Tuesday, November 17, 2009

సోమయ్య ....కాదు సోమరాజుగారు !


నా గోరింట పూసింది...అరచేత ! టపా చదివిన మిత్రులకు సోమయ్య పరిచయమే ...సోమయ్య ...నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మమ్మగారింటి పాలేరు ...బహుశా తన చిన్నప్పట్నుంచే మాదగ్గరే పనిచేసేవాడనుకుంటా ..వాళ్ల నాన్న కూడా తాతగారి దగ్గర పొలాలు చూసుకోనేవాడనుకుంటా ! అమ్మమ్మగారింటికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ...నన్నెంతో గారాబం చేసేవాడు ...గోరింటాకు , చెరుకుగడలు ,కందికాయలు ...ఇలా ఏదడిగితే అది తెచ్చి తిను బుజ్జమ్మా ..మీ టౌనోల్లకి ఇయన్నీ దొరకవుకదా అంటూ ఎంతో ఆప్యాయంగా చూసేవాడు .

ఇక వేసవి సెలవుల్లోనే అమ్మమ్మగారి ఊరిలో ప్రతి ఏటాగౌరమ్మ సంబరం జరుగుతుంది . అది కూలీలంతా కలిసి కట్టుకున్న గుడన్న మాట ! చందాలు పోగేసి చాలా బాగా జాతర జరిపేవారు. ఇక ఊరేగింపులో గరగలు , గారడీ వాళ్లు , బ్యాండు పార్టీలూ , కోయ డాన్సులూ , పౌరాణిక ,సాంఘిక వేషధారణలు ...రాత్రి సందకాడ మొదలైన ఊరేగింపు తెల్లరేవరకూ జరిగేది .ఇంతకూ విశేషమేవిటంటే ...ఈ వేషాలు వేసుకున్నోళ్ళంతా మా కళ్ళముందు తిరిగే చాకలి వీరయ్యా, టైలర్ సత్తిబాబు , ఇంకా మా సోమయ్యా ...మొదలైన వారన్న మాట !

ఇక ఊరేగింపులో చివరగా వేషాల బళ్ళు మొదలవగానే మొదలయ్యేది మా సెర్చింగ్ . ఎవరు ఏ వేషం వేశారా అని ! ముఖ్యంగా మా సోమయ్య కోసం ! రాముడి వేషం వేసుకొని విల్లు బాణాలతో , పక్కనే సీతా లక్ష్మణులతో కదలకుండా నిలబడి ఉండేవాడు. మా ఇంటిదగ్గర బండి ఆగగానే సోమయ్యా సోమయ్యా అంటూ అరిచి గోల చేసేవాళ్ళం ( పిన్నిల పిల్లల తో కలిసి చిన్నగాంగ్ అయ్యేదిలెండి ) కళ్లు మాత్రం తిప్పి చిరునవ్వులు చిందిన్చేవాడు కానీ అంగుళం కూడా కదిలేవాడు కాదు...మేం కాగితాలు విసిరి , మాతమ్ముడైతే చిన్న చిన్న రాళ్ళు కూడా విసిరి అమ్మమ్మ చేత చివాట్లు తినేవాడు.అయినా సోమయ్యని మాత్రం కదిలించలేక పోయేవాళ్ళం .అలా మా ఇల్లు దాటేవరకూ నరకం చూపించేవాళ్ళం .

అలా మేం పెద్దై పోయాం ...అమ్మమ్మ ,తాతగారు కాలం చేశారు ...పొలాలు కౌలుకిచ్చేసే వారనుకుంటా ! ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యాక ...అమ్మకి తాతగారిల్లు రావటం వల్ల అక్కడే సెటిలయ్యారు . అప్పట్నుంచీ మళ్ళీ సోమయ్య విశేషాలు తెలుస్తున్నాయి . మా పొలాలే కౌలుకు చేసుకుంటూ ...సొంతంగా పశువులను కొనుక్కుని పాడి చేసుకుంటూ
చక్కగా పైకొచ్చాడు .ఇప్పటికీ ఏ పనికైనా మాకు సాయం వస్తుంటాడు .

ఆ మధ్య ఊరెళ్ళినప్పుడు వీరభద్రుని బోణం రోజు వంటచేస్తూ కనపడ్డాడు సోమయ్య ! నేను ఆశ్చర్యంగా ఏంటి సోమయ్యా !అంటే నాన్నగారు చెప్పారు మనకి సోమయ్య గాని ఇప్పుడందరికీ సోమరాజుగారమ్మా ....అని ! చిన్నగా ఓ వంట మాస్టర్ దగ్గర అసిస్టెన్స్ చేస్తూ తనూ నేర్చుకొని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు దాదాపు ఐదారు వందల మందికి వంట చేయగల మాస్టర్ ఐపోయాడు సోమయ్య ..కాదు కాదు సోమరాజుగారు !పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే సోమరాజుగారి సెల్ కి విశ్రాంతే ఉండదు . అన్నట్టు మన సోమరాజు గారికి భక్తి కూడా ఎక్కువేనండోయ్ ప్రతి ఏటా భవానీ మాల వేసుకుంటాడు .అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు .

