Monday, September 20, 2010

నా ధ్యానం !!


కోపాన్ని ధ్యానంతో జయించేద్దాం..అని నిర్ణయించుకున్నా కదండీ ..ఇక ధ్యానం ఎలా చేయాలో నాకు తెలిసింది చెపుతా! పద్మాసనంలో కూర్చొని చూపుడు వేలు , బొటనవేలు కలిపి చిన్ముద్రలో ఉండి కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో అదేనండీ నుదుటి మధ్య ఉంచి ధ్యానం చేయటం...రెండు సుఖాసనంలో కూర్చుని రెండుచేతుల వేళ్ళూకలిపి ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళటం ! మొదటిది నావల్ల కాదు కాబట్టి రెండోదానికే డిసైడ్ అయ్యాను .

ఇక ఎప్పుడు ప్రారంభించాలి ?ధ్యానం అంటే ఉదయాన్నే సూర్యోదయ వేళలో చేస్తే మంచిది అంటారుకనుక ఆదివారం కుదరదు ఎందుకంటే హరిహర బ్రహ్మాదులు వరమిస్తానన్నా ఓ గంటాగికోరుకుంటా స్వామీ...అనేసి ముసుగు పెట్టేస్తా మరి !కాబట్టి ప్రతి ఆదివారం ధ్యానానికి సెలవు ఇచ్చేశా ! ఇక శనివారం..వద్దు మనకసలే ద్వితీయవిఘ్నం సెంటిమెంటు. మంగళవారం ఏపని మొదలు పెట్టినా సాగదని అంటుంది అమ్మ కనుక వద్దు!ఇన్ని ఆలోచించి ఓ శుభదినం డిసైడ్ చేసుకొని ముందురోజు రాత్రి ..తెల్లవారుఝామున ఆరు గంటలకే సెల్ లో అలారం పెట్టుకొని ....పొద్దున్నే కాఫీపట్టుకొచ్చేయకండి నేను ధ్యానం పూర్తయ్యేవరకూ తాగను...ఈలోపు షేవింగు గట్రా ...మీ పనులు పూర్తిచేసుకోండి అని శ్రీవారికి స్ట్రిక్ట్ గా ఇంచుమించు వార్నింగ్ లాంటిది ఇచ్చి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ...ఈనాడే ఎదురౌతుంటే ఇంకా తెలవారదేమి..ఈ చీకటి విడిపోదేమి అని పాడుకుంటూ నిద్రకుపక్రమించా!

ఆరుగంటలకు అలారం మోగినట్టుంది...అదేం రింగ్ టోనోనండీ అసలు మోగినట్టే తెలీలేదు.మా ఇంటాయనకి మెలకువ వచ్చేసిందట కాని నన్ను లేపే రిస్క్ చేయలేకపోయినట్టున్నారు పాపం! అది రెండోసారో మూడోసారో రిపీట్ అవుతుండగా మెలకువ వచ్చి చూస్తె ఆరున్నర ! ఛీ మొదటిరోజే లేటా అనుకొని ఐనాసరే ఈరోజే మొదలుపెట్టాలి అనిఘాట్టిగా అనుకొని
లేచి కూర్చున్నా! ఇంతకూ ధ్యానం బ్రష్ చేసుకొని చేయాలా ...లేకపోతె లేవగానే చెయ్యాలా ??? ప్చ్ ..ధ్యానం పవిత్రమైనకార్యం ...కాఫీతాగటంలాగా మొహం కడుక్కూకుండా చేయకూడదు.( ఇంతకూ కాఫీ క్షుద్రమైనదంటారా?) చకచకా మొహం కడిగేసి సుఖాసనంలో కూర్చున్నాక మరో సందేహం ....ధ్యానానికి ముందు ఓంకారం చేయాలా ..అప్పుడెప్పుడో నేను యోగా క్లాసులకు వెళ్ళే రోజుల్లో టీచర్ చెప్పినట్టు గుర్తు! సరే మూడుసార్లు ఓంకారం పూర్తిచేసి ...కళ్ళుమూసుకొని కూర్చున్నాక మళ్ళీ ఓ డౌటు ఒకవేళ పదినిముషాలకు ధ్యానంలోంచి బైటకు రాకపోతే ....పూర్తిగా ధ్యానంలో నిమగ్నమైపోతే ...ఈయన కదిలిస్తారన్న నమ్మకం లేదు కాబట్టి సెల్ తెచ్చుకొని పదినిముషాల తర్వాత మోగేలా అలారం సెట్ చేసుకొని మళ్ళీ కళ్ళుమూసుకున్నా!

