Thursday, May 28, 2009

ఆరంభ శూరత్వం !


చిన్నప్పుడు అంటే ఇంకా స్కూల్ లో వెయ్యకుండానే ..నాన్నగారు చెప్పిన పాటలూ ..పద్యాలూ ...చిలకపలుకుల్లా పలకటం చూసి కూతురు ప్రతిభకి మురిసి పోయి ఒక సవత్సరం ముందే నన్ను స్కూల్ లో వేసేయ్యడానికి నిర్ణయించేసుకున్నారు అమ్మ నాన్నగారునూ ...వయసుదేముందిలే (అప్పట్లో బర్త్ సర్టిఫికేట్ అడిగేవారు కాదనుకుంటా ) ఒక సంవత్సరం ఎక్కువ వెయ్యొచ్చు అనుకున్నారు .

అప్పుడు మేముండే ఊర్లో ఒకే ఒక ఇంగ్లీషు మీడియం కాన్వెంటు ఉండేది .సరే కూతురు ఏ కలెక్టరో ...డాక్టరో ...అయిపోవాలని ముచ్చటపడిపోయి ఒకేడు ఎక్కువ వయసు వేయించి మరీ కాన్వెంట్ లో జాయిన్ చేశారు .సరే ఎదురు చూసిన రోజు రానే వచ్చింది .ఆ రోజే నేను మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళటం .అమ్మ చక్కగా తయారు చేసింది .నా పుస్తకాల పెట్టె ( అప్పట్లో ఇండాలియం బాక్సులు ఉండేవి ) తోపాటూ ....మరో బుట్ట ! దాంట్లో లంచ్ బాక్స్ ,వాటర్ బోటిల్ తోపాటూ స్నాక్స్ బాక్స్ , జూస్ బోటిల్ , ఇంకా పాల ఫ్లాస్క్ ...సరంజామా సిద్ధం . ఇంతకూ స్కూల్ మూడు గంటల వరకే ! సరే ఇక స్కూల్ కి వెళ్ళాకా ..అక్కడ టీచర్ కీ ...ఆయాకీ ...నన్ను అప్పగించి ..పొద్దుట ఇంటెర్వల్ లో పాలు , బిస్కెట్ లూ ....మద్యాహ్నం లంచ్ , తర్వాతి ఇంటెర్వల్ లో జూస్ ఇవ్వాలని అన్ని జాగ్రత్తలూ ఆయాకి చెప్పి ..కొద్దోగొప్పో ఆమెకి లంచమిచ్చి మంచి చేసుకొని వదల్లేక వదిలి వెళ్ళారు నాన్నగారు . ఇక్కడ మీలో ఆకాశమంత సినిమా చూసిన వారంతా
ప్రకాష్ రాజ్ ను గుర్తు తెచ్చుకోవాల్సిందే !

నా సరంజామా చూసిన వాళ్ళకి నేను చదువుకోడానికి వెళ్తున్నానా ...లేక తినటానికి వెళ్తున్నానా అనిపిస్తే అది వాళ్ల తప్పు కాదు మరి ! ప్రతి రోజూ నాన్నగారు దింపడం ( రిక్షాలు ఉండేవి కానీ తనే దింపేవారు) ...ఆయాకు అన్ని జాగ్రత్తలతో అప్పగించడం జరిగేది .సరే మనం కూడా శ్రద్ధగా A B C D లు దిద్దడం నుంచి ...మెల్లగా రైమ్స్ ,చిన్న చిన్న పదాల్లోకి వస్తున్నాం .ఈలోగా ఒక విషయం ఇంట్లో తెలిసి పోయింది .

నా దురదృష్టవశాత్తూ ...మా ఆయాకి ఓ కొడుకున్నాడు .వాడెప్పుడూ వాళ్లమ్మతోనే ఉండేవాడు .మన బుట్టంత నిండుగా ఏ బుట్టా వచ్చేది కాదేమో ..నన్ను ప్రత్యేకంగా ఓ ప్రక్కన కూర్చోబెట్టి తినిపించేది . తినిపిస్తూ నాకు రెండు ముద్దలు పెట్టడం ఇంక చాలా ..అని అడగటం ...మనకేం తెలుసు చాలు అనగానే మిగతా అన్నం కొడుక్కి పెట్టేయడం .అలాగే పాలు తాగుతావా ... నేను తాగను అనగానే వాడికి ఇచ్చేయటం ...జూస్ కూడా అంతే అమ్మ కష్టపడి పంపిస్తే నేను తాగేది రెండు సిప్ లు . కొన్నాళ్ళకు ఇంటర్వెల్ లో స్నాక్స్ బాక్స్ ఖాళీగా ఉండేది .

