Tuesday, July 21, 2009

నా మొదటి వంట !


ఉప్మా నేను మొదట చేసిన వంట ! ఉప్మా అంటే పైన ఫోటోలో చూసి అదే అనుకోకండి . అలా కనిపించనివాటిని కూడా ఉప్మా అనే అంటారు .కాకపొతే కొన్ని ఉప్మాలు అప్పుడప్పుడూ ఉప్పుమాలుగానూ , ఫెప్మాలుగానూ , అక్కడక్కడా గోళాకృతులుగానూ రూపాంతరం చెందుతూ ఉంటాయి . అటువంటి అద్భుతమైన ఉప్మా రుచి చూసేభాగ్యం అందరికీ కలగదు . కానీ మానాన్నగారికి ఆ అదృష్టం కలిగింది .అదీ నావల్ల !

నాన్నగారి ఉద్యోగరీత్యా తెనాలిలో ఉండేవాళ్ళం .ఊళ్ళో ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఐతే నాన్నగారికి సెలవులేక ,నాకేమో స్కూలు , అన్నయ్యకు కాలేజి పోతాయని అమ్మే ఎక్కువగా వెళ్ళేది .చిన్నప్పట్నించీ అమ్మ ఊరెళితే నాన్నగారో , అన్నయ్యో వంట చేయడం నేను భోంచేయడం జరుగుతూ ఉండేది .ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది కానీ నేను తిన్న కంచం కూడా నాన్నగారే తీసేస్తుంటే నేను శుభ్రంగా చేతులు కడిగేసుకొని వచ్చేసేదాన్ని .అన్నట్టు అన్నయ్య చండాలంగా చేసేవాడుకానీ మా నాన్నగారు మాత్రం వంట చాలాబాగా చేస్తారండోయ్ !

నేనప్పుడు తొమ్మిదోతరగతి చదువుతున్నా ...అమ్మ , అన్నయ్య ఊరేళ్ళారు. సాయంత్రం నేను స్కూల్ నుంచివచ్చేశాక నాకెందుకో రోజూ నాన్నగారు కష్టపడివండితే నేను తింటున్నాను ఈరోజు డ్యూటీ నుంచి వచ్చేసరికి నేనే వంటచేసి ఆశ్చర్యంలో ముంచేద్దాం అని డిసైడ్ ఐపోయా .ఆరోజు శనివారం కాబట్టి అన్నం తినరు . టిఫెన్ చేయాలి ...ఏం చేయాలి ? ఎలా చేయాలి ?

అర్జంటుగా పక్కింటి అత్తయ్యగారింటికి పరిగెత్తా ..ఆవిడ లేరు కాని వాళ్ల అమ్మాయి ఉంది . సత్యవతక్కా అర్జంటుగా ఐపోయే టిఫిన్ చెప్పవా ...అని అడిగి కావలసిన పదార్ధాల లిస్టు , చేసే విధానం రాసుకొని ఇంటికివచ్చి మొదలుపెట్టా ...
ఉల్లిపాయలు సాంబార్ లోకి కోసే సైజులో , టమోటాని రెండు ముక్కలు ( టమోటా వేస్తె ఉప్మాకి ఎక్స్ ట్రా టేస్ట్ వస్తుందని చెప్పింది కానీ పచ్చిమిర్చి వెయ్యాలని చెప్పనేలేదు ) గా కోసి రెడీ చేసుకున్నా ! పోపు దినుసులు అంది కదాని పోపులపెట్టి తీస్తే దాంట్లో చాలారకాలు కనిపించాయి బాండీలో నూనె వేసి పెట్టెలోని సామగ్రి అంతా చేతికి వచ్చినంత వేసి ఆపై ఉల్లిపాయలూ ....వగైరా వేసిరెండు గ్లాసుల నీళ్లు పోసి ( మూడుగ్లాసులు పోయాలని అక్కకి కూడా తెలీదట తర్వాత తెలిసింది )మర్చిపోకుండా ఉప్పువేసి ఇక రవ్వకోసం వెతకటం మొదలుపెట్టా ...అది దొరికేసరికి నీళ్లు మరిగి గ్లాసుడైనట్టున్నాయి . రవ్వ మొత్తం కుమ్మరించి తిప్పుదామంటే అక్కడేం తిప్పేచాన్స్ లేదు . ఇక మూతపెట్టేసి నాన్నగారికోసం ఎదురుచూట్టం మొదలు పెట్టా !

