Thursday, July 2, 2009

గోరింట పూసింది...అరచేత !


గోరింటాకు ....
కన్నె నుండి బామ్మ వరకూ అందరినీ మురిపించే ముద్దుటాకు!అట్లతద్ది తర్వాత అందరూ ప్రత్యేకంగా పెట్టుకొనేది ఆషాడంలోనే .

ముద్దుపాపలు అమ్మ ఒడిచేరి నా చేయికంటే గోరింటాకు రుబ్బిన నీచేయి ఎర్రగా పండిందేమంటూ గారాలు పోతారు .ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటూ అమ్మమ్మలు పెట్టిన గోరింట ...నీకెలా పండిందంటే నీకెలా పండిందంటూ రాబోయే వరుడ్ని అరచేతి గోరింట చూసుకొని మురిసిపోతారు కన్నె బంగారు తల్లులు . కొత్త పెళ్ళికూతురు ఆషాఢపు వియోగం మరచి పండిన ఎరుపు చూసుకొని ...మగని ప్రేమ తలచుకొని సిగ్గుల మొగ్గయిపోతుంది .

గోరింటాకు ఇష్టపడని స్త్రీలు అరుదనే చెప్పాలి .మిగతావారి సంగతికేం కానీ నాకు మాత్రం గోరింటాకంటే చిన్నప్పట్నుంచీ చాలా ఇష్టం . ఈ కోనులూ....కొత్తరకాల డిజైనులూ...ఎన్ని వచ్చినా ఆకు రుబ్బి వేళ్ళ నిండుగా ...అరచేత చందమామ చుక్కలు పెట్టుకోవడమంటేనే నాకు ఇష్టం . సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు మా పొలంగట్టు మీద గోరింటాకు చెట్టు ఉండేది మా సోమయ్య ( పాలేరు ) బుజ్జమ్మ వచ్చిందంటూ తువ్వాలు నిండుగా ఆకు కోసి తెచ్చేవాడు . అప్పట్లో మిక్సీలు లేవు అమ్మమ్మ రుబ్బురోలులో వేసి చింత పండు , కుండ పెంకు , పటిక ( నాకు అవే గుర్తున్నాయి ) వేసి మెత్తగా రుబ్బి వాకిట్లో గట్టుమీద కూర్చోబెట్టి రెండు చేతులకూ ..కాళ్ళకు పారాణీ ....పచ్చటి కాళ్ళకు అందంగా పండుతుంది అంటూ ఇంత వెడల్పు పారాణీ పెట్టి ..ఇంకా రెండు కాళ్ళ క్రిందా రెండు మొక్కల పీటలు పెట్టి అరికాలు అంతా పెట్టేది .ఆ తర్వాత అన్నం కలుపుకొని వచ్చి తినిపిస్తుంటే ...వెన్నెట్లో చందమామని చూస్తూ ..అరచేత పండబోయే చందమామని ఊహించుకుంటూ ...అమ్మమ్మ చేతి గోరుముద్దలు తినడం మరిచిపోలేని అనుభూతి !

ఆ తర్వాత కొంచెం పెద్దదాన్నయినా ...నాన్నగారి ఉద్యోగరిత్యా రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తెలిసిన వారెవరైనా గోరింటాకు ఇస్తే అమ్మ నాకు పెట్టి ..అన్నయ్యకు కూడా కొద్దిగా దాచి ఉంచేది . చేతులూ , కాళ్ళూ నిండుగా పెట్టుకున్నా అన్నయ్యకి మిగల్చటం నాకు ఇష్టముండేది కాదు ఎందుకంటే ఎంత కొంచెం మిగిలినా దాన్ని అందంగా ( వాడికి క్రియేటివిటీ ఎక్కువలెండి ) పెట్టుకొనేవాడు .నాకంటే ఎర్రగా పండేది .అంతేకాదు కొత్తగా NTR సినిమాలు రిలీజైతే ఆ పేరు అన్నయ్య చేతిమీద ప్రత్యక్షం !EX: గజదొంగ ...అలాగన్న మాట ! అన్నయ్య ఆయనకి వీరాభిమాని లెండి . పైగా నేను నిద్రపోయాక పెట్టుకొని పొద్దుట లేచాక చూపించేవాడు .నేనేమో ఉడికిపోయి నువ్వెందుకు వాడికిచ్చావ్ ?అత్తయ్యగారు నాకోసం పంపిస్తే అంటూ అమ్మ దగ్గర పేచీ పెట్టేదాన్ని ..అప్పట్లో మొండిఘటాన్ని లెండి ...అన్ని విషయాల్లోనూ అనుకొనేరు గోరింటాకు , పూలూ ఇవి ఎన్ని ఉన్నా నాకే సరిపోవనిపించేది .

