Monday, November 30, 2009

నాన్న చెప్పిన ఓ సంఘటన!


అవి 1962 వ సంవత్సరం నాన్నగారు రైల్వే లో అప్రెంటీస్ గా కోయంబత్తూర్ లో పనిచేస్తున్న రోజులు .అప్పటికే నాన్నగారికి పెళ్లయింది.ఏవో నాలుగు రోజులు సెలవులోస్తే కోయంబత్తూర్ నుండి ఊరికి వచ్చారు . సెలవులు పూర్తయి తిరుగు ప్రయాణం.

ఆరోజు 30 వతేదీ ....ఆ మర్నాడు జీతాలిస్తారు .( అప్పట్లో నాన్నగారికి స్టేఫండ్ ఎనభైఐదు రూపాయలట ! ) ట్రైనుకి టికెట్ అవసరం లేదు పాస్ ఉంటుంది . కాబట్టి డబ్బులు పెద్దగా పనేముందీ అనుకొని ఓ పదిరూపాయల కాగితం జేబులో వేసుకొని భోజనం చేసేసి సాయంత్రం నాలుగ్గంటలకు రాజమండ్రి లో మద్రాసు మెయిల్ ఎక్కారు.కోయంబత్తూర్ వెళ్ళాలంటే మద్రాసులో దిగి ట్రైన్ మారి వెళ్ళాలి .సరే ఉదయం ఆరుగంటలకి మద్రాస్ లో దిగితే తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తిరిగి కోయంబత్తూర్ వెళ్ళే కొచ్చిన్ ఎక్స్ ప్రెస్.అప్పట్లో భోజనం ముప్ఫైమూడు పైసలట ! మద్రాస్ లోనే టిఫిన్ ,భోజనం చేసి బండి ఎక్కేవారట !

రాజమండ్రిలో బండి ఎక్కి పై సీటుమీద దుప్పటి పరుచుకొని సెటిలైపోయి కూర్చున్నాక ..ఎదురుగా ఉన్న సీటుమీద కూడా ఓ వ్యక్తి టవల్ లాంటిది పరుచుకొని కూర్చోవడం గమనించి పలకరించారు .అతను కూడా మద్రాస్ వెళుతున్నట్టు చెప్పాడు .ఎనిమిది గంటలయ్యేసరికి ట్రైను విజయవాడ చేరుకుంది అక్కడ ఎక్కువసేపు హాల్ట్ !విజయవాడ స్టేషన్ లో
ఎద్దు ముఖంఆకారంతో వంపున్న ఎర్రమట్టి కూజాలు అమ్మేవారట ! నాన్నగారి పై అధికారి ఒకరు నాన్నగారిని వీలయితే ఆ కూజా ఒకటి తెచ్చిపెట్టమని అడిగారట ! విజయవాడ రాగానే నాన్నగారి ఎదురుసీటులో ఆయన
కిందికి వెళ్ళబోతూ ఉంటే నాన్నగారు అతన్నిఆపి మీరెలాగూ దిగుతున్నారు కదాఒకకూజా తెచ్చిపెట్టమని అడిగారు .కూజా రెండున్నర ! చిల్లరలేక పదిరూపాయల నోటు ఇచ్చారు అంతే దిగి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు .అతనికి లగేజ్ కూడా ఏమీలేదని అప్పుడు గమనించారట నాన్నగారు !సాటిమనిషిని మీద నమ్మకం పోయిన క్షణాలవి !

మద్రాస్ స్టేషన్లో బండి దిగి ఫ్లాట్ ఫాం మీద మొహం కడుక్కొని ఒక బెంచిమీద కూర్చున్నారు .టిఫిన్ మాట అటుంచి టీ తాగుదామన్నా జేబులో నయాపైసా లేదు .నిన్న మధ్యాహ్నం అనగా తిన్న భోజనమే .కడుపులో ఆకలి ..సూర్యుడు పైకొచ్చినకొద్దీ నీరసం ..నిస్సత్తువా ఆవరించేసి కళ్లు తిరుగుతున్నట్టు అనిపించి అలాగే బల్లమీదజారబడి కళ్లు మూసుకున్నారు నాన్నగారు !

