Sunday, February 21, 2010

మా తెలుగుతల్లికి మల్లెపూదండ ........


ప్రతి మనిషి పసిబిడ్డగా ఉన్నప్పుడు మొదటిగురువు తల్లే అవుతుంది . తల్లి ఒడిలో నేర్చుకొన్న భాష మాతృభాష !ఇది సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండానే అలవడుతుంది . మనభాషకంటే పరాయిభాషల పట్ల మోజుతో మాతృభాషను విస్మరించడం మాతృ ద్రోహంతో సమానం . "దేశ భాషలందు తెలుగు లెస్స "అన్న వారెవరు అని అడిగితే ఈరోజు ఎంతమంది పిల్లలు సమాధానం చెప్పగలుగుతున్నారు ?శ్రీకృష్ణదేవరాయలు అంతటివారే తన ఆముక్తమాల్యద ప్రబంధంలో మన తెలుగును గురించి ఇంత గొప్పగా చెప్పారు అని ఎంతమంది తల్లితండ్రులు మన భాష గొప్పతనం గురించి పిల్లలకు వివరిస్తున్నారు ?తన మాతృభాష తెలుగు కాని రాజు తెలుగుభాషలోని మాధుర్యాన్ని గుర్తించి కీర్తించడం మన తెలుగువారికెంతో గర్వకారణం .మహాకవి శ్రీనాధుడు ఇలా అన్నారట ! ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కరూపు ...కన్నతల్లి మాతృభాష ఒక్కరూపు అని .పరాయిభాషలను తక్కువచేయటం నా ఉద్దేశ్యం కాదు..అవి నేర్చుకోవడం తప్పని అనను .అవసరార్ధం కావచ్చు ఆసక్తితో కావచ్చు ఎన్ని భాషలు నేర్చినా ...మాతృభాష పట్ల చులకన కలగకుండా ఆసక్తిని పెంపొందించే ప్రయత్నం చేయటం ప్రతి తల్లి తండ్రి బాధ్యత ! వారితర్వాత ఉపాధ్యాయుల బాధ్యత !ఎన్ని భాషలు నేర్చినా మన మనోభావాలు వ్యక్తీకరించడానికి మాతృభాషను మించిన సాధనం ఉండదనుకుంటాను .
*ఈరోజు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం ఎడిషన్ లో అమ్మభాషకు జేజే !అంటూ కనిపించుటలేదు పేరు:తెలుగు అనిరాస్తే బాధ ,భయం కలిగాయి ....మాతృభాషను మన పిల్లలు మర్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరిదీ కాబట్టి మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్ని టపా ! ఏవైనా తప్పులు దొర్లితే మన్నించగలరు . మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు !

9 comments:

  1. naa blog ki vekshakulu takkuvaina karanangaa..naa bhaavaaloo ikkade panchukonistunnanduku kruthagjnathalato...raki
    తేనె వంటిదీ మన తెలుగు కదా
    ’మరి చే’దెలా అయ్యింది మాతృభాష-మన మాతృభాష
    అమ్మ అంటెనే హాయికదా
    ’మమ్మీ’ అనుమాటలో ప్రేతమనీ తోచదా
    కన్నతల్లి కన్నమిన్న ఇంకేది లోకాన
    సొంతఊరు అవ్వనుడుగు సాటిలేనివెపుడైనా
    1. క్షరము కానిదే అక్షరము కదా
    కొఱవడుతున్నాయెలా క్ష ఱ లు
    సమసిపోనిదే వర్ణం కదా
    లుప్తమెలా అయ్యాయి ఌ ౡ లు
    ఇంద్ర ధనుసు కున్నవి ఏడే వర్ణాలు
    తెలుగు భాష వర్ణాలు యాభయ్యారు
    2. ఋణములు,ౠకలు నిత్యాగత్యమే కదా
    మాయమెలా అయ్యాయి ఋ,ౠలు
    మనఃపూర్వకంగా తెనుఁగు అనాలన్నా
    అవసరమవుతాయికదా అరసున్నా విసర్గలు
    భిన్నమైన యాసలే తెలుగు గర్వకారణం
    ముత్యాల దస్తూరే తెలుగులిపికి ఆభరణం
    3. అచ్చరువొందే అచ్చరాలే
    అచ్చతెనుఁగుకే మెచ్చుతునకలు
    దేశ భాషల్లో తెలుగు లెస్సగా
    రాయల పలుకులే జిలుగు కణికలు
    నిలపాలి మనమెప్పుడు తెలుగు ఆత్మగౌరవము
    గుర్తెరిగీ మసలాలి తెలుగు భాష గొప్పదనం
    తూర్పులోని ఇటలిభాషగ కీర్తించెను ప్రపంచం

    ReplyDelete
  2. మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  3. ఓ సారిటు చూడగలరు.
    http://kasstuuritilakam.blogspot.com/2010/02/blog-post_21.html

    ReplyDelete
  4. velugu unnanta kaalam,
    telugu untundi. no fear please..!
    parimala nenarulu..

    ReplyDelete
  5. విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
    * కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
    పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
    పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
    ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
    ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
    తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
    మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
    అంతరించిపోతున్నఅమ్మభాష
    దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

    ReplyDelete
  6. మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. @ రాఖీ సర్ ! ఎంతమాట ! మీవంటి ప్రజ్ఞావంతులు నా బ్లాగ్ లో కామెంట్ రాయడమే గొప్పవిషయం అటువంటిది మీ భావాలు తెలియ చేయడం నా బ్లాగ్ కి ధన్యత చేకూరినట్టే ....ధన్యవాదాలు .

    @ శివగారు ధన్యవాదాలండీ ...

    @ నరసింహగారు చూశానండీ ..మంచి పద్యాలు మననం చేసుకొనే అవకాశం కలిగింది .ధన్యవాదాలు .

    @ మోహన్ గారు , మన తెలుగు బ్లాగులను చూస్తుంటే నమ్మకం కలుగుతోందండి ధన్యవాదాలు .

    @ రెహంతుల్లా గారు , మీ భాషాభిమానానికి జోహార్లండి . ఇంత చక్కటి వివరణ ఇచ్చారు ..చాలావిషయాలు తెలుసుకొనే అవకాశం కలిగింది ధన్యవాదాలు .

    ReplyDelete
  8. @ మాలాగారు ధన్యవాదాలండీ :)

    ReplyDelete
  9. కొంచెం లేట్ గా మీ కు కూడా మాతృ భాషా దినోత్సవ శుభా కాంక్షలు. చాలా బాగా వ్యక్త పరచేరు మాతృ భాష మీది మమకారాన్ని.

    ReplyDelete