ధ్యానం మొదలు పెట్టాక ఏమీ ఆలోచించకూడదు....అన్నట్టు నిన్న పేపర్అబ్బాయి మాకు వేయాల్సిన ఈనాడుకు బదులు ఎవరికో వేయాల్సిన ఆంధ్రజ్యోతి వేశాడు ఈరోజు కూడా అలాగే చేస్తాడేమో బహుశా కొత్త అబ్బాయేమో ఈయనకు చెప్పి ఉండాల్సింది...ఛీ ఇదేవిటీ ..ఏం ఆలోచించకూడదు ...నా దృష్టంతా రెండుకనుబోమ్మల మధ్య కాన్సంట్రేషన్ చెయ్యాలి...ఎండ వచ్చేటట్టుంది ఈరోజు వాషింగ్మిషన్ వెయ్యాలి ..ప్చ్ ...దృష్టి ...అదేంటి ఈయన్ని కాఫీ అప్పుడే వద్దన్నానుకదా ..మరి అదేంటి కాఫీ కప్పుతో ఆర్తి అగర్వాల్ వచ్చేస్తుంది !! ఓహో ..ఆ ముందురోజు ఏదో లోకల్ చానెల్లో అనుకుంటా పూర్తిగా చూస్తానని నా ఫ్రెండుతో పందెం వేసి మరీ చూసిన మెంటల్ కృష్ణ సినిమాలో సీనది. పందెం ఓడిపోయాను కాని ఈ సీను నన్ను వదలకుండా వెంటాడుతుందన్న మాట!పోసాని కృష్ణమురళి సినిమానా మజాకా !ఛీ ఛీ ఇలాంటివి మనసులోకి రానివ్వకూడదు ...మరింత ఘాట్టిగా కళ్ళుమూసుకున్నా....

చాకలి ఇస్త్రీ బట్టలు తేలేదు లోపలిబీరువాలోది ఒక జత తీసిపెట్టి కూర్చోవాల్సింది నేను ప్చ్...ఏం వేసుకుంటున్నారో ..అసలే లేటుగా మొదలుపెట్టాను...టిఫిన్ చేయటానికి టైం సరిపోదేమో ..హమ్మయ్య ఫ్రిజ్ లోబ్రెడ్ఉంది బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తే సరి!ఆఅయ్...దృష్టి తప్పుతోంది ...కాన్సంట్రేట్ బుజ్జీ ...కాన్సంట్రేట్ ...అవునూ చాలా సేపయింది కదా ఇంకా పదినిముషాలు కాలేదా ...లేక నాకు వినపడలేదా ...అనుమానం కాసేపటికి పెనుభూతమైంది...ఐనా మొదటి రోజు కదా కొద్దిసేపు చేసినా చాలు అనుకొంటూ కళ్ళుతెరిచి టైం చూసి షాకయ్యా...అప్పటికింకా నాలుగునిముషాల ఇరవై సెకన్లుమాత్రమే అయ్యింది.


ఐనా పర్లేదు మొదటిరోజు కదండీ...అన్నప్రాశన రోజే ఆవకాయ తినగలమా...ఈరోజుకిది చాలు.రేపు పొద్దున్నే లేచి పర్ఫెక్ట్ గా చేద్దాం. అ రోజంతా బాగా ఆలోచించా వేరే ఆలోచనలు మనసులోకి రాకుండా ఏం చెయ్యాలా అని! ఐడియా....నాది వోడా ఫోనేనండి ఐనా ఈ ఐడియా నా ధ్యానాన్ని మార్చేస్తుంది చూడండి. పడుకొనేముందు సెల్ లో అలారం రింగ్ టోన్ మార్చిసౌండ్ లౌడ్ లో పెట్టుకొని తలదగ్గరే ఉంచుకున్నాను.