ఎంతసేపట్నించి నాన్నగార్ని గమనిస్తున్నాడో ఒక పెద్దాయన దగ్గరికివచ్చి తెలుగువాడిలా ఉన్నావ్ నీపెరేంటి బాబూ అని పలకరించాడు.నాన్నగారు చెప్పాక ...ఏంటి నీరసంగా కనిపిస్తున్నావ్ ఒంట్లో బాగానే ఉందా ..భోజనం చేశావా అని అడిగారు .నాన్నగారు మొహమాటం కొద్దీ చేశానండీ ..అని సమాధానం చెప్పారు కానీ ఆయన నాయనా ! పెద్ద కుటుంబం నుండి వచ్చినట్టున్నావ్ ఏం జరిగిందో నాకు తెలీదు నేను చాలాసేపట్నించి చూస్తూనే ఉన్నాను నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చున్నావ్ ఏం జరిగిందో చెప్పు అని అడిగారు . అప్పుడు నాన్నగారు జరిగింది చెప్పగానే ఆయన పదిరూపాయల కాగితం తీసిచ్చి ముందు నువ్వు భోజనం చేసిరా తర్వాత మాట్లాడదాం అన్నారు .కాని నాన్నగారికి అభిమానం అడ్డొచ్చి తీసుకోలేకపోతే నీ తండ్రిలాంటివాడిని తీసుకోకపోతే నా మనసు బాధపడుతుంది అని ఒప్పించి పంపించారు .తిరిగి వచ్చాక మిగిలిన చిల్లర కూడా ఏదైనా అవసరం పడొచ్చు ఉండనీ అన్నారట !ఆ తర్వాత మాటల్లో నాన్నగారు ఆయన అడ్రస్ తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు .

ఆయన పేరు సిఖిలే వెంకన్న గారు , ఆయనది అమలాపురం . నాన్నగారు కోయంబత్తూర్ వెళ్ళిన వెంటనే జీతం తీసుకొని చేసిన మొదటి పని ఆయన ఇచ్చిన పదిరూపాయలతోపాటూ మరో పది కలిపి , మాటల సందర్భంలో ఆయన క్రిస్టియన్ అని తెలుసుకొని ఒక సిలువ బొమ్మ కొని మనియార్డర్ తోపాటు పార్సిల్ చేశారట !

దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రిందటి సంగతి నాన్నగారు ఇప్పటికీ ఆయన్ని , ఆయన చేసిన సహాయాన్నీ మర్చిపోకుండా గుర్తుచేసుకుంటారు . ఒక మనిషి తప్పు చేసినంత మాత్రాన అందరు మనుషులపై నమ్మకం పోగొట్టుకోవద్దని భగవంతుడు నాకు వెంటనే తెలియచేశాడని చెప్తూ ఉంటారు . అలాగే ఎవరైనా చేసిన మేలును జీవితాంతం మర్చిపోకూడదని నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు .

ఆరోజు నాన్నగారికి సహాయం చేసి ఆకలి తీర్చిన భగవత్స్వరూపులు సిఖిలే వెంకన్నగారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలీదు అయినా ఆయనకు నా కృతజ్ఞతాభివందనం ! భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా !

23 comments:

  1. your father words are correct. if we help for 100 people. 99 percent may be forgot lost one must help for us. this i learned in my life.

    ReplyDelete
  2. hrudayamenta sunnitam nestam!
    anduke bhagavanthudu
    daanni urah panjaram madhya
    ati padilangaa pondu parichaadu..
    ayinaa daniki gaayaalu avutoone untaayi..
    navaneetaaloo dorukutoo untaayi..

    edalo tadi erpadi..
    aa ootaa "neeti bugga"(spring) laa paiki tannukochhi
    kaasepu kanupaapa to chelimi chesi..
    kanulani chelime chesi..
    ayinaa koodaa ..niluvaleka..
    manasaagalekaa..
    ashrudhaaralai..dukhah bhashpaalai..
    kanneeti varadalai..udvega jalapaataalai dumukutaayi..
    inta kanna inkem kaavali maanavataki
    mana spandanaki..

    ReplyDelete
  3. ఆయన పేరు కూడా ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగింది.

    ReplyDelete
  4. very great...God lives in such people.

    ReplyDelete
  5. ఇక్కడ మంచివారు ఉన్నారు చేడ్డవారు ఉన్నారు
    నైస్ :)

    ReplyDelete
  6. చాలా బాగా చెప్పారు. ఈ టపా చాలామందికి కొంత మానవత్వంపై నమ్మకాన్ని కలిగిస్తుంది.

    ReplyDelete
  7. పరిమళ గారు,
    చాలా బాగుంది. అందరూ తెలుసుకోవలసిన విషయం.
    ఒకరికి మంచి చేయాలనుకునేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.

    ReplyDelete
  8. ఇలాంటి సంఘటనలు మనిషిలోని రెండు పార్శ్వాలను తెలియజేస్తూ ఉంటాయి.

