Sunday, December 30, 2012

కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!

ముగిసిపోయే కధనుకాను
రగులుతున్న వ్యధను నేను
చనిపోలేదు నేను......
మీ కొవ్వొత్తుల వెలుగులో జీవించే ఉన్నాను
అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
నా మరణం కూడా ధన్యం!
నా మరణానికి కారణమైన కామాంధుల
తలలు తక్షణం తీసి కోటగుమ్మానికి  వ్రేలాడగట్టమని
ఆజ్ఞాపించే రాజే లేడా ఈ లోకంలో
రాచరికానికి సెలవిచ్చేసి, ప్రజలే ప్రభువులన్న
ప్రజాస్వామ్యంలో నా మరణానికి సమాధానం
కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న
ఏ ప్రభువు నడగాలి ?
మరోసారి ఆడపిల్ల పై చేయి వేయాలంటే ఒణుకు పుట్టేలా
ఏ ప్రభువు శిక్షవేస్తాడు ఆ దుర్మార్గులకు?
ఎంతకాలానికి ?
 కన్నీళ్ళతోనో, కొవ్వొత్తులతోనో కాదు నాకు నివాళి
యత్రనార్యస్తు పూజ్యంతే అని పుస్తకాలకే పరిమితం చేయకండి
ప్రాధమిక విద్యనుండే పిల్లలకు బోధించండి
 మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దండి
స్త్రీలను పూజించక్కర్లేదు 
వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి
భయం నీడన బ్రతుకు వెళ్ళదీయకుండా 
కొంచెం ధైర్యంగా నడిచేలా రక్షణ కల్పించండి
హింసకు గురైన వారిపట్ల  కాస్త సానుభూతి చూపించండి
చులకనగా మాట్లాడి మా ఆత్మలకు కూడా
శాంతి లేకుండా చేయకండి 
ఇదే నాకు, నాలాంటి ఎందరో అభాగినులకు
నిజమైన నివాళి!!

** నేనుసైతం అంటూ  ఓ టపా రాసి చేతులు దులిపేసుకోవటం తప్ప ఏమీ చేయలేని నానిస్సహాయతకు బాధపడుతూ నిర్భయకు అశ్రునివాళి! రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!