Wednesday, September 9, 2009

స్వయంకృతాపరాధం !


నా పెళ్లి ఫిక్స్ అయి రెండో రోజే నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది . ఐతే ఈ విషయాలేవీ స్కూల్ లో చెప్పటానికి చాలా బిడియంగా అనిపించి ...నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా ఏమీ చెప్పకుండా మామూలుగా స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉన్నాను రెండు నెలల్లో ముహూర్తం ఉంది . పెళ్లి అయ్యేటప్పటికి ఒక నెలా , నెలన్నర రోజుల్లో ఫైనల్ పరీక్షలుంటాయి .సిక్ లీవ్ పెట్టేసి సరాసరి ఎగ్జాం సెంటర్కి వెళ్లి పరీక్షలు రాసేద్దాం ...ఆ తర్వాత ఇంటర్ అంటే పెద్దైపోయినట్టేగా ....పెళ్లైనట్టు తెలిసినా ఫర్వాలేదు అనుకున్నా !అన్నీ మనమనుకున్నట్టు జరిగితే ఇక విధాతకు ఆయన రాసిన రాతకు అర్ధమేముందీ ?

అలా ఒక వారం బాగానే గడిచిపోయింది . ఆరోజు శుక్రవారం ! చివరి పిరీడ్ గేమ్స్ ...మాస్కూల్ లో పెద్ద గ్రౌండ్ ఉండేది. అబ్బాయిలంతా ఒకపక్క ...అమ్మాయిలంతా ఒకపక్క వాలీబాల్ ఆడుతున్నాం ! ఒక్కరే కోచ్ అటు బాయ్స్ కి మాకూ మధ్య తిరుగుతూ ....ఆడిస్తున్నారు . మా గ్రౌండ్ ని ఆనుకొని లెక్చరెర్స్ కోలనీ ఉండేది అదీ మా గ్రౌండ్ ని ఆనుకొని బాబూరావుగారని మాకు తెలిసిన వారుండేవారు . మేమంతా ఆడుతూ ఉండగా డాబాపైనుండి చూసిన ఆంటీ గబగబా దిగి మా గ్రౌండ్ లోకి వచ్చేసి ....ఏంటి బుజ్జమ్మా...నీకు పెళ్లి కుదిరిందంటగా ..మమ్మల్ని పిలవకుండానే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావా ?మాకు తెలీదనుకున్నావా ?అబ్బాయిది ఫలానా ఊరట కదా ...భోజనాల్లో నిన్నుచూసి చేసుకుంటున్నారట కదా ...అసలు నా సమాధానం కోసం చూడకుండా మాట్లాడేస్తూనే ఉందావిడ ! ఒక్కసారిగా రక్తమంతా ముఖంలోకి తన్నుకొచ్చిన భావన ! ఆ ఫీల్ చెప్పలేను .

సడన్ గా గ్రౌండ్ అంతా నిశ్శబ్దం ఆవరించుకుంది ...అప్పటివరకు అరుపులతో ....మాటలతో హోరెత్తిన గ్రౌండ్ ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది ...బాయ్స్ అంతా ఆడటం మానేసి ఆవిడమాటలు ఆసక్తిగా వినసాగారు . మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా నోరెల్లబెట్టుకుని నన్నూ ,ఆవిడనీ మార్చి మార్చి చూస్తుండిపోయారు .మా కోచ్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్లిపోయారు .నేను మాత్రం ఎర్రబడిన మొహంతో అలా చలనంలేని బొమ్మలా షాక్ లో ఉండగానే బెల్ మోగడం ..నేను తేరుకొని పరుగెత్తుకుంటూ బాగ్ తీసుకుని ఇంటికి పారిపోవడం జరిగిపోయింది .

ఆ మర్నాడు ఎలా వెళ్ళను అనుకొంటూనే స్కూల్ కి వెళ్లాను. నేను అడుగు పెట్టగానే క్లాసంతా మళ్ళీ నిశ్శబ్దం ! అబ్బాయిలంతా ముసిముసిగా నవ్వులు ...వాళ్ళల్లో వాళ్లు గుసగుసలు ! ఇక అమ్మాయిలు నేనెప్పుడు దొరుకుతానా అన్నట్టు ప్రశ్నల వర్షం కురిపించారు . స్కూల్ అంతా పాకిపోయినట్టుంది ..మా తెలుగు మేడం కూడా క్లాస్ అవ్వగానే పిలిచి అడిగారు . బహుశా ఆ స్కూల్ మొత్తం మీద ఇలా జరిగింది నాకే అనుకుంటా !