    ReplyDelete
  9. చాలా బాగుంది. నిజమే కదా ఒక మనిషి ఏదైనా కొంచం హాని చెయ్యగానే అనుకుంటాము కదా చీ మనుష్యులంతా ఇంతే అని. ఒకే రోజు లో రెండు కోణాలు చూసేరన్నమాట నాన్న గారు. :-)

    ReplyDelete
  10. పరిమళగారూ,
    చూసారా భగవంతుడి లీల.. ఏ ప్రయాణంలో అయితె మీ నాన్నగారి పది రూపాయలు ఒక దొంగ పట్టుకుపోయాడో, అదే ప్రయాణంలో ఒక మంచి మనిషి భగవంతునిలా ఆదుకున్నారు. మీ నాన్నగారి మీద మీకు గల అభిమానంతో ఆ మంచిమనిషిని ఇప్పటికీ ఒక భగవంతునిలా తల్చుకుంటున్నారు. అందుకే అంటారు ఒక మంచి మాటైనా, మంచి పనైనా పది కాలాలపాటు నిలిచి ఉంటుందని..

    ReplyDelete
  11. పరిమళం గారు మీ నాన్న గారి ఙ్ఞాపకాలు బాగున్నాయండి. వెంట వెంటనే ఇటువంటి అనుభవాలు జరగడం చిత్రమే.

    ReplyDelete
  12. మీ నాన్న గారు చెప్పిన ఓ అనుభవాన్ని మీ మాటల్లో కళ్ళకి కట్టినట్టు చూపించారు... సహాయం అవసరమైనప్పుడు దొరికితేనే దాని గొప్పతనం తెలుస్తుంది.. అందుకే ఆయన పేరు మీకింకా గుర్తుంది..
    I wish 200 years for all those good ones..

    ReplyDelete
  13. పరిమళ గారు మీ నాన్నగారి అనుభవాలు అందరికీ పాఠాలే నండి. అందుకేనేమో జీవితాన్ని రైలుబండి తో పోలుస్తారు.

    ReplyDelete
  14. చూసావా అక్క చడ్డ మనుషులూ ఆ పెట్టెలోనే ఉన్నారు మంచి మనిషులు ఆ పెట్టెలోనే ఉన్నారు.....

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  15. అంతే , మంచి , చెడు నాణానికి రెండు వైపులు .

    ReplyDelete
  16. అనుభవ సందేశం బాగుంది .

    ReplyDelete
  17. నాకూ ఒకసారి రైలు ప్రయాణంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అయితే నేను డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా నాదగ్గర కొన్ని ఉంచుకున్నాను.. నిజమే మనకి మంచీ, చెడూ రెండూ తారసపడతాయి.. బాగుందండి టపా..

    ReplyDelete
  18. పరిమళ గారు మంచి విషయం చెప్పారు.

    మీ స్పూర్తితో ఇక్కడొక జీవుడు బ్లాగు తయారుచేసుకున్నాడు. ఒక్కసారి ఇటు చూడండి.

    ReplyDelete
  19. మీ నాన్న గారి ఙ్ఞాపకాలు బాగున్నాయండి.అందరూ తెలుసుకోవలసిన విషయం, బాగుందండి టపా!

    ReplyDelete
  20. మీ పోస్టింగ్ చదివాక నాకు ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ వొక ఆమె వాళ్ళ అబ్బాయికి కాన్సెర్ అని చెపితే వొక ముక్యమైన పని కోసం దాచుకున్న డబ్బులు ఇచ్చేస్తాడు .మర్నాడు పేపర్ లో ఆమె పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తుంది .దాన్ని చదివి రాజేంద్రప్రసాద్ పోనిలేవే వాళ్ళ అబ్బాయికి కాన్సెర్ లేదు గా అని భార్య తో అంటాడు .ఆ వెంకన్న కూడా అల్లాంటి మంచి వాడె , అది గాక ఆ రోజులకి ఇంకా మానవత్వం ఆరోగ్యం గా బానే వుండేది . యి రోజుల్లో అల్లాంటివి ఆశించడం దురాసే .
    మీకు రైల్వే తో అనుభంధం మీ నాన్న గారి తో నే ఆగి పోయిందా లేక ఇంకా కోన సాగుతోందా ఉద్యోగ రీత్యా?

    ReplyDelete
  21. బొమ్మలో చిన్న సవరణ . అప్పట్లో ఏ సి భోగీలు లేవు . థర్డ్ ఏ సి యి మద్య నే వచ్చిన పరిణామం

    ReplyDelete
  22. నాన్నగారి జ్ఞాపకాలను నాతో కలిసి పంచుకొని స్పందించిన మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు .

    @ రవిగారు ! రైల్వే తో అనుబంధం కొనసాగుతూనే ఉందండీ ...కాకపొతే అన్నయ్యద్వారా ...
    నిజమే అప్పట్లో ఏ సి బోగీలు లేవు గూగుల్ లో చూసి పెట్టాను కాని ఆలోచించలేదు ...మీ సునిశిత దృష్టికి ...తెలియచేసినందుకు థాంక్స్ !

    ReplyDelete
  23. ఒక మంచి నీతిని ఒక మంచి నిజ జీవితపు ఉదాహారణ తో చెప్పినందుకు ఒక మంచి రచయిత్రికి ధన్యవాదాలు.

    ReplyDelete