Thursday, April 2, 2009

మన్నించు నేస్తం !


పింకీ ....అప్పుడు నెల ఉంటుందేమో దాని వయసు .తెల్లని తెలుపు ...గుండ్రటి ,నల్లటి కళ్ళూ ...చిన్ని మూతీ ..ఎంత ముద్దుగా ఉండేదో ..

బాబాయ్ గారింట్లో దాన్ని చూసి ముద్దుగా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ..హడావుడిగా క్రిందికి దూకి ...వాకిట్లోకి వెళ్లి ----పని కానిచ్చి తిరిగి తోకూపుకుంటూ నా దగ్గరకొచ్చి నిలబడిన దాని సంస్కారానికి ముచ్చట పడిపోయి దాని సహోదరులనుండి విడదీసి మరీ తెచ్చుకున్నాను .( మా వారికిష్టం లేకపోయినా )

పింకీని నేనూ ,పిల్లలూ చాలా గారంగా చూసేవాళ్ళం .పోటీపడి దానికి స్నానం చేయించడం , జుట్టు దువ్వడం , పాలుపోయడం ...మావారి కొరకొర చూపుల్ని లెక్కచేయకుండా మా పని మేం చేసుకునేవాళ్ళం .దానిష్టమైనవి ఉడక పెట్టిన గుడ్డు , చికెన్ బోన్స్ , కార్ట్ బిస్కెట్స్ .ఇక పుచ్చాకాయంటే దానికి ప్రాణం .

పళ్ళు వస్తూన్నప్పుడు మొదలైంది మాకు తంటా ! ఏది కనిపించినా కొరికి పెట్టేది ...ముఖ్యంగా చెప్పులు .అది చేసే చేష్టల కన్నా మావారు చూసే చూపులు ఎదుర్కోవడమే కష్టం గా ఉండేది .కానీ పింకీ చాలా తెలివైంది .కొద్దికాలం లోనే తోకూపుకుంటూ .కాళ్ళ పైకెగబాకుతూ మవార్ని మార్చేసింది .

సంవత్సరం ఐంది .పిల్లలు సరదాగా దాని పుట్టిన రోజుని జరుపుకున్నారు .నా పూలతోటకు భలే కాపలాగా ఉండేది బయటి వారెవరూ ఒక్క పూవు కూడా కోయకుండా .

కొన్నాళ్ళకు పింకీ తల్లయింది .ఎనిమిది పిల్లలు .మొదటిసారి అవటం వల్లా ,ఎక్కువ పిల్లల వల్లా ...చాలా పలుచటి స్కిన్ తో బలహీనంగా పుట్టాయి పిల్లలు .వాటినెంత జాగ్రత్తగా పోదువుకోనేదో పొట్టకింద .ఆ ప్రేమే వాటి ప్రాణాలు తీసింది .అవి లుకలుక మంటూ కాస్త దూరం జరగ గానే ....పళ్ళతో దగ్గరకు లాక్కునేది .నాట్లు పడి గాలి లోపలికెళ్ళి పిల్లలు చనిపోయేవి .నన్ను తప్ప ఎవ్వర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు .ఒక్కొక్కటిగా పిల్లలన్నీ చనిపోతుంటే చూడలేక చివరగా మిగిలిన ఒక్క పిల్లనీ వేరు చేసి బాటిల్ తో బయటి పాలు పట్టి పెంచాను .నేలతిరిగే సరికి అది పింకీ కంటే ముద్దుగా ,బంతిలా తయారైంది .పిల్లలు దానికి ప్రెట్టీ అని పేరు పెట్టారు .పింకీ ,ప్రేట్టీల ఆటల మధ్య పిల్లలకు టైం తెలిసేది కాదు .

మా బంధువులు బ్రతిమాలి ప్రెట్టీ ని పెంచుకుంటామని తీసుకెళ్ళి పోయారు .కొన్ని రోజులు పింకీ దిగులుగా కనిపించినా ..త్వరగానే మర్చిపోయింది .దాదాపు మూడు సంవత్సరాలు మాలో ఒకటిగా కలిసిపోయింది పింకీ .

తర్వాత కొన్నాళ్ళకి మేం హైదరాబాద్ వస్తూ అపార్ట్ మెంట్స్ లో కష్టం అని తెలిసిన వారికిచ్చేశాం పింకీని .గొలుసు పట్టుకొని వాళ్లు తీసుకెళ్తుంటే వెళ్లనని గొడవ చేసింది .అయినా బలవంతంగా తీసుకెల్లేప్పుడు అది చూసిన చూపు ...నా జీవితాంతం మర్చిపోలేను .అది జాలో ....నాపై ప్రేమో ....నన్ను క్షమించేంత దయో ....
ఆ చూపుకి భాషే ఉంటే ...బహుశా ఈ వీడ్కోలు శాశ్వతం చేయకు నేస్తం ! అని అడిగి ఉండేదేమో ?