కొన్నాళ్ళు గడిచాక ...రోజు రోజుకీ చదివేసి చిక్కిపోతున్నానా ..లేకపోతె ఏంటీ ...అని అమ్మ ఒక రోజు కూర్చోబెట్టి బుజ్జీ ! అన్నం తింటున్నావా ?జూస్ తాగుతున్నావా ....అని బుజ్జగించి అడిగే సరికి ....మరే ..పాపం ..ఆయా వాళ్ల అన్నయ్యున్నాడు కదా ( వాళ్ల అబ్బాయి ) ....వాడు తినాలికదా ..అందుకే నేను చాలు అంటున్నానన్నమాట !అనేసింది బుజ్జి ...అదేనండీ ...నేను !

అంతే ఆ తర్వాత నాన్నగారు స్కూల్ కి వచ్చి ఆయాతో గొడవ పెట్టుకొని ...టీచర్ కి కంప్లైంట్ చేశారు . స్కూల్ మేనేజ్ మెంట్ అక్కడ ఉండేవారు కాదు .టీచర్ లేమో పట్టించుకోలేదు .దానితో నాన్నగారు గొడవ పెట్టుకొని స్కూల్ మానిపించేశారు . వేరే స్కూల్ లో వేద్దామని అనుకోని సంవత్సరం వేస్ట్ అవకుండా విరజాజి పూలు ....
టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టి తెలుగు అక్షరాలు నేర్పించి ...ఆ తర్వాతి సంవత్సరం తెలుగు మీడియం అంటే బోర్డు స్కూల్లో చేర్చారు .

అంత హడావుడిగా మొదలైన నా చదువు స్కూల్ ఫైనల్ పూర్తవ కుండానే ఆగిపోయిందనుకోండి .ఎందుకనేది మరో టపాలో.....

* పై బొమ్మ లో ఉన్నది నేను కాదు .బుజ్జి కి కాస్త దగ్గరి పోలికలున్నాయని పెట్టాను ... :) :)

Tuesday, May 26, 2009

పునరపి జననం !!( కవిత )


మానవ జన్మం భగవంతుని వరం
వినమ్రుడవై స్వీకరించు ....
జీవితం అంతులేని ప్రయాణం
అలుపెరుగక పయనించు ....
దేవుని సృష్టి ఒక అద్భుతం
ఆ అందాన్ని ఆస్వాదించు...
పరోపకారార్ధ మిదం శరీరం
సాటి ప్రాణులపట్ల దయఉంచు...
మృత్యువొక శాశ్వత సుఖం
ఎదురాడక తలవంచు ....
తప్పనిసరి మరుజన్మం
ఇదేకదా గీతాసారాంశం !

* ఈ కవితకు శీర్షిక సరైనదో ..లేక ఈ శీర్షిక పెట్టె అర్హత కవితకు ఉందొ లేదో ..అన్న సందేహంతో ఈ టైటిల్ పెట్టటం జరిగింది. మీ సూచనలు కోరుతున్నాను .

