Sunday, May 17, 2009

వారి ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా ....


వారికి ఇంద్ర ధనుస్సు తెలియక పోవచ్చు .కాని వారికీ ఓ రంగు తెలుసు ..అది ..నలుపు ...ఆ రంగు నుండే స్ఫూర్తి నింపుకొని ..ఆత్మవిశ్వాసంతో ...జీవన పోరాటం సాగిస్తున్న వారి ముందు దైవం తలదించాల్సిందే ...తాను ఇచ్చిన లోపాన్ని శాపం అనుకోకుండా ...తనను నిందించకుండా ...నీ దయవల్లె ప్రభూ ..అంటూ వారు నమస్కరిస్తుంటే ...దైవం తలదించాల్సిందే ...

వారంతా అంధ గాయకులు ..సంగీతం వచ్చిన వారు , రానివారూ కూడా ఉన్నారు .అటువంటి అంధ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్న ఈ టివి వారు అభినందనీయులు .ఈ టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమం బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్. సంగీత విద్వాంసులు మోహన కృష్ణ గారు ,యువకవి అనంత శ్రీరాం , సినీనటి లయ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈకార్యక్రమానికి ఝాన్సీ యాంకరింగ్ కూడా హుందాగా ఉంటోంది .

అంధులైన వారంతా అధ్బుతంగా పాడటంలోనే కాదు , ఆత్మవిశ్వాసం లోనూ వారికి సాటి వారే ! ఈకార్యక్రమం ఫైనల్స్ కి కళాతపస్వి శ్రీ k.విశ్వనాద్ గారు రావడం ఈ కార్యక్రమానికి మరింత నిండుదనాన్నిచ్చింది .

గాయకుల ఫెర్ఫార్మెన్స్ ఒక ఎత్తైతే ప్రోగ్రాం ఫైనల్స్ లో స్వాతి అనే అమ్మాయి( అంధురాలు ) చేసిన డాన్స్ నా శరీరాన్ని రోమాంచితం చేసింది . ఆ అమ్మాయి దీపాలు చేతపట్టి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది .ఆ అమ్మాయి చేసేటప్పుడు కాలి చివర చెంగు ఎక్కడ కాలుతుందోని భయపడ్డాను .కాని స్వాతి ఎటువంటి బెరుకు లేకుండా చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది .
నృత్యం పూర్తయ్యాక ఆమెను అభినందిస్తూ విశ్వనాద్ గారు తన వయసును ,అనుభవాన్ని మరచి స్వాతి చేతిని తన తలపై ఉంచుకొని ఆశీర్వచనం తీసుకున్న తీరు ....నన్ను కంటతడి పెట్టించింది .అది ఆయన కళామ తల్లికి ఇచ్చిన గౌరవమే...అంతే కాదు ...ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఏవిటో ఆయన్ను చుస్తే తెలిసింది .ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన మాట్లాడిన తీరు ...పార్టిసిపెంట్స్ నుండి తాను స్ఫూర్తి పొందానని చెప్పటం ఆయన వినమ్రతను , ఆయన వ్యక్తిత్వాన్ని మనముందుంచుతుంది .

సుదీర్ఘంగా సాగిన ఈ ప్రస్థానంలో చివరి వరకు నిలిచి గెలిచిన వారు ముగ్గురు . వారిలో మొదటి స్థానంలో బాలరాజుగారు , రెండవ స్థానంలో మాధవ గారు , మూడవ స్థానంలో దొరబాబు గారు నిలిచారు .

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ...వారి గెలుపును పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించి సంతోషించడం . చాలా షోల్లో ఓడిపోయిన వారు ఏడవటం ..ఎలిమినేషన్ రౌండ్లు ఎంత భీభత్సంగా ఉంటాయో మనందరికీ తెలుసు . ఐతే ఇక్కడ చూపుతోపాటు ఈర్ష్యా ద్వేషాలు కూడా లేని వీరంతా ఎంతో హుందాగా వైదొలగారే గానీ ఎక్కడా కంట తడి పెట్టలేదు. గెలిచిన వారు మాత్రమే కంట తడి పెట్టారు ఉద్వేగంతో ....

*త్వరలో బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో చిన్నారుల ప్రతిభను మనందరం చూసి వారిని ప్రోత్సహిద్దాం .....

11 comments:

  1. విజేతలకి అభినందనలు.. మామూలువారిలో కన్నా, శారీరక లోపాలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం పాళ్ళు అధికంగా ఉంటాయి. బహుశా అందువల్లే వారు ఓటమిని హుందాగా స్వీకరించ గలుగుతున్నారేమో అనిపించింది నాకు. చాలా రొటీన్ కార్యక్రమాల మధ్య ఇదో విభిన్నమైన కార్యక్రమం.. చక్కని టపా...