అలారం మోగగానే లేచి బ్రష్ చేసేసుకొని ధ్యానానికి సిద్ధమైపోయా...డివిడిలో ఓం చాంటింగ్ పెట్టుకొని( నిన్న నాకొచ్చిన గుడ్ ఐడియా ఇదే) సోఫాలో చేరాను. నిటారుగా కూర్చోవడం కష్టంగా ఉండి కాన్సంట్రేషన్ దెబ్బతుంటుంది అదే రిలాక్స్డ్ గా ఉంటే ఆ ప్రోబ్లం ఉండదు కాబట్టి సోఫాలో శవాసనంలో ధ్యానం చేయటం ద్వారా అందరికీ ఓ కొత్త కోణం చూపిద్దాం..అనుకుంటూశవాసనంలో కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలో కేంద్రీకరించి...ధ్యానం ప్రారంభించా...ఆహా ..ఎంత ప్రశాంతంగా ఉంది...ఇహపరమైన ఆలోచనలు ఏమీ రావట్లేదు ....అనుకొంటూ ధ్యానంలో నిమగ్నమైపోయా!........















బుజ్జీ....బుజ్జీ ....ఎక్కడో లోయలోనుండి వినపడుతోంది ఎవరిదా గొంతు.....ఎవరో గట్టిగా భుజాలు పట్టి కుదుపుతున్నారు..ఎవరు ? ఎవరు నా ధ్యానాన్ని భగ్నం చేసింది...కళ్ళుతెరిచి చూసేసరికి ...ఎదురుగా ఈయన ! బుజ్జీ టైం ఎనిమిదైంది...ఇక్కడ పడుకున్నావేం?నాకు టైం అయిపొయింది టిఫిన్ బైట చేస్తాలే తలుపేసుకో....అంటూ ....అలా నాధ్యానం ద్వితీయ విఘ్నం కాకుండా పూర్తయింది.
మీరూ ట్రై చెయ్యండి చాలా ప్రశాంతంగా ఉంటుంది...నేను చెప్పిన పొజిషన్ లో నేను చేసినట్టు చేస్తే ఎన్ని గంటలైనా ధ్యానం కాన్సంట్రేషన్ తో చెయ్యొచ్చు.....కనుక మిత్రులారా ధ్యానం చేయండి కోపాన్ని జయించండి.

27 comments:

  1. హహ్హహ్హ.. పరిమళ గారు, చాలా బాగున్నాయి మీ ధ్యానం కబుర్లు :) నవ్వాలగలేదు.:)
    నేను కూడా దాదాపుగా ఇలానే చాలా సార్లు ప్రయత్నించా. ఇంకా ఏరోబిక్స్ కూడా చేశాను ఒక పది రోజులు ఆరోగ్యానికి మంచిది అనుకుంటూ..:) అంతే మళ్లీ వాటి జోలికి పోలేదు.. ;)

    ReplyDelete
  2. మీరు ఖచ్చితంగా నేను రాసిన క్రితం కామెంట్ తాలూకు కథ చదివి ఉంటారు.... అది మీ మెదడులో నిక్షిప్తంగా ఉండిపోయి మీరు ఇలా శ్రధ్ధగా ధ్యానం చేయటానికి ఉపయోగపడి ఉంటుంది....:) :)

    ReplyDelete
  3. నా బంగారు తల్లే ..నేను కూడా నేర్చేసుకుందామని పరుగులు పెట్టేసి వచ్చా... ప్రొద్దున నా యోగాలా అన్నమాట..నేనైతే బుద్దిగా యు ట్యూబ్ లో మంతెన గారి ప్రాణాయామం పెట్టి కూర్చున్నానా..తెల్లగా తెల్లారిపోయింది .. ఎపిసోడ్ లు ఎపిసోడ్లు ఆయన కబుర్లు చెబుతున్నారుగాని ఒక్క ఆశనం చెప్పరే...ఇంకేంటి ఆయన ఆశనం చెప్పుదామని మొదలు పెట్టారు.. మా ఆయన టిపిన్...న్ ..న్ ...బట్టలు ఐరన్ చేసావా? చట్నీ ఏంటీ అని ఒకటే అరుపులు...దానితో రేపటికి వాయదా వేసా..

