"మావూరి గాలి" టపాలో ప్రవీణ్ గారు పల్లె అందాలతో పాటు పల్లె రుచులను కూడా ప్రస్తావిస్తూ తేగలు ,చెరకు గడలు అంటూ నోరూరించారు .చిన్ననాటి జ్ఞాపకాల తేనెతుట్ట మీద రాయి విసిరిన చందంలా ...
మా అమ్మమ్మ గారి ఊరిలో కూడా పొలంలో తేగలపాతర వేసేవారు .అంటే తాటి టెంక లన్నీ ఒక చోట పాతిపెడతారన్నమాట .అవి అన్నీ ఊరి తేగలు తయారయ్యాక తంపట వేస్తారు .అంటే ఒక కుండలో తేగలు వేసి చుట్టూ మంట వేస్తే లోపలి తేగలు చక్కగా ఉడుకుతాయన్నమాట .ఇంటికి తేగానే పిల్లలందరం లావుపాటి తేగలు పోటీపడి ఏరుకొని తినేవాళ్ళం .వాటి రుచి చెప్పక్కర్లేదనుకోండి . తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని ,తింటే చదువు రాదనీ చెప్పేవాళ్ళు .మేం భయపడి తినేవాళ్ళం కాదు .కాని అప్పుడప్పుడు అమ్మమ్మ చూడకుండా తిన్న నాకు ,అస్సలు తినని మా చెల్లికి కూడా చదువబ్బలేదు అది వేరే సంగతనుకోండి .(బహుశా అందుకేనేమో మా చెల్లి నాకంటే ఓ రెండు క్లాసులేక్కువే చదివేసింది లెండి ).
ఇంతకూ నాకొచ్చిన తంటా ఏవిటంటారా ? అక్కడికే వస్తున్నా !ఈ మధ్య మా చెల్లెలి కొడుకు ఏడేళ్ళ వాడు మా ఇంటికొస్తే తేగలు పెట్టా .పెట్టి ఊరుకోకుండా చందమామ తినకూడదురా అన్నా .అంతే మొదలైంది నాకు తంటా ...ఎందుకు తినకూడదు ? ఎందుకు చదువు రాదు ? నీకెవరు చెప్పారు ? అంటూ వదలకుండా వెంట పడ్డాడు .మా రోజులు కావు కదా పెద్దాళ్ళు చెప్పారు కదాని వినటానికి .పిల్లల దగ్గర నోరు జారితే ప్రతీదానికి రీజన్ చెప్పాల్సి వస్తోంది .ఒక పట్టాన వాడు వదలడు నాకు తెలీదని అంటే మరెందుకు చెప్పావ్ అంటూ అందర్లో పరువు తీస్తాడు.సరే ఇక తప్పదు మన క్రియేటివిటి కి టైం వచ్చేసిందని అనుకొంటూ చెప్పాను .
అనగనగా చాలా సంవత్సరాల క్రితం అంటే కొన్ని వందల ఏళ్ల క్రిందట రాసుకోవడానికి పుస్తకాలు ,పేపర్లు ....ఉండేవి కాదు .అప్పుడు తాటి ఆకుల్ని కోసి వాటిపైనే రాసుకోనేవారు .వాటినే తాళపత్ర గ్రంధాలంటారు . అంటే మన పుస్తకం లాగే తాటి ఆకులు కూడా సరస్వతీ దేవి అన్నా మాట .మరి చందమామ మొలిస్తే తాటి చెట్టవుతుంది కదా .అందుకే చందమామ తింటే సరస్వతీ దేవికి కోపం వస్తుంది .చదువు రాదు అందుకే తినొద్దని అంటారన్న మాట .అని చెప్పి ఉపిరి
పీల్చుకున్నా.మావాడు కన్విన్స్ అయ్యాడా అని చుసేలోపు ...అప్పటి వరకు ఊపిరి బిగబట్టి వింటున్న మా చెల్లి ,మరిది ,మా మేనకోడలు ,మా అబ్బాయి ......ఇలా అంతా హాశ్చర్యంగా చూసి నిజమా ...అత్తమ్మా ...నాకింతవరకు తెలీదండి .....అక్కా చిన్నప్పుడు నాకెప్పుడూ చెప్పలేదే ...అంటూ .....ఒకటే ప్రశ్నలు .ఏం చెప్పను నా ఇబ్బంది ?ఇంతలో వాడు అడిగాడు ..నువ్వు చెప్పింది కరక్టే కాని ఇప్పుడు మేం బుక్స్ మీదే రాస్తున్నాంగా ...మేమెందుకు తినకూడదు ? అని .
