Saturday, February 27, 2010

ఆత్మహత్యలెందుకు ??


రెండు రోజులనుండి లోకల్ ఎడిషన్ చూస్తుంటే బాధ ..ఆందోళన కలుగుతున్నాయ్ !రెండురోజుల్నుంచే కాదు
ఈమధ్య ఎక్కడ చూసినా ఆత్మహత్యలు !నాలో ఎన్నో ప్రశ్నలు ..సమాధానం లేనివి...ఎవరితో పంచుకుందామన్నా నాది అర్ధం లేని బాధగా కొట్టిపడేస్తారేమో....పొరపాటున ఎవరితో అయినా అంటే నీకెందుకు , కనీసం ముఖపరిచయం కూడా లేనివారి గురించి నీ మనసు పాడు చేసుకుంటావెందుకంటూ చివాట్లు !

అసలు ఆత్మహత్యలు ఎంత తీవ్రమైపోయాయో ....ప్రాణం విలువ ఎంత దిగజారిపోయిందో తలుచుకుంటే చాలా బాధేస్తుంది .భర్త తిట్టాడని బిడ్డతో సహా కాల్చుకున్న ఓ తల్లి , తండ్రి మందలించాడని కొడుకు,ఏదో ప్రాంతం వారివల్ల తనకు ఉద్యోగం రావట్లేదని ఓ వ్యక్తీ ,చెవి సంబంధిత వ్యాధితో ఓ గృహిణి ,ప్రియురాలు తిరస్కరించిందని ఓ యువకుడు, తనను నమ్మిన వారిని మోసగించానని,చదువు రాలేదని మరో యువకుడు, భార్యతో మనస్పర్ధలతో ఒక వ్యక్తీ , ప్రేమ విఫలమై మరో వ్యక్తీ ...ఇవే కాదు ..మార్కులు తక్కువొచ్చాయని , పరీక్ష తప్పాననీ , పోటీ పరీక్షల్లో విజయం సాధించలేక పోయాననీ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్నో ....బలవంతపు చావులు!

ఇంకో దారుణం ఏవిటంటే పదిహేనేళ్ళ వయసున్న అమ్మాయి ,అబ్బాయి ఆత్మహత్యకు ప్రయత్నించడం ..అమ్మాయి చనిపోవడం. వారిద్దరినీ ప్రేమికులనాలా?స్నేహితులనాలా ?పిల్లలిద్దరూ నాలుగేళ్ళుగా కలిసి చదువుతున్నారట ! అమ్మాయి తల్లితండ్రులు విడిపోతే తల్లి రెండోపెళ్ళి చేసుకుందట ! తోటి పిల్లలతో కలవకుండా ఈ అబ్బాయితో మాత్రం తన బాధను పంచుకొనేదట !అమ్మమ్మ దగ్గర ఉంటున్నా మానసిక వేదనతో చనిపోవాలనే నిర్ణయం తీసుకొని aస్నేహితులిద్దరూ కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ పైకెక్కి చనిపోదామని ...ముందుగా అమ్మాయి దూకేసిందట అబ్బాయి భయపడి వెనక్కివచ్చాడట ! తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని చనిపోవడానికి వచ్చామని అబ్బాయి చెప్పడం చదువుతుంటే ....నాకు నోట మాట రాలేదు.

అసలు ఈ ఆత్మహత్యలు అవసరమా ..చావుతప్ప సమస్యలకు పరిష్కారం దొరకదా ..అసలు పరిష్కారం వైపు సాగకుండా వీరి ఆలోచనలు చావువైపుగా ఎందుకు సాగుతున్నాయ్ ? వీరి చావులకు బాధ్యులు వారు మాత్రమేనా ?చుట్టూ ఉన్నవారు కూడానా ?వీరి చుట్టూ ఉన్నవారికి చనిపోయేముందు వారి ప్రవర్తనలో మార్పు తెలీదా ?తెలిసినా తమకేం పట్టనట్టు ఉండిపోతారా ?తల్లి తండ్రులకు ,సమాజంలోని తోటి మనుష్యులకు ఏమీ బాధ్యతా ఉండదా ? ఇవన్నీ మీక్కూడా పిచ్చి ప్రశ్నల్లా అనిపిస్తున్నాయా ? సంవత్సరనికోరోజు ఆత్మహత్యల నివారణదినంగా ప్రకటించి పెరిగిపోతున్న ఆత్మహత్యలను నలుగురు మానసిక నిపుణుల చేత పత్రికలలో ప్రకటన సూచనలు ,సలహాలు ఇప్పిస్తే సరిపోతుందా?

