Monday, January 12, 2009

సంక్రాంతి (మా ఊరి సంబరాలు )

సంక్రాంతి తెలుగు వారి" పెద్ద పండుగ ".సూర్యుడు ధనూ రాశి నుంచి ,మకర రాశి లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి .ఇప్పుడే ఉత్తరాయణం ప్రవేశిస్తుంది .
మూడు రోజులు జరుపుకొనే ఈ పండుగ పల్లెల్లో ఏటేటా సంబరాల్ని తెస్తుంది .పేరుకి మూడు రోజులే కాని నెలంతా పండుగ లాగే ఉంటుంది .మా ఊళ్ళో కూడా ....మీకు తెలీదని కాదు ,ఈ పట్నవాసంలో నేను మిస్ ఐన పండుగ సందడిని మీతో పంచుకోవాలని ఈ టపా .....
హేమంత ఋతువు .......పుష్య మాసం ....ధాన్య లక్ష్మీసమేతయై పౌష్య లక్ష్మి ఇంటింటికి వస్తూంటే ముంగిట రంగవల్లులతో ఆహ్వానిస్తాము .పంట చేతికొచ్చి రైతూ ,రైతు బావుంటే రెండు పుట్లవడ్లు ఎక్కువ కొలుస్తారని కూలీలు ...అందరూ సంతోషంగా చేసుకొనే పండుగ .ఈ నెలలో బలి చక్రవర్తి ఏడాదికోసారి పాతాళం నుండి భూలోక సంచారానికి వస్తాడని ఆయన్ను స్వాగతిస్తూ నెలంతా నాలుగు ద్వారాలున్న నెలముగ్గులు (నెల కంట )పెడతారు .మా వూళ్ళో ధనుర్మాసం నెలంతా తెల్లవారు ఝామున , నగర సంకీర్తన చేస్తారు .అంటే కొంతమంది భక్తులు కలసి హరి నామ సంకీర్తన చేస్తూ ఊరంతా తిరుగుతారు .హరినామ స్మరణ చేయని వారికి కూడా హరినామ శ్రవణం వల్ల పుణ్యం లభిస్తుందని ఈ నగర సంకీర్తన యొక్క ఉద్దేశ్యం .ఈ మాసంలో వస్త్ర దానం మంచిదని అంటారు బహుశా చలికాలం పేదలకు వస్త్రాలు అందుతాయన్న ఉద్దేశ్యం కావచ్చు .నెల పట్టింది మొదలు ముంగిట ముగ్గులు వేసి వాటి మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు చివరిరోజు పసుపు కుంకుమలు చల్లిన గొబ్బెమ్మల్ని ఒక చోట చేర్చి వాటిపై గుమ్మడి పూవులుంచి కన్నెపిల్లలంతా చేరి ....సుబ్బి గొబ్బెమ్మా ,సుబ్బణ్ణియ్యవె, చామంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే , తామర పువ్వంటీ తమ్మున్నియ్యవే .....ముసి ముసి నవ్వులతో ,బుగ్గల్లో సిగ్గులు పూయిస్తూ ....మొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవె .....అంటూ చప్పట్లు చరుస్తూ గొబ్బిళ్ళ చుట్తో తిరుగుతూ పాడుతుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలవనుకోండి.ఇక నెలంతా రోజుకొక వేషంతో పౌరాణిక ఘట్టాలను పద్యాలుగా పాడుతూ పగటి వేషగాళ్ళూ , హరిలో రంగ హరీ అంటూ ఇంటింటికీ తిరిగే హరి దాసులూ ,అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ బుడబుక్కల వాళ్ళూ ,శుభోజ్జయమంటూ భట్రాజులూ ,అమ్మగారికి దణ్ణం పెట్టు,అయ్యగారికి దణ్ణం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళూ ,శంఖారావం చేస్తూ వచ్చే ఈశ్వర స్వరూపులు జంగం దేవరలూ ఇంకా కొమ్మదాసులవాళ్ళు (చెట్లెక్కి దూకుతూ తిరిగే హాస్యగాళ్ళు ),పిచ్చిక గుంటోళ్ళు (వీళ్ళు మన ఇంటి పేరు చెప్తే గోత్రాన్ని ,ఇంకా మన వంశీకుల ,ఇంటిపేర్ల పుట్టుపూర్వోత్తరాలు చెప్తారు ).వీరంతా నెలంతా బియ్యంతో సరిపెట్టినా పండుగ మూడు రోజులూ స్వయంపాకమో ,సంభావనో ,ధాన్యమో లేక పాత వస్త్రమో ఇస్తే మహదానందంగా దీవెనలిస్తూ మరలిపోతారు . తనకున్న దానిలో కొంత ఇతరులకు పంచడంలోని తృప్తిని ప్రజలకు కలగజేయటమే పండుగ దానం పరమార్ధం .దానివల్ల కష్ట జీవులకు ,పేద సాదలకు మేలు కలగాలన్న ఉద్దేశ్యం అయి వుంటుంది .