ఈమధ్య ఊరెళ్ళినపుడు ...నాటుకోడిని కోసి మాంసం తెచ్చి ....అయ్యో పెంచుకునే కోడిని కోసేసేవా అని బాధపడితే ..మీరెప్పుడూ బాయిలర్ మాసమే తింటారు బుజ్జమ్మా ..మేం అస్సలు తినం కావలసినప్పుడు ఓ కోడిని కోసుకుంటాం (వాళ్ళింట్లో పెంచిన కోళ్ళని , కోడిగ్రుడ్లనీ అస్సలు అమ్మడట ! వాళ్లింట్లోకే పెంచుతాడట !) అంటూ అమ్మా ...ఉల్లిపాయలిలా పడేయ్ , కూర వండేసి వెళ్తాను అంటూంటే ఎన్నేళ్ళైనా తరగని ఆప్యాయతకు కళ్లు తడిసాయ్ !

** పై ఫోటోలో సోమయ్యని వెతక్కండెం....తన ఫోటో లేక గూగుల్ లోది పెట్టా ...

14 comments:

 1. its very lucky to have such caring people around...

  ReplyDelete
 2. బాగుంది...మా మంచి సోమయ్య...సారీ సోమరాజుగారు అని అనిపించింది బుజ్జమ్మ గారు...

  ReplyDelete
 3. కృషి తో నాస్తి దుర్భిక్షం - సోమయ్య

  సంభవామి యుగే యుగే - ఒంగోలు శీను

  హిహి

  మీరు శివభాక్తులా - మా అత్తగారి ఊర్లో మా బావ మరుదులు పెళ్లి చేసుకోవాలంటే ముందు వీరభద్రుని ముందు నిప్పుల్లో నడవాల్సిందే.

  ReplyDelete
 4. బాగుంది మీ సోమరాజు కధ :)

  ReplyDelete
 5. సోమయ్యను మాకు చూపించివుంటే బాగుండేది.

  ReplyDelete
 6. బాగుందండి మీ గౌరమ్మ సంబరం. పాపం సోమయ్య! అయినా అతని అభిమానం చాలా విలువైనది. చిన్నప్పుడు మేమూ మా అమ్ముమ్మ వాళ్ళ ఊర్లో నూకాలమ్మ సంబరాలకు వెళ్ళే వాళ్ళం. ముఖ్యంగ "ప్రభ" లు తయారు చేసి రాత్రంతా ఇలాగే రక రకాల నృత్యాలు, నాటకాలు, ఎన్నో రకాలుగా చేసే వాళ్ళు. ప్రభలు చాలా ఎత్తుగా ఉంటాయి కదా, అందుకని కరెంట్ వొచ్చిన తరువాత వైర్లు తగులుతాయని, ప్రభలు మాత్రం మానేసారు. కాని జాతర చాలా బాగా జరుగుతుంది.

  ReplyDelete
 7. అవును బలే వుండేవి కదా ఆ అనుభందాలు. అందరి తో కలిసి వుండే సమిష్టి సమాజం నుంచి ఒంటరి గూళ్ళలోకి పయనం :(

  ReplyDelete
 8. "అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు." మంచి మాట చెప్పేరు. ఇంత లా అభిమానం చూపే వ్యక్తులూ అదీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారు అరుదుగా కనిపిస్తారు.

  ReplyDelete
 9. పరిమళ గారూ! మా అమ్మమ్మ గారింట్లో ఇలాగే అశ్వత్థమ్మ అని ఒకావిడ ఉండేది. మేము వెళ్తే ఎంత మురిసిపోయేదో ! ఆవిడ చక్కగా జడలు వేస్తుందని ఆవిడతోనే వేయించుకునేవాళ్ళం. పెద్ద ఇత్తడి గ్లాసులో కాఫీ ఇచ్చేవారు ఆవిడొస్తే. దాన్ని చెరగుతో పట్టుకుని ఊదుకుంటూ తాగేవారు. ఎన్ని కబుర్లు చెప్పేవారో. నాకావిడంటే ఎంతిష్టమో తెలుసా! ఈమధ్యే పోయారని విని చాలా బాధేసింది.

  ReplyDelete
 10. మా తాతగారి ఊళ్ళో మంగమ్మ అని ఒకావిడ ఉండేది.. మేము ఊళ్లోకి అడుగుపెట్టగానే అడ్డ దోవన మాకన్నా ముందే ఇంటికి చేరి మాకు స్వాగతం చెప్పేది.. ఇక అది మొదలు మేమున్న రెండు రోజులూ హడావిడి చేస్తూనే ఉండేది.. చాలా బాగుందండీ మీ సోమరాజు గారి కథ.. నిజమే కృషితో నాస్తి దుర్భిక్షం..

  ReplyDelete
 11. ఆలస్యంగా చూసాను...భలే బాగుంది మీటపా!

  ReplyDelete
 12. బాగుందీ కథనం. మా వూరి నాగరత్నమ్మ గారిని గుర్తుకి తెచ్చారు. ఇంచుమించు ఇదే కథ, కాకుంటే మొదట్లో గృహిణి, నిదానంగా పెద్దవారిళ్ళకి వంట సాయం వచ్చేవారు. ఇప్పుడా పెద్దవారే ముందుగా ఫోన్ చేసుకుని ఆర్డర్ ఇవ్వాలట. మీ సోమరాజు గారి సంగతి బాగుంది. నా కన్న కి చెప్తే ఆ నాటుకోడి కోసం నన్నొదిలైనా పరుగెట్టివస్తాడేమో.. ;) చక్కగా వివరాలిస్తూ అతని స్వయంకృషిని కూడా అందరి దృష్టికి తెచ్చారు. అభినందనలు.

  ReplyDelete
 13. మా సోమరాజుగారిని ఆదరించి ...మీ అభిప్రాయాలను తెలియచేసిన ...మీ జ్ఞాపకాలను పంచుకున్న మిత్రులకు ధన్యవాదాలు!

  ReplyDelete