Friday, December 31, 2010

HAPPY NEW YEAR


కొత్త సంవత్సరం మొదలై నప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ...అవి మామూలుగానే సంవత్సరం తోపాటూ పాతబడి పోవడం నాకు మామూలే ...ఇంతకు ముందు చాలా సార్లు ఇలాగే అయ్యిందిలెండి ముఖ్యంగా డైటింగ్ చేద్దామని....ధ్యానం చేద్దామని...ఇలా మంచి మంచి పనులు చేయాలని ప్రతి సంవత్సరమూ అనుకుంటూనే ఉంటా ! ఫస్ట్ రోజు ఎందుకులే రెండోతారీకునుండీ అని !కానీ ఎప్పుడూ పూర్తిగా చేసినపాపాన పోలేదు ఎప్పుడూ ఆరంభశూరత్వమే :) :)ఐతే ఈసారి తీసుకున్న నిర్ణయంమాత్రం అలా కాకూడదని అనుకొంటున్నా అది ఏంటంటే బ్లాగ్ లో కనీసం నెలకో రెండు మూడు టపా లన్నా ఖచ్చితంగా రాయాలనే నిర్ణయం తీసుకుంటూ ఈ యేటికి వీడ్కోలు చెబుతూ ....కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నా!
బ్లాగ్ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ నూతన సంవత్సరం మీకందరికీ సకల శుభాలనీ కలగాచేయాలని కోరుకొంటూ .....HAPPY NEW YEAR

Tuesday, November 9, 2010

రెండో పుట్టినరోజు !!


శభాష్ పరిమళం ...ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!
ఇలా నా భుజం నేనే తట్టుకోవచ్చో లేదో కాని ఈ బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు అసలు అంతర్జాలమంటే తెలీని నేను ఎప్పుడూ కంప్యూటర్ తాకి చూడని నేను ఇలా ఇన్నిరోజులు బ్లాగ్ వనంలో పరిమళాన్నో...లేక పిచ్చిమొక్కనో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు అందుకే ఆ శభాష్ !!

ఇంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేక్రమంలో అప్పుడప్పుడూ బ్లాగుకు చాలారోజులు దూరమైనా, టపాలు తగ్గిపోయినా...నన్నాదరిస్తూ మేమున్నామంటూ నన్ను మరువక ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకూ.....నా టపాలనూ ఇష్టపడేవారున్నారన్న కాన్ఫిడెన్స్ ని నాలో పెంచుతున్న బ్లాగ్ ఫాలోవర్స్ కూ....ఇంకా నా టపాల్లో తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దే పెద్దలకు, సరదాగా ఆటపట్టించే పిన్నలకూ ...విమర్శకులకూ అందరికీ నా వినమ్రపూరిత ధన్యవాదాలు.
బ్లాగ్ క్రియేట్ చేసి నువ్వు రాయగాలవంటూ నాచేత కీబోర్డు పట్టించి అక్షరాలు అద్దించి ఇప్పటికీ నాకు సహకరిస్తున్న నా మిత్రుడికి కృతజ్ఞతలు తెలుపుకోకపోతే ఈటపా అసంపూర్ణం!కృతజ్ఞతలు మిత్రమా !


ఇల్లాలిగా, తల్లిగా , కూతురుగా ....ఇలా అన్నిబాధ్యతలూ ...బాదరబందీల నడుమ నేనంటూ ప్రత్యేకం...నాదంటూ ఓలోకం అనుకొనే విధంగా నాజీవితంలో ఈ బ్లాగ్ ఓఅందమైన అనుభూతిని అందించింది.కొత్తకొత్త స్నేహితులనూ ఇచ్చింది.అంతే కాదు నా బ్లాగుకు నేనే రాజు,రాణి ,మంత్రి , సేవకుడు ....అన్నీఅనుకుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో! తానొవ్వక ...అన్యుల మనముల్ నొప్పింపక ...ఈ బ్లాగ్ ఇలా ఇంకొన్నాళ్ళు సాగాలని ఆశపడుతున్నాను.

Tuesday, October 12, 2010

మరచితివా నను!!



మరచితివా ....ప్రియతమా !
మనం తలపుల తోటలో ఊగిన
వలపు ఊయలలు
వెన్నెల మడుగులో ఆడిన
తుంటరి జలకాలు
చలిరాతిరి వెలిగించుకున్న
కౌగిళ్ళ నెగళ్లు
మరచితివా ...ప్రియతమా !
కనురెప్పల ఊసులు
మరుమల్లెలపై బాసలు
ఇచ్చుకున్న మనసులు
మెచ్చుకున్న సొగసులు
నువ్వేసిన మూడుముడులు
ఆ తీపి గురుతులు ....
మరచితివా ...ప్రియతమా !
నేనలిగినవేళ నువ్వు నాన్నవై
నువ్వలసినవేళ నేను అమ్మనై
మనఒడే ఒండొరులకు తలగడై
ఆబంధమే మనఇద్దరి మనుగడై
సేదతీరిన మధుర క్షణాలను ....
మరచితివా ...ప్రియతమా ....
మరచితివా నను !!

Monday, September 27, 2010

పోస్ట్ చేయని ఉత్తరం ( గుర్తుకొస్తున్నాయి)


నాన్నగారూ
కుశలమే కదా ? ప్రతిరోజూ ఫోన్ చేసుకున్నా ఇలా ఎపుడైనా అడిగానా అని సందేహం!మీరు మాత్రం నా గొంతులోనిచిన్న
మార్పును కూడా పసిగట్టేసి ఏంట్రా అలా ఉన్నావేం ఒంట్లో బాగానే ఉందికదా...మీ గొంతులో ఎంత ఆత్రుత...మరింత ఆర్ద్రత!ఆ పక్కనే తనపని చేసుకుంటూనే ఓచెవి ఇటువేసి ఉంచిన అమ్మ ఖంగారూ ! ఎందుకు నాన్నగారు ఇంకా ఇంతప్రేమ! నాకు జరపాల్సిన విధులన్నీ శక్తికి మించి జరిపేసి...బాధ్యతలన్నీ తీరిపోయి, ఉద్యోగ విరమణలో హాయిగా కాలం గడపాల్సిన వయసులో ఇంకా మా బాధ్యతల్ని కూడా మోస్తూ మాకు స్పూర్తిగా నిలుస్తున్నారు.మేం మిమ్మల్నిచూసుకోవాల్సిన ఈ వయసులో కూడా నన్నొక గాజుబొమ్మలాఅతి జాగ్రత్తగా చూసుకుంటారు.


నాన్నగారూ! దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి పండుగా మీ సమక్షంలోనే....ఇప్పుడు మీ ఇద్దర్నీవదిలి.... పండుగలు చేసుకుంటున్నాం అంటే అక్కడ మీరిద్దరే ఉన్నారన్న గిల్టీ ఫీలింగ్ గుండె లోపలిపోరల్లోకి తోసేసి చిరునవ్వుల పూత వేసుకొని చేసుకోవాలి కాబట్టి అన్నట్టు చేసుకుంటున్నాం!

మీకు గుర్తుందా నాన్నగారు, ఏ పండుగ వచ్చినా షాపింగ్ కి మనిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం మీరు నాచేతిని బలమైన మీ గుప్పిట్లో గట్టిగా పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం! మీకు తెలుసా ఆ వెళ్ళేదారిలో మీ ఆఫీస్ వాళ్ళు కాని మీ ఫ్రెండ్స్ కాని తారసపడకూడదని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకునేదాన్ని! ఎందుకంటే ఎవరు కనపడినా ఓ అరగంట తక్కువకాకుండా మాట్లాడేసేవారు మీరు (ఇప్పటికీ అంతే మీరు) ...నాకు బోర్ ! అంతసేపు నాచేయిమాత్రం మీ గుప్పిట్లోనే ఉండేది.


వినాయక చవితి వస్తే బొమ్మ , గొడుగు నాకు నచ్చినవే కొనేవారు.దీపావళి వస్తే నా ఫ్రెండ్స్ అందరూ ఇద్దరు , ముగ్గురు పిల్లలకి వికొనే టపాసుల కంటే నా ఒక్కదానివే ఎక్కువ ఉండేవి.వారం రోజులు ముందే మీరు కొనిచ్చిన టపాసుల బుట్ట అమ్మకిచ్చి ప్రతి రోజు స్కూల్ కి వెళ్లేముందు ఎండలో పెట్టమని ఆర్డర్ వేసేసి...మళ్ళీ సాయంత్రం అన్నీ సరిచూసుకొనే దాన్ని! దీపావళి రోజు అందరికన్నా ముందే టపాకాయల శబ్దానికి భయపడతానని నాచేత మందులు కాల్పించేవారునాన్నా! ఇప్పటికీ మీ అల్లుడు,మనుమలూ కూడా అంతే.. ఏడుగంటలకల్లా టపాసులు కాల్చేసి తలుపులన్నీ మూసేస్తారు ఓ పక్క నన్ను వెక్కిరిస్తూనే !మతాబులు, కాకర పువ్వొత్తులు కూడా పొడవాటి చువ్వకి కట్టి స్టూల్ మీద నించోబెట్టి ఫెన్సింగ్ ఇవతలనుండి బైటకి కాల్పించేవారు నాన్నగారు , అప్పుడు మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తుంటే మీ చాదస్తానికి విసుగానిపించేది కాని ఇప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో !

నాన్నగారూ ! గుర్తుందా మీకు!బైటకి వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు గోల్డ్ స్పాట్ కొనిచ్చి మీరు షోడా తాగేవారు అదేంటి నాన్నా అని అడిగిన గుర్తులేదు తలుచుకొన్న కొద్దీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి సంతోషమో..దుఃఖమో తెలీదు గొంతుకడ్డం పడుతోంది.మీరు డ్యూటీ నుండి ఎంతాలస్యంగా వచ్చినా నాతో ముచ్చట్లు ఐతేకాని అమ్మ ఎంత ఉడికిపోయినాస్నానానికి వెళ్ళేవారుకాదు. మీ ఎడమ తొడపై నన్ను కూర్చోబెట్టుకొని ముందుగా నాకు గోరుముద్దలు
తినిపించకుండా మీరు తినేవారుకాదు.ఆ తర్వాత స్కూల్ లో జరిగిన విశేషాలు అడుగుతూ ...ప్రతిరోజూ ఓ కధ చెపుతూ చెప్పినవే ఐనా మీరు చెపుతుంటే వినాలనిపించేది నిద్రపుచ్చేవారు.గుర్తు చేసుకోవడం కాదు నాన్నా...మనసు బావిలో జ్ఞాపకాల ఊటలు ఇవి ఏనాటికీ ఇంకిపోయేవికాదు...ఇవన్నీ తలుచుకొంటుంటే మీరు చూపించిన శ్రద్ధలో ఎన్నోవంతు మా పిల్లలమీద చూపిస్తున్నామో ...ఎలా పెంచుతున్నామా అనిపిస్తుంది.