Saturday, May 23, 2009

నాన్నచెప్పిన కధలు -2


అనగనగా మన దేశాన్ని నవాబులు పాలించే రోజుల్లో ....
ఓ రాజ్యాన్ని పాలించే నవాబు గారికి 14 భాషలు వచ్చు .చాలా శౌర్యమూ , తెలివీ అన్నీ ఉన్నా ఆయనకు ఒక బలహీనత ఉండేది .అది ఆయనకు కధలంటే విపరీతమైన పిచ్చి . ఎంతంటే రాజ్యపాలన కూడా పట్టించుకోకుండా రోజంతా కధలు వింటూ కాలం గడిపేవాడు .ఎన్ని కధలు విన్నా ఆయనకు తృప్తి ఉండేది కాదు . తనకు వచ్చిన 14 భాషల్లో ఏ భాషలోనైనా తను విసుగొచ్చి ఆపమనేంత వరకు కధలు చెప్పగలిగిన వారికి లక్ష దీనారాలు బహుమతి అనీ ...అలా చెప్పలేక పొతే 100 కొరడా దెబ్బలు శిక్ష అనీ రాజ్యంలో ప్రకటన చేయించాడు .ఎంతోమంది కవులూ ,పండితులూ నవాబుగారి దీనారాలకు ఆశపడి రావడమూ ....ఆయన్ను మెప్పించలేక శిక్ష అనుభవించి వెనుతిరగటమూ జరిగేది .

ఇదిలా ఉండగా రాజ్యంలో వర్షాలు కురవక కరువు తాండవించసాగింది.పంటలు పండకపోయినా పన్నులు కట్టవలసి రావడం నవాబుగారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా కధలతో కాలక్షేపం చేయడంతో రాజ్యం అస్తవ్యస్తమై పోయింది . మధ్యలో అధికారులూ , భటులూ ప్రజల వద్ద అందిన కాడికి దోచుకునేవారు .ప్రజలంతా అన్నమో రామచంద్రాని అలమటించే పరిస్థితి వచ్చింది .

ఆ రాజ్యంలోని ఓ కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు .తనకున్న నాలుగెకరాలూ పండించుకుని భార్యా పిల్లలతో హాయిగా కాలం గడిపేవాడు . కరువు ...రాజభటుల పన్నుల వసూళ్ళతో కుటుంబం ఆకలితో పస్తులుండే పరిస్థితి వచ్చింది . ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలని రాజధానికి పనివెతుక్కుంటూ వెళ్ళాడు ఆ రైతు . అక్కడ రాజుగారి ప్రకటన గురించి తెలుసుకున్న రైతు స్వతహాగా తెలివైన వాడవటం చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా రక్షించుకోవాలని అనుకున్నాడు .

నవాబుగారు దర్బారులో కొలువై ఉండగా తాను కధ చెప్పటానికి వచ్చానని రైతు చెప్పగానే రాజుగారితో సహా సభికులంతా హేళనగా నవ్వారు . మహా పండితులే నవాబుగారికి విసుగు తెప్పించలేకపోయారు ఇతనెలా ఆయన చేత ఇక చాలనిపిస్తాడని ఆశ్చర్యపోయారు .నవాబుగారు సరే కానీ శిక్ష తెలుసుకదా ....నాకు విసుగోచ్చేవరకూ చెప్పలేకపోతే 100 కొరడా దెబ్బలు అన్నారు . రైతు తెలుసు ప్రభూ ..కాని నేను మీకు విసుగు వచ్చేవరకూ కధ చెప్పగలిగితే మాత్రం మీరు ఇంకెప్పుడూ కధలు వినకూడదు అన్నాడు .అతని ధైర్యానికి సభంతా నిర్ఘాంత పోయినా నవాబుగారు చిరునవ్వుతో ఒప్పుకున్నారు ధీమాగా తనకు విసుగొచ్చినప్పుడుకదాని ...

రైతు కధ చెప్పటం ప్రారంభించాడు .అనగనగా ఓ ఊరు . ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రిచెట్టు . ఆ చెట్టుకు లెక్కపెట్టలేనన్ని ఆకులు ....నవాబుగారు ...ఫిర్ ....అన్నారు .ప్రతీ ఆకు మీదా ఓ కొంగ ..అన్నాడు రైతు ....ఫిర్ ...అన్నారు నవాబుగారు.ఒక ఆకుమీది కొంగ తుర్ మని ఎగిరి పోయింది అన్నాడు ఆయన తిరిగి ..ఫిర్ ..అన్నారు ...రైతు ఇంకో ఆకుమీద కొంగ తుర్ మని ఎగిరిపోయింది అన్నాడు . మళ్ళీ నవాబుగారు ..ఫిర్ ..అనటం ...తిరిగి రైతు తుర్ ..అనడమూ ..ఇలా చాలాసేపు జరిగాక నవాబుగారు అడిగారు ఇంకా ఎంతసేపు ఎగిరిపోతాయి అని ..లెక్కలేనన్ని ఆకులు కదా ప్రభూ ..ఈ రోజు పూర్తవ్వచ్చు.. రేపు పూర్తవ్వచ్చు ..లేదా వారం తర్వాత పూర్తవ్వచ్చు ...అన్నాడు .ఎన్నిసార్లు తాను ఫిర్ అన్నా తిరిగి అతను తుర్ అనే అంటాడని అర్ధమై పోయింది ....నవాబుగారికి విసుగుపుట్టసాగింది.ఇక చేసేది లేక ఇంక చాలు ఆపు అన్నారు .

