Wednesday, May 13, 2009

విరజాజి పూలు ....


వేసవి ఇంకా వెళ్ళనే లేదు ...మల్లెలింకా కనుమరుగవలేదు ....అప్పుడే విరజాజులు దర్శనమిస్తున్నాయ్ !
విరజాజి పూలు ....ఈ పూలంటే నాకు చిన్ననాటినుండే చాలా ఇష్టం ...మరచి పోలేని అనుబంధం కూడా ...అదెలాగంటే ...

చిన్నప్పుడు నాకు ఓ టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టారు .అప్పటికి మనకి A B C D లు వచ్చాయి కాని అ ఆ లు రావు . ( చదువులో మనది ఆరంభ శూరత్వం లెండి ..దాని గురించి ఇంకో టపా రాసుకుందాం ) టీచర్ గారు ఇంటిలోనే మాకు ట్యూషన్ చెప్పేవారు .ప్రతి రోజూ సాయంత్రం నాన్నగారు కాని అన్నయ్య కాని సైకిల్ మీద ట్యూషన్ లో దించి , తిరిగి అయిపోయే వేళకు వచ్చి నన్ను తీసుకు వెళ్ళేవాళ్ళు .

అప్పట్లో నాన్నగారికి నైట్ డ్యూటీలు ఉండేవి .నైట్ షిఫ్ట్ ఐతే పగలు ఖాళీ కాబట్టి నన్ను తనే తీసుకెళ్ళేవారు . ఆయనకి పగలు డ్యూటీ ఐతే అన్నయ్య తీసుకెళ్ళేవాడు .ఎవరు తీసుకెళ్తే ఏంటీ ..అనుకుంటున్నారా ...
నాన్నగారు సైకిల్ మీద వెళ్ళినంత సేపూ ...మన ప్రధాని ఎవరు ? రైల్వే మంత్రి ఎవరు ? ఆర్ధిక మంత్రి ఎవరు ? రాష్ట్ర ముఖ్య మంత్రి ఎవరు? మన జండాకు ఎన్ని రంగులు ..వగైరా ..వగైరా ...ప్రశ్నలతో బుర్ర తినేస్తూ ...కూతురు చెప్పే సమాధానాలకు తెగ మురిసిపోతూ ....ఇలా ...పరమ బోర్ గా సాగేది .

అదే అన్నయ్యైతే చక్కగా అప్పటికి కొత్తగా వచ్చిన సినిమా పాటలు పాడుతూ ...పాట రానిచోట .....నోటితోనే దరువేస్తూ ..మధ్య మధ్య సైకిల్ బెల్ తో మ్యూజిక్ ఇస్తూ ...భలే సరదాగా ఉండేది .నేనేమో ప్రతి రోజూ నాన్నగారికి నైట్ షిఫ్ట్ ఉండాలని దేవుడ్ని కోరుకునేదాన్ని .కొద్దిరోజులకు దేవుడు నామొర ఆలకించాడో ఏమో నాన్నగారి డ్యూటీ మారలేదు కాని అన్నయ్యను మా టీచరు గారి టైప్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు నా ట్యూషన్ టైం లో ...అప్పటి నుండీ నాకు రోజూ పాటల పండగే ...

ట్యూషన్ టీచర్ గారింట్లో విరజాజి పూల పందిరి ఉండేది .మేం వెళ్ళేసరికి ఆవిడ మొగ్గలు కోసి ఓ నీళ్ళ గిన్నెలో వేసి ఉంచేవారు .పిల్లలకు ట్యూషన్ చెప్తూ విరజాజులు మాల కడుతూ ....మధ్య మధ్యలో ఆ గిన్నెలోని నీళ్ళతో పలకలు తుడుస్తూ ...అక్షరాలు దిద్దించేవారు .

మరి నేనేమో కాస్త యాక్టివ్ గా ,ముద్దుగా , బొద్దుగా ఉండేదాన్నేమో ...పైగా అందరికంటే చిన్నదాన్ని కూడానూ ..అందుకో ఏమో నేనంటే ఆవిడకు ప్రత్యేకమైన అభిమానం .పిల్లలందరూ వెళ్ళిపోయినా అన్నయ్య వచ్చేవరకు తనతోనే ఉంచుకొని ..ప్రతి రోజూ ఎంతో ప్రేమగా జాజిపూల దండ జడలో పెట్టి పంపించేవారు . ఒక్కరోజు మానేయాలన్నా పూలు మిస్ అయిపొతాయో...ఎవరికైనా ఇచ్చేస్తారో అని అస్సలు మానేదాన్ని కాదు .అదిగో అప్పట్నుంచే విరజాజులంటే బోల్డు ఇష్టం .