ఫోనులు వచ్చిన కొత్తల్లో ...ఎందుకు నాన్నగారు ఉత్తరాలు ? ఏముంటాయి ఫోన్ లో చెప్పినవే రాస్తారు...రాసినవే ఫోన్ లో చెపుతారు అనేదాన్ని! కాని నాన్నగారూ! అనీ ఫోన్లో మాట్లాడలేం ఫీలింగ్స్ తెలియచేయటానికి ఉత్తరానికి మించినది ఏముంటుంది ? అందుకే బాల్యంలోని నా అపురూప క్షణాల్ని పోస్ట్ చేయని ఈ ఉత్తరం ద్వారా మీతో పంచుకుంటున్నా...ఇక సెలవా మరి! ఆరోగ్యం,అమ్మ జాగ్రత్త !

Monday, September 20, 2010

నా ధ్యానం !!


కోపాన్ని ధ్యానంతో జయించేద్దాం..అని నిర్ణయించుకున్నా కదండీ ..ఇక ధ్యానం ఎలా చేయాలో నాకు తెలిసింది చెపుతా! పద్మాసనంలో కూర్చొని చూపుడు వేలు , బొటనవేలు కలిపి చిన్ముద్రలో ఉండి కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో అదేనండీ నుదుటి మధ్య ఉంచి ధ్యానం చేయటం...రెండు సుఖాసనంలో కూర్చుని రెండుచేతుల వేళ్ళూకలిపి ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళటం ! మొదటిది నావల్ల కాదు కాబట్టి రెండోదానికే డిసైడ్ అయ్యాను .

ఇక ఎప్పుడు ప్రారంభించాలి ?ధ్యానం అంటే ఉదయాన్నే సూర్యోదయ వేళలో చేస్తే మంచిది అంటారుకనుక ఆదివారం కుదరదు ఎందుకంటే హరిహర బ్రహ్మాదులు వరమిస్తానన్నా ఓ గంటాగికోరుకుంటా స్వామీ...అనేసి ముసుగు పెట్టేస్తా మరి !కాబట్టి ప్రతి ఆదివారం ధ్యానానికి సెలవు ఇచ్చేశా ! ఇక శనివారం..వద్దు మనకసలే ద్వితీయవిఘ్నం సెంటిమెంటు. మంగళవారం ఏపని మొదలు పెట్టినా సాగదని అంటుంది అమ్మ కనుక వద్దు!ఇన్ని ఆలోచించి ఓ శుభదినం డిసైడ్ చేసుకొని ముందురోజు రాత్రి ..తెల్లవారుఝామున ఆరు గంటలకే సెల్ లో అలారం పెట్టుకొని ....పొద్దున్నే కాఫీపట్టుకొచ్చేయకండి నేను ధ్యానం పూర్తయ్యేవరకూ తాగను...ఈలోపు షేవింగు గట్రా ...మీ పనులు పూర్తిచేసుకోండి అని శ్రీవారికి స్ట్రిక్ట్ గా ఇంచుమించు వార్నింగ్ లాంటిది ఇచ్చి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ...ఈనాడే ఎదురౌతుంటే ఇంకా తెలవారదేమి..ఈ చీకటి విడిపోదేమి అని పాడుకుంటూ నిద్రకుపక్రమించా!

ఆరుగంటలకు అలారం మోగినట్టుంది...అదేం రింగ్ టోనోనండీ అసలు మోగినట్టే తెలీలేదు.మా ఇంటాయనకి మెలకువ వచ్చేసిందట కాని నన్ను లేపే రిస్క్ చేయలేకపోయినట్టున్నారు పాపం! అది రెండోసారో మూడోసారో రిపీట్ అవుతుండగా మెలకువ వచ్చి చూస్తె ఆరున్నర ! ఛీ మొదటిరోజే లేటా అనుకొని ఐనాసరే ఈరోజే మొదలుపెట్టాలి అనిఘాట్టిగా అనుకొని
లేచి కూర్చున్నా! ఇంతకూ ధ్యానం బ్రష్ చేసుకొని చేయాలా ...లేకపోతె లేవగానే చెయ్యాలా ??? ప్చ్ ..ధ్యానం పవిత్రమైనకార్యం ...కాఫీతాగటంలాగా మొహం కడుక్కూకుండా చేయకూడదు.( ఇంతకూ కాఫీ క్షుద్రమైనదంటారా?) చకచకా మొహం కడిగేసి సుఖాసనంలో కూర్చున్నాక మరో సందేహం ....ధ్యానానికి ముందు ఓంకారం చేయాలా ..అప్పుడెప్పుడో నేను యోగా క్లాసులకు వెళ్ళే రోజుల్లో టీచర్ చెప్పినట్టు గుర్తు! సరే మూడుసార్లు ఓంకారం పూర్తిచేసి ...కళ్ళుమూసుకొని కూర్చున్నాక మళ్ళీ ఓ డౌటు ఒకవేళ పదినిముషాలకు ధ్యానంలోంచి బైటకు రాకపోతే ....పూర్తిగా ధ్యానంలో నిమగ్నమైపోతే ...ఈయన కదిలిస్తారన్న నమ్మకం లేదు కాబట్టి సెల్ తెచ్చుకొని పదినిముషాల తర్వాత మోగేలా అలారం సెట్ చేసుకొని మళ్ళీ కళ్ళుమూసుకున్నా!

ధ్యానం మొదలు పెట్టాక ఏమీ ఆలోచించకూడదు....అన్నట్టు నిన్న పేపర్అబ్బాయి మాకు వేయాల్సిన ఈనాడుకు బదులు ఎవరికో వేయాల్సిన ఆంధ్రజ్యోతి వేశాడు ఈరోజు కూడా అలాగే చేస్తాడేమో బహుశా కొత్త అబ్బాయేమో ఈయనకు చెప్పి ఉండాల్సింది...ఛీ ఇదేవిటీ ..ఏం ఆలోచించకూడదు ...నా దృష్టంతా రెండుకనుబోమ్మల మధ్య కాన్సంట్రేషన్ చెయ్యాలి...ఎండ వచ్చేటట్టుంది ఈరోజు వాషింగ్మిషన్ వెయ్యాలి ..ప్చ్ ...దృష్టి ...అదేంటి ఈయన్ని కాఫీ అప్పుడే వద్దన్నానుకదా ..మరి అదేంటి కాఫీ కప్పుతో ఆర్తి అగర్వాల్ వచ్చేస్తుంది !! ఓహో ..ఆ ముందురోజు ఏదో లోకల్ చానెల్లో అనుకుంటా పూర్తిగా చూస్తానని నా ఫ్రెండుతో పందెం వేసి మరీ చూసిన మెంటల్ కృష్ణ సినిమాలో సీనది. పందెం ఓడిపోయాను కాని ఈ సీను నన్ను వదలకుండా వెంటాడుతుందన్న మాట!పోసాని కృష్ణమురళి సినిమానా మజాకా !ఛీ ఛీ ఇలాంటివి మనసులోకి రానివ్వకూడదు ...మరింత ఘాట్టిగా కళ్ళుమూసుకున్నా....

చాకలి ఇస్త్రీ బట్టలు తేలేదు లోపలిబీరువాలోది ఒక జత తీసిపెట్టి కూర్చోవాల్సింది నేను ప్చ్...ఏం వేసుకుంటున్నారో ..అసలే లేటుగా మొదలుపెట్టాను...టిఫిన్ చేయటానికి టైం సరిపోదేమో ..హమ్మయ్య ఫ్రిజ్ లోబ్రెడ్ఉంది బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే సరి!ఆఅయ్...దృష్టి తప్పుతోంది ...కాన్సంట్రేట్ బుజ్జీ ...కాన్సంట్రేట్ ...అవునూ చాలా సేపయింది కదా ఇంకా పదినిముషాలు కాలేదా ...లేక నాకు వినపడలేదా ...అనుమానం కాసేపటికి పెనుభూతమైంది...ఐనా మొదటి రోజు కదా కొద్దిసేపు చేసినా చాలు అనుకొంటూ కళ్ళుతెరిచి టైం చూసి షాకయ్యా...అప్పటికింకా నాలుగునిముషాల ఇరవై సెకన్లుమాత్రమే అయ్యింది.


ఐనా పర్లేదు మొదటిరోజు కదండీ...అన్నప్రాశన రోజే ఆవకాయ తినగలమా...ఈరోజుకిది చాలు.రేపు పొద్దున్నే లేచి పర్ఫెక్ట్ గా చేద్దాం. అ రోజంతా బాగా ఆలోచించా వేరే ఆలోచనలు మనసులోకి రాకుండా ఏం చెయ్యాలా అని! ఐడియా....నాది వోడా ఫోనేనండి ఐనా ఈ ఐడియా నా ధ్యానాన్ని మార్చేస్తుంది చూడండి. పడుకొనేముందు సెల్ లో అలారం రింగ్ టోన్ మార్చిసౌండ్ లౌడ్ లో పెట్టుకొని తలదగ్గరే ఉంచుకున్నాను.


అలారం మోగగానే లేచి బ్రష్ చేసేసుకొని ధ్యానానికి సిద్ధమైపోయా...డివిడిలో ఓం చాంటింగ్ పెట్టుకొని( నిన్న నాకొచ్చిన గుడ్ ఐడియా ఇదే) సోఫాలో చేరాను. నిటారుగా కూర్చోవడం కష్టంగా ఉండి కాన్సంట్రేషన్ దెబ్బతుంటుంది అదే రిలాక్స్డ్ గా ఉంటే ఆ ప్రోబ్లం ఉండదు కాబట్టి సోఫాలో శవాసనంలో ధ్యానం చేయటం ద్వారా అందరికీ ఓ కొత్త కోణం చూపిద్దాం..అనుకుంటూశవాసనంలో కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో కేంద్రీకరించి...ధ్యానం ప్రారంభించా...ఆహా ..ఎంత ప్రశాంతంగా ఉంది...ఇహపరమైన ఆలోచనలు ఏమీ రావట్లేదు ....అనుకొంటూ ధ్యానంలో నిమగ్నమైపోయా!........