అప్పుడు నవాబుగారు రైతు తెలివిని మెచ్చుకొని తాను ప్రకటించిన బహుమతితో పాటూ ..తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు . అంతేకాదు రైతు ద్వారా రాజ్యం లోని పరిస్థితులు తెలుసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ...దళారులను శిక్షించి ...ఆదర్శవంతంగా పరిపాలించారు.

* తెలివైనవారు ఎప్పుడూ తన తెలివిని తమ స్వార్ధం కోసం మాత్రమే కాకుండా సాటివారికోసం కూడా ఉపయోగిస్తే అందరూ బావుంటారు .

Wednesday, May 20, 2009

అశ్రువు ...( ఓ బుల్లి కవిత )


నేస్తం !
నీ కన్నుల్లో పుట్టి ...
నీ చెక్కిలిపై జారి ...
నీ పెదవులపై జీవించి ...
హృదయం పై మరణిస్తే .....
క్షణ కాలమైతేనేం ?
నీకు సాంత్వన కలిగితే
నా జన్మ ధన్యం !

Sunday, May 17, 2009

వారి ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా ....


వారికి ఇంద్ర ధనుస్సు తెలియక పోవచ్చు .కాని వారికీ ఓ రంగు తెలుసు ..అది ..నలుపు ...ఆ రంగు నుండే స్ఫూర్తి నింపుకొని ..ఆత్మవిశ్వాసంతో ...జీవన పోరాటం సాగిస్తున్న వారి ముందు దైవం తలదించాల్సిందే ...తాను ఇచ్చిన లోపాన్ని శాపం అనుకోకుండా ...తనను నిందించకుండా ...నీ దయవల్లె ప్రభూ ..అంటూ వారు నమస్కరిస్తుంటే ...దైవం తలదించాల్సిందే ...

వారంతా అంధ గాయకులు ..సంగీతం వచ్చిన వారు , రానివారూ కూడా ఉన్నారు .అటువంటి అంధ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్న ఈ టివి వారు అభినందనీయులు .ఈ టీవీ వారు నిర్వహిస్తున్న కార్యక్రమం బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్. సంగీత విద్వాంసులు మోహన కృష్ణ గారు ,యువకవి అనంత శ్రీరాం , సినీనటి లయ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈకార్యక్రమానికి ఝాన్సీ యాంకరింగ్ కూడా హుందాగా ఉంటోంది .

అంధులైన వారంతా అధ్బుతంగా పాడటంలోనే కాదు , ఆత్మవిశ్వాసం లోనూ వారికి సాటి వారే ! ఈకార్యక్రమం ఫైనల్స్ కి కళాతపస్వి శ్రీ k.విశ్వనాద్ గారు రావడం ఈ కార్యక్రమానికి మరింత నిండుదనాన్నిచ్చింది .

