Thursday, September 3, 2009

తెర వెనుక !


అలా నా పెళ్లి కుదిరిపోయింది కదా ! అసలు నా వెనుక ఏం జరిగిందో చెప్తాను . నేను భోజనాల కార్యక్రమం లో నా గురించి ఆరా తీసిన తాతగారు మా శ్రీవారి తాతగారన్న మాట ! అప్పటికి కొద్దిరోజుల ముందు ఆయనకు అనారోగ్యం చేసిందట! నన్ను చూడగానే వాళ్ల మనవడికి చేసుకుంటే బావుండుననిపించిందట ! కనీసం ఒక మనవడి పెళ్లినైనా చూసుకోవాలని ( రెండో ఆయన పెళ్లి చూపులకొచ్చిన ఇంకో అబ్బాయి ఇప్పుడు మా మరిది ) మా బాబాయి గారిచేత నాన్నగార్ని అడిగించారట ! ( ఆ తర్వాత కూడా ఆయన చాలా ఏళ్ళు క్షేమంగానే ఉన్నార్లెండి :) )

తాతగారికి వాళ్ల వదిన గారంటే చాలా గౌరవం ! అమ్మమ్మగారికంటే ముందు ఆవిడ సలహానే తీసుకొనేవారు . భోజనం చేసి సరాసరి వాళ్ల వదినగారి ఇంటికి వెళ్లి తన మనసులోని మాటను చెప్పగానే ఆవిడ అవును ఆ అమ్మాయి చాలా బావుంది తప్పకుండా చేసుకుందాం అన్నారట ! ఇంతకూ బస్ లో నన్ను ప్రశ్నలమీద ప్రశ్నలతో విసిగించిన ఆవిడే ఈవిడ !తర్వాత అమ్మమ్మగారికీ , మా అత్తగారికీ కూడా నేను నచ్చడం వాళ్ళూ ఓకే చెప్పటం జరిగింది .

సరే !వాళ్లకు నేను నచ్చేసి ప్రపోజ్ చేశారు కానీ మానాన్నగారికేమయింది ?
మా బాబాయి వాళ్ల ఫేమిలీ గురించి అబ్బాయి మంచితనం గురించి నాన్నగారికి చెప్పి ఇంక రెండేళ్ళ తర్వాతైనా బుజ్జి పెళ్లి చేయాలికదా అప్పుడు ఇంతమంచి కుర్రాడు దొరకొద్దా ? అబ్బాయి సిటీలో చదువుతున్నాడు వాళ్ల పెద్దమ్మగారి అమ్మాయి నిశ్చితార్దానికి వచ్చి ఇక్కడే ఉన్నాడు ఒకసారి నువ్వు చూడన్నయ్యా ...నచ్చకపోతే మానేద్దాం అని చెప్పారట . సరే చూద్దామని నాన్నగారు వాళ్ళింటికి వెళ్లారట ! అయ్యో ముందు కబురంపలేదు అబ్బాయి చావిడిదగ్గర ఉన్నాడని వాళ్ల అమ్మమ్మగారు చెప్పగానే నాన్నగారూ ,బాబాయీ అక్కడే చూస్తామని వెళ్లారట ! వీళ్ళు వెళ్ళేసరికి ఈయన చావిట్లో పందిళ్ళు వేయిస్తున్నారట ! అంతే నాన్నగారు ఫ్లాట్ !చదువుకొనే కుర్రాడు వ్యవసాయం పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నాడని , ఆ తర్వాత తన మాట తీరు నచ్చేసి వెంటనే మా అమ్మాయిని చూడటానికి రండని చెప్పారట !

ఆతర్వాత జరిగింది మీకు తెలిసిందే !తన చదువూ పూర్తి కాలేదు ( మా పెళ్ళయిన తర్వాతే డిగ్రీ పూర్తి చేశారు ), నువ్వుకూడా మనింటి దగ్గరే చదువుకోవచ్చు 10 పూర్తయ్యాక కావాలంటే ప్రేవేట్ గా చదువుకోవచ్చు .అని నాకు చెప్పారు .నన్ను చూసుకున్న తర్వాత రెండు రోజులకే నిశ్చితార్ధం ....ఆతర్వాత రెండు నెలలలోపే పెళ్లి జరిగిపోవడం జరిగింది .ఐతే నా చదువు మాత్రం ఆగిపోయింది .అదీ నా స్వయంకృతాపరాధం అదెలాగో తర్వాతి టపాలో ..........