బుజ్జీ....బుజ్జీ ....ఎక్కడో లోయలోనుండి వినపడుతోంది ఎవరిదా గొంతు.....ఎవరో గట్టిగా భుజాలు పట్టి కుదుపుతున్నారు..ఎవరు ? ఎవరు నా ధ్యానాన్ని భగ్నం చేసింది...కళ్ళుతెరిచి చూసేసరికి ...ఎదురుగా ఈయన ! బుజ్జీ టైం ఎనిమిదైంది...ఇక్కడ పడుకున్నావేం?నాకు టైం అయిపొయింది టిఫిన్ బైట చేస్తాలే తలుపేసుకో....అంటూ ....అలా నాధ్యానం ద్వితీయ విఘ్నం కాకుండా పూర్తయింది.
మీరూ ట్రై చెయ్యండి చాలా ప్రశాంతంగా ఉంటుంది...నేను చెప్పిన పొజిషన్ లో నేను చేసినట్టు చేస్తే ఎన్ని గంటలైనా ధ్యానం కాన్సంట్రేషన్ తో చెయ్యొచ్చు.....కనుక మిత్రులారా ధ్యానం చేయండి కోపాన్ని జయించండి.

Wednesday, September 15, 2010

అసలామె కన్నతల్లేనా ...


అమ్మ....ఈ పేరు తలచుకోగానే ఒళ్ళు పులకరిస్తుంది. తానెంత కష్టపడినా తెలియనీయక బిడ్డను మాత్రం ఒడిలో చేర్చుకొని జీవితాంతం సేదతీరుస్తుంది.పారాడే వయసునుండి కంటికి రెప్పలా కాపాడుతుంది.బడిలో మాస్టారు కొట్టినా ...ఆటల్లో తోటిపిల్లలు కొట్టినా తానేల్లి కొట్లాడుతుంది. తెలీక ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బ వేసి ...తిరిగి తానే తనవి పాపిష్టి చేతులని తిట్టుకొంటూ అక్కున చేర్చుకొంటుంది.అమ్మగురించి ఎపుడో విన్నాను ...ఇంట్లో రెండు ముద్దల అన్నం మాత్రమే ఉంటే ...చెరొక ముద్దా తిందాం రారా అని తండ్రి అంటాడట ! అదే అమ్మైతే నాకు ఆకలిగా లేదు నాన్నా అంటూ ఆ రెండు ముద్దలూ గోరుముద్దలుగాచేసి బిడ్డకు తినిపిస్తుందట !అదీ అమ్మ మనసు !

ప్రపంచం లోని రిలేషన్స్ లో చెడ్డ తల్లి మాత్రం ఉండదని అంటారు.అందుకే మాతృదేవోభవ అంటూ తొలి గురువుగా అంత గొప్ప స్థానాన్ని అమ్మకిచ్చాం. అటువంటి అమ్మ స్థానంలో ఉండి కన్నా బిడ్డను దారుణంగా కొట్టి హింసించిన తల్లిని నిన్న న్యూస్ చానెల్ లో చూశాను.అసలు మానవ జాతిలో పుట్టిన ఎ మనిషీ చేయలేనంత హేయమైన పని చేసిన ఆమె పేరు నాగ చైతన్య అట ! పాప పేరు నర్తన !ఐదారేళ్ళు ఉంటాయేమో...బందీలుగా దొరికిన శత్రు సైనికుల్నిహింసిస్తారని విన్నాను కాని ఇంతకంటే దారుణంగా మాత్రం చెయ్యరు. బ్లేడుతో కోసి , చువ్వతో కాల్చి , కాలితో తన్ని ...గాయాలతో హాస్పటల్ లో పడి ఉన్న పాపను చూస్తె నాకు కన్నీళ్ళ పర్యంతమైంది .అసలామె పాపని కన్నతల్లేనా అన్న అనుమానం వస్తుంది .

మాతృత్వం ఒక వరం!అది పొందగలిగిన స్త్రీ జీవితం ధన్యంఅంటారు.కాని ఇటువంటి తల్లిని ఎవ్వరూ ఎక్కడా చూసి ఉండరు . శరీరంపై కనిపించే ఘోరమైన గాయాలే కాదు ...గుండెకు బలమైన దెబ్బ తగిలి , లివర్ కు గాయమై ఇంటర్నల్ బ్లీడింగ్ అయి పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది.కన్న బిడ్డను ఇంత క్రూరంగా హింసించిన తల్లికి ఏం శిక్ష వేస్తారో తెలీదు కాని నిజానికి న్యాయ స్థానం విధించే శిక్ష అది ఉరి ఐనా తక్కువే ...ఆమెను క్రూర మృగాలకు ఆహారంగా వేయాలి .
న్యూస్ చూసిన కొందరు పాపను ఆదుకుంటామని , మరికొందరు దత్తత తీసుకుంటామని వస్తున్నారట ! ఒకవేళ పాప శారీరకంగా కోలుకున్నా తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ..అది ముందు ముందు తన భవిష్యత్తుకి ఎటువంటి చేటు తెస్తుందో ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏది ఏమైనా నర్తన త్వరలో కోలుకోవాలని ...ఆమెకి మంచి మనుషుల నీడలో చక్కటి భవిష్యత్తు ఏర్పడాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.

Tuesday, September 7, 2010

నాకు కోపమా ....గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్....


బుజ్జీ నువ్వీమధ్య ప్రతిదానికీ చిరాకు పడిపోతున్నావురా ....చెప్పనా వద్దా అన్నట్టు లోగొంతుకతో శ్రీవారు! నేనేం చిరాకు పడుతున్నా...అసలు మ్మిమ్మల్నేమైనా అన్నానా ...అన్నా మొహం చిట్లిస్తూ ...
ఆతర్వాత రెండురోజులకి ఈమధ్య నీకు కోపం ఎక్కువైపోతుంది బుజ్జమ్మా....బెరుకు బెరుకుగా చూస్తూనే నాఫ్రెండ్ !ఏం అలా చూస్తున్నావ్...నేనేమైనా మింగేస్తానా ..ఒక్క అరుపు అరిచేసరికి తను మాయం !!

కొద్దిసేపయ్యాక నేనే ఆలోచించుకున్నా ఏంటీ...నిజంగానే నాకు కోపం ఎక్కువైందా...అందరిమీదా చిరాకు పడుతున్నానా? అనుకుంటూ అద్దం దగ్గరకెళ్ళి గతుక్కుమన్నా...అసలు అద్దంలో ఉన్నది నేనేనా ? కాల్గేట్ పేస్ట్ మోడల్ లాగా కళకళలాడుతూ ఉండే మొహం ....ఇలా నొసలు చిట్లించుకొని చిరాగ్గా తయారైందేవిటీ..ఐతే వాళ్ళు చెప్పేది నిజమేనన్న మాట అనుకొంటూ కారణాల కోసం వెదికితే ఒకటి బీపీ ఐనా వచ్చుండాలి (అప్పుడే వచ్చేస్తుందా ...ఏమో చెప్పలేం) లేదా ఈ మధ్య మా సునీత (పనిమనిషి) రాక ఆ పనులుకూడా చేసుకోవాల్సొచ్చి వీళ్ళమీద చిరాకు పడుతూఉండాలి అనుకొని స్థిమిత పడ్డాను.

ఊరెళ్ళిన పనిమనిషి వచ్చేసింది. ఆ తర్వాత కూడా అంతాఇంకా భయం భయంగా ....బెరుకుగా చూస్తున్నట్టే అనిపించింది. ఇలాక్కాదని ఒక శుభముహూర్తం చూసుకొని మా ఇంటికి దగ్గరలోని హాస్పటల్ కి వెళ్లి బీపీ చెక్ చేయించుకున్నా!ఏమీలేదని తేలింది. డాక్టర్ ఇంచుమించుగా మా ఫ్యామిలీ డాక్టర్ వంటి వారు....విశాలంగా నవ్వుతూ ఇప్పుడీ అనుమానం ఎందుకొచ్చింది నీకు అని అడిగింది.ఈమధ్య కాస్త కోపం ఎక్కువైనట్టు అనిపిస్తుంది డాక్టర్ p.m.s కూడా కాదు అన్నా! ఇంట్లో ఏమైనా సమస్యలా ...లేదు డాక్టర్ ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్లకి నేనే సమస్యవుతా ! ఏం కాదులే....రోజూ ఓ పదినిముషాలు ధ్యానం చేయి అన్నీ సర్దుకుంటాయి అన్నారావిడ నవ్వుతూనే ...

150/- ఫీజు తీసుకొని ఈవిడ చెప్పే సలహా ఇదా అని మనసులో విసుక్కుంటూ...పైకి మాత్రం ఓ వెర్రినవ్వు పడేసి ఇంటికోచ్చేశా. ఐతే ఆలోచిస్తే ఆవిడ చెప్పింది మంచిదేననిపించింది.ధ్యానం వల్ల కోపం , ఒత్తిడి , మానసిక ఆందోళన తగ్గుతాయని...ఇంకా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలున్నాయని పేపర్లో చదివినవీ ...టీవీలో చూసినవీ అన్నీ గుర్తుకొచ్చేశాయి. సరే! ఏ పుట్టలో ఏపాముందో...ఇంతమంది మేధావులు ఊరికే చెప్పారు కదా వింటే తప్పేంటి ...రోజూ పదినిముషాలేగా చేసేద్దాం....అని నిర్ణయించుకున్నా....

నా ధ్యానం విశేషాలు తర్వాతి టపాలో.....

Wednesday, September 1, 2010

నా నేస్తం పుట్టినరోజు !!

ఎవరా అనుకుంటున్నారా ...ఇంకెవరు ? మన కన్నయ్యే ...చిన్నప్పటినుండి అంటే సరిగా ఊహ తెలియనప్పుడు అమ్మమ్మ కొంగువెనక నుండి తను పూజచేయటం చూస్తున్నప్పట్నుంచీ కృష్ణయ్య నాకునేస్తం మరి !
కలువలవంటి కన్నులున్నవాడు
తలపై నెమలిఫించమున్నవాడు
వేణుగాన లోలుడు
రాధా మానసచోరుడు
చెలువల వలువలు దోచుకెళ్ళినవాడు
గీతార్ధసారం బోధించినవాడు
తల్లి, తండ్రి, పతియు, గతియు
గురువు, దైవమూ.. అన్నీ తానైన
నా కన్నయ్యకు .....
పుట్టినరోజు జేజేలు !!

మాయింట కృష్ణాష్టమి !


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు .....



బుజ్జిగా ఉన్నాయని సందేహం వద్దు బ్రహ్మ కడిగిన పాదాలివే ....



రాధకు నీవేర ప్రాణం ...రాధా హృదయం మాధవ నిలయం !



ననుపాలింపగ నడచి వచ్చితివా ....



కర్పూర హారతులియ్యరుగా .....



కొలువై ఉన్నాడే.... దేవదేవుడు !!