రాగానే తొందరగా స్నానం చేసేయండి నాన్నగారూ !నేను మీకోసం ఉప్మా చేశానని చెప్పగానే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ! నువ్వు స్టవ్ ఎందుకు ముట్టుకున్నావ్ రా ...ఉల్లిపాయలుకూడా కోసావా ..ఏమన్నా అయితేనో అని మెత్తగా చివాట్లు పెడుతూనే స్నానం ముగించి వచ్చి ప్లేట్లో పెట్టుకుందామని చూస్తె బాండీ లోంచి అట్లూస ఊడిరానని మొండికేస్తే దాన్ని బలవంతంగా పెకలించి ఉప్మాని పెట్టుకొని దానిలో గుండ్రం గా ఉండలుగా ఉన్న వాటిని చేత్తోచిదుపుతుంటే రవ్వ జలజలా రాలుతున్నా కలిపేసుకొని బుజ్జిగాడూ ..చాలా బావుందిరా ..అమ్మకూడా ఇలా ఎప్పుడూ చేయలేదు అంటూ దాంట్లోనే మజ్జిగ కలిపేసుకొని తినేసి నాకు అన్నం వండుతుంటే అర్ధం కాలేదు . నేనూ అదేతిందామని ఎక్కువే చేశానుకదా అని నోట్లో పెట్టుకోగానే ఏడుపొచ్చేసింది . అంత కష్టపడినా అమ్మ చేసినట్టు రాలేదు ఏం బాలేదు అంటే ...లేదురా చాలా బావుంది అమ్మెప్పుడూ టమోటాలే వెయ్యలేదు . అంటూ నాకు అన్నం తినిపించారు . అంతే కాదు తర్వాతకూడా చాన్నాళ్ళు మా బుజ్జమ్మ ఉప్మా చేసింది అంటూ అందరికీ చెప్పేవారు .అమ్మొచ్చాక కూడా అంతే బుజ్జమ్మ ఉప్మా బ్రహ్మాండంగా చేసిందని చెప్పారు .ఇప్పుడు తలుచుకుంటే కళ్లు చెమరుస్తాయి .

ఎంత చండాలంగా చేసినా నా మొదటి ప్రయత్నం అవటం వల్లనో ఏంటో ..ఉప్మా నా ఫేవరేట్ టిఫిన్ . ఇప్పుడు అలాచేయను లెండి . మా శ్రీవారు ఉప్మా ఇష్టమేంటో ..తప్పకపోతే తింటాం కానీ అని వెక్కిరిస్తూనే ...నాకోసం నేర్చుకొని నాకంటే ఎక్సలెంట్ గా చేస్తారిప్పుడు .

** ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచా ...నాకు ఉప్మా చేయడం ఎలాగో చెప్పిన సత్యవతి అక్క అప్పటికి తను ఒక్కసారికూడా చేయలేదట !ఆ సంగతి తర్వాత వాళ్ళమ్మ గారు చెప్తే తెలిసింది :) :)

32 comments:

  1. పరిమళం గారు నాన్న లంటే అంతే మరి ...ఎంత ముద్దు చేస్తారు ,ఏంటోనండి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం అంటారు.. అబ్బాయిగా పుట్టినా కనీసం వారికి అండదండగానో ,నెల నెలా డబ్బురూపం లోనో వారిని చూడచ్చు..హుం మా అమ్మకు ఎప్పుడన్నా పొరపాటున చీర కొంటానన్నా వద్దు అంటే వద్దు అల్లుడి సొమ్ము అలా తీసుకోకూడదు అని మళ్ళీ నాకే తిరిగి పెడుతుంది ..మీ నాన్న గారి గురించి చదువుతుంటే కళ్ళు చెమర్చాయి

    ReplyDelete
  2. మీ ఉప్మోఖ్యానం చాలా బావుంది .
    ముఖ్యంగా కొసమెరుపు మరీ బావుంది.

    ఉప్మా తో ప్రతి ఒక్కరికీ పాజిటివ్ గానో నెగెటివ్ గానో గాఢమైన అనుబంధం తప్పక వుంటుందేమో. .
    మీ టపా చదువుతుంటే కాలేజీ రోజుల్లో నలుగురు మిత్రులం వంటలతో పడ్డ పాట్లు గుర్తుకొచ్చాయి.
    అంతవరకు మీలాగే మాకూ అమ్మ చేసిపెడితే తినడమే తప్ప కంచాలు తీసే అలవాటు కూడా లేకుండేది .
    హఠాత్తుగా వంటలు చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు వూడవడం, బట్టలు ఉతుక్కోవడం వంటి "ఆడ" పనులన్నీ చచ్చినట్టు మేమే చేసుకుంటూ చదువుకోవలసిన పరిస్థితి వచ్చిపడింది.

