
నా
గోరింట పూసింది...అరచేత ! టపా చదివిన మిత్రులకు సోమయ్య పరిచయమే ...సోమయ్య ...నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మమ్మగారింటి పాలేరు ...బహుశా తన చిన్నప్పట్నుంచే మాదగ్గరే పనిచేసేవాడనుకుంటా ..వాళ్ల నాన్న కూడా తాతగారి దగ్గర పొలాలు చూసుకోనేవాడనుకుంటా ! అమ్మమ్మగారింటికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ...నన్నెంతో గారాబం చేసేవాడు ...గోరింటాకు , చెరుకుగడలు ,కందికాయలు ...ఇలా ఏదడిగితే అది తెచ్చి తిను బుజ్జమ్మా ..మీ టౌనోల్లకి ఇయన్నీ దొరకవుకదా అంటూ ఎంతో ఆప్యాయంగా చూసేవాడు .
ఇక వేసవి సెలవుల్లోనే అమ్మమ్మగారి ఊరిలో ప్రతి ఏటాగౌరమ్మ సంబరం జరుగుతుంది . అది కూలీలంతా కలిసి కట్టుకున్న గుడన్న మాట ! చందాలు పోగేసి చాలా బాగా జాతర జరిపేవారు. ఇక ఊరేగింపులో గరగలు , గారడీ వాళ్లు , బ్యాండు పార్టీలూ , కోయ డాన్సులూ , పౌరాణిక ,సాంఘిక వేషధారణలు ...రాత్రి సందకాడ మొదలైన ఊరేగింపు తెల్లరేవరకూ జరిగేది .ఇంతకూ విశేషమేవిటంటే ...ఈ వేషాలు వేసుకున్నోళ్ళంతా మా కళ్ళముందు తిరిగే చాకలి
వీరయ్యా, టైలర్ సత్తిబాబు , ఇంకా మా సోమయ్యా ...మొదలైన వారన్న మాట !
ఇక ఊరేగింపులో చివరగా వేషాల బళ్ళు మొదలవగానే మొదలయ్యేది మా సెర్చింగ్ . ఎవరు ఏ వేషం వేశారా అని ! ముఖ్యంగా మా సోమయ్య కోసం
! రాముడి వేషం వేసుకొని విల్లు బాణాలతో , పక్కనే సీతా లక్ష్మణులతో కదలకుండా నిలబడి ఉండేవాడు. మా ఇంటిదగ్గర బండి ఆగగానే సోమయ్యా సోమయ్యా అంటూ అరిచి గోల చేసేవాళ్ళం ( పిన్నిల పిల్లల తో కలిసి చిన్నగాంగ్ అయ్యేదిలెండి ) కళ్లు మాత్రం తిప్పి చిరునవ్వులు చిందిన్చేవాడు కానీ అంగుళం కూడా కదిలేవాడు కాదు...మేం కాగితాలు విసిరి , మాతమ్ముడైతే చిన్న చిన్న రాళ్ళు కూడా విసిరి అమ్మమ్మ చేత చివాట్లు తినేవాడు.అయినా సోమయ్యని మాత్రం కదిలించలేక పోయేవాళ్ళం
.అలా మా ఇల్లు దాటేవరకూ నరకం చూపించేవాళ్ళం .
అలా మేం పెద్దై పోయాం ...అమ్మమ్మ ,తాతగారు కాలం చేశారు ...పొలాలు కౌలుకిచ్చేసే వారనుకుంటా ! ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యాక ...అమ్మకి తాతగారిల్లు రావటం వల్ల అక్కడే సెటిలయ్యారు . అప్పట్నుంచీ మళ్ళీ సోమయ్య విశేషాలు తెలుస్తున్నాయి . మా పొలాలే కౌలుకు చేసుకుంటూ ...సొంతంగా పశువులను కొనుక్కుని పాడి చేసుకుంటూ
చక్కగా పైకొచ్చాడు .ఇప్పటికీ ఏ పనికైనా మాకు సాయం వస్తుంటాడు .
ఆ మధ్య ఊరెళ్ళినప్పుడు వీరభద్రుని బోణం రోజు వంటచేస్తూ కనపడ్డాడు సోమయ్య ! నేను ఆశ్చర్యంగా ఏంటి సోమయ్యా !అంటే నాన్నగారు చెప్పారు మనకి సోమయ్య గాని ఇప్పుడందరికీ సోమరాజుగారమ్మా ....అని ! చిన్నగా ఓ వంట మాస్టర్ దగ్గర అసిస్టెన్స్ చేస్తూ తనూ నేర్చుకొని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు దాదాపు ఐదారు వందల మందికి వంట చేయగల మాస్టర్ ఐపోయాడు సోమయ్య ..కాదు కాదు సోమరాజుగారు !పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే సోమరాజుగారి సెల్ కి విశ్రాంతే ఉండదు .
అన్నట్టు మన సోమరాజు గారికి భక్తి కూడా ఎక్కువేనండోయ్ ప్రతి ఏటా భవానీ మాల వేసుకుంటాడు .అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా
ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు .
ఈమధ్య ఊరెళ్ళినపుడు ...నాటుకోడిని కోసి మాంసం తెచ్చి ....అయ్యో పెంచుకునే కోడిని కోసేసేవా అని బాధపడితే ..మీరెప్పుడూ బాయిలర్ మాసమే తింటారు బుజ్జమ్మా ..మేం అస్సలు తినం కావలసినప్పుడు ఓ కోడిని కోసుకుంటాం (వాళ్ళింట్లో పెంచిన కోళ్ళని , కోడిగ్రుడ్లనీ అస్సలు అమ్మడట ! వాళ్లింట్లోకే పెంచుతాడట !
) అంటూ అమ్మా ...ఉల్లిపాయలిలా పడేయ్ , కూర వండేసి వెళ్తాను అంటూంటే ఎన్నేళ్ళైనా తరగని ఆప్యాయతకు కళ్లు తడిసాయ్ !
** పై ఫోటోలో సోమయ్యని వెతక్కండెం....తన ఫోటో లేక గూగుల్ లోది పెట్టా ...