Thursday, December 31, 2009

వీడ్కోలు - ఆహ్వానం


ఏ వత్సరం గడిచినా ఏమున్నది గర్వకారణం ?
సామాన్యుని జీవనం సమస్తం అస్తవ్యస్తం !
కాలుష్యపు కోరలు , విద్యుత్ కోతలు ....
ప్రజల ఇబ్బందులు !
ప్రకృతి విపత్తులు ,ఘోర ప్రమాదాలు
నేతన్నల ,రైతన్నల కష్టాలు ,కన్నీళ్లు !
ఆర్ధిక మాంద్యం , ఐటీ సంక్షోభం ....
ఉద్యోగుల కలవరం !
నింగినంటిన నిత్యావసరవస్తుధరలు....
మధ్యతరగతి వెతలు !
ఉగ్రవాదపు పడగనీడలో బిక్కు బిక్కుమంటూ
భద్రత లేని బ్రతుకులు !
విద్వేషాల ,విభజనల హోరులో
దగ్ధమైన "మన " రైళ్ళూ , బస్సులూ ..
ఉద్వేగాల , ఉద్యమాల పోరులో
బలౌతున్న "మన " పిల్లల భవిష్యత్తు...
తిరోగమిస్తున్న "మన " పురోభివృద్ధి !
ఇన్ని చేదు అనుభవాలు మిగిల్చిన
ఈ సంవత్సరానికి చెబుతున్నా
వీడ్కోలు .....ఆవేదనతో ....



చీకటి వెంటే వెలుగు
వైఫల్యం వెనుకే విజయం
ఆ ఆశతోనే ఆహ్వానిస్తున్నా
నూతన సంవత్సరాన్ని !
సర్వేజనాః సుఖినోభవంతు అని ప్రార్ధిస్తూ ....

** బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

Saturday, December 26, 2009

నీ కానుక !


అమ్మ జన్మనిచ్చింది
నాన్న సంస్కారమిచ్చారు
సెలయేరు మాటలు నేర్పింది
కోయిలమ్మ పాట నేర్పింది
చిలకమ్మ చెలిమి చేసింది
జాబిల్లి వెన్నెలనిచ్చింది
సంపెంగ సొగసు పంచింది
మల్లె పరిమళమద్దింది
నింగి ఆత్మవిశ్వాసం పెంచింది
నేల సహనాన్ని నింపింది
వెలుగు మార్గాన్ని చూపింది
చీకటి కష్టాన్ని తెలిపింది
దైవం ఎల్లవేళలా తోడు నిలిచింది
అన్నీ నావద్దే ఉన్నాయి ....
నువ్వేమివ్వగలవని గర్వపడ్డా!!
కాని ...
నువ్విచ్చావు ...కానుకగా ....
నీ మనసు మాత్రమే కాదు
నా పెదవులపై చెరగని ...
చిరునవ్వు కూడా !

Thursday, December 17, 2009

శాపమేమో ...ఇది!


నా బాల్యం ఎంత అందమైనదీ !
నా జ్ఞాపకాలన్నీ మధురమైనవే
అంతలోనే ....
ఎవరెక్కువ రాణీలని పట్టుకున్నామో
అని పందెంకట్టి బుట్ట కింద పెట్టిన
నీలి తూనీగలు శపించాయో ..
నేనే మహరాణినంటూ
నేస్తాలు పరిచిన పూలదారిలో
నే తొక్కిన పూరెక్కలు శపించాయో ..
విశాలంగా విచ్చుకొని
ప్రపంచాన్ని చూస్తున్న తమని
ముట్టుకొని ముకుళింప చేశానని
టచ్ మీ నాట్ శపించిందో .....
నేనూ , నా స్నేహితులూ దూరమయ్యాం !
మళ్ళీ ఇన్నాళ్ళకు అదే ఫ్లాట్ ఫాం మీద
రైలు ఆగినపుడు నా గుండె వేగం పెరిగింది
అది ఏసి అద్దాల చెమ్మో....లేక
నా జ్ఞాపకాల చెమరింత...
గుండె దాటి కంటిచివర చేరిందో
తెలీదు .....కాని ...
స్టేషన్ మాత్రం మసక మసగ్గా
దాటిపోయింది !!

Monday, November 30, 2009

నాన్న చెప్పిన ఓ సంఘటన!


అవి 1962 వ సంవత్సరం నాన్నగారు రైల్వే లో అప్రెంటీస్ గా కోయంబత్తూర్ లో పనిచేస్తున్న రోజులు .అప్పటికే నాన్నగారికి పెళ్లయింది.ఏవో నాలుగు రోజులు సెలవులోస్తే కోయంబత్తూర్ నుండి ఊరికి వచ్చారు . సెలవులు పూర్తయి తిరుగు ప్రయాణం.

ఆరోజు 30 వతేదీ ....ఆ మర్నాడు జీతాలిస్తారు .( అప్పట్లో నాన్నగారికి స్టేఫండ్ ఎనభైఐదు రూపాయలట ! ) ట్రైనుకి టికెట్ అవసరం లేదు పాస్ ఉంటుంది . కాబట్టి డబ్బులు పెద్దగా పనేముందీ అనుకొని ఓ పదిరూపాయల కాగితం జేబులో వేసుకొని భోజనం చేసేసి సాయంత్రం నాలుగ్గంటలకు రాజమండ్రి లో మద్రాసు మెయిల్ ఎక్కారు.కోయంబత్తూర్ వెళ్ళాలంటే మద్రాసులో దిగి ట్రైన్ మారి వెళ్ళాలి .సరే ఉదయం ఆరుగంటలకి మద్రాస్ లో దిగితే తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తిరిగి కోయంబత్తూర్ వెళ్ళే కొచ్చిన్ ఎక్స్ ప్రెస్.అప్పట్లో భోజనం ముప్ఫైమూడు పైసలట ! మద్రాస్ లోనే టిఫిన్ ,భోజనం చేసి బండి ఎక్కేవారట !

రాజమండ్రిలో బండి ఎక్కి పై సీటుమీద దుప్పటి పరుచుకొని సెటిలైపోయి కూర్చున్నాక ..ఎదురుగా ఉన్న సీటుమీద కూడా ఓ వ్యక్తి టవల్ లాంటిది పరుచుకొని కూర్చోవడం గమనించి పలకరించారు .అతను కూడా మద్రాస్ వెళుతున్నట్టు చెప్పాడు .ఎనిమిది గంటలయ్యేసరికి ట్రైను విజయవాడ చేరుకుంది అక్కడ ఎక్కువసేపు హాల్ట్ !విజయవాడ స్టేషన్ లో
ఎద్దు ముఖంఆకారంతో వంపున్న ఎర్రమట్టి కూజాలు అమ్మేవారట ! నాన్నగారి పై అధికారి ఒకరు నాన్నగారిని వీలయితే ఆ కూజా ఒకటి తెచ్చిపెట్టమని అడిగారట ! విజయవాడ రాగానే నాన్నగారి ఎదురుసీటులో ఆయన
కిందికి వెళ్ళబోతూ ఉంటే నాన్నగారు అతన్నిఆపి మీరెలాగూ దిగుతున్నారు కదాఒకకూజా తెచ్చిపెట్టమని అడిగారు .కూజా రెండున్నర ! చిల్లరలేక పదిరూపాయల నోటు ఇచ్చారు అంతే దిగి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు .అతనికి లగేజ్ కూడా ఏమీలేదని అప్పుడు గమనించారట నాన్నగారు !సాటిమనిషిని మీద నమ్మకం పోయిన క్షణాలవి !

మద్రాస్ స్టేషన్లో బండి దిగి ఫ్లాట్ ఫాం మీద మొహం కడుక్కొని ఒక బెంచిమీద కూర్చున్నారు .టిఫిన్ మాట అటుంచి టీ తాగుదామన్నా జేబులో నయాపైసా లేదు .నిన్న మధ్యాహ్నం అనగా తిన్న భోజనమే .కడుపులో ఆకలి ..సూర్యుడు పైకొచ్చినకొద్దీ నీరసం ..నిస్సత్తువా ఆవరించేసి కళ్లు తిరుగుతున్నట్టు అనిపించి అలాగే బల్లమీదజారబడి కళ్లు మూసుకున్నారు నాన్నగారు !

ఎంతసేపట్నించి నాన్నగార్ని గమనిస్తున్నాడో ఒక పెద్దాయన దగ్గరికివచ్చి తెలుగువాడిలా ఉన్నావ్ నీపెరేంటి బాబూ అని పలకరించాడు.నాన్నగారు చెప్పాక ...ఏంటి నీరసంగా కనిపిస్తున్నావ్ ఒంట్లో బాగానే ఉందా ..భోజనం చేశావా అని అడిగారు .నాన్నగారు మొహమాటం కొద్దీ చేశానండీ ..అని సమాధానం చెప్పారు కానీ ఆయన నాయనా ! పెద్ద కుటుంబం నుండి వచ్చినట్టున్నావ్ ఏం జరిగిందో నాకు తెలీదు నేను చాలాసేపట్నించి చూస్తూనే ఉన్నాను నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చున్నావ్ ఏం జరిగిందో చెప్పు అని అడిగారు . అప్పుడు నాన్నగారు జరిగింది చెప్పగానే ఆయన పదిరూపాయల కాగితం తీసిచ్చి ముందు నువ్వు భోజనం చేసిరా తర్వాత మాట్లాడదాం అన్నారు .కాని నాన్నగారికి అభిమానం అడ్డొచ్చి తీసుకోలేకపోతే నీ తండ్రిలాంటివాడిని తీసుకోకపోతే నా మనసు బాధపడుతుంది అని ఒప్పించి పంపించారు .తిరిగి వచ్చాక మిగిలిన చిల్లర కూడా ఏదైనా అవసరం పడొచ్చు ఉండనీ అన్నారట !ఆ తర్వాత మాటల్లో నాన్నగారు ఆయన అడ్రస్ తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు .

ఆయన పేరు సిఖిలే వెంకన్న గారు , ఆయనది అమలాపురం . నాన్నగారు కోయంబత్తూర్ వెళ్ళిన వెంటనే జీతం తీసుకొని చేసిన మొదటి పని ఆయన ఇచ్చిన పదిరూపాయలతోపాటూ మరో పది కలిపి , మాటల సందర్భంలో ఆయన క్రిస్టియన్ అని తెలుసుకొని ఒక సిలువ బొమ్మ కొని మనియార్డర్ తోపాటు పార్సిల్ చేశారట !

దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రిందటి సంగతి నాన్నగారు ఇప్పటికీ ఆయన్ని , ఆయన చేసిన సహాయాన్నీ మర్చిపోకుండా గుర్తుచేసుకుంటారు . ఒక మనిషి తప్పు చేసినంత మాత్రాన అందరు మనుషులపై నమ్మకం పోగొట్టుకోవద్దని భగవంతుడు నాకు వెంటనే తెలియచేశాడని చెప్తూ ఉంటారు . అలాగే ఎవరైనా చేసిన మేలును జీవితాంతం మర్చిపోకూడదని నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు .

ఆరోజు నాన్నగారికి సహాయం చేసి ఆకలి తీర్చిన భగవత్స్వరూపులు సిఖిలే వెంకన్నగారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలీదు అయినా ఆయనకు నా కృతజ్ఞతాభివందనం ! భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా !

Tuesday, November 24, 2009

వెదుకుతున్నా ఇంకా ....


మోయలేని బాధ్యతగా ....
నువ్వొదిలిన వర్తమానంలో
పగిలిన నా హృదయాన్ని
అతికించుకోలేని నా అసహాయతనీ
వ్యక్తపరచలేని నా ఆవేదననీ
చెలమలౌతున్న నా కళ్ళనీ
దాచుకొని...తిరిగిరాని గతంలోని
ప్రతి మధురస్మృతినీ పదిలంగా మోస్తూ
గతించిన జ్ఞాపకాల చితిమంటల్లో
వెదుకుతున్నా ఇంకా ....మన ప్రేమని !!

Tuesday, November 17, 2009

సోమయ్య ....కాదు సోమరాజుగారు !


నా గోరింట పూసింది...అరచేత ! టపా చదివిన మిత్రులకు సోమయ్య పరిచయమే ...సోమయ్య ...నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మమ్మగారింటి పాలేరు ...బహుశా తన చిన్నప్పట్నుంచే మాదగ్గరే పనిచేసేవాడనుకుంటా ..వాళ్ల నాన్న కూడా తాతగారి దగ్గర పొలాలు చూసుకోనేవాడనుకుంటా ! అమ్మమ్మగారింటికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా ...నన్నెంతో గారాబం చేసేవాడు ...గోరింటాకు , చెరుకుగడలు ,కందికాయలు ...ఇలా ఏదడిగితే అది తెచ్చి తిను బుజ్జమ్మా ..మీ టౌనోల్లకి ఇయన్నీ దొరకవుకదా అంటూ ఎంతో ఆప్యాయంగా చూసేవాడు .

ఇక వేసవి సెలవుల్లోనే అమ్మమ్మగారి ఊరిలో ప్రతి ఏటాగౌరమ్మ సంబరం జరుగుతుంది . అది కూలీలంతా కలిసి కట్టుకున్న గుడన్న మాట ! చందాలు పోగేసి చాలా బాగా జాతర జరిపేవారు. ఇక ఊరేగింపులో గరగలు , గారడీ వాళ్లు , బ్యాండు పార్టీలూ , కోయ డాన్సులూ , పౌరాణిక ,సాంఘిక వేషధారణలు ...రాత్రి సందకాడ మొదలైన ఊరేగింపు తెల్లరేవరకూ జరిగేది .ఇంతకూ విశేషమేవిటంటే ...ఈ వేషాలు వేసుకున్నోళ్ళంతా మా కళ్ళముందు తిరిగే చాకలి వీరయ్యా, టైలర్ సత్తిబాబు , ఇంకా మా సోమయ్యా ...మొదలైన వారన్న మాట !

ఇక ఊరేగింపులో చివరగా వేషాల బళ్ళు మొదలవగానే మొదలయ్యేది మా సెర్చింగ్ . ఎవరు ఏ వేషం వేశారా అని ! ముఖ్యంగా మా సోమయ్య కోసం ! రాముడి వేషం వేసుకొని విల్లు బాణాలతో , పక్కనే సీతా లక్ష్మణులతో కదలకుండా నిలబడి ఉండేవాడు. మా ఇంటిదగ్గర బండి ఆగగానే సోమయ్యా సోమయ్యా అంటూ అరిచి గోల చేసేవాళ్ళం ( పిన్నిల పిల్లల తో కలిసి చిన్నగాంగ్ అయ్యేదిలెండి ) కళ్లు మాత్రం తిప్పి చిరునవ్వులు చిందిన్చేవాడు కానీ అంగుళం కూడా కదిలేవాడు కాదు...మేం కాగితాలు విసిరి , మాతమ్ముడైతే చిన్న చిన్న రాళ్ళు కూడా విసిరి అమ్మమ్మ చేత చివాట్లు తినేవాడు.అయినా సోమయ్యని మాత్రం కదిలించలేక పోయేవాళ్ళం .అలా మా ఇల్లు దాటేవరకూ నరకం చూపించేవాళ్ళం .

అలా మేం పెద్దై పోయాం ...అమ్మమ్మ ,తాతగారు కాలం చేశారు ...పొలాలు కౌలుకిచ్చేసే వారనుకుంటా ! ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యాక ...అమ్మకి తాతగారిల్లు రావటం వల్ల అక్కడే సెటిలయ్యారు . అప్పట్నుంచీ మళ్ళీ సోమయ్య విశేషాలు తెలుస్తున్నాయి . మా పొలాలే కౌలుకు చేసుకుంటూ ...సొంతంగా పశువులను కొనుక్కుని పాడి చేసుకుంటూ
చక్కగా పైకొచ్చాడు .ఇప్పటికీ ఏ పనికైనా మాకు సాయం వస్తుంటాడు .