గాయకుల ఫెర్ఫార్మెన్స్ ఒక ఎత్తైతే ప్రోగ్రాం ఫైనల్స్ లో స్వాతి అనే అమ్మాయి( అంధురాలు ) చేసిన డాన్స్ నా శరీరాన్ని రోమాంచితం చేసింది . ఆ అమ్మాయి దీపాలు చేతపట్టి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది .ఆ అమ్మాయి చేసేటప్పుడు కాలి చివర చెంగు ఎక్కడ కాలుతుందోని భయపడ్డాను .కాని స్వాతి ఎటువంటి బెరుకు లేకుండా చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది .
నృత్యం పూర్తయ్యాక ఆమెను అభినందిస్తూ విశ్వనాద్ గారు తన వయసును ,అనుభవాన్ని మరచి స్వాతి చేతిని తన తలపై ఉంచుకొని ఆశీర్వచనం తీసుకున్న తీరు ....నన్ను కంటతడి పెట్టించింది .అది ఆయన కళామ తల్లికి ఇచ్చిన గౌరవమే...అంతే కాదు ...ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఏవిటో ఆయన్ను చుస్తే తెలిసింది .ఈ కార్యక్రమాన్ని గురించి ఆయన మాట్లాడిన తీరు ...పార్టిసిపెంట్స్ నుండి తాను స్ఫూర్తి పొందానని చెప్పటం ఆయన వినమ్రతను , ఆయన వ్యక్తిత్వాన్ని మనముందుంచుతుంది .

సుదీర్ఘంగా సాగిన ఈ ప్రస్థానంలో చివరి వరకు నిలిచి గెలిచిన వారు ముగ్గురు . వారిలో మొదటి స్థానంలో బాలరాజుగారు , రెండవ స్థానంలో మాధవ గారు , మూడవ స్థానంలో దొరబాబు గారు నిలిచారు .

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ...వారి గెలుపును పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించి సంతోషించడం . చాలా షోల్లో ఓడిపోయిన వారు ఏడవటం ..ఎలిమినేషన్ రౌండ్లు ఎంత భీభత్సంగా ఉంటాయో మనందరికీ తెలుసు . ఐతే ఇక్కడ చూపుతోపాటు ఈర్ష్యా ద్వేషాలు కూడా లేని వీరంతా ఎంతో హుందాగా వైదొలగారే గానీ ఎక్కడా కంట తడి పెట్టలేదు. గెలిచిన వారు మాత్రమే కంట తడి పెట్టారు ఉద్వేగంతో ....

*త్వరలో బ్లాక్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో చిన్నారుల ప్రతిభను మనందరం చూసి వారిని ప్రోత్సహిద్దాం .....

Saturday, May 16, 2009

చెలీ .....


చెలీ .....
చూపులా .... అవి నను చూసిన క్షణం
విరి తూపులై మానని గాయం చేశాయ్
తమకంతో నీ నడుమును చుట్టిన కొంగును
చూసి ఈర్ష్యతో నా గుండె భగ్గుమంది ...
చెరకువింటి విలుకాడు నా ఎదలో చేసిన
గాయం చాలదనా .... నీకీ విల్లంబులు ?
నీ నొసట కులుకు నెలవంక నడుగు
సోగ కళ్ళనడుగు .... పాల చెక్కిళ్ళ నడుగు
చిత్రకారుని కుంచెనే కదలనివ్వని
నీ నడుముకున్న ఒంపు నడుగు ....
నా గుండెకు చేసిన గాయం చెబుతాయవి !
ఐనా .... చాలదంటావా ....
నీ శరాఘాతంతో నా హృదయాన్ని చీల్చు ....
నీ కళ్ళ కొసల జాలువారే చిర్నవ్వుకే
తిరిగి పునర్జీవితుడ్నవుతా ....

Wednesday, May 13, 2009

విరజాజి పూలు ....


వేసవి ఇంకా వెళ్ళనే లేదు ...మల్లెలింకా కనుమరుగవలేదు ....అప్పుడే విరజాజులు దర్శనమిస్తున్నాయ్ !
విరజాజి పూలు ....ఈ పూలంటే నాకు చిన్ననాటినుండే చాలా ఇష్టం ...మరచి పోలేని అనుబంధం కూడా ...అదెలాగంటే ...

చిన్నప్పుడు నాకు ఓ టీచర్ గారి దగ్గర ట్యూషన్ పెట్టారు .అప్పటికి మనకి A B C D లు వచ్చాయి కాని అ ఆ లు రావు . ( చదువులో మనది ఆరంభ శూరత్వం లెండి ..దాని గురించి ఇంకో టపా రాసుకుందాం ) టీచర్ గారు ఇంటిలోనే మాకు ట్యూషన్ చెప్పేవారు .ప్రతి రోజూ సాయంత్రం నాన్నగారు కాని అన్నయ్య కాని సైకిల్ మీద ట్యూషన్ లో దించి , తిరిగి అయిపోయే వేళకు వచ్చి నన్ను తీసుకు వెళ్ళేవాళ్ళు .