Thursday, August 19, 2010

జీవన సహచరుడు!


ఎగసిపడే కడలి తరంగాలు....
అవి కొన్ని సాగినా తీరం వైపు
తిరిగి తనలోనే దాచుకుంటుంది సాగరం!
ఆ అలల కలలు ఎంత ఉప్పొంగినా
అందుకోలేవు నింగినెన్నడూ
విడిపోలేవు సంద్రాన్నెప్పుడూ
మన అనుబంధమూ అంతే!
జీవితపు ప్రతి మలుపులోనూ ....
నా తోడువై ....నీడవై ......
చేయిపట్టి నడిపించావు
అడుగడుగునా నువ్వు చూపిన
ఓర్పు....నీ ఓదార్పు ...
నీ సహనం ...సహచర్యం ...
నన్ను నానుండి వేరుచేసేసి
నీలో కలిపేస్తున్నాయి...
ఎంతెలా అంటే ప్రియతమా!
మనవాళ్ళంతా పాలూ నీళ్ళలా
అనికాదు నువ్వు నేనులా ...
అనేంత !!

Monday, July 26, 2010

అలిగినవేళ .......


నగుమోము కనలేని నాజాలి తెలిసి
కనులు మూయకనే స్వప్నమరుదెంచె
స్వప్నమందు చెలియ తానేతెంచెగాని
కన్నుకలపదాయే....పలుకరించదాయె
రేయిపగలు వేచిచూసిన ఘడియలు ...
మూతిముడుపులతోనే గడిచిపోయె
చిలకమడుపు సేవకై నేనెదురుచూస్తుంటె
తానేమొ దయలేక అలక పానుపునెక్కె
మాయలెన్నిచేసినా మొలకనవ్వే కరువాయె
మెట్టె సవరించినా కనికరించని చెలి
అదేమి మహత్యమో మరి !!
సిరిమల్లె పూలకే కరిగి కరుణించె...
సుప్రభాతవేళ కనులు తెరచి చూడ ..
కలకాని నిజం నాకళ్ళెదురుగానె !!

Wednesday, June 16, 2010

బ్రాడ్ బాండ్ పేరుతో మోసం!


కొత్త ఇంటికి మారాం ....సర్దుకొని సెటిల్అవడానికి ఓ రెండు వారాలు ...ఆ తర్వాత ఒక వారం పెళ్ళిళ్ళు , ఊరు ప్రయాణం ...ఐనా ఇంకా మధ్యలో మూడువారాలు ఖాళీయే కదా ..నెట్ పెట్టించుకోవడానికి ఏమిటాలస్యం అనుకుంటున్నారా ..అక్కడికే వస్తున్నా ...పాత ఇంటిదగ్గర రిలయన్స్ బ్రాడ్ బాండ్ షిఫ్ట్ చేయమని అడిగితే మా కొత్తింటి ఏరియాకి లైన్ లేదన్నారని డిస్ కనెక్ట్ చేయించేశాం. అక్కడ ఏది వీలయితే అది పెట్టిన్చుకోవచ్చని. ఊరెళ్ళి రాగానే ముందు కేబుల్ , నెట్ పెట్టించుకుందామని ఆరా తీసి కేబుల్ కనెక్షన్ పెట్టించుకున్నాం.

ఇంతలో మా ఫ్లాట్ కి దగ్గరలో ఒక వీధిలో పై ఫోటో లోని పాంప్లెట్లు చాలా చోట్ల కనిపించాయి .అంతకు ముందు కూడా హాత్ వే , తర్వాత రిలయెన్స్ ఇలా చూసే పెట్టించుకున్నాం. ఇదేంటి ఈ ఏరియాకి లైన్ లేదన్నాడుకదా అని పాంప్లెట్ లోని నెంబర్ కి ఫోన్ చేశాం...శ్రీనివాస్ అనే అతను ( అదికూడా నకిలీ పేరై ఉంటుంది )మాట్లాడి ఉంది మేడం ! అడ్రస్ చెప్పండి అని అడ్రస్ తీసుకొని అలీ అనే అతన్ని పంపించాడు. నేనతన్ని మేం ముందు అడిగితే లేదన్నారు కదా అని అడిగితే ...పదిమంది వరకూ కస్టమర్లు ఉన్నారు మేడం అందుకే అంటూ కనెక్షన్ తీసుకున్నవారి చెక్కులు ( పాపం నాలాంటి బకరాలు ) చూపించాడు . ఐనా ఎందుకైనా మంచిదని కస్టమర్ కేర్ కి అతనుండగానే ఫోన్ చేసి అడిగితే పదినిముషాలలో డిటైల్స్ కనుక్కుని మీకు చేస్తానని చెప్పింది . సరేని అప్లికేషన్ ఫిలప్ చేసి 1000/- కాష్ ఇచ్చి ఐడి ప్రూఫ్ లు ఇచ్చి రసీదు తీసుకొని తిరిగి అతను వెళ్ళిపోయే టప్పటికి కూడా కస్టమర్ కేర్ నుండి ఫోన్ రాకపోతే ....మా కజిన్ మళ్ళీ ట్రై చేస్తే ఎవ్వరూ ఎత్తలేదు . సరే అతను వెళ్తూ ఎల్లుండి మీకు కనెక్షన్ ఇస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు .

ఎల్లుండి ...అవతలెల్లుండి కూడా అయ్యింది కనెక్షన్ మాత్రంరాలేదు.ఫోన్ చేశాం ఫోన్ ఎత్తలేదు సరే ఆదివారం సెలవు కాబట్టి ఎత్తలేదేమో అనుకున్నాం...ఆదివారం లేదు సోమవారం లేదు ...ఆతర్వాత ఫోన్ స్విచిడ్ ఆఫ్! కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే మళ్ళీ కనుక్కొని చెప్తాననే మాటే ! పట్టువదలని విక్రమార్కురాల్లా ఫోను మీద ఫోను చేసి విసిగిస్తే చివరికి మాకిచ్చిన రసీదులోని నెంబర్ తీసుకొని వెరిఫై చేసి అసలు మేముండే ఏరియాకి లైన్ లేదని ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ ఏజెంట్స్ లో ఎవ్వరిదీ కాదని తేల్చి చెప్పింది . ఆతర్వాత మెయిన్ బ్రాంచ్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి మీకు సంబంధం లేకుండా మీ అప్లికేషన్ ఫాం లూ, రసీదులూ ఎలావస్తాయి ? పైగా అతనిచ్చిన కస్టమర్ కేర్ నెంబర్ కూడా సరైనదే ...అని గట్టిగా అడిగితే మళ్ళీ అన్ని బ్రాంచిల్లో ఎంక్వైరీ చేస్తాం మేడం ఒకవేళ మాదగ్గర చేసి మానేసిన వాళ్లెవరైనా అలా చేస్తున్నారేమో అంటూ చల్లబరిచి ఫోన్ పెట్టేశాడు . అంతే ఆ తర్వాత ఓ పదిసార్లైనా చేసి ఉంటాను ....ప్రతిసారీ ఇదేమాట ! ఇంకా వేరే ఏరియా నుండి కూడా కంప్లైంట్ లు వచ్చాయి అంటాడు కాని ఏం యాక్షన్ తీసుకోలేదు.కనీసం మా ఏరియా లోకల్ చానెల్ లో ఐనా స్క్రోల్ వేయించమన్నాను . అసలు వాళ్ళకేమీ బాధ్యత లేనట్టే వదిలేశారు . వాడికి కస్టమర్ కేర్ లో వాళ్ళపట్ల ఎంత నమ్మకం లేకపోతె అంత ధైర్యంగా నెంబర్ ఇస్తాడు ? పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మావారేమో లైట్ తీసుకున్నారు , నాకేమో సరిగ్గా ఇంట్లో మా అత్తగారూ వాళ్ళున్నారు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళక్కర్లేదు వెళ్తానని అంటే చాలు హడలిపోతారు . వెయ్యి రూపాయలు పోయినందుకు బాధ లేదు మోసపోయినందుకు బాధగా ఉంది ...ఇంకా నాలాగ ఎంతమంది మోసపోయారో తలుచుకుంటే ఇంకా బాధగా ఉంది .

ఆ తర్వాత airtel బ్రాడ్ బాండ్ పెట్టించుకోవడం ..(వచ్చినతన్ని స్కానింగ్ చేసి మరీ :) ) జరిగిందనుకోండి . " Tolet" " broadband" ఇలాంటి పాంప్లెట్లు ద్వారాచాలా సులువుగా ప్రజలనుమోసం చేయగలుగుతున్నారు. కాబట్టి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త !

Friday, May 28, 2010

శ్రీవారి కల !!


కొత్తసున్నపు వాసన ..కాంతులు వెదజల్లే విద్యుద్దీపాలూ ...మావిడాకుతోరణాలు పచ్చగా ...పసుపు పూసిన గడపలు ...నట్టింట నడుస్తున్న ప్రత్యక్షలక్ష్మి ....అన్నీ కొత్తగా ...అంతా కొత్త కొత్తగా .....
కళ్ళుతెరిస్తే ....అన్నీ మాయం ! పక్షుల కిలకిలారావాలు ! తెల తెలవారుతున్న ఆనవాళ్ళు !ఇదీ శ్రీవారి కల !ఆతర్వాత కొన్ని వసంతాల అలుపెరుగని శ్రమ !చిందిన చెమట చుక్కలు !
తనదైన సొంతింట నడయాడే తన అర్ధాంగ లక్ష్మిని చూసుకొంటున్న అపురూప క్షణాన ....సాకారమైంది శ్రీవారి బంగారు కల !
తెల్లవారుజ్హాము కలలు నిజమౌతాయంటారు అవి ఊరికే ఏం నిజం కావు వాటిని నిజం చేసుకోవడానికి ఎంతో శ్రమించాలి అటువంటి నిరంతర శ్రమతో తన కలను నిజం చేసుకొని తన కలను నాకు కానుకగా ఇచ్చిన శ్రీవారికి ........థాంక్స్ చెప్పక్కర్లేదు కదూ ? ఎందుకంటే తన కలను నిజం చేసుకున్నారు అంతే :)

ఓ అపార్ట మెంట్ లో ఫ్లాట్ తీసుకొని ఉన్నంతలో మా అభిరుచులకనుగుణంగా తీర్చిదిద్దుకొని ఆ ఇంట్లోకి మారి సర్దుకొని అన్నీ కొత్తగా నెట్ కనెక్షన్ తో సహా పెట్టించుకొనేసరికి ఐన ఆలస్యం ఇది ! మిత్రులంతా నన్ను మర్చిపోలేదు కదా :) :)

Monday, March 15, 2010

వసంత గానం....