టీచర్ గారికి సినిమా థియేటర్ ఉండేది.వాళ్ల ఇల్లు కూడా థియేటర్ గేటు లోనుండి లోపలికి వెళ్తే ఉంటుంది .ఆర్ధిక పరిస్థితుల వల్ల వాళ్లు థియేటర్ 30 ఏళ్ళకి లీజుకు ఇచ్చేసి ..వాళ్ల పిల్లలు టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ...టీచర్ గారి భర్త ఏవో ఆయుర్వేదం మందులు ఇస్తూ ..ఈవిడ ట్యూషన్ చెప్తూ ..కుటుంబాన్ని నడుపుకునేవారు . అలా నాకు ప్రతి రోజూ పూలతో పాటు కొద్దిసేపు సినిమా చూసే చాన్స్ కూడా దొరికేది .

ఈరోజు తెలుగు తప్పుల్లేకుండా రాయగలుగుతున్నానంటే ఆమె చలవే .తర్వాత మాకు ట్రాన్స్ఫర్ ఐనా .. మళ్ళీ మాకు పది సవత్సరాల తర్వాత తిరిగి అక్కడికే ట్రాన్స్ఫర్ అవడం వల్ల తరచూ టీచర్ గారిని కలుస్తూ ఉండేదాన్ని .మా పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడూ మా వారితో కలిసి చూడటానికి వెళ్తే ఆ వృద్ధాప్యం లో ఆవిడ ఎంత సంతోష పడేవారో ...అందరూ మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదురా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు .ఒకసారి వెళ్ళేసరికి బొట్టు లేకుండా ...చాలా బాధనిపించింది ....కొన్నాళ్ల తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యి మా సొంత ఊరిలో స్థిరపడ్డారు . చాన్నాళ్ళు గాప్ తర్వాత ఆ ఊళ్ళో బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్లి ..టీచర్ గార్ని చూద్దామని వెళ్ళా ....కాని ఆవిడ లేరు .విరజాజి పందిరి మాత్రం తలూగించింది నన్ను ఓదారుస్తూ ...పాత నేస్తాన్ని కదూ ....
ఇప్పటికీ విరజాజుల్ని చూస్తె టీచర్ గారు ఆవిడ ప్రేమా తలపుకొస్తాయి .

20 comments:

  1. బాగుందండి.. కొన్ని చూడగానే కొందరు గుర్తొస్తారు అప్రయత్నంగానే..

    ReplyDelete
  2. బాగున్నాయి అండి మీ విరజాజుల వూసులు.. నాకూ కూడా విరజాజులన్నా, సన్న జాజులన్నా చాలా ఇష్టం.. విరజాజులైతే పూల బజారు లో కూడా అమ్ముతారు కాని సన్నజాజులు మన దొడ్లో వుంటే తప్ప పెట్టుకోలేము, అంటే మీ టీచరు గారి లాంటి మంచోళ్ళు వుంటే మన తల లోకి వస్తాయి అనుకోండి. పువ్వులు మనకు డెవుడు ప్రతి రోజు ఇచ్చే అదనపు బహుమతి. అందుకే కదా దేవులపల్లి అన్నారు "మనసున మల్లెల మాలలూగెనె" అని.

    ReplyDelete
  3. Nice post!
    నాకెందుకో మల్లెల మీద విరజాజులంటే ఓ పిసరంత ఎక్కువ ఇష్టం :-)

    ReplyDelete
  4. మల్లెలంటే ఏ మగువకి ఇష్టముండదు.మండువేసవికి, మగువకి, మల్లెలకు ఓ మరపురాని అనుబంధం కదా.. అవునూ మీ చిత్రంలో ఉన్నవి సన్నజాజులు కదా.. నాలుగు రెక్కలతో ఉండి, మొగ్గలపై ఎర్ర గీత ఉంటాయి హైలో వాటిని చమేలీ అంటారు. అవి విరజాజులు కదా.... కాస్త ఈ సందేహం తీర్చండి..

    ReplyDelete
  5. జ్యోతి సన్నజాజులను చెమేలి అంటారా? సన్నజాజులు చెమేలి కంటే స్వల్పం గా అంటే ఇంకా నాజుకు గా వుంటాయి చెమేలి కొంచం పూరేకు మందం గా వుంటుంది అనుకున్నాను నేను... చెమేలి అంటే అడవి మల్లె లా వుండదా?

    ReplyDelete
  6. @ మురళి గారు , ధన్యవాదాలు .

    @ భావన గారూ ! నా ఊసులన్నీ ఓపిగ్గా చదివినందుకు థాంక్స్ ! మీరన్నట్టు సన్నజాజులు అమ్మరు. మన పల్లెటూళ్ళల్లో ఐతే ఎవరింట్లో ఉన్నా ఇరుగు పొరుగు వారికి ఇస్తారు . ముఖ్యంగా ....జాజులు , మల్లెలు ఉంటే కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకి ....

