Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలతో.....


చైత్రమింకా బొట్టిపెట్టి పిలిచిందో లేదో ...
తనుమాత్రం కుహూ మంటూ వచ్చేసింది
కోయిలమ్మ !
వసంతలక్ష్మికి స్వాగత గీతిక పాడుతూ ...
దారికిరువైపులా ఎర్రగా ...
విరగబూసిన మోదుగ పూలు
రాబోయే రోజుల్లో భానుని ప్రతాపానికి
చిహ్నాల్లా కనిపిస్తున్నాయ్
పిల్లల పరీక్షల కష్టాన్ని రాబోయే
సెలవులు మరిపించినట్టు ...
పగటి వేసవి తాపాన్ని
సాయంత్రం మల్లెలు మరిపిస్తున్నాయ్
వేపపూత సౌరభాన్ని మోసుకొస్తున్న
చిరుగాలులు రాత్రిళ్ళని ...
పరిమళభరితం చేస్తున్నాయ్
కొత్త చివుళ్ళు తొడిగిన చెట్లూ ..
విరగబూసిన మల్లె పొదలూ ...
మధుమాసాన్ని మధురంగా
మార్చేస్తున్నాయ్ !
ఆరు ఋతువుల్లోనూ వసంతాన్ని
మహారాణిని చేస్తున్నాయ్!
మరి మనం కూడా ఆరు రుచుల ఉగాదిని
ఆహ్లాదభరితంగా జరుపుకుందామా
ఉగాది శుభాకాంక్షలతో.....మీ పరిమళం.

Sunday, March 18, 2012

అబ్బాయిల్ని పొగడాలంటే ......?


శిశిరంలోంచి వసంతంలోకి వచ్చేశాం ...నేనూ బాధ్యతల సుడిగుండంలోనుంచి ఒడ్డున పడిపోయా .రావటం రావటమే సందేహాన్ని వెంటబెట్టుకు వచ్చానని అనుకుంటున్నారా :) ఇది నాకు చాలా ఏళ్ళ నుండీ బుర్ర తొలుస్తున్న సందేహమే !
అమ్మాయిల్ని బుట్టలో వేయడానికి అతి సులువైన దారి పొగడ్తే అని చాలా మంది అదే ఫాలో అయిపోవడం చూశాను. అదిగో సరిగ్గా అప్పుడే నాకు ఈ సందేహం పుట్టుకొచ్చింది. అమ్మాయిల్ని పొగడాలంటే ...
* చిలిపితనం జాలువారే నీ సోగ కళ్ళని చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు (లోపల... ఆఫీస్ అయ్యాక ఉన్న కాస్త టైమూ నిన్ను పొగడడానికే సరిపోతుంది ఖర్మ) ఎన్ని గంటలైనా నీ కళ్ళల్లోకి చూస్తూ గడిపేయగలను.
* నువ్వు ఫక్కున నవ్వితే గుప్పెడు మల్లెలు జల జలా రాలినట్టు ఉంటుందనుకో (లోపల ....ఈమె టూత్ పేస్ట్ ఏంటో బ్రాండ్ మారిస్తే బావుండు హు ..అనుకున్నాసరే)
* మొన్న నువ్వు మాఇంటి కొచ్చి వెళ్ళినప్పటి నుంచీ మా పెంపుడు పిల్లి కొత్తగా నడుస్తోంది బహుశా నీ నడక చూసే అనుకుంటా (లోపల...దాని కాలికేదో గుచ్చుకున్నట్టుంది)
* అరె వసంతం రాక ముందే కోయిల కూస్తుందేవిటి అనుకుంటున్నా మీరు హలో అన్నారా (లోపల....వాయిస్ విని మోసపోవడం లేదుకదా)
ఇంకా ఇలాగే నీ ముక్కు చూసి సంపెంగలు సిగ్గు పడుతున్నాయ్ , నిన్ను చూసే నెమళ్లు హొయలు నేర్చాయ్ , నీ పలుకులు విని రాచిలకలు మూగపోయాయ్ వగైరా వగైరా .....చాలా ఉన్నాయి కాని అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా పొగుడుతారో ఏం చెప్తే వాళ్ళు ఫ్లాట్ అవుతారో...అవుతున్నారో .... నా మట్టి బుర్రకి తెలియలేదు ఒకవేళ 100% లవ్ సినిమాలో లాగా యు ఆర్ ది గ్రేట్ అంటూ ఉండాలా ? మీకెవరికైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్ ....