ఆషాడం మొదలైంది ఎలాగైనా గోరింటాకు కావాలని పెచీపెడితే ( ఆ రెండు విషయాల్లోనూ ఇప్పటికీ పెంకి పిల్లనే ) మా శ్రీవారు ఏం తంటాలుపడి తెచ్చారో గానీ మిక్సీలోవేసి చేతికి పెట్టుకొంటుంటే ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు వెల్లువలా పొంగుకొచ్చాయి . చందమామ , వెన్నెలా , అమ్మ చేతి గోరుముద్దలూ ...ఇవేవీ ఇప్పుడు లేకపోయినా ..ఎడమ చేతికీ , రెండు కాళ్ళకూ పారాణీ పెట్టుకున్నాక ...శ్రీవారిచేత కుడిచేతికి పెట్టించుకోవడం మరింత అందమైన అనుభూతి ! వచ్చిరాక ఆయన పెడుతుంటే వంకలు పెడుతూనే మహారాణీలా పెట్టించుకుంటా ! ఈ విషయం ఎవరికీ చెప్పకండేం? రాస్తూంటే నా చేతికన్నా ఎర్రనైంది నా మోము .అయినా మన మిత్రులతోనే కదా అని పంచుకొంటున్న అనుభూతి ఇది !పై ఫోటోలోని కుడి చేతి సింగారం మా శ్రీవారి పుణ్యమే ....

30 comments:

 1. ఐతే మీచేత గోరింట మందారంలా పూసిందని అర్ధమైందిలెండి :).. ఇంతకీ మీవారికి సగం గోరింట అంటుకుని ఉండొచ్చే..పాపం వాళ్ల ఆఫీసులో వెక్కిరిస్తే ఎలా?? మీరు చెప్పింది పాత సంగతులా?? లేటెస్టా???

  ReplyDelete
 2. 'ముక్కాలి పీట' ని 'మొక్కల పీట' అనడం ఒక్క మా ఇంట్లోనే అనుకున్నా.. చాలామందే వాడతారన్న మాట ఆ మాట. మీరు చెప్పిన దినుసులతో పాటు చిన్న ఇటుక ముక్క, ఎండు తాటాకు ముక్క కూడా వేసి రుబ్బేది మా అమ్మమ్మ.. 'లక్కలా పండాలి..' అంటూ.. బాగుందండి మీ గోరింటాకు ముచ్చట.. చివరి లైన్లు చదువుతుంటే శ్రీరమణ 'మిధునం' కథ గుర్తొచ్చేసింది.. "మేము మరీ అంత పెద్దవాళ్ళమా?" అని కర్ర పుచ్చుకోవద్దు.. వయసు గురించి కాదండి..'అన్యోన్యత' విషయం లో.. బాగుంది టపా...

  ReplyDelete
 3. "గోరింటాకు , పూలూ ఇవి ఎన్ని ఉన్నా నాకే సరిపోవనిపించేది" ఆ మాటకి నాక్కూడా ఓ డిట్టొ కొట్టేయండి. నాగార్జునసాగర్ లో మా ఇంటి గోడ కి 3 పొదలు వుండేవి. గోరింట కోసిచ్చి అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసేదాన్ని. ఆ రోజుల్లో గంట లెక్కలు కాదు కానీ గుప్పెడు ఆకుకింత అని లెక్కవేసేదాన్ని. ఇక చూస్కోండి కుప్పలుగా డబ్బులు ;) మీ అనుభూతి బాగుంది అందుకే కుటుంబ వ్యవస్థని/మన వైవాహిక బంధాలని సృజిస్తూ వ్రాసిన నా "గోడ గుండె పగిలింది!" http://maruvam.blogspot.com/2009/06/blog-post_08.html కవితలో గోరింట గురించి ప్రస్తావించాను. ఇకపోతే మునుపు చేతులు పండించాయీ ఆకులు ఇపుడు సిగకి కెంపు వన్నె మెరుపులద్దుతున్నాయి. ;)

  ReplyDelete
 4. గతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు.మా అత్తయ్య నా మరదళ్ళకు గోరింటాకు పెడుతున్నప్పుడు( వారిలో ఒకరు ఇప్పుడు మా ఆవిడేలెండి )నేను కూడా ప్రయోగాలు చేయాలని ప్రయత్నం చేసేవాడిని

  ReplyDelete
 5. బాగుందండీ... ఇంతకీ ఎర్రగా పండిందా గోరింటాకు?
  మందారం కన్నా ఎర్రగా పండి ఉంటుంది, అవునాండీ?