మానసికంగా వేదనకు గురైతే ..స్నేహితులకు కూడా చెప్పుకోలేమని అనిపిస్తే ...అటువంటివారి బాధని ఓర్పుగా విని ,ఓ తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే నష్టం వివరించి కౌన్సిలింగ్ చేసే స్వచ్చంద సంస్థలు ఉన్నాయని తెలుసు వాటి పూర్తివివరాలు తెలియవు .కాని 108 కి , 100 కి ఎంత ప్రాచుర్యం కల్పించారో ఇటువంటి వాటికికూడా ప్రభుత్వం విరివిగా ప్రచారం చేస్తే బావుండు అనిపిస్తుంది .అంటే సినిమా హాల్లో స్లైడు వేయించడం ,టివి లో యాడ్ ఇప్పించడం వంటివి చేస్తే బావుంటుందేమో ...

యండమూరిగారు ఏదో నవలలో అన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య మరణం మాత్రమే అనివార్యమైన మరణంతో పోలిస్తే మిగిలినవన్నీ చిన్న సమస్యలే !

ఆత్మహత్యలు క్షణికావేశంలో జరిగేవి ఆ కాస్సేపూ ఎవరైనా తోడుగా ఉండి వారి బాధను పంచుకొని వారి ఆలోచన మళ్లిస్తే వారికి బ్రతుకుపై ఆశ కలగొచ్చు . తర్వాత వారి మానసిక ఆందోళన తీవ్రతను బట్టి తగిన వైద్యం చేయించొచ్చు
తల్లితండ్రులు కాని ,సన్నిహితులుగాని తమవారి ప్రవర్తనలో మార్పు , నిరాశ , నిరాసక్తత కనిపిస్తే అలక్ష్యంచేయకుండావారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్తే కనీసం కొన్ని ఆత్మహత్యలనైనా నిరోధించగలమేమో !

** మీకెవరైనా అలాంటివారు కనిపిస్తే శ్రమనుకోకుండా కాస్త ఓర్పు ...మరికాస్త సమయం వారికోసం వెచ్చిస్తారు కదూ !




13 comments:

  1. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటారు...అంటారు కాని, అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి. అసహాయతలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తే సరిపోదు. పోరాడే శక్తిని కలిగించాలి. క్షణికావేశం యొక్క ప్రమాదాన్ని ఎన్నో ఉదాహరణలతో తెలియచేయగలగాలి. కంటికి రెప్పగా ఎంతకాలమని కాపలా కాయగలరు. సమస్యలో సత్వర మార్పు తేకలగాలి. పూర్తిగా డైవర్ట్ చేసి వాళ్ళని బిజీ చేయాలి. వాళ్ళకు సంఘసేవకు సంబంధించి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలి. వాళ్ళు ఎన్నో పనులను సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వహించగలరని తెలుసుకోవాలి. వాళ్ళ అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళే తెలుసుకో గలుగుతారు. క్రమంగా జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించటం నేర్చుకుంటారు. పరిమళ గారు, నా చుట్టూ నేను గమనిస్తున్న సమష్యలకు నేను చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఇవే.

    ReplyDelete
  2. మీరు ఎంతో బాధ్యత తీసుకొని రాసిన పోస్టు చదువుతూంటే వారి చుట్టూ వున్న మనం నేరస్తులం కాదా అనిపిస్తోంది. కూలిపోయిన కుటుంబ సంబంధాలు, అంతా సరుకై పోయి, తడి ఆరిపోయిన హృదయాల మధ్య ఆ సున్నితమనస్కులు ఆత్మహననం చేసుకుంటున్నారు. నాతోటి మితృడొకరు ఆ మధ్య యిలానే 59 ఏళ్ళప్పుడు, ఆడపిల్ల పెళ్ళి 15 రోజులలో పెట్టుకొని చనిపోయినప్పుడు తలా ఒక మాట విసిరారు కానీ, తాను పడ్డ వేదనను ఎవరు మాన్పే ప్రయత్నం ముందుగా చేయలేదు. యిది దారుణం కాదా? మానసిక చికిత్స తప్పక అవసరం. అసలు ఈ వైద్యులను కలవాలంటేనే ఎందుకొ జంకుతారు. తమను పిచ్చివాళ్ళనుకుంటారని. కానీ నేటి సామాజిక రుగ్మతగా మారిన ఆత్మహత్యలు, ఆత్మబలిదానాలకు యిది చాలా అత్యవసరం. లేకపోతే మనం ఒక తరాన్ని నష్టపోతాం.