    ReplyDelete
  2. విజేతలకు అభినందనలు.కార్యక్రమం చూసి మీ స్పందనను చాలా బాగా వ్యక్తం చేసారు.
    కాలి చివర చెంగు ఎక్కడ కాలుతుందోని భయపడ్డాను,
    ....నన్ను కంటతడి పెట్టించింది
    ఈ రెండు వాక్యాలు వెన్న లాంటి మీ మంచి మనసును తెలియచేస్తున్నాయి.

    ReplyDelete
  3. మొదట్లో బ్లాక్ పోగ్రాం చూస్తున్నప్పుడు ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యేవాడిని. మనసులో ఎన్ని సార్లు వారిని అభినందించానో లెక్కే లేదు. ఒక్కోక్కసారి వారి నుండి స్ప్పూర్తి కూడా పొందేవాడిని. ఆగలేక ఒక టపాకూడా రాసాను. వారి ఆత్మవిశ్వాసానికి నిజంగా హేట్సాఫ్ చెప్పోచ్చు. ఇంత మంచికార్యక్రమం రూపొందించినవాళ్ళని కూడా అభినందించాలి. మంచి టపా అందించినందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
  4. ఈ పరిణామం, ప్రతి వారిలోని, వికలాంగతని గుర్తుకి రానీయకుండా,ప్రతిభ కనబరిచే అవకాశం, ఆదరణ అందించబడటం ముదావహం. 2సం. క్రితం వరకు దాదాపు 2 ఏళ్ళ పైగా ఒక అంధుడైన మానేజరు వద్ద పనిచేసాను. ఆయన పనిలో కనపరిచిన తీరు ఎంత అచ్చెరువున ముంచేదంటే మాటల్లో చెప్పలేను. ఈ దేశంలో అదీ ఐటి రంగంలో దాదాపు 20 సం.పైన ఆయన ఆ వృత్తిలో రాణించటం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇప్పటికి ఇద్దరం సహోద్యోగులం, నేనింకా "గుడ్మా.." అని పూర్తి చేయకమునుపే ఆయన "ఓ ఉష.." అంటూ గుర్తించటం నాకు ఎంతో సంబ్రమాన్ని, సంబరాన్ని కలుగజేస్తుంది. మనిషిలోని శక్తి కేవలం ఒక ఇంద్రియంలో లేదన్నది వీరంతా మనకి ఋజువుచేస్తున్నారు.

    ReplyDelete
  5. చాలా మంచి టపా పరిమళ. నేను అన్నీ ఎపిసోడ్స్ చూడలేకపోయినా కొన్ని చూసేను.. అవును వాళ్ళు పాడే తీరు కనపరిచే విశ్వాసం హుందాతనం నిజం గా ప్రశసనీయం.... విశ్వనాథ్ గారు ఎప్పుడూ ఒక విశిష్ట వ్యక్తే కదా.. ఆయన మంచితనం ఇంకోసారి మీ పోస్ట్ లో చదువుతుంటే సంతోషమయ్యింది. నలుపు అన్ని రంగులను తనలోకి ఇముడ్చుకోగలదు... అందుకేనేమో కంటి ముందు నలుపు అవిష్కరించినా అన్ని భావాలాను గుండెలోనికి తీసుకుని హుందా గా వ్యవహరించ గలిగేరు వాళ్ళందరు. చాలా మంచి టపా పరిమళా... ధన్యవాదాలు.

    ReplyDelete
  6. పరిమళంగారూ...
    నేనసలు ఈ ప్రోగ్రాం ఇంతవరకూ చూడలేదు. అసలు టీవీ చూసేదే తక్కువ. రోజూ ఆఫీసు పని, ఇంటిపనితోనే సరిపోతుంది. రాత్రి భోజనాల సమయంలో మాత్రం కాసేపు టీవీ చూస్తుంటాను.

    మీ కథనం చదివిన తరువాత ఖచ్చితంగా ఈ ప్రోగ్రామును చూడాలనిపిస్తోంది. చూస్తాను కూడా...! మీ భావాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ మిత్రమా...!

    విరజాజిపూలు
    http://virajajulu.mywebdunia.com

    ReplyDelete
  7. స్పందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు .

    ReplyDelete
  8. మంచి అంశాన్ని ఎత్తి రాసారు ..అభినందనలు .

    ReplyDelete
  9. టి వి చూసే యోగ్యం,తీరిక లేకపోయినటువంటి నా లాంటి దురదృష్ట వంతులకు కళ్ళకు కట్టినట్టు కామెంటరీ ఇచ్చారు ..బావుంది
    కే విశ్వనాద్ నిజంగా గొప్ప మనిషి

    ReplyDelete