  ReplyDelete
 6. పరిమళం గారు, మీ అనుభూతులు చదువుతుంటే, మీరు పొందిన అనుభూతులు నేను పొందాను... భావాన్ని వ్యక్తపరచడం వేరు, అదే భావాన్ని చదువుతున్న వాళ్ళలో కలిగించడం వేరు....మీరు రెండూ చెయ్యగలిగారు....

  ReplyDelete
 7. oh !super ga undi....ఎడమ చేతికీ , రెండు కాళ్ళకూ పారాణీ పెట్టుకున్నాక ...శ్రీవారిచేత కుడిచేతికి పెట్టించుకోవడం మరింత అందమైన అనుభూతి ! వచ్చిరాక ఆయన పెడుతుంటే వంకలు పెడుతూనే మహారాణీలా పెట్టించుకుంటా ! ఈ విషయం ఎవరికీ చెప్పకండేం? రాస్తూంటే నా చేతికన్నా ఎర్రనైంది నా మోము .

  ReplyDelete
 8. మీ గోరింట ముచ్చట్లు భలే ఉన్నాయి. మీ శ్రీ వారు మీకు గోరింట పెట్టడం చదువుతుంటే మాటలకందని భావమేదో కలిగింది.
  నలుగురక్కలకు ముద్దుల తమ్ముడను అయిన నాకు కూడా అక్కా వాళ్ళు కొంచం గోరింట ఉంచి చేతిలో చందమామ పెట్టేవారు. అది ఎలా పండి ఉంటుందో చూడాలన్న ఆతృతతో పొద్దున్నే లేచేవాణ్ణి. అమ్మ మాత్రం అక్కల కంటే నాకే బాగా పండింది అని అన్నప్పుడు గొప్ప సంతోషంగా ఉండేది.

  ReplyDelete
 9. నా చిన్నపుడు నేనూ, మా చెల్లెళ్ళూ అలాగే పోట్లాడుకొనే వాళ్ళం. వాళ్ళని చూసి నేనూ సరదా పడే వాడిని. కాని నాకు ఏమీ మిగిల్చేవారు కాదు. వాళ్లు కష్టపడి మంచి ఆకుల్ని చెట్టు నుంచి ఏరుకుని కోసుకుని, ఇంట్లో రుబ్బుకొని గోరింటాకు పెట్టుకోవడం గుర్తు. ఈ రోజుల్లో అమ్మాయిలందరూ సులువుగా దొరికే 'కోన్' ల డిజైన్ లతో అసలు గోరింటాకు అనుభూతులకు దూరమవుతున్నారు. అపార్ట్మెంట్లు వచ్చాక అసలు గోరింటాకు మొక్కలు కనబడడమే అరుదు అయి పోయింది.

  ReplyDelete
 10. మీరు నేను ఒక్కసారే పెట్టుకున్నట్లున్నం ...లేకపోతె ఒక అరచేతిలో చంద్రుడిని మాత్రమె పెట్టుకున్న ,ఆషాడం లో పెట్టుకోవాలని అమ్మ చెబితే ..:)

  ReplyDelete
 11. జ్యోతిగారూ ! కనిపెట్టేశారుగా ...నా చేతి రంగు ! లేటెస్టే నండీ ...బుధవారం జరిగింది గురువారం రాశాను . ఆఫీస్ లో కొలీగ్స్ మగవారితో ఏం బాధలేదు తను అలాంటివేం పట్టించుకోరు .
  కానీ ఆడవారి భర్తల సంగతే పాపం ...అలవాటుంటే పరవాలేదు లేకపొతే కొత్తగా నేర్చుకోవాలేమో పాపం :)

  ReplyDelete
 12. @ విజయమోహన్ గారూ ! ఐతే మీ శ్రీమతికి మీరు పెళ్ళికి ముందే గోరింటాకు పెట్టి ఇంప్రెస్స్ చేశేసారన్నమాట !

  @ శివ ప్రసాద్ గారూ థాంక్స్ :) :)

  @ శేఖర్ గారూ ! మీ అక్కలు ఎంత మంచివారండీ ..నలుగురూ పెట్టుకున్నా మీకు ఉంచేవారన్న మాట ! నేనలా కాదండీ పెంకి పిల్లని ...నాన్నగారి సపోర్ట్ చూసుకొని :)

  ReplyDelete
 13. పరిమళ గారూ!
  ఇలాంటి అనుభూతులు లేని ఆడపిల్ల ఆంధ్రాలో (ఇదివరకు) ఉండేది కాదు.
  కాని ఇప్పుడు కొంత మందిని చూస్తుంటాం-మాకు పూలు పెట్టుకోవటం ఇష్టం లేదు, గోరింటాకు పెట్టుకోవడం నచ్చదు అంటుంటారు!!
  మీ అనుభవం తాజాది అన్నారు. జయహొ మీ వారికి!