అప్పట్లో నాన్నగారికి నైట్ డ్యూటీలు ఉండేవి .నైట్ షిఫ్ట్ ఐతే పగలు ఖాళీ కాబట్టి నన్ను తనే తీసుకెళ్ళేవారు . ఆయనకి పగలు డ్యూటీ ఐతే అన్నయ్య తీసుకెళ్ళేవాడు .ఎవరు తీసుకెళ్తే ఏంటీ ..అనుకుంటున్నారా ...
నాన్నగారు సైకిల్ మీద వెళ్ళినంత సేపూ ...మన ప్రధాని ఎవరు ? రైల్వే మంత్రి ఎవరు ? ఆర్ధిక మంత్రి ఎవరు ? రాష్ట్ర ముఖ్య మంత్రి ఎవరు? మన జండాకు ఎన్ని రంగులు ..వగైరా ..వగైరా ...ప్రశ్నలతో బుర్ర తినేస్తూ ...కూతురు చెప్పే సమాధానాలకు తెగ మురిసిపోతూ ....ఇలా ...పరమ బోర్ గా సాగేది .

అదే అన్నయ్యైతే చక్కగా అప్పటికి కొత్తగా వచ్చిన సినిమా పాటలు పాడుతూ ...పాట రానిచోట .....నోటితోనే దరువేస్తూ ..మధ్య మధ్య సైకిల్ బెల్ తో మ్యూజిక్ ఇస్తూ ...భలే సరదాగా ఉండేది .నేనేమో ప్రతి రోజూ నాన్నగారికి నైట్ షిఫ్ట్ ఉండాలని దేవుడ్ని కోరుకునేదాన్ని .కొద్దిరోజులకు దేవుడు నామొర ఆలకించాడో ఏమో నాన్నగారి డ్యూటీ మారలేదు కాని అన్నయ్యను మా టీచరు గారి టైప్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు నా ట్యూషన్ టైం లో ...అప్పటి నుండీ నాకు రోజూ పాటల పండగే ...

ట్యూషన్ టీచర్ గారింట్లో విరజాజి పూల పందిరి ఉండేది .మేం వెళ్ళేసరికి ఆవిడ మొగ్గలు కోసి ఓ నీళ్ళ గిన్నెలో వేసి ఉంచేవారు .పిల్లలకు ట్యూషన్ చెప్తూ విరజాజులు మాల కడుతూ ....మధ్య మధ్యలో ఆ గిన్నెలోని నీళ్ళతో పలకలు తుడుస్తూ ...అక్షరాలు దిద్దించేవారు .

మరి నేనేమో కాస్త యాక్టివ్ గా ,ముద్దుగా , బొద్దుగా ఉండేదాన్నేమో ...పైగా అందరికంటే చిన్నదాన్ని కూడానూ ..అందుకో ఏమో నేనంటే ఆవిడకు ప్రత్యేకమైన అభిమానం .పిల్లలందరూ వెళ్ళిపోయినా అన్నయ్య వచ్చేవరకు తనతోనే ఉంచుకొని ..ప్రతి రోజూ ఎంతో ప్రేమగా జాజిపూల దండ జడలో పెట్టి పంపించేవారు . ఒక్కరోజు మానేయాలన్నా పూలు మిస్ అయిపొతాయో...ఎవరికైనా ఇచ్చేస్తారో అని అస్సలు మానేదాన్ని కాదు .అదిగో అప్పట్నుంచే విరజాజులంటే బోల్డు ఇష్టం .

టీచర్ గారికి సినిమా థియేటర్ ఉండేది.వాళ్ల ఇల్లు కూడా థియేటర్ గేటు లోనుండి లోపలికి వెళ్తే ఉంటుంది .ఆర్ధిక పరిస్థితుల వల్ల వాళ్లు థియేటర్ 30 ఏళ్ళకి లీజుకు ఇచ్చేసి ..వాళ్ల పిల్లలు టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ...టీచర్ గారి భర్త ఏవో ఆయుర్వేదం మందులు ఇస్తూ ..ఈవిడ ట్యూషన్ చెప్తూ ..కుటుంబాన్ని నడుపుకునేవారు . అలా నాకు ప్రతి రోజూ పూలతో పాటు కొద్దిసేపు సినిమా చూసే చాన్స్ కూడా దొరికేది .