తొందరపడి ఓ కోయిల ముందేకూసింది
అన్నాడని అపుడెపుడో ఓ కవి .........
ఇప్పుడింకా గళం విప్పని కోయిలమ్మల అలక !
మీరలిగితే మేమేం తక్కువా అని
ఆకులు రాల్చేసిన చెట్లూ .....
ఏడాదికోసారి వచ్చే అతిథులకు
చేసే మర్యాదిదేనా అంటూ ...
లేలేతగా పుట్టుకొచ్చి ఆతిథ్యమిచ్చిన చివుర్లు!
రంగుల పండుగతో అరుదెంచిన
వసంతుడు నువ్వు వసంతగీతం
ఆలపించక చైత్రరథమెక్కనన్నాడు
ఇప్పుడైనా అలకమాని .....
వగరు చివురులారగించి ..
కుహూమని....గొంతు సవరించి
ఉగాదిలక్షికి స్వాగత గీతం
పాడవమ్మా...కోయిలమ్మా ....

**ఉగాది వచ్చేసినా మా చుట్టుపక్కల కోయిలమ్మలు ఇంకా గొంతు సవరించలేదు :( కారణమేంటో మరి !
బ్లాగ్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ...ఈ కొత్త సంవత్సరం మీ ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరాలని కోరుకుంటూ....మీ పరిమళం

Friday, March 12, 2010

మరో జన్మ ఉంటే .....(మరో చిన్న టపా)


నా ముందు టపాలో మరోజన్మ ఉంటే ఆడపిల్లగానే పుట్టాలని ఉందని రాశాను. కానీ నాబాల్యం నుండి ఇప్పటివరకు నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకు ఒక్క జన్మ చాలదు చాలా చాలా జన్మలు కావాలనిపిస్తుంది మరి !వాటిలో కొన్ని చెప్తాను .

నాకు మరోజన్మంటూ ఉంటే ..పుట్టినదగ్గర్నుంచీ నన్నెంతో అపురూపంగా పెంచిన నాన్నగారికి నాన్నగా పుట్టి తన లేత పాదాలు కందకుండా నా అరచేతుల్లో పెంచుకోవాలనుంది అచ్చంగా తనలాగే ....

ఇంకో జన్మంటూ ఉంటే ...తన భర్త ప్రేమనికూడా మొత్తంగా నాకే ఇచ్చేసి నాకు అన్నీ సమకూర్చి పెట్టాలని తను ఎన్నో ఆనందాలకు దూరమైనా అమ్మకు...అమ్మగా పుట్టి తను చేసినవన్నీ నాకు పాపగా పుట్టిన తనకోసం చేయాలనుంది .

దేవుడింకో అవకాశమిస్తే ...తనకంటే ఎంత చిన్నదాన్నైనా , గిల్లి గిచ్చి యాగీ చేసినా ....తనకంటే నాన్న నన్నే ఎక్కువ గారం చేసినా అన్నిటికీ చిన్న చిరునవ్వుతో ....ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట అనకుండా ,చెయ్యెత్తి ఒక్క దెబ్బకూడా కొట్టకుండా ...ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నన్నే సపోర్ట్ చేస్తూ ...నాకన్ని వేళలా అండదండగా ఉండే అన్నయ్యకి ....తనకంటే ముందే పుట్టేసి నేను అన్ననై అలకలు తీర్చాలని ఉంది.

నేను దేవుడ్ని అడిగి మరీ కోరుకొనే ఇంకో జన్మ ...మా శ్రీవారికి భర్తగా ....కన్నవారి గారాబం సరే !పెళ్ళైన దగ్గర్నుంచీ కన్నవారికంటే మిన్నగా , కష్టమంటే తెలీకుండా , నాకు మరోనాన్నగా , అమ్మగా , అన్నగా ..అన్ని పాత్రలూ తానెఐ నాలోని మైనస్ లతో సహా నన్ను ప్రేమించే బంగారు శ్రీవారికి ఏమివ్వగలను ? నా మరోజన్మంతా భర్తనై భరించడం తప్ప !అప్పుడప్పుడూ మావారి మేనల్లుడుసరదాగా అడుగుతాడు....అత్తా!కష్టపెట్టలేదని సంబరపడతావ్ కాని కష్టాల్లో పాలుపంచుకోలేక పోతున్నానని బాధపడవేమని !అటువంటప్పుడు మనసు చివుక్కుమనిపించినా...ఎటువంటి ఒడిదుడుకులొచ్చినా మీనాన్నగారు , నేనూ చూసుకుంటాం కదా వాడేదో నిన్నేడిపించాలని అంటాడు అంటూ బుజ్జగించేస్తారు .

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్ని జన్మలైనా చాలవు . నేనే అమ్మనైనా ...నా అలకలు తీర్చి బుజ్జి చేతులతో గోరుముద్దలు తినిపించే పిల్లలూ ....అత్తమ్మనైనా బుజ్జమ్మా ..అంటూ బుజ్జగింపుగా పిలిచే అన్నయ్య పిల్లలూ .....అమ్మ ,నాన్నల కంటే ఎక్కువగా గారం చేసే పిన్ని ,బాబాయ్ లు అత్తమ్మలు , మావయ్యలు ...కజిన్స్ ఐనా సొంత తోబుట్టువులా ముద్దు చేసే అన్నయ్యలూ , అక్కలూ ...మనవారంటే సరే అంతే ప్రేమగా చూసే వదినలు , బావలూ ....అన్నిటికంటే నా ప్రేమనే కాకుండా ...నా కోపాల్నీ , ఉక్రోషాల్నీ కూడా భరిస్తూ నన్ను విడవని నా స్నేహితులూ ...ఇలా అందరి కోసం అన్ని జన్మలు కావాలనిపిస్తుంది.మరి దేవుడెన్ని జన్మలిస్తాడో :) :)

*** నిషిగంధ గారు తన బ్లాగ్ కామెంటర్స్ అందరికీ థాంక్స్ గివింగ్ టపా రాశారు ...నా టపాకు అదే ప్రేరణ ! నాకు చిన్నప్పట్నుంచి ఆత్మీయతానురాగాలను పంచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఆరాటమే ఈ టపా !చిన్న టపా అనుకున్నాను కాని పెద్దటపానే అయ్యింది బోర్ కొడితే మన్నించాలి

Monday, March 8, 2010

మరో జన్మ ఉంటే ...


ఆడపిల్లగా పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలని సామెత ! బహుశా పుట్టిన దగ్గర్నుంచీ ఆడపిల్ల ఎదుర్కొనే వివక్ష , వేధింపులు , బాధ్యతలు , స్వేచ్చా స్వాతంత్ర్యాలకు నోచుకోకపోవడం ,శారీరకంగా , మానసికంగా మగవారికంటే సున్నితంగా ఉండటం ఆర్ధికంగా , సామాజికంగా ఎప్పుడూ ఎవరో ఒకరిమీద ఆధారపడాల్సి రావడం .అంటే బాల్యంలో తండ్రి , ఆతర్వాత భర్త , వృద్ధాప్యం లో కొడుకుఇలాగన్నమాట ! వీటన్నిటినీ మూలంగా చేసుకొని ఈ సామెత పుట్టి ఉండొచ్చు...కాని ఇప్పుడు చాలా వరకు సామాజిక పరిస్థితులు మారాయి లింగ వివక్ష చూడకుండా పిల్లల్ని చదివిస్తున్నారు తద్వారా ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుంది అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యం కూడా నేటి మహిళలకు ఉంది ముందు తరంలోలా అనవసరఆంక్షలు స్త్రీలపై చాలావరకూ తగ్గాయనే చెప్పుకోవాలి . అలా అన్ని చోట్లా ఇలాగే ఉందని చెప్పటం లేదు ...అసమానతలూ , అత్యాచారాలు ,ఆంక్షలూ,అవహేళనలూ అన్నీ ఇప్పుడూ ఉన్నాయి కాని మునుపటికంటే స్త్రీ జీవితం బావుంది ఆమె ఔన్నత్యానికి తగిన గుర్తింపు వస్తుంది .

స్త్రీ ....ఆమెకు భగవంతుడు కూడా పురుషపక్షపాతి కాబట్టి కష్టాలన్నీ ఆమెకే పెట్టాడు...అంటారు కాని ఇక్కడ ఒక అద్భుతమైన వరం స్త్రీకి మాత్రమే ఇచ్చాడు అది మరో ప్రాణికి జన్మనివ్వడం. అది వరమేలా అవుతుంది ప్రతి ప్రసవానికీ ప్రాణగండమే కదా ...అంటే మా అమ్మమ్మగారు చెప్పేవారు స్త్రీకి మాత్రమే కష్టాలు కాదు స్త్రీకి పురుడు పురుడుకి గండమైతే ....మగవాడికి దినదిన గండం అని ....అంటే కుటుంబ పోషణార్ధం బయటకు వెళ్ళిన పురుషుడికి పొలానికి వెళ్తే పాము పుట్రలతో ...ఇప్పటి రోజులైతే రోడ్డుమీదకు వెళ్తే ...ఇలా ప్రతి దినమూ గండమే కదా !

ఐతే అంతా సాధించేశామని పొంగిపోనక్కర్లేదు ...ఇంకా ఎన్నో ప్రాంతాలలోనూ ..కుటుంబాలలోనూ ఆడపిల్ల అంటే మైనస్ అనే భావనతోనే ఉంటున్నారు పనిచేసేచోట ...అది రోజు కూలీదగ్గర్నుంచి ..టెక్నికల్ కూలీ వరకు ( ఈ పదాన్ని మన బ్లాగు మిత్రులెవరో ఉపయోగించారు) వివక్షకు గురవుతూనే ఉన్నారు అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న సోదరీ మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

ఇటువంటి రోజు మనకు ఏడాదికొకసారి కావాలా అంటే ...కావాలి మనల్ని గుర్తించడానికి ,మనకోసం కూడా ఒకరోజు కావాలి ...ప్రతిరోజూ పూజిస్తున్నా కొన్నిరోజులు దుర్గాదేవికి , లక్ష్మీ దేవికి ...ఇలా దేవుళ్ళకి ప్రత్యేక పూజలు ఎలాగో ప్రకృతికి ప్రతిరూపమైన స్త్రీకి ఓ ప్రత్యేకమైన పండుగరోజు ఉండొద్దా....ఎంతటి మగధీరుడైనా....చివరికి భగవంతుడైనా అమ్మకడుపున పుట్టాల్సిందే వారు మహిళగా మనం నిర్వర్తించే బాధ్యతకు కృతజ్ఞతగా హేపీ ఉమన్స్ డే అంటూ శుభాకాంక్షలు చెబుతుంటే స్త్రీగా పుట్టినందుకు ...ఈ సమస్త సృష్టిలోనూ భాగస్వామిగా ఉన్నందుకు..గర్విస్తూ ఆ శుభాకాంక్షలందుకుందాం.