    ReplyDelete
  4. hahahha very funny. Naku kooda ilanti experiece ee eduraindi dyanam tho.. ayina kooda balavantham ga alochanalni nokki patta.. ala chesthe thala noppi. lekunte full alochanalu.. prasthutaniki nenu dyanam chese idea ni vadilesaa

    ReplyDelete
  5. చాలా బాగా రాసారండీ. అచ్చు నాదీ ఇదే పరిస్థితి. సుఖాసనం కన్నా నేను కూడా శవాసనంలోనే ధ్యానం చెయ్యగలుగుతున్నాను.

    ReplyDelete
  6. బాగున్నాయి మీ ధ్యానం కబుర్లు :)

    ReplyDelete
  7. good naration. I do keep posponing things to start on tuesday.

    ReplyDelete
  8. చాలా బాగా రాసారండీ. :)

    ReplyDelete
  9. <<< బుజ్జీ టైం ఎనిమిదైంది...ఇక్కడ పడుకున్నావేం?నాకు టైం అయిపొయింది టిఫిన్ బైట చేస్తాలే తలుపేసుకో....అంటూ ....అలా నాధ్యానం ద్వితీయ విఘ్నం కాకుండా పూర్తయింది. >>>
    పై లైన్లు సూపర్! చక్కగా నవ్వించారు. తెల్లవారింటికి హాయిగా ఉంది.
    ఎవరి దగరికైనా వెళ్లి ప్రయత్నించండి. అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు.

    ReplyDelete
  10. mee andari kante nade best naadi


    visnumoorthilaa "yoga nidra "

    haaa haaa haaa .

    bagundi post. :))))))))))

    ReplyDelete
  11. మీ అమ్మని నీవు ఎప్పుడు , ఏ సమయం లో ప్రేమిస్తావ్? అడిగితే ఎవరైనా ఎం చెబుతారు.......?
    దీనికి సమాధానమే ధ్యానం!
    సమయాలు, సంధర్భాలూ, సానుకూలతలు, సంస్కారాలు అన్నీ అవంతకవే సర్దుకుంటాయి, కుదురుకుంటాయి....
    (నేనైతే దేష- కాల- మానాలకి, , సమయాలకీ, సంధర్భాలకీ, సానుకూలతలకీ అతీతంగా . . .సర్వకాల,సర్వావస్థలయందూ ప్రేమిస్తాను ......ధ్యానిస్తాను)

    ReplyDelete
  12. అమ్మా తాయే నమస్తే, బాంచెన్, కాల్మొక్త. నవ్వలేక చస్తున్నా. కొంచెం వార్నింగులు పెట్టండి ఇలాంటివి ప్రచురించేముందు!!

    ReplyDelete
  13. హ హ. ఇవాళ ఇండియాలో వున్న మా కోడలితో ఫోనులో మాట్లాడుతుంటే ఇదే టాపిక్ వచ్చింది. ఇండియా వెళ్ళినప్పుడు ఇద్దరం ఇకనుండీ ధ్యానం/సెల్ఫ్ హిప్నటిజం చెయ్యాలని తీర్మానించుకున్నాం. అలారం పెడితే నొక్కేస్తాను, లేదా బద్దకమేసి లేవను కాబట్టి మా కోడలినే ఆ సమయానికి ఇండియా నుండి మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పాను. ఎప్పటినుండి అలా కాల్ ఇవ్వాలో US వెళ్ళాక చెబుతా అన్నాను. ఇవాళ అడిగింది తను -'మామాజీ మిస్డ్ కాల్ ఇవ్వమని నాకు చెబుతా అన్నారుగా, ఇన్ని రోజులయ్యింది, దాని సంగతే ఎత్తట్లేదు?' అని.
    'రోజూ ఆఫీసుకి వెళ్ళేప్పుడు, వచ్చేటప్పుడూ 40, 40 నిమిషాల చొప్పున రెండు సార్లు ధ్యానం చేస్తూనే వున్నాగా, అందుకే నీకు చెప్పలేదు' అని అన్నాను. పడి పడీ నవ్వింది. నేను ఆ సమయాల్లో ఎంచక్కా బజ్జుంటానని తనకు గుర్తుకు వుంది మరి :(

    ReplyDelete
  14. అసలు మీ మొదటి రోజు ధ్యానం చదివేటప్పుడే నాకు అనుమానం వచ్చేసిన్దండీ "నిద్ర రాదా?" అని.. ఎందుకంటె నేనలా ఒక సారి కూర్చుని ప్రయత్నించి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను మరి.. అన్నట్టు కోపం తగ్గించుకోడానికి బోల్డన్ని పన్లు చేయోచ్చండీ.. కామెడీ సినిమాల డీవీడీలు చూడడం (మెంటల్ కృష్ణ లాంటివి కాదని మనవి), పుస్తకాలు చదవడం, సెల్ఫ్ మోటివేషన్ ఇలాంటివన్న మాట..

