Friday, November 21, 2014

గోవర్ధనగిరిధారి..... మురారి!

చాలా రోజులైంది కృష్ణయ్యను చూసి అనుకుంటూ నిన్న సాయంత్రం వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళాము. నాలుగ్గంటలకే వెళదామని అలా లేటైపోయి వెళ్లేసరికి ఆరుగంటలైంది.వెళ్లేసరికి ఆకాశదీప పూజ జరుగుతోంది. ఆలశ్యంగా వెళ్ళటం మంచిదైంది పూజలో పాల్గొనే అదృష్టం మాత్రమే కాదు గోపూజలో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.

kphb కాలనీ మలేషియాటౌన్ షిప్ opp లో ఉంది గోవర్ధనగిరిపై శ్రీ వేణుగోపాలస్వామి గుడి. చాలామందికి తెలీదు అక్కడో గుడి ఉందని. నగరం మధ్యలో ఉన్నా చిన్న కొండపై ఉండటంవల్ల అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండపై అడుగు పెట్టగానే ఆలయం,ధ్వజస్తంభం, ఒక పక్కగా గోశాల, పరుగులిడుతూ తిరుగాడే ఓ బుజ్జి తువ్వాయి{పేరు గోపాలుడు),మంద్రంగా వినిపించే అన్నమాచార్య కీర్తనలూ.....  ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక చింతనతో పాటూ ఆహ్లాదాన్నీ కలిగిస్తాయి. ఇక రుక్మిణీ సత్యభామలనిరువైపులా నిలుపుకున్న వేణుగోపాల స్వామిని చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు.ఆయన మృదు మధుర సుందర వదనారవిందం మనసును దోచుకుంటుంది. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి కూడా అదే మండపంలో కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయానికి కాస్త పక్కగా చిన్న ఆంజనేయస్వామి గుడి ఉంది. 

నేను మొదటిసారి ఓ రెండేళ్ళ క్రిందట వెళ్లాను. ఆతర్వాత నుండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము .అప్పటికి ఇప్పటికీ గుడి చాలా అభివృద్ధి చేశారు. కాని కొండపైకి దారి అంతగా బావుండదు కార్లు వెళతాయి కాని రాళ్ళతో కూడిన మట్టి రోడ్డు. దాతల సహకారంతోనే గుడి నడుస్తుందని చెప్పారు. ప్రస్తుతం రోడ్డు,కొండపైకి ప్రవేశించే చోటఅందరికీ తెలిసేలా  ఒక ఆర్చి నిర్మించాలని సంకల్పించారట.స్వామి ఆశీస్సులు దాతల సహకారం ఉంటే అవి కూడా పూర్తవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. 

ప్రతి ఏటా కృష్ణాష్టమి,గోవర్ధనగిరి తిరునాళ్ళు , కార్తీక, ధనుర్మాసాలలో విశేష పూజలు జరుగుతాయట! రాబోయే 29వ తేదీ మాధవాష్టమి కూడా బాగా చేస్తారట!

భక్తీ, ఆధ్యాత్మిక చింతన అనేవి పక్కన పెడితే అక్కడ ఉన్నంతసేపూ కనులకు ఆహ్లాదం, మనసుకి ప్రశాంతత కలుగుతుందనేది నిజం! పైన ఉన్నది బుజ్జి గోపాలుడే :) గుడి ఫొటోస్ కూడా తీసి ఉంటే  బావుండేది ప్చ్.... ఈసారి వెళ్ళినప్పుడుతీస్తాను.

4 comments:

 1. బ్లాగుల్లోకి పునఃస్వాగతం పరిమళం గారూ :)
  తువ్వాయి బావుంది ముద్దుగా.. ఈసారి వెళ్ళినప్పుడు నాలుగు పరకలు తినిపించి రండి..

  ReplyDelete
 2. @ మురళిగారు ధన్యవాదాలు. తువ్వాయి అరటిపండు పెడితే కూడా తినలేదండీ ఎవరో బెల్లం పెట్టారు అది మాత్రం ఇష్టంగా తిన్నది :)

  ReplyDelete
 3. ఈ గుడి గురించి ఎప్పటినించో రాద్దామనండి..
  నిజంగా చాలా అందంగా ,ఆహ్లాదంగా ఉంటుంది.అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వెళ్ళిన ప్రతిసారి.:)
  బాగా రాసారు గుడి గురించి..

  ReplyDelete
 4. @ ధాత్రి,అవునాండీ.... మీరూ ఫొటోలతో రాయండి. అక్కడంతా ఆయన మాయ పరుచుకొని ఉంటుంది. అందుకే బహుశా అక్కడనుంచి రావాలనిపించదు. ధన్యవాదాలు :)

  ReplyDelete