హా ..........హతవిధీ ......
ఇంతకూ చందమామెందుకు తినకూడదంటారూ? మీకేమైనా తెలుసా ?
*ఏదో ఆట విడుపుగా రాశాను .నవ్వొస్తే నవ్వుకోండి ...మీ సమయం వృధా ఐతే క్షమించండి .
Friday, January 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
బావుంది మీ తేగ కథ :)
ReplyDeleteఇంతకీ నాకు అసలు తేగలో చందమామ తినకూడదనే తెలీదు :(
అయినా నేనెప్పుడూ తినలేదులెండి. నాకెందుకో మరీ ఎక్కువ ఇష్టం ఉండదు ఆ రుచి.
మీలాగా మంచి ఫ్రెష్ తేగలు తినలేదు నేను ఎప్పుడూ. మా స్కూల్ దగ్గరికి బండి మీద తెచ్చి అమ్మేవాళ్ళు. అవే తిని చూశా.. :(
భలేగా ఉ౦ద౦డీ మీ క్రియేటివిటి..అమ్మో! పిల్లల్ని కన్విన్స్ చేయాల౦టే ఆమాత్ర౦ కథలు అల్లాల్సి౦దే.. :-) నాకు కూడా తెలుసుకోవాలని ఉ౦ది,చ౦దమామ ఎ౦దుకు తినకూడదో...
ReplyDeletehaa ..haa .. maaku alaage anevaaru.. tinakoodadani.. kaaranam teliyadu :) kondaru naalika moddubaaripotundi anevaaru
ReplyDeleteచాలా బాగుందండీ తేగలకథ. నాకు ఈపూర్వపు మాటలూ, తేగలూ అవీ చదవడం చాలా ఆనందంగా వుంటుంది. చందమామ అంటారని నాకు తెలీదు కూడాను మీవాడితో పాటు నేను కూడా కొత్తసంగతులు తెలుసుకున్నాను ఆలస్యంగానేనా :p
ReplyDeleteపరిమళగారూ....అది నిజమో కాదో తెలియదు కాని, మీ క్రియేటివిటీ బాగుందండి.
ReplyDeleteమీ తేగ స్టోరీ చదివాను. నవ్వొచ్హింది. చిన్నప్పుడు నేను చందమామలు తెగ తినే వాణ్ణి. అయితే చదువు వచ్హింది......!
ReplyDelete@ సిరి సిరి మువ్వ గారూ !థాంక్స్ అండీ .
ReplyDelete@ మధురవాణి గారూ !ఈ సీజన్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పల్లెటూర్లు వెళితే మీకు తేగలతో ఆతిధ్యం ఉంటుంది మరి .
@ శ్రీ గారూ !పిల్లలు కాదండి బాబూ పిడుగులు వీళ్ళు .
@ నేస్తం గారూ ! ఒక వేళ అదికూడా నిజమేనేమో ....
@ తూలిక గారూ !మీరలా అంటూంటే ఈ పట్నవాసంలో కోల్పోయిన వన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయండీ .
@ పద్మార్పిత గారూ !నిజంగా నాకూ తెలీదండీ !మీలో ఎవరైనా చెబుతారని చూస్తున్నా .
@ ఆది శేషారెడ్డి గారూ !ఏదో సరదా టపా అండీ ! నచ్చినందుకు ధన్యవాదములు .
మీలాగే నేనూ ఫ్రెష్ గా తంపెట వేసిన తేగలు భీమవరం పక్కన పల్లెటూర్లో తిన్నాను. తేగలంటే మనకు బండి మీద అమ్మేవి తప్ప అంత ఫ్రెష్ వి దొరకవు. పైగా హైదరాబాదులో వాటి పేరు వింటే కొనబుద్ధి కూడా కాదు. "గేంగులు" అంటారు ఇక్కడ అదేం ఖర్మో, ఎంచక్కా తేగలనొచ్చుగా!