    ReplyDelete
  15. ఒక మంచి గురువు దగ్గర కెళ్ళి - ధ్యానం గురించి తెలుసుకోండి - అంతే గాని ఇలా అపహాస్యం చెయ్యకండి - ఏకాగ్రతగా వుండడం ఎలాగో - క్రమం తప్పకుండా అన్ని క్లాసులకి వెళ్ళలి.. మీలాంటి మిడి మిడి జ్నానం వున్న వాళ్ళ దగ్గర కాకుండా ఒక మంచి గురువుని ఎంచుకొండి. -యోగా & ధ్యానం గురించి ఇలా అపహాస్యంగా రాయడం మంచిది కాదు..భగవంతుడి అనుగ్రహం లేనిదే ఇలాంటి విద్యలు రావు.. యోగం వుంటేనే గాని యోగా అబ్బదు.

    ReplyDelete
  16. @ మనసుపలికే ....ఏంటోనండీ..ద్వితీయవిఘ్నం జరక్కుండా చూసుకున్నా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి ప్చ్ :( ధన్యవాదాలు :)

    @ తృష్ణ గారు, కధ చదవలేదండీ ...ఇదంతా నా సొంత బుద్ధిపూర్వకమైన నిర్వాకమే...సారీ నిర్ణయమే :) ధన్యవాదాలు.

    @ నేస్తం గారు, చూశారా మీరుకూడా నన్ను మెచ్చేసుకున్నారు. బంగారుతల్లిని కాబట్టే కదా మీ అందరికీ మార్గాదర్శినయ్యను:) ధన్యవాదాలు.

    @ సాహితిగారు, సేం పించ్ అన్నమాట :) థాంక్స్ !

    @ విజయమోహన్ గారు ధన్యవాదాలండీ!

    @ ప్రసూనగారు , శవాసనంలో ధ్యానం నాకంటే ముందే ట్రై చేసేశారా ....ఐతే క్రెడిట్ మీదే :) ధన్యవాదాలు.

    @ పద్మార్పిత గారు థాంక్స్!

    @ రవిగారు, మీరుకూడానాండీ....టపా నచ్చినందుకు థాంక్సండీ !

    ReplyDelete
  17. @ దివ్యవాణి గారు, థాంక్స్ !

    @ సవ్వడిగారు, నిజమేనండీ మరో మిత్రులు కూడా ఇదే సలహా ఇచ్చారు కామెంట్స్ లో...బైటకు వెళ్ళే టీం లేక ఏదో ప్రయత్నం చేద్దామని మొదలుపెడితే అలా జరిగింది :) ధన్యవాదాలు.

    @ సావిరహే...."యోగనిద్ర"ఇదేదో బావుందండీ...కాని విష్ణుమూర్తిలా నెలల తరబడి ఉండిపోకండెం :) ధన్యవాదాలు.

    @ సత్య గారు, అదృష్టవంతులు మీరు!మీ స్థాయికి రావాలంటే నేను ఓ ఐదారేడేనిమిది సంవత్సరాలు ప్రయత్నించాలేమో..ఏదేమైనా మీరు నిజంగా గ్రేటండీ.ధన్యవాదాలు.

    @ కొత్తపాళీ సర్! ఏంటి సర్ మీరు మరీను :) ధన్యవాదాలండీ :)

    @ శరత్ గారు, నాధ్యానం బాగు ఐతే మీధ్యానం బహుబాగు సుమండీ :) మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    @ మురళిగారు, మీరు ముందే కనిపెట్టేశారా :) మీ సూచనలు నాట్ చేసుకున్నానండీ.ధన్యవాదాలు.

