Friday, October 5, 2012

లడ్డూ బాబోయ్ ....లడ్డూ :) :)

కొన్నేళ్ళ క్రిందట అప్పటికి ఇంకా స్వగృహ ఫుడ్స్ అంటే పెద్దగా తెలీదు.అప్పుడు రాజమండ్రిలో వసుంధర స్వగృహ ఫుడ్స్ అని కొత్తగా పెట్టారు. మావూరికి దగ్గర సిటీ కావడంతో మాకు ఏం కావాల్సినా రాజమండ్రి వెళ్లి తెచ్చుకోనేవాళ్ళం. అలా ఏదో పనిమీద వెళ్ళినప్పుడు మా శ్రీవారు ఈ వసుంధరలో సన్నబూంది లడ్డు ఒక అరకేజీ తీసుకొచ్చారు.చిదిమినోట్లోవేసుకోగానే  కమ్మటి నేతి వాసనతో తియ్యగా....మెత్తగా ...ఆహా...ఏమి రుచి! ఇటువంటి లడ్డు ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు అనుకొంటూ రెండురోజుల్లో అరకేజీ ఖాళీ చేసేశాం.

అప్పటికి లడ్డులు ఇంట్లో చేసినా,ఎవరైనా సారెగా పంచిపెట్టినా కొంచెంలావుబూందీతో చేసినవే! పండగకు బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి ఇంట్లోనే చేసేవారు.స్వీట్స్  షాపులో కొనుక్కుంటే కాజాలు,జాంగ్రీలు ,జిలేబీ,ఇంకా రసగుల్లా,కోవా టైపు కొనుక్కోనేవాళ్ళం.అసలే  మా ఇంటాయనకి పంచదార మిఠాయి అంటే ఇష్టం. పంచిపెట్టిన సారె లడ్డూ కూడా వదలరు.సైజు కేజీకి నాలుగు... రెండు దఫాల్లో కానిచ్చేస్తారు.అటువంటిది ఇక ఇంత కమ్మటి లడ్డు దొరుకుతుంటే ఊరుకుంటారా? ఇక ఏ పనిమీద రాజమండ్రి వెళ్ళినా లడ్డూ పేకెట్ ఇంటికి వచ్చేది.అరకేజి అల్లా కేజీ అయ్యింది.తర్వాత కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారని,అలాగే కొనసాగింది.తర్వాత హైదరాబాద్ వచ్చేశాం.ఇక్కడ వీధికో స్వగృహ షాపు! ఇప్పుడు రెండు మూడు కూడా ఉన్నాయనుకోండి.ఇక ఈయనకి పండగే!

అప్పటివరకు ఫర్లేదు కాని ఇక ఇక్కడికొచ్చింది మొదలు...ఎప్పుడు స్వీట్ షాప్ కి వెళ్ళినా లడ్డూనే...ఏమండీ చిన్నివాళ్ళింటికెళ్దాం ఏమైనా..స్వీట్స్ తెండి అనటం పాపం లడ్డూలతో ప్రత్యక్షం.అత్తయ్య వాళ్లింటికెళ్ళినా, మా చెల్లెలి గారింటికి వెళ్లినా...వాళ్ళ అక్కగారింటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లడ్డూలే ! ఈయన పనిచేసే కాలేజిలో ఏ ఫంక్షన్ వచ్చినా,ఆగష్టు 15 కీ, టీచర్స్ డే కీ, దసరాకి... వినాయకచవితికి కూడా ఉండ్రాళ్ళ తోపాటూ లడ్డూకూడా ఆర్డరివ్వాల్సిందే.ఏ గుడికెళ్ళి కెళ్ళినా లడ్డూ ప్రసాదం తప్పకుండా కొంటారు.తిరుపతిలో ఐతే బ్ల్లాకులో ప్రసాదం కొనటం పాపమండీ అన్నా వినకుండా 20 లడ్డూలైనా కొంటారు.వాటిలో ఓ పది ఆయనకే :)  :)

ఇక ఈవిషయం ఆనోటా ఆనోటా బంధువులకి, స్నేహితులకి తెలిసిపోయింది.ఇక అప్పట్నుంచి మాఇంటికి ఎవరొచ్చినా బావగారికిష్టం అంటూ అన్నయ్యలూ, చిన్నాన్నగారికిష్టం, అన్నయ్యగారికిష్టం,మా పెద్దోడికిష్టం అంటూ ఎవరిమటుకు వారు ప్రేమగా లడ్డూ లే తెస్తున్నారు.ఇలా ఏళ్లు గడిచి పోతున్నా ఇంట్లో అందరికీ ముఖ్యంగా నాకు లడ్డూ మీద (నిజానికి జీవితంమీదే) విరక్తి పుట్టేసింది. ఈయన ఎప్పుడు తిన్నా ఒకటి తినరు రెండు కావాలి.ఐనా అప్పుడు కూడా ఇంకో లడ్డూ కావాలా బాబూ....అంటే నో అని మాత్రం అనరు. లడ్డూ మీద శ్రీవారికి విరక్తి రావాలంటే....కాదు కాదు అసలు లడ్డూ అనే మాటే మాఇంట్లో వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వరూ ప్లీజ్ !

