
రెండు రోజులనుండి లోకల్ ఎడిషన్ చూస్తుంటే బాధ ..ఆందోళన కలుగుతున్నాయ్ !రెండురోజుల్నుంచే కాదు
ఈమధ్య ఎక్కడ చూసినా ఆత్మహత్యలు !నాలో ఎన్నో ప్రశ్నలు ..సమాధానం లేనివి...ఎవరితో పంచుకుందామన్నా నాది అర్ధం లేని బాధగా కొట్టిపడేస్తారేమో....పొరపాటున ఎవరితో అయినా అంటే నీకెందుకు , కనీసం ముఖపరిచయం కూడా లేనివారి గురించి నీ మనసు పాడు చేసుకుంటావెందుకంటూ చివాట్లు !
అసలు ఆత్మహత్యలు ఎంత తీవ్రమైపోయాయో ....ప్రాణం విలువ ఎంత దిగజారిపోయిందో తలుచుకుంటే చాలా బాధేస్తుంది .భర్త తిట్టాడని బిడ్డతో సహా కాల్చుకున్న ఓ తల్లి , తండ్రి మందలించాడని ఓ కొడుకు,ఏదో ప్రాంతం వారివల్ల తనకు ఉద్యోగం రావట్లేదని ఓ వ్యక్తీ ,చెవి సంబంధిత వ్యాధితో ఓ గృహిణి ,ప్రియురాలు తిరస్కరించిందని ఓ యువకుడు, తనను నమ్మిన వారిని మోసగించానని,చదువు రాలేదని మరో యువకుడు, భార్యతో మనస్పర్ధలతో ఒక వ్యక్తీ , ప్రేమ విఫలమై మరో వ్యక్తీ ...ఇవే కాదు ..మార్కులు తక్కువొచ్చాయని , పరీక్ష తప్పాననీ , పోటీ పరీక్షల్లో విజయం సాధించలేక పోయాననీ ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్నో ....బలవంతపు చావులు!
ఇంకో దారుణం ఏవిటంటే పదిహేనేళ్ళ వయసున్న అమ్మాయి ,అబ్బాయి ఆత్మహత్యకు ప్రయత్నించడం ..అమ్మాయి చనిపోవడం. వారిద్దరినీ ప్రేమికులనాలా?స్నేహితులనాలా ?పిల్లలిద్దరూ నాలుగేళ్ళుగా కలిసి చదువుతున్నారట ! అమ్మాయి తల్లితండ్రులు విడిపోతే తల్లి రెండోపెళ్ళి చేసుకుందట ! తోటి పిల్లలతో కలవకుండా ఈ అబ్బాయితో మాత్రం తన బాధను పంచుకొనేదట !అమ్మమ్మ దగ్గర ఉంటున్నా మానసిక వేదనతో చనిపోవాలనే నిర్ణయం తీసుకొని aస్నేహితులిద్దరూ కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ పైకెక్కి చనిపోదామని ...ముందుగా అమ్మాయి దూకేసిందట అబ్బాయి భయపడి వెనక్కివచ్చాడట ! తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని చనిపోవడానికి వచ్చామని అబ్బాయి చెప్పడం చదువుతుంటే ....నాకు నోట మాట రాలేదు.
అసలు ఈ ఆత్మహత్యలు అవసరమా ..చావుతప్ప సమస్యలకు పరిష్కారం దొరకదా ..అసలు పరిష్కారం వైపు సాగకుండా వీరి ఆలోచనలు చావువైపుగా ఎందుకు సాగుతున్నాయ్ ? వీరి చావులకు బాధ్యులు వారు మాత్రమేనా ?చుట్టూ ఉన్నవారు కూడానా ?వీరి చుట్టూ ఉన్నవారికి చనిపోయేముందు వారి ప్రవర్తనలో మార్పు తెలీదా ?తెలిసినా తమకేం పట్టనట్టు ఉండిపోతారా ?తల్లి తండ్రులకు ,సమాజంలోని తోటి మనుష్యులకు ఏమీ బాధ్యతా ఉండదా ? ఇవన్నీ మీక్కూడా పిచ్చి ప్రశ్నల్లా అనిపిస్తున్నాయా ? సంవత్సరనికోరోజు ఆత్మహత్యల నివారణదినంగా ప్రకటించి పెరిగిపోతున్న ఆత్మహత్యలను నలుగురు మానసిక నిపుణుల చేత పత్రికలలో ప్రకటన సూచనలు ,సలహాలు ఇప్పిస్తే సరిపోతుందా?
మానసికంగా వేదనకు గురైతే ..స్నేహితులకు కూడా చెప్పుకోలేమని అనిపిస్తే ...అటువంటివారి బాధని ఓర్పుగా విని ,ఓ తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే నష్టం వివరించి కౌన్సిలింగ్ చేసే స్వచ్చంద సంస్థలు ఉన్నాయని తెలుసు వాటి పూర్తివివరాలు తెలియవు .కాని 108 కి , 100 కి ఎంత ప్రాచుర్యం కల్పించారో ఇటువంటి వాటికికూడా ప్రభుత్వం విరివిగా ప్రచారం చేస్తే బావుండు అనిపిస్తుంది .అంటే సినిమా హాల్లో స్లైడు వేయించడం ,టివి లో యాడ్ ఇప్పించడం వంటివి చేస్తే బావుంటుందేమో ...
యండమూరిగారు ఏదో నవలలో అన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య మరణం మాత్రమే అనివార్యమైన మరణంతో పోలిస్తే మిగిలినవన్నీ చిన్న సమస్యలే !
ఆత్మహత్యలు క్షణికావేశంలో జరిగేవి ఆ కాస్సేపూ ఎవరైనా తోడుగా ఉండి వారి బాధను పంచుకొని వారి ఆలోచన మళ్లిస్తే వారికి బ్రతుకుపై ఆశ కలగొచ్చు . తర్వాత వారి మానసిక ఆందోళన తీవ్రతను బట్టి తగిన వైద్యం చేయించొచ్చు
తల్లితండ్రులు కాని ,సన్నిహితులుగాని తమవారి ప్రవర్తనలో మార్పు , నిరాశ , నిరాసక్తత కనిపిస్తే అలక్ష్యంచేయకుండావారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్తే కనీసం కొన్ని ఆత్మహత్యలనైనా నిరోధించగలమేమో !
** మీకెవరైనా అలాంటివారు కనిపిస్తే శ్రమనుకోకుండా కాస్త ఓర్పు ...మరికాస్త సమయం వారికోసం వెచ్చిస్తారు కదూ !