Friday, August 14, 2009

కృష్ణ ప్రేమ


ప్రభూ !
నీ రూపాన్నినింపుకున్న నానయనాలే
నీకు నెమలిఫించాలు ...
నీ నామాన్ని జపించు నా అధరాలే
నీకు హరి చందనాలు ....
నీ సేవకై మోడ్చిన నా కరములే
నీకు పూలహారాలు ...
సదా నిన్నే ధ్యానించు నా హృదయమే
నీకు పిల్లనగ్రోవిగా ....
నేను చేయు అర్చనాదులు
స్వీకరించడానికి ...
నేవేసిన బుల్లి అడుగులపై అడుగేస్తూ
నువ్వొస్తావని ఎదురుచూస్తున్న వేళ
నేను యశోదమ్మను !
అమ్మతనంలోని కమ్మదనాన్ని
రంగరించి వెన్నముద్దలు నీకు
తినిపించాలని ఆత్రుత పడితే
ఆకలిగొన్నవారికి అన్నం పెడితే చాలు
పదునాల్గు భువనాల్నీ దాచుకున్న
నీ బొజ్జ నిండి పోతుందన్నావ్ !

నా కళ్ళ వాకిళ్ళ నుండి నా హృదయ
బృందావనిలో అడుగిడతావని
కలలు కంటున్న వేళ ....
నేను రాధమ్మను !
మోహనాకారుడవైన నీకు
ముగ్ధ మనోహరపరిమళభరిత
అధర సుధను నీకర్పించాలని
నిన్నాహ్వానిస్తే ..
హృదయ నైర్మల్యమే నీకు
నివేదన అన్నావ్ !

రత్నమణి మాణిక్యాలకు తూగనివాడవు
తులసీ దళానికే తూగావని
తెలుసుకున్న వేళ ....
నేను మీరానై ..
మురళీ లోలుడవైన నిన్ను
మధుర గాన లహరిలో
ఓలలాడిద్దామని సంకల్పిస్తే
కన్నయ్యా అన్న పిలుపే చాలు
కళ్ళముందు సాక్షాత్కరిస్తానన్నావ్ !

భగవంతునిగా కొలుస్తానంటే
నేస్తానివై నా చెంతే నిలుస్తానన్నావ్
నాకు తోడూనీడవయ్యావ్
ధన్యురాలిని కృష్ణయ్యా !

23 comments:

 1. అద్భుతం.
  గోకులాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 2. భగవ౦తునిగా కోలుస్తాన౦టే నేస్తానివై నిలుస్తానన్నావు....
  చాలా చాలా బాగు౦ది.మాటల గారడి తో కిట్టయ్యని కట్టెశారు.

  ReplyDelete
 3. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండీ..

  ReplyDelete
 4. చాలా బాగుంది. మా తరుపున మీ కన్నయ్యకు పారిజాత సుమమాల .

  ReplyDelete
 5. చాలా బాగా రాసారు. మీ మనసునే ఆ గోపాలునికి నివేదించినంత గొప్పగా వుంది.

  ReplyDelete
 6. చాలా బాగా రాసారు.. కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 7. కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

  ReplyDelete
 8. కృష్ణాష్టమి శుభాకాంక్షలు....

  ReplyDelete
 9. అదన్నమాట.... మీ రచనల వెనక ఉన్న చీక్రెట్...
  ఆ కన్నయ్య తోడుగా ఉన్నాడు గనకే మీ బ్లాగు ఓ బృందావనమైంది.
  మాకు మధురోహల పరిమళాలను పంచుతోంది. :)

  ReplyDelete
 10. woww..only one word.. excellent piece of writing :)

  ReplyDelete
 11. chala bagundandi mi kavitavam.
  krishanastmi subhakankshalu

  ReplyDelete
 12. క్రిష్ణయ్య ను తోడు నీడ చేసుకున్న పరిమళం వెదజల్లే సుగంధాలు నచ్చని వారెవ్వరు చెప్పండి... క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 13. copying my own comment from elsewhere, none other suits...
  కన్నయ్యా, వనమాలీ, నీ మువ్వల రవళి, మోహన మురళీ, జగతికి కావా జోలాలి. నీకు వెన్నల కట్నం ఇస్తాను, వెన్నెల ముద్దులు ముడుపిస్తాను ఆ వన్నెల వలపులు నాకే ఇవ్వవూ - నీ రాధమ్మ