    ReplyDelete
  3. @ జయగారు , అందరూ మీలా అవగాహనతో ఉంటే కనీసం మన పరిధిలో జరిగే బలవన్మరణాలను ఆపే వీలుంటుంది అభినందనలండీ !

    @ వర్మగారు ! కొన్నేళ్ళ క్రితం మాకు బాగా దగ్గరి బంధువులు ముగ్గురు ఇలాగే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు ....వీరు బాధలకు దూరంగా వెళ్ళిపోయారు కాని వారితో బంధం ఏర్పరచుకున్న తల్లితండ్రులు , పిల్లలూ వారి జీవితాలు అస్తవ్యస్తమై మాకళ్ళముందే కనిపిస్తున్నాయి .ఇప్పటికీ అనిపిస్తుంది నేను అప్పుడు వారికి దగ్గరగా ఉంటే ఇలా జరగనిచ్చేదాన్ని కాదని....ప్చ్ ....

    ReplyDelete
  4. మొన్న తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఓ ఇద్దరు చిన్నారులను అనాధలుగా వదిలేసి సూసైడ్ చేసుకున్నారు. బతుకంటే ఏంటో తెలీని ఆ పిల్లలను చూస్తే మనసు కకావికలం అయిపోతుంది...ఆత్మహత్యలకు ముఖ్యకారణం డిప్రెషన్ లో ఉన్న వారికి గానీ, తీవ్రమైన భాదల్లో ఉన్నవారికి గానీ మేమున్నామన్న భరోసా ఎవరూ ఇవ్వలేకపోవటం...మీరన్నట్టు 108 కి ఉన్నంత ప్రచారం దీనికి కూడా కలిగించాలి. హైదరాబాదులో రోషిణి అనే స్వచ్చంద సంస్థ ఇలా ఆత్మహత్య ఆలోచన ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇస్తారు.
    వారి ఫోన్ నెం. 040-66202000. ఈ నెం ఎవరి విషయంలోనైనా అవసరమైతే ఉపయోగపడుతుందని మొబైల్లో సేవ్ చేసి ఉంచుకున్నాను. ఒకవేళ మనకు ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నవారు కనిపించి వారిని మనం సరిగ్గ డీల్ చెయ్యలేమనిపిస్తే కనీసం ఈ ఫోన్ నెం.కు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించవచ్చు. మనవంతు భాద్యతను నిర్వర్తించవచ్చు.

    మంచి టపా రాసారు. అభినందనలు.

    ReplyDelete
  5. @ శేఖర్ గారు , రోషిణి సంస్థ నెంబర్ నా ఫోన్ బుక్ లో ఉండేదండీ ...మా చెల్లిగారి అబ్బాయి చింపేయడం వల్ల టపాలో పెట్టలేక పోయాను మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలండీ ..

    ReplyDelete
  6. పరిమళ గారు మొట్టమొదటిసారిగా ఒక బ్లాగుకి ఫాలోయర్ ని ఐయ్యాను. అది మీ బ్లాగే..

    మీ ముందు టపా చూసిన తరువాత మీ మనసేంటో అర్థమైంది. ఈ టపా చూసాక మీరు అన్ని విషయాలకు స్పందిస్తారని అర్య్హమైంది. మీరు కూడా చాలా సున్నిత మనస్కులు అని అర్థమైంది. నేను మీలాగే ఆలోచిస్తుంటాను.