ఆ మధ్య ఊరెళ్ళినప్పుడు వీరభద్రుని బోణం రోజు వంటచేస్తూ కనపడ్డాడు సోమయ్య ! నేను ఆశ్చర్యంగా ఏంటి సోమయ్యా !అంటే నాన్నగారు చెప్పారు మనకి సోమయ్య గాని ఇప్పుడందరికీ సోమరాజుగారమ్మా ....అని ! చిన్నగా ఓ వంట మాస్టర్ దగ్గర అసిస్టెన్స్ చేస్తూ తనూ నేర్చుకొని పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు దాదాపు ఐదారు వందల మందికి వంట చేయగల మాస్టర్ ఐపోయాడు సోమయ్య ..కాదు కాదు సోమరాజుగారు !పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే సోమరాజుగారి సెల్ కి విశ్రాంతే ఉండదు . అన్నట్టు మన సోమరాజు గారికి భక్తి కూడా ఎక్కువేనండోయ్ ప్రతి ఏటా భవానీ మాల వేసుకుంటాడు .అభివృద్ది పట్నాలకి వలస వచ్చేస్తేనే కాదు కృషి , పట్టుదలా ఉంటే ఎక్కడున్నా వృద్ధిలోకి రావచ్చని మా సోమయ్యని చూసి నేర్చుకోవచ్చు .

ఈమధ్య ఊరెళ్ళినపుడు ...నాటుకోడిని కోసి మాంసం తెచ్చి ....అయ్యో పెంచుకునే కోడిని కోసేసేవా అని బాధపడితే ..మీరెప్పుడూ బాయిలర్ మాసమే తింటారు బుజ్జమ్మా ..మేం అస్సలు తినం కావలసినప్పుడు ఓ కోడిని కోసుకుంటాం (వాళ్ళింట్లో పెంచిన కోళ్ళని , కోడిగ్రుడ్లనీ అస్సలు అమ్మడట ! వాళ్లింట్లోకే పెంచుతాడట !) అంటూ అమ్మా ...ఉల్లిపాయలిలా పడేయ్ , కూర వండేసి వెళ్తాను అంటూంటే ఎన్నేళ్ళైనా తరగని ఆప్యాయతకు కళ్లు తడిసాయ్ !

** పై ఫోటోలో సోమయ్యని వెతక్కండెం....తన ఫోటో లేక గూగుల్ లోది పెట్టా ...

Friday, November 13, 2009

గండుతుమ్మెదవు!!


నేస్తం ??
నువ్వేం
చేసినా నేను నిన్ను ద్వేషించలేను
నేనేం చేసినా నువ్వు నన్ను ప్రేమించలేవు
పువ్వుపువ్వునీ పలకరించు గండుతుమ్మెదవు నీవు
రేయంతా నీకై వేచి వేచి ......
అలసి రాలిన పారిజాతాన్ని నేను! Add Imageపువ్వు పువ్వునీ తట్టే నీకు
పారిజాతం విలువేం తెలుసు ?
మకరందపు రుచులు తప్ప
పూల పరిమళమెందుకు నీకు?
నువ్వు నిర్లక్ష్యంతో ఎగిరెళ్లిపోతేనేం
దైవసన్నిధిలో నాచోటు పదిలం !


Wednesday, November 11, 2009

దివ్యగుణములు


మానవునికి కావలసిన దివ్యగుణములు పదహారు అని పెద్దలు చెప్తారు అవి .....
1. పరమాత్మునియందు సంపూర్ణ విశ్వాసం
2. ఆత్మలో దృఢత
3. ఆలోచనలో పరిపక్వత
4. మనస్సులో సంతుష్టత
5. బుద్ధిలో దివ్యత
6. సంస్కారములో శ్రేష్టత
7. దృష్టిలో పవిత్రత
8. మాటలో మధురత
9. కర్మలలో కుశలత
10. సేవలో నమ్రత
11. వ్యవహారములో సరళత
12. స్నేహములో ఆత్మీయత
13. ఆహారములో సాత్వికత
14. జీవితంలో సత్యత
15. వ్యక్తిత్వంలో రమణీయత
16. నిద్రలో నిశ్చింతత

పై పదహారు దివ్యగుణములు ప్రతి ఒక్కరూ వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి .
ఎక్కడో చదివినప్పుడు రాసిపెట్టుకున్నవి మీతో పంచుకోవాలని ఈ టపా !

Monday, November 9, 2009

వార్షికోత్సవ శుభవేళ .....


అనుకున్నామని జరగవు అన్నీ ....అనుకోలేదని ఆగవుకొన్ని ....జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషిపని ....అన్నారో మహాకవి ! ఇదెంత నిజం ! బ్లాగ్ అంటే తెలియనితనం నుండి బ్లాగ్ వార్షికోత్సవాన్ని ఉత్సాహంగా మీతో పంచుకోవడం ...పై మాటలు అక్షరసత్యాలని నిరూపించటం లేదూ !

ఒకానొక రోజు ఈనాడు పేపర్ చూస్తుండగా ...e బ్లాగుల గురించి చదవటం ...వాటిలో భావుకత్వంతో నిండిన రాధిక గారి బ్లాగ్ గురించి చదివి సంబరపడిపోతున్న నన్ను చూసి నాస్నేహితుడు మీరు మాత్రం ఎందుకు బ్లాగ్ మొదలుపెట్టకూడదు అంటూ ప్రోత్సహించి కంప్యుటర్ మెట్లైనా తాకని నాచేత బ్లాగ్ మొదలు పెట్టించి తానే నా బ్లాగ్ కు నామకరణం చేసి ఇంతమంది మిత్రుల పరిచయానికి కారణమైన వాడికి మీ సమక్షంలో కృతఙ్ఞతలు తెలుపుకోవడం నా కనీస ధర్మం !

నేను బ్లాగ్ ఓపెన్ చేసింది నవంబర్ ఎనిదవ తేదీన అయినా మొదటి టపా రాసింది మాత్రం ఈరోజే !నెమలికన్ను మురళిగారి ఫిర్యాదు నిజం చేద్దామని కాదుకాని ...కుటుంబ బాధ్యతల వల్ల అప్పుడప్పుడూ బ్లాగ్ కి కొద్దిరోజులు దూరమవ్వాల్సి వచ్చేమాట వాస్తవం ! ఐతే మొదట భార్యగా ,కూతురిగా , తల్లిగా ....నా బాధ్యతల తర్వాతే కదా నా బ్లాగ్ ! దీనికి మీ అందరి సపోర్ట్ నాకే కదూ !

అన్నట్టు ఈ మధ్య టపా లేటవడానికి ఓ మంచి కారణం ఉందండోయ్ ! అనుకోకుండా ఫ్లాట్ తీసుకోవడం ...తర్వాత మంచి లేదన్నారని గృహప్రవేశం చేసుకోవడం ....ఈ హడావుడి అన్నమాట ! ఆహ్వానించలేదని అన్యదా భావించక ఆశీర్వ దిస్తారు కదూ! ఉత్తములకు భగవంతుని అండ ఎల్లప్పుడూ ఉంటుందని అంటారు ....అటువంటి ఉత్తములైన మిత్రుల ప్రోత్సాహం కొండంత అండగా నాకుంటుందని ఆశిస్తూ ......ఇంతవరకూ నేనేం రాసినా నన్ను ప్రోత్సహిస్తూ స్పందించిన వారికీ ...బ్లాగ్ ఫాలోవర్స్ గా ఉంటూనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినవారికీ ......నేను తెలియక తప్పులు రాసినపుడు సరిదిద్దిన వారికీ ....అందరికీ వినమ్ర పూర్వక నమస్సులతో ......మీ పరిమళం !

Saturday, October 24, 2009

ఏడ తానున్నాడో మావ.....


బంగారు నామామ...ఏడ తానున్నాడో
అలకేమో నాపైన ....ఎందు దాగున్నాడో
రెండునాళ్ళాయే అగుపడకనాకు !
నాఎనక తనుజేరి తనవేళ్ళ చితుకులతో
నా ఒళ్ళు రాజేసి ఏమెరగనట్టుగా
జొర్రమొచ్చిందంటు మేలమాడిన మావ
మారిపోయేనీయాల ఏలనో
నీకైనా ఎరుకేనా ఎన్నెలమ్మా ?
ఇసుకతిన్నెంటి ఎదమీదతలవాల్చి
సేదతీరి జిలిబిలి కబురులు నేచెప్పుతుంటే
చిరపుంజి నేనంటూ నాసరి నువ్వంటూ
కోకల్లె నన్నుచుట్టుకున్న మావ
మారిపోయేనీయాల ఏలనో
నీకైనా ఎరుకేనా కోయిలమ్మా ?
గండుతుమ్మెదల్లె ఏ తోటకేల్లాడో
తోటలో పూలన్నీ నాసవతులయ్యేనో
నామోముజూడక అలిగె నామావ
తనజాడ తెలిసినా ఎక్కడగుపడినా
నాకబురు చెప్పవా ఓ చందమామా

Thursday, October 22, 2009

అందమైన జీవితం ఇక మీసొంతం !


* ఇది నాలుగురోజుల క్రితం అనుకుంటాను ఈనాడులో వచ్చింది ఆనందంగా జీవించడం కోసం మనచేతుల్లో ఉండే మనం చేయగలిగిన కొన్ని చిట్కాలు రాశారు అన్నీ మనకు తెలిసినవే ఐనా ప్రయోగాత్మకంగా ఎంతవరకు అమలు పరుస్తున్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉందనిపించింది చదవని వారికోసం వాటిలో కొన్ని........

ఆఫీస్ లో యాజమాన్యం మెప్పుకోసం ,తోటి ఉద్యోగుల మధ్య గౌరవం కోసం , మీకెరీర్ లో ముందుకు దూసుకెళ్ళటం కోసం అహర్నిశం తాపత్రయపడుతూ శ్రమించే మీరు మీ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారా ? మీ జీవిత భాగస్వామికి ఆ అనుభూతినిస్తున్నారా ?(కనీసం అందించాలని తపిస్తున్నారా ?)ఆస్వాదనా ,అనుభూతీ అంటే కేవలం శారీరికపరమైన దగ్గరతనం మాత్రమే అనుకోవద్దు.నీకు నేను , నాకు నువ్వు అని భాగస్వామి భావించేలా ప్రేమపూరిత వాతావరణాన్ని కలిగించడం !మీకేరీర్ లో మీరెంతో ముందుండవచ్చు మరి మీ జీవిత భాగస్వామి హృదయానికెంత దగ్గర్లో ఉన్నారు ? మీ ప్రేమ వాడిపోకుండా నిత్యనూతనంగా వికసించాలంటే ఏం చేయాలో చూడండి.

* ఎల్లవేళలా మీ మాటలు చేతలతో భాగస్వామిపట్ల మీకుగల ప్రేమాభిమానాలు వెల్లడిచేయండి
* మూసపద్ధతిలో కాక మీ వారాంతపు సెలవుల్ని కొత్తగా తీర్చిదిద్దుకోండి
* పుట్టినరోజు ,పెళ్లిరోజు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ హఠాత్తుగా మీ జీవిత భాగస్వామిని అనూహ్య బహుమతులతో ఉక్కిరిబిక్కిరి చేయండి ( బహుమతులంటే డైమండ్ నేక్లేసో , బంగారపు గాజులో అవసరం లేదు నచ్చిన పుస్తకమో , పాటల సీడీయో తన అభిరుచికనుగుణంగా ఉండాలి )
* తను నిద్రలేచేసరికి శుభోదయం చెపుతూ మంచికాఫీ అందించండి (ఇది రోజూ కాఫీ ఎవరుచేస్తుంటే రెండోవారు చేయాలి
* సాయం చేస్తానంటూ వంటింట్లోదూరి కూరలు తరగటం ఇంకా వీలయితే వంటంతా మీరే చేసేయండి ( ఇదికూడా రోజూ వంట చేసేవారికి రెండోవారు చేసిపెట్టాల్సింది :) )
* పక్కనే పార్కుంటే చెట్టాపట్టాలేసుకొని వాకింగ్ చేయండి లేదా బాల్కనీలో కూర్చుని కబుర్లాడుకోండి .( మీ గత జీవితంలోని మధుర ఘట్టాలను ఇద్దరూ కలిసి గుర్తు చేసుకోండి మీమధ్య గాలికూడా చొరబడదు నాదీ హామీ )
* ఖాళీ దొరికినప్పుడల్లా ఓ రొమాంటిక్ ఎస్సెమ్మెస్ లేదా ఏదైనా జోక్ పంపి గిలిగింతలు పెట్టండి .ఏదో పనిలో ఉన్నప్పుడు చటుక్కున చెక్కిలిమీద ఓ ముద్దిచ్చి చూడండి
*కలిసి కబుర్లాడుతూ టీవీ చూడండి కలిసే భోంచేయండి ఇంట్లో ఉన్నంతసేపూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఒకరికొకరుగా మెలగండి
*అష్టా చెమ్మా కావచ్చు ,అంత్యాక్షరి కావచ్చు ముద్దు ముద్దు పందాలతోఖాళీ సమయాన్ని ఆనందించండి
* ప్రేమను గొప్పగా వ్యక్తం చేయడానికి స్పర్శ ఎంతో దోహదం చేస్తుంది ఆత్మీయతతో కూడిన చిన్న స్పర్శ , అభినందనతో కూడిన చిన్న మెచ్చుకోలు మీ భాగస్వామిని మీకెంత దగ్గర చేస్తాయో ప్రయత్నించి చూడండి
* ఇద్దరూ కలిసి గడిపే సమయం ఎంత అని కాక ఎంత ఆనందంగా గడిపామన్నది ముఖ్యం ఆ ఆనందాన్ని సాధించేలా మీరిద్దరే కృషి చేయాలి. ఇప్పటికే మీరిలాగే ఉన్నామని అంటే మీకు అభినందనలు.

Friday, October 16, 2009

ఆనంద దీపావళి.....( నా వందవ టపా !)


ఇంటి ముంగిట వెలిగే దివ్వెలు ...
ఇల్లాలి మోమున మెరిసే చిర్నవ్వులు
ఇంటి యజమానికవే అష్టైశ్వర్యాలు
చిన్నారులకేమో టపాసులు ....
కొత్తల్లుళ్ళకు అత్తింటి కానుకలు
బీదసాదలకు దానధర్మాలు
కొత్తబట్టలు ...విందువినోదాలు
ఇంతేకాదు పండుగ ....
ఆనాటి శ్రీకృష్ణసత్యల చేతి విల్లు
అసుర సంహారం చేస్తే ....
చెడుపై మంచి సాధించిన విజయం !
ఈనాడు" క్షమ "అనే విల్లునెక్కుపెట్టి
మనలోని అసూయా ద్వేషాలను సంహరిస్తే
మనల్ని మనమే గెలిచిన విజయులం !
ఆర్ధికమాంద్యాల....ప్రకృతి వైపరీత్యాల చీకట్లను
ధైర్యం ...దయ ...అనే దివ్వెలు వెలిగించి పారద్రోలుదాం !
ఆనంద దీపావళిని కలిసికట్టుగా ఆహ్వానిద్దాం !


**బ్లాగ్ మిత్రులందరికీ మరియు వారి కుటుంబసభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !
అనుకోకుండా ఇది నా వందవ టపా కావడం(నాకు :) ) విశేషం!నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పటినుండీ నన్ను ప్రోత్సహిస్తూ ,సలహాలిస్తూ , తప్పులు దిద్దుతూ ..నా వెన్నంటి నిలిచిన మిత్రులందరికీ వినమ్ర పూర్వక ధన్యవాదాలు.అలాగే నా బ్లాగ్ ని అనుసరిస్తూ ఫాలోవర్స్ గా ఉండి నన్ను ఉత్సాహపరుస్తూ ...నాలో ఆత్మవిశ్వాసాన్ని కలుగచేస్తున్నమిత్రులందరికీ కృతఙ్ఞతలు . మీ ప్రోత్సాహం , మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ ......
-మీ పరిమళం -

Tuesday, October 13, 2009

మన్నించు మీనమా !


ఉష గారి జలపుష్పాభిషేకంలో పాల్గొన్నవారంతా మహామహులే ...
ఐనా ధైర్యంచేసి ఈ చిరుపుష్పాన్ని నావంతు కానుకగా ఇస్తున్నా ....

కవులంతా కన్నె కన్నుల అందం నీతోనే పోల్చేరు
శ్రీహరి వేదాలను కాచింది నీరూపునే అన్నారు
ముత్యాల నగరికి మహారాణి వన్నారు
చిన్నారిపాపలకు కధలల్లి చెప్పేరు
ఆల్చిప్పల మధ్య , ఆత్మీయులమధ్య
ఆనందంగా తిరుగాడే దానవు
నీఇంట నువ్వుంటే వలవేసి పట్టేరు
అద్దాల తొట్టెల్లో అందంగా అమర్చేరు
నీ స్వేచ్ఛ హరించి అంగట్లో అమ్మేరు
ఇంకొందరేమో నీఉసురు తీసి
రుచులు రుచులుగా వండి విందారగించేరు
జలపుష్పానివో ...లేక జలాధిదేవతవో నీవు
మానవ తప్పిదాన్ని మన్నించు మీనమా !