అంతే ఇంటికి వెళ్ళగానే చెప్పేశా !ఇక స్కూల్ కి వెళ్లనని ! అమ్మ ,పిన్ని వాళ్లు మిసెస్ బాబూరావ్ ని కాస్సేపు తిట్టి నన్ను ఒప్పించాలని చూశారు కానీ నేను మొండికేసే సరికి నాన్నగారేమీ మాట్లాడలేదు . ఆ తర్వాత ఎలాగూ తెలిసింది కదాని పెళ్ళికి ముందు శుభలేఖలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మా హెడ్ మాస్టరు చాలా బాధపడి పెళ్ళి ఐతేనేం .....చదువుకోవడానికేం...తప్పకుండా రామ్మా అని చెప్పారు కానీ ..అప్పుడా మాటల విలువ తెలీలేదు .అలా నాచదువుకి నేనే పుల్ స్టాప్ పెట్టుకున్నా ! నేను వెళ్తానంటే ఎవ్వరూ వద్దని అనేవారు కాదు ...మా అత్తవారింట్లో కూడా ! కానీ ...ప్చ్ ...మా వారు మాత్రం పెళ్లి తర్వాతే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.

తర్వాత పెళ్ళికి వచ్చిన నా ఫ్రెండ్స్ , మా క్లాస్ అబ్బాయిలు నన్ను స్కూల్ కి రమ్మని , పరీక్షలు రాయమని చెప్పారు కానీ మంగళ సూత్రాలు , మెట్టెలు వేసుకొని స్కూల్ కి వెళ్ళటం సిగ్గుగా అనిపించి ఎవరిమాటా వినలేదు.అయినా అంతా నా స్వయంకృతాపరాధం మాత్రమె కాదండోయ్ ....కొంత దైవం కూడా అనుకూలించలేదు ....అప్పటినుండి నాకు ఒక సెంటిమెంటు కూడా ఏర్పడింది ...అదేంటో మరో టపాలో ....అంతవరకూ సెలవా మరి !

15 comments:

 1. మా స్కూల్లో ఏడో తరగతి నుంచే అమ్మాయిలకి పెళ్లిళ్ళవ్వడం మొదలయ్యేవి.. వాళ్ళు మేష్టార్లని శుభలేఖలతోనూ, అమ్మాయిల్లో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ని నోటి పిలుపులు పిల్చేవాళ్ళు. అబ్బాయిలని పిలిచేవాళ్ళు కాదు. అమ్మాయిలు పెన్ను, ఇంకు బాటిలు లాంటి ప్రెజెంట్లు ఇచ్చేవాళ్ళు పెళ్లి కూతుళ్ళకి.. మీరు మానేయకుండా ఉండాల్సింది.. అయినా ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందండి.. "ఏ వేదంబు పఠించే లూత.." అన్నట్టు అవలీలగా, అందంగా టపాలు రాసేస్తున్నారు కదా... కథ అయిపోయిందనుకుంటే చివర్లో ట్విస్ట్ ఇచ్చారు.. మళ్ళీ ఎదురు చూపులు మాకు....

  ReplyDelete
 2. హూం బుజ్జమ్మా ఎంతపని అయిపోయింది ..మరేం పర్లేదులే మీరు చదివేసి జాబ్ గట్రా చేసుకుని బిజీగా ఉంటే ఇంత తియ్యని కబుర్లు ఎవరు చెప్తారు ..:)

  ReplyDelete
 3. మా స్కూల్ లో కూడా 10 వ తరగతికే ఇద్దరు అమ్మాయిలకి ఇలా పెళ్ళి కుదిరింది. మీ టపా చదువుతుంటే నాకు నా స్కూలు రోజులు గుర్తు వచ్చాయి.