  ReplyDelete
 14. పరిమళం
  నేనొప్పుకోను, చందమామ + చుక్కలు నావి. కాపీ రైట్ ఇవ్వ్నంటే ఇవ్వను.

  ఎన్ని కొత్త ప్రయోగాలొచ్చిన నాకు మాత్రం ఆకు రుబ్బి పెట్టుకోవడమే ఇష్టం. అందులోనూ ఇలా చుక్కలు పెట్టుకుని, కళ్ళకు పారాణి పెట్టుకోవడం మరీ ఇష్టం. పండిన చేతులతో లేత అరిటాకులో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని అన్నంతినడం మరీ ఇష్టం. నాన్న, పాప ఇప్పటికి అరుస్తారు. నీకు గోరింటకుతో పాతు అరిటకు ఎక్కడ వెతికి తీసుకు రావాలి అని.


  ఏదేమైనా చక్కని అనుభూతులను మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 15. @ మురళి గారూ !భలే గుర్తు చేశారు ...అవును తాటాకు కూడా వేసేవారు .ముక్కాలిపీటను గోదావరి జిల్లాలో మొక్కలపీట అనడం మామూలేనండీ ...మా అన్యోన్యతకు గుర్తు నా కుడి అరచేయి !ధన్యవాదాలు !

  @ ఉషగారు , ఐతే ఈ విషయంలో ఇద్దరమూ పెంకివాల్లమేఅన్నమాట :) :)
  మీ బాల్య స్మృతుల్ని కొన్నింటిని మాకు పంచినందుకు కృతఙ్ఞతలు .

  @ కిషన్ రెడ్డి గారూ ! నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు .

  @ మూర్తిగారూ ! మేమంతా ( ఆడవారు ) అంతేనండీ ...అంతే ....ఎవ్వరికీ పంచటానికి ప్రాణం ఒప్పదు .కోన్ లూ డిజైన్లూ ఎన్ని వచ్చినా దీని అందం దీనిదే ...మీ స్పందనకు ధన్యవాదాలు .

  ReplyDelete
 16. @ చిన్ని గారూ ! ఎందుకనేది నాకూ సరిగా తెలీదు కానీ ....ఈ అట్లతద్దులూ , ఆషాడాలూ లేకపొతే కొన్నాళ్ళకి గోరింటాకుని మర్చిపోతామేమో ...థాంక్స్ !

  @ మందాకిని గారూ ! ఇప్పటి ఆడపిల్లలకి ఇష్టం లేక కాదండీ ...ఎక్కడ నవ నాగరికతకు భంగం వాటిల్లుతుందోని , ఫ్రెండ్స్ అంతా వెక్కిరిస్తారేమోని దూరంగా ఉంచుతారు అంతే ! నా అనుభవం తాజాదే...పైన ఫోటో నా చేతులది రీప్లేస్ చేశాను చూడండి . కుడి చేయి మా శ్రీవారి క్రియేటివిటీయే :) :)

  @ శృతి గారూ ! మీ రైట్స్ నేను వాడుకున్నందుకు పెనాల్టీ గా రాబోయే పున్నమి వెన్నెలంతా మీకే ఇచ్చుకుంటాను సరేనా ? అరిటాకు కాన్సెప్ట్ ఏదో బావున్నట్టుంది మావార్ని మళ్ళీ వేటకు పంపిస్తే ....:) :)

  ReplyDelete
 17. @ పద్మార్పిత గారూ ! మీరే చూడండి ! పైన ఫోటోలోని నా చేతులు !

  @ వినయ్ చక్రవర్తిగారూ ! ధన్యవాదాలండీ ...

  ReplyDelete
 18. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశంలో ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా లతలుగా అల్లుకున్న మెహెందీ డిజైనులే కనిపిస్తున్నాయి గానీ ఇలా సాంప్రదాయకమైన ముద్ద గోరింట ప్య్యడం ఈ మధ్యకాలంలో చూళ్ళేదు. చిన్నప్పుడు మా ఇంటో బాగా పెద్ద పొదే ఉండేది. ఆషాఢం వచ్చిందంటే ఇంక సందడి చెప్పనలవి కాదు.
  చెట్టు బాగా ముదిరాక పూలు పుయ్యడం మొదలెడుతుంది. ఈ పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండవుకానీ గొప్ప సువాసన వెదజల్లుతుంటాయి.