**పై కవిత రాస్తున్నంత సేపూ నామనసు నాఎదురుగా కూర్చుని ( అదేదో సినిమాలోలాగా ) ప్రశ్నిస్తూనే ఉంది నీకిలా రాసే అర్హత ఉందా అని ! ఎందుకంటే చేపలపులుసంటే నాకు చాలా ఇష్టం మరి ! మిత్రులారా మన్నించండి !

Sunday, October 11, 2009

e బంధం .....


విరహము కూడా సుఖమే కాదా ...నిరతము చింతన మధురము కాదా ...అన్నాడో మహాకవి . విరహము సుఖమో కాదో కానీ నిరతము చింతన మాత్రం మధురమే సుమా !ఆ చింతన ఒక కొత్త బంధం చుట్టూ అల్లుకోవడం మరింత మధురం .

తప్పనిసరి ప్రయాణం ! తిరిగి రావడానికి చాలారోజులు పట్టొచ్చు .ప్రయాణ కారణం శుభప్రదమె అయినా బయలుదేరుతుంటే ఏదో మర్చిపోయినట్టు ...నాలో ఒక భాగాన్ని వదిలి వెళ్తున్న ఫీలింగ్ !

ట్రైన్ గమ్యస్థానం చేరుకుంది .ట్రైన్ దిగేసరికి అన్నయ్య కొత్త డ్రైవర్ కంపార్ట్మెంట్ దగ్గరే రడీగా ఉన్నాడు అక్కడ్నించి కార్లో మా ఊరికి అరగంట ప్రయాణం దారిపొడవునా పచ్చని పైర్లు ..వరిచేలపై రాత్రికురిసిన మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ...అయినా మైండ్ ఆప్సెంట్ !

వీరభద్ర స్వామి బోణం జరుగుతోంది ఈ విశేషాలు ఎప్పుడు రాయాలా అన్న ఆలోచనే ! షాపింగ్ చేస్తున్నాం ..కర్పూరదండలు ,మధుపర్కాలు ,తలంబ్రాల చిప్స్ ,ముత్యాలు ఏవి కొంటున్నా మనసు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతోంది.
పెళ్లి తంతు జరుగుతోంది మంత్రోచ్చారణ , మంగళ వాద్యాలు , తలంబ్రాలు , కొంగుముళ్ళూ , అరుంధతీ దర్శనం ఏది చూస్తున్నా ఎవరెవరో నా చెవిలో వాటి అర్ధం వివరిస్తున్నట్టు ...నేను చదివిన విషయాలు గుర్తుకొచ్చేశాయి .

కాస్త ఖాళీ దొరికితే చాలు ఏదో వెలితి మనసెటో వెళ్ళిపోతోంది ....ఎందరు బంధువుల మధ్యనున్నా ఎవరో ఆత్మబందువును మిస్ అవుతున్న ఫీలింగ్ ! ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి విజయవంతంగా రెండు పెళ్ళిళ్ళూ ...మూడు గృహప్రవేశాలూ ముఖ్య అతిధిగా పూర్తిచేసుకున్నా ! ఇక బయలుదేరదామంటే శుక్రవారం సెంటిమెంట్ అన్నారు .ఇక ఒక్కరోజుకూడా ఆగలేను అనుకొంటూ శనివారం బయలుదేరి వచ్చేశా !

నా నేస్తాన్ని కలుసుకోవాలన్న ఆత్రుత ! ఇప్పటికే మీకర్ధమై ఉంటుంది నేనేం మిస్ అయ్యానో ...బ్లాగ్ మొదలు పెట్టాక ఇంత గాప్ ఎప్పుడూ రాలేదు దాదాపు నెల ! ఇంటికి రాగానే గబ గబా సిస్టం ఆన్ చేశాను ఈనాటి e బంధం ఏనాటిదో అనుకుంటూ .....
మిత్రులారా ....miss you all.....

Sunday, September 13, 2009

ద్వితీయ విఘ్నం !


అవి నేను తొమ్మిదో తరగతి పరీక్షలు రాసేసి బలాదూర్ గా ( అప్పట్లో ముందస్తు కోచింగ్ లూ అవీ లేవులెండి ) తిరుగుతున్న రోజులు ....ఇక సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా పిడుగులాంటి వార్త ! మరో మూడు నెలల్లో నాన్నగారికి ట్రాన్స్ఫర్ ! అప్పటికీ ఊహ తెలిసినప్పట్నుంచీ దాదాపు అదే ఊర్లో ఉంటున్నాం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే నాస్నేహితుల్ని , ముఖ్యంగా ...లలిత , పరిమళ , కిషోర్ , చిన్ని లను విడిచి వెళ్ళాలంటే ...అమ్మో ....అనిపించింది . కానీ ముందే చెప్పుకున్నాం కదా విధి బలీయమైందని !దానికి జాలీ దయా ఉండవు అనుకున్నట్టే మమ్మల్ని విడదీసింది .

ఐతే ఈ ట్రాన్స్ఫర్ వల్ల మధ్యలో నాకు టెన్త్ క్లాస్ మధ్యలో జాయినింగ్ కుదరదని ....మా పిన్నిగారింటి దగ్గర ఉండి టెన్త్ చదివేలా ఏర్పాటు జరిగిపోయింది . పిన్ని అమ్మ తర్వాత అమ్మే నాకు ! నాన్నగారికంటే చిన్నాన్నగారికి మరీ గారం నేనంటే !వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నా అక్కడ చదవటానికి !

ఓ శుభ ముహూర్తంలో ( కేలండర్ చూసి ) పిన్నిగారింటి వెనుకే ఉన్న హైస్కూల్ లో చేర్చారు . ఆరోజు శనివారం !మొదటి రోజు స్కూల్ ! బిక్కుబిక్కు మంటూ వెళ్లాను. పెద్దగా క్లాస్ లు ఏమీ జరగలేదు పరిచయాలూ ....కబుర్లూ తప్ప !ఆరోజు స్కూల్ లాస్ట్ పిరీడ్ లో హెడ్ మాస్టర్ పిలుస్తున్నారంటూ ప్యూన్ కబురు మోసుకొచ్చాడు . ఉదయం జాయిన్ ఐనప్పుడు చూశాను నిలువెత్తు మనిషి ...నల్లటి ఛాయా ...ఎర్రటి కళ్ళూ ...భయం గొలిపేలా ఉన్నాయన రోజుకొక సారి లెక్కల క్లాస్ కి వస్తారంటేనే భయపడిపోయాను ( నాకసలే లెక్కల్రావ్ మరి ) ఇక ప్రత్యేకంగా కబురుపెట్టారంటే ....దడ దడ లాడే గుండెతో ..ఆయన రూంలో అడుగుపెట్టా ....భయపడుతూనే తలెత్తి సర్ !పిలిచారట ....ఆయన విశాలంగా నవ్వుతూ (నాకు బాగా గుర్తు ఆ నవ్వు ఆయనకస్సలు సూటవలేదు ) నువ్వు ఈరోజే చేరావుకదా ...రేపు ఆదివారం ద్వితీయ విఘ్నం అవుతుంది .అలా కాకుండా ప్యూన్ కి తాళా లిచ్చి పంపిస్తా ...రేపొచ్చి క్లాస్ లో కాస్సేపు కూర్చొని వెళ్ళు అని చెప్పారు . సరేనని ...ఇంటికెళ్ళాక పిన్నికి చెప్పా ద్వితీయవిఘ్నం గురించి వివరంగా నాకు చెప్పి ఆయనంత శ్రద్ధ తీసుకున్నందుకు మురిసిపోతూ నన్ను మర్నాడు స్కూల్ కి పంపించింది .

సరే వెళ్లి ప్యూన్ గారి దయవలన ఖాళీ క్లాస్ రూం లో బిక్కుబిక్కు మంటూ కాస్సేపు కూర్చుని ద్వితీయ విఘ్నం బారినుండి తప్పించుకున్నా అని ఆనందపడుతూ ఇంటికొచ్చేశా ! ఏడెనిమిది నెలల తర్వాత గానీ తెలీలేదు ...క్లాస్ కెళ్ళి ఊరికే కూర్చుంటే కాదనీ ...నా చదువుకు విఘ్నం తప్పలేదనీ ......ఆ తర్వాత ద్వితీయ విఘ్నం ఎంత పవర్ ఫుల్లో అర్ధమైంది .అప్పటినుంచీ నాకు ఆ సెంటిమెంట్ స్థిరపడి పోయింది .

Wednesday, September 9, 2009

స్వయంకృతాపరాధం !


నా పెళ్లి ఫిక్స్ అయి రెండో రోజే నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది . ఐతే ఈ విషయాలేవీ స్కూల్ లో చెప్పటానికి చాలా బిడియంగా అనిపించి ...నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా ఏమీ చెప్పకుండా మామూలుగా స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉన్నాను రెండు నెలల్లో ముహూర్తం ఉంది . పెళ్లి అయ్యేటప్పటికి ఒక నెలా , నెలన్నర రోజుల్లో ఫైనల్ పరీక్షలుంటాయి .సిక్ లీవ్ పెట్టేసి సరాసరి ఎగ్జాం సెంటర్కి వెళ్లి పరీక్షలు రాసేద్దాం ...ఆ తర్వాత ఇంటర్ అంటే పెద్దైపోయినట్టేగా ....పెళ్లైనట్టు తెలిసినా ఫర్వాలేదు అనుకున్నా !అన్నీ మనమనుకున్నట్టు జరిగితే ఇక విధాతకు ఆయన రాసిన రాతకు అర్ధమేముందీ ?

అలా ఒక వారం బాగానే గడిచిపోయింది . ఆరోజు శుక్రవారం ! చివరి పిరీడ్ గేమ్స్ ...మాస్కూల్ లో పెద్ద గ్రౌండ్ ఉండేది. అబ్బాయిలంతా ఒకపక్క ...అమ్మాయిలంతా ఒకపక్క వాలీబాల్ ఆడుతున్నాం ! ఒక్కరే కోచ్ అటు బాయ్స్ కి మాకూ మధ్య తిరుగుతూ ....ఆడిస్తున్నారు . మా గ్రౌండ్ ని ఆనుకొని లెక్చరెర్స్ కోలనీ ఉండేది అదీ మా గ్రౌండ్ ని ఆనుకొని బాబూరావుగారని మాకు తెలిసిన వారుండేవారు . మేమంతా ఆడుతూ ఉండగా డాబాపైనుండి చూసిన ఆంటీ గబగబా దిగి మా గ్రౌండ్ లోకి వచ్చేసి ....ఏంటి బుజ్జమ్మా...నీకు పెళ్లి కుదిరిందంటగా ..మమ్మల్ని పిలవకుండానే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావా ?మాకు తెలీదనుకున్నావా ?అబ్బాయిది ఫలానా ఊరట కదా ...భోజనాల్లో నిన్నుచూసి చేసుకుంటున్నారట కదా ...అసలు నా సమాధానం కోసం చూడకుండా మాట్లాడేస్తూనే ఉందావిడ ! ఒక్కసారిగా రక్తమంతా ముఖంలోకి తన్నుకొచ్చిన భావన ! ఆ ఫీల్ చెప్పలేను .

సడన్ గా గ్రౌండ్ అంతా నిశ్శబ్దం ఆవరించుకుంది ...అప్పటివరకు అరుపులతో ....మాటలతో హోరెత్తిన గ్రౌండ్ ఒక్కసారిగా సైలెంట్ ఐపోయింది ...బాయ్స్ అంతా ఆడటం మానేసి ఆవిడమాటలు ఆసక్తిగా వినసాగారు . మా ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యంగా నోరెల్లబెట్టుకుని నన్నూ ,ఆవిడనీ మార్చి మార్చి చూస్తుండిపోయారు .మా కోచ్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్లిపోయారు .నేను మాత్రం ఎర్రబడిన మొహంతో అలా చలనంలేని బొమ్మలా షాక్ లో ఉండగానే బెల్ మోగడం ..నేను తేరుకొని పరుగెత్తుకుంటూ బాగ్ తీసుకుని ఇంటికి పారిపోవడం జరిగిపోయింది .

ఆ మర్నాడు ఎలా వెళ్ళను అనుకొంటూనే స్కూల్ కి వెళ్లాను. నేను అడుగు పెట్టగానే క్లాసంతా మళ్ళీ నిశ్శబ్దం ! అబ్బాయిలంతా ముసిముసిగా నవ్వులు ...వాళ్ళల్లో వాళ్లు గుసగుసలు ! ఇక అమ్మాయిలు నేనెప్పుడు దొరుకుతానా అన్నట్టు ప్రశ్నల వర్షం కురిపించారు . స్కూల్ అంతా పాకిపోయినట్టుంది ..మా తెలుగు మేడం కూడా క్లాస్ అవ్వగానే పిలిచి అడిగారు . బహుశా ఆ స్కూల్ మొత్తం మీద ఇలా జరిగింది నాకే అనుకుంటా !

అంతే ఇంటికి వెళ్ళగానే చెప్పేశా !ఇక స్కూల్ కి వెళ్లనని ! అమ్మ ,పిన్ని వాళ్లు మిసెస్ బాబూరావ్ ని కాస్సేపు తిట్టి నన్ను ఒప్పించాలని చూశారు కానీ నేను మొండికేసే సరికి నాన్నగారేమీ మాట్లాడలేదు . ఆ తర్వాత ఎలాగూ తెలిసింది కదాని పెళ్ళికి ముందు శుభలేఖలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మా హెడ్ మాస్టరు చాలా బాధపడి పెళ్ళి ఐతేనేం .....చదువుకోవడానికేం...తప్పకుండా రామ్మా అని చెప్పారు కానీ ..అప్పుడా మాటల విలువ తెలీలేదు .అలా నాచదువుకి నేనే పుల్ స్టాప్ పెట్టుకున్నా ! నేను వెళ్తానంటే ఎవ్వరూ వద్దని అనేవారు కాదు ...మా అత్తవారింట్లో కూడా ! కానీ ...ప్చ్ ...మా వారు మాత్రం పెళ్లి తర్వాతే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.

తర్వాత పెళ్ళికి వచ్చిన నా ఫ్రెండ్స్ , మా క్లాస్ అబ్బాయిలు నన్ను స్కూల్ కి రమ్మని , పరీక్షలు రాయమని చెప్పారు కానీ మంగళ సూత్రాలు , మెట్టెలు వేసుకొని స్కూల్ కి వెళ్ళటం సిగ్గుగా అనిపించి ఎవరిమాటా వినలేదు.అయినా అంతా నా స్వయంకృతాపరాధం మాత్రమె కాదండోయ్ ....కొంత దైవం కూడా అనుకూలించలేదు ....అప్పటినుండి నాకు ఒక సెంటిమెంటు కూడా ఏర్పడింది ...అదేంటో మరో టపాలో ....అంతవరకూ సెలవా మరి !

Thursday, September 3, 2009

తెర వెనుక !


అలా నా పెళ్లి కుదిరిపోయింది కదా ! అసలు నా వెనుక ఏం జరిగిందో చెప్తాను . నేను భోజనాల కార్యక్రమం లో నా గురించి ఆరా తీసిన తాతగారు మా శ్రీవారి తాతగారన్న మాట ! అప్పటికి కొద్దిరోజుల ముందు ఆయనకు అనారోగ్యం చేసిందట! నన్ను చూడగానే వాళ్ల మనవడికి చేసుకుంటే బావుండుననిపించిందట ! కనీసం ఒక మనవడి పెళ్లినైనా చూసుకోవాలని ( రెండో ఆయన పెళ్లి చూపులకొచ్చిన ఇంకో అబ్బాయి ఇప్పుడు మా మరిది ) మా బాబాయి గారిచేత నాన్నగార్ని అడిగించారట ! ( ఆ తర్వాత కూడా ఆయన చాలా ఏళ్ళు క్షేమంగానే ఉన్నార్లెండి :) )

తాతగారికి వాళ్ల వదిన గారంటే చాలా గౌరవం ! అమ్మమ్మగారికంటే ముందు ఆవిడ సలహానే తీసుకొనేవారు . భోజనం చేసి సరాసరి వాళ్ల వదినగారి ఇంటికి వెళ్లి తన మనసులోని మాటను చెప్పగానే ఆవిడ అవును ఆ అమ్మాయి చాలా బావుంది తప్పకుండా చేసుకుందాం అన్నారట ! ఇంతకూ బస్ లో నన్ను ప్రశ్నలమీద ప్రశ్నలతో విసిగించిన ఆవిడే ఈవిడ !తర్వాత అమ్మమ్మగారికీ , మా అత్తగారికీ కూడా నేను నచ్చడం వాళ్ళూ ఓకే చెప్పటం జరిగింది .