మరుజన్మ అనేది ఉంటే నేను ఆడపిల్లగానే పుట్టాలని కోరుకుంటా ...ఐతే నా బాల్యం నుండీ నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకు ఒక జన్మచాలదనిపిస్తుంది ..చాలా జన్మలు కావాలని పిస్తుంది అవేంటో తర్వాతి టపాలో రాస్తాను :)

మహిళా !
హద్దులేని ఔన్నత్యానివి నువ్వు
భూమిని పోలిన సహనానివి నువ్వు
దుర్మార్గాన్ని దునిమే ఖడ్గం నువ్వు
సమస్త సృష్టిలోనూ సగభాగం నువ్వు !!

Saturday, February 27, 2010

ఆత్మహత్యలెందుకు ??


రెండు రోజులనుండి లోకల్ ఎడిషన్ చూస్తుంటే బాధ ..ఆందోళన కలుగుతున్నాయ్ !రెండురోజుల్నుంచే కాదు
ఈమధ్య ఎక్కడ చూసినా ఆత్మహత్యలు !నాలో ఎన్నో ప్రశ్నలు ..సమాధానం లేనివి...ఎవరితో పంచుకుందామన్నా నాది అర్ధం లేని బాధగా కొట్టిపడేస్తారేమో....పొరపాటున ఎవరితో అయినా అంటే నీకెందుకు , కనీసం ముఖపరిచయం కూడా లేనివారి గురించి నీ మనసు పాడు చేసుకుంటావెందుకంటూ చివాట్లు !

అసలు ఆత్మహత్యలు ఎంత తీవ్రమైపోయాయో ....ప్రాణం విలువ ఎంత దిగజారిపోయిందో తలుచుకుంటే చాలా బాధేస్తుంది .భర్త తిట్టాడని బిడ్డతో సహా కాల్చుకున్న ఓ తల్లి , తండ్రి మందలించాడని కొడుకు,ఏదో ప్రాంతం వారివల్ల తనకు ఉద్యోగం రావట్లేదని ఓ వ్యక్తీ ,చెవి సంబంధిత వ్యాధితో ఓ గృహిణి ,ప్రియురాలు తిరస్కరించిందని ఓ యువకుడు, తనను నమ్మిన వారిని మోసగించానని,చదువు రాలేదని మరో యువకుడు, భార్యతో మనస్పర్ధలతో ఒక వ్యక్తీ , ప్రేమ విఫలమై మరో వ్యక్తీ ...ఇవే కాదు ..మార్కులు తక్కువొచ్చాయని , పరీక్ష తప్పాననీ , పోటీ పరీక్షల్లో విజయం సాధించలేక పోయాననీ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్నో ....బలవంతపు చావులు!

ఇంకో దారుణం ఏవిటంటే పదిహేనేళ్ళ వయసున్న అమ్మాయి ,అబ్బాయి ఆత్మహత్యకు ప్రయత్నించడం ..అమ్మాయి చనిపోవడం. వారిద్దరినీ ప్రేమికులనాలా?స్నేహితులనాలా ?పిల్లలిద్దరూ నాలుగేళ్ళుగా కలిసి చదువుతున్నారట ! అమ్మాయి తల్లితండ్రులు విడిపోతే తల్లి రెండోపెళ్ళి చేసుకుందట ! తోటి పిల్లలతో కలవకుండా ఈ అబ్బాయితో మాత్రం తన బాధను పంచుకొనేదట !అమ్మమ్మ దగ్గర ఉంటున్నా మానసిక వేదనతో చనిపోవాలనే నిర్ణయం తీసుకొని aస్నేహితులిద్దరూ కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ పైకెక్కి చనిపోదామని ...ముందుగా అమ్మాయి దూకేసిందట అబ్బాయి భయపడి వెనక్కివచ్చాడట ! తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని చనిపోవడానికి వచ్చామని అబ్బాయి చెప్పడం చదువుతుంటే ....నాకు నోట మాట రాలేదు.

అసలు ఈ ఆత్మహత్యలు అవసరమా ..చావుతప్ప సమస్యలకు పరిష్కారం దొరకదా ..అసలు పరిష్కారం వైపు సాగకుండా వీరి ఆలోచనలు చావువైపుగా ఎందుకు సాగుతున్నాయ్ ? వీరి చావులకు బాధ్యులు వారు మాత్రమేనా ?చుట్టూ ఉన్నవారు కూడానా ?వీరి చుట్టూ ఉన్నవారికి చనిపోయేముందు వారి ప్రవర్తనలో మార్పు తెలీదా ?తెలిసినా తమకేం పట్టనట్టు ఉండిపోతారా ?తల్లి తండ్రులకు ,సమాజంలోని తోటి మనుష్యులకు ఏమీ బాధ్యతా ఉండదా ? ఇవన్నీ మీక్కూడా పిచ్చి ప్రశ్నల్లా అనిపిస్తున్నాయా ? సంవత్సరనికోరోజు ఆత్మహత్యల నివారణదినంగా ప్రకటించి పెరిగిపోతున్న ఆత్మహత్యలను నలుగురు మానసిక నిపుణుల చేత పత్రికలలో ప్రకటన సూచనలు ,సలహాలు ఇప్పిస్తే సరిపోతుందా?

మానసికంగా వేదనకు గురైతే ..స్నేహితులకు కూడా చెప్పుకోలేమని అనిపిస్తే ...అటువంటివారి బాధని ఓర్పుగా విని ,ఓ తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే నష్టం వివరించి కౌన్సిలింగ్ చేసే స్వచ్చంద సంస్థలు ఉన్నాయని తెలుసు వాటి పూర్తివివరాలు తెలియవు .కాని 108 కి , 100 కి ఎంత ప్రాచుర్యం కల్పించారో ఇటువంటి వాటికికూడా ప్రభుత్వం విరివిగా ప్రచారం చేస్తే బావుండు అనిపిస్తుంది .అంటే సినిమా హాల్లో స్లైడు వేయించడం ,టివి లో యాడ్ ఇప్పించడం వంటివి చేస్తే బావుంటుందేమో ...

యండమూరిగారు ఏదో నవలలో అన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య మరణం మాత్రమే అనివార్యమైన మరణంతో పోలిస్తే మిగిలినవన్నీ చిన్న సమస్యలే !

ఆత్మహత్యలు క్షణికావేశంలో జరిగేవి ఆ కాస్సేపూ ఎవరైనా తోడుగా ఉండి వారి బాధను పంచుకొని వారి ఆలోచన మళ్లిస్తే వారికి బ్రతుకుపై ఆశ కలగొచ్చు . తర్వాత వారి మానసిక ఆందోళన తీవ్రతను బట్టి తగిన వైద్యం చేయించొచ్చు
తల్లితండ్రులు కాని ,సన్నిహితులుగాని తమవారి ప్రవర్తనలో మార్పు , నిరాశ , నిరాసక్తత కనిపిస్తే అలక్ష్యంచేయకుండావారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్తే కనీసం కొన్ని ఆత్మహత్యలనైనా నిరోధించగలమేమో !

** మీకెవరైనా అలాంటివారు కనిపిస్తే శ్రమనుకోకుండా కాస్త ఓర్పు ...మరికాస్త సమయం వారికోసం వెచ్చిస్తారు కదూ !




Monday, February 22, 2010

అవును...ఈ అబ్బాయి చాలా మంచోడు .....


పై పేపర్ క్లిప్పింగ్ చూశారుకదా..మొన్న శనివారం (20 వ తేదీ) హైదరాబాద్ ఎడిషన్ లో 10 వ పేజీలో వచ్చింది. ఆరోజు గెస్ట్ లు వచ్చిన కారణంగా బిజీగా ఉండి పేపర్ చూడలేదు. నిన్న నా ఫ్రెండ్ చూసి ఇతను అతనే కదా అంటూ చూపిస్తే ..అప్పుడు చూశాను. అప్పుడెప్పుడో పేపర్ క్లిప్పింగ్ లో చూసిన ముఖం ! గొంతు పరిచయమే కాని ఆ పేపర్ క్లిప్పింగ్ లేకపోతే గుర్తుపట్టలేక పోయేదాన్ని! స్ఫూర్తి కాలమ్ లో రాసిన అతని జీవిత కధ నిజంగా స్ఫూర్తివంతం....యువతకు ఆదర్శం.

2005 సెప్టెంబర్ పద్నాలుగు (నిజానికి నాకు గుర్తులేదు ఆపక్క క్లిప్పింగ్ చూస్తేగాని :) ) ఈనాడు లోకల్ ఎడిషన్లో ఓ పక్కన చూసాను ఒక న్యూస్. దశరథ్ అనే అబ్బాయి కష్టపడి డిగ్రీ పూర్తిచేశాడని MCA లో సీటు వచ్చిందని ఆర్ధిక ఇబ్బందులవల్ల ఫీజ్ కట్టలేక పోతున్నాడని క్లుప్తంగా దాని సారాంశం ! అందరిలాగే స్పందించి నేనూ ఏదో నాకు తోచిన చిన్న మొత్తాన్ని పంపించాను . ఇలా చాలా సార్లు చేస్తూ ఉంటాం...ఆవెంటనే మర్చిపోతూ ఉంటాం..కాని మొదటిసారి నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ఉత్తరం వచ్చింది . అది దశరథ్ దగ్గరనుండి .

అది ఒక్కటే ఐతే ఈ అబ్బాయి గురించి ఈ టపా ఇలా రాసేదాన్ని కాదేమో ! ఫీజులు కట్టి ఎంతో శ్రద్ధ తీసుకొని మనం స్కూళ్ళకి ..కాలేజీలకి ..పంపించే పిల్లలు బాధ్యతగా వారి ప్రోగ్రెస్స్ మనకు చూపిస్తారో లేదో గాని దశరథ్ మాత్రం తన ప్రతి సెమిస్టరు ఫలితాలు జిరాక్స్ తీసి నాకు పంపిస్తూ ఉండేవాడు. నేను పంపించిన చిన్న మొత్తానికి అతడు అంతబాధ్యతగా పంపించడం నాకు చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉండేది. అంతేకాదు ప్రతి పండుగకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతాడు ఇప్పటికీ ...తనకి బెంగుళూరులో జాబు వచ్చినప్పుడు కూడా అపాయింట్మెంట్ లెటర్ కాపీని పంపించాడు.
పోయిన సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు నా మేనల్లుడికి యాక్సిడెంట్ ఐతే ...తను విష్ చేసినప్పుడు నేను తిరిగి మనస్పూర్తిగా విష్ చేయలేక విషయం చెప్తే తర్వాత కొద్దిరోజులకు మళ్ళీ ఫోన్ చేసి యాక్సిడెంట్ ఐన బాబు బావున్నాడా అమ్మా...అంటూ పలకరించిన విషయం నేనెప్పటికీ మర్చిపోలేను .