    అప్పుడు ఒక్కొక్కడు ఒక్కో కొత్త వంటకాన్ని సృష్టిస్తుంటే ఎంత సరదాగా వుండేదో.
    అమ్మ పెట్టిచ్చిన పచ్చళ్ళ, పొడుల సప్పోర్ట్ తో ఎలాంటి వింత వంటకాన్నైనా వేస్ట్ చేయకుండా ఆరగించేవాళ్ళం.
    అలంటి దశలో నేను మొట్టమొదటగా చేసిన టిఫిన్ కూడా ఉప్మాయే .

    కారం ఉప్పు లేకుండా ఏ వంటకం వుండదన్న ప్రగాఢ మైన విశ్వాసం వుండేది నాకు.
    అందుకే గంటేడు కారం వేసి బ్రహ్మాండ మైన ఉప్మాని తయారు చేసాను.
    ఆ తర్వాత ప్రతీ ఒక్కళ్ళం అందులో గంటేడు గంటేడు చక్కర కలుపుకుని మరీ లొట్టలేసుకుంటూ తిన్నాం.
    మధుర స్మృతులను గుర్తుకు తెచ్చారు.
    అభినందనలు.

    ReplyDelete
  3. నాన్నలకి వాళ్ళ అమ్మాయిలు ఏం చేసినా గొప్పగానే వుంటుంది. బాగుంది మీ ఉప్మా అనుభవం.

    ReplyDelete
  4. ఉప్మా తో ఉన్న అనుభందం అలాంటిది ..చాలా బావుంది మీ మొదటి వంట

    ReplyDelete
  5. చాలా హ్రుద్యం గా చెప్పారండి.
    చదవగనే మా బాబయి పెళ్లయిన కొత్తలో మేము మా పిన్ని మీద మోజు తో అవిడ బాగా వండుతుంది అని మా అమ్మ తొ పందెం వేసి, మా పిన్ని చేత ఉప్మా చేయించి, గ్లాసులలో పొసుకు తాగిన విషయం గుర్తు వచ్హింది.

    ఆ రొజు మా పిన్నిని ఎన్ని తిప్పలు పెట్టామో అనిపిస్తుంది ఇప్పుడు తలచుకుంటే

    ReplyDelete
  6. hahahhaa baaga raasaru...........
    ma friends (B.tech chese time lo) iddaru prati roju upma ne tiffin ga chesukoni tine vaaru..... enti ra babu ela tintaaru adi rooju ante .mari em cheyyamantav easy ga and vachhindi ade kaabatti ane vaaru..........

    m.tech lo tamil upma tine sariki upma meeda prema chachhindi .

    ReplyDelete
  7. బాగుందండి ఉప్మా కథ.. ముఖ్యంగా కొసమెరుపు :-) :-)

    ReplyDelete
  8. వుండలు చిదుముతుంటే ..రవ్వ జల జల రాలుతుంటే ......మీ నాన్నగార్ని తలుచుకుంటే మనస్సు ఆర్ధ్రమయ్యిందండీ .టపా బాగుంది .

    ReplyDelete
  9. అన్నట్లు చెప్పడం మరిచాను ,మా అభిమాన రచయిత కి ఇష్టమైన టిఫిన్ ..జీడిపప్పు, వుల్లిపాయలు ఎక్కువ వేస్తే తియ్యగా వుంటుందని చెప్పారు ....నాతో కాదు ఆయన రాసే కథల్లో ...ఏం టిఫిన్ అంటే ..మల్లాది టిఫిన్ అనుకుంటాము :):)

    ReplyDelete
  10. ఉప్మా చేయడం ఎలాగో చెప్పిన సత్యవతి అక్క అప్పటికి తను ఒక్కసారికూడా చేయలేదట !

    kosamerupu baagundi..:))

    ReplyDelete
  11. బాగుందండి..ఉప్మా! మీరు చేస్తే బాగోపోవడం ఏమిటి చెప్మా!

    ReplyDelete
  12. మీ నాన్న గురించి చాలా బాగా చెప్పారు. లేదా నాకు చాలా బాగా నచ్చింది. నేనూ ఓ పాపకు తండ్రిని కాబట్టేమో. (మా పాపాయికి యేడాది నిండుతూంది)

    ReplyDelete
  13. baagundi mee upmaa prahasanam!!!

    ReplyDelete
  14. ఆహ!! ఏమి రాజ భోగాలు అనుభావించారండి మీ నాన్న గారి చెంతలో....ఒక్క నిమిషం మీమీద జెలసీ పుట్టేసింది నాకు. అబ్బాయిలకైతే సాధారణంగా మొదటి వంటకి బలయ్యేది వారి స్నేహితులే అయ్యుంటారు...బావుంది మీ మొదటి పాకశాస్త్ర అనుభవం..