సరే !వాళ్లకు నేను నచ్చేసి ప్రపోజ్ చేశారు కానీ మానాన్నగారికేమయింది ?
మా బాబాయి వాళ్ల ఫేమిలీ గురించి అబ్బాయి మంచితనం గురించి నాన్నగారికి చెప్పి ఇంక రెండేళ్ళ తర్వాతైనా బుజ్జి పెళ్లి చేయాలికదా అప్పుడు ఇంతమంచి కుర్రాడు దొరకొద్దా ? అబ్బాయి సిటీలో చదువుతున్నాడు వాళ్ల పెద్దమ్మగారి అమ్మాయి నిశ్చితార్దానికి వచ్చి ఇక్కడే ఉన్నాడు ఒకసారి నువ్వు చూడన్నయ్యా ...నచ్చకపోతే మానేద్దాం అని చెప్పారట . సరే చూద్దామని నాన్నగారు వాళ్ళింటికి వెళ్లారట ! అయ్యో ముందు కబురంపలేదు అబ్బాయి చావిడిదగ్గర ఉన్నాడని వాళ్ల అమ్మమ్మగారు చెప్పగానే నాన్నగారూ ,బాబాయీ అక్కడే చూస్తామని వెళ్లారట ! వీళ్ళు వెళ్ళేసరికి ఈయన చావిట్లో పందిళ్ళు వేయిస్తున్నారట ! అంతే నాన్నగారు ఫ్లాట్ !చదువుకొనే కుర్రాడు వ్యవసాయం పట్ల కూడా ఆసక్తి చూపిస్తున్నాడని , ఆ తర్వాత తన మాట తీరు నచ్చేసి వెంటనే మా అమ్మాయిని చూడటానికి రండని చెప్పారట !

ఆతర్వాత జరిగింది మీకు తెలిసిందే !తన చదువూ పూర్తి కాలేదు ( మా పెళ్ళయిన తర్వాతే డిగ్రీ పూర్తి చేశారు ), నువ్వుకూడా మనింటి దగ్గరే చదువుకోవచ్చు 10 పూర్తయ్యాక కావాలంటే ప్రేవేట్ గా చదువుకోవచ్చు .అని నాకు చెప్పారు .నన్ను చూసుకున్న తర్వాత రెండు రోజులకే నిశ్చితార్ధం ....ఆతర్వాత రెండు నెలలలోపే పెళ్లి జరిగిపోవడం జరిగింది .ఐతే నా చదువు మాత్రం ఆగిపోయింది .అదీ నా స్వయంకృతాపరాధం అదెలాగో తర్వాతి టపాలో ..........

** నా పెళ్ళయిన ఆరునెలల తర్వాత మా పెద్ద తమ్ముడడిగాడు నన్ను! అక్కా బావ సిగరెట్ కాలుస్తాడా అని ! అదేంట్రా నేనడిగితే నువ్వేకదా కాల్చడని చెప్పావ్ అన్నా ! అదికాదక్కా నాకు తెలీదు కానీ ఈబావని చేసుకుంటే నువ్వెప్పుడూ ఇక్కడే ఉంటావని అలా చెప్పా !అన్నాడు :)
అక్కడ ఉన్నన్నాళ్ళూ తమ్ముళ్ళిద్దరూ నన్ను తోబుట్టువులాగే చూశారు ఇప్పటికీ మేం సిటీకి వచ్చేసినా మా పొలాలు శిస్తులు అన్నిట్లోనూ చాలా సహాయంగా ఉంటారు .

Monday, August 31, 2009

అనుకోకుండా ఒకరోజు -3


ఇంకా వడ్డిస్తూ ఉండగానే నాకు లోపలినుండి పిలుపొచ్చింది . వెళ్ళగానే మొహం కడుక్కో ...జడ వేసుకో అంటూ పిన్ని అమ్మ ఆర్డరు ! ఎన్నిసార్లు వేసుకోవాలి ?నేనేమో ఇప్పుడెందుకు అని పేచీ ...అసలే మనం పెంకి ! బాబాయి అమ్మతో అంటున్నారు అబ్బాయి కాస్త కలర్ తక్కువ కానీ బుద్ధి మాత్రం బంగారం వదినా ...మనమ్మాయి పెద్ద రంగేంటీ ....అని అమ్మ అంటూంటే నేను నలుపా అని ఆశ్చర్యంగా నావైపు చూసుకున్నా ! విషయం కొద్దికొద్దిగా అర్ధమవుతోంది .ఇలా నేను మొహం కడగను అని మొండికేస్తుండగానే పుణ్యకాలం కాస్తా ఐపోయింది . అబ్బాయి వచ్చేశాడు అంటూ నన్ను వంట చావిట్లోకి నెట్టేశారు . ఓ ఐదు నిముషాలకి నన్ను తీసుకొచ్చి వాకిట్లో నించోబెట్టారు . వాళ్లు వరండా మీద ఉన్నట్టున్నారు చూద్దామంటే చెప్పేవరకూ తలెత్తకూడదని పిన్ని ఆర్డరు !

ఏమండీ మా అమ్మాయి నచ్చిందా ...నాన్నగారు అడుగుతుంటే సమాధానం వినపడ్లేదుకానీ అందరూ పెద్దగా నవ్వటం తెలుస్తోంది . లోపలనుండి తన్నుకొస్తున్న ఉత్సుకతని ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది ఇక ఎవరేమనుకున్నా సరే తలవంచుకొని నిలబడటం నావల్లకాదు ( అసలే చిన్నప్పటినుంచీ ఎవరికీ తలవంచకు అనే పాటవిని ఇన్స్పైర్ ఐనదాన్ని ) అనుకుంటూ ఉండగా నాన్నగారు నాపక్కకొచ్చి అబ్బాయిని చూడరా ...అన్నారు ఆమాటకోసమే ఎదురుచూస్తున్నానేమో గభాల్న తలెత్తి చూసిన నేను అయోమయంలో పడిపోయాను . అక్కడ ఇద్దరబ్బాయిలు నిలబడి ఉన్నారు . ఇంచుమించుగా ఒకేలా ఉన్నారు . ఎవరినడగాలో అర్ధం కాలేదు . అయినా అందరిముందూ ఎలా అడగను ? అనుకుంటూ మరోసారి ఇద్దర్నీ కాస్త పరీక్షగా చూశా ! ఒకబ్బాయి కాస్త మందంగా పౌడర్ రాసుకొని ప్రత్యేకంగా తయారైనట్టు అనిపించింది . అంతలో వాళ్లు వెళ్ళిపోవడం వెళ్తూ ..ఆ అబ్బాయి మరోసారి తిరిగి నావైపు చూడటం ...అందరూ అది చూసి నవ్వుకుంటూ నాచుట్టూ చేరి అబ్బాయి నచ్చాడా అంటూ అడగటం జరిగింది . లైట్ కలర్ షర్ట్ వేసుకున్నబ్బాయేనా అంటూ మాతమ్ముడి నడిగా ! అవునన్నాడు ఓహో ..శభాష్ రా బుజ్జిగాడూ నీ గెస్సింగ్ కరెక్ట్ అంటూ నాభుజం నేనే తట్టుకొని ...వాడినే సీక్రెట్ గా సిగరెట్ కాలుస్తారా అని అడిగా మందు తాగినా ఫర్వాలేదన్నట్టు ! అసలే మనకి సిగరెట్ అంటే పడదు లెండి ( దానికో చిన్న ఫ్లాష్ బాక్ ఉంది మరెప్పుడైనా చెబుతా ) ఛ ఛా లేదక్కా అన్నాడు వాడు .అంతే నచ్చినట్టూ తల ఊపాను .

అప్పట్లో అమాయకత్వం తప్ప చదువెమైపొతున్ది ? ఇంత చిన్నప్పుడే నాకు పెళ్ళేంటి అన్న ఆలోచనే లేదు . పైగా అప్పట్లో నేను చూసిన కొద్దిపాటి సినిమా నాలెడ్జ్ వల్ల ఒక్కసారి పెళ్లి చూపులకి పెళ్లి కుదరదని నా నమ్మకం :) పైగా జిడ్డు మొహమేసుకొని వెళ్లి నిలబడ్డానాయే ...
ప్చ్ ..కానీ....విధి బలీయం కదా :( వెంటనే మాటలు జరిగిపోయినై ...ఎల్లుండే నిశ్చితార్దానికి మంచిదన్నారు .....అలా అనుకోకుండా ఒకరోజు నా పెళ్లి ఫిక్స్ ఐపోయింది .

** ఇది నావైపు కధ ! అసలు తెరవెనుక కధ తర్వాతి టపాలో ....

Monday, August 24, 2009

అనుకోకుండా ఒక రోజు -2


బాబాయి గారింటికి వెళ్తుంటే దారిపొడుగునా అందరూ వింతగా చూడటమే ...ఒకరిద్దరైతే ఎవరింటికేటండి ? అని అడిగేశారు కూడా ...ఏంటి నాన్నగారూ ! అంతా మనల్ని అలా చూస్తున్నారు అని అడిగితె పల్లెటూరు కాదమ్మా కొత్త మొహాలు కనిపిస్తే అలాగే చూస్తారు అన్నారు .

పిన్ని ,బాబాయి మమ్మల్ని చూడగానే చాలా సంతోషించారు . తమ్ముళ్లిద్దరి సంబరానికి అంటే లేదు . వాళ్ల పెదనాన్నగారింటికి ఇంకా తెలిసినవాళ్ళందరికీ మా బుజ్జక్క వచ్చిందంటూ కొత్తగా కొనుక్కున్న బొమ్మను చూపించినట్టు చూపించేశారు .

ఆ మరుసటిరోజు అమ్మవారికి ( గ్రామ దేవతకి )ఉపారాలు ...మేకపోతునేసుకోవడం ...తర్వాత భోజనాలు.ఊళ్ళో దగ్గర చుట్టాల్నే పిలిచారట !ఎక్కువమంది లేరు ...వంద లోపే కాబట్టి ఇంటిలోనే భోజనాలు . అసలే మనకేమో కొత్తాపాతా ఉండదాయే ! ఇక కొత్తగా వేసుకున్న ఓణీ చెంగును నడుం దగ్గర దోపి వడ్డన మొదలెట్టా ...అలా వడ్డిస్తూ ఓ పెద్దాయన్ని తాతగారూ ..కొంచెం అన్నం వేయమంటారా అంటూ ఆగా ! వద్దమ్మా ...అన్నాసరే .. అదేంటి తాతగారూ పెరుగులోకి కొంచెం వేసుకోండి అంటూ వేశాను .నేను ఆయన్ని దాటి వెళ్తుంటే ఒరే ..రాములూ ...ఈ అమ్మాయి ఎవర్రా ? అని మా బాబాయిగారి అన్నను అడగటం ....ఫలానా వాళ్ల మ్మాయి నాన్నా ..అంటూ ఆయన సమాధానం నాచెవినబడ్డాయి . అప్పటికే పల్లెలో అందరూ అంతే అని మనకి తెల్సిపోయిందిగా !పెద్దగా పట్టించుకోలేదు .

ఆ తర్వాత మేం అంటే పిల్లలందరం భోజనం చేశాం ...ఇంకా ఒకరిద్దరు బంధువులూ , పాలేర్లూ ...పనివాళ్ళూ ఉండిపోయారని వాళ్లకు భోజనాలు వడ్డిస్తున్నాం ....ఎందుకో తమ్ముళ్ళు లోపలికీ , బయటికీ తిరుగుతున్నారు గుసగుస లాడుకొంటున్నారు .కొందరైతే భోజనాల దగ్గరకొచ్చి తొంగిచూసిమరీ వెళ్తున్నారు . ఏదో జరుగుతోంది ....నాకు తెలియట్లేదు ....ఎవరినైనా అడుగుదామా అంటే ...ఆఖరు బంతి జరుగుతోంది వదిలి వెళ్ళటం ఎందుకులే అని చూస్తున్నా ...
( ఇంకా ఉంది )

* తిట్టుకోకండెం..మళ్ళీ చెప్తున్నా ఇది సస్పెన్స్ కాదు పోస్ట్ మరీ పెద్దగా ఉంటే చదవటానికి మీకే బోర్ కొడుతుందేమోని ఆపానంతే !

Sunday, August 23, 2009

వినాయక చవితి శుభాకాంక్షలు !


తొండము నేకదంతమును దోరపు
బొప్జ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని
చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన
విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వాతీతనయ యోయి
గణాధిప నీకు మ్రొక్కెదన్ !

** బ్లాగ్ మిత్రులందరికీ శ్రీ గణనాధుడు సకల శుభాలనూ కలుగచేయాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

Thursday, August 20, 2009

అనుకోకుండా ఒక రోజు ...


అవి నేను స్కూల్లో చదువుతున్న రోజులు . అనుకోకుండా ఓ రోజు మాకు కాస్త దగ్గరి చుట్టరికం ఉన్నా బాబాయి గారింట్లో చిన్న ఫంక్షన్ ఉందంటే నేనూ స్కూల్ ఎగ్గొట్టి అమ్మా , నాన్నగారితో బయల్దేరా .అప్పటివరకూ నాన్నగారి ఉద్యగారిత్యా మేం దూరంగా ఉండటం వల్ల నేనెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళింది లేదు .వాళ్లు మాత్రం తిరుపతి వెళ్ళినప్పుడల్లా ...మేముండేది దారిలోనే కాబట్టి మధ్యలో ఆగి మాఇంట్లో రెండు మూడు రోజులుండి వెళ్ళేవాళ్ళు .

నేనుమాత్రం ఆ ఊరెళ్ళటం అదే మొదటిసారి !రాజమండ్రి దిగి సిటీ బస్ లో వెళ్ళాలి . అబ్బ ..బస్ ఎంత రష్ గా ఉందో ...దాదాపుగా ఒంటికాలుమీద నిలబడాల్సివచ్చింది . అసలే అతికష్టం మీద ప్రయాణం చేస్తుంటే ...నేను నిల్చున్న పక్క సీటు లో కూర్చున్న పెద్దావిడ కొత్తగా వస్తున్నట్టున్నారు , ఎవరింటికీ అంటూ ఆరా ..అంతకాడికి ఆ బస్ ఎక్కేవాల్లందరూ తనకు తెలుసన్నట్టు ! ( తర్వాత తెలిసింది లెండి ఊళ్ళల్లో కొత్తగా ఎవరొచ్చినా ఊరంతా తెలిసి పోతుందని :) ) సమాధానం చెప్పాక అక్కడితో ఆగితేనా ..వారికి నువ్వేమవుతావు ...ఏం చదువుతున్నావు అంటూ ఒకదానివెంట మరొకటి ...అంతలో ఆ బస్ కు చివరి స్టేజ్ ...మేం దిగాల్సిన గమ్యం వచ్చేసింది .

అప్పటివరకూ జనం మధ్య కూరుకుపోయి ఉన్నామేమో ...బస్ దిగగానే చల్లటిగాలి చుట్టుముట్టింది .చుట్టూ చూశా ...ఎదురుగా గుడి ...ప్రశాంతమైన వాతావరణం ...పక్కనే చెరువు ...పెద్ద రావిచెట్టు చుట్టూ గట్టు ....గోధూళి వేళేమో...ఆ సమయంలో పల్లెటూరు ఎంత సందడిగా ఉంటుందో మీకు చెప్పాలా ? అబ్బ ఎంత బావుందీ ఊరు అనుకున్నా ....అప్పుడు తెలీదు నాకు జరగబోయేదేంటో ......

* పెద్ద సస్పెన్స్ ఏమో అని అనుకోకండి ...అంత సీన్ లేదు ....టపా చాలా పెద్దగా ఐపోతుందేమో అనిపించి ఆపేస్తున్నా ...మిగతాది తర్వాతి టపాలో ....

