
* ఇది నాలుగురోజుల క్రితం అనుకుంటాను ఈనాడులో వచ్చింది ఆనందంగా జీవించడం కోసం మనచేతుల్లో ఉండే మనం చేయగలిగిన కొన్ని చిట్కాలు రాశారు అన్నీ మనకు తెలిసినవే ఐనా ప్రయోగాత్మకంగా ఎంతవరకు అమలు పరుస్తున్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉందనిపించింది చదవని వారికోసం వాటిలో కొన్ని........
ఆఫీస్ లో యాజమాన్యం మెప్పుకోసం ,తోటి ఉద్యోగుల మధ్య గౌరవం కోసం , మీకెరీర్ లో ముందుకు దూసుకెళ్ళటం కోసం అహర్నిశం తాపత్రయపడుతూ శ్రమించే మీరు మీ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారా ? మీ జీవిత భాగస్వామికి ఆ అనుభూతినిస్తున్నారా ?(కనీసం అందించాలని తపిస్తున్నారా ?)ఆస్వాదనా ,అనుభూతీ అంటే కేవలం
శారీరికపరమైన దగ్గరతనం మాత్రమే అనుకోవద్దు.నీకు నేను , నాకు నువ్వు అని భాగస్వామి భావించేలా ప్రేమపూరిత వాతావరణాన్ని కలిగించడం !మీకేరీర్ లో మీరెంతో ముందుండవచ్చు మరి మీ జీవిత భాగస్వామి హృదయానికెంత దగ్గర్లో ఉన్నారు ? మీ ప్రేమ వాడిపోకుండా నిత్యనూతనంగా వికసించాలంటే ఏం చేయాలో చూడండి.
* ఎల్లవేళలా మీ మాటలు చేతలతో భాగస్వామిపట్ల మీకుగల ప్రేమాభిమానాలు వెల్లడిచేయండి
* మూసపద్ధతిలో కాక మీ వారాంతపు సెలవుల్ని కొత్తగా తీర్చిదిద్దుకోండి
* పుట్టినరోజు ,పెళ్లిరోజు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ హఠాత్తుగా మీ జీవిత భాగస్వామిని అనూహ్య బహుమతులతో ఉక్కిరిబిక్కిరి చేయండి ( బహుమతులంటే
డైమండ్ నేక్లేసో , బంగారపు గాజులో అవసరం లేదు నచ్చిన పుస్తకమో , పాటల సీడీయో తన అభిరుచికనుగుణంగా ఉండాలి )
* తను నిద్రలేచేసరికి శుభోదయం చెపుతూ మంచికాఫీ అందించండి (ఇది రోజూ కాఫీ ఎవరుచేస్తుంటే రెండోవారు చేయాలి
* సాయం చేస్తానంటూ వంటింట్లోదూరి కూరలు తరగటం ఇంకా వీలయితే వంటంతా మీరే చేసేయండి ( ఇదికూడా రోజూ వంట చేసేవారికి రెండోవారు చేసిపెట్టాల్సింది :) )
* పక్కనే పార్కుంటే చెట్టాపట్టాలేసుకొని వాకింగ్ చేయండి లేదా బాల్కనీలో కూర్చుని కబుర్లాడుకోండి .( మీ గత జీవితంలోని మధుర ఘట్టాలను ఇద్దరూ కలిసి గుర్తు చేసుకోండి మీమధ్య గాలికూడా చొరబడదు నాదీ హామీ )
* ఖాళీ దొరికినప్పుడల్లా ఓ రొమాంటిక్ ఎస్సెమ్మెస్ లేదా ఏదైనా జోక్ పంపి గిలిగింతలు పెట్టండి .ఏదో పనిలో ఉన్నప్పుడు చటుక్కున చెక్కిలిమీద ఓ ముద్దిచ్చి చూడండి
*కలిసి కబుర్లాడుతూ టీవీ చూడండి కలిసే భోంచేయండి ఇంట్లో ఉన్నంతసేపూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఒకరికొకరుగా మెలగండి
*అష్టా చెమ్మా కావచ్చు ,అంత్యాక్షరి కావచ్చు ముద్దు ముద్దు పందాలతోఖాళీ సమయాన్ని ఆనందించండి
* ప్రేమను గొప్పగా వ్యక్తం చేయడానికి స్పర్శ ఎంతో దోహదం చేస్తుంది ఆత్మీయతతో కూడిన చిన్న స్పర్శ , అభినందనతో కూడిన చిన్న మెచ్చుకోలు మీ భాగస్వామిని మీకెంత దగ్గర చేస్తాయో ప్రయత్నించి చూడండి
* ఇద్దరూ కలిసి గడిపే సమయం ఎంత అని కాక ఎంత ఆనందంగా గడిపామన్నది
ముఖ్యం ఆ ఆనందాన్ని సాధించేలా మీరిద్దరే కృషి చేయాలి. ఇప్పటికే మీరిలాగే ఉన్నామని అంటే మీకు
అభినందనలు.