    నాకు ఎక్కువ బాధ కలిగించిన సంఘటనను చెప్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్ విధ్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక్కడ ఆ అమ్మాయి తన బాధను చెప్పుకుంది. కాని తన తల్లిదండ్రులు వినిపించుకోలేదు. వారు ఆ అమ్మాయిని ఓ కార్పోరేట్ కాలేజ్ లో వేసారు. అక్కడ చదువుల సంగతి తెలిసిందే కదా... 24 గంటలు తినేస్తారు. ఆ అమ్మాయి వాళ్ల నాన్నతో " నాన్న నేను ఇక్కడ చదువుకోలేకపోతున్నాను. ఉండలేకపోతున్నాను. " అని ఏడుస్తూ మరీ చెప్పిందట! ఐనా వాళ్లు వినలేదు. డబ్బు కోసం, పరువు కోసం ఆలోచించారు. చివరికి అదే కాలేజ్ బిల్డింగ్ మీద నుండి దూకి చనిపోయింది. తరువాత వాళ్లు ఎంత ఏడిస్తే ఏం లాభం. ప్రాణం తిరిగి రాదుగా!



    ఇక్కడ ఆ అమ్మాయి తన గోడును వెలబోసుకున్నా ఎవరూ వినలేదు. ఇది చదివిన నాకు మూడు రోజుల వరకూ ఈ చదువుల గురించీ.. ఈ సమాజం గురించీ.. ఒకటే ఆలోచనలు. ఇప్పటకీ అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది.



    నా వంతు సాయం చేద్దామని "వర్మ" గారు ఇచ్చిన "రోషిణి" నెంబర్ ని సేవ్ చేసుకున్నాను.

    ReplyDelete
  7. జయగారు, పొరబాటు. ఆత్మహత్యలకి గుండెధైర్యం కాదు కావల్సింది. 90 శాతం ఆత్మహత్యలు తీవ్రమైన డిప్రెషన్ మూలంగా ప్రేరేపించబడీనవి. ఇది గుండెజబ్బు, షుగరు వాటిల్లాగానే ఒక జబ్బు. సరైన సమయంలో గుర్తిస్తే దీన్ని మందులతో టృఈట్ చెయ్యొచ్చు. ఒకో వ్యక్తికి ఇలా డిప్రెషన్ ఉన్నదని గుర్తించకపోవడం వల్ల, ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా దీనికి లేనిపోని లక్షణాలు అంటగడతారు. పిరికితనమూ కాదు, ధరియమూ కాదు. It is depression, plain and simple. And they need treatment.

    ReplyDelete
  8. చాలా బాధ అనిపించింది టపా చూస్తే. ఒక ప్రాణం ఎంత విలువైనది కదా ఆ ప్రాణం వూపిరి పోసుకోవటానికి వూపిరి పోవటానికి మధ్య విలువైన ఒక జీవితం.. దాని కోసం ఎన్ని బాధలు చివరకు జీవితాన్నే ముగించెయ్యాలన్నంత బాధ.. మీరందరు అన్నట్లు ఇలా గాడి తప్పిన ఆలోచనలను సరి ఐన దారి లో పెట్టే సంస్థ ల కు ఇంకా అందరికి తెలిసేట్లు వుండాలి. చాలా ఆలోచనలను రేకెత్తించే పోస్ట్.

    ReplyDelete
  9. @ సవ్వడిగారు పిల్లలు తమ బాధను చెప్పుకొనే అవకాశం తల్లితండ్రులే ఇవ్వకపోవటం బాధాకరం.పిల్లల మానసిక ఒత్తిడి తల్లితండ్రులు కాకపొతే ఇంకెవరు పట్టించుకుంటారు ? మీరు చెప్పిన సంఘటన ప్రతి తల్లితండ్రులకు ఒక కనువిప్పు ఐతే కనీసం ఇకముందైనా జాగ్రత్త పడతారు మీ వంతుగా సాయపడతానన్నారు అది నాకు బ్లాగును ఫాలో కావటం కంటే ఆనంద దాయకం ధన్యవాదాలండీ !

    @ కొత్తపాళీ సర్ ! మీరు చెప్పింది అక్షర సత్యం ఇది అందరూ ఏకీభవించాల్సిన విషయం !మీ స్పందనకు ధన్యవాదాలండీ !