Friday, August 14, 2009

కృష్ణ ప్రేమ


ప్రభూ !
నీ రూపాన్నినింపుకున్న నానయనాలే
నీకు నెమలిఫించాలు ...
నీ నామాన్ని జపించు నా అధరాలే
నీకు హరి చందనాలు ....
నీ సేవకై మోడ్చిన నా కరములే
నీకు పూలహారాలు ...
సదా నిన్నే ధ్యానించు నా హృదయమే
నీకు పిల్లనగ్రోవిగా ....
నేను చేయు అర్చనాదులు
స్వీకరించడానికి ...
నేవేసిన బుల్లి అడుగులపై అడుగేస్తూ
నువ్వొస్తావని ఎదురుచూస్తున్న వేళ
నేను యశోదమ్మను !
అమ్మతనంలోని కమ్మదనాన్ని
రంగరించి వెన్నముద్దలు నీకు
తినిపించాలని ఆత్రుత పడితే
ఆకలిగొన్నవారికి అన్నం పెడితే చాలు
పదునాల్గు భువనాల్నీ దాచుకున్న
నీ బొజ్జ నిండి పోతుందన్నావ్ !

నా కళ్ళ వాకిళ్ళ నుండి నా హృదయ
బృందావనిలో అడుగిడతావని
కలలు కంటున్న వేళ ....
నేను రాధమ్మను !
మోహనాకారుడవైన నీకు
ముగ్ధ మనోహరపరిమళభరిత
అధర సుధను నీకర్పించాలని
నిన్నాహ్వానిస్తే ..
హృదయ నైర్మల్యమే నీకు
నివేదన అన్నావ్ !

రత్నమణి మాణిక్యాలకు తూగనివాడవు
తులసీ దళానికే తూగావని
తెలుసుకున్న వేళ ....
నేను మీరానై ..
మురళీ లోలుడవైన నిన్ను
మధుర గాన లహరిలో
ఓలలాడిద్దామని సంకల్పిస్తే
కన్నయ్యా అన్న పిలుపే చాలు
కళ్ళముందు సాక్షాత్కరిస్తానన్నావ్ !

భగవంతునిగా కొలుస్తానంటే
నేస్తానివై నా చెంతే నిలుస్తానన్నావ్
నాకు తోడూనీడవయ్యావ్
ధన్యురాలిని కృష్ణయ్యా !

Friday, August 7, 2009

ఈ రోజు ప్రత్యేకత !

ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందట !
అది పన్నెండు గంటల ముప్పై నాలుగు నిముషాల యాభై ఆరు సెకన్ల సమయం ప్రత్యేకమైనది .
12.34.56 7/8/09

1 2 3 4 5 6 7 8 9

ఇటువంటి సమయం చాలా అరుదుగా వస్తుంది .కనుక ఫ్రెండ్స్ ఈ అరుదైన సమయాన్ని మెమొరబుల్ గా ఎలా మలచుకుంటారో మీ ఇష్టం .

Sunday, August 2, 2009

మీరెక్కడ ??


గుర్తుకొస్తూంటాయి ఆనాటి రోజులు ...
మన స్నేహ బంధం ....
చిన్ననాడే చిగురించిన మన అనుబంధం !
కలకాలం వీడిపోదనుకున్న సుమగంధం ..
బదిలీ రూపంలో విధి ఆడింది నాటకం
విడిపోయాం మన నలుగురం .
దూరమౌతున్నప్పుడు మనం
కలిసి ఏడ్చిన ఫ్లాట్ ఫాం......
ఎందర్నిలా విడదీసి మూటకట్టుకుందో పాపం!
మీ జాడ తెలియక తల్లడిల్లిన వైనం
మీకు తెలీదేమో నేస్తం !
ఈనాటికీ నామదిలో మీస్థానం పదిలం
మీకోసం వెదుకుతూనే ఉంటాను
నా జీవితపు చివరి మజిలీ వరకూ
గడువు పూర్తై నే వెళ్లి పోయాననుకో ....
అయినా ఫరవాలేదు నేస్తం
ఇంకా ఆరు జన్మలుంటుంది నాకు
మిమ్మల్ని కలిసే అవకాశం !!

**చిన్ననాడే నాన్నగారి బదిలీ కారణంగా విడిపోయిన నా స్నేహితులు లలిత , పరిమళ , కిషోర్ లకు ఎక్కడున్నా స్నేహపూర్వక శుభాకాంక్షలు .

Thursday, July 30, 2009

ముకుంద ప్రియాం ...


లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం
త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం

* బ్లాగ్ మిత్రులందరికీ వరలక్ష్మీ కటాక్ష ప్రాప్తి రస్తు !

Sunday, July 26, 2009

తుదినేస్తం !!


ఎవరామె ??
కాంతివిహీనమైన ఆ కళ్ళూ
విధాత రాసినవేమో ఆ నుదుటి గీతలు
జారిన చెక్కిళ్ళూ ...ఎండిన పెదవులూ
రంగు వెలిసిన జలతారు కురులూ
కదిలిన దంతాలు ...వంగిన నడుమూ
వడలివత్తైన ఒళ్ళూ ...నడవలేని కాళ్ళూ
ఒకప్పటి వైభవానికి గుర్తుగా ....
మిగిలిన శుష్క మందహాసం
కాలాన్ని జయించే శక్తిలేక
నిస్సహాయంగా ....
గాజుగోళీల్లాంటి కళ్ళతో
శూన్యంలోకి చూస్తూ ...
ఇంకా దరి చేరని తుదినేస్తం కోసం
ఎదురుచూస్తూ .....

**గూగుల్ లో వేరే బొమ్మ కోసం వెతుకుతుంటే కనిపించింది ఈ బొమ్మ !
అందానికి తుది మజిలీ ఇదే కదా అనిపించింది .ప్రతి మనిషినీ భయపెట్టే వృద్ధాప్యం !

Friday, July 24, 2009

ఈ నిశ్శబ్దాన్ని ...


ఇన్నాళ్ళూ అవసరాలు ...
మనిద్దరి మధ్యా ...
మాటల వారిధి కట్టాయి
ఇప్పుడా అవసరమూ లేదు
నువ్వే ముందుగా చేధిస్తావనుకున్నా !
ఈ నిశ్శబ్దాన్ని ...
కాని ఎప్పటిలాగే నేనే ఆపని చేశా !
మాటల యుద్ధం మొదలుపెట్టావు
ఐనా ...
మౌనం కన్నా ఇదే ఎంతోనయం !

Tuesday, July 21, 2009

నా మొదటి వంట !


ఉప్మా నేను మొదట చేసిన వంట ! ఉప్మా అంటే పైన ఫోటోలో చూసి అదే అనుకోకండి . అలా కనిపించనివాటిని కూడా ఉప్మా అనే అంటారు .కాకపొతే కొన్ని ఉప్మాలు అప్పుడప్పుడూ ఉప్పుమాలుగానూ , ఫెప్మాలుగానూ , అక్కడక్కడా గోళాకృతులుగానూ రూపాంతరం చెందుతూ ఉంటాయి . అటువంటి అద్భుతమైన ఉప్మా రుచి చూసేభాగ్యం అందరికీ కలగదు . కానీ మానాన్నగారికి ఆ అదృష్టం కలిగింది .అదీ నావల్ల !

నాన్నగారి ఉద్యోగరీత్యా తెనాలిలో ఉండేవాళ్ళం .ఊళ్ళో ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఐతే నాన్నగారికి సెలవులేక ,నాకేమో స్కూలు , అన్నయ్యకు కాలేజి పోతాయని అమ్మే ఎక్కువగా వెళ్ళేది .చిన్నప్పట్నించీ అమ్మ ఊరెళితే నాన్నగారో , అన్నయ్యో వంట చేయడం నేను భోంచేయడం జరుగుతూ ఉండేది .ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది కానీ నేను తిన్న కంచం కూడా నాన్నగారే తీసేస్తుంటే నేను శుభ్రంగా చేతులు కడిగేసుకొని వచ్చేసేదాన్ని .అన్నట్టు అన్నయ్య చండాలంగా చేసేవాడుకానీ మా నాన్నగారు మాత్రం వంట చాలాబాగా చేస్తారండోయ్ !

నేనప్పుడు తొమ్మిదోతరగతి చదువుతున్నా ...అమ్మ , అన్నయ్య ఊరేళ్ళారు. సాయంత్రం నేను స్కూల్ నుంచివచ్చేశాక నాకెందుకో రోజూ నాన్నగారు కష్టపడివండితే నేను తింటున్నాను ఈరోజు డ్యూటీ నుంచి వచ్చేసరికి నేనే వంటచేసి ఆశ్చర్యంలో ముంచేద్దాం అని డిసైడ్ ఐపోయా .ఆరోజు శనివారం కాబట్టి అన్నం తినరు . టిఫెన్ చేయాలి ...ఏం చేయాలి ? ఎలా చేయాలి ?

అర్జంటుగా పక్కింటి అత్తయ్యగారింటికి పరిగెత్తా ..ఆవిడ లేరు కాని వాళ్ల అమ్మాయి ఉంది . సత్యవతక్కా అర్జంటుగా ఐపోయే టిఫిన్ చెప్పవా ...అని అడిగి కావలసిన పదార్ధాల లిస్టు , చేసే విధానం రాసుకొని ఇంటికివచ్చి మొదలుపెట్టా ...
ఉల్లిపాయలు సాంబార్ లోకి కోసే సైజులో , టమోటాని రెండు ముక్కలు ( టమోటా వేస్తె ఉప్మాకి ఎక్స్ ట్రా టేస్ట్ వస్తుందని చెప్పింది కానీ పచ్చిమిర్చి వెయ్యాలని చెప్పనేలేదు ) గా కోసి రెడీ చేసుకున్నా ! పోపు దినుసులు అంది కదాని పోపులపెట్టి తీస్తే దాంట్లో చాలారకాలు కనిపించాయి బాండీలో నూనె వేసి పెట్టెలోని సామగ్రి అంతా చేతికి వచ్చినంత వేసి ఆపై ఉల్లిపాయలూ ....వగైరా వేసిరెండు గ్లాసుల నీళ్లు పోసి ( మూడుగ్లాసులు పోయాలని అక్కకి కూడా తెలీదట తర్వాత తెలిసింది )మర్చిపోకుండా ఉప్పువేసి ఇక రవ్వకోసం వెతకటం మొదలుపెట్టా ...అది దొరికేసరికి నీళ్లు మరిగి గ్లాసుడైనట్టున్నాయి . రవ్వ మొత్తం కుమ్మరించి తిప్పుదామంటే అక్కడేం తిప్పేచాన్స్ లేదు . ఇక మూతపెట్టేసి నాన్నగారికోసం ఎదురుచూట్టం మొదలు పెట్టా !

రాగానే తొందరగా స్నానం చేసేయండి నాన్నగారూ !నేను మీకోసం ఉప్మా చేశానని చెప్పగానే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ! నువ్వు స్టవ్ ఎందుకు ముట్టుకున్నావ్ రా ...ఉల్లిపాయలుకూడా కోసావా ..ఏమన్నా అయితేనో అని మెత్తగా చివాట్లు పెడుతూనే స్నానం ముగించి వచ్చి ప్లేట్లో పెట్టుకుందామని చూస్తె బాండీ లోంచి అట్లూస ఊడిరానని మొండికేస్తే దాన్ని బలవంతంగా పెకలించి ఉప్మాని పెట్టుకొని దానిలో గుండ్రం గా ఉండలుగా ఉన్న వాటిని చేత్తోచిదుపుతుంటే రవ్వ జలజలా రాలుతున్నా కలిపేసుకొని బుజ్జిగాడూ ..చాలా బావుందిరా ..అమ్మకూడా ఇలా ఎప్పుడూ చేయలేదు అంటూ దాంట్లోనే మజ్జిగ కలిపేసుకొని తినేసి నాకు అన్నం వండుతుంటే అర్ధం కాలేదు . నేనూ అదేతిందామని ఎక్కువే చేశానుకదా అని నోట్లో పెట్టుకోగానే ఏడుపొచ్చేసింది . అంత కష్టపడినా అమ్మ చేసినట్టు రాలేదు ఏం బాలేదు అంటే ...లేదురా చాలా బావుంది అమ్మెప్పుడూ టమోటాలే వెయ్యలేదు . అంటూ నాకు అన్నం తినిపించారు . అంతే కాదు తర్వాతకూడా చాన్నాళ్ళు మా బుజ్జమ్మ ఉప్మా చేసింది అంటూ అందరికీ చెప్పేవారు .అమ్మొచ్చాక కూడా అంతే బుజ్జమ్మ ఉప్మా బ్రహ్మాండంగా చేసిందని చెప్పారు .ఇప్పుడు తలుచుకుంటే కళ్లు చెమరుస్తాయి .

ఎంత చండాలంగా చేసినా నా మొదటి ప్రయత్నం అవటం వల్లనో ఏంటో ..ఉప్మా నా ఫేవరేట్ టిఫిన్ . ఇప్పుడు అలాచేయను లెండి . మా శ్రీవారు ఉప్మా ఇష్టమేంటో ..తప్పకపోతే తింటాం కానీ అని వెక్కిరిస్తూనే ...నాకోసం నేర్చుకొని నాకంటే ఎక్సలెంట్ గా చేస్తారిప్పుడు .

** ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచా ...నాకు ఉప్మా చేయడం ఎలాగో చెప్పిన సత్యవతి అక్క అప్పటికి తను ఒక్కసారికూడా చేయలేదట !ఆ సంగతి తర్వాత వాళ్ళమ్మ గారు చెప్తే తెలిసింది :) :)

Friday, July 10, 2009

అక్షింతలు...


కళ్ళముందు నువ్వు లేకుంటేనేం ?
రెప్పమూసినపుడల్లా నిను చూస్తూనేఉన్నా!
నిను చేరనీయక విధి శాశిస్తే ...
నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తా!
నువ్వు నా ప్రేమను కాదన్నా ...
నీ సుఖమే నేకోరుకున్నా !
అందుకే అశ్రువులే అక్షింతలుగా ...
నినునేదీవిస్తున్నా !
ఇది నా ఓటమి కానేకాదు....
మరుజన్మనేది నిజమేఐతే ,
నీ ఒడిలో పసిపాపనై ...
నీ ప్రేమను గెలుచుకుంటా !

Thursday, July 2, 2009

గోరింట పూసింది...అరచేత !


గోరింటాకు ....
కన్నె నుండి బామ్మ వరకూ అందరినీ మురిపించే ముద్దుటాకు!అట్లతద్ది తర్వాత అందరూ ప్రత్యేకంగా పెట్టుకొనేది ఆషాడంలోనే .

ముద్దుపాపలు అమ్మ ఒడిచేరి నా చేయికంటే గోరింటాకు రుబ్బిన నీచేయి ఎర్రగా పండిందేమంటూ గారాలు పోతారు .ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటూ అమ్మమ్మలు పెట్టిన గోరింట ...నీకెలా పండిందంటే నీకెలా పండిందంటూ రాబోయే వరుడ్ని అరచేతి గోరింట చూసుకొని మురిసిపోతారు కన్నె బంగారు తల్లులు . కొత్త పెళ్ళికూతురు ఆషాఢపు వియోగం మరచి పండిన ఎరుపు చూసుకొని ...మగని ప్రేమ తలచుకొని సిగ్గుల మొగ్గయిపోతుంది .

గోరింటాకు ఇష్టపడని స్త్రీలు అరుదనే చెప్పాలి .మిగతావారి సంగతికేం కానీ నాకు మాత్రం గోరింటాకంటే చిన్నప్పట్నుంచీ చాలా ఇష్టం . ఈ కోనులూ....కొత్తరకాల డిజైనులూ...ఎన్ని వచ్చినా ఆకు రుబ్బి వేళ్ళ నిండుగా ...అరచేత చందమామ చుక్కలు పెట్టుకోవడమంటేనే నాకు ఇష్టం . సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు మా పొలంగట్టు మీద గోరింటాకు చెట్టు ఉండేది మా సోమయ్య ( పాలేరు ) బుజ్జమ్మ వచ్చిందంటూ తువ్వాలు నిండుగా ఆకు కోసి తెచ్చేవాడు . అప్పట్లో మిక్సీలు లేవు అమ్మమ్మ రుబ్బురోలులో వేసి చింత పండు , కుండ పెంకు , పటిక ( నాకు అవే గుర్తున్నాయి ) వేసి మెత్తగా రుబ్బి వాకిట్లో గట్టుమీద కూర్చోబెట్టి రెండు చేతులకూ ..కాళ్ళకు పారాణీ ....పచ్చటి కాళ్ళకు అందంగా పండుతుంది అంటూ ఇంత వెడల్పు పారాణీ పెట్టి ..ఇంకా రెండు కాళ్ళ క్రిందా రెండు మొక్కల పీటలు పెట్టి అరికాలు అంతా పెట్టేది .ఆ తర్వాత అన్నం కలుపుకొని వచ్చి తినిపిస్తుంటే ...వెన్నెట్లో చందమామని చూస్తూ ..అరచేత పండబోయే చందమామని ఊహించుకుంటూ ...అమ్మమ్మ చేతి గోరుముద్దలు తినడం మరిచిపోలేని అనుభూతి !

