంతా చూసిన తర్వాత అంత పెద్ద కళా ధామ నిర్వహణ భారం సాధారణం కాదు అనే విషయం మనకు అర్ధమౌతుంది .

అక్కడి శిల్పకళను నాపరిధిలో చాలా క్లుప్తంగా వివరించాను ,నేను రాయని విశేషాలు ఇంకా ఉన్నాయి .చూశాక తప్పకుండా ఒక మంచి ఆధ్యాత్మికానుభూతి కలుగుతుంది .

6 comments:

 1. పరిమళ గారు,
  చూద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ సెలవల్లో పిల్లలని తప్పక తీసుకెలుతాను.

  ReplyDelete
 2. మంచి విషయం తెలియచేసారు.

  ReplyDelete
 3. టీవీలో ప్రకటనలు చూశానండి.. మీరు వివరించిన తీరు బాగుంది.. ప్రవేశ రుసుము ఎంతో రాసి ఉంటే బాగుండేది.. ముఖ్యంగా బృందాలుగా వెళ్ళే వారికి, పిల్లలని తీసుకెళ్లాలని ప్లాన్ చేసే స్కూల్ యాజమాన్యాలకి అలాంటి సమాచారం పనికొస్తుంది కదా..

  ReplyDelete
 4. @ మాలా కుమార్ గారూ ! తప్పక చూపించాల్సిన విశేషం ! పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు .

  @ విజయ మోహన్ గారూ ! ధన్యవాదాలు .

  @ మురళి గారు ! మేం వెళ్ళినప్పుడు ప్రవేశ రుసుము ఒకరికి 200/- ఇప్పుడు 300/- చేశారని తెలిసింది .

  ReplyDelete
 5. చాలా బాగా రాసారు ...ఆ స్వామి దయ ఉంటే తప్పక వెళ్ళతాను ..

  ReplyDelete
 6. దాదాపు మూడు సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు అకడ పంచముఖాంజనేయుడూ, శివుడూ తప్ప మిగిలిందంతా దాదాపు ఖాళీ స్థలం. ఇప్పుడు మీ విశేషాలను చదివితే మహా ఆశ్చర్యమేసింది. తప్పక వెళ్తాను. థాంక్యూ పరిమళగారూ!

  ReplyDelete