    @ తువ్వాయి...థాంక్స్ !

    ReplyDelete
  18. @ వోలేటిగారు...ముందుగా మీకు బాధకలిగించి ఉంటే క్షమించాలి.మీకు ధ్యానం పట్ల ఉన్న అవగాహన, మక్కువ వల్ల బాధకలిగి ఉంటుంది.ఐనా మీ అభిప్రాయాన్నిఇలా వెలిబుచ్చినందుకు మీకుధన్యవాదాలు.
    నిజానికి నేను రాసినా టపా ధ్యానాన్ని కాని,యోగా ని కాని అపహాస్యం చేయటానికో కాదండీ..మీరన్నారే "భగవంతుడి అనుగ్రహం లేనిదే ఇలాంటి విద్యలు రావు.. యోగం వుంటేనే గాని యోగా అబ్బదు." అని ఆవిషయమే నాకు ఈవిషయంలో ఆయన కృప లేదని మొదలుపెట్టాక అర్ధమైంది. నేను మంచి ఉద్దేశ్యంతో మొదలు పెట్టినా..నా ఆలోచనలు ఎలా సాగాయో మిత్రులతో పంచుకొనే చిన్న ప్రయత్నం అంతేనండీ.
    ఇలా రాయటంవల్ల ఎవరైనా సలహా ,సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా!మీరుకూడా మంచి గురువును వెదుక్కోమని మంచి సలహా ఇచ్చారు.ధన్యవాదాలు.
    చివరిగా ఒక్కవిషయం...నా మిడిమిడి జ్ఞానం గురించి పైన నా పరిచయం లోనే రాసుకున్నాను కాని నేను వెళ్ళిన గురువు జ్ఞానమెంతో తెలుసుకోవడం ఎలాగండీ ?

    ReplyDelete
  19. మీ వూరు తెలియదు.. ఏదైనా సిటీల్లొ అయితే "పిరమిడ్" యోగా సెంటెర్ - పతంజలి యోగా, "బ్రహ్మ కుమారి ఈశ్వరి" వంటి చక్కటి యోగా సెంటెర్స్ ఉన్నాయి. ధ్యానం చేసుకోవాలంటే నియమిత అహారం, ప్రాణాయామం వంటివి చెయ్యాలి.. కొద్దిగా వ్యాయామం వుంటే మంచిది.. ఇవన్నీ ఇలా నెట్ లో చెప్పేవి కావు.. వీటిపై మంచి పుస్తకాలు కూడా వున్నయి.. సరే నాకు తెల్సిన కొన్ని సూత్రాలు చెప్తున్నాను., సుఖాసనం లో నిటారుగా కూర్చోండి.. కళ్ళు మూసుకొని.. ఓంకారాన్ని..జపించండి.. (లేదా) మీకు ఇస్టమైన దేముడి మీద ద్రుష్టి నిలపండి..(ఆ దేముని నామజపం చెస్తూనే)..అలా కొద్ది సేపు అయిన తరువాతా ఆటొమటిక్ గా .. ఆలొచన్లూ తగ్గి.. మనసు ఏకాగ్రత తో నిండి పొతుంది. ఇవన్ని చెప్పకూడని మా గురువుల ఆదేశం.. కాని ..మీతో బాటు కొద్దిమంది యోగా ని చులకనగా చూస్తున్నారు కాబట్టి ఇలా రాస్తున్నను.. తద్వారా నాకు ఏమైనా పర్వలేదు.. ..లేదంటే మీ వూపిరి(శ్వాస) మీదే కాన్సంట్రేట్ చెయ్యండి.. మంచి ఫలితం వుంటుంది. ఓ పావుగంట ధ్యానం కోసం కేటాయించి.. మిగిలిన డిస్త్రబెన్సెస్ లేకుండా జాగ్రత్తపడండి. మీ పన్లు అన్ని అయిన తరువాతే చేసుకొండి.. కాలం ఏప్పుడైనా పర్వాలేదు.. సంధ్యా కాలం అయితే మంచిది. కాఫీ, టీ, మశాలా లు, కొవ్వు పదార్ధాలు క్రమేపి తగ్గించుకుంటే మంచిది..

    ReplyDelete
  20. వోలేటిగారు, నాకు రెండు విషయాలు అర్ధమయ్యాయి.మీరు టపా గాని , మీ కామెంట్ కి నేనురాసిన సమాధానంకాని పూర్తిగా చదవలేదు లేక చదివినా మీకు అర్ధం కాలేదు.అందుకే మళ్ళీ 'చులకన' అనే అంటున్నారు.తర్వాత మాకు మీరుచేప్పినవి ఏవీ అందుబాటులో లేవు.ఏది ఏమైనా టివీల్లోనూ, పుస్తకాల్లోనూ బహిరంగంగా అందరూ చెప్పినవే ఐనా మీకు హానికలుగుతుందని తెలిసినా తెగించి మాకు సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  21. పరిమళం గారు :)
    మీ సహనానికి నా జేజే లు

    ReplyDelete
  22. @ శ్రీనివాస్ గారు :) :)

    ReplyDelete
  23. పరిమళ గార్కి
    నా అజ్ఞానాన్ని మన్నించండి.. చాలా బ్లాగుల్లో మంచి మంచి విషయాలు, తెలియని విషయాలు రాస్తుంటే, మీ "నా ధ్యానం" అనే కాలమ్ కూడా అలాటిదే అనుకుని పొరబాటు బడ్డాను. మీ కామెడీ కి "ధ్యానాన్ని" వాడుకున్నందుకు.. తద్వారా "మిత్రులారా ధ్యానాన్ని చెయ్యండి..కోపాన్ని పోగొట్టుకోండి" అని చివరగా చక్కగా సలహా ఇచ్చినా.. మీ అనుభావాల్ని నవ్వుకొనే స్థితిలో నేను లేనందుకు మనస్పూర్తిగా క్షమించండి..కాని ఒక్క విషయం : ధ్యాన మార్గం ద్వారా భగవంతుని చేరడం ఎలాగో సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడే "భగవద్గీత" లో చక్కగా వివరించాడు..ఈ రోజున మనం కడుపుబ్బా నవ్వుకోడాన్కి ధ్యానాన్ని వాడుకున్నందుకు ..ధన్యవాదాలు

    ReplyDelete
  24. @ వోలేటిగారు, మీరు క్షమాపణ చెప్పడం ఎందుకండీ ?నేనే మీకు ధ్యన్యవాదాలు చెప్పాలి ఇంత వివరంగా కామెంట్స్ రాస్తున్నందుకు.బ్లాగులు కేవలం తెలియని విషయాలుతెలుసుకోవడానికే అని నాకు తెలీదండీ...చాలా బ్లాగులుచదివినప్పుడు వారి జ్ఞాపకాలు , అనుభూతులు, మరికొన్ని అనుభవాలు పంచుకుంటూ ఉంటే నేనుకూడా అందుకే బ్లాగ్ ధైర్యంగా మొదలుపెట్టాను. బ్లాగింగ్ చెయ్యాలంటే తెలియని విషయాలే రాయాలని అనుకోలేదుపైగా నాకు తెలియనివి మరొకరికి తెలిసినవే అయివుండొచ్చు.ఏది ఏమైనా ఇంత ఓర్పుగా నాకు కామెంట్ రాస్తున్నారంటే మీకు ధ్యానం వల్లే అది సాధ్యమై ఉంటుంది.కాని మీరన్నట్టు ధ్యానంతో భగవత్ సాక్షాత్కారం పొందిన వారిని నేను చూసి ఉండలేదండీఅదీ ఈకాలంలో ....
    మీరోక్కవిషయం గ్రహించండి దయచేసి...నేను మామూలు గృహిణిని,బాధ్యతలు,బాదరబందీల మధ్య రిలీఫ్ కోసం బ్లాగింగ్ చేసుకుంటున్నాను.బ్లాగు ద్వారా సకల మానవాళికి సందేశం ఇచ్చేంత శక్తి , ఆసక్తి నాకు లేవండి.ధన్యవాదాలు

    ReplyDelete
  25. hahaha! baagu! baagu! baagaa raasaaru.

    ReplyDelete
  26. ఇంతకీ అసలు ధ్యానం మొదలు పెట్టారా లేదా ? చేస్తూ వుంటే అదే వచ్చేస్తుంది లెండి . ( నిద్ర ) :)

    ReplyDelete