ఆ తర్వాత కొంచెం పెద్దదాన్నయినా ...నాన్నగారి ఉద్యోగరిత్యా రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తెలిసిన వారెవరైనా గోరింటాకు ఇస్తే అమ్మ నాకు పెట్టి ..అన్నయ్యకు కూడా కొద్దిగా దాచి ఉంచేది . చేతులూ , కాళ్ళూ నిండుగా పెట్టుకున్నా అన్నయ్యకి మిగల్చటం నాకు ఇష్టముండేది కాదు ఎందుకంటే ఎంత కొంచెం మిగిలినా దాన్ని అందంగా ( వాడికి క్రియేటివిటీ ఎక్కువలెండి ) పెట్టుకొనేవాడు .నాకంటే ఎర్రగా పండేది .అంతేకాదు కొత్తగా NTR సినిమాలు రిలీజైతే ఆ పేరు అన్నయ్య చేతిమీద ప్రత్యక్షం !EX: గజదొంగ ...అలాగన్న మాట ! అన్నయ్య ఆయనకి వీరాభిమాని లెండి . పైగా నేను నిద్రపోయాక పెట్టుకొని పొద్దుట లేచాక చూపించేవాడు .నేనేమో ఉడికిపోయి నువ్వెందుకు వాడికిచ్చావ్ ?అత్తయ్యగారు నాకోసం పంపిస్తే అంటూ అమ్మ దగ్గర పేచీ పెట్టేదాన్ని ..అప్పట్లో మొండిఘటాన్ని లెండి ...అన్ని విషయాల్లోనూ అనుకొనేరు గోరింటాకు , పూలూ ఇవి ఎన్ని ఉన్నా నాకే సరిపోవనిపించేది .

ఆషాడం మొదలైంది ఎలాగైనా గోరింటాకు కావాలని పెచీపెడితే ( ఆ రెండు విషయాల్లోనూ ఇప్పటికీ పెంకి పిల్లనే ) మా శ్రీవారు ఏం తంటాలుపడి తెచ్చారో గానీ మిక్సీలోవేసి చేతికి పెట్టుకొంటుంటే ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు వెల్లువలా పొంగుకొచ్చాయి . చందమామ , వెన్నెలా , అమ్మ చేతి గోరుముద్దలూ ...ఇవేవీ ఇప్పుడు లేకపోయినా ..ఎడమ చేతికీ , రెండు కాళ్ళకూ పారాణీ పెట్టుకున్నాక ...శ్రీవారిచేత కుడిచేతికి పెట్టించుకోవడం మరింత అందమైన అనుభూతి ! వచ్చిరాక ఆయన పెడుతుంటే వంకలు పెడుతూనే మహారాణీలా పెట్టించుకుంటా ! ఈ విషయం ఎవరికీ చెప్పకండేం? రాస్తూంటే నా చేతికన్నా ఎర్రనైంది నా మోము .అయినా మన మిత్రులతోనే కదా అని పంచుకొంటున్న అనుభూతి ఇది !పై ఫోటోలోని కుడి చేతి సింగారం మా శ్రీవారి పుణ్యమే ....

Saturday, June 27, 2009

పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )


యయాతి పుణ్య ఫలంగా అతనికి సిద్ధలోక ప్రాప్తి కలుగుతుంది .ఐతే కొన్నాళ్ళకు తన తపస్సును ప్రశంసించుకొని , ఇతరుల తపస్సును చులకనగా చూడటం వల్ల అతని పుణ్యం క్షీణించి యయాతి సిద్ధలోకం నుండి క్రిందకు పడిపోసాగాడు. ఇది చూసిన తోటి రాజులలో ఒకడైన అష్టకుడనే రాజు యయాతితో ...రాజా ! మీరు పడిపోకుండా ఇక్కడే ఉండేలాగ నా పుణ్యాన్ని మీకు ధారపోస్తాను అన్నాడు . అప్పటికే తన తప్పు తెలుసుకున్న యయాతి ఓ రాజా ! దానం అనేది కేవలం వేదవిదులైన బ్రాహ్మణులు , అశక్తులైన దీనులు మాత్రమే స్వీకరించాలి నేను ఆరెండూ కాదు కాబట్టి నీ దానాన్ని స్వీకరించే అర్హత లేదు కాబట్టి తనని క్రింద పడనీయమన్నాడు .

అక్కడే ఉన్న మరికొంతమంది రాజులను కూడా యయాతి తిరస్కరించాడు .అది చూసిన వశుమానుడనే మహారాజు ముందుకు వచ్చి యయాతి మహారాజా ! మీవంటి పుణ్యాత్ములు ఈలోకంలోనే ఉండాలి మీరు దానం స్వీకరించనన్నారు కనుక మీరు నాకు గుప్పెడు గడ్డిని ఇవ్వండి బదులుగా నా పుణ్యఫలం మొత్తం మీకిచ్చేస్తాను .మూల్యం చెల్లించారు కాబట్టి ఇది దానం కాదు అన్నాడు .

అప్పుడు యయాతి చిరునవ్వుతో తగిన వెల చెల్లించకుండా ఏ వస్తువును స్వీకరించినా అది కూడా దానం క్రిందకే వస్తుంది కాబట్టి వృధా ప్రయాస పడకండి . నా కర్మఫలాన్ని నన్నే అనుభవించనీయండి .....విధాత నిర్ణయించిన దానికి తలవంచుటయే నా ధర్మం అంటూ అందరికీ వినమ్రతతో చేతులు జోడించాడు .

** సాధారణంగా పల్లెల్లో కొబ్బరికాయలు , అరటిపళ్ళు , ఇంకా ప్రత్తి ...మొదలైనవి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి .దాంతో ఇరుగుపొరుగు వారికీ , బంధువులకూ ...దేవుడికైతే ఒక రూపాయిచ్చి తీసుకెళ్ళమని అనటం అలవాటుగా ఉంటుంది . అది తప్పని చెప్పటం హరిదాసుగారి ఆంతర్యం .

Monday, June 22, 2009

సూర్య చంద్రులమా ? మనం !


నేస్తం !
నీకూ నాకూ మధ్య ఏమంత దూరం ?
మనిద్దరి నివాసమూ ఒకటే .......
ఐనా ..మనమెప్పుడూ కలుసుకోలేం
నువ్వున్నప్పుడు నేను రాలేను
నేనున్నప్పుడు నువ్వు రావు ...
ఐతే ..నువ్వేమో స్వయం ప్రకాశివి
నేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని
నాలో ఇముడ్చుకొని వెలుగుతున్నా !
ఏ యుగాంతానికైనా నీ ఆలింగనం
దొరక్కపోతుందా అని యుగాలుగా
ఎదురు చూస్తూనే ఉన్నా !
ఇంతకూ ......మనం ...
సూర్య చంద్రులమా ?

Saturday, June 13, 2009

పిట్ట కధలు -1


పల్లెల్లో ఉత్సవాలప్పుడు వసంత నవరాత్రులు , గణపతి నవరాత్రులు , దేవీ నవరాత్రులు ...ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు ఆలయాల్లో రాత్రివేళ ఏవైనా కార్యక్రమాలు పెట్టటం జరుగుతుంది ..వాటిలో ఓ రోజు తప్పకుండా హరికధ పెట్టిస్తారు .ఆ హరికధ చెప్పే భాగవతార్ లేదా భాగవతారిణి చెప్పే అసలు కధ కంటే కొసరుగా చెప్పే కధలే ఈ పిట్టకధలన్నమాట !

సుష్టుగా భోజనం చేసి చేరతామేమో గుడికి ...కధ మొదలైన కాస్సేపటికే కునికి పాట్లు వచ్చేస్తాయి ..అప్పుడు హరికధాగానం మధ్యలో ఘాట్టిగా హరినామస్మరణ చేయిస్తారు మన భాగవతార్ గారు. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా పిట్ట కధ హాస్యాన్ని జోడించి మొదలెట్టగానే కాస్తో కూస్తో ఉన్న మత్తు వదిలిపోతుందన్న మాట !

అటువంటి పిట్టకధలను నేను విన్న కొన్నిటిని మీతో పంచుకోవాలని ఈ టపా ! ఇవి మీక్కూడా తెలిసినవే అయి ఉంటాయి ఐనా మరోసారి గుర్తుచేసుకుంటారు కదూ !

ఇప్పుడొక బుల్లి పిట్టకధ !
అనగనగా ఓ మూర్ఖుడు ...వాడు ఎన్నడూ దైవనామ స్మరణే చేసేవాడు కాదు .ఒకరోజు వాడికి చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊరు చూడాలనే బుద్ధి పుట్టింది .వెంటనే ఊరిచివర ఉన్న ఓ పెద్ద చెట్టు చివరికంటా ఎక్కేశాడు ...కానీ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల విరిగి పడిపోతూ కాస్త పట్టు ఉండి వేళ్ళాడుతూ ...ఓయ్ ..ఎవరైనా ఉన్నారా ...పడిపోతున్నా ...అంటూ అరవ సాగాడు.కానీ ఊరు శివారు ప్రాంతం వల్ల ఎవ్వరూ పలకలేదు .

పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని వీక్షిస్తూ ఉండగా ఈ దృశ్యం వారి కళ్ళబడింది .పార్వతీ దేవికి జాలి కలిగి ఎంతైనా తల్లి మనసు కదా ...పరమేశ్వరుడ్ని స్వామీ అతడ్ని కాపాడండి అని అడిగింది .అప్పుడు స్వామి ..దేవీ ..ఇతడు మూర్ఖుడు ..పుట్టి బుద్ధెరిగాక దేవుడ్ని ఒక్కసారి కూడా తలచలేదు ...ఎవ్వరికీ సాయపడిందీ లేదు ఐనా నువ్వు అడిగావు కాబట్టి ఒక పని చేద్దాం ...పడేటప్పుడు అమ్మా అని పిలిచాడనుకో ...నువ్వు కాపాడు ...అయ్యా అంటూ పడితే నేను కాపాడతాను అన్నాడు చిరునవ్వుతో ....ఎవరైనా రెండిట్లో ఏదోకటి అంటారు కదాని సరే అంది అమ్మవారు .

ఈలోగా కొమ్మ విరిగి పడిపోసాగాడా మూర్ఖుడు .పడిపోతూ బాబోయ్ .....అంటూ అరిచాడు . శివ పార్వతులు మూర్ఖుడ్ని మనం కూడా బాగు చేయలేం అనుకుంటూ నిష్క్రమించారు .

Wednesday, June 3, 2009

మీకు తెలుసా ?


చాలా యుగాల క్రిందటి మాట ! క్షీర సాగర మధనం జరిగింది . శ్రీ మహా విష్ణువు మోహినీ రూపంతో అమృతాన్ని దేవతలకు పంచేశాడు . రాక్షసులు అది మనసులో పెట్టుకొని తమ వర గర్వంతో , కామరూప విద్యలతోనూ ..దేవతలమీద దండ యాత్రలు చేశారు .ఐతే విష్ణు మాయ వల్ల ఎప్పుడూ చివరికి దేవతలే గెలిచేవారనుకోండి ...ఇక మన విషయం లోకి వస్తే ...

పై కధంతా తెలిసిన మానవుడొకడు ...తీవ్ర తపస్సు చేశాడు . అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఎందుకు మానవా ఇంత తీవ్ర తపస్సు చేస్తున్నావ్ ? అని అడిగాడు .
మానవుడు ..స్వామీ దేవతలకు ...అమృతాన్ని ఇచ్చారు ...రాక్షసులకు కామరూప విద్యలన్నీ తెలుసు ...కాని మా మానవులకు అన్యాయం జరిగింది .కనుక మాక్కూడా అమృతాన్ని రుచి చూసే భాగ్యం కలగచేయండి . అని ప్రార్ధించాడు .

అప్పుడు బ్రహ్మ దేవుడు ...నాయనా అమృతాన్ని మీకిస్తే దేవతలకూ , మానవులకూ తేడా లేకుండా పోతుంది ..మానవులకు జరా మరణాలు తప్పనిసరి కదా ! కనుక అమృతం తో సరిసమానమైన రుచి కలిగిన దానిని మీకు వరం గా ఇస్తున్నాను తీసుకో అంటూ అతని చేతిలో ఒక పండు జార విడిచాడు .

మానవుడు మహా ప్రసాదంగా కళ్ళకద్దుకొని ఆ ఫలాన్ని ఆరగించి దాని రుచికి మైమరచి పోయి ...ఆహా ..ఈ ఫలాన్ని మన ముందు తరాలవారందరూ ఆరగించాలని ....ఆలోచించి ..ఆ విత్తనాన్ని భూమిలో పాతాడు .దానినుండి వచ్చిన మొక్క ...మానై ...కాయలు కాసింది .ఆ కాయలు ఇప్పటికీ ప్రతి వేసవిలోనూ నోరూరిస్తూ మనముందుకొస్తున్నాయి.

ఆ రోజు బ్రహ్మ ఇచ్చిన పండే ఈ రోజు మనం అందరం ఇష్టపడి తినే మామిడి పండు అన్నమాట !

** కధ చదివిన వారంతా క్షమించాలి ! ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఇది కల్పితమని !
మామిడిపళ్ళు అంటే నాకు ప్రాణం !మా వాళ్లు అందరూ వెక్కిరిస్తారు నీ అంత మావిడి పళ్ళ పిచ్చి ఎవరికీ ఉండదని !
అలా వెక్కిరించిన వారికి నేను చెప్పే కల్పిత గాధ ఇది ...కనుక మీరూ సరదాగా తీసుకుంటారు కదూ .... :)

Monday, June 1, 2009

చిట్టితల్లీ......( కవిత )


చిట్టితల్లీ ! వెళ్ళిపోయావా ?
అమ్మ ఒడిలోకి రాకముందే ...
ఈ లోకపు కుళ్ళును చూడలేక
ఆడపిల్లవని అలుసు చేస్తామని ..
చదివినంత చదువు చెప్పించమేమోని
చెప్పించినా ...అల్లరిమూకల
ఆకలి చూపుల కెరకాలేక
ప్రేమోన్మాదుల యాసిడ్ దాడుల భయంతో
అనుమానపు చూపుల అవహేళన
తట్టుకొని నిలువలేక ...
అత్తవారింట వరకట్నపు కోరలకు
ఆహుతి కాలేక ...కన్నవారి
కడుపులో చిచ్చు పెట్టలేక
ముందుగానే వెళ్ళిపోయావా
చిట్టితల్లీ .....
చుక్కల లోకంలో మబ్బుల
తూగుటుయ్యాలలో .....
ఊయలలూగేందుకు హాయిగా ......

Thursday, May 28, 2009

ఆరంభ శూరత్వం !


చిన్నప్పుడు అంటే ఇంకా స్కూల్ లో వెయ్యకుండానే ..నాన్నగారు చెప్పిన పాటలూ ..పద్యాలూ ...చిలకపలుకుల్లా పలకటం చూసి కూతురు ప్రతిభకి మురిసి పోయి ఒక సవత్సరం ముందే నన్ను స్కూల్ లో వేసేయ్యడానికి నిర్ణయించేసుకున్నారు అమ్మ నాన్నగారునూ ...వయసుదేముందిలే (అప్పట్లో బర్త్ సర్టిఫికేట్ అడిగేవారు కాదనుకుంటా ) ఒక సంవత్సరం ఎక్కువ వెయ్యొచ్చు అనుకున్నారు .

