Wednesday, January 19, 2011

ముగ్ధ మనోహరి...


ముగ్ధ మనోహరి...ఇలా అనుకోగానే అలనాటి అందాలనటి జమున అలా కళ్ళముందు కదలాడుతుంది.బాలనురా మదనా...అంటూ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ అభినయించినా, గోదారి గట్టుంది...అంటూ చిలిపిగా అల్లరి చేసినా, సత్యభామగా రుసరుసలాడుతూ వాల్జెడ విసిరినా , మూగనోముతో కన్నీళ్లు పెట్టించినా ఆమెకు ఆమే సాటి!

మాష్టారూ మాష్టారూ...ఈఝుంకీలేలా ఉన్నాయి...మాష్టారూ మరే...అంటూ మిస్సమ్మలో ఆమె అభినయం ముగ్ధ మనోహరమే కదూ!మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్....సత్యాపతి...అంటూ ఆమె అభినయిస్తుంటే ఆ కళ్ళల్లోని అతిశయం..దర్పం...గర్వం...వెరసి ఓహో...సత్యభామ ఇలా ఉండేదా అని అనిపించకుండా ఉండదు.తెలుగువారికి కృష్ణుడిగా రామారావుగారు ఎలాగో తెలుగువారి సత్యభామగా జమున ఎప్పటికీ గుర్తుండిపోతుంది . సత్యభామగా ఎంత మెప్పించగలిగిందో రామాలయం ,మూగనోము వంటి సినిమాల్లో కరుణారసప్రధానమైన పాత్రల్లో ప్రేక్షకుల చేత కంటనీరు పెట్టించిన సహజనటి!

తెలుగులోనే కాకుండా ఇతరభాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన నటీమణి ఆమె.హిందీలో ఆమె నటించిన 'మిలన్ 'చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది.అదేనండీ మన తెలుగులో మూగమనసులు సినిమాలో గౌరీ పాత్ర !
భూకైలాస్ లో మండోదరిగా, గులేబకావళి కధలో యుక్తిమతిగా, గుండమ్మ కధలో సూర్యకాంతం గారాలపట్టి సరోజగా...ఇలా ఏపాత్ర చూసినా ఆమెరూపం అపురూపం! ఆమె నవ్వితే నెలవంక నవ్వినట్టు ఉంటుంది. అందం,అభినయం కలబోసుకున్న ముగ్ధ మనోహరి జమున మన తెలుగువారు గర్వించదగ్గ నటీమణి!

నిజానికి నాకు మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టం! ఐతే ఆమె తర్వాత గర్వంగా చెప్పుకోదగ్గ నటి అనిపిస్తుంది జమునగారిని చూస్తే ! మా అమ్మగారికి మాత్రం జమున అభిమాన నటి! అప్పట్లో కధానాయిక ప్రాధాన్యత కల సినిమాలు జమునవి వస్తే అవి ప్లాప్ ఐనా సరే తప్పకుండా చూసేదట!అంత ఇష్టం అమ్మకి జమున అంటే!
ఈమధ్యే మిస్సమ్మ సినిమా చూశా...ఎన్నోసారో గుర్తులేదు జమున చక్కదనాన్ని మీతో పంచుకుందామని ఈటపా !

9 comments:

  1. నిజమే... సాధారణంగా ఏ సినిమానీ రెండోసారి చూడ్డానికి ఇష్టపడని నేను మిస్సమ్మని మళ్ళీ మళ్ళీ చూశాను. may be జమున అల్లరి కూడా దానికి కారణం కావచ్చు..