** నా పెళ్ళయిన ఆరునెలల తర్వాత మా పెద్ద తమ్ముడడిగాడు నన్ను! అక్కా బావ సిగరెట్ కాలుస్తాడా అని ! అదేంట్రా నేనడిగితే నువ్వేకదా కాల్చడని చెప్పావ్ అన్నా ! అదికాదక్కా నాకు తెలీదు కానీ ఈబావని చేసుకుంటే నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావని అలా చెప్పా !అన్నాడు :)
అక్కడ ఉన్నన్నాళ్ళూ తమ్ముళ్ళిద్దరూ నన్ను తోబుట్టువులాగే చూశారు ఇప్పటికీ మేం సిటీకి వచ్చేసినా మా పొలాలు శిస్తులు అన్నిట్లోనూ చాలా సహాయంగా ఉంటారు .

17 comments:

 1. అలా బుజ్జమ్మ పెళ్ళి కూతురాయనె మా బుజ్జయ్య తోటి పెళ్ళి ఆయనే పీపిపి ...పీపి.... పీపి ... పీపిపి... మరి మాకు భోజనాలెప్పుడూ...

  ReplyDelete
 2. బుజ్జెమ్మా! చాలా నచ్చెశవ్ సుమా!
  చదువుదేముంది చెప్పు. లసలక్షణమయిన సంసారం దొరకడం ముఖ్యం కాని. ఇప్పూడు మాత్రమేం? ఎన్ని కబుర్లు చెప్పడంలేదు.
  నా చిన్నప్పుడు, ప్రయాగ రామక్రిష్ణగారు ఆటోగ్రాఫ్ ఇచ్చారు " చదువు నేర్చుకుంటే వస్తుంది. సంస్కారం పుట్టుకతో వస్తుంది" అని. మీకెప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు.
  ఏమంటారూ......

  ReplyDelete
 3. @ భావన గారూ !మీరెప్పుడంటే అప్పుడే ...నేనసలే వడ్డించడంలో ఎక్స్పర్ట్ ని కదా !( భోజనమే సుమా :) )

  @ శృతి గారు , ఇంకేమంటాను ? చాలా చాలా థాంక్స్ అని తప్ప !

  ReplyDelete
 4. మీ పెళ్ళి ఏ సంవత్సరంలో జరిగింది , పరిమళం గారూ !
  చా.............................. లా ... బాగున్నాయి , మీ "పెళ్ళి నాటి ప్రమాణాలు " అండ్ అన్ని ముచ్చట్లూ .
  చదువు ఆగి పోయిందని బెంబేలు ఎందుకు ? ఇంత బ్లాగును ,సరదాగా ఇంచక్కా మెయింటైను చేసేస్తూనారు కదా !
  ఒక వేళ నిజ్ఝంగా , చదూకుని ఉండుంటే , ఏ సన్న కారు ఉద్యోగినిగానో మనుగడ కొనసాగేది కాబోలును.
  ఇంత " మాతృ భాషా సేవ "ను కళాత్మకంగా చేయ గలిగి ఉండే వారేనా ?
  ఏమంటారు ?

  ReplyDelete
 5. బాగుందండీ.

  తాత గారినీ,బస్సులో ప్రశ్నలడిగిన ఆంటీ ఇలా మీ పెళ్ళికి కారకులయ్యారనమాట. చదువు ఎలాగ ఆగిపోయిందో చెప్పటానికి మళ్ళీ ఇంకొక టపా అన్నారు,ఎదో ఒకటి చేసి కాలు మెలేస్తున్నారు.

  ReplyDelete
 6. మీ పెళ్ళి వెనుక కథ చాలానే ఉందన్నమాట!
  నా చదువు మాత్రం ఆగిపోయింది .అదీ నా స్వయంకృతాపరాధం ...అపరాథం అని ఎందుకనుకుంటారు, చదువుకున్న వాళ్లు అంతా ఏదో ఊడపొడిచేస్తారు అనుకుంటున్నారా? అదేం లేదు. మీరు పెద్ద పెద్ద చదువులు చదివుంటే ఇంత కమ్మటి బ్లాగుని మాకందించగలిగేవాళ్లు కాదేమో!!

  ReplyDelete
 7. హమ్మయ్యా, అన్ని టపాలు చదివి మీ పెళ్ళి వార్తతో చల్లబడ్డాను. ఇక ఆ చదువు సంగతీ చెప్పేస్తే ఆ కొంచం అనుమానమూ తీరిపోతుంది. అయినా ఇంత చక్కని శైలి, శిల్పంతో వ్రాస్తున్నారు. ఇలా ఇలా ఎదిగి రచయిత్రిగా పేరుప్రఖ్యాతులు తెచ్చేసుకోండి. నిజంగా అదే నా మనసులోని కోరిక.