    ReplyDelete
  15. బాగుందండి మి మొదటి వంట.నాకు నేను మొదటిసారి ఉప్మా చేసిన విషయం గుర్తు వచ్చింది.ఆ కధ నా మరొ టపాలొ..

    ReplyDelete
  16. చూసారా! అప్పుడు అలా చేయబట్టేకదా, ఇప్పటివరకు ఘుమ ఘుమలాడుతుంది.
    అదండీ పాత సృతుల రుచులు....

    ReplyDelete
  17. నాకిష్టమైన టిఫిను కూడా ఉప్మానే. ఇప్పటికీ నా చేత ఏదయినా బండ పని చేయించాలంటే మా ఆవిడ ఉప్మా ఆశ చూపెడుతుంది.

    ReplyDelete
  18. బాగున్నాయి మీ మొదటి వంట విశేషాలు.నాకు నా మొదటి ఉప్మా చేసిన రోజు గుర్తు వచ్చింది.కానీ ఆ కధ కొంచం పెద్దది.ఒ టపాలో రాయాల్సిందే..

    ReplyDelete
  19. ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచా ...నాకు ఉప్మా చేయడం ఎలాగో చెప్పిన సత్యవతి అక్క అప్పటికి తను ఒక్కసారికూడా చేయలేదట !ఆ సంగతి తర్వాత వాళ్ళమ్మ గారు చెప్తే తెలిసింది

    ReplyDelete
  20. @ నేస్తం గారూ !మా అమ్మకూడా అంతేనండీ ...ఏదేమైనా ఎన్ని జన్మలైనా అమ్మాయిగానే పుట్టాలి ...మానాన్నగారి బుజ్జమ్మగానే ఉండాలని కోరుకుంటానండీ ...

    @ ప్రభాకర్ సర్ ! మీ కాలేజీ రోజుల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు .మీలాగే అన్నయ్యకి పచ్చళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే ...

    @ మాలాగారు , నిజమేనండీ ...నాన్న కూతుర్ని కదామరి !

    @ లక్ష్మిగారు , థాంక్స్ !

    @ హరే కృష్ణ గారూ ! ఇంతకూ మీకు ఉప్మా ఇష్టమో కాదో చెప్పారుకాదు :)

    ReplyDelete
  21. @ వెన్నెల గారు , ఆతర్వాత అంటే పెళ్ళయిన నాలుగేళ్ల తర్వాత రెండోసారి చేసినపుడు నా ఉప్మా ఆకారం అదే ! :)

    @ వినయ్ చక్రవర్తిగారు , స్వయంపాకం చేసి చూడండి మీ ఉప్మా మీకు ఎంత రుచిగా అనిపిస్తుందో ... :)

    @ మురళి గారూ ధన్యవాదాలు :) :)

    @ చిన్నిగారు , చిన్ననాటి జ్ఞాపకాలు మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది .మల్లాదిగారికి ఇష్టమా ? కొత్తవిషయం తెలిసింది .

    @ విజయమోహన్ గారు , ధన్యవాదాలండీ !

    ReplyDelete
  22. @ సుజ్జి గారు , థాంక్స్ :)

    @ పద్మార్పితగారు , ఇప్పుడైతే సూపరండీ ...మీ ప్రాస ఇంకా సూపరండీ ..

    @ రవిగారూ ..ఐతే మీపాప నాన్నకూతురేనన్న మాట !అదృష్టవంతురాలు.

    @ సునీత గారూ థాంక్స్ !

    @ శేఖర్ గారు , నిజమండీ ...ఒక కోటీశ్వరుడు కూతురికి మణి మాణిక్యాలివ్వొచ్చు, భోగభాగ్యాల్లో ముంచేయొచ్చు ...కానీ మానాన్నగారు తన అరచేతుల్లో నడిపించారు నన్ను .మీరన్నారని కాదుగానీ నిజంగానే నా స్నేహితులూ , బంధువులూ జెలసీ ఫీలయ్యేవారు :)

    @ తృష్ణ గారూ , ఐతే మీ టపా కోసం ఎదురు చూస్తుంటాం ...

    @ సృజన గారు , మీ అందరితో పంచుకోవడంతో స్మృతుల రుచి మరింత పెరిగింది .థాంక్స్ .