    @ భావనగారు , మన చుట్టూ ఉన్నవారిని కాస్త గమనిస్తే డిప్రెషన్ లో ఉన్నవారిని గుర్తించవచ్చు ...డిప్రెషన్ లో ఉన్న ప్రతి వారు ఆత్మహత్య చేసుకుంటారని కాదుగాని ...ఆ టైం లో వారిని గుర్తించి సపోర్ట్ ఇవ్వకపోతే తర్వాత వారి ఆలోచనలు ఆదిశగా సాగే అవకాశం ఉండొచ్చు . అలా ఏదైనా జరిగాక మనమే ఎంతో మధన పడతాం అనేది నా ఆవేదన ! స్పందించినందుకు ధన్యవాదాలు .

    ReplyDelete
  10. నేర్పుతుంది జీవితమే
    అనుక్షణం కొత్త పాఠమే
    ఓడిపోతుంది ఒకనాడు ఓటమే
    ఓర్పుతో సాధిస్తే వరించేను విజయమే
    1. అద్భుతాలు జరిగి ఎవ్వరూ- కాలేదు గొప్పవారు
    అదృష్టం నమ్ముకొని అవలేదు-మహానీయులు
    ఇటుక మీద ఇటుక పేర్చి -కడితేనే మేడగ మారు
    పునాదియే పటిష్టమైతే –కట్టడాలు కడతేఱు
    2. నిద్రలేమి రాత్రులెన్నో- గడిపారు కీర్తి చంద్రులు
    సాధనయే ఊపిరిగా- సాగారు లక్ష్య పథికులు
    పక్కదోవ పట్టలేదు –ఎన్నడైనా విజేతలు
    ధ్యేయాన్ని మరువలేదు –కలనైనా జిష్ణువులు
    3. భగీరథుని సంకల్పం-అవ్వాలీ నీకభిమతం
    సడలని విక్రమార్కుని-పట్టుదలే నీకాదర్శం
    ఏకలవ్యు నేకాగ్రతయే- ఎప్పటికీ నీకు హితం
    అభిమన్యుని విక్రమతే-సదా నీకు ప్రామాణ్యం
    4. ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
    కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
    సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
    ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం

    ReplyDelete
  11. చావడానికి చాలా ధైర్యం కావాలి అది బ్రతకడానికి వుపయోగించు..అని సినిమల్లో చాలా వీజీగా చెప్పేస్తారు...

    మొన్న ఆదివారం, అందర్కీ హోళీ శుభాకాకంక్షలు msgs fwd చేసేసి, చక్కగా నిండు చందమామ కింద బండ పైన పప్పు ఆవకాయ్ కలుపుకుని తింటున్నాము, మా నేస్తం యునివర్సిటిలో. ఈ లోపు మా యునివర్సిటి నించి వార్త, నువ్వు happy holi చెప్పావు కదా, కాని నీకో bad news, B.A student ఒకడు దూకేశాడు పైనించి అని...నిండా 20 ఏళ్ళు కూడా రాని వాడికి జీవితం అప్పుడే మోయలేనంత బరువైపోయిందా....

    students ఆత్మ హత్యల గురించి HOPE అని ఓ సినిమా ఉంది, చాలా బాగా తీశాడు, డా.రామానాయిడు, కళ్యాణి నటించారు...దాని గురించి తీస్తున్నప్పుడు పేపరులో చూశాను కానీ విడుదల ఐనట్టు తెలీలా తర్వాత ఎప్పుడో చూశాను, కాస్తైనా మార్పు తేవాలనే ప్రయత్నాలు ఎంత వరకూ వెలుగులోకి వస్తున్నాయో మరి....

    ReplyDelete
  12. ఆత్మహత్య వార్తలు చూసినప్పుడల్లా నా ఆలోచనలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయండీ.. అందరం మామూలుగా చూస్తున్న సీరియస్ సమస్య ఇది..

    ReplyDelete
  13. ఆలోచింపచేసే టపా పరిమళం గారు, సంభందం ఉన్నవారైనా లేనివారైనా ఎవరిదైనా జీవితం విలువైనది దాన్ని కాపాడటానికి మనవంతు భాధ్యత మనం నిర్వర్తించాలి. ఖచ్చితంగా ఆత్మహత్యకు కావలసింది ధైర్యం అనేమాట అపోహ, కొత్తపాళిగారు చెప్పినట్లు ఇది డిప్రెషన్ కు పరాకాష్ట అంతే, ఆ వ్యక్తులను ముందుగా గమనిస్తే తప్పక నివారించవచ్చు.

    ReplyDelete