ReplyDeleteమీ చందమామ స్టోరీ బాగుంది. కానీ ఒక పక్క నేనే చందమామ నముల్తూ ఇలాంటి కథ పిల్లకెలా చెప్పను? నైతిక హక్కేది?
అమ్మో నిజం గా నిజం అనిపించేలా చెప్పారు.చిన్నప్పుడు నేను కూడా అడిగేదానిని ఎందుకు తినకూడదు చందమామని అని.నోరు మూసుకుని తేగ తింటే తిను లేకపోతే అక్కడ పెట్టి అవతలకి పో అని సమాధానం వచ్చేది.అమ్మా.....ఎవడయినా తేగ వదులుకుంటారేమిటి సమాధానం కోసం :)
ReplyDeleteradhika
snehama.blogspot.com
తేగలు,తేగలూ.తేగలే అంటూ టపాలు రాయటం కాదండి,
ReplyDeleteవాటి ఫొటోలూ పెట్టాలి.
మా పిల్లలడుగుతున్నారు,అర్జంటుగా చూయించాలి ముందొక తేగ ఫొటో పెట్టండి అమ్మా!!! ????
@ సుజాత గారూ !"గేంగులు"? నేనిప్పుడే వింటున్నా .బహుశా నేనెప్పుడూ ఇక్కడ తేగలు కొనక పోవడం వల్ల తెలీలేదనుకుంటా .తిన్నా ఏం కాదని ఆదిశేషారెడ్డి గారు హామీ ఇచ్చారుగా.
ReplyDelete@ సాహి గారూ !థాంక్సండీ ! అన్నట్టు మీ సాహిత్ ఫోటోలు చాలా బావున్నాయి .
@రాజేంద్ర కుమార్ గారూ ! నాకూ పెట్టాలనే వుందండీ .కాని బ్లాగ్ రాయడమే కొత్త .ఇంకా బ్లాగ్ ని అలంకరించుకోవడం తెలీలేదండీ .ఇక నుండి ప్రయత్నిస్తాను .
పరిమళం గారూ..
ReplyDeleteమీ బ్లాగుని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎలా..? అని తెలుసుకోవాలంటే జ్యోతి టీచర్ గారిని అడగండీ.. సూపర్ గా చెప్తారు.
http://jyothivalaboju.blogspot.com/
నాలాంటి వాళ్ళందరికీ ఆవిడే సహాయం చేసారు. ఆవిడని అడగవసరం లేదు అసలు.. ముందే అన్నీ చెప్తారు ఆవిడ :)
అన్నట్టు.. మీరు మహిళా బ్లాగరుల గ్రూపులో ఎందుకు చేరలేదు ఇంకా? 'ప్రమదావనం' లో మీరూ చేరచ్చు కదా.. ఎంచక్కా అక్కడ మనం ముచ్చట్లాడుకోవచ్చు :)
ఒక్కసారి జ్యోతి గారిని కాంటాక్ట్ చేయండి వివరాల కోసం.
మధురవాణి గారూ !థాంక్సండీ .తప్పకుండా జ్యోతి గారిని కాంటాక్ట్ చేస్తా .
ReplyDeleteచందమామని తినకూడదా?! ఇంతవరకూ తెలియదు నాకు..
ReplyDeleteనెను తేగ లొ ముందు చందమామనే తింటాను, కొబ్బరికాయలొ లేత మీగడ ల భలే వుంటుంది కదా?!!
మరి నా చదువుకీ ఏమీ problem రాలేదేంటి చెప్మా?!
మీరు చెప్పిన సమాధానమూ బాగానే ఉంది.
ReplyDeleteపూర్వకాలంలో చదువు అంటే గురు ముఖతహ సంత చెప్పుకుని దాన్ని వల్లె వెయ్యడమే. చందమామ కొద్దిభాగం మాత్రమే మెత్తగా తినడానికి అనువుగా ఉంతుంది. మిగతాది తాటాకులా పెళుసుగా ఉంటుంది. అది గనక తినడానికి ప్రయత్నిస్తే నాలిక్కి గుచ్చుకుని నాలిక సరిగ్గా పనిచెయ్యకపోయే ప్రమాదం ఉంది. చదువు రాదనే భయానికి అర్ధం అది.