ఇటువంటి అబ్బాయి ...ఒకప్పటి కష్టాల కడలికి ఎదురీది చదువుకొని ఈరోజు తాను మంచి ఉద్యోగం సంపాదించుకోవటమే కాకుండా తనలాంటి వారికి తనకు చేతనైన సాయం చేయాలన్న సంకల్పంతో ...నలుగురు సభ్యులతో ఓ టీమ్ ని తయారుచేసి పేద విద్యార్ధులకు అండగా నిలబడుతున్నాడని తెలిసినప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది . తన జీవితాన్ని చక్కదిద్దుకోవటమే కాకుండా తనలాంటివారికి మార్గదర్శిగా...స్ఫూర్తి ప్రదాతగా ఉన్న ఈ అబ్బాయి చాలా మంచోడే ..కదూ !

తాను పైకొచ్చినా ఎక్కిన మొదటిమెట్టునుకూడా గుర్తుపెట్టుకొనే దశరథ్ ఇంకా ఎంతో మంచి స్థాయికి రావాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నా ...ఎప్పుడూ తను లాండ్ నెంబర్ కి ఫోన్ చేయటం వల్ల ప్రత్యేకంగా తన నెంబర్ అడగక పోవడంవల్ల నాకు స్వయంగా అభినందించే అవకాశం లేకపోయింది. అందుకే నా ఆనందాన్ని బ్లాగ్ మిత్రులందరితో పంచుకోవడంతో పాటు దశరథ్ కి హృదయపూర్వక అభినందనలు బ్లాగ్ ముఖంగా తెలుపుతున్నా ...నా అభినందనలు అతనికి అందకపోయినా మీ అందరి ఆశీస్సులు తప్పక అందిస్తారుకదూ !

Sunday, February 21, 2010

మా తెలుగుతల్లికి మల్లెపూదండ ........


ప్రతి మనిషి పసిబిడ్డగా ఉన్నప్పుడు మొదటిగురువు తల్లే అవుతుంది . తల్లి ఒడిలో నేర్చుకొన్న భాష మాతృభాష !ఇది సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండానే అలవడుతుంది . మనభాషకంటే పరాయిభాషల పట్ల మోజుతో మాతృభాషను విస్మరించడం మాతృ ద్రోహంతో సమానం . "దేశ భాషలందు తెలుగు లెస్స "అన్న వారెవరు అని అడిగితే ఈరోజు ఎంతమంది పిల్లలు సమాధానం చెప్పగలుగుతున్నారు ?శ్రీకృష్ణదేవరాయలు అంతటివారే తన ఆముక్తమాల్యద ప్రబంధంలో మన తెలుగును గురించి ఇంత గొప్పగా చెప్పారు అని ఎంతమంది తల్లితండ్రులు మన భాష గొప్పతనం గురించి పిల్లలకు వివరిస్తున్నారు ?తన మాతృభాష తెలుగు కాని రాజు తెలుగుభాషలోని మాధుర్యాన్ని గుర్తించి కీర్తించడం మన తెలుగువారికెంతో గర్వకారణం .మహాకవి శ్రీనాధుడు ఇలా అన్నారట ! ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కరూపు ...కన్నతల్లి మాతృభాష ఒక్కరూపు అని .పరాయిభాషలను తక్కువచేయటం నా ఉద్దేశ్యం కాదు..అవి నేర్చుకోవడం తప్పని అనను .అవసరార్ధం కావచ్చు ఆసక్తితో కావచ్చు ఎన్ని భాషలు నేర్చినా ...మాతృభాష పట్ల చులకన కలగకుండా ఆసక్తిని పెంపొందించే ప్రయత్నం చేయటం ప్రతి తల్లి తండ్రి బాధ్యత ! వారితర్వాత ఉపాధ్యాయుల బాధ్యత !ఎన్ని భాషలు నేర్చినా మన మనోభావాలు వ్యక్తీకరించడానికి మాతృభాషను మించిన సాధనం ఉండదనుకుంటాను .
*ఈరోజు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఆదివారం ఎడిషన్ లో అమ్మభాషకు జేజే !అంటూ కనిపించుటలేదు పేరు:తెలుగు అనిరాస్తే బాధ ,భయం కలిగాయి ....మాతృభాషను మన పిల్లలు మర్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరిదీ కాబట్టి మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్ని టపా ! ఏవైనా తప్పులు దొర్లితే మన్నించగలరు . మిత్రులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు !

Thursday, February 11, 2010

ఆ ఇల్లు ....


ఆ ఇల్లు ....ఆ ఇల్లంటే నాకు చాలా ఇష్టం . ఆ దారిన వెళ్తూ ఆ ఇంటికేసి ప్రేమగా చూస్తాను.అది మిగతా ఇళ్ళకంటే గొప్పదేం కాదు .అయినా ఆ ఇల్లంటే నాకు ప్రేమ !ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలకు , దాటొచ్చిన మజిలీలకు , అభిమానాలకు ,అనుబందాలకూ సాక్షి ఆ ఇల్లు .తలపైకెత్తి చూస్తే మనం నిలుచుని కబుర్ల కచేరీ చేసుకున్న బాల్కనీ కనపడుతూ ఉంటుంది బోసిగా....ఇంటి ఎదురుగా ఉన్న పూలచెట్టు మాత్రం ఇప్పుడు లేదు .మిగతా అంతా అలాగే ఉంది.అందరూ మనవారనుకోవడం , అన్నిటిపైనా మమకారం పెంచుకోవడం పిచ్చితనం కదూ !ఎంత అశాశ్వతమీ అనుబంధాలు ?

అక్కడ ఆ ఇంట్లోనే అప్పటికే పరిచయమున్న మనమధ్య కొత్తగా అంకురించిన అనురాగం....అది పెరిగి పెద్దదై నామనసునల్లుకొని మొగ్గతొడిగి పుష్పించిందక్కడే ఆ గుభాళింపు ఆస్వాదించక మునుపే తుఫానుగాలికి గూడు కూలిన గువ్వలా విధిచే విసిరేయబడి చెరొక దారి అయ్యాం . నువ్వక్కడ ...నేనిక్కడ ! ఐతేనేం ఆ మలుపు తిరిగినప్పుడల్లా
గడచిన కాలపు జ్ఞాపకాలు ....అవి ముళ్ళైనా , పూలైనా ...గుండె పొరలను ఆర్తిగా స్పృశిస్తూనే ఉంటాయి .ఎన్నాళ్ళైనా కళ్ళముందు కదులుతూనే ఉంటాయి...ఏళ్ళు గడిచినా ఆ ఇల్లూ అలాగే ఉంది మన అనుబంధం విడిచిన గుర్తుగా ....

Wednesday, February 3, 2010

మనసు మూగబోతున్నా ....


నేస్తమా !
నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ ....
కంట పొంగే ఏరునాపలేకున్నా!
నువ్వే కొలువైన మది గుడిలో
పరులనడుగు పెట్టనీయలేకున్నా !
ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !
నువ్వేమో ....
అభిమానాల అల్లికలు పెనవేసుకుంటే
అనురాగాల వేళ్ళు పాతుకుపోతాయన్నావ్
కాలం ప్రతికూలిస్తే.....
మనపరిచయం అగాధాల అంచుకుచేరి
మరో వ్యధాభరితకధనం కాకూడదన్నావ్ !
నా మనసు నిఘంటువులో .....
నీ మాటలకర్ధం వెతుకుతున్నా !
ఆకాశంవంటి నీ వ్యక్తిత్వం ముందు
ప్రతిసారీ నేనోడిపోతూనే ఉన్నా !
మనసు మూగబోతున్నా ....
నీఆదర్శం ముందు మోకరిల్లుతున్నా!!

Sunday, January 31, 2010

రంగుల కళ !!


మాయా బజార్ నిజంగానే ఒక మాయ ! చూస్తున్నంతసేపూ మనల్ని మెస్మరైజ్ చేసే మహాద్భుతం !భారతంలో లేని శశిరేఖా పాత్రను సృష్టించి ఆమె చుట్టూ అల్లిన కాల్పనిక గాధ !అంతే కాదు ఎక్కడా పాండవులు కనిపించని(కల్పిత)భారత ఘట్టం1957 వ సంవత్సరంలో తీసిన ఈసినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే !అటువంటి సినిమాని నలుపుతెలులో నుండి రంగులద్దుతున్నారని తెలిసి ఎప్పుడు రిలీజవుతుందాని ఎదురుచూసి మరీ నిన్న చూసేశాను.

మాయాబజార్ గురించిన కధ , తెరవెనుక కధతో సహా ఇక్కడ రాసేశారు రంగుల మాయ..
కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే రంగులద్దటంలో గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ వారు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు .చిత్రంలోని" లాహిరి లాహిరి "పాటలో వెన్నెల నీడల్ని సైతం అందంగా చూపించారు .ఈ సినిమాలో హైలెట్ సావిత్రిగారనే చెప్పుకోవాలి .బ్లాక్ &వైట్ లోనే ఎంతో అందంగా కనిపించే ఆమె రంగుల్లో మరీ అందంగా కనిపించారు .అసలు ఆవిడ అలవోకగా తలతిప్పి కనురెప్పలల్లార్చి , చిరునవ్వు నవ్వితే చాలు ఎంతవారలైనా ఆ అభినయానికి దాసోహమనవలసిందే !

ఘటోత్కచుని పాత్రలో ఎస్.వి రంగారావుగారికి ఇప్పటికీ ఎంత ఫాలోయింగ్ ఉందో థియేటర్లో పడిన ఈలలు , చప్పట్లే సాక్ష్యం .అలాగే రమణారెడ్డి గారి కామెడీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు ."సుందరి నీవంటి దివ్యస్వరూపము "రేలంగిగారి పాటకు కూడా హాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది .ఈ సినిమాకి పెద్దా ,చిన్నా తేడా లేకుండా ,ఇంకా వారి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్న వారిని చూసి నాకెంత సంతోషంవేసిందో మాటల్లో చెప్పలేను .ఇటువంటి మంచి సినిమాల్ని ప్రజలు ఆదరిస్తే మరిన్ని ఆణిముత్యాల్ని రంగులలో మనముందుకు తెచ్చే సాహసం చేస్తారు.అలాగే ఈ తరం పిల్లలకూ పాండవులు ఐదుగురని , కౌరవులు నూర్గురని ....రామాయణ , మహాభారతాల పట్ల బేసిక్ నాలెడ్జ్ ఏర్పడుతుంది .ఈమధ్య చాలా టీవీ షోల్లో పిల్లల సమాధానాలు చూస్తుంటే బాధ కలుగుతుంది .

