Saturday, May 23, 2009
నాన్నచెప్పిన కధలు -2
అనగనగా మన దేశాన్ని నవాబులు పాలించే రోజుల్లో ....
ఓ రాజ్యాన్ని పాలించే నవాబు గారికి 14 భాషలు వచ్చు .చాలా శౌర్యమూ , తెలివీ అన్నీ ఉన్నా ఆయనకు ఒక బలహీనత ఉండేది .అది ఆయనకు కధలంటే విపరీతమైన పిచ్చి . ఎంతంటే రాజ్యపాలన కూడా పట్టించుకోకుండా రోజంతా కధలు వింటూ కాలం గడిపేవాడు .ఎన్ని కధలు విన్నా ఆయనకు తృప్తి ఉండేది కాదు . తనకు వచ్చిన 14 భాషల్లో ఏ భాషలోనైనా తను విసుగొచ్చి ఆపమనేంత వరకు కధలు చెప్పగలిగిన వారికి లక్ష దీనారాలు బహుమతి అనీ ...అలా చెప్పలేక పొతే 100 కొరడా దెబ్బలు శిక్ష అనీ రాజ్యంలో ప్రకటన చేయించాడు .ఎంతోమంది కవులూ ,పండితులూ నవాబుగారి దీనారాలకు ఆశపడి రావడమూ ....ఆయన్ను మెప్పించలేక శిక్ష అనుభవించి వెనుతిరగటమూ జరిగేది .
ఇదిలా ఉండగా రాజ్యంలో వర్షాలు కురవక కరువు తాండవించసాగింది.పంటలు పండకపోయినా పన్నులు కట్టవలసి రావడం నవాబుగారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా కధలతో కాలక్షేపం చేయడంతో రాజ్యం అస్తవ్యస్తమై పోయింది . మధ్యలో అధికారులూ , భటులూ ప్రజల వద్ద అందిన కాడికి దోచుకునేవారు .ప్రజలంతా అన్నమో రామచంద్రాని అలమటించే పరిస్థితి వచ్చింది .
ఆ రాజ్యంలోని ఓ కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు .తనకున్న నాలుగెకరాలూ పండించుకుని భార్యా పిల్లలతో హాయిగా కాలం గడిపేవాడు . కరువు ...రాజభటుల పన్నుల వసూళ్ళతో కుటుంబం ఆకలితో పస్తులుండే పరిస్థితి వచ్చింది . ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని రాజధానికి పనివెతుక్కుంటూ వెళ్ళాడు ఆ రైతు . అక్కడ రాజుగారి ప్రకటన గురించి తెలుసుకున్న రైతు స్వతహాగా తెలివైన వాడవటం చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా రక్షించుకోవాలని అనుకున్నాడు .
నవాబుగారు దర్బారులో కొలువై ఉండగా తాను కధ చెప్పటానికి వచ్చానని రైతు చెప్పగానే రాజుగారితో సహా సభికులంతా హేళనగా నవ్వారు . మహా పండితులే నవాబుగారికి విసుగు తెప్పించలేకపోయారు ఇతనెలా ఆయన చేత ఇక చాలనిపిస్తాడని ఆశ్చర్యపోయారు .నవాబుగారు సరే కానీ శిక్ష తెలుసుకదా ....నాకు విసుగోచ్చేవరకూ చెప్పలేకపోతే 100 కొరడా దెబ్బలు అన్నారు . రైతు తెలుసు ప్రభూ ..కాని నేను మీకు విసుగు వచ్చేవరకూ కధ చెప్పగలిగితే మాత్రం మీరు ఇంకెప్పుడూ కధలు వినకూడదు అన్నాడు .అతని ధైర్యానికి సభంతా నిర్ఘాంత పోయినా నవాబుగారు చిరునవ్వుతో ఒప్పుకున్నారు ధీమాగా తనకు విసుగొచ్చినప్పుడుకదాని ...
రైతు కధ చెప్పటం ప్రారంభించాడు .అనగనగా ఓ ఊరు . ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రిచెట్టు . ఆ చెట్టుకు లెక్కపెట్టలేనన్ని ఆకులు ....నవాబుగారు ...ఫిర్ ....అన్నారు .ప్రతీ ఆకు మీదా ఓ కొంగ ..అన్నాడు రైతు ....ఫిర్ ...అన్నారు నవాబుగారు.ఒక ఆకుమీది కొంగ తుర్ మని ఎగిరి పోయింది అన్నాడు ఆయన తిరిగి ..ఫిర్ ..అన్నారు ...రైతు ఇంకో ఆకుమీద కొంగ తుర్ మని ఎగిరిపోయింది అన్నాడు . మళ్ళీ నవాబుగారు ..ఫిర్ ..అనటం ...తిరిగి రైతు తుర్ ..అనడమూ ..ఇలా చాలాసేపు జరిగాక నవాబుగారు అడిగారు ఇంకా ఎంతసేపు ఎగిరిపోతాయి అని ..లెక్కలేనన్ని ఆకులు కదా ప్రభూ ..ఈ రోజు పూర్తవ్వచ్చు.. రేపు పూర్తవ్వచ్చు ..లేదా వారం తర్వాత పూర్తవ్వచ్చు ...అన్నాడు .ఎన్నిసార్లు తాను ఫిర్ అన్నా తిరిగి అతను తుర్ అనే అంటాడని అర్ధమై పోయింది ....నవాబుగారికి విసుగుపుట్టసాగింది.ఇక చేసేది లేక ఇంక చాలు ఆపు అన్నారు .