బంతిపూల తోరణాల గుమ్మాలూ ,పసుపు రాసిన గడపలూ ,చామంతులరరారు కొప్పులతో పల్లె పడుచులూ ...అసలు చేల గట్ల మీద పూచిన బంతిపూలు మా పల్లెకు కట్టని బంగారు తోరణాలు .పండిన మిరప చేలు భూమాతకు పచ్చంచు ఎర్ర చీర .
మొదటిరోజు భోగి .తెల్లవారు ఝామున లేచి (నూనె రాసి నలుగు తప్పనిసరి )తలంటి పోసుకొని ,కొత్తబట్టలు వేసుకొని ,
చిన్న పాలేరు నెలరోజులు కష్టపడి ఆవు పేడతో చేసి ఎండబెట్టిన చిన్నచిన్న పిడకలతో భోగిదండలు చేసేవాడు .ఎంతమంది పిల్లలుంటే అన్నిదండలు .వీధి చివరి భోగి మంటలో వేసి నస్కరించాలి .అది కూడా ఒక యజ్ఞమేనని అమ్మమ్మ చెప్పేది .సున్నుండలూ ,పులగం భోగి స్పెషల్ .(అరిసెలు ,పాకుండలు ,బెల్లం మిఠాయి ,కారప్పూస .....కామన్ )
సంక్రాంతి ....తల స్నానం ,కొత్తబట్టలూ షరా మామూలే .పరమాన్నం ,పులిహోర ,గారెలూ ..సంక్రాంతి స్పెషల్ .పెద్దపండుగ రోజు కొత్తగా వచ్చిన పంటతోనూ,పిండివంటలతోనూ పెద్దలను (చనిపోయిన పూర్వీకులను ) పూజిస్తారు .ఇక అమ్మమ్మ మమ్మల్ని ముస్తాబు చేసి ఒక బుట్టలో బియ్యం పోసి చిన్న గిన్నె చేతికిచ్చి బయట అరుగుమీద కూర్చోబెట్టేది .భిక్షకు ఎంతమంది వచ్చినా లేదనకుండా ఆ చిన్న గిన్నెతో కొలిచి పోసేవాళ్ళం .ఇంట్లో పెద్దమ్మలూ ,పిన్నులూ ,బాబాయిలూ ,అన్నలూ ,చెల్లెళ్ళూ , తమ్ముళ్ళూ ,కొత్తగా పెళ్ళయిన అక్కలుంటే బావతో మరీ సందడి .
బావని అల్లరి పట్టించడానికి పిల్లలంతా ప్లాన్ చేసుకొని ,సున్నుండలకు బదులు తవుడు ,బెల్లం నేతితో కలిపి పెట్టడం ,తమలపాకుల్లో పచ్చిమిరప ముక్క పెట్టివ్వడం .....ఇలా తుంటరి పనులు చేయడం అలా పెద్దాళ్ళతో చివాట్లు తినడం (ఉత్తుత్తినే లెండి )భలే సరదా !మరి ఊర్లో సందడి ....ఓహో ...మహా జోరుగా కోడి పందేలు ,రావి చెట్టు గట్టు మీద చతుర్ముఖ పారాయణం .కొత్తల్లుళ్ళ దగ్గర్నించీ ,తల పండిన తాతల వరకూ అందరూ అక్కడే ఉంటారు .
మూడవ రోజు కనుమ ....ఎడ్లను ,పాడి పశువులనూ కడిగి పూజిస్తారు .ఎడ్లను పసుపు కుమ్కాలతోనూ ,కొమ్ములకు రంగులతోనూ ,మెడలో మువ్వలతోనూ అలంకరిస్తారు .పూర్ణం బూరెలు ,పప్పు ,అన్నంతో గ్రామ దేవతకు నైవేద్యాలు పెడతారు .రెండు రోజుల్నుంచీ పప్పు ధప్పలాలతో చప్పబడిన అల్లుళ్ళకి కనుమ విందు ప్రత్యేకం .నాటుకోడి కూర ,గారెలూ ...స్పెషల్ .
భోగి పళ్ళూ ,గాలిపటాలూ, బొమ్మల కొలువులు ..... చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాని అసలు ఇది చదివే ఓపికేఎందరికి ఉంటుందో ,లేదో అనుకొంటూ రాస్తున్నా .
నాలుగవదీ ,చివరిదీ ముక్కనుమ ....ఆరోజు సూర్యుని రధం దిశ మారటానికి గుర్తుగా రధం ముగ్గు వేసి పొడవాటి గీత వీధి చివరి వరకూ గీసి మరు ఏడు మరల రావమ్మా అంటూ సంక్రాంతి లక్ష్మిని సాగనంపుతారు . మరుసటి రోజు ప్రయాణం ....అందరి ముఖాల్లో దిగులు .పిల్లలకేమో సెలవులైపోయాయనే గుబులు .సంవత్సరానికి సరిపడా తీపి గుర్తులు మూటగట్టుకొని (అమ్మమ్మ ఇచ్చిన స్వీట్ ల తోపాటు )మరలిపోయేవాళ్ళం .