18 comments:

  1. మీ విరక్తి అర్ధమైంది. కానీ అంత ఇష్టమైన లడ్డూని మానేయమంటే మీ శ్రీవారి పరిస్తితి ఏంటండి పాపం .
    పోనీ మీరే ఓ కొత్త స్వీట్ తయారుచేసిపెట్టండి.

    ReplyDelete
  2. ఏముంది...సింపుల్ ..ఈ మధ్య విడుదల అయిన/అవ్వబోయే చిత్రం..'ఏం..బాబు..ఇంకొ లడ్డూ కావలా?' చూపించడమే..

    ReplyDelete
  3. :))
    మీకా రహస్యం తెలిసాకా నా చెవిన కూడా పడేద్దురూ...

    ReplyDelete
  4. మీరు చిత్రంలో పెట్టిన చిన్న బూంది లడ్డు మా పాపకి ప్రాణం...
    ఒక్కక్కరి ఇష్టం ఒకోలా ఉంటుంది...మీరు అలా అంటే ఎలా చెప్పండి...:-))
    @శ్రీ

    ReplyDelete
  5. మీ ఇంట్లో చీమలు స్వీట్లెందుకు ముట్టుకోవడంలేదో నాకు ఇప్పుడు అర్ధమైందండోయ్ :-)))

    ReplyDelete
  6. ఒక కె.జి లడ్డు తెచ్చి ఇంట్లో లడ్డు నే టిఫిన్ , లంచ్ , డిన్నర్ గా పేట్టండి

    ReplyDelete
  7. @ శ్రీనివాస్ గారు, ఎన్ని స్వీట్స్ పెట్టినా లడ్డూ లడ్డూనే.....అటండీ :) ధన్యవాదాలు.

    @ సంజీవ్ గారు,ఆ సినిమా హైదరాబాద్ లో విడుదలైనట్టు లేదండీ :) థాంక్స్.

    @ తృష్ణా...నేనే అనుకున్నా మీరు కూడానా :( ధన్యవాదాలు.

    @ శ్రీ గారు,మీ పాపతో పాటూ ఇంకా చాలామంది ఇష్టపడతారు...కాని నాకష్టం కూడా అర్ధం చేసుకోండి :) ధన్యవాదాలు.

    @ వేణుశ్రీకాంత్ గారు,అలా అనుకొనే పాపం అని కోవా,పల్లిచిక్కి,కజ్జికాయలు కూడా పెట్టానండి:) థాంక్స్!

    @ సందీప్ గారు, అలా కాదుగాని అప్పుడప్పుడు కాస్త ఇంచుమించుగా అలాగే జరుగుతుంది మాఇంట్లో రెండు మూడు లడ్లు బ్రేక్ ఫాస్ట్ బదులుగా లాగించేస్తారు :) ధన్యవాదాలండి.

    ReplyDelete
  8. శ్రీ తిరుమలేశు డాదిగ
    ఖ్యాతింగల వేల్పు లెల్ల కర మిష్టముగా
    నేతిని జేసిన లడ్డుల
    నా తీరుగ నారగించ నరులొక లెఖ్ఖా ?
    ----- సుజన-సృజన

    ReplyDelete
  9. @ రాజారావుగారు, ఈయన పేరు కూడా ఆయనదే లెండి :) అందుకేనేమో ఇలా :) ధన్యవాదాలు సర్!

    ReplyDelete
  10. వసుంధర స్వగృహ ఫుడ్స్ అబ్బా గుర్తుచేసారా???? నాకిప్పుడు అర్జెంటుగా మోతీచూర్ లడ్డూ కావాలి :(

    ReplyDelete
  11. ఒకసారి పరమానందయ్య శిష్యుల కథ సినిమా గుర్తుకు తెచ్చుకోండి.

    ReplyDelete
  12. @ రసజ్ఞ గారు, ఐతే ఆన్ లైన్లో బుక్ చేసుకొనే అవకాశం ఉందేమో చూడండి లేదా చలో రాజమండ్రి :)

    @ బోనగిరి గారు, :) :) ధన్యవాదాలు.

    ReplyDelete
  13. అతి చేస్తే గతి చెడుతుందని సామెత. తిన నియ్యండి.

    ReplyDelete
  14. @ కష్టేఫలె గారు, అంతేనంటారా :) ధన్యవాదాలు.

    ReplyDelete
  15. పోనిద్దురూ.. ఆయనకి ఇష్టమైనది ఆయన తింటారు.. మీకు ఇష్టమైనది మీరు తినండీ.. సింపుల్...

    ReplyDelete
  16. మీ లడ్డూ కథ బహు గుడ్డుగా ఉందండీ.

    ReplyDelete
  17. manten satyanarayana raju gaari video lu chupincheyyandi.. aayana laddu gurinchi cheppindi vinna taruvaata evvaroo laddulu kaadu kadaa ye sweetu muttukoru gaaka muttukoru..

    mee blog chala bagundi andee.. :)

    ReplyDelete
  18. @ శ్రీలలితగారు అంతేనంటారా :)

    @ కిషోర్ గారు, థాంక్సండీ :)

    @ ప్రసూనగారు,అసలాయనంటేనే పడదండీ మావారికి,ఆయనచెప్పినట్టు వింటే తినాతానికేం మిగలవట.......తప్ప:) నాబ్లాగ్ కి విచ్చేసినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete