Tuesday, November 24, 2009

వెదుకుతున్నా ఇంకా ....


మోయలేని బాధ్యతగా ....
నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని
అతికించుకోలేని నా అసహాయతనీ
వ్యక్తపరచలేని నా ఆవేదననీ
చెలమలౌతున్న నా కళ్ళనీ
దాచుకొని...తిరిగిరాని గతంలోని
ప్రతి మధురస్మృతినీ పదిలంగా మోస్తూ
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ....మన ప్రేమని !!

16 comments:

  1. వెతుకులాట ఎందుకు ప్రేమ కోసం
    ఉంది కదా అది హృదిలో వెల్లువై
    ఎగసిపడనీ అలలను ఎత్తుగా
    తడిసిపోనీ మదిని చల్లగా..

    ReplyDelete
  2. కడలివి నీవు
    సాహసి నేను
    ఎన్నిసార్లు ముంచినా
    ఎదలోతుల శోధన నాపలేను
    ఎన్నిసార్లు విసిరేసినా
    అవతలి గట్టెక్కే వరకు ఈ(త) సాధన మానుకోను
    కరుణిస్తావో-కాలానికే వదిలేస్తావో
    నన్ను గెలిపించి గెలుస్తావో(విను విను విన్-విన్ లా)!
    అగాధ జలధి అట్టడుగున సమాధి చేస్తావో!!
    sadaa nee
    snehaabhilaashi raki

    ReplyDelete
  3. బాగుందండీ..కొంచెం విషాదంగా అనిపించింది.

    ReplyDelete
  4. పరిమళ గారు బాగుందండి ప్రేమ. కాని ప్రేమని ఇంత వెదికే ప్రయాస బాధనిపిస్తోంది.

    ReplyDelete
  5. అయ్యో... బాధేసింది.. :-(

    ReplyDelete
  6. ప్చ్.....మీరిలా విషాద కవితలు రాస్తే నాకు ఏం రాయాలో తోచదండీ...నిన్న అందుకే చదివి ఏం రాయాలో తోచక వెళ్పోయా....

    ReplyDelete
  7. పగిలిన హౄదయం పనికి రాదు
    గడిచిని గతమూ తిరిగిరాదు
    ఉప్పునీతి చెలమ దాహం తీర్చదు
    మంట మిగిల్చేది ఏమి వుండదు ....ఇంత విరహమా ?

    ReplyDelete
  8. గతమంతా తీపి గురుతుల మయం
    అవిలేవని తెలిసాక ఆ భాధ మోయటం ఇబ్బందికరం
    భవిష్యత్తు తాలూకు వర్తమానాన్ని సరయిన దారిలో తీసుకెళ్ళడం భాద్యతాయుతం

    చక్కగా రాసారు

    ReplyDelete
  9. హృదయం ముక్కలుగా పగిలేది,
    పది మంది తొ పంచుకోవడానికేనేమో!?
    వ్యక్రి కి పరిమిత మైన ప్రేమని, చరాచరానికి
    అపరిమితంగా పంచడానికేనేమో..?!!

    ReplyDelete
  10. ప్రేమ కి రూపం లేదు. అది మనం ప్రేమించే వ్యక్తిగానో, మనని ప్రేమించే వ్యక్తిగానో మాత్రమే రూపుదిద్దుకుంటుంది. నేనూ ఒకప్పుడు అన్వేషించాను. తన ఆగమనం నా జీవితంలో జరిగే వరకు ఇలా..
    నేనింకా నీ రాక కోసం వేచివున్నానని, నీవొచ్చే దారులు వెదుకుతున్నానని చెప్పాగా నీకు, ఇపుడూ
    నేను వెదుక్కుంటున్నా ...
    వెదుకులాటలోనే వున్నానని వుసూరుమంటూనేవున్నా
    ఎందుకంటే ఎపుడూ వెదుక్కుంటునేవున్నా,
    వెదికినవేవి నాకు దొరకవని గురుతుకీ రాదు మరి
    వెదకాల్సినవింకేవీ లేవని ఆపేసిన క్షణం
    మిగిలిన నన్ను నేను మళ్ళీ వెదుక్కోవాలని అనిపిస్తుంది,
    నేను కనుక నాకు మళ్ళీ దొరికితే
    ఈ సారి మాత్రం వెదకటాన్ని ఇంకెవరికైనా వీలునామా వ్రాసేయాలని.
    వెతుక్కోవాల్సినవి మాత్రం వారు ఎంచుకోవాలని
    నే వెతికినవేవీ ఈ లోకంలో ఇంకెక్కడా వుండవని
    నా కెపుడోనే తెల్సిందని చెప్పటానికి మాత్రం మాటలు వెదుక్కుంటున్నా
    ఆవి వినే మనిషి కొరకు మాత్రమే ఇపుడు వెదుక్కుంటున్నా

    మరి చెస్తావా ఆ మాట నాకు, నే వెదుక్కున్నది నిన్నేనని?

    ReplyDelete
  11. ఇప్పుడే నాకొచ్చిన మీ కామెంట్ నుండి మీ ప్రొఫైల్ కి అక్కడ నుండి మీ బ్లాగ్ కి వచ్చి కొన్ని మంచి కవితలను చదివాను. బాగున్నాయండి మీ కవితలు. ముఖ్యంగా "చెలమలు" లాంటి పల్లె పదాలు విని, చదివి చాలా రోజులయ్యింది, మంచి కవితలకి, మీరు పంపిన కామెంట్స్ కి కృతజ్ఞతలు.

    ReplyDelete
  12. కవిత బావుంది. మీ బ్లాగ్ లో ఏదో స్టికీ ఫాక్టర్ ఉంది. బ్లాగ్ (టెంప్లేట్) థీమ్ చాలా హాయిగా ఉంది.

    ReplyDelete
  13. @ వాసుగారు ! థాంక్స్ :) :)

    ReplyDelete