ఈరోజు తెలుగు తప్పుల్లేకుండా రాయగలుగుతున్నానంటే ఆమె చలవే .తర్వాత మాకు ట్రాన్స్ఫర్ ఐనా .. మళ్ళీ మాకు పది సవత్సరాల తర్వాత తిరిగి అక్కడికే ట్రాన్స్ఫర్ అవడం వల్ల తరచూ టీచర్ గారిని కలుస్తూ ఉండేదాన్ని .మా పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడూ మా వారితో కలిసి చూడటానికి వెళ్తే ఆ వృద్ధాప్యం లో ఆవిడ ఎంత సంతోష పడేవారో ...అందరూ మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదురా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు .ఒకసారి వెళ్ళేసరికి బొట్టు లేకుండా ...చాలా బాధనిపించింది ....కొన్నాళ్ల తర్వాత నాన్నగారు రిటైర్ అయ్యి మా సొంత ఊరిలో స్థిరపడ్డారు . చాన్నాళ్ళు గాప్ తర్వాత ఆ ఊళ్ళో బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్లి ..టీచర్ గార్ని చూద్దామని వెళ్ళా ....కాని ఆవిడ లేరు .విరజాజి పందిరి మాత్రం తలూగించింది నన్ను ఓదారుస్తూ ...పాత నేస్తాన్ని కదూ ....
ఇప్పటికీ విరజాజుల్ని చూస్తె టీచర్ గారు ఆవిడ ప్రేమా తలపుకొస్తాయి .

Sunday, May 10, 2009

అమ్మ


దేవుడొక అధ్బుతాన్ని సృష్టించాడు
బంగారం కంటే విలువైన ... ( రూపం )
పూలకంటే సున్నితమైన ... ( హృదయం )
తొలి పొద్దువలె వెచ్చనైన ... ( ఒడి )
వెన్నెలకంటే చల్లనైన ... ( చూపు )
తేనె కంటే మధురమైన ... ( మాట )
శిఖరం కంటే ఎత్తైన .... ( వ్యక్తిత్వం )
సముద్రం కంటే లోతైన ... ( గంభీరత )
అంతెందుకు ?
తనకంటే గొప్పదైన ...
అమ్మను ...వరంగా ...
నాకోసం ....
** అమ్మా ! ఎప్పటికీ ఇదే వరాన్నడుగుతా ఆ దేవుడ్ని !!

Wednesday, May 6, 2009

స్నేహమా ! స్నేహమేనా ??


స్నేహంలో క్షమాపణలు .....
కృతఙ్ఞతలు ఉండకూడదన్నావ్
స్నేహంలో ఎదురుచూపులేగాని
పెదవి విరుపులు ఉండకూడదన్నావ్
స్నేహంలో కమ్మటి కలలేగాని
కలహాలు ఉండకూడదన్నావ్
స్నేహంలో లోకమంతా ....
కాంతివంతమన్నావ్ !
నీకది స్నేహమేనా ??
కాని నాకు మాత్రం ....
మన పరిచయం తర్వాత
ప్రతి రేయీ 'కల ' వరమే !
ప్రతి పగలూ కలవరమే !!
స్నేహమన్న ప్రతి చోటా
ప్రేమనన్వయించుకుంటుందేం ?
పిచ్చి మనసు .......

Sunday, May 3, 2009

తప్పక చూడండి !! ( సురేంద్రపురి )


యాదగిరి గుట్ట వెళ్ళారా ? ఈ మధ్య ..అంటే ఓ ఏడాది లోపులో ...వెళ్ళక పొతే తప్పక వెళ్లి రండి .హైదరాబాద్ నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షాలతో పాటు , పంచముఖ హనుమదీశ్వర అనుగ్రహం కూడా పొందవచ్చు .అంతే కాదు సంపూర్ణ భారత దేశ యాత్రానుభూతి కలుగుతుంది .