ఇప్పటికీ బయటికెళ్ళినప్పుడు కుక్క పిల్లలు కనిపిస్తే పింకీ ..దాని జాలి చూపులు గుర్తుకొచ్చి గొంతులో దుఃఖం సుడులు తిరుగుతుంది .అపరాధ భావనతో తల వాలి పోతుంది .

13 comments:

  1. పరిమళ గారు,
    ఈ రొజు ఉదయము నుండి ఎందుకో మా చుటికి గుర్తుకు వస్తొంది.
    మీ టపా చూసాక ఎంత కొ ఇన్సిడెంట్ అనుకున్నాను.
    వద్దంటె మా అబ్బయి వింకుండా తెచ్చాడు.పదునాలుగు సంవత్సరాలు ఉన్నది.
    పిల్లలు దూరంగా ఉన్నపుడూ చాలా కంపేని ఇచ్చేది.
    మూడు సంవత్సరాలు అయినా మరచి పొలేకున్నాను.

    ReplyDelete
  2. పెంపుడు జంతువులతో అటాచ్మెంట్ పెంచుకోవడం చాలా సులువు, తెంచుకోవడం చాలా కష్టం.. పెంచిన వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ.. మా పెంపుడు కుక్కలన్నీ గుర్తొచ్చాయి..

    ReplyDelete
  3. కన్నీళ్లు పెట్టించడం భావ్యమా చెప్పండి?

    ReplyDelete
  4. పరిమళం గారు ఎందుకో ఈ పోస్ట్ చదివాకా మీ మీద కోపం వచ్చింది.. అనుకోకుండా ఒక అనాధ కుక్కపిల్లను పెంచుకోవడం వేరు..కాని దాని కుటుంభంతో దాన్ని వేరు చేసి మరీ వదిలేసారు..అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు మరొక వైపు పెంచిన మీరు అందరూ దూరం అయిపోతుంటే ఆ మూగ జీవి వేదన ఎవరికి చెప్పుకుంటుంది.. ఎందుకంటే మా వారి కుటుంభంలో కూడా ఒక కుక్కపిల్లను ఇలాగే తెచ్చి దాన్ని బాగా ముద్దు చేసి ఎవరికి వారు విదేశాలు చెక్కేసారు.. పాపం అది వచ్చినపుడల్లా వదిలేదికాదు బయటకు వీళ్ళూ వెళుతున్నా వదిలేది కాదు భయం తో ..మళ్ళీ దాన్ని వదిలి వెళ్ళీపోతారేమో అని .. ఆకరికి అది కాలం చేసినపుడు ఇక్కడ మౌనం గా రోధించడం తప్ప ఇంకేం చేయలేకపోయారు ఈయన.. మనం వాటిని చివరి వరకూ చూడగలం అనే నమ్మకం ఉంటేనే పెంచాలి.. క్షమించండి మీ మనసునొప్పించాలని కాదు..

    ReplyDelete
  5. ఆర్ద్రంగా, చక్కగా వెలిబుచ్చారు మీకున్న అభిమానాన్ని. అభినందనలు, పరిమళంగారూ.

    ReplyDelete
  6. మీ బాధ నాకర్ధమయ్యింది.
    కానీ వాటికి క్షమించే గుణం ఎక్కువనిపిస్తుంది నాకు.
    వీలుంటే ఈ టపా చదవండి.

    ReplyDelete
  7. ఈరోజే మా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది.తొమ్మిది సంవత్సరాలుగా మేము ముద్దుగా పెంచుకొన్న మా .'టీనూ' ఈరో జు ఉదయమే కన్నుమూసింది. ఇంట్లో ఎక్కడ చూసినా ఆ ఞాపకాలే మమ్మల్ను వెంటాడుతున్నాయి .
    నిజంగా ఈ విషాదం భరించలేనిది.

    ReplyDelete
  8. కుక్కపిల్లలంటే ఇష్టమేగానీ వాటితో అనుబంధంపెంచుకుని తర్వాత బాధపడడం ఇష్టం లేక వాటిని పెంచుకోవడంలేదు.కానీ చాలా ఏళ్ళనుంచి మా ఇంట్లో పిల్లులతో అనుబంధం ఉంది.కానీ వాటికి ఆహారం పెట్టడంవరకే మాపని వాటిపై మమకారం మాత్రం పెంచుకోవడంలేదు

    ReplyDelete
  9. మా రాయుడు ని కూడా ఇరవై రోజుల బిడ్డ గా ఉండగానే తెచ్చుకున్నాను.ఇప్పుడు వాడు లేకుండా ఉండలేనేమో బహుశా. మూడు సంవత్సరాలు ఉంచుకుని కూడా ఎలా ఇవ్వగలిగారు?????

    ReplyDelete
  10. కొన్నిసార్లు తప్పవండి మా బ్రూని గుర్తొచింది. మా మద్యలేదు .చనిపోయి ఆరో సంవతరం డిసెంబర్ కి

    ReplyDelete
  11. మా టఫ్ గాడు కూడా నెలలో పిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చాడు. మొన్న మార్చి 18న వాడి మొదటి పుట్టినరోజు అయింది. కేక్ అన్నా ఐస్ క్రీం అన్నా పిచ్చి ఇష్టం. ఇంటికి వచ్చిన వాళ్ళందరిని వాడి చూపులతో ఇట్టే ఆకట్టుకుంటాడు. ప్రొద్దున్న మాత్రం బయటికి వెళ్ళుతుంటే వెళ్ళొద్దు అని కాళ్ళకి చుట్టేసుకుంటాడు.అప్పుడు మాత్రం వాడి ముఖం చూస్తే జాలి వేస్తుంది. కాని ఏం చేద్దాం తప్పదు కదండి!!!!

    ReplyDelete
  12. @ మాల గారూ ! ఒక్కోసారి అంతేనండీ ..... చుటికి పేరు బావుందండీ ! ధన్యవాదాలు .

    @ మురళి గారు , ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను .ఫిష్ ఎక్వేరియం కొందామని షాప్ వరకూ వెళ్లి తిరిగివచ్చేశాను . అవి దూరమైతే ...అన్న ఊహతో ...

    @ అరుణ గారూ ! స్వాగతం ..ఇదే మొదటిసారనుకుంటా మీరు నా బ్లాగ్ లోకి రావటం .రాసే టప్పుడు నాకళ్ళూ చేమర్చాయండీ ..ధన్యవాదాలు .

    @ నేస్తం గారూ ! మీ కోపం సహేతుకమైనదే ..కుక్కపిల్లల్ని ఒక నెల తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తుంటారు సాధారణం గా , అన్ని పిల్లల్ని పెంచటం కష్టమని .తర్వాత మేం దాన్ని తెచ్చుకునేటప్పటికి సొంత ఊరిని , మా పొదరింటిని, ముఖ్యంగా మా గోదారి తల్లినీ వదిలి వచ్చేస్తామని అస్సలు అనుకోలేదండీ . అప్పుడు అపార్ట్ మెంట్స్ లో మేం అలవాటు పడటమే కష్టమైంది . దానికైతే జైలులా ఉండేది .పైగా మా ఫ్లాట్ లో పెట్స్ ని పెంచుకోకూడదని రూల్ ఉండేది .ఏదేమైనా అపరాధ భావన నన్ను ఎన్నేళ్ళైనా వీడిపోలేదండీ ....

    @ మాలతి గారూ , ధన్యవాదాలండీ !

    @ భవాని గారూ ! మీ నిక్కి టపా చదివానండీ ...ఒక్కోసారి తప్పని పరిస్థితుల వల్ల వదలాల్సి వస్తుంది .ప్చ్ ...

    @ జయచంద్ర గారూ ! నిజంగా విషాదమేనండీ ...వదిలి వచ్చినందుకే బాధగా ఉంది ...టీనూ శాశ్వతంగా దూరమైనందుకు మీకెంత బాధగా ఉంటుందో ....అవిలేక పోయినా జ్ఞాపకాలు వీడవండీ ...

    @ విజయమోహన్ గారు , మనం పెంచుకోక పోయినా అవి ఎదురు చూస్తాయండీ ...ఆహారం కోసమే కాదు అవి పెట్టే మన కోసం కూడా ...

    @ శ్రీనివాస్ గారూ ! రాయుడు పేరు బావుందండీ ..రాయల్ గా ...నేస్తం గారికిచ్చిన సమాధానమే మీకూనూ ...

    @ చిన్ని, ధన్యవాదాలండీ !మా పింకీ మీ బ్రూనీ ని గుర్తుకు తెచ్చిందన్నమాట .

    @ పద్మార్పిత గారూ ! మీ టఫ్ గాడికి బిలేటేడ్ హేపీ బర్త్ డే ! ఇష్టమని స్వీట్స్ ఎక్కువ పెట్తేయకండేం... :)

    ReplyDelete