Thursday, April 26, 2012

గుర్తుకొస్తున్నాయీ ....గుర్తుకొస్తున్నాయి

చాలా ఏళ్ళ తర్వాత పెళ్ళికి వెళ్ళిన నేను నా చిన్ననాటి జ్ఞాపకాల నిధిని తవ్వి తీసుకున్నా! ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది.

ఈ రైల్వే స్టేషన్ లోనే ఎన్నోసార్లు మెయిల్ ఎక్కి రాజమండ్రి స్టేషన్లో దిగేవాళ్ళం .ఇప్పుడు కొత్త హంగులతో ముస్తాబయిందనుకోండి.ఆ కనిపించే బ్రిడ్జ్ కి అటువైపు రైల్వే క్వార్టర్స్ ఉండేది ఇటువైపు మాస్కూల్ ఉండేది.బజారుకి ,సినిమాకి దేనికి వెళ్ళాలన్నా బ్రిడ్జ్ దాటాల్సిందే అలా4,5,6  తరగతులు పూర్తయ్యాక 7 వ తరగతిలో బ్రిడ్జ్ కి ఇటువైపు స్కూల్ లో జాయిన్ చేశారు.అంటే ఆరవ తరగతిలో తెలివితేటలు పెరిగిపోయి బ్రిడ్జ్ ఎక్కకుండా పట్టాలు దాటి వెళ్లిపోతుంటే నాన్నగారు రెండుమూడు సార్లు రెడ్ హాన్డేడ్ గా పట్టుకొని తక్షణ రక్షణ చర్యగా అమలు చేశారన్న మాట :)  :)



ఇది నేను 7 , 8 , 9 తరగతులు చదివిన స్కూల్ .



ఇక్కడే ప్రేయర్ జరిగేది. ఆ షెడ్ ఒకప్పటి స్టేజ్ అక్కడ డ్రామాలు కూడా వేశాం:)


ఏడవ తరగతి వరకు క్రింది గదుల్లో .....ఎనిమిది నుండి పది వరకు పైన! ఎనిమిదో క్లాసులో అడుగుపెట్టిన మొదటి రోజు మెట్లేక్కుతున్నప్పటి గర్వం,ఏదో సాధించేసినట్టు ఆ ఆనందం గుర్తుకొచ్చి నవ్వొచ్చేసింది :)


పైన గదుల్లో సైన్స్ లాబ్ ,టీచర్స్ రూం ఉండేవి సెలవులు కదా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి.ఎవ్వరూలేరు .ఇంతకూ మా బడి బావుందాండీ :)


ఇది మా నాన్నగారు పనిచేసిన ఆఫీస్! ఎన్నోసార్లు నాన్నగారి వేలుపట్టుకొని ఇక్కడకు వచ్చాను.ముఖ్యంగా దసరాకు దేవీపూజ చాలా బాగా చేసేవారు నాన్నగారు నన్ను తప్పకుండా తీసుకెళ్ళేవారు.మరమరాలు బెల్లం సెనగపప్పు కలిపి పంచేవారు.బయట నిలబడి ఫోటో తీసుకుంటుంటే ఎవరమ్మా అంటూ వచ్చిన పెద్దాయన నాన్నగారి దగ్గర పనిచేసిన గాంగ్ మేన్ అవటం ,ఆయన నాన్నగారిగురించి గుర్తుచేసుకుని చెప్పిన మాటలు ఆయన కూతురుగా మరోసారి గర్వపడేలా మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.



ఈ బల్ల చూశారా నేను అక్కడనుండి వచ్చేసే టప్పుడు స్టేషన్లో కూర్చున్న బల్ల! ఈ బెంచి మీదకూర్చునే మాస్నేహితులందరం వెక్కి వెక్కి ఏడ్చాం !ఇక్కడే నా స్నేహితులు నాకు కళ్ళనిండా నీళ్ళతో....గుండె నిండా ప్రేమతో వీడ్కోలు పలికారు.స్టేషన్ ఎంత మార్పులు చేర్పులు చేసినా ఆ బల్లను అలాగే ఉంచడంతో నాకు ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి.

ఇంకా మేము ఉన్న క్వార్టర్స్ , నేను ఆడుకున్నప్రదేశాలూ,స్కూల్ హాండ్ పంపులో నీళ్ళు తాగుతున్నపుడు ఇవి మినరల్ వాటర్ కాదు అంటూ మావాళ్ళ వెళాకోలాల మధ్య అన్నీ తిరిగి తిరిగి ,జ్ఞాపకాల్ని తడిమి చూసుకొని భారమైన మనసుతో తిరుగు ప్రయాణమయ్యాను.