అప్పుడు నవాబుగారు రైతు తెలివిని మెచ్చుకొని తాను ప్రకటించిన బహుమతితో పాటూ ..తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు . అంతేకాదు రైతు ద్వారా రాజ్యం లోని పరిస్థితులు తెలుసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ...దళారులను శిక్షించి ...ఆదర్శవంతంగా పరిపాలించారు.
* తెలివైనవారు ఎప్పుడూ తన తెలివిని తమ స్వార్ధం కోసం మాత్రమే కాకుండా సాటివారికోసం కూడా ఉపయోగిస్తే అందరూ బావుంటారు .
Subscribe to:
Post Comments (Atom)
మీ కధ బా గుందండీ. మీ బ్లాగు కూడా బాగుంది.
ReplyDeleteమా చిన్నప్పుడు బళ్ళో మేష్టారు కూడా ఇలాంటి కథే చెప్పారండి.. కాకపొతే అందులో రైతు 'చీమ' కథ చెబుతాడు. ధాన్యపు గాది పక్కన చీమలపుట్ట.. "చీమ వెళ్ళెను..ధాన్యపు గింజ తెచ్చెను..పుట్టలో పెట్టెను.." ముగింపు మీరు చెప్పిందే...
ReplyDeleteChandamama pustakam chadivina challani feeling meeru raasi kadha chaduvutunte....Nice
ReplyDeleteకథ చాలా బాగుంది.పిల్లలకి, పెద్దలకి పనికి వచ్చె కథ.మా పిల్లల కి చెబుతాను.
ReplyDeleteఫిర్...తుర్... నవ్వులే నవ్వులు
ReplyDeleteనా చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటి కధనే చెప్పింది మరలా మీ కధ తొ అనాటి జ్ణాపకాన్ని గుర్తుచేసారు ధన్యవాదాలండి.
ReplyDeleteపూర్తిగా జ్ఞాపకానికి రాకపోయినా ఇటువంటి కథే విన్న గుర్తు. అలాగే తెనాలి రామలింగడి "మేకకు తొక, తోకకు మేక .." కథావైనం కూడా గుర్తు వచ్చింది.
ReplyDeleteమీ లాంటి వాల్లు ఇటువంటి పొస్ట్లు రాయబట్టే బ్లాగులు బ్లాగ్ అంటె విపరీతమైన పిచ్చి ఏర్పడి ఆఫీసు లో పనులు మానేసి రోజంతా బ్లాగులు చదువుతూ కాలం గడిపేస్తున్నారు ప్రజలు ..ఫిర్ అనే పదాన్ని బాగా వాడారు
ReplyDeleteఫిర్ ఆప్ కా అగలా పోస్ట్ కబ్ ఆయెగా
బాగా రాసారు.. మీకు అభినందనలు
కధలంటే నాకు భలే ఇష్టం...ఇలాంటి వెరైటీ రాజుల కధలంటే.. ఇంకా..:)Thanks
ReplyDeleteమీ అభినందనలకు నమస్సులు
ReplyDeleteసాహితీ సహృదయానికి వందనాలు
విరియాలి సదా ఈ స్నేహసుమాలు
- మన్నవ
మీ బ్లాగు నిర్వహణ బాగుంది, మీ కృషికి మరన్ని అబినందనలతో
మన్నవ65
@ జయచంద్రగారు , ధన్యవాదాలు .
ReplyDelete@ మురళిగారు , మీ మాష్టారికధ కూడా బావుందండీ ....అప్పట్లో మాష్టార్లు కధలూ ...దాంట్లోని నీతీ కూడా పిల్లల మనస్సులో చొచ్చుకుపోయేలా చెప్పేవారు .
@ పద్మ గారూ !థాంక్స్ ...
@ మాలగారు , పిల్లలకి కధలు వినే టైం ఎక్కడ ఉంటోందండీపాపం .....
@ విజయమోహన్ గారు :) :)
@ ఉష గారు ,మా నాన్నగారు మేక తోక కధ కూడా చెప్పేవారండీ ...
@ హరే కృష్ణ గారు , మీ స్పందనలేనండీ మాకు ప్రోత్సాహాన్నిచ్చేది .ధన్యవాదాలు .....తర్వాతి పోస్ట్ చూడండి ..
@ శివ గారు మీక్కూడా థాంక్సండీ ...
@ గంగాధర ప్రసాద్ గారు మీ స్పందనకు ధన్యవాదములండీ ..మీవంటివారి ప్రోత్సాహమే మాకు స్ఫూర్తి .
ఇదివరకటిలా చందమామ,బాలమిత్ర చదవటానికి కుదరటం లేదు(ఈ పుస్తకాలు ఇక్కడ దొరకవండి, ఓపిగ్గా వేటాడితే తప్ప)అని బాధపడే నాలాంటి వాళ్లకు కొంత ఉపశమనం దొరికినట్టే...ధన్యవాదాలు..
ReplyDeletethank u alot
ReplyDeleteకధ చాలా చాల బాగుంది
ReplyDelete