    @ జయచంద్ర గారూ ! ఇది మాత్రం దారుణమండీ ...ఉప్మా అభిమానుల సంఘం మీవెనుకే ఉంది భయపడకుండా మీరే ట్రై చేయండి . వివరాలు కావాలంటే మా సత్యవతక్క ఉందనే ఉందిగా :)

    @ శివ ప్రసాద్ గారూ ! :) :)

    ReplyDelete
  23. >>ఇప్పుడు తలుచుకుంటే కళ్లు చెమరుస్తాయి.
    ఏవో జ్ఞాపకాలు............చెమర్చాయి.
    పనిలోపని ఉప్పమా ఎలా చెయ్యాలో ఓ పోస్టేస్తే పొయ్యేదిగా. మేమూ నేర్చుకునేవాళ్ళం కదాఆఆఆ. :):)
    మీనాన్న గారి వద్ద నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మా చంటిది ఇప్పుడిప్పుడే కిచ కిచా అని నవ్వుతోంది. ఇక రేపొద్దున ఎలా వంటావార్పు చేసి నన్ని ఎలా ఆనందింపజేస్తుందో చూడాలి.
    ఇంకో విషయం, ఆడపిల్లల్ల గురించైతే ఇలా చెప్తారేమోకానీ, మొగపిల్లలగురించైతే? ఏదో మావాడు ఇంత ఉడకేసి పడేసి, ఉమ్పా అని పేరు పెట్టాడు అని చెప్పేవారేమో? లేక మా బడుద్ధాయ్ పనిలేక పిల్లితల గొరుకబోతుంటే అరేయ్, భడవ, అలా పిల్లితల గొరికేబదులు ఉప్మాచేసిఏడవచ్చుగా అని చెప్పా సుబ్బారాబు గారు! ఏదో ఏడ్చాడు చవట, ఇలా ఏడ్చింది ఉప్మా అని చెప్పేవాళ్ళేమో...

    ReplyDelete
  24. अबके जनम मोहे बिटिया ही कीजो (c)
    వావ్!!
    సరే దానిగురించి మరెప్పుడైనా మాట్లాడదాం
    మీరు ఇది చదివినట్టులేరు...ఓ లుక్కు వేయండి..
    http://nalabhima.blogspot.com/2009/04/blog-post_13.html

    ReplyDelete
  25. హతోస్మీ మీరు ఉప్మా లోకులేనా? అది మాత్రం నాకు చాలా రోజులు శత్రువు. నేను చేసిన మొదటి వంట ఏమిటన్నది మాత్రం చెప్పను నిజానికి చెప్పలేను, ఒకటి అనుకుని ఒకటి చేసాను అది మధ్యస్తంగా వచ్చింది కనుక. కానీ మా నాన్నగారిది మాత్రం మీ నాన్నగారి మాదిరి ప్రేమే. :)

    ReplyDelete
  26. పరిమళం,

    ఈ సారి ఉప్మా చేసేటప్పుడు టమోటాలకు బదులు రెండు చెంచాల పాలు వేసి చూడండి.

    నేను మా అన్నయ్యకోసం రక రకాలుగా ప్రయత్నించి చేసేదాన్ని.

    ReplyDelete
  27. నా మొదటి ఉప్మా కధ ఇవాళ రాసానండి.విలుంటే ఒ కన్ను అటు వెయ్యండి..

    ReplyDelete
  28. @ భాస్కర్ రామ రాజుగారూ !ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు .ఉప్పమా మీద పోస్టా? అమ్మో ...నలభీముని ముందు కుప్పిగంతులా ...
    ఆడపిల్లలెపుడూనాన్న కూతుళ్ళే కదండీ ! ఇంకో పదేళ్ళు ఆగండి ఆ అనుభూతి మాతో పంచుకొందురుగాని !

    @ ఉషాగారూ ! మేమింత ధైర్యం చేసి ఫెప్మా గురించి రాస్తే ...మీ మొదటి వంట గురించి చెప్పరా :( :(

    @ శృతి గారూ ! తప్పకుండా పాలు కలపమని చెప్తా ...........మా శ్రీవారితో ....:) :)

    @ అంకుష్ గారు , సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండండి . ఏదోకరోజు అద్భుతంగా వస్తుంది :) :)

    @ తృష్ణ గారూ !తప్పకుండానండీ ....

    ReplyDelete
  29. మీ ఉప్మా కథ, అందరి వ్యాఖ్యలు బావున్నాయి. ఒకోసారి ఆలస్యంగా రావడం వల్ల ఇదే ఉపయోగం ;)
    నేను కూడా ఇలా ఉప్మాతో మా నాన్నని భయపెట్టాను. మీ నాన్న లాగే పాపం ఆయన తెగ మెచ్చుకుంటూ మొత్తం తినేశారు :)
    కొసమెరుపు భలేగా ఉంది :)

    ReplyDelete