  ReplyDelete
 19. @ కొత్తపాళీ గారూ !గోరింట పూలు నేనూ చూశానండీ.. మీరాక , మీ స్పందన మాకెంతో స్ఫూర్తిదాయకం.ధన్యవాదాలండీ ...

  ReplyDelete
 20. పరిమళం గారు ఎంత ముచ్చటగా అనిపించాయో మీ చేతులు..నా టేస్టే సుమా మీదీ కూడా..నాకు డిజయిన్లు ,రెడీమేడ్ మెహందీ పేకట్లు నచ్చవు గాక నచ్చవు.. రుబ్బాలి,చందమామా చుక్కలు పెట్టాలి ..కాళ్ళకు చక్కగా ముద్దుగా పారాణీ పెట్టుకోవాలి అదీ గోరింట అంటే ..ఎంత పని చేసారు ఇప్పుడు రుబ్బిన గోరింటాకు ఎక్కడ నుండి తెప్పించు కోనూ పెట్టుకోవాలి అని ఉంది :(

  ReplyDelete
 21. నాకు కూడా ఈనాటి సన్న డిజైన్స్ నచ్చవు. మీలాటి డిజైన్ మాత్రమే పెట్టుకుంటాను. నిండుగా, ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను గోరింటాకు పెట్టుకోవాలి ..ఆకు దొరకదు. పొడి తెచ్చుకుని ఆషాడం వెళ్లేలోగా మీలాగే పెట్టుకుంటాను. కాని కుడిచేతికి ఎలా?? మావారిని ఎప్పుడో పెళ్లైన కొత్తలో అడిగితే చేతికి మొత్తం పూసేస్తా అన్నారు.:).. మా అమ్మాయి ఉందిగా...

  ReplyDelete
 22. చాలా బాగుంది మీ చేతి గొరింటాకు ఎర్రదనము

  ReplyDelete
 23. @ నేస్తం గారూ ! నా చేతుల ఎర్రదనం నచ్చినందుకు ధన్యవాదాలు . రుబ్బిన గోరింట దొరక్కపోతే జ్యోతిగారి ఐడియాని ఫాలో ఐపోండి .

  @ జ్యోతిగారూ ! ఆ అదృష్టం మీ అమ్మయికిచ్చేస్తే ఎలా ? భోజనానికి ముందు పెట్టుకుంటే రెండో సేవా అందుతుంది మరి !

  @ వర్మగారూ ! ధన్యవాదాలండీ !

  ReplyDelete
 24. నేస్తంగారు, గోరింటాకు కోన్ విప్పి ఎంచక్కా పెట్టేసుకోండి.

  పరిమళంగారు,, చెప్పడం మర్చిపోయా.. నిన్నే నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇదే డిజైన్. రెండు చేతులకు నేనే పెట్టుకున్నాను.మావారు చూసి గోంగూర గిన్నె ముందు పెట్టుకుని తింటున్నా అనుకున్నారంట.. :))

  ReplyDelete
 25. మొక్కల పీట,తువ్వాలు వాకిట్లో గట్టు.....అమ్మో ఎందుకండీ ఇలా ఏవేవో గుర్తు చేస్తారు?
  అరచేతుల్లో గోరింట బుగ్గల్లో పండింది అని ఎప్పుడో రాసుకున్నది గుర్తొచ్చింది.అప్పట్లో నేను ఇష్టమైన వాళ్ళకి ఇచ్చే గొప్ప బహుమతులు పెరట్లో పూసే పూలు,గోరింటాకు.

  ReplyDelete
 26. @ జ్యోతిగారూ ! :) :)

  @ రాధికగారూ !యధాలాపంగా వచ్చేసిన గోదావరి యాస ! మీరెంత మంచివారండీ ..నేనైతే ఇప్పుడు మంచిదాన్నైపోయాను కానీ(నిజ్జంగా) చిన్నప్పుడు పూలూ , గోరింతాకూ ఎవ్వరికీ ఇవ్వటానికి మనసోప్పేదికాదండీ .

  ReplyDelete
 27. బహు ముచ్చటైన దాంపత్యం ;)
  మీరిలాగే ప్రతీ ఆషాడంలో మీ శ్రీవారి చేత గోరింట పెట్టించుకుంటూ గారాలు పోవాలనీ, ఇలాంటి మధురస్మృతులెన్నో మాతో పంచుకోవాలనీ కోరుకుంటున్నాను :)

  ReplyDelete
 28. This comment has been removed by the author.

  ReplyDelete