  ReplyDelete
 8. సస్పెన్స్ చాలా బాగా మైంటైన్ చేస్తున్నారండి..సీరియల్ చదువుతున్నట్టుంది.

  ReplyDelete
 9. ముచ్చటగా ఉండండి మీ పెళ్ళి కధ!

  ReplyDelete
 10. అబ్బా..చాలా కథే ఉందండీ.. ఎంత బాగా చెప్పారో తెలుసా.. చివర్లో మళ్ళీ మెలిక పెట్టడం చూస్తుంటే త్వరలో మీరు సీరియల్స్ రాసేస్తారనిపిస్తోంది.. పత్రికలకో, టీవీకో..

  ReplyDelete
 11. మొత్తానికి మాకు 'శశిరేఖా{బుజ్జమ్మ} పరిణయం' చూపించారుకదా!!
  కానీ మీరు దీన్ని భాగాలుగా విభజించి మాకు పంచినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నానండోయ్! మీ చదువు గురించి టపా మాత్రం మొత్తం ఒకేదానిలో రాయండి ప్లీజ్.

  ReplyDelete
 12. అయ్యబాబోయ్ బాబోయ్ ఎలా మిస్ అయిపోయాను..నాలుగు రోజులు బిజిగా ఉండి సరిగా బ్లాగ్స్ చూడలేదు..పోనీలేండి నేను సస్పెన్స్ భరించకుండా అన్నీ చదివేసానోచ్
  super super మీ పెళ్ళి కధ

  ReplyDelete
 13. chala bagha raseru me pellinati muchatlu.chalamandiki ila functions,pellilonu fix authaee leda abbayi ishtapadathamo jaruguthundi.
  mothaniki chaild marriage chesukunnaru...

  ReplyDelete
 14. అనుకోకుండా ఒక రోజు అంటే ఏదో థ్రిల్లర్ అనుకోని చదవడం మొదలెట్టా.గుక్కతిప్పుకోకుండా చదివేలా రాసారు .అంతా చదివుతుంటే మీరేదో తెలుగు సాహిత్యం లో మాస్టర్స్ చేసి వుంటారనుకున్నాను .అంతా చదివాక మీరు మీ చదువు గురించి చెప్పిన నిజం నమ్మలేకపోయాను.
  చాలా బాగా రాసారు

  ReplyDelete
 15. very nice.
  మీ తమ్ముడి ఫీలింగ్ మాత్రం చో చ్వీట్. వెయ్యబద్ధాలాడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్న సూత్రాన్ని చిన్నప్పుడే వంటపట్టించుకున్నాడన్న మాట! ఇంతకీ అతను చెప్పింది అబద్ధమా?

  ReplyDelete
 16. @ కాదంబరి శ్రీ గారు ," మాతృ భాషా సేవ "లాంటి పెద్ద పెద్ద మాటలు తెలియవండి ..తోచినదేదో రాయటం తప్ప మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు .

  @ శ్రీ గారూ :) :)

  @ సిరిసిరి మువ్వగారూ ! చాలా థాంక్స్ ! మీ అందరి అభిమానమే కదా నా బ్లాగ్ కు నిజమైన పరిమళం !

  @ ఉషా గారు , అమ్మో ...హనుమంతుడి ముందు .....అంత లేదండీ :)

  @ ప్రణీత గారు థాంక్స్ !

  @ తృష్ణ గారు మీక్కూడా ....

  ReplyDelete
 17. @ మురళి గారూ ! ఉష గారికి చెప్పిన సమాధానమే మీకూనూ ...నేను రాయగలనో లేదో ...మీ ప్రశంసే చాలండీ ధన్యవాదాలు.

  @ శేఖర్ గారూ ! అది చిన్న టపానే లెండి :)

  @ నేస్తం గారూ ! మీ ఇన్స్పిరేషన్ తోనే నేనూ రాశా ...మీకు ప్రత్యేక కృతఙ్ఞతలు .

  @ అనఘ గారూ ! నేనూ మా నాన్నగార్ని అప్పుడప్పుడూ ఇలాగే బెదిరిస్తా ! చైల్డ్ మారేజ్ చేసేశారు అని :)

  @ మావూరు గారు , నేను టైటిల్ పెట్టినప్పుడు ఆలోచించలేదండీ ...లేదంటే బ్రాకెట్లో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కానేకాదు అని పెట్టేదాన్ని :) ఇంత సరళమైన పదాలతో రాసినా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .

  @ కొత్తపాళీ గారు , మీ స్పందనకు ధన్యవాదాలు . మాతమ్ముడు తెలియక చెప్పినా అది నిజమైంది నా అదృష్టావశాత్తూ ...

  ReplyDelete