  మళ్ళీ ఇంకొక టపా అని మెలిక పెట్టారూ? --)

  ReplyDelete
 4. భలే రాసారు కళ్ళకి కట్టినట్టు .....ఆ అవమానం ఏంటో నాకు బాగా తెలుసు ...డీగ్రీ కి వచ్చకా జరిగిన అదేదో అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని .క్లాసు రూం లో వెళ్తుంటే మెడలోని మంగళసూత్రాలు చప్పుడవుతుంటే అందరు చూసే చూపు ....అమ్మో అప్పట్లో సిగ్గు ...ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది....బాగున్నాయండి మీ ముచ్చట్లు .

  ReplyDelete
 5. కథనం బాగుంది. చాలా మంది అమ్మాయిలకు చదువును దూరం చేసేది ఇలానే కదా? వారి అభివృద్ధికి ఫుల్ స్టాప్ పడేది అప్పట్లో పెళ్ళితోనే కదా? బాధాకరమే ననిపించింది.

  ReplyDelete
 6. ఇ౦తా జరిగి౦దా!హథవిధి...
  పాప౦ అనిపిస్తు౦ది,మీరు స్కూల్ తో చదువు ఆపినా మీకు భాష మీద ఉన్న పట్టుచుస్తు౦టే నాకు అన్పిస్తు౦ది ,చదువుకి ప్రతిభకి స౦భ౦ధ౦ లేదని.

  ReplyDelete
 7. మా అమ్మాయి క్లాస్ మేట్ కు కూడా ఇలానే టెన్త్ క్లాస్ లోనే పెళ్ళి చేసేశారు.ఇంత చిన్న వయసులోనే చేస్తున్నారే అనిపించింది.ఆ సమయంలో అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా బాగా రాశారు

  ReplyDelete
 8. అయ్యో ఎంత పని జరిగిపోయిందండి కనీసం మీ వారో ఇంకా ఎవరైనా ఆపేసి వుంటే వాళ్ళ మీద కాసేపు కారాలు మిరియాలు నూరేసి "చీ పాడు లోకం" అనెయ్యొచ్చు, ఇక్కడ ఆ చాన్స్ లేదు. ఐనా మన బడి చదువు కు సంస్కారానికి, బడి చదువు కు జ్ఞానానికి సంబంధం ఏమి వుంది అండి.. కాని ఆ వయసులో తెలియదు కదా అంత వితరణ, వూహించుకుంటె ఎంత బాధ అనిపించిందో అప్పటి మీ మనో భావాలను.

  ReplyDelete
 9. మా అక్కయ్య పెళ్లి కూడా పదవ క్లాసు లోనే అయింది.
  ఇప్పుడు హ్యాపీ గానే వున్నా అప్పుడప్పుడు ఇంకా చదువుకుంటే బాగుండు అని బాధపడుతుంది.
  అవన్నీ గుర్తు చేసారు.

  ReplyDelete
 10. ముందుగా పెళ్ళైపోయి క్రొత్త పెళ్ళికూతురిగా వచ్చిన మా విశ్వశాంతి గుర్తుకి వచ్చింది. అలాగే మా అబ్బాయికి నాలుగేళ్ళ వయసులో తారసపడ్డ సుబ్బలక్ష్మి పిల్లల్ని చూస్తే నవ్వు వచ్చింది, తనను మించి ఎదిగివున్నారు... ;)

  ReplyDelete
 11. ఓహో...మీ చదువు ఆగిపోడానికి మీరే కారణం అన్నమాట. అయినా మన చదువులు మనకి పెద్దగా జీవిత పాఠాలు లాంటివి ఏమీ నేర్పవు కాబట్టి మీరు ప్రత్యేకంగా కోల్పోయింది, మిగిలిన వారు సంపాదించేసింది ఏమీలేదు. మొదట్లో మీ పొఫైల్ Description చూసి అర్దమయ్యేది కాదు..ఈవిడేంటి తెలుగు భాషని ఇంత బాగా వాడుతూ కవితలు రాస్తూ పెద్దగా చదుకోలేదంటారు అని.... కొన్నాళ్ళ వరకు నమ్మకం కుదిరేది కాదండి.
  నిజంగా మీరు అభినందనీయులు.