యాదగిరి గుట్ట స్వామివారి ఆలయమునకు వెళ్ళే దారిలో సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయం మరియు కుందా సత్యనారాయణ కళాధామం ఉన్నాయి .

సాధారణంగా ఆంజనేయస్వామి మనకు భక్తాంజనేయునిగా , వీరాంజనేయునిగా , ప్రసన్నాంజనేయునిగా ......కొలువై కనిపిస్తారు . ఇక్కడ పంచముఖాంజనేయుడై , సువర్చలా సమేతుడై దర్శనమిచ్చుట ఇచ్చటి విశేషము .ఈశ్వర , నారసింహ ,గరుడ , వరాహ, హయగ్రీవ ....ఈ ఐదు ముఖములతో అలరారు హనుమంతుని విగ్రహముతో పాటు అదే ఆవరణలో పంచముఖ విశ్వరూపుడైన శివుడు కొలువై ఉన్నాడు .ఆ శివలింగం నేపాల్ లోని పశుపతినాధ లింగాన్ని పోలి ఉండటం విశేషం .

కుందా సత్యనారాయణ కళాదామంఒక అపురూప పౌరాణిక విజ్ఞాన కేంద్రం ....అధ్బుత శిల్ప కళా సృష్టి కి నిలయం !
సురెంద్రపురిలో దాదాపు 10 సంవత్సరాలు కొన్ని వందలమంది కళాకారుల ,శ్రామికుల కష్ట ఫలం .
ఖమ్మం జిల్లా , మదిర తాలూకా , బసవాపురం వాస్తవ్యులు శ్రీ కుందా సత్యనారాయణ గారు భగవంతుడు అర్ధాంతరంగా దూరం చేసిన తమ చిన్న కుమారుడు సురేంద్ర శాశ్వత కీర్తిని భువిలో నిలుప దలచి అహోరాత్రులూ కష్టించి ,ఎన్ని అవాంతరాలు , కష్టనష్టాలు ఎదురైనా ..ఆరోగ్యం ,వయసు సహకరించక పోయినా స్వామిపైనే భారం వేసి ఈ మహత్తర కార్యాన్ని పూర్తి చేశారు .

కళాధామం విశేషాలు :

భారత దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల నకళ్ళు ఇక్కడ నిర్మించడం విశేషం !సంపూర్ణ భారతదేశ యాత్ర చేయలేనివారు సురేంద్ర పురిని దర్శిస్తే ఒకింత ఆ అనుభూతిని పొందవచ్చు .
అంతేకాక బ్రహ్మ లోకం , విష్ణులోకం , శివలోకం , నాగలోకం , ఇంద్రలోకం ,యమలోకం ,నరకలోకం...శిక్షలు , పాతాళ లోకం ,....క్షీరసాగర మధనం , గజేంద్రమోక్షం , కాళీయ మర్దనం , గోవర్ధన గిరి ధారణం , విశ్వరూప సందర్శనం , పద్మవ్యూహం మొదలైన శిల్పాలతోపాటు .....రామాయణ , మహాభారత , భాగవతాలలోని ముఖ్య ఘట్టాలనూ అపూర్వంగా మలిచారు .

ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూడదగ్గ ప్రదేశం .ముఖ్యంగా పిల్లలకు పౌరాణిక విజ్ఞానం తక్కువగా ఉంటోంది . చక్కటి శిల్పాల ద్వారా ఆసక్తి కలిగించేలా పిల్లలకు మన పురాణాలను వివరించవచ్చు .కుటుంబ సమేతంగా చూడదగ్గ విశేషం .ప్రవేశ రుసుము కాస్త ఎక్కువ అనిపించినా ...అంతా చూసిన తర్వాత అంత పెద్ద కళా ధామ నిర్వహణ భారం సాధారణం కాదు అనే విషయం మనకు అర్ధమౌతుంది .

అక్కడి శిల్పకళను నాపరిధిలో చాలా క్లుప్తంగా వివరించాను ,నేను రాయని విశేషాలు ఇంకా ఉన్నాయి .చూశాక తప్పకుండా ఒక మంచి ఆధ్యాత్మికానుభూతి కలుగుతుంది .