అప్పుడు మేముండే ఊర్లో ఒకే ఒక ఇంగ్లీషు మీడియం కాన్వెంటు ఉండేది .సరే కూతురు ఏ కలెక్టరో ...డాక్టరో ...అయిపోవాలని ముచ్చటపడిపోయి ఒకేడు ఎక్కువ వయసు వేయించి మరీ కాన్వెంట్ లో జాయిన్ చేశారు .సరే ఎదురు చూసిన రోజు రానే వచ్చింది .ఆ రోజే నేను మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళటం .అమ్మ చక్కగా తయారు చేసింది .నా పుస్తకాల పెట్టె ( అప్పట్లో ఇండాలియం బాక్సులు ఉండేవి ) తోపాటూ ....మరో బుట్ట ! దాంట్లో లంచ్ బాక్స్ ,వాటర్ బోటిల్ తోపాటూ స్నాక్స్ బాక్స్ , జూస్ బోటిల్ , ఇంకా పాల ఫ్లాస్క్ ...సరంజామా సిద్ధం . ఇంతకూ స్కూల్ మూడు గంటల వరకే ! సరే ఇక స్కూల్ కి వెళ్ళాకా ..అక్కడ టీచర్ కీ ...ఆయాకీ ...నన్ను అప్పగించి ..పొద్దుట ఇంటెర్వల్ లో పాలు , బిస్కెట్ లూ ....మద్యాహ్నం లంచ్ , తర్వాతి ఇంటెర్వల్ లో జూస్ ఇవ్వాలని అన్ని జాగ్రత్తలూ ఆయాకి చెప్పి ..కొద్దోగొప్పో ఆమెకి లంచమిచ్చి మంచి చేసుకొని వదల్లేక వదిలి వెళ్ళారు నాన్నగారు . ఇక్కడ మీలో ఆకాశమంత సినిమా చూసిన వారంతా
ప్రకాష్ రాజ్ ను గుర్తు తెచ్చుకోవాల్సిందే !

నా సరంజామా చూసిన వాళ్ళకి నేను చదువుకోడానికి వెళ్తున్నానా ...లేక తినటానికి వెళ్తున్నానా అనిపిస్తే అది వాళ్ల తప్పు కాదు మరి ! ప్రతి రోజూ నాన్నగారు దింపడం ( రిక్షాలు ఉండేవి కానీ తనే దింపేవారు) ...ఆయాకు అన్ని జాగ్రత్తలతో అప్పగించడం జరిగేది .సరే మనం కూడా శ్రద్ధగా A B C D లు దిద్దడం నుంచి ...మెల్లగా రైమ్స్ ,చిన్న చిన్న పదాల్లోకి వస్తున్నాం .ఈలోగా ఒక విషయం ఇంట్లో తెలిసి పోయింది .

నా దురదృష్టవశాత్తూ ...మా ఆయాకి ఓ కొడుకున్నాడు .వాడెప్పుడూ వాళ్లమ్మతోనే ఉండేవాడు .మన బుట్టంత నిండుగా ఏ బుట్టా వచ్చేది కాదేమో ..నన్ను ప్రత్యేకంగా ఓ ప్రక్కన కూర్చోబెట్టి తినిపించేది . తినిపిస్తూ నాకు రెండు ముద్దలు పెట్టడం ఇంక చాలా ..అని అడగటం ...మనకేం తెలుసు చాలు అనగానే మిగతా అన్నం కొడుక్కి పెట్టేయడం .అలాగే పాలు తాగుతావా ... నేను తాగను అనగానే వాడికి ఇచ్చేయటం ...జూస్ కూడా అంతే అమ్మ కష్టపడి పంపిస్తే నేను తాగేది రెండు సిప్ లు . కొన్నాళ్ళకు ఇంటర్వెల్ లో స్నాక్స్ బాక్స్ ఖాళీగా ఉండేది .

కొన్నాళ్ళు గడిచాక ...రోజు రోజుకీ చదివేసి చిక్కిపోతున్నానా ..లేకపోతె ఏంటీ ...అని అమ్మ ఒక రోజు కూర్చోబెట్టి బుజ్జీ ! అన్నం తింటున్నావా ?జూస్ తాగుతున్నావా ....అని బుజ్జగించి అడిగే సరికి ....మరే ..పాపం ..ఆయా వాళ్ల అన్నయ్యున్నాడు కదా ( వాళ్ల అబ్బాయి ) ....వాడు తినాలికదా ..అందుకే నేను చాలు అంటున్నానన్నమాట !అనేసింది బుజ్జి ...అదేనండీ ...నేను !

అంతే ఆ తర్వాత నాన్నగారు స్కూల్ కి వచ్చి ఆయాతో గొడవ పెట్టుకొని ...టీచర్ కి కంప్లైంట్ చేశారు . స్కూల్ మేనేజ్ మెంట్ అక్కడ ఉండేవారు కాదు .టీచర్ లేమో పట్టించుకోలేదు .దానితో నాన్నగారు గొడవ పెట్టుకొని స్కూల్ మానిపించేశారు . వేరే స్కూల్ లో వేద్దామని అనుకోని సంవత్సరం వేస్ట్ అవకుండా విరజాజి పూలు ....
టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టి తెలుగు అక్షరాలు నేర్పించి ...ఆ తర్వాతి సంవత్సరం తెలుగు మీడియం అంటే బోర్డు స్కూల్లో చేర్చారు .

అంత హడావుడిగా మొదలైన నా చదువు స్కూల్ ఫైనల్ పూర్తవ కుండానే ఆగిపోయిందనుకోండి .ఎందుకనేది మరో టపాలో.....

* పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)

Tuesday, May 26, 2009

పునరపి జననం !!( కవిత )


మానవ జన్మం భగవంతుని వరం
వినమ్రుడవై స్వీకరించు ....
జీవితం అంతులేని ప్రయాణం
అలుపెరుగక పయనించు ....
దేవుని సృష్టి ఒక అద్భుతం
ఆ అందాన్ని ఆస్వాదించు...
పరోపకారార్ధ మిదం శరీరం
సాటి ప్రాణులపట్ల దయఉంచు...
మృత్యువొక శాశ్వత సుఖం
ఎదురాడక తలవంచు ....
తప్పనిసరి మరుజన్మం
ఇదేకదా గీతాసారాంశం !

* ఈ కవితకు శీర్షిక సరైనదో ..లేక ఈ శీర్షిక పెట్టె అర్హత కవితకు ఉందొ లేదో ..అన్న సందేహంతో ఈ టైటిల్ పెట్టటం జరిగింది. మీ సూచనలు కోరుతున్నాను .

Saturday, May 23, 2009

నాన్నచెప్పిన కధలు -2


అనగనగా మన దేశాన్ని నవాబులు పాలించే రోజుల్లో ....
ఓ రాజ్యాన్ని పాలించే నవాబు గారికి 14 భాషలు వచ్చు .చాలా శౌర్యమూ , తెలివీ అన్నీ ఉన్నా ఆయనకు ఒక బలహీనత ఉండేది .అది ఆయనకు కధలంటే విపరీతమైన పిచ్చి . ఎంతంటే రాజ్యపాలన కూడా పట్టించుకోకుండా రోజంతా కధలు వింటూ కాలం గడిపేవాడు .ఎన్ని కధలు విన్నా ఆయనకు తృప్తి ఉండేది కాదు . తనకు వచ్చిన 14 భాషల్లో ఏ భాషలోనైనా తను విసుగొచ్చి ఆపమనేంత వరకు కధలు చెప్పగలిగిన వారికి లక్ష దీనారాలు బహుమతి అనీ ...అలా చెప్పలేక పొతే 100 కొరడా దెబ్బలు శిక్ష అనీ రాజ్యంలో ప్రకటన చేయించాడు .ఎంతోమంది కవులూ ,పండితులూ నవాబుగారి దీనారాలకు ఆశపడి రావడమూ ....ఆయన్ను మెప్పించలేక శిక్ష అనుభవించి వెనుతిరగటమూ జరిగేది .

ఇదిలా ఉండగా రాజ్యంలో వర్షాలు కురవక కరువు తాండవించసాగింది.పంటలు పండకపోయినా పన్నులు కట్టవలసి రావడం నవాబుగారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా కధలతో కాలక్షేపం చేయడంతో రాజ్యం అస్తవ్యస్తమై పోయింది . మధ్యలో అధికారులూ , భటులూ ప్రజల వద్ద అందిన కాడికి దోచుకునేవారు .ప్రజలంతా అన్నమో రామచంద్రాని అలమటించే పరిస్థితి వచ్చింది .

ఆ రాజ్యంలోని ఓ కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు .తనకున్న నాలుగెకరాలూ పండించుకుని భార్యా పిల్లలతో హాయిగా కాలం గడిపేవాడు . కరువు ...రాజభటుల పన్నుల వసూళ్ళతో కుటుంబం ఆకలితో పస్తులుండే పరిస్థితి వచ్చింది . ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని రాజధానికి పనివెతుక్కుంటూ వెళ్ళాడు ఆ రైతు . అక్కడ రాజుగారి ప్రకటన గురించి తెలుసుకున్న రైతు స్వతహాగా తెలివైన వాడవటం చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా రక్షించుకోవాలని అనుకున్నాడు .

నవాబుగారు దర్బారులో కొలువై ఉండగా తాను కధ చెప్పటానికి వచ్చానని రైతు చెప్పగానే రాజుగారితో సహా సభికులంతా హేళనగా నవ్వారు . మహా పండితులే నవాబుగారికి విసుగు తెప్పించలేకపోయారు ఇతనెలా ఆయన చేత ఇక చాలనిపిస్తాడని ఆశ్చర్యపోయారు .నవాబుగారు సరే కానీ శిక్ష తెలుసుకదా ....నాకు విసుగోచ్చేవరకూ చెప్పలేకపోతే 100 కొరడా దెబ్బలు అన్నారు . రైతు తెలుసు ప్రభూ ..కాని నేను మీకు విసుగు వచ్చేవరకూ కధ చెప్పగలిగితే మాత్రం మీరు ఇంకెప్పుడూ కధలు వినకూడదు అన్నాడు .అతని ధైర్యానికి సభంతా నిర్ఘాంత పోయినా నవాబుగారు చిరునవ్వుతో ఒప్పుకున్నారు ధీమాగా తనకు విసుగొచ్చినప్పుడుకదాని ...

రైతు కధ చెప్పటం ప్రారంభించాడు .అనగనగా ఓ ఊరు . ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రిచెట్టు . ఆ చెట్టుకు లెక్కపెట్టలేనన్ని ఆకులు ....నవాబుగారు ...ఫిర్ ....అన్నారు .ప్రతీ ఆకు మీదా ఓ కొంగ ..అన్నాడు రైతు ....ఫిర్ ...అన్నారు నవాబుగారు.ఒక ఆకుమీది కొంగ తుర్ మని ఎగిరి పోయింది అన్నాడు ఆయన తిరిగి ..ఫిర్ ..అన్నారు ...రైతు ఇంకో ఆకుమీద కొంగ తుర్ మని ఎగిరిపోయింది అన్నాడు . మళ్ళీ నవాబుగారు ..ఫిర్ ..అనటం ...తిరిగి రైతు తుర్ ..అనడమూ ..ఇలా చాలాసేపు జరిగాక నవాబుగారు అడిగారు ఇంకా ఎంతసేపు ఎగిరిపోతాయి అని ..లెక్కలేనన్ని ఆకులు కదా ప్రభూ ..ఈ రోజు పూర్తవ్వచ్చు.. రేపు పూర్తవ్వచ్చు ..లేదా వారం తర్వాత పూర్తవ్వచ్చు ...అన్నాడు .ఎన్నిసార్లు తాను ఫిర్ అన్నా తిరిగి అతను తుర్ అనే అంటాడని అర్ధమై పోయింది ....నవాబుగారికి విసుగుపుట్టసాగింది.ఇక చేసేది లేక ఇంక చాలు ఆపు అన్నారు .

అప్పుడు నవాబుగారు రైతు తెలివిని మెచ్చుకొని తాను ప్రకటించిన బహుమతితో పాటూ ..తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు . అంతేకాదు రైతు ద్వారా రాజ్యం లోని పరిస్థితులు తెలుసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ...దళారులను శిక్షించి ...ఆదర్శవంతంగా పరిపాలించారు.

* తెలివైనవారు ఎప్పుడూ తన తెలివిని తమ స్వార్ధం కోసం మాత్రమే కాకుండా సాటివారికోసం కూడా ఉపయోగిస్తే అందరూ బావుంటారు .

Wednesday, May 20, 2009

అశ్రువు ...( ఓ బుల్లి కవిత )


నేస్తం !
నీ కన్నుల్లో పుట్టి ...
నీ చెక్కిలిపై జారి ...
నీ పెదవులపై జీవించి ...
హృదయం పై మరణిస్తే .....
క్షణ కాలమైతేనేం ?
నీకు సాంత్వన కలిగితే
నా జన్మ ధన్యం !

Sunday, May 17, 2009

వారి ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా ....


వారికి ఇంద్ర ధనుస్సు తెలియక పోవచ్చు .కాని వారికీ ఓ రంగు తెలుసు ..అది ..నలుపు ...ఆ రంగు నుండే స్ఫూర్తి నింపుకొని ..ఆత్మవిశ్వాసంతో ...జీవన పోరాటం సాగిస్తున్న వారి ముందు దైవం తలదించాల్సిందే ...తాను ఇచ్చిన లోపాన్ని శాపం అనుకోకుండా ...తనను నిందించకుండా ...నీ దయవల్లె ప్రభూ ..అంటూ వారు నమస్కరిస్తుంటే ...దైవం తలదించాల్సిందే ...

వారంతా అంధ గాయకులు ..సంగీతం వచ్చిన వారు , రానివారూ కూడా ఉన్నారు .అటువంటి అంధ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్న ఈ టివి వారు అభినందనీయులు .ఈ టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమం బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్. సంగీత విద్వాంసులు మోహన కృష్ణ గారు ,యువకవి అనంత శ్రీరాం , సినీనటి లయ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈకార్యక్రమానికి ఝాన్సీ యాంకరింగ్ కూడా హుందాగా ఉంటోంది .

అంధులైన వారంతా అధ్బుతంగా పాడటంలోనే కాదు , ఆత్మవిశ్వాసం లోనూ వారికి సాటి వారే ! ఈకార్యక్రమం ఫైనల్స్ కి కళాతపస్వి శ్రీ k.విశ్వనాద్ గారు రావడం ఈ కార్యక్రమానికి మరింత నిండుదనాన్నిచ్చింది .

గాయకుల ఫెర్ఫార్మెన్స్ ఒక ఎత్తైతే ప్రోగ్రాం ఫైనల్స్ లో స్వాతి అనే అమ్మాయి( అంధురాలు ) చేసిన డాన్స్ నా శరీరాన్ని రోమాంచితం చేసింది . ఆ అమ్మాయి దీపాలు చేతపట్టి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది .ఆ అమ్మాయి చేసేటప్పుడు కాలి చివర చెంగు ఎక్కడ కాలుతుందోని భయపడ్డాను .కాని స్వాతి ఎటువంటి బెరుకు లేకుండా చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది .
నృత్యం పూర్తయ్యాక ఆమెను అభినందిస్తూ విశ్వనాద్ గారు తన వయసును ,అనుభవాన్ని మరచి స్వాతి చేతిని తన తలపై ఉంచుకొని ఆశీర్వచనం తీసుకున్న తీరు ....నన్ను కంటతడి పెట్టించింది .అది ఆయన కళామ తల్లికి ఇచ్చిన గౌరవమే...అంతే కాదు ...ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఏవిటో ఆయన్ను చుస్తే తెలిసింది .ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన మాట్లాడిన తీరు ...పార్టిసిపెంట్స్ నుండి తాను స్ఫూర్తి పొందానని చెప్పటం ఆయన వినమ్రతను , ఆయన వ్యక్తిత్వాన్ని మనముందుంచుతుంది .

సుదీర్ఘంగా సాగిన ఈ ప్రస్థానంలో చివరి వరకు నిలిచి గెలిచిన వారు ముగ్గురు . వారిలో మొదటి స్థానంలో బాలరాజుగారు , రెండవ స్థానంలో మాధవ గారు , మూడవ స్థానంలో దొరబాబు గారు నిలిచారు .

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ...వారి గెలుపును పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించి సంతోషించడం . చాలా షోల్లో ఓడిపోయిన వారు ఏడవటం ..ఎలిమినేషన్ రౌండ్లు ఎంత భీభత్సంగా ఉంటాయో మనందరికీ తెలుసు . ఐతే ఇక్కడ చూపుతోపాటు ఈర్ష్యా ద్వేషాలు కూడా లేని వీరంతా ఎంతో హుందాగా వైదొలగారే గానీ ఎక్కడా కంట తడి పెట్టలేదు. గెలిచిన వారు మాత్రమే కంట తడి పెట్టారు ఉద్వేగంతో ....