  ReplyDelete
 12. @ ప్చ్ ...ఇప్పుడనిపిస్తుందండీ మురళి గారు ! ఒక్క రెండునెలలు ఓపిక పడితే ...కనీసం చెప్పుకోవడానికి టెన్త్ సర్టిఫికేట్ అయినా ఉండేదని !

  @ నేస్తంగారూ ! పెద్దగా బాధపడే సందర్భం ఎపుడూ రాలేదు కానీ లోటుగానే అనిపిస్తుంది . మన బ్లాగరులు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ కూడా చక్కటి బ్లాగులు రాస్తూ ...ఇంకా తెలియనివారి సందేహాలు తీరుస్తూ ఎంతో కృషి చేస్తున్నారు వారందరినీ చూస్తుంటే ఆశ్చర్యంగానూ...ఆనందంగానూ ఉంటుంది నాకు !

  @ శ్రీ గారు :) ఈసారి చిన్న టపాయే లెండి :)

  @ చిన్నిగారు , అప్పట్లో ఏంటో బిడియం ! ఇప్పుడు ఎత్తి పరిస్థితులెదురైనా కెరీర్ ని వదులుకోకూడదని నేనే అందరికీ చెప్తాను .ఎందుకంటే మునిగిన వాడికేగా లోటు తెలిసేది !

  @ వర్మగారు ,ధన్యవాదాలండీ ....

  ReplyDelete
 13. @ సుభద్ర గారు , నాకంత భాషాపరిజ్ఞానం ఏమీ లేదండీ ...మన వాడుక భాషలోనే ఇలా రాసేస్తూ ఉంటాను .మీవంటివారి ప్రోత్సాహంతో ....

  @ విజయమోహన్ గారు , అమ్మాయిపై ఎంత ప్రేమానురాగాలున్నా ...అతిగారాబం పిల్లల భవిష్యత్తుకి అడ్డం కాకూడదు కదండీ ...ధన్యవాదాలు .

  @ భావన గారూ !నిజమేనండీ ...ఎప్పుడైనా మావార్ని దెప్పుదామన్నా దొరకరు సుమండీ ...ఐనా మనమేం తక్కువ తిన్నామా ఏంటీ ...చెవులు మెలేసి పరీక్షలు రాయించక్కర్లేదూ ....అంటూ మిరియాలూ అవీ నూరుతూనే ఉంటాననుకోండి :) :)

  @ మా ఊరు గారు , నిజమేనండీ ...జీవితంలో ఏ లోటూ లేకపోయినా ...ఇది పూడ్చలేని లోటుగానే అనిపిస్తుంది .

  @ ఉషాగారు !విశ్వశాంతి ....సుబ్బలక్ష్మి ...నేనూ ..ప్చ్ ..... :(

  @ శేఖర్ గారు , మీ సపోర్ట్ కి చాలా చాలా థాంక్సండీ .....ఇక నాకు తెలిసిన ఏకైక భాష తెలుగు ....అది తప్పుల్లేకుండా(కొంతవరకు ) రాయగలుగుతున్నానంటే దానిక్కారణం నా చిన్ననాటి ప్రేవేట్ టీచర్ ! (http://anu-parimalam.blogspot.com/2009/05/blog-post_13) ఆవిడకు మరోసారి నానమస్సులు .

  ReplyDelete
 14. పరిమళం గారూ మీ అనుకొకుండా! పొస్ట్ ల విశేషాలు బావున్నాయి..బాగా రాసారు ..మీ పొస్ట్స్ కంటే వ్యాఖ్యలు ఇంకా స్పీడ్ గా వున్నాయి ..నెక్ష్ట్ పార్ట్ లొ ఎం రాస్తున్నారో కామెంట్ ల ద్వారా తెలిసిపొయింది..

  ఇప్పుడు తెలియడం లేదు ఏం రాయబొతున్నారో..:)

  ReplyDelete
 15. @ హరే కృష్ణ గారూ ఐతే అన్నిటపాలూ ఒకేసారి చదివారన్న మాట :) ఇప్పుడు రాయబోఎది చిన్న విషయమేలెండి :)

  ReplyDelete