    Geetika

    ReplyDelete
  2. అబ్బ, ఇన్నాళ్ళకి నాకు ఎంతో ఇష్టమైన జమున గురించి బ్లాగ్ లో రాయటం చూసాను. నాకైతే నిజం చెప్పాలంటే సావిత్రి కన్నా కూడా జమునే ఇష్టం. మీరు ఉదహరించినవన్నీ కూడా నాకెంతో ప్రియమైనవి. తనమీది పాటలు కూడా నాకు ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. పరిమళం గారూ !
    చక్కని నవరసాలోలికించగల కథానాయికను గుర్తుచేశారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఈ హంపీ సుందరిని గురించి యెంత రాసినా తక్కువే అనిపిస్తుంది కదండీ.. ఆమె రసాన్ని ప్రదర్శించినా దానితోపాటు రవ్వంత అమాయకత్వం కూడా కనిపిస్తుంది ఆమె ముఖంలో.. అది బహుశా ఆమె సహజ లక్షణమేమో..

    ReplyDelete
  5. జమున గారిని ఇంట్రెస్ట్ గా చూసింది ఇంటర్ (1999)లో. నూనూగు మీసాల వయసు, బ్లాక్ & వైట్ లో అయినా ఫుల్ల్ గా ఫ్లాట్ అయిపోయా (she is my first love), తన పేపర్ క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసేవాడిని, పుస్తకాల్లో పెట్టు కునే వాడిని,
    జమున గారిలో ఆడతనమూ, నయగారమూ, నిండుగా వుంటాయి. నవ్వితే చాలు గుండే జారి పోయేది. అందుకె, కొత్త హిరొయిన్ లెవ్వరూ నచ్చేవారు కాదు. తనని చూసిన మొదటి గుండమ్మ కథ, గారాలు పోయినా, అలక బూనినా అత్భుతంగా అనిపించేది... రెండు సంవత్సరాలు పట్టింది తేరుకోడానికి. అప్పట్లో తన బొమ్మ గీసి దాని కిందే కవిత కూడా రాసా, అనవసరంగా ఆవేశపడి పత్రిక కి పంపా, లేకపోతే అది ఇప్పటికీ నాదగ్గరే వుండేది..
    అంత సహజమైన అందం ( cosmetic surgeries లేకుండా) నేనైతే ఇంతవరకూ చూడలేదు...

    ReplyDelete
  6. @ గీతికా! నిజంగా ఆమె అల్లరి భలే ముద్దుగా ఉంటుందండీ థాంక్స్ !

    @ జయగారు నచ్చినందుకు ధన్యవాదాలు.

    @ రావుగారు , ధన్యవాదాలండీ...

    @ మురళిగారు...ధన్యవాదాలు.

    @ సత్యగారు...:) :)ఆమె అందం గురించి వర్ణించాలంటే నాకు సాధ్యం కాదు..ముఖ్యంగా గులేబకావళి కధ చిత్రంలో నన్నుదోచుకొందువటే...పాటలో ఆమె సౌందర్యం వర్ణించలేము. ధన్యవాదాలండీ :)

    ReplyDelete
  7. జమున మంచి నటే, ఫీల్డ్ కొచ్చిన కొత్తల్లో, తర్వాత్తర్వాత కొంచెం గర్వం కలగలపి వుండే రాముడు, భీముడు వంటి సినిమాల్లో నటించి, నిజంగానే గర్వం, అహం ఎక్కువై తోటి హీరోలు (ఎ.ఎన్.ఆర్ , ఎన్.టి.ఆర్) ఆమె ను కొంత కాలం ఫీల్దుకి దూరం చేసారన్నది అందరికీ తెలిసిందే. కాని సావిత్రి, అంజలీ దేవి వంటి ఆ కాలపు నటీ మణులకి ఇలాంటి చెడ్డ పేరు రాలేదు. ప్రేక్షకులు కూడా జమున గారి అహం గూర్చి (డామినేటింగ్) పై రకరకాలుగా చెప్పుకొనే వారు ఆ రోజుల్లో.

    ReplyDelete
  8. @ వోలేటిగారు...అవునాండీ...ఒకచేతి వెళ్ళే ఒకలా ఉండనట్టు మనుషులంతా ఒకలా ఉండరుకదండీ.ధన్యవాదాలు.

    ReplyDelete
  9. బాగుందండీ...నాకు కూడా సావిత్రి గారి తరవాత జమున గారు ఇష్టం...

    ReplyDelete