
ఉప్మా నేను మొదట చేసిన వంట ! ఉప్మా అంటే పైన ఫోటోలో చూసి అదే అనుకోకండి . అలా కనిపించనివాటిని కూడా ఉప్మా అనే అంటారు .కాకపొతే కొన్ని ఉప్మాలు అప్పుడప్పుడూ ఉప్పుమాలుగానూ , ఫెప్మాలుగానూ , అక్కడక్కడా గోళాకృతులుగానూ రూపాంతరం చెందుతూ ఉంటాయి . అటువంటి అద్భుతమైన ఉప్మా రుచి చూసేభాగ్యం అందరికీ కలగదు . కానీ మానాన్నగారికి ఆ అదృష్టం కలిగింది .అదీ నావల్ల !
నాన్నగారి ఉద్యోగరీత్యా తెనాలిలో ఉండేవాళ్ళం .ఊళ్ళో ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఐతే నాన్నగారికి సెలవులేక ,నాకేమో స్కూలు , అన్నయ్యకు కాలేజి పోతాయని అమ్మే ఎక్కువగా వెళ్ళేది .చిన్నప్పట్నించీ అమ్మ ఊరెళితే నాన్నగారో , అన్నయ్యో వంట చేయడం నేను భోంచేయడం జరుగుతూ ఉండేది .ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది కానీ నేను తిన్న కంచం కూడా నాన్నగారే తీసేస్తుంటే నేను శుభ్రంగా చేతులు కడిగేసుకొని వచ్చేసేదాన్ని .అన్నట్టు అన్నయ్య చండాలంగా చేసేవాడుకానీ మా నాన్నగారు మాత్రం వంట చాలాబాగా చేస్తారండోయ్ !
నేనప్పుడు తొమ్మిదోతరగతి చదువుతున్నా ...అమ్మ , అన్నయ్య ఊరేళ్ళారు. సాయంత్రం నేను స్కూల్ నుంచివచ్చేశాక నాకెందుకో రోజూ నాన్నగారు కష్టపడివండితే నేను తింటున్నాను ఈరోజు డ్యూటీ నుంచి వచ్చేసరికి నేనే వంటచేసి ఆశ్చర్యంలో ముంచేద్దాం అని డిసైడ్ ఐపోయా .ఆరోజు శనివారం కాబట్టి అన్నం తినరు . టిఫెన్ చేయాలి ...ఏం చేయాలి ? ఎలా చేయాలి ?
అర్జంటుగా పక్కింటి అత్తయ్యగారింటికి పరిగెత్తా ..ఆవిడ లేరు కాని వాళ్ల అమ్మాయి ఉంది . సత్యవతక్కా అర్జంటుగా ఐపోయే టిఫిన్ చెప్పవా ...అని అడిగి కావలసిన పదార్ధాల లిస్టు , చేసే విధానం రాసుకొని ఇంటికివచ్చి మొదలుపెట్టా ...
ఉల్లిపాయలు సాంబార్ లోకి కోసే సైజులో , టమోటాని రెండు ముక్కలు ( టమోటా వేస్తె ఉప్మాకి ఎక్స్ ట్రా టేస్ట్ వస్తుందని చెప్పింది కానీ పచ్చిమిర్చి వెయ్యాలని చెప్పనేలేదు ) గా కోసి రెడీ చేసుకున్నా ! పోపు దినుసులు అంది కదాని పోపులపెట్టి తీస్తే దాంట్లో చాలారకాలు కనిపించాయి బాండీలో నూనె వేసి పెట్టెలోని సామగ్రి అంతా చేతికి వచ్చినంత వేసి ఆపై ఉల్లిపాయలూ ....వగైరా వేసిరెండు గ్లాసుల నీళ్లు పోసి ( మూడుగ్లాసులు పోయాలని అక్కకి కూడా తెలీదట తర్వాత తెలిసింది )మర్చిపోకుండా ఉప్పువేసి ఇక రవ్వకోసం వెతకటం మొదలుపెట్టా ...అది దొరికేసరికి నీళ్లు మరిగి గ్లాసుడైనట్టున్నాయి . రవ్వ మొత్తం కుమ్మరించి తిప్పుదామంటే అక్కడేం తిప్పేచాన్స్ లేదు . ఇక మూతపెట్టేసి నాన్నగారికోసం ఎదురుచూట్టం మొదలు పెట్టా !
రాగానే తొందరగా స్నానం చేసేయండి నాన్నగారూ !నేను మీకోసం ఉప్మా చేశానని చెప్పగానే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ! నువ్వు స్టవ్ ఎందుకు ముట్టుకున్నావ్ రా ...ఉల్లిపాయలుకూడా కోసావా ..ఏమన్నా అయితేనో అని మెత్తగా చివాట్లు పెడుతూనే స్నానం ముగించి వచ్చి ప్లేట్లో పెట్టుకుందామని చూస్తె బాండీ లోంచి అట్లూస ఊడిరానని మొండికేస్తే దాన్ని బలవంతంగా పెకలించి ఉప్మాని పెట్టుకొని దానిలో గుండ్రం గా ఉండలుగా ఉన్న వాటిని చేత్తోచిదుపుతుంటే రవ్వ జలజలా రాలుతున్నా కలిపేసుకొని బుజ్జిగాడూ ..చాలా బావుందిరా ..అమ్మకూడా ఇలా ఎప్పుడూ చేయలేదు అంటూ దాంట్లోనే మజ్జిగ కలిపేసుకొని తినేసి నాకు అన్నం వండుతుంటే అర్ధం కాలేదు . నేనూ అదేతిందామని ఎక్కువే చేశానుకదా అని నోట్లో పెట్టుకోగానే ఏడుపొచ్చేసింది . అంత కష్టపడినా అమ్మ చేసినట్టు రాలేదు ఏం బాలేదు అంటే ...లేదురా చాలా బావుంది అమ్మెప్పుడూ టమోటాలే వెయ్యలేదు . అంటూ నాకు అన్నం తినిపించారు . అంతే కాదు తర్వాతకూడా చాన్నాళ్ళు మా బుజ్జమ్మ ఉప్మా చేసింది అంటూ అందరికీ చెప్పేవారు .అమ్మొచ్చాక కూడా అంతే బుజ్జమ్మ ఉప్మా బ్రహ్మాండంగా చేసిందని చెప్పారు .ఇప్పుడు తలుచుకుంటే కళ్లు చెమరుస్తాయి .
ఎంత చండాలంగా చేసినా నా మొదటి ప్రయత్నం అవటం వల్లనో ఏంటో ..ఉప్మా నా ఫేవరేట్ టిఫిన్ . ఇప్పుడు అలాచేయను లెండి . మా శ్రీవారు ఉప్మా ఇష్టమేంటో ..తప్పకపోతే తింటాం కానీ అని వెక్కిరిస్తూనే ...నాకోసం నేర్చుకొని నాకంటే ఎక్సలెంట్ గా చేస్తారిప్పుడు .
** ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచా ...నాకు ఉప్మా చేయడం ఎలాగో చెప్పిన సత్యవతి అక్క
అప్పటికి తను ఒక్కసారికూడా చేయలేదట !ఆ సంగతి తర్వాత వాళ్ళమ్మ గారు చెప్తే తెలిసింది :) :)