ఇక ఇప్పుడు పండుగ ...ఆరు గంటలకు (అదే ఎక్కువ )లేచి షాంపూతో తలస్నానం అయిందనిపించి ,కొత్తబట్టలు వేసుకోవడం ,తప్పదన్నట్టు కాసిని పిండివంటలు వండుకోవడం (అప్పుడప్పుడు స్వగృహ ఫుడ్స్ నుంచి ).
టి .వి ముందర సెటిలై పోవడం .కాకపొతే ఎడారిలో ఒయాసిస్ లాగా ఈ కాంక్రీట్ జంగిల్ లో శిల్పారామం .పండుగ వాతావరణాన్ని తలపింప చేస్తుంది .ఎంతైనా క్రియేట్ చేసిన దానికీ ,మన పల్లె సాంప్రదాయానికీ తేడా వుంటుంది కదండీ !

4 comments:

  1. చాలా బాగా రాసారు పరిమళం గారు :)

    ReplyDelete
  2. "అసలు చేల గట్ల మీద పూచిన బంతిపూలు మా పల్లెకు కట్టని బంగారు తోరణాలు .పండిన మిరప చేలు భూమాతకు పచ్చంచు ఎర్ర చీర"
    ఎంత చక్కని వర్ణణ-బాగా గుర్తుకు చేసారు.

    ReplyDelete
  3. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు!!

    నిజమేనండీ, పండుగ మన ఊరులో, మన వాళ్ళతో జరుపుకుంటేనే అసలు పండుగ ఆనందం వస్తుంది.

    నాకు రంగు ముగ్గులు వేయడం చాలా ఇష్టం. పక్కింటి వాల్లకి పోటీగా అందరికన్నా ముందు వేయాలని పొద్దు పొద్దున్నే లేవడం, ఆ రాతిరే ముగ్గును select చేసేసుకొవడం అంతా భలే ఉండెది.. మల్లీ ఎప్పుడు వస్తాయో ఆ రోజులు...

    ReplyDelete
  4. @ నేస్తం గారూ !
    @ సిరిసిరి మువ్వగారూ !
    @ రాజీ గారూ !
    నా టపా ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదములు .
    మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు .

    ReplyDelete