    @ నిషిగంధ గారూ , స్వాగతం ....
    మీ స్పందనకు ధన్యవాదాలు .

    @ జ్యోతిగారూ ! మీరు చెప్పినవి చమేలీలే ...పై చిత్రం లోనివి విరజాజులు ...ఇవి సన్నజాజుల కంటే చిన్నగా పొట్టి కాడతో ఉంటాయి . ఇవి బయట అమ్ముతారు . ఇప్పుడు మల్లెలతోపాటూ మార్కెట్ లో ఉన్నాయి . సన్నజాజులు మనకి ఊళ్లలో ఇంట్లో పందిరి ఉంటేనే తప్ప మన ఏరియా లో బయట అమ్మరు .పూలే కాదు రెండిటి ఆకులూ వేరుగానే ఉంటాయి .

    ReplyDelete
  7. అంతే కాదు విరజాజులు జీవిత కాలం కొంచం ఎక్కువ సన్నజాజులు కొంచం దుడుకుగా పట్టుకున్నా వూరికే ఎర్ర బడిపోతాయి కదా.. దండ కట్టటం సన్నజాజులతో తేలిక కదా పెద్ద కాడ తో... కాని సన్నజాజులు బాగా విచ్చేక కట్టటం కొంచం కష్టమే... అబ్బ నాకు ఎన్ని గుర్తు వచ్చేస్తున్నాయో థేంక్స్ పరిమళ గారు...

    ReplyDelete
  8. @ భావన గారు , చమేలీలు వేరు సన్నజాజులు వేరు .మీరన్న అడవి మల్లెలే చమేలీలనుకుంటా ! వాటి రేకులపై ఎరుపు గీతలుంటాయ్.సన్నజాజులు స్వచ్చమైన తెలుపుకదా !

    ReplyDelete
  9. హాయ్ ...మీ విరజాజుల పరిమళం ఇక్కడ గుప్పుమంటోంది ....ఒక్కో పూవు తో ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా ...సాయంత్రం మా చేట్టువే కోసి టీపాయి మీద గ్లాస్ బౌల్లో వేసా ...నేను కోసేప్పుడు నిద్రలో వున్నాయి ,ఇప్పుడు కళ్ళిప్పి ఇల్లంతా చూస్తున్నాయి ..మీరు అనే చమేలి (చంబెలి)పూలు చెన్నై, మైసూరు బృందావున్ లో తెగ అమ్ముతారు.వాటి వాసన బాగున్నా విరజాజి ,సన్నజాజి తో పోలిస్తే మోటుగా వుంటాయి...మీ టపా బాగుంది .

    ReplyDelete
  10. ఆడపిల్లలకి పువ్వులను మించిన నేస్తాలు,బహుమతులు వుండవేమో.మీ జ్ఞాపకం గుండెను మెలితిప్పిందండి.నాకు మల్లెలు తల్లోకి ఇష్టం.సన్నజాజుల పందిరి కింద కుర్చోడం ఇష్టం.

    ReplyDelete
  11. విరజాజుల్ని చూడగానే అప్రయత్నంగా టీచర్ గారు గుర్తుకురావడం ఆమెపై మీకున్న అభిమానమే.నాకు మాత్రం ఇప్పటికికూడా మల్లెల్లో తేడాలు సరిగ్గా తెలియవు

    ReplyDelete
  12. మరి నేను ఊరికే పెట్టుకున్నానా నా బ్లాగుకి జాజిపూలూ అని :) nice post

    ReplyDelete
  13. సన్నజాజులు చూస్తే అమ్మను చూసినంత సంతోషమేస్తుంది. అమ్మకు సన్నజాజులంటే అమంత ఇష్టం. అందుకే ఇంట్లో ఆ చెట్టు పెట్టుకున్నాను. విరిజాజులైతే త్వరగా వాడిపోతాయి కదూ! ఎదేమైనా మండే ఈ ఎండల్లో ఈ పూలు మనసుని, మనిషిని భలే చల్లబరుస్తాయి. అచ్చంగా మీలానే పరిమళం.:)

    ReplyDelete
  14. చాలా బాగుంది పరిమళం గారు nice post

    ReplyDelete
  15. పరిమళం గారూ..
    సరదా సరదాగా సాగుతున్న విరజాజుల కబుర్లు చదువుకుంటూ చివరికొచ్చేసరికి.. మనసంతా అదో మాదిరిగా అయిపోయిందండీ..ఏంటో వైరాగ్యం మాటలు గుర్తొచ్చేస్తున్నాయి :-( ఏది ఏమైనా జీవితాంతం విరజాజుల పరిమళాలలో మీ టీచర్ గారు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు.
    అన్నట్టు.. నాక్కూడా..మల్లెపూల కన్నా.. బాగా ఒత్తుగా కట్టిన విరజాజి, సన్నజాజి మాలలే ఇష్టం. మా ఇంట్లో రెండూ ఉన్నాయి. కానీ, నేనే ఇంట్లో లేను :-(

    ReplyDelete
  16. @ చిన్ని గారూ ! అవునండీ చమేలీలు కొంచెం మోటుగానే ఉంటాయ్ . కాని మంచి వాసనతో ఉంటాయ్ .పూలను గ్లాస్ బౌల్ లో వేసే అలవాటు నాకూ ఉందండీ ...టపా నచ్చినందుకు థాంక్స్ .

    @ రాధిక గారూ ! వెన్నెల్లో పూలు కోయని సన్నజాజి పందిరి ని చూస్తే ....చందమామ పైనుంటే నక్షత్రాలు కిందికి దిగి వచ్చాయని పిస్తుంది .ధన్యవాదాలండీ .

    @ విజయ మోహన్ గారు , ధన్యవాదాలు .

    @ నేస్తం గారూ ! అందుకే మరి మీ బ్లాగ్ కి ఆ సౌరభం !

    @ శృతి గారూ ! మీ అభిమానానికి థాంక్స్ ...నిజానికి బ్లాగ్ నాదైతే పరిమళం మీ స్పందనలే ...

    @ శ్రీ గారు , థాంక్స్ ..

    @ మధురవాణి గారూ ! నిజానికి చివరి పేరా రాయాలని అనుకోలేదండీ ...పూలమీద ఇష్టం వరకు ఆపేద్దామనుకున్నా ...కాని మనసు మాట వినలేదు ...టీచర్ గారితో నా అనుబంధం మీ అందరితో పంచుకోవాలని అనిపించింది . మా ఇంట్లోనూ మల్లె , సన్నజాజి , విరజాజి పందిళ్ళు ఉండేవి ...మరి నేనూ అక్కడలేను మీలాగే :(

    ReplyDelete
  17. చిన్ననాటి నేస్తాన్ని మళ్ళీ ఆనందం వాటిని చూస్తుంటే. సన్నజాజి కన్నా నాకు విరజాజి పట్ల మక్కువ మరీ ఎక్కువ. మా వూర్లవైపు వీటి వాడకం మరీ ఎక్కువ, ముఖ్యంగా రావులపాలెం ప్రాంతాల్లో అమ్మేవార్ని చూసే పూల తోట వేసుకుని అక్కడే గడపాలన్న కోరిక బలీయంగా కలిగేది. ఇప్పటికీ ఆశ, ఏదో ఒక రానున్న రేపుల్లో నేనొక ఎకరం పూల మడుల్లో, ఒక ఎకరం ఆకు కూరల మడుల్లో పాటలు పాడుకుంటూ, కవితలు వ్రాసుకుంటూ గడుపుతానని. మీ జ్ఞాపకం లోనూ జాజులంత గాఢమైన పరిమళం వుంది. మీ మాటల్లోనూ అది గుభాళించింది.

    ReplyDelete
  18. @ ఉషాగారు , ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది ఉష గారు ....తప్పక నెరవేరుతుంది ... :) :) (నువ్వు నాకు నచ్చావ్ స్టైల్ లో )ధన్యవాదాలండీ..

    ReplyDelete
  19. చిన్నప్పటినుంచీ పువ్వులంటే భలే ఇష్టమండీ. నా చిన్నతనం నుంచీ ఇప్పటికి కూడా అమ్మావాళ్లు పువ్వులు అమ్ముతూ ఉన్నారు. ప్రతిరోజూ కొట్టుకు తీసుకెళ్లేందుకు ముందుగానే అమ్మ ప్రతిరోజూ నాకోసం తీసిపెట్టిన తరువాతే తీసుకెళ్తుండేది. నా పెళ్లయిన తరువాత పాపం అమ్మకు ఆ అవకాశం లేకపోయింది.

    తరువాత నాకు కూడా అంతగా ఆశక్తి లేకపోయింది. అయితే ఊరెళ్తే మాత్రం అమ్మ ఎప్పటిలాగా నాకోసం పువ్వులను ఉంచటం షరా మామూలే. అయితే నాకు ఎక్కువగా మల్లెలు, జాజిపూలు బాగా ఇష్టం. మల్లెపూవులంటే మరీ ఇష్టం సుమండీ..!

    నా చిన్నప్పటి జ్ఞాపకాలను మీ కథనంతో మరోసారి తట్టి లేపినందుకు కృతజ్ఞతలు మిత్రమా...!

    ReplyDelete
  20. విరజాజి పూల తోటలోకి
    ఆలస్యంగా వచ్చాను

    ReplyDelete