  ReplyDelete
 14. మా అమ్మగారు, పేలాలు చేసి, అవి పిండిగా విసిరి, అందులో బెల్లం కలిపి ఆ నైవెద్యం పెట్టేవారు. నాకు college first వచ్చినపుడు కృష్ణ భక్తురాలైన మా మేడంగార్ని అనుకోకుండా కృష్ణాష్టమి రోజున కలవటానికి వెళ్ళాను. ఆవిడకి నేను మరీ ఇష్టం. ఆ చిన్ని పాదాల మీద నా అడుగులు వేయించారు, ఎందుకో తెలియని ఆ ఆప్యాయత... చిరు జ్ఞాపకపు తాకిడి..

  ReplyDelete
 15. మురళీ లోలా మువ్వగోపాల
  నువ్వు చిందేయగా చిలిపి కృష్ణా
  కనువిందాయెరా బాలకృష్ణా
  1. కాళింది మడుగులో-కాళీయుని పడగలపై
  నర్తనమాడిన తాండవ కృష్ణా
  దర్పము నణచిన వంశీ కృష్ణా
  2. చిటికెన గోటిపైన గోవర్ధన గిరిని నిల్పి
  లోకుల గాచిన గోపీకృష్ణా
  ఘనత వహించిన గిరిధర కృష్ణా
  3. పొన్నచెట్టుపైన నిలిచి-కన్నెల కోకలు దాచి
  కన్నుల పొరమాన్పిన –గీతా కృష్ణా
  కన్నెల ఎదదోచిన-మోహన కృష్ణా
  4. యమునా నది తరంగాల-భక్తాంతరంగాల
  రాసలీలలాడిన రాధా కృష్ణా
  రాగడోల లూగిన మీరా కృష్ణా
  entagaa kolichinaa takkuvE swaami ninu

  mee kavitaa vatavRuksahmu mundu ee ardha vatapatrashaayi(ram kishan loni krishnudu)
  soham/daasoham/sadaa soham /dasadaasohaM

  ReplyDelete
 16. భగవంతునిగా కొలుస్తానంటే
  నేస్తానివై నా చెంతే నిలుస్తానన్నావ్...
  చాలా బాగారాసారండి!

  ReplyDelete
 17. entandi................chinchesaaru........baaga vachhindi.............

  ReplyDelete
 18. పొన్నచెట్టు నీడలో కూర్చొని లోకాలని కాస్తున్న మా కన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియ చేసిన , మరియు వారి అనుభవాలను ఇక్కడ పంచుకున్న మిత్రులకూ ...అలాగే నా కన్నయ్యకు కానుకగా అద్భుతమైన పాటనిచ్చిన రాఖీ గారికీ నా హృదయపూర్వక ధన్యవాదములు .

  ReplyDelete
 19. చాలా బాగా రాసారు.నేను ఊళ్ళో లేక ఆ రొజు నా కృష్ణ ప్రేమని పోస్ట్ లో రాయలేకపోయానండి...

  ReplyDelete
 20. కాస్తాలస్యమైనా మీకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  గీతాచార్య,

  ధీర సమీరే... యమునా తీరే!

  ReplyDelete
 21. వావ్ అద్భుతమైన కవిత్వం. అభినందనలు

  ReplyDelete
 22. మేము ఇంజనీరింగు చదివి ఏం లాభం. మీరు "నేను పై చదువులు చదవలేదు" అని చెబుతూనే ఇంత రచ్చగా(నాకు తెలుగు సరిగ్గా రాదు! క్షమించాలి) కవిత వ్రాసారు. నేను మొన్నీమధ్యనే ఒక కవిత వ్రాసాను. అది వ్రాసేలోపు నా తల ప్రాణం తోకకొచ్చింది. నెనర్లు.

  ReplyDelete