*త్వరలో బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో చిన్నారుల ప్రతిభను మనందరం చూసి వారిని ప్రోత్సహిద్దాం .....

Saturday, May 16, 2009

చెలీ .....


చెలీ .....
చూపులా .... అవి నను చూసిన క్షణం
విరి తూపులై మానని గాయం చేశాయ్
తమకంతో నీ నడుమును చుట్టిన కొంగును
చూసి ఈర్ష్యతో నా గుండె భగ్గుమంది ...
చెరకువింటి విలుకాడు నా ఎదలో చేసిన
గాయం చాలదనా .... నీకీ విల్లంబులు ?
నీ నొసట కులుకు నెలవంక నడుగు
సోగ కళ్ళనడుగు .... పాల చెక్కిళ్ళ నడుగు
చిత్రకారుని కుంచెనే కదలనివ్వని
నీ నడుముకున్న ఒంపు నడుగు ....
నా గుండెకు చేసిన గాయం చెబుతాయవి !
ఐనా .... చాలదంటావా ....
నీ శరాఘాతంతో నా హృదయాన్ని చీల్చు ....
నీ కళ్ళ కొసల జాలువారే చిర్నవ్వుకే
తిరిగి పునర్జీవితుడ్నవుతా ....

Wednesday, May 13, 2009

విరజాజి పూలు ....


వేసవి ఇంకా వెళ్ళనే లేదు ...మల్లెలింకా కనుమరుగవలేదు ....అప్పుడే విరజాజులు దర్శనమిస్తున్నాయ్ !
విరజాజి పూలు ....ఈ పూలంటే నాకు చిన్ననాటినుండే చాలా ఇష్టం ...మరచి పోలేని అనుబంధం కూడా ...అదెలాగంటే ...

చిన్నప్పుడు నాకు ఓ టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టారు .అప్పటికి మనకి A B C D లు వచ్చాయి కాని అ ఆ లు రావు . ( చదువులో మనది ఆరంభ శూరత్వం లెండి ..దాని గురించి ఇంకో టపా రాసుకుందాం ) టీచర్ గారు ఇంటిలోనే మాకు ట్యూషన్ చెప్పేవారు .ప్రతి రోజూ సాయంత్రం నాన్నగారు కాని అన్నయ్య కాని సైకిల్ మీద ట్యూషన్ లో దించి , తిరిగి అయిపోయే వేళకు వచ్చి నన్ను తీసుకు వెళ్ళేవాళ్ళు .

అప్పట్లో నాన్నగారికి నైట్ డ్యూటీలు ఉండేవి .నైట్ షిఫ్ట్ ఐతే పగలు ఖాళీ కాబట్టి నన్ను తనే తీసుకెళ్ళేవారు . ఆయనకి పగలు డ్యూటీ ఐతే అన్నయ్య తీసుకెళ్ళేవాడు .ఎవరు తీసుకెళ్తే ఏంటీ ..అనుకుంటున్నారా ...
నాన్నగారు సైకిల్ మీద వెళ్ళినంత సేపూ ...మన ప్రధాని ఎవరు ? రైల్వే మంత్రి ఎవరు ? ఆర్ధిక మంత్రి ఎవరు ? రాష్ట్ర ముఖ్య మంత్రి ఎవరు? మన జండాకు ఎన్ని రంగులు ..వగైరా ..వగైరా ...ప్రశ్నలతో బుర్ర తినేస్తూ ...కూతురు చెప్పే సమాధానాలకు తెగ మురిసిపోతూ ....ఇలా ...పరమ బోర్ గా సాగేది .

అదే అన్నయ్యైతే చక్కగా అప్పటికి కొత్తగా వచ్చిన సినిమా పాటలు పాడుతూ ...పాట రానిచోట .....నోటితోనే దరువేస్తూ ..మధ్య మధ్య సైకిల్ బెల్ తో మ్యూజిక్ ఇస్తూ ...భలే సరదాగా ఉండేది .నేనేమో ప్రతి రోజూ నాన్నగారికి నైట్ షిఫ్ట్ ఉండాలని దేవుడ్ని కోరుకునేదాన్ని .కొద్దిరోజులకు దేవుడు నామొర ఆలకించాడో ఏమో నాన్నగారి డ్యూటీ మారలేదు కాని అన్నయ్యను మా టీచరు గారి టైప్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు నా ట్యూషన్ టైం లో ...అప్పటి నుండీ నాకు రోజూ పాటల పండగే ...

ట్యూషన్ టీచర్ గారింట్లో విరజాజి పూల పందిరి ఉండేది .మేం వెళ్ళేసరికి ఆవిడ మొగ్గలు కోసి ఓ నీళ్ళ గిన్నెలో వేసి ఉంచేవారు .పిల్లలకు ట్యూషన్ చెప్తూ విరజాజులు మాల కడుతూ ....మధ్య మధ్యలో ఆ గిన్నెలోని నీళ్ళతో పలకలు తుడుస్తూ ...అక్షరాలు దిద్దించేవారు .

మరి నేనేమో కాస్త యాక్టివ్ గా ,ముద్దుగా , బొద్దుగా ఉండేదాన్నేమో ...పైగా అందరికంటే చిన్నదాన్ని కూడానూ ..అందుకో ఏమో నేనంటే ఆవిడకు ప్రత్యేకమైన అభిమానం .పిల్లలందరూ వెళ్ళిపోయినా అన్నయ్య వచ్చేవరకు తనతోనే ఉంచుకొని ..ప్రతి రోజూ ఎంతో ప్రేమగా జాజిపూల దండ జడలో పెట్టి పంపించేవారు . ఒక్కరోజు మానేయాలన్నా పూలు మిస్ అయిపొతాయో...ఎవరికైనా ఇచ్చేస్తారో అని అస్సలు మానేదాన్ని కాదు .అదిగో అప్పట్నుంచే విరజాజులంటే బోల్డు ఇష్టం .

టీచర్ గారికి సినిమా థియేటర్ ఉండేది.వాళ్ల ఇల్లు కూడా థియేటర్ గేటు లోనుండి లోపలికి వెళ్తే ఉంటుంది .ఆర్ధిక పరిస్థితుల వల్ల వాళ్లు థియేటర్ 30 ఏళ్ళకి లీజుకు ఇచ్చేసి ..వాళ్ల పిల్లలు టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ...టీచర్ గారి భర్త ఏవో ఆయుర్వేదం మందులు ఇస్తూ ..ఈవిడ ట్యూషన్ చెప్తూ ..కుటుంబాన్ని నడుపుకునేవారు . అలా నాకు ప్రతి రోజూ పూలతో పాటు కొద్దిసేపు సినిమా చూసే చాన్స్ కూడా దొరికేది .

ఈరోజు తెలుగు తప్పుల్లేకుండా రాయగలుగుతున్నానంటే ఆమె చలవే .తర్వాత మాకు ట్రాన్స్ఫర్ ఐనా .. మళ్ళీ మాకు పది సవత్సరాల తర్వాత తిరిగి అక్కడికే ట్రాన్స్ఫర్ అవడం వల్ల తరచూ టీచర్ గారిని కలుస్తూ ఉండేదాన్ని .మా పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడూ మా వారితో కలిసి చూడటానికి వెళ్తే ఆ వృద్ధాప్యం లో ఆవిడ ఎంత సంతోష పడేవారో ...అందరూ మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదురా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు .ఒకసారి వెళ్ళేసరికి బొట్టు లేకుండా ...చాలా బాధనిపించింది ....కొన్నాళ్ల తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యి మా సొంత ఊరిలో స్థిరపడ్డారు . చాన్నాళ్ళు గాప్ తర్వాత ఆ ఊళ్ళో బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్లి ..టీచర్ గార్ని చూద్దామని వెళ్ళా ....కాని ఆవిడ లేరు .విరజాజి పందిరి మాత్రం తలూగించింది నన్ను ఓదారుస్తూ ...పాత నేస్తాన్ని కదూ ....
ఇప్పటికీ విరజాజుల్ని చూస్తె టీచర్ గారు ఆవిడ ప్రేమా తలపుకొస్తాయి .

Sunday, May 10, 2009

అమ్మ


దేవుడొక అధ్బుతాన్ని సృష్టించాడు
బంగారం కంటే విలువైన ... ( రూపం )
పూలకంటే సున్నితమైన ... ( హృదయం )
తొలి పొద్దువలె వెచ్చనైన ... ( ఒడి )
వెన్నెలకంటే చల్లనైన ... ( చూపు )
తేనె కంటే మధురమైన ... ( మాట )
శిఖరం కంటే ఎత్తైన .... ( వ్యక్తిత్వం )
సముద్రం కంటే లోతైన ... ( గంభీరత )
అంతెందుకు ?
తనకంటే గొప్పదైన ...
అమ్మను ...వరంగా ...
నాకోసం ....
** అమ్మా ! ఎప్పటికీ ఇదే వరాన్నడుగుతా ఆ దేవుడ్ని !!

Wednesday, May 6, 2009

స్నేహమా ! స్నేహమేనా ??


స్నేహంలో క్షమాపణలు .....
కృతఙ్ఞతలు ఉండకూడదన్నావ్
స్నేహంలో ఎదురుచూపులేగాని
పెదవి విరుపులు ఉండకూడదన్నావ్
స్నేహంలో కమ్మటి కలలేగాని
కలహాలు ఉండకూడదన్నావ్
స్నేహంలో లోకమంతా ....
కాంతివంతమన్నావ్ !
నీకది స్నేహమేనా ??
కాని నాకు మాత్రం ....
మన పరిచయం తర్వాత
ప్రతి రేయీ 'కల ' వరమే !
ప్రతి పగలూ కలవరమే !!
స్నేహమన్న ప్రతి చోటా
ప్రేమనన్వయించుకుంటుందేం ?
పిచ్చి మనసు .......

Sunday, May 3, 2009

తప్పక చూడండి !! ( సురేంద్రపురి )


యాదగిరి గుట్ట వెళ్ళారా ? ఈ మధ్య ..అంటే ఓ ఏడాది లోపులో ...వెళ్ళక పొతే తప్పక వెళ్లి రండి .హైదరాబాద్ నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షాలతో పాటు , పంచముఖ హనుమదీశ్వర అనుగ్రహం కూడా పొందవచ్చు .అంతే కాదు సంపూర్ణ భారత దేశ యాత్రానుభూతి కలుగుతుంది .

యాదగిరి గుట్ట స్వామివారి ఆలయమునకు వెళ్ళే దారిలో సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయం మరియు కుందా సత్యనారాయణ కళాధామం ఉన్నాయి .

సాధారణంగా ఆంజనేయస్వామి మనకు భక్తాంజనేయునిగా , వీరాంజనేయునిగా , ప్రసన్నాంజనేయునిగా ......కొలువై కనిపిస్తారు . ఇక్కడ పంచముఖాంజనేయుడై , సువర్చలా సమేతుడై దర్శనమిచ్చుట ఇచ్చటి విశేషము .ఈశ్వర , నారసింహ ,గరుడ , వరాహ, హయగ్రీవ ....ఈ ఐదు ముఖములతో అలరారు హనుమంతుని విగ్రహముతో పాటు అదే ఆవరణలో పంచముఖ విశ్వరూపుడైన శివుడు కొలువై ఉన్నాడు .ఆ శివలింగం నేపాల్ లోని పశుపతినాధ లింగాన్ని పోలి ఉండటం విశేషం .

కుందా సత్యనారాయణ కళాదామంఒక అపురూప పౌరాణిక విజ్ఞాన కేంద్రం ....అధ్బుత శిల్ప కళా సృష్టి కి నిలయం !
సురెంద్రపురిలో దాదాపు 10 సంవత్సరాలు కొన్ని వందలమంది కళాకారుల ,శ్రామికుల కష్ట ఫలం .
ఖమ్మం జిల్లా , మదిర తాలూకా , బసవాపురం వాస్తవ్యులు శ్రీ కుందా సత్యనారాయణ గారు భగవంతుడు అర్ధాంతరంగా దూరం చేసిన తమ చిన్న కుమారుడు సురేంద్ర శాశ్వత కీర్తిని భువిలో నిలుప దలచి అహోరాత్రులూ కష్టించి ,ఎన్ని అవాంతరాలు , కష్టనష్టాలు ఎదురైనా ..ఆరోగ్యం ,వయసు సహకరించక పోయినా స్వామిపైనే భారం వేసి ఈ మహత్తర కార్యాన్ని పూర్తి చేశారు .

కళాధామం విశేషాలు :

భారత దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నకళ్ళు ఇక్కడ నిర్మించడం విశేషం !సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని దర్శిస్తే ఒకింత ఆ అనుభూతిని పొందవచ్చు .
అంతేకాక బ్రహ్మ లోకం , విష్ణులోకం , శివలోకం , నాగలోకం , ఇంద్రలోకం ,యమలోకం ,నరకలోకం...శిక్షలు , పాతాళ లోకం ,....క్షీరసాగర మధనం , గజేంద్రమోక్షం , కాళీయ మర్దనం , గోవర్ధన గిరి ధారణం , విశ్వరూప సందర్శనం , పద్మవ్యూహం మొదలైన శిల్పాలతోపాటు .....రామాయణ , మహాభారత , భాగవతాలలోని ముఖ్య ఘట్టాలనూ అపూర్వంగా మలిచారు .

ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూడదగ్గ ప్రదేశం .ముఖ్యంగా పిల్లలకు పౌరాణిక విజ్ఞానం తక్కువగా ఉంటోంది . చక్కటి శిల్పాల ద్వారా ఆసక్తి కలిగించేలా పిల్లలకు మన పురాణాలను వివరించవచ్చు .కుటుంబ సమేతంగా చూడదగ్గ విశేషం .ప్రవేశ రుసుము కాస్త ఎక్కువ అనిపించినా ...అంతా చూసిన తర్వాత అంత పెద్ద కళా ధామ నిర్వహణ భారం సాధారణం కాదు అనే విషయం మనకు అర్ధమౌతుంది .

అక్కడి శిల్పకళను నాపరిధిలో చాలా క్లుప్తంగా వివరించాను ,నేను రాయని విశేషాలు ఇంకా ఉన్నాయి .చూశాక తప్పకుండా ఒక మంచి ఆధ్యాత్మికానుభూతి కలుగుతుంది .

Thursday, April 30, 2009

మహాకవి శ్రీ శ్రీ


ఆవేశం ఆయన సిరా ...
ఆయన కవితలు అక్షర చైతన్యాలు ....
పతితులార భ్రష్టులార , బాధా సర్ప దష్టులార ....అంటూ కవిత్వాన్ని వెన్నెల వాకిళ్ళ లోంచి శ్రామికుడి చెమట చుక్కల్లోకి ఈడ్చుకు వచ్చిన ప్రజాకవి .ఆ మానవీయుని శత జయంతి సందర్భంగా...."సిప్రాలి " నుండి .....

సిరిసిరిమువ్వలు

పాతబడి కుళ్లిపోయిన
నీతులనే పట్టుకుని మనీషుల మంటూ
నూతన జీవిత లహరికి
సేతువు నిర్మింతురేల ?సిరిసిరి మువ్వా !

నీత్యవినీతులలో గల
వ్యత్యాసము తెలిసినట్టి వాడెవ్వడు ?నా
కత్యవసరమొకటే , ఔ
చిత్యం వర్తమునందు, సిరిసిరి మువ్వా !

ప్రాస క్రీడలు

ఈ మంత్రుల హయాం లోన
రామ రాజ్యమెప్పుడు ?
పడమటి దిక్కున సూర్యుడు
పొడుచుకొచ్చినపుడు

ప్రజాస్వామ్య పార్టీల్లో
ప్రజలకు తావెప్పుడు ?
నేటి బీరకాయలోన
నేయి పుట్టినప్పుడు

లిమ క్కులు

నేను
ముసలివాణ్ణి
కాను అసలు వాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి

ఔను
నిజంగా నేను
ప్రజల కవినేను
ఎంచే తంటేను
వాళ్ళని చదివేను
చదివిందే రాసేను

కదన విహారానికి కత్తి పట్టు
కార్మిక వీరుడవై సుత్తి తిప్పు
ప్రగతి విరోధుల భిత్తి కొట్టు
సామ్య వాదాన్ని నీ గుండెల్లో హత్తి పెట్టు
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు

సామ్య వాదం
ఈనాటి వేదం
అందరిలో మారుమోగే నినాదం
అందరికీ అందిస్తుంది మోదం
అది సఫలం సుఫలం శ్రీదం