ఇక ఈసినిమాలో కృష్ణుని పాత్ర రంగు , ధరించినమాల కొంత డల్ గా అనిపించాయి.ఐతే ఎన్ .టి రామారావుగారి చిరునవ్వు , హావభావాలు యధావిధిగా మన మనసుల్ని దోచుకుంటాయి. ఆద్యంతం కామెడీ పిల్లలనుండి ,పెద్దలవరకూ ఎంజాయ్ చేస్తాం.ఐతే నన్ను నిరాశపరచిన విషయం "చూపులు కలిసిన శుభవేళ "పాటను ఇంకా అక్కడక్కడా కొంత భాగాన్ని కట్ చేసేయడం ! చిత్రం నిడివి తగ్గించే ప్రయత్నంలో అలా జరిగి ఉండొచ్చు కధాపరంగా ఎక్కడా ఆలోటు కనిపించదు .రంగుల మాయాబజార్ పాత సినిమా ప్రియులనే కాదు ఈతరం యూత్ ని కూడా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.మరి సెలవురోజు ప్రోగ్రాం కన్ఫర్మ్ అయిందా :) :)

Wednesday, January 27, 2010

బంగారు తల్లిని :)


జన్మనిచ్చే మాకు జీవించే హక్కు లేదా?
జ్యోతిగారి టపా చదివినప్పుడు మనసు కలచివేసినట్టైంది.నేనూ ఇటువంటివి టీవీ లో చూసినప్పుడు ,పేపర్లో చదివినప్పుడు బాధపడుతూ ఉంటాను.హోమ్స్ లో ఉయ్యాలల్లో వదిలేసే వాళ్లలోనూ ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉంటారు.ఈమధ్య టీవీలో అమ్మకానికి పిల్లలు అని ఒక న్యూస్ చూపించినపుడు కూడా ఎక్కవ ఆడపిల్లల్నే అమ్మకానికి పెడుతున్నారట !ఆడపిల్లని తెలియగానే గర్భస్త శిశువుల్ని చిదిమేసేవారు , ఇప్పుడు ముందే లింగ నిర్ధారణ చేయటం నేరం కాబట్టి పుట్టిన తర్వాత విసిరి పారేస్తున్నారు .పుట్టిన తర్వాత తప్పక పెంచుతూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారు కూడా చాలామంది ఉంటారు .ఇవన్నీ చూస్తుంటే ఇటువంటివారూ ఉంటారా అని ఎంతో బాధగా ఉంటుంది .

ఐతే నేను అదృష్టవంతురాల్ని అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా నాన్నగార్ని నాకిచ్చినందుకు ! నేను మాత్రమే కాదు కూతుర్ని అపురూపంగా చూసుకొనే తల్లితండ్రులున్న వారందరూ అదృష్టవంతులే !

అందరూ ఆడపిల్లల్ని మొగ్గలోనే తుంచేయక పోయినా ...మగపిల్లాడు కావాలని ముడుపులు కట్టేవారు ,మొక్కుకొనేవారు చాలామందే ఉంటారు .ఐతే మా నాన్నగారికి మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టం .ఐతే ముందు అన్నయ్య పుట్టేశాడు .అన్నయ్య పుట్టేసరికి నాన్నగారు ఇంకా ట్రైనింగ్ లోనే ఉండటం వల్ల అమ్మ అమ్మమ్మగారి ఇంటిదగ్గరే ఉండేదట !నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు పాలకోసం వచ్చే చిన్నపిల్లల్ని (అమ్మమ్మగారికి పాడి ఎక్కువే ఉండేదట పాలు ,పెరుగు అమ్మటంవల్ల చాలామంది పిల్లలువచ్చేవారట ) ఎత్తుకొని ముద్దుచేసేవారట !వాళ్ళ ముక్కుకారుతున్నా కూడా :) పిన్నిలు ఇప్పటికీ చెప్పి నవ్వుతుంటారు . రెండోసారైనా ఆడపిల్ల పుట్టకపోతుందా అని అనుకొంటే అదేంటో అన్నయ్య పుట్టాక చాన్నాళ్ళు పిల్లలు కలగలేదు .ఇక నాన్నగారు ఒక పాప కావాలని కనిపించిన దేవుడికల్లా మొక్కుకొనేవారట!అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది చెట్టుకి ,పుట్టకి ఆఖరుకి పసుపు పూసిన రాయి కనిపించినా అమ్మవారిగా తలచి మొక్కేవారట .చివరికి అన్నయ్య పుట్టిన పన్నెండేళ్ళకి దేవీ నవరాత్రుల రోజుల్లో నేను పుట్టానట !

ఇక నేను పుట్టింది మొదలు కళ్ళల్లో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకొనేవారట అలా నేను నాన్నగారి బంగారు తల్లిని అయ్యానన్నమాట ! పెరిగి పెద్దయ్యాక తెలిసింది అందరూ మా నాన్నగారిలా ఉండరు కొందరు ఇలా చేతులారా ఆడపిల్లల్ని చంపుకోనేవారూ ఉంటారని ! ఏది ఏమైనా ఈ నాన్నని నాకిచ్చినందుకు దేవుడికి సదా కృతజ్ఞురాలిని !మీకూ నాన్న గుర్తుకొస్తున్నారు కదూ ! వెంటనే ఫోన్ అందుకోండి మరి :)

Monday, January 18, 2010

పిట్ట కధలు - 3


పిట్ట కధలు -
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )

గత జూన్ లో చెప్పుకున్నపై రెండు కధలు చదివారుగా ! ఇప్పుడింకో చిన్న పిట్టకధ !
కలియుగం ప్రారంభమైంది మానవులు మోక్షం కోసం కాక ధనాపేక్షతో , తమ స్వార్ధ ప్రయోజనాలకోసం లక్ష్మిని పూజించడం మొదలుపెట్టారు .పాలకడలిలో శేషతల్పంపై పవళించిన స్వామి పాదాలు వొత్తుతూ పై విషయం తలచుకొని లక్ష్మీదేవి గర్వంతో నవ్వుకోసాగిందట ! ఐతే స్వామి సర్వాంతర్యామి అమ్మ నవ్వులోని అంతర్ధానం గ్రహించి కూడా ఏమీ ఎరుగనట్టు ఏంటి లక్ష్మి నీలో నీవే నవ్వుకొంటున్నావ్ అని అడిగారు .అప్పుడు లక్ష్మీదేవి స్వామీ! కలియుగ మహిమ చూశారా ?భూలోకంలో ఎక్కడ చూసినా నా భక్తులే ఉన్నారు కాని మోక్షాపేక్షగల మీ భక్తులు అసలున్నారా అని సందేహంగా ఉంది అని గర్వంతో అంటుంది .

అమ్మకు ఎలాగైనా గర్వభంగం చేయదలచి స్వామి దేవీ ! భూలోకంలో నా భక్తులు అన్నికాలాల్లోనూ ఉంటారు కాబట్టే ధర్మం ఒంటిపాదంతో ఐనా నిలబడగలుగుతోంది కాకపొతే కాకులు అన్నిచోట్ల కనిపిస్తాయి నీ భక్తుల్లా ...హంసలు అరుదుగా కనిపిస్తాయి నా భక్తుల్లా అంటూ చమత్కరిస్తారు .

అమ్మకు మనసు చివుక్కుమని కోపంతో మీరు చెప్పినట్లు స్వార్ధంలేని భక్తులు ఎవరైనా ఉంటే చూపించండి వారు ఎటువంటివారో నేను నిరూపిస్తాను అని అంటుంది .స్వామి కాశీ క్షేత్రంలో రామానందుడు అనే మహా భక్తుని చూపించి యితడు వాంచారహితుడు , భక్తిని ప్రజలలో వృద్ధి చేయటం తప్ప వేరే స్వార్ధం లేనివాడు అంటూ చెప్పారు .

లక్ష్మీదేవి రామానందుని పరీక్షింప దలచి అతడు నడిచే దారి పక్కగా ధనరాశులను సృష్టించింది ఐతే హరినామస్మరణ చేసుకుంటూ కనీసం తలకూడా తిప్పిచూడకుండా వెళ్ళిపోయాడు రామానందుడు . అమ్మ పట్టువదలకుండా ఆ మర్నాడు తెల్లవారుఝామున రామానందుడు గంగా స్నానానికి వెళ్ళేదారిలో తన మాయతో అందమైన పుష్పాలతో కూడిన ఒక గులాబీ తోటను సృష్టించింది రామానందుడు స్నానం చేసి వెళ్తూ ఆతోటను చూసి ఆశ్చర్యంతో ఇంత అందమైన పుష్పం శ్రీహరి పాదాల చెంత ఉండతగినది అనుకొని ఒక పుష్పాన్ని కోసి చేతపట్టుకోగానే లక్ష్మి మారువేషంలో వచ్చి ఈ తోట నాది నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని దొంగిలించావు అన్నది

తల్లీ !క్షమించు ఇంతఅందమైన పూలు కనిపించగానే భగవానుని పాదాలవద్ద ఉంచాలనిపించి కోసాను అంతేగాని దొంగను కాదు అంటూ ఆ పుష్పాన్ని అమ్మకిచ్చి వెళ్ళిపోయాడు రామానందుడు .లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకొని విష్ణుమూర్తిని చేరి చూశారా స్వామీ !మీరు చెప్పిన రామానందుడు ఒక దొంగ ఈ పువ్వే దానికి నిదర్శనం అంటూ ఆ పుష్పాన్ని స్వామికందించింది .

అప్పుడు స్వామి చిరునవ్వుతో దేవీ !పొరపాటు పడ్డావు .ఈ పువ్వు అతడు నాకు సమర్పించాలనే కాని స్వార్ధంతో అపహరించాలన్న ఆలోచన లేదు .నా విగ్రహం ముందుంచాలని కోశాడు కాని అతనికి నాపట్ల గల అపార భక్తి వల్ల నీవే స్వయంగా ఈ పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అన్నారు . లక్ష్మీ దేవి గర్వం తొలగిపోయి స్వామీ అపరాధం మన్నించండి మీ భక్తులు అన్నికాలాల్లోనూ పుట్టి ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లుతూ ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ ఆదర్శ జీవనం సాగిస్తారు అంటూ స్వామితో ఏకీభవించింది .