Sunday, September 27, 2015

అంతటా నేనే !


నేను రాసే లేఖలు మోసుకొచ్చేది కాలమే 
సూర్యుడు చంద్రుడు తపాలా బంట్రోతులు 
నీ చుట్టూ నిండిన  చీకటి వెలుగులు.. అవి.... 
నా ఆనవాళ్ళు....  నా పలకరింతల నకళ్ళు 
రాత్రి కురిసే వెన్నెలంతా  నా కలవరింతే 
అమావాస్య రోజు  నక్షత్రాలు నా అక్షరాలే 
వర్షపు రాత్రి చినుకులన్నీ నా కన్నీటి చుక్కలే 
సాయంసంధ్యలన్నీ నా ఎదురు చూపులే 
నానుంచి దాక్కోవాలంటే నువ్వు......  
చీకటి వెలుగులు లేని చోటు వెతుక్కోవాలి 
దొరుకుతుందా మరి ఆ చోటు నీకు?

Thursday, July 2, 2015

సుదీర్ఘ నిరీక్షణ


మనసులో సంతోషం పెదవులపై చిర్నవ్వైతే
ఆనంద బాష్పం కంటి చివర మెరుస్తుంది 
కాని గుండెల్లో బాధ కళ్ళల్లో పొంగితే 
కన్నీరు వరదై ముంచేస్తుంది 
నీ తొలివలపు నేనేమో...... కాని 
నా తుది తలపు నీవే 
నా నీడ కూడా నన్ను విడిచి వెళ్ళిన వేళ 
నిశ్శబ్దానికీవల సడి చేయక రోదిస్తున్నా 
ఈ సుదీర్ఘ నిరీక్షణలో అలసి సొలసి 
తుదకు రాలిపోతానేమోని  భయమేస్తుంది 

Wednesday, June 17, 2015

ఎందుకిలా?


ఒకప్పుడు 
నువ్వు నాతో ఉన్నప్పుడు .... ఎప్పుడూ
నాపై ప్రేముందా నీకు అని..ఎంతుందో అని 

కొలమానాలతో ఉక్కిరిబిక్కిరౌతూ సంధిగ్ధత!
ఇప్పుడు
నువ్వు నాతో లేనప్పుడు.... ఎప్పుడూ 
గుర్తున్నానా నీకు అని..తలుస్తావా నన్నుఅని  
మనసును బలహీన పరుస్తూ సందేహం
ఎల్లప్పుడూ..... 
నా కనురెప్పల క్రింద నీ రూపం కరిగి
జారిపోతూంటే ఎదలో పొదువుకుంటున్నా
అపురూపంగా ఈ అశ్రువు సాక్షిగా.... 

Thursday, June 4, 2015

ఒంటరిని....


నేను ఒంటరినయినపుడు 
నా నీడవై నా వెంటే వున్నావు 
ఇప్పుడు నువ్వే నన్నొదిలి వెళ్ళావ్ 
నిన్నెంత కోల్పోయానో నీకెలా చెప్పను 
లిపిలేని భాషను ఎలా చూపను  
మౌనమే భాష్యమైతే ఎలా చెప్పను 
అది... చుస్తే.... 
నీ కంటిపాపలోనే  కనిపిస్తుంది 
వినాలంటే.... 
అది నీగుండె సవ్వడిలో వినిపిస్తుంది

Wednesday, May 27, 2015

వీడుకోలు....


సెలవా మరి అంటున్న నీ కళ్ళనుండి 
నా కళ్ళను విడదీయటానికి 
వెళ్ళనా మరి అంటున్న నీచేతి స్పర్శనుండి 
నాచేతిని విడిపించడానికి 
నా మనసు పడిన మూగవేదన
నీవు తెలుసుకోక నేను తెలుపలేక 
వీడ్కోలు చెప్పటానికి మొరాయిస్తున్న 
నా మనసును సముదాయించలేక 
ఆ క్షణమే మరణించాను.

Sunday, May 17, 2015

శూన్యం!


కరిగి పోయిన కలేమో మన
పరిచయం అనుకుందామంటే ... 
నీ జ్ఞాపకాల ఊటను కన్నుల్లో 
నింపుతున్న గతం నన్ను 
నీడలా వెంటాడుతోంది....  
కట్టెను వదిలి ప్రాణం పయనమై పోతుంటే 
కళ్ళప్పగించి చూస్తూండి పోయిన క్షణం!
బాధ్యతల ఉక్కు సంకెళ్ళ మధ్య 
బందీనై నిలుచుండి పోయాను
నేస్తం! 
ఇన్నేళ్ళ మన సావాసంలో 
ఎన్నో విలువైన కానుకలిచ్చావు 
అవన్నీ నాతోనే వున్నాయి 
నువ్వు మాత్రం నన్ను విడిచి 
దూరపుకొండల వైపు సాగిపోయావు 
నువ్విచ్చిన చివరి కానుకేమో ఈ శూన్యం! 
బహుశా అదే తోడుగా వుంటుంది 
నా ఈ ఏకాంత వాసంలో.... 

Sunday, May 10, 2015

Tears are the words the heart can't say.


పెద్ద పెద్ద కళ్ళనిచ్చిన దేవుడు
ఛత్రాలవంటి రెప్పలనిచ్చివుంటే
రెప్పల మాటున స్వప్నం
కరిగి జారుతున్న వేళ
కంటిచివరి నీటి చుక్కని
రెప్పవాల్చి దాచుకునేదాన్ని
ముఖం దాచుకొనేందుకు
నీ గుండె వెదుక